ఈ బ్లాగును సెర్చ్ చేయండి

23, ఆగస్టు 2013, శుక్రవారం

కొత్తరైలు మార్గాల కోసం ఉద్యమించక తప్పదు

 
కొత్తరైలు మార్గాల కోసం ఉద్యమించక తప్పదు
నూర్ బాషా రహంతుల్లా
             1849లో భారతదేశంలో ఒక్క కిలోమీటర్ రైలుమార్గంకూడా లేదు.1853 లో బొంబాయి-థానే అనే చిన్న మార్గంతో మొదలైన భారతీయ రైలు మార్గాల పొడవు ప్రస్తుతం 65 వేల కి.మీ.తో  ఆసియాలో కెల్లా అగ్రగామిగా ఉంది. మన రైలు మార్గాల వ్యవస్థ 7500 స్టేషన్లతో ప్రపంచంలో నాల్గవస్థానం ఆక్రమిస్తున్నది. ఇది దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. రోజూ రెండున్నర కోట్ల మంది జనాభా రైళ్ళ ద్వారా ప్రయాణం చేస్తున్నారు. అయితే పెరుగుతున్న జనాభాతో పాటు రైల్వే మార్గాలు పెరగడం లేదు.
దక్షిణ మధ్య రైల్వే 5810 కి.మీ.ల మార్గాలతో దేశంలో మూడవ స్థానంలో ఉంది.అయితే మన రాష్ట్రం మొత్తం దీని పరిధిలోకి రాలేదు.విశాఖపట్టణం డివిజన్ ను,గూడూరు ను  జోన్ లో కలపాలని ఇప్పటికీ ప్రజలు గోల చేస్తున్నారు.దక్షిణ మధ్య రైల్వేలో హైదరాబాదు,సికిందరాబాదు,గుంతకల్లు,గుంటూరు,విజయవాడ,నాందేడు డివిజన్లున్నాయి.ఇది 1966 లో ఏర్పడింది.మన రాష్ట్రంలో  మెదక్ జిల్లా కేంద్రానికి ఇంకా రైలు మార్గం  లేదు. భద్రాచలం, అమలాపురం, నాగర్ కర్నూల్, సిద్దిపేట పార్లమెంటు స్థానాలకు రైలు మార్గం లేదు. అలాగే      ఉట్నూరు,బోత్, అసిపాబాద్, వనపర్తి, జమ్మలమడుగు, మదనపల్లి, కందుకూరు, కొత్తగూడెం, పరకాల,నర్సీపట్నం,పాడేరు,పాలకొండ,పెద్దాపురం,రంపచోడవరం,రామచంద్రాపురం,జంగారెడ్డిగూడెం,ఆత్మకూరు,చంద్రగిరి,కళ్యాణదుర్గంచేవెళ్ళ,వనపర్తి,నారాయణపేట,సిరిసిల్ల,పరకాల,జనగాం,నర్సంపేట,పాల్వంచ,సూర్యాపేట,దేవరకొండ,సంగారెడ్డి,మెదక్, సిద్దిపేట,ఆసిఫాబాదు,మొదలైన రెవిన్యూ డివిజన్ కేంద్రాలకు ఇప్పటికీ రైలు మార్గం విస్తరించలేదు.
1946 లో పుచ్చలపల్లి సుందరయ్య కోరిన కొత్త రైలు మార్గాలు :
              కీర్తిశేషులు శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారు 1946 లో "విశాలాంధ్ర   లో ప్రజారాజ్యం" అనే పుస్తకంలో 12 రైలు మార్గాలు వెయ్యాలని కోరారు.   అవి   ఈనాటికి కూడా నిర్మించబడలేదు. ఆయన కోరిన రైలు మార్గాలు   ఇవి:

1.           విశాఖపట్నం-భద్రాచలం-వరంగల్లు
2.           హైదరాబాద్-దేవరకొండ-మాచర్ల-దొనకొండ-పొదిలి-ఒంగోలు
3.           ఒంగోలు-అద్దంకి-నర్సరావుపేట-సత్తెనపల్లి-అచ్చంపేట
4.           ఒంగోలు-పొదిలి-కనిగిరి-బద్వేలు-కడప-రాయచోటి-మదనపల్లి-బెంగుళూరు
5.           నెల్లూరు-బద్వేలు-మైదుకూరు-ప్రొద్దుటూరు-ఆళ్ళగడ్డ-నంద్యాల-ఆత్మకూరు
6.           గూడూరు-రాపూరు-రాజంపేట-రాయచోటి-కదిరి
7.           రాయదుర్గ-కళ్యాణదుర్గ-అనంతపురం-తాడిపత్రి-కోయిలకుంట్ల-నంద్యాల
8.           బళ్ళారి-ఆదోని-కర్నూలు-ఆత్మకూరు-ఎర్రగొండపాలెం-మాచర్ల
9.           కదిరి-పులివెందుల-ఎర్రగుంట్ల-ప్రొద్దుటూరు
10.     ఖమ్మం-తిరువూరు-చింతలపూడి-జంగారెడ్డిగూడం-నిడదవోలు
11.     చల్లపల్లి-పామర్రు-గుడివాడ-నూజివీడు-తిరువూరు
12.     రాజమండ్రి-భద్రాచలం

       ఆయన జీవిత కాలంలో ఈ రైలు మార్గాలను చూడలేకపోయారు.
1960 లో రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిపాదించిన మార్గాలు:
బొగ్గు, సిమెంటు, ఎరువులు, ముడి ఇనుము, ఆహారధాన్యాలు, పంచదారబెల్లం, చేపలు, పండ్లు మొదలైన వస్తువుల మన రాష్ట్రం నుండి రవాణా    అవుతాయి. ఈ రవాణా కోసం రైలు మార్గాలు ఎంతో అవసరం. రాష్ట్రంలోని   వివిధ ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మన రాష్ట్ర ప్రభుత్వం 1960 లో ఈ క్రింది కొత్త రైలు మార్గాలను ప్రతిపాదించింది.

·       కొవ్వూరు-భద్రాచలం-దంతెవాడ-(మద్యప్రదేశ్)
·       గద్వాల-రాయచూర్
·       రామగుండం-జగిత్యాల-నిజామాబాద్
·       లింగంపల్లి-పటాన్ చెర్వు-మెదక్-సిద్దిపేట-సిరిసిల్ల-కరీంనగర్- పెద్దపల్లి
·       జగ్గయ్యపేట-వాడపల్లి
·       నడికుడి-వినుకొండ-దర్శి-పొదిలి-ఉదయగిరి-ఆత్మకూరు-రావూరు-గూడూరు
ఈ మార్గాలన్నింటికీ ప్రాథమిక సర్వే పని పూర్తయ్యింది. కాని కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించడం లేదు.
జనం పదే పదే కోరుతున్నకొత్త మార్గాలు:
 ఇక ఆయా ప్రాంతాల ప్రజలు ఈ క్రింది రైలు మార్గాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు.
       కొత్తగూడం-ఖమ్మం-సూర్యాపేట-నల్గొండ-జడ్చర్ల
      కడప-ఆళ్ళగడ్డ-నంద్యాల
      బాపట్ల-నిజాంపట్నం- రేపల్లె-అవనిగడ్డ-మచిలీపట్నం
     కైకలూరు -ఏలూరు
      మచిలీపట్నం నర్సాపురం -కాకినాడ

ప్రజల ప్రయాణ అవసరాలను కేంద్రప్రభుత్వం శ్రద్ధగా గమనిస్తే ఈమార్గాలు ఎంత ప్రాముఖ్యమైనవో తెలుస్తాయి.తరచుగా వరదలు తుఫానులకు గురయ్యే కోస్తా ప్రాంత ప్రజలకు ప్రయాణ బాధలు
 ఎక్కువగా ఉంటాయి.ఈ కొత్త రైలుమార్గాలు మన తెలుగునాట సముద్ర తీరప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయి. నేపాల్,బర్మా,పాకిస్థాన్,బంగ్లాదేశ్,థాయ్ ల్యాండ్,వియత్నాం,భూటాన్ లాంటి విదేశాలకు కూడా రైల్వే లింకులు కలపాలని చూసే ప్రభుత్వం ముందుగా స్వదేశంలోపలి  మార్గాలను చక్కబరచాలి.
మన రాష్ట్రంలో ప్రస్తుతం 4958 కి.మీ. ల రైలు మార్గాలున్నాయి.మనది మీటర్‌గేజ్‌ లేని రాష్ట్రం.నడికుడి- బీబీనగర్ రైలు మార్గం మాత్రమే మనకు స్వాతంత్రానంతరం కొత్తగా ఒనగూడిన ప్రజోపయోగం.

ప్రైవేట్‌ రైల్వే లైన్లు

రాష్ట్ర ప్రభుత్వం సగం నిధులను భరించడానికి ముందుకొచ్చే లైన్ల నిర్మాణానికి మాత్రమే రైల్వేశాఖ అనుమతి ఇస్తోంది.ఇకపై సర్వేలు పూర్తయి, లాభదాయకత ధృవపడి కొత్తగా ప్రతిపాదించిన లైన్లు మాత్రమే ప్రవేటుకు అప్పగిస్తారు.విధానాలు:
  • లైన్‌ కనీసం 20 కిలోమీటర్ల పొడవు ఉండాలి.
  • రైళ్లు నడిపే అధికారం రైల్వేదే.
  • లైన్ల నిర్మాణం కోసం సేకరించిన భూములు, లైన్లన్నీ రైల్వే ఆస్తులుగానే పరిగణిస్తారు.
  • భూసేకరణ రైల్వేయే చేపడుతుంది. డబ్బులు మాత్రం ప్రైవేటు సంస్థలు చెల్లించాలి.
  • ప్రైవేటు సంస్థ సదరు లైనును 30 ఏళ్ల పాటు నిర్వహించుకొని ఆదాయం పొందాలి.


బస్సులు నడపటానికి పోటా పోటీగా ముందుకొచ్చే ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు ఎందుకోగానీ ప్రైవేటు రైళ్ళ విషయంలో వెనుకాడుతున్నారు. అందువలన పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రజాప్రతినిధులందరూ కలిసి పార్లమెంటులో కేంద్రం మీద కొత్త  రైలు మార్గాల కోసం వత్తిడి తేవాలి. 275 వేల చ.కి.మీ విస్తీర్ణం గల మన రాష్ట్రంలో ప్రతి వెయ్యి కిలో మీటర్ల భూమికి కేవలం 18 కి.మీ. రైలు మార్గం మాత్రమే ఉంది. సగటున ప్రతి ఆంధ్రుడు రైలు బండి ఎక్కాలంటే 45 కిలోమీటర్లు పోవలసి వస్తున్నది. కొన్నిచోట్ల అయితే దాదాపు 60 కి.మీ. వ్యాసార్థంలో రైలు సౌకర్యం లేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత బ్రిటిష్ వాడికంటే వేగంగా నిర్మాణం కావలసిన రైలు మార్గాలు నత్త నడక నడుస్తున్నాయంటే సిగ్గుచేటు. రైల్వే మంత్రి పదవి కూడా ఆంధ్రుల కింతవరకు ఇవ్వలేదు. మన పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో ఏం చేస్తున్నారో అర్ధం కాదు. "విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు" అని ఉద్యమాలు చేసి ఉక్కు ఫ్యాక్టరీ సాధించాం. మరి ఆ ఉక్కు ఇక్కడి రైలు మార్గాలకు, వంతెనలకు ఉపయోగించాలని డిమాండ్ చేస్తే బాగుంటుంది. ఈ రైలు మార్గాల నిర్మాణం వల్ల మన రాష్ట్రంలోని పరిశ్రమలు అభివృద్ధి అభివృద్ధి చెందుతాయి. వేలాది  పేద కార్మికులకు ఉపాధి లభిస్తుంది. రాష్ట్ర రవాణా సమస్యలు తీరుతాయి. రోడ్డు రవాణా గణనీయంగా తగ్గి రోడ్లు పటిష్టంగా ఉండి, ఎక్కువ కలం మన్నుతాయి.కేవలం ఒక తాలూకా కేంద్రంగా ఉన్న ఊరు విజయవాడ.అది మునిసిపల్ కార్పొరేషన్ కావటం దేశ చరిత్రలో ప్రథమం. అది పెద్ద రైల్వే జంక్షన్ కావటం వల్లనే అంటే అతిశయోక్తి కాదు. కాబట్టి ఈ రైలు మార్గాల సాధన కోసం ఆంధ్రులంతా గట్టి కృషిసల్పాలి.రాష్ట్రం విడిపోయినా ప్రజలకు రైళ్ళ లేమి బాధ తప్పదు.మార్గం ఉంటేనే కదా  బండి నడిచేది?రాష్ట్ర ప్రభుత్వాలైనా భూసేకరణ జరిపి అత్యవసరమని భావించిన ప్రాంతాల్లో పబ్లిక్ -ప్రైవేటు నిధులతో రైలుమార్గాలు నిర్మించి నిర్వహించటానికి కేంద్రాన్ని ఒప్పించాలి.
 https://www.facebook.com/photo.php?fbid=503406646357997&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater 

ఆంధ్రపత్రిక22.12.1990,

 http://www.suryaa.com/opinion/edit-page/article-151305

https://www.facebook.com/photo.php?fbid=623617004336960&set=a.233025936729404.60739.100000659993594&type=1
సూర్య29.8.2013
గీటురాయి 4.10.2013
    


రాష్ట్రాల ఆధారంగా రైల్వే జోన్లు కుదరదు
రైల్వేశాఖ మంత్రి స్పష్టీకరణ
రాష్ట్రానికి కొత్త జోన్ కష్టమే!
సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో పెట్టిన హామీ నెరవేరేలా కనిపించడం లేదు. గురువారం రైల్వే మంత్రి మల్లికార్జునఖర్గే లోక్సభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ఈ అంశాన్ని చాటుతోంది. ''దేశంలోని రైల్వే జోన్లు, డివిజన్లను పునర్వ్యవస్థీకరించాలంటూ వచ్చిన సిఫార్సులపై ఆ శాఖ తుది నిర్ణయం తీసుకుందా'' అని ఇద్దరు సభ్యులు అడిగిన ప్రశ్నకు మల్లికార్జునఖర్గే 'లేదు' అని సమాధానం చెప్పారు. ''ప్రస్తుతానికి ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. అందుకు తగిన నిర్దిష్ట సమయం చెప్పడం కూడా కష్టం. విస్తీర్ణం, పని భారం, అందుబాటు, ట్రాఫిక్ రద్దీ, ఆర్థిక అవసరాల్లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని భారతీయ రైల్వే కొత్త జోన్లు, డివిజన్ల ఏర్పాటు గురించి ఆలోచిస్తుంది. వీటిని రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దుల ప్రాతిపదికనో, లేదంటే ప్రాంతీయ, భౌగోళిక అంశాలను దృష్టిలో ఉంచుకొనో ఏర్పాటు చేయడం కుదరదు. వివిధ వర్గాల నుంచి కొత్త రైల్వే జోన్లు, డివిజన్ల కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో కమిటీ ఏర్పాటు చేశాం. నిర్వహణ, ఆర్థిక, పరిపాలన, సిబ్బంది వ్యవహారాలను దృష్టిలో ఉంచుకొని కొత్త జోన్లు, డివిజన్ల ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తూ సదరు కమిటీ నివేదిక ఇచ్చింది. దానిపై ఇంతవరకూ తుది నిర్ణయం తీసుకోలేదు'' అని పేర్కొన్నారు.(ఈనాడు 7.2.2014)








14, ఆగస్టు 2013, బుధవారం

హైదరాబాదు -కేంద్రీకరణ



అదనపు బరువు

   ఎన్. రహంతుల్లా   నెల్లూరు

                   "వికేంద్రీకరణ", "సమగ్ర ప్రాంతీయ అభివృద్ధి",  అనే నినాదాలు రాజకీయ నాయకుల నోటి నుండి తరచుగా వినవస్తుంటాయి. కాని  వాస్తవానికి సమస్త అభివృద్ధి పట్టణాల చుట్టూ కేంద్రీకరించబడి కొత్త రుగ్మతలు వస్తున్నాయి.

              ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీల స్థాపనకు     హైదరాబాద్ మినహాయించి మరో ఊరు ఈ తెలుగు దేశంలో దొరకలేదా?  హైదరాబాద్ అధిక జన భారంతో ఎన్ని రుగ్మతల్లో ఉందో ప్రభుత్వానికి తెలియదా? హైదరాబాద్ లో ఈనాడు సగం మందికి స్వంత ఇళ్ళు లేవు. ఇంకెంత మందిని అక్కడికి తీసికెళ్ళి బాధపెట్టాలి? హైదరాబాద్ కంటే ఎంతో మేలైన ప్రశాంతమైన నాగార్జున సాగర్ లోనే, మహైష్ యోగి కివ్వదలచిన  వెయ్యి ఎకరాల స్థలంలో  ఈ రెండు యూనివర్సిటీల స్థాపిస్తే హైదరాబాద్ పై  అదనపు భారం తగ్గడమే గాక, వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.

10, ఆగస్టు 2013, శనివారం

సహనం,క్షమ,మతసామరస్యం



ఇదేనా సెక్యులరిజం

        ఆంధ్రజ్యోతి 15-10-1988                                     
              సల్మాన్ రష్దీ రచించిన "ది సాతానిక్ వర్సెస్" అనే గ్రంధాన్ని కేంద్ర     ప్రభుత్వం నిషేదించింది. జమాతె ఇస్లామీ, తబ్లిక్ జమాతి మొదలైన సంస్థల     కోర్కె మేరకు ప్రభుత్వం ఈ పని చేసింది. ఇంతకీ మన దేశంలో నిజమైన సెక్యులర్ పాలన ఉందా లేదా అనేది అనుమానాస్పందంగా తయారయ్యింది.         ప్రొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోబోయే వరకు మన రేడియో, టి.వి.లు   ప్రసారం చేసే భక్తి గీతాలు, పౌరాణిక కార్యక్రమాలపై సెక్యూలర్ కేంద్రం        ఎలాంటి నిషేధం విధించలేదు. విధించబోదుకూడా. బైబిలు బండారం, రిడిల్స్       ఆఫ్ రామా అండ్ కృష్ణా మొదలైన ఎన్నో గ్రంథాలు ప్రభుత్వ నిషేదపు      చర్యలను ఎదుర్కొన్నాయి. మత చాందసుల పిడివాదమే ఈ దేశంలో      నెగ్గుతున్నది గాని మత విమర్శకుల సమంజసవాదం సైతం వెలుగులోకి             రావడం లేదు. మతాలన్నీ కలహాలకు కారణమై అభివృద్ధి నిరోధకాలుగా నిలిచి ప్రపంచానికి పట్టిన చీడలైయున్న ఈనాడు వాటి బండారాన్ని        బట్టబయలు చేసే గ్రంథాలు తప్పక రావాలి. అలాంటి వాటిని నిషేదించడం   అంటే మత మౌఢ్యానికి పట్టంగట్టి, హేతుబద్ధమైన ఆలోచనను హరించటమే       అవుతుంది. ప్రజలను తమ జైళ్ళ మధ్య మ్రగ్గింపజేయడమే అవుతుంది.    స్వేచ్ఛకు హామీ ఇచ్చిన సెక్యులర్ ప్రభుత్వం  'మత నియంత' లాగా    ప్రవర్తించకూడదు.


ఆగి, ఆలోచించాలి

        ఆంధ్రప్రభ 23-2-1989                                                నూర్ బాషా రహంతుల్లా
                                                              హైదరాబాద్
              భౌతిక ప్రపంచంలో ఉన్నట్లుగానే ఆధ్యాత్మిక లోకంలో కూడా రెండు   సూపర్ పవర్లు ఉన్నాయి. అవి ఏవంటే ఒకటి దేవుడు, రెండోది దెయ్యం.        ఒకరు అల్లా, రెండో వారు సైతాను. వీళ్ళిద్దరూ మొదటి నుండీ ఈ సృష్టి మీద      ఆధిపత్యం కోసం మన అదికార-ప్రతిపక్ష నాయకుల్లాగా     పోరాడుకుంటున్నారు. ఆ పోరాటంలో మనుషుల్ని బలిపశువుల్ని        చేస్తున్నారు. వాళ్ళను గురించి ఈ మనుషులు ఏమనుకుంటారంటే దేవుడు        మంచికోసం ఉంటే, సైతాను చెడుకోసం ఉన్నాడని, మంచిని ప్రచారం చేసే    దేవునికి విరుద్ధంగా సైతాను కూడా చెడును ప్రచారం చేస్తాడు. ఇద్దరు కూడా   మనుషుల ద్వారానే మనుషులకు బోధింపజేస్తారు. ఉదాహరణకు సాల్మన్    రష్దీ అనే ఒక మనిషిని ఆవహించి సైతాను తన వచనాలను ఒక గ్రంథంగా        వ్రాయించాడు. ఎందుకంటే దేవుడు కూడా గతంలో అనేక మంది ప్రవక్తలను ఆవేశించి తన గ్రంథాలను మనుషులకు సరఫరా చేశాడు. వాటిలో పవిత్ర        ఖురాను ఒకటి. అందులో ఏమి ఉందంటే "భక్తులు కోపాన్ని దిగమింగేవారు.        ఇతరుల తప్పల్ని క్షమించేవారు. ఇలాంటి సజ్జనులంటే అల్లాహ్ కు ఎంతో      ఇష్టం (3:1:34). చెడును, మంచితో, మేలుతో ఎదుర్కొనండి. అలా చేస్తే మీ    విరోధులు మీకు మిత్రులైపోతారు".

              ఈ మాటల్ని దృష్టిలో ఉంచుకునే హజ్రత్ అలీ తనను పరాభవించిన   వాడిని కూడా ఏమీ అనకుండా విడిచిపెట్టాడు. హజరత్ అలీ బిన్ హుసైన్     తనపై నీళ్ళ చెంబు దొర్లించిన పనిపిల్లకు విడుదల ప్రసాదిస్తాడు. హజరత్    అబూ హనీఫా అయితే తనను నడిరోడ్డులో పట్టుకుని నానా తిట్లూ తిట్టిన వాడికి డబ్బులిచ్చి సత్కరిస్తాడు. ఇలాంటి నీతుల్ని, ఆదర్శాలను చాటి చెప్పిన మతం ఇస్లాం అనీ, అసలు ఇస్లాం అంటేనే 'శాంతి' అని అర్థమనీ, ఇది       దేవుడు చూపిన జీవన విధానమనీ ముస్లింలు భావిస్తారు.

              అయితే ఆయతుల్లా ఖొమేనీ అనే ఇరాన్ నాయకుడు సాల్మాన్ రష్దీని       చంపండి అంటూ ప్రపంచ ముస్లింలకు చేసిన విజ్ఞప్తి అల్లాహ్ ప్రేరణతో జరిగి     ఉంటుందా లేక సాల్మాన్ రష్దీని ఆవహించిన సైతానే ఖొమేనీని కూడా పట్టి ఇలా పంకించిందా అనేది ముస్లం మేధావులు కొంచెం ఆగి ఆలోచించాలి.

భూసేకరణ



ఉసురు తియ్యకండి

      ఆంధ్రజ్యోతి  ప్రజావాక్కు 6-8-2003                                      ఎన్. రహంతుల్లా
                                                              విజయవాడ
              జీవితమంతా కష్టించి సంపాదించిన దానితో ఎంతో మక్కువతో నిర్మించుకున్న భవనాలను రోడ్ల విస్తరణ కోసం ప్రభుత్వం      కూలగొడుతున్నది. ఈ చర్య ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తున్నది. ఆ   విధంగా కూలగొట్టిన భవనాల వారిని ప్రభుత్వం ఆదుకోవడం లేదు.        దశాబ్దాల నుండి స్థిరపడ్డవారు తమ నివాసాలు కళ్ళముందే కూలిపోతుంటే మానసిక రోగులవుతున్నారు. ఇక ప్రభుత్వం అందింతే ఆర్ధిక సహాయం ఎందుకూ సరిపోక పునరాశ్రయం దొరకక ఎందరో వీధులపాలవుతున్నారు.      ఇది ప్రభుత్వానికి, పాలక పార్టీ జయం కాదు. అందువల్ల  విధంగా భవనాలు కూలగొట్టిన సందర్భాలలో ఆయా భవనాల యజమానులకు, వారి        కుటుంబాలకు-అభ్యంతరం లేని అక్రమణలను క్రమబద్ధం చేసి పట్టాలివ్వాలి. భవన నిర్మాణానికి కూడా సహాయం అందించి తీరాలి. నిర్మాణాలతో    స్థిరపడిపోయిన రోడ్లను విస్తరించే కంటె ఊరి చుట్టూ కొత్త రోడ్లు నిర్మాంచాలి.      పడగొట్టే భవనాలకు ఖచ్చితంగా మార్కెట్ రేటు ఇచ్చి నిరాశ్రయుల్ని      ఆదుకోవాలి. దయ ఉంచి వారి ఉసురు తీయవద్దు.



ఇంతకీ ఎవర్ని నమ్మాలి ?
        ఆంధ్రజ్యోతి   23-9-1989                          నూర్ బాషా రహంతుల్లా                                                                     దిల్ సుక్ నగర్
                                                               
                    మిగులు భూములపై ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే బిల్లు గురించి   మాట్లాడుతూ సి.పి.యం. సభ్యుడు శ్రీ జక్కా వెంకయ్య రాష్ట్ర ప్రభుత్వ   ఆధీనంలో 20 లక్షల ఎకరాల మిగులు భూమి ఉంటే 3 లక్షల ఎకరాలు       మాత్రమే పంపిణీ చేశారన్నారు. సి.పి.ఐ. సభ్యుడు శ్రీ రజబలీ 20 వేల     ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారని విమర్శించారు. అయితే రెవిన్యూ మంత్రి        శ్రీ వీరయ్య మాట్లాడుతూ 14 లక్షల 11 వేల ఎకరాల మిగులు భూమిని   గుర్తించామని, అందులో 4 లక్షల 6వేల ఎకరాలు పంచివేశామని చెప్పారు.    ఇంతకీ వీళ్ళు చెప్పిన అంకెల్లో దేనిని నమ్మాలి?
             
              ఒక వేళ రెవిన్యూ మంత్రి మాటే నిజమని భావిస్తే ఇంకా పంచవలసిన        భూమి 10 లక్షల ఎకరాలు ఉంది. అయితే 1981 నాటికే మన రాష్ట్రంలో 46 లక్షల కుటుంబాలు అంటే 230 లక్షల మంది ప్రజలు భూమి లేని     నిరుపేదలుగా ఉన్నారు. ఇంతమందికి ఈ పది లక్షల ఎకరాలు ఏ మూల       కబురు?

7, ఆగస్టు 2013, బుధవారం

కుటుంబనియంత్రణ



ఆపరేషన్లకు అవరోధాలు

        ఈనాడు 10-10-1980                                              
                   కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు కేంద్రం విధించిన   నిబంధనలు దానికే అవరోధంగా తయారైనాయి. ఆపరేషన్ చేయించుకునే    వారికి ఇద్దరు బిడ్డలు ఉండాలి. వారిలో చిన్న వాని వయస్సు 2 సంవత్సరాలుండాలి. ఆపరేషన్ చేయించుకునే స్త్రీకి 20 ఏళ్ళు పురుషుడుకి      25 ఏళ్ళు ఉండాలి. అందువల్ల దేశంలో 18 నుంచి 35 ఏళ్ళ మధ్య ఉన్న 30        కోట్ల మందికి ఆపరేషన్ చేయలేరు. అలాగే ఇద్దరు బిడ్డలు లేని మరి కొంత మందికి కూడా ఆపరేషన్ చేయకూడదు. ఇక అధిక సంతానం ఉన్న     ఛాందసులైన పెద్దలు ఆపరేషన్ చేయించుకోరు. ఇక ప్రభుత్వం ఆపరేషన్లు   చేసేదెవరికి? ఒక పక్క ప్రచారం చేస్తూనే మరో పక్క ఇటువంటి నిర్భందాలు విధించటం వల్ల జనాభా తగ్గదు.

పాలనా సంస్కరణలు,వికేంద్రీకరణ



సూచన

        ఆంధ్రపత్రిక 30-10-1985                                     
                   ఆర్యా, మనకు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచీ రాజకీయ      నాయకులు "వికేంద్రీకరణ". "సమగ్ర ప్రాంతీయాభివృద్ధి" అనే తరచుగా అంటూ ఉండటం తప్ప చేసిందేమీ లేదు. వాస్తవానికి అభివృద్ధి అంతా    పట్టణాల్లో కేంద్రీకరించబడింది. పట్టణ మోజులో వలస వెళ్ళే ప్రజల వల్ల   పట్టణాలలో బ్రతుకు చాలా నీచంగా మారింది. ప్రభుత్వం ఇక నుండైనా      వికేంద్రీకరణకు పూనుకోవాలి.

              ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీలు    స్థాపించటానికి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ తప్ప మరో మంచి ఊరే లేదా?      హైదరాబాద్ లో దాదాపు సగం మందికి స్వంత ఇళ్ళు లేవు. ఈ పట్టణం ఇంకా ఎంత పెరగాలి. హైదరాబాద్ కంటే ఎంతో మేలైన, ప్రశాంతమైన       నాగార్జున సాగర్ లోనే, మహేష్ యోగికి ఇవ్వజూపిన వెయ్యి ఎకరాల స్థలం లోనే ఈ రెండు యూనివర్సిటీలు స్థాపించవచ్చు గదా! ప్రభుత్వం      ఆలోచించాలి.



రాజధాని-రాజధానేతర ఉద్యోగులు
         

        ఆంధ్రపత్రిక 6-5-1986                             
                   ఆర్యా, 
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పనిచేసే ఉద్యోగులకు, రాష్ట్ర      రాజధాని నగరంలో పనిచేసే ఉద్యోగులకు పనిభారంలో, పని పరిస్థితుల్లో   చాలా తేడా ఉంది. ఈ తేడాలు సుస్పష్టంగా కనబడుతున్నా నియమించబడిన పేరివిజన్ కమీషనర్లెవరూ పట్టించుకోలేదు. రాజధాని నగరంలో పనిచేసే ఉద్యోగులకు       కొన్ని సౌకర్యాలను పెంచాలనే విషయం ప్రభుత్వానికీ పట్టడం లేదు.

1.    సెక్రెటేరియట్-నాన్ సెక్టెటేరియట్ ఉద్యోగుల మధ్య ప్రభుత్వం తేడా చూపిస్తున్నది. 30 ఏళ్ళ నుండి ఉద్యోగులు ఈ తేడాను రూపుమాపాలని మొరపెడుతున్నా ప్రభుత్వం వినలేదు. మరి రాజధాని – రాజధానేతర ఉద్యోగుల మధ్య కూడా ప్రభుత్వం తేడా ఎందుకు చూపదు?

2.    ఉదాహరణకు ప్రకాశం జిల్లా వైశాల్యం 17620 చదరపు కిలో మీటర్లు అంత విశాలమైన భూమిలో 23 లక్షలమంది ప్రజలు సౌకర్యంగా నివసిస్తున్నారు. అయితే అంతకంటే ఎక్కువ మంది జనం కేవలం 217 చదరపు కిలో మీటర్ల వైశాల్యం గల పట్టణంలో కిక్కిరిసి నివసిస్తున్నారు. వాస్తవానికి ఎవరికి ఎక్కువ సౌకర్యం ఉంది? జనసాంధ్రతను బట్టి అలవెన్సులు పెంచవద్దా?

3.    నగర శివార్లలో నివసించే ఉద్యోగి కనీసం 30 కిలోమీటర్లు ప్రయాణం చెయ్యాలి. అంటే జిల్లాలలోని ఉద్యోగుల కంటే రాజధానిలోని ఉద్యోగులు ఒక గంట ముందే బయలుదేరాలి. ఒక గంట ఆలశ్యంగా ఇంటికి చేరాలి. అంటే రెండు గంటలు కేవలం ప్రయాణానికే వెచ్చించాలి. దీనికి ప్రతిఫలం ఏది?

4.    రోజిరోజుకి పెరిగిపోతున్న జనాభా కొత్తగా వెలుస్తున్న కార్యాలయాలు ప్రభుత్వ కేంద్రీకరణ చర్య వల్ల రాజధానిలో గృహ సమస్య చాలా తీవ్రమై పోయింది. రాజధానిలో 70 శాతం ఉద్యోగులకు ప్రస్తుతం స్వంత ఇళ్ళు లేవు. అద్దెలు భరించలేని స్థాయిలో ఉన్నాయి. ప్రభుత్వ క్వార్టర్లు కొత్తగా కట్టడం లేదు. అవి లభించాలంటే భగీరధ ప్రయత్నం చెయ్యాలి. అప్పటికీ క్వార్టర్ లభించటం అసాధ్యమే. మరి రాజధాని నగరపు ఉద్యోగులకు ప్రత్యేక ఇంటి అద్దెను మంజూరు చేయవద్దా? ప్రతి ఏడు కొత్తగా క్వార్టర్లు కట్టించవద్దా? స్వంత ఇళ్ళకై స్థలాలు కేటాయించవద్దా?
       ఈ పనులన్నీ చేయకపోతే రాజధానిలో ఉద్యోగం వెట్టిచాకిరి లాగానే ఉంటుంది.




మాకూ బదిలీ సౌకర్యం కావాలి
         

        ఆంధ్రజ్యోతి 1-5-1986                                             
                   రాయలసీమ ఉద్యోగులను రాయలసీమకు, తెలంగాణా ఉద్యోగులను తెలంగాణాకు, ఆంధ్ర ఉద్యోగులను ఆంధ్రకు పంపివేయాలని రాష్ట్ర ప్రభుత్వ     ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఒక్క హైదరాబాద్ లో పనిచేసే      ఉద్యోగులు మినహా మిగతా రాష్ట్రమంతటిలోని చిరుద్యోగులంతా ఎవరి   జోన్లకు లేదా జిల్లాలకు వారు హాయిగా వెళ్ళిపోతారు.

  అయితే ఎంతోకాలం నుంచి తమ సొంత జిల్లాలకు వెళ్ళిపోవాలని  అనేక వేల        మంది ఎన్జీవోలు, హైదరాబాద్ పట్టణంలో పనిచేసే వారు కోరుకుంటున్నప్పటికీ ఇది "ఫ్రీ జోన్" అయినందున వారి ఆశలు తీరడం    లేదు. ప్రభుత్వం ఇరు ప్రాంతాల నాయకులతో ఒప్పందం కుదుర్చుకుని   రాజధానేతర ప్రాంతాలవారికి అదృష్టాన్ని కలిగించింది కానీ, రాజధాని    ఉద్యోగుల విషయం మరచిపోయింది.

              రాజధానిలోని చిరుద్యోగుల జీవిత పరిస్థితులు చాలా దుర్భరంగా     ఉన్నాయి. పైగా ప్రతి డైరెక్టొరేట్ లోను ఖచ్చితంగా రాజధాని నగరంలోనే ఉండి తీరనక్కరలేని సెక్షన్లు అనేకం ఉన్నాయి. వాటన్నిటినీ జిల్లాలలోనే శాశ్వతంగా ఉంచవచ్చు. తద్వారా తమ ప్రాంతాలకు వెళ్ళాలని   ఉవ్విళ్ళూరుతున్న అనేక వేల మంది చిరుద్యోగులను వారి ప్రాంతాలకు పంపవచ్చు. రాజధాని నగరం మీద భారాన్ని తగ్గించవచ్చు.

    ప్రతి మంత్రిత్వ శాఖ, డైరెక్టొరేట్ల తరఫున రాష్ట్రంలోని మూడు    ప్రాంతాలలో మూడు ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటుచేసి రాజధాని నగరంలో పనిచేస్తున్న ఉద్యోగులను వారి వారి ప్రాంతాలను తరలించవచ్చు.

              ఇతర జిల్లాల వారందరికీ కలుగజేసిన బదిలీ సౌకర్యం హైదరాబాద్    లోని ఎన్జీవోలకు కూడా కల్పించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను.


మంత్రుల ఇళ్ళుంటేనే
పాత బస్తీకి మోక్షం
         

        ఆంధ్రజ్యోతి 19-2-1989                                  
                   హైదరాబాద్ లోని పాత బస్తీ బాగుపడాలంటే మంత్రుల నివాసాలు,    కార్యాలయ భవనాలు పాత బస్తీలోనే నిర్మించాలని శ్రీ నాదెండ్ల భాస్కరరావు      అన్నారు. చెప్పింది ఎవరైనా నిజం చెప్పినప్పుడు ప్రభుత్వం ఆలకించాలి. పట్టణాలలో అయిదు లక్షల ఇళ్ళు కట్టిస్తానంటున్న ముఖ్యమంత్రి మంత్రుల నివాసాలు కాకపోయినా పేదల ఇళ్ళైనా పాత బస్తీలో కట్టించాలి. గచ్చీ        బౌలీలో తమ ఇళ్ళ నిర్మాణం కోసం వెయ్యి ఎకరాల స్థలం ఇవ్వమని నగర ఎన్జీవోలు ఎంతగానో మొత్తుకుంటున్నారు. వారికి ఆ స్థలాన్ని పాత బస్తీ అవతల పహాడీ షరీఫ్ దగ్గర మంజూరు చేస్తే ఎన్జీవోల వల్లనైనా ఆ ప్రాంతం       అభివృద్ధి చెందవచ్చు. మంత్రులు రాజకీయ నాయకులు ఏదైనా ప్రాంతంలో ఉండలేకపోతే ఆ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగుల్ని నివసింపజేయడం ద్వారా       ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చు. వనస్థలిపురం ఇప్పుడెలా ఉందో        చూస్తున్నారుగా!


మంత్రుల ఆఫీసుల తరలింపు మంచిదే!
           

        ఆంధ్రప్రభ 3-6-1986                                            
                   సచివాలయం నుంచి మంత్రుల కార్యాలయాలను ఆయా డైరెక్టరేట్లకు తరలించాలని ప్రభుత్వం ఉద్దేశించటం చాలా మంచిది. ఇందువలన ఆయా     డైరెక్టరేట్లపై ప్రభుత్వానికి మంచి అదుపు లభించటమే గాక, సెక్రెటేరియేట్ కు        ఇచ్చిన అనవసర ప్రాధాన్యత తగ్గుతుంది. ప్రజలు ప్రతి విషయానికి ఇక   సెక్రెటరియేట్ కు పోకుండానే, ఆయా డైరెక్టరేట్లలోనే అన్ని పనులూ పూర్తి        చేసుకోవచ్చు. ఇది క్రమంగా జరిగితే నిశ్చయంగా మేలు చేసే పద్ధతే.

              కాని రాజకీయ నాయకులు ఆఫీసుల్లోకి వచ్చేస్తే వారి పరివారం       పైరవీలు, అధికార దుర్వినియోగం యధాతథంగా జరుగుతుంది. దీనిని   అరికట్టే మార్గం ప్రభుత్వం వెదకలేదు. ఇంతవరకూ సెక్రెటరియేట్ లో   కొనసాగిన అవినీతి ఇక నుంచి డైరెక్టరేట్లలో కొనసాగుతుంది. పైగా డైరెక్టర్ల   అధికారం, సంపాదనావకాశం కుచించుకు పోతుందని అప్పుడే        భయాందోళనలు మొదలయ్యాయి.


పాలనా సంస్కరణలు అమలు జరపాలి
                                                           
          ఆంధ్రప్రభ 24-9-1986                                   
                        తెలుగుదేశం పార్టీ పాలనా సంస్కరణల మీద ప్రభుత్వానికి చాలా     మంచి ప్రతిపాదనలు చేస్తుంది. వీటిని అమలు చేయనిస్తే రాష్ట్రం చాలా బాగుపడుతుంది. సెక్రెటేరియట్ - నాన్ సెక్రెటేరియట్, డైరెక్టరేట్- నాన్   డైరెక్టరేట్ అనే తేడాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులందరినీ సమానం     చెయ్యటం, మంత్రుల కార్యదర్శుల కార్యాలయాలను ఆయా డైరెక్టరేట్లలోనే      పెట్టడం. అన్ని డిపార్ట్ మెంట్లకు ప్రాంతీయ కార్యాలయాలను తెరచి రాజధాని        నుండి ఉద్యోగులను ప్రజల చేరువకు తరలించడం, అన్ని జిల్లా ప్రధాన        కార్యాలయాలలో కంప్యూటర్లు, పొటోస్టాట్ యంత్రాలు స్థాపించటం, సబ్ ట్రెజరీ        అధికారులను గజిటెడ్ అధికారులుగా మార్చటం మొదలైన ప్రతిపాదనలు శుభప్రదమైనవి. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు జీవోలు జారీ చేయాలి.


అదనపు బరువు

   "వికేంద్రీకరణ", "సమగ్ర ప్రాంతీయ అభివృద్ధి",  అనే నినాదాలు   రాజకీయ నాయకుల నోటి నుండి తరచుగా వినవస్తుంటాయి. కాని       వాస్తవానికి సమస్త అభివృద్ధి పట్టణాల చుట్టూ కేంద్రీకరించబడి కొత్త      రుగ్మతలు వస్తున్నాయి.
 ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీల స్థాపనకు        హైదరాబాద్ మినహాయించి మరో ఊరు ఈ తెలుగు దేశంలో దొరకలేదా?     హైదరాబాద్ అధిక జన భారంతో ఎన్ని రుగ్మతల్లో ఉందో ప్రభుత్వానికి       తెలియదా? హైదరాబాద్ లో ఈనాడు సగం మందికి స్వంత ఇళ్ళు లేవు. ఇంకెంత మందిని అక్కడికి తీసికెళ్ళి బాధపెట్టాలి? హైదరాబాద్ కంటే ఎంతో మేలైన ప్రశాంతమైన నాగార్జున సాగర్ లోనే, మహైష్ యోగి కివ్వదలచిన    వెయ్యి ఎకరాల స్థలంలో  ఈ రెండు యూనివర్సిటీల స్థాపిస్తే హైదరాబాద్ పై అదనపు భారం తగ్గడమే గాక, వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.