ఈ బ్లాగును సెర్చ్ చేయండి

28, అక్టోబర్ 2013, సోమవారం

సుప్రీం కోర్టు, హైకోర్టు బెంచీలు ఏర్పాటు చేయాలి




సుప్రీం కోర్టు, హైకోర్టు బెంచీలు ఏర్పాటు చేయాలి
నూర్ బాషా రహంతుల్లా 9948878833

హైకోర్టులకు బెంచ్ ను నెలకొల్పటం వల్ల ప్రజలు న్యాయం కోసం చాలా దూరం ప్రయాణమై వెళ్ళాల్సిన అవసరం ఉండదు.దేశంలో పెద్ద ఎత్తున కేసులు పెండింగ్ లో ఉండిపోతున్నాయి. ప్రయాణమనేది ఒక  అనుత్పాదక వ్యయం.సమాజంలో సంప్రదాయ చట్టాలు, కట్టుబాట్ల వల్ల ఎన్నో కేసులు కోర్టుల    వరకు వెళ్లకుండానే పరిష్కారమవుతాయి.సామాజికాభివృధ్ధికి ఇది ఎంతో అవసరం. అందువలన దేశంలో గ్రామ న్యాయస్థానాలను పటిష్టపరచాలి.
12-8-2000 తేదీన అరుణాచల్ ప్రదేశ్ "ఇటానగర్" లో గౌహతి హైకోర్టుకు శాశ్వత బెంచ్ ను       ప్రారంభిస్తూ అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎ.ఎస్. ఆనంద్  అన్న మాటలివి.
జర్మనీ కోర్టులు ఎటువంటి సెలవులు లేకుండా ఏడాది పొడుగునా పనిచేస్తాయి. ఈ విధానాన్ని ఇండియాలో కూడా ప్రవేశ పెట్టాలి. పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారానికి సాయంత్రం కోర్టులు ఏర్పాటు చెయ్యాలి. గత అయిదు దశాబ్దాలుగా మన న్యాయ వ్యవస్థ అనేక సమస్యలతో క్రుంగిపోతున్నది. కేసులు సుధీర్ఘ కాలం కొనసాగుతున్నాయి. సత్వర న్యాయం అందజేసే విషయంలో న్యాయవాదుల్లో అంకిత భావం కొరవడిందని 6-3-99 తేదీన ముంబాయి లో జరిగిన మహా రాష్ట్ర న్యాయవాదుల సదస్సులో సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంగనాథ్ మిశ్రా అన్నారు. దాదాపు 139 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, " హైకోర్టులో 32 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయనీ, లోక్ సభ మాజీ స్పీకర్ పి.ఎ. సంగ్మా ఇదే సభలో వాపోయారు.
కోర్టు బెంచీల ఏర్పాటుకు ప్రామాణిక సూత్రం ఏమిటి?
              సామాన్య ప్రజలకు న్యాయం అందాలంటే న్యాయాధికారాన్ని ఉన్నత స్థాయిలో వికేంద్రీకరించాలి. దేశ దక్షిణ, ఈశాన్య ప్రాంతాల్లో సుప్రీం కోర్టు    బెంచీలు ఏర్పాటు చెయ్యాలని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వి.       ఆర్. కృష్ణ అయ్యర్ గతంలో చెప్పారు. ఇక హై కోర్టు బెంచీల కోసం వివిధ రాష్ట్రాల్లో అప్పుడప్పుడూ ఆందోళనలు జరగటం, అవి అణగారిపోవటం        మనందరికీ తెలుసు. దక్షిణ భారత దేశంలో సుప్రీం కోర్టు బెంచి సాధన కోసం ఏర్పాటైన కార్యాచరణ కమిటీ అధ్యక్షుడు శ్రీ టి. పి. యమ్. ఇబ్రహీం ఖాన్        పౌరులందరి హక్కులను కాపాడడంలో ఏకత్వం సమానత్వం   ఉండాలంటారు.

దక్షిణాదిలో సుప్రీం కోర్టు బెంచి కోసం దక్షిణ భారత న్యాయవాదులు    19-10-96 వ తేదీన కొచ్చీలో పెద్ద సదస్సు జరిపారు. అలాగే గుంటూరు, విజయవాడల మధ్య హై కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోస్తా జిల్లాల న్యాయవాదులు ఎంతో కాలం నుంచి కోరుతున్నారు. దీని కోసం గతంలో ఉద్యమం కూడా జరిగింది. కేవలం రద్దీ వల్ల అపార ధనార్జన సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయవాదులకు మాత్రమే అందిరావటం, మిగతా చోట్ల చెట్టు క్రింద ప్లీడర్లు (పని దొరకని న్యాయవాదులు) ఎక్కువ కావటం జరుగుతున్నది.
సుప్రీం కోర్టు, హైకోర్టులకు బెంచ్ లు ఏర్పాటు చెయ్యకుండా, నిరంకుశంగా పరిపాలన చేయటం ఇక ఎంతో కాలం సాగదు. పెరుగుతున్న   జనాభాకు కేసులకు దీటుగా న్యాయ సహాయాన్ని జనానికి చేరువలోకి తేవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పని సరి. న్యాయవాదులు కొంత మంది        తమ స్వార్ధం కోసం ఈ బెంచీల ఏర్పాటును వ్యతిరేకించవచ్చు. కానీ విశాల ప్రజానీకం శ్రేయస్సును కోరే సంక్షేమ ప్రభుత్వం బెంచీల ఏర్పాటు కాదనలేదు.
             
              మన దేశంలో ప్రస్తుతం  హైకోర్టులు 18 నుండి 24 కు పెరిగాయి. వీటి స్థాపనలో ఒక        ప్రామాణిక సూత్రం గానీ, శాస్త్రబద్ధమైన పద్ధతి గాని కానరావడం లేదు. ఉదాహరణకు అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర అనే ఏడు ఈశాన్య రాష్ట్రాలకు కలిపి ఒకే హైకోర్టు గతంలో గౌహతి లో ఉండేది. ఈ ఏడు రాష్ట్రాల వైశాల్యం 2.60 లక్షల చ.కి.మీ, జనాభా నాలుగు కోట్లు. సిక్కిం రాష్ట్ర వైశాల్యం ఏడువేల చ. కి.మీటర్లు. జనాభా ఆరు లక్షలు. అయినా దానికి ప్రత్యేకంగా ఒక హైకోర్టు గాంగ్ టాక్ లో ఉంది. మన రాష్ట్ర కోస్తా జిల్లాల వైశాల్యం 93 వేల చ.కి.మీటర్లు జనాభా నాలుగు  కోట్లు. ఇక్కడ కనీసం హైకోర్టు బెంచ్ అయినా ఏర్పాటు చేయలేదు. వందల, వేల కిలోమీటర్ల ప్రయాణం న్యాయసహాయం కోసమే చేయాల్సి వస్తున్నదంటే అంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? కర్ఫ్యూ సమయాలలో దూరప్రదేశం నుంచి వచ్చే ప్రయాణీకులు పడే బాధ వర్ణనాతీతం. హైదరాబాదు వెళితేనే జేబులు ఖాళీ. ఇక ఢిల్లీ వెళ్ళడం అంటే మాటలా ?      కోర్టు కెళ్ళే కంటే అన్యాయాన్ని భరించడమే లాభదాయకంగా ఉంటుందని        ఆర్ధిక పరిజ్ఞానం కలవారు అంటున్నారు. గ్రామీణుల సౌకర్యార్ధం ఏర్పాటు        చేయ తలపెట్టిన గ్రామ,మండల న్యాయస్థానాలు ఎండ మావుల పాలు గావడం    మన రాష్ట్ర దౌర్భాగ్యం. 49 ఏళ్ల స్వాతంత్ర్య పాలనలో మన న్యాయ వ్యవస్థ   రాజకీయ మబ్బులు కమ్మి కళ్ళకు గంలు కట్టిన న్యాయ దేవత        రూపాన్ని సార్ధకం చేసింది. దొంగలు, దుర్మార్గులు, త్రాగుబోతులు     వ్యభిచారులు అన్ని రకాల అవగుణాల వాళ్ళు పోగై న్యాయ వ్యవస్థను        నీరుగార్చారు. అందువలన న్యాయవ్యవస్థ పటిష్టత కోసం చాలా మార్పులు తేవాల్సి ఉంది.
న్యాయం చౌకగా సత్వరమే అందేలా సంస్కరణలు తేవాలి

1.    కోర్టులకు ఎలాంటి సెలవులు ఉండకూడదు. కోర్టులకు సెలవులు ఇవ్వటం అంటే న్యాయానికి విశ్రాంతి నివ్వటమే. వేసవి సెలవులు, వానాకాలం సెలవులు మొదలైనవన్నీ రద్దు చేసి రైళ్లు, బస్సులు నీటి సరఫరా లాంటి ప్రజోపయోపయోగ నిత్యావసర సేవల జాబితాలోకి న్యాయ సహాయ సేవ ను కూడా చేర్చి 365 రోజులూ కోర్టుల చేత పని చేయించాలి. న్యాయం ఆలస్యంగా అందితే న్యాయం జరగనట్లే అని సామెత. ఆలస్యం వల్ల హాని జరుగుతున్నది. మోషే,ముహమ్మద్ లాంటి న్యాయమూర్తులు మున్నూట అరవై రోజులూ జనానికి అందుబాటులో ఉండి తీర్పులిచ్చారు. పెండింగ్ కేసులు తగ్గాలంటే కోర్టులకు సెలవులు ఇవ్వకూడదు. జడ్జీల ఖాళీలు వెంటనే భర్తీ చెయ్యాలి. కేసుల సంఖ్యకు అనుగుణంగా జడ్జీల సంఖ్యను పెంచాలి.ప్రతి గ్రామంలోనూ గ్రామ న్యాయాలయాలను నెలకొల్పాలి.
2.    న్యాయవాడులందరికీ వారు చేపట్టే కేసుల సంఖ్యకు గరిష్ట పరిమితి విధించాలి. సీనియర్ న్యాయవాదుల దగ్గర భారీగా కేసులు పేరుకుపోయి ప్రతీసారీ వాయిదాలు కోరడం వల్ల పెండెన్సీ పెరిగిపోతున్నది. వాయిదాల సంఖ్య మీద సీలింగ్ విధించాలి.
3.    సుప్రీం కోర్టుకు బొంబాయి,కలకత్తా,హైదరాబాదు,మద్రాసుల్లో బెంచీలు ఏర్పాటు చెయ్యాలి. అలాగే పెద్ద రాష్ట్రాల్లో హై కోర్టులకు బెంచీలు ఏర్పాటు చెయ్యాలి. లోక్ అదాలత్ ల సంఖ్య పెంచాలి.
4.    కోర్టు ఫీజు, న్యాయవాదుల ఫీజు పేద ప్రజలకు భరించలేని భారంగా పరిణమించాయి. పేదవాళ్ళకు అండగా నిలబడి చౌకగా న్యాయ సహాయం అందించే ప్లీడర్లు తక్కువగా ఉన్నారు. నిలువు దోపిడీ జరుగుతున్నది. న్యాయవాది అంటే ఒక తెలివైన మధ్య వర్తి, తాను వాదించినందుకు ఫీజు పుచ్చుకుంటాడు. న్యాయవాదుల అవసరం లేకుండా నేరుగా న్యాయమూర్తి ఎదుట విన్నవించుకునే అవకాశం కల్పించాలి. కోర్టు వ్యవహారాలను సులభతరం చెయ్యాలి.
5.    ఏళ్ల తరబడి కోర్టులో తిష్టవేసే ఉద్యోగుల వల్ల, న్యాయస్థానాల్లోని ఉద్యోగులు లంచం తీసుకోవడం వల్ల న్యాయస్థానాల విలువ పడిపోతున్నది. "కట్నం కోసం భార్యను వేదించే న్యాయవాదులు, సాయంత్రానికి బారుల్లో బ్రాందీ త్రాగే న్యాయవాదులు ఇంకా న్యాయమూర్తులు కూడా మందు పార్టీలలో మగువల పార్టీలలో పాల్గొంటున్నారని "సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వెంకట్రామయ్య గారు ఆవేదన చెందారు. కాబట్టి న్యాయస్థానాలలోని ఉద్యోగులు, న్యాయవాదులు న్యాయ మూర్తుల వ్యక్తిగత ప్రవర్తనపైనా గట్టి నిఘా ఉండాలి. బెయిళ్ల స్కాము బయటపడినట్లుగా ఇంకా బయటపడాల్సిన లొసుగులు ఎన్నో ఉన్నాయి.
6.    న్యాయస్థానాలలోని రకరకాల చట్టాలను ప్రాంతీయ భాషలలోనికి అనువదించాలి. ఆయా ప్రాంతీయ భాషలలోనే వాదప్రతివాదాలు తీర్పులు జరగాలి. కోర్టుల్లో కంప్యూటర్లు, ఫొటోకాపీ యంత్రాలను విరివిగా వినియోగించాలి. న్యాయమూర్తి నుండి బాధితునికి అందవలసిన సమాచారానికి గరిష్ట కాలపరిమితిని విధించాలి.

7.    దేశ జనాభాలో 70 శాతం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. గ్రామీణ న్యాయ స్థానాలను నెలకొల్పితే ఎన్నో కేసులు అక్కడికక్కడే పరిష్కారమై పై కోర్టుల్లో పని భారం తగ్గుతుంది. గ్రామ పంచాయితీ ఎగ్జిక్యూటివ్ అధికారులు సర్పంచ్ లు, ఏం. పీ. టీ. సీ. లు, గ్రామ పాలనాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఇలా ఎంతో మంది గ్రామ స్థాయిలో పని చేస్తున్న వారికి న్యాయశాస్త్రం విషయాలలో స్వల్పకాలిక శిక్షణ నిచ్చి చిన్న చిన్న తగాదాలను పరిష్కరించే అధికారాన్ని వారికివ్వాలి. వారిచ్చే తీర్పు  నచ్చక పోతే పై కోర్టుకు ఎలాగూ వెళతారు. కాబట్టి ముందుగా గ్రామ స్థాయిలో కేసుల వడపోత జరగాలి. అలాగే నేరుగా హైకోర్టు కేసులను స్వీకరించే పద్ధతిని ఆపివేసి, జిల్లా కోర్టుల తీర్పులపై అప్పీళ్లను మాత్రమే హైకోర్టులు విచారించాలి.

      

8. నీతి నిజాయతీలతో కూడిన ధర్మశాస్త్ర బోధన ఈనాడు అందరికీ అవసరం. కేవలం న్యాయమూర్తులు, న్యాయవాదులు మాత్రమే ధర్మ శాస్త్రాన్ని చదివితే సరిపోదు. న్యాయశాస్త్రం. ధార్మిక విషయాలు ప్రజలందరికీ తెలియాలి. అందుకే చిన్నతనం నుండే పిల్లలకు న్యాయ విద్య అందించాలి. సామూహికంగా కూడా ధర్మశాస్త్రాన్ని ప్రజలందరికీ వినిపించాలి.

జమ్మూలో జ్యుడీషియల్ అధికారుల సదస్సును ప్రారంభిస్తూ 20-3-  99 న చీఫ్ జస్టిస్ ఆదర్శ సేన్ ఆనంద్ ఇలా అన్నారు. "కోర్టు కేసుల పరిష్కారంలో విపరీతమైన జాప్యమే భారతీయ న్యాయ వ్యవస్థలో పెద్ద     లోపం, న్యాయ వ్యవస్థ విఫలం కాలేదు. దాన్ని నిర్వహిస్తున్న వారే        విఫలమయ్యారు. బాధ్యత, నిబద్ధత లేకపోవడమే దీనికి కారణం. న్యాయం కోసం వచ్చేవారు దానిని అతి తక్కువ ఖర్చులో, వీలైనంత త్వరగా   రావాలని కోరుకుంటారు. అది లభించని నాడు చట్టాన్ని చేతుల్లోకి   తీసుకుంటారు. దాన్ని గుర్తెరిగి మసలుకోవాలి. "

              9. నల్లటి గబ్బిలం రంగు గౌనులు న్యాయవాదులు, న్యాయమూర్తుల        మనస్తత్వాన్ని మలినం చేసే అవకాశం  ఉండని ఎంతో మంది మనస్తత్వ     శాస్త్రవేత్తలు చెప్పారు. నల్లగౌనుల వాళ్ళు మోడరన్ డ్రాక్యులాల వలె        కనిపిస్తున్నారని వేసిన ఒక కార్టూన్ చాలా కాలం క్రిందటే రంగు మార్పు        గురించిన ఆలోచనలను రేకెత్తించింది. తెలుపు రంగు పరిశుద్ధతను, శాంతి     కాముకతను, సత్య ప్రియత్వాన్ని సూచించుటయే కాక ఆ సద్గుణాలకు       తగిన మానసిక ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి న్యాయస్థానాలలోని ప్రతి        ఒక్కరూ విధిగా తెల్లబట్టలు ధరించేలా మార్పులు తేవాలి. బట్టలతో పాటు,   న్యాయవాద వృత్తిలో ఉన్న వారు తమ హృదయ ప్రక్షాళన దైవ సన్నిధిలో అనునిత్యం చేసుకోవాలని ప్రవక్తలు కోరారు. ఈ న్యాయ స్థానాల కళ్ళు     గప్పినా, పరలోక న్యాయ స్థానంలో శిక్ష తప్పించుకోలేమన్న భయం      ఆవరించిన న్యాయమూర్తులు, న్యాయవాదుల వల్ల సమాజానికి కలిగే మేలు        అంతా ఇంతా కాదు, వాళ్ళే ఈ సమాజ ఉద్ధారకులు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ       జరిపే సమవర్తులు, సాధు జనాన్ని రక్షించే పరిత్రాయణులు.

సిక్కిం హైకోర్టు అతి చిన్నది
సిక్కిం రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉందనీ అందువలన ఆ రాష్ట్రానికి "శాంతి బహుమానం" ఇవ్వాలనీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరారు. కేవలం నాలుగు జిల్లాలు , 7 వేల చ.కి.మీ భూభాగం , 6  లక్షల జనాభా మాత్రమే ఉండే సిక్కిం కోసం ఆ రాష్ట్రంలోని      గ్యాంగ్ టాక్ లో హై కోర్టు ఏర్పరచారు. దేశంలోని మిగతా ఏ రాష్ట్రంతో పోల్చినా శాంతి భద్రతలు, న్యాయ సహాయం విషయంలో సిక్కిం మొదటి స్థానంలో ఉంది.
2000 లో ఏర్పడిన బిలాస్ పూర్,రాంచీ,నైనిటాల్,2013 లో ఏర్పడిన ఇంఫాల్,షిల్లాంగ్,అగర్తలా హైకోర్టులు ఆయా ప్రాంతాల ప్రజలకు దూరం భారం తగ్గించి సత్వర న్యాయ సేవలు అందిస్తున్నాయి.

మనకూ హైకోర్టు బెంచీలు కావాలి
దేశం లోని 24 హై కోర్టులకు 13 చోట్ల  బెంచీలున్నాయి  : దేశంలో ఎనిమిదిన్నర కోట్ల ప్రజలకు బెంచీలు కూడా లేకుండా పనిచేస్తున్న ఒకే ఒక రాష్ట్ర హైకోర్టు హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.అలాగే బెంచీలు కూడా లేకుండా 275వేల చదరపు కిలోమీటర్ల పరిధిలోని లక్షలాది కేసులు విచారిస్తున్న  ఏకైక హైకోర్టు కూడా మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టే.అది ఎలాగో చూడండి:


హైకోర్టు పేరు ,
స్థాపించిన సంవత్సరం  
రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు
బెంచీలు
సగటు జనాభా లక్షల్లో
సగటు భూభాగం వేల చ.కి.మీ.లో
1
కలకత్తా 1862
పశ్చిమ బెంగాల్, అండమాన్, నికోబార్
పోర్టు బ్లెయిర్
458
48
2
మద్రాసు 1862
తమిళనాడు, పాండి చ్చేరి
మధురై
734
131
3
బొంబాయి 1862
మహారాష్ట్ర, గోవా, దాద్రానగర్ హవేలి,డామన్ డయ్యు
ఔరంగాబాద్,నాగపూర్,పనాజి
286
78
4
అలహాబాద్ 1866
ఉత్తర ప్రదేశ్
లక్నో
499
121
5
బెంగుళూరు 1884
కర్ణాటక
హుబ్లీ,దార్వాడ్,గుల్బర్గా
153
48
6
పాట్నా1916
బీహార్
రాంచీ
104
94
7
జబల్పూర్ 1936
మధ్యప్రదేశ్
గ్వాలియర్, ఇండోర్
242
102
8
శ్రీనగర్ 1943
జమ్మూ- కాశ్మీర్
జమ్మూ
63
111
9
చంఢీగర్ 1947
పంజాబు, హర్యానా, చంఢీగఢ్

541
95
10
కటక్ 1948
ఒరిస్సా

419
156
11
గౌహతి 1948
అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం
ఇటానగర్, కోహిమా, ఐజ్వాల్
89
45
12
జోద్ పూర్ 1949
రాజస్థాన్
జైపూర్
343
171
13
హైదరాబాద్ 1954
ఆంధ్రప్రదేశ్,

847
275
14
కోచీ  1956
కేరళ, లక్షద్వీపాలు

335
39
15
అహ్మదాబాద్ 1960
గుజరాత్

604
196
16
ఢిల్లీ 1966
ఢిల్లీ

168
11
17
సిమ్లా  1971
హిమాచల్ ప్రదేశ్

69
56
18
గాంగ్ టాక్ 1975
సిక్కిం

6
7
19
బిలాస్పూర్ 2000
ఛత్తీస్ ఘర్ 

255
135
20
రాంచీ 2000
ఝార్కండ్

330
80
21
నైనిటాల్ 2000
ఉత్తరాఖండ్

101
53
22
ఇంఫాల్ 2013
మణిపూర్

27
22
23
షిల్లాంగ్ 2013
మేఘాలయ

30
22
24
అగర్తలా 2013
త్రిపుర

37
10


గుంటూరులో మళ్ళీ హైకోర్టు పెట్టాలి
మన రాష్ట్రం లో హైకోర్టుకు వెళ్ళాలంటే ప్రజలు ప్రయాణించే దూరం చాలా ఎక్కువ.ఈ దూరాన్ని తగ్గించాలి.1956 కు ముందు గుంటూరు లో హైకోర్టు ఉండేది.మళ్ళీ దానిని అక్కడే పునరుద్ధరించటం ఆంధ్రులందరికీ అవసరం. హైకోర్టును గుంటూరులో పెడితే ఒక్క కర్నూలు ,అనంతపురం లకు తప్ప సీమాంధ్రలోని అన్నిప్రాంతాలకూ దూరంతగ్గుతుంది. విశాఖపట్టణం,తిరుపతి లేదా కడప లో గుంటూరు  హైకోర్టుకు బెంచీలు పెట్టి ఈ దూరాన్ని తగ్గించవచ్చు. జాతీయస్థాయిలో  హైకోర్టుల పరిధిలోని  సగటు జనాభా,సగటు విస్తీర్ణం తో పోలిస్తే మనరాష్ట్రానికి ఎన్ని బెంచీలు కావాలో తెలుస్తుంది. ఇంకా  ఎన్ని వేల కేసులకు ఎన్ని బెంచీలు కావాలో అనే  ప్రాతిపదిక తీసుకున్నా మిగతా రాష్ట్రాలతో పాటు మనకూ హైకోర్టు బెంచీలు  అనేకం వస్తాయి.రాష్ట్రం చీలినా చీలకపోయినా కోర్టు బెంచీల ఏర్పాటు తప్పదు.ఇది ప్రజా అవసరం.


ఎంతెంత దూరం?
సీమాంధ్ర ప్రాంతాలు
హైదరాబాద్ కు దూరం కి.మీ
గుంటూరుకు దూరం కి.మీ
తగ్గే దూరం కి.మీ
శ్రీకాకుళం
915
500
415
విజయనగరం
705
430
275
విశాఖపట్నం
650
415
235
కాకినాడ
525
255
270
ఏలూరు
340
105
235
బందరు
350
115
235
విజయవాడ
270
35
235
ఒంగోలు
330
110
220
నెల్లూరు
520
225
295
చిత్తూరు
590
445
145
కడప
415
335
80
భద్రాచలం
315
240
75
కర్నూలు
210
290
-80
అనంతపురం
360
450
-90


  కర్ణాటకలోని కూర్గు ప్రాంతంలో హైకోర్టు బెంచి ఏర్పాటు చేయడం కుదరదని ప్రభుత్వం తేల్చి చెప్పటంతో ప్రత్యేక రాష్ట్రంగా చీలిపోతే హైకోర్టు వస్తుందనే భావంతో కూర్గు రాష్ట్ర ఉద్యమాన్ని అక్కడి వారు మళ్ళీ లేవనెత్తారు. పెద్ద రాష్ట్రాలు ఈ విషయాన్ని గమనించి మసలుకోవాలి. అక్కడి ప్రజలు కొత్త బెంచీలకోసం 1954 నుండీ ఉద్యమిస్తూ ఉన్నారు.ఫలితంగా  బెంగుళూరు హైకోర్టుకు హుబ్లీ,దార్వాడ్,గుల్బర్గాలలో ఈ ఏడే (2013లో) బెంచీలు ఏర్పాటు చేశారు. 


న్యాయం కోసం వందల మైళ్ళ ప్రయాణం చేసే అవస్థ తప్పటం కోసం కడప,  విశాఖ పట్టణాల్లో హైకోర్టు బెంచీలు ఏర్పాటు చేయించమనిప్రజలు వేడుకుంటున్నారు. భాగ్యనగర ప్రయాణం దూర  జిల్లాల      వారికి దౌర్భాగ్యంగా పరిణమించింది.న్యాయం కోసం  హైకోర్టు కు వెళ్ళేందుకు 900  కి.మీ.లు ప్రయాణం చేయాల్సిన అవస్థ దేశం మొత్తం మీద కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. 



గీటురాయి  8.9.2000






http://www.suryaa.com/opinion/edit-page/article-158034 సూర్య 2.11.2013