ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, జులై 2014, గురువారం

టోల్ గేట్ల భారం తగ్గించాలి



టోల్ గేట్ల భారం తగ్గించాలి

నూర్ బాషా రహంతుల్లా  9948878833

మహారాష్ట్రలో ఏర్పాటు చేసిన 44 టోల్‑ప్లాజాలను మూసేయాలని 
అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.రోడ్డు నిర్మాణానికి అయిన వ్యయం చాలావరకు వెనక్కి వచ్చేసి టోల్‑ప్లాజాలను డెవలపర్లకు రూ. 309 కోట్లను చెల్లించి ముందుగానే మూసేయాలని నిర్ణయించుకున్నట్లు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చెప్పారు. అయితే ఆయన  ఇలాంటి నిర్ణయానికి రావటానికి కారణం ఏమై ఉంటుంది?


మహారాష్ట్రలో టోల్ గేట్ వసూళ్ళ వ్యతిరేక ఉద్యమం ఊపందుకుంది. టోల్ వసూళ్ళ పక్రియను నిరసిస్తూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) రాస్తారోకో పిలుపు నేపథ్యంలో మహారాష్ట్రలో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. టోల్ సుంకానికి తాము వ్యతిరేకం కాదని, అయితే వసూలు చేస్తున్న వేలకోట్ల రూపాయలు ఏమవుతున్నాయన్న విషయంలో పారదర్శకత లోపించిందని, టోల్ వసూళ్ళ సొమ్ము అనధికారికంగా కొద్ది మంది వ్యక్తుల జేబుల్లోకి వెళ్ళడాన్ని తాము అడ్డుకుంటామని ఎంఎన్ఎస్ ప్రకటించింది. కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ల్లో కూడా టోల్ వసూళ్లకు వ్యతిరేకంగా ప్రజలు గతంలో ఉద్యమించారు. మహారాష్ట్రలోని ఎనిమిది నగరాల్లోని టోల్‌బూత్‌లను అగ్నికి ఆహుతి చేశారు.

 “దేశంలో టోల్‌టాక్స్‌ల పేరుతో సాగుతున్న దోపిడీని నిలువరించాలి.రోడ్ల అభివద్ధికి,నిర్మాణానికి పెట్టిన
పెట్టుబడిని శాస్త్రీయంగా అంచనావేసి దానికనుగుణంగా రోడ్లపై టోల్‌టాక్స్ వసూలు చేయడానికి అనుమతి ఇవ్వాలి” లాంటి నినాదాలతో దేశవ్యాప్తంగా ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు.వాహనం తీసుకుని రోడ్డుమీది కెక్కాలంటే గుండె దడ పుడుతున్నది.ఇంధనానికి అయ్యే ఖర్చు కన్నా టోల్‌ టాక్స్ ఖర్చు తడిసిమోపెడు అవుతున్నది. ప్రతి నలభై, యాభై కిలోమీటర్లకు ఒకటి చొప్పున టోల్‌గేట్లు పెట్టి వాహనదారుల నుంచి టోల్ నిర్వాహకులు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ వసూళ్లకు ఎలాంటి శాస్త్రీయ ప్రాతిపాదిక కనిపించదు. ఒక్కో వాహనానికి ఒక్కో రేటు చొప్పున కనీసం 80-90 రూపాయల నుంచి మూడు 400 దాకా వసూలు చేస్తున్నారు. టోల్ నిర్వాహకులు ఈ దోపిడీ ఏకంగా 20- 30 ఏళ్లపాటు ప్రజల నుంచి ముక్కు పిండి వసూళ్లు చేస్తారు. ఇవ్వాళ.. దేశవ్యాప్తంగా టోల్ మాఫియా దోపిడీ ఎక్కువైందని ప్రజల నుంచి స్వచ్ఛంద సంస్థ లు, ప్రజాప్రతినిధుల దాకా ఆరోపిస్తున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 ఢిల్లీ, హర్యానాలో గుర్‌గావ్, రోహతక్ ప్రాంతాల్లో, అసోం, అరుణాచ ల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, కర్నాటక, కేరళ, గుజరాత్, ఒడిషా, తమిళనాడు తదితర రాష్ర్టాల్లో టోల్ దోపిడీకి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. చాలా చోట్ల టోల్ స్టేషన్లపై ప్రజలు దాడులు చేశారు. టోల్ సెంటర్లను ధ్వంసం చేశారు. దీనికితోడు లారీ యజమానులు, వాహనదారులు కూడా టోల్ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. ఈ మధ్యనే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ర్టాల్లో టోల్ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి.  

టోల్ పన్ను ఎంత ఉండాలి?

కేంద్ర ప్రభుత్వానికి  పబ్లిక్‌పైవేట్ యాజమాన్యంతో ఎంత నష్టం జరుగుతుందో ఇప్పుడిప్పుడే అనుభవంలోకి వస్తున్నది. అభివద్ధికి సంకేతంగా చూసే విధానాల్లోంచి పుట్టుకువచ్చిందే పీపీపీ పద్ధతిలో రహదారుల నిర్మాణం. దేశవ్యాప్తంగా ప్రైవేటు వారికి రోడ్ల నిర్మాణాన్ని అప్పజెప్పి వారు పెట్టిన పెట్టుబడులకు గాను రోడ్డుపై ప్రయాణించే ప్రతివాహనం నుంచీ కొంత చొప్పున రుసుము వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే అది ఎంత ఉండాలనేది, ఎంతకాలమనేది ఇప్పుడు దేశ ప్రజలందరినీ వేధిస్తున్న ప్రశ్న.

ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలో మహారాష్ట్ర నవనిర్మాణ సేననేత రాజ్ ఠాక్రే ఏకంగా టోల్ గేట్ల దగ్గర ఎవరూ టోల్ ఫీజును కట్టొద్దని ప్రజలకు పిలుపునిచ్చాడు. ఎవరైనా, ఎక్కడైనా టోల్ నిర్వాహకులు బలవంతంగా టోల్‌టాక్స్ వసూలుకు సిద్ధపడితే తిరగబడండి అని పిలుపునిచ్చాడు. అలాగే ఉత్తర ప్రదేశ్‌లో, హర్యానాలో స్థానిక నాయకులు కూడా టోల్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ప్రజలెవ రూ టోల్‌టాక్స్ కట్టొద్దని, టోల్ ఫీజు అడిగిన వారి పై తిరగబడాలని, టోల్ స్టేషన్లను ధ్వంసం చేయాలని ప్రజలకు చెబుతున్నారు. కర్నాటకలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు హెచ్.ఎస్. దొరైస్వా మి టోల్‌గేట్ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాన్నే మొదలు పెట్టాడు. దేశవ్యాప్తంగా రోడ్లపై పట్టపగలు నిలువుదోపిడీ జరుగుతున్నదని ఆగ్రహిస్తున్నాడు. దీనికి వ్యతిరేకంగా ప్రజలంతా కదిలి ఉద్యమించాలని పిలుపునిస్తున్నాడు.బెంగళూరులో వేలాదిమంది స్కూటర్, కారు వాహనదారులు టోల్‌టాక్స్‌కు వ్యతిరేకంగా పెద్ద ప్రదర్శన నిర్వహించారు. టోల్ టాక్స్ నిర్వాహకులు తాము వెచ్చించిన డబ్బుల కన్నా వెయ్యి రెట్లు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు .  నోయిడా లో రహదారుల నిర్మాణానికి సదరు కంపెనీ వెచ్చించిన డబ్బులు కేవలం మూడేళ్లలోనే వసూలయినా ఆ టోల్ నిర్వాహకులు ఇంకా వసూ లు చేస్తూనే ఉన్నారు.ఆ కంపెనీ రెండేళ్లలోనే వాహనదారుల నుంచి 748 కోట్లు వసూలు చేసిందని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడి అయ్యింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఓ రోడ్డు నిర్మాణ సంస్థ రహదారి నిర్మాణానికి 420 కోట్లు వెచ్చించిం ది. కానీ ఆ సంస్థ వాహనదారులనుంచి ఒక ఏడాది లోనే 750 కోట్లు వసూలు చేసింది. ఇంతటితో ఇది ఆగిపోతుందా అంటే అదీ లేదు. ఏకంగా 30 ఏళ్లు ప్రజలనుంచి టోల్‌ను వసూలు చేయడానికి ప్రభుత్వం నుంచి హక్కు పొంది ఉన్నారు. అంటే టోల్ నిర్వాహకుల నిర్వాకం, దోపిడీ ఏ స్థాయిలో ఉన్నదో ఊహించుకోవాల్సిందే.

ప్రజలపై పెనుభారం

 రహదారుల నిర్మాణం అవసరమే కానీ  ప్రభుత్వాలు ఒక హేతుబద్ధమైన విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉన్నది. రోడ్ల నిర్వహణకు, నిర్మాణానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం అవసరమైన పెట్టుబడులు తొమ్మిది వేల కోట్లనుంచి 60 వేల కోట్లకు పెరిగింది. ఈ అవసరమైన పెట్టుబడుల కోసం ప్రైవేటు పెట్టుబడిదారులపై ఆధారపడక తప్పని పరిస్థితి వస్తే.. దానికి తగు శాస్త్రీయమైన విధి విధానాలను రూపొందించాలి. కానీ ప్రజలను నిలువు దోపిడీ చేయడానికి ప్రైవేటు వ్యక్తులకు లైసెన్సులు ఇవ్వడం ఏవిధంగానూ సమర్థనీయం కాదు. అలాగే ఈ రోడ్ల నిర్వహణ కోసమే ప్రభుత్వం ఇంధనాలపై రెండు శాతం సెస్ విధిస్తున్నది. దీని ద్వారా ప్రభుత్వానికి ఏటా 50వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నది. అలాగే ప్రైవేటు వాహనాలపై పర్మిట్‌ల పేరుమీద 30వేల కోట్లు వసూలు చేస్తున్నది. దీన్ని సక్రమంగా వినియోగిస్తే చాలా వరకు జాతీయ రహదారుల అవసరాలను పూడ్చవచ్చు. కానీ రహదారుల అభివృద్ధి, నిర్మాణం పేర ప్రైవేటు పెట్టుబడిదారులకు  అపార లాభాలు కట్టపెట్టడం దారుణం.

1997లో ప్రభుత్వం విధించిన టోల్‌టాక్స్ ప్రకారం చిన్న వాహనానికి కిలోమీటర్‌కు 40 పైసలు. పెద్ద వాహనానికి70 పైసలు. ట్రక్కులు, లారీల లాంటి వాటికి కిలోమీటర్‌కు 1.40 పైసలుగా నిర్ణయించారు. ఇదే 2006 వచ్చే నాటికి టోల్ టాక్స్ విధించే రుసుమును కిలోమీటర్‌కు రెండు రెట్ల నుం చి పదిరెట్లదాకా పెంచారు.కారుకు రూ. 65-111కు ,మధ్యరకం వాహనానికి 115నుంచి 229కి పెంచారు.ఈవిధంగా టోల్ టాక్స్‌ను పెంచడానికి ఏవిధమైన హేతుబద్ధమైన కారణాన్ని చూపలేదు.
మరో వైపు టోల్ నిర్వాహకుల నిర్వాకం అంతా ఇంతా కాదు. ఒక్కోసారి టోల్‌గేట్ దాటడానికి వాహనానికి గంటల సమయమే కాదు ఇంధనం కూడా వృథాగా ఖర్చు అవుతున్నది. కాబట్టి ఇప్పటికైనా దేశంలో టోల్‌ పేరుతో సాగుతున్న దోపిడీని నిలువరించాలి. వారి అరాచకాలను అరికట్టాలి. రోడ్ల అభివద్ధికి, నిర్మాణానికి వారు పెట్టిన పెట్టుబడిని శాస్త్రీయంగా అంచనావేసి దానికనుగుణంగా రోడ్లపై టోల్‌టాక్స్ వసూలు చేయడానికి అనుమతి ఇవ్వాలి. టోల్‌టాక్స్ వసూలుకు ఏ శాస్త్రీయమైన పద్ధతి లేకుండా ఉంటే..అది దారి దోపిడీ తప్ప మరోటి కాదు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే.. రానున్న రోజుల్లో టోల్‌గేట్లకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఉద్య మం చెలరేగే అవకాశం ఉన్నది. టోల్ ధరని తగ్గించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాని కి లదు. 1956 టోల్ చట్టాల ప్రకారమే టోల్ చార్జీలను ఖరారు చేస్తున్నా రాష్ట్రంలో ప్రతిరోజూ టోల్ పన్నుల రూపం లో రోజుకు రూ.3 కోట్లు వసూలు అవుతున్నాయి. ప్రజలపై భారం కొంచమైనా తగ్గించాల్సిందే.కారులో ప్రయాణిస్తేనే టోల్‌టాక్స్ కడతారనుకుంటే పొరబాటే.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించినా టోల్తీస్తున్నారు. ఒక్క టోల్ గేట్ దాటితే సాధారణ టిక్కెట్‌పై అదనంగా రూ.4 వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుడు మూడు గేట్లు దాటాల్సి ఉంటుంది. ఒక్కో ప్రయాణికుడు టిక్కెట్‌పై అదనంగా రూ.12 చెల్లించాల్సి వస్తోంది. హైదరాబాద్ పోయి, రావాలంటే అదనంగా రూ.24 భారం పడుతోంది. సొంత వాహనాల్లో ప్రయాణించే వారికి టోల్‌టాక్స్ రూపంలో 30 శాతం అదరనపు భారం పడుతోంది. ఆర్టీసీ బస్సుల్లో దూరాన్ని బట్టి టాక్స్‌ను టిక్కెట్‌లో జమ చేసి ఇష్యూ చేస్తున్నారు. ఆర్డీనరీ, ఎక్స్‌ప్రెస్, ఇతర అన్ని బస్సులకు తేడా లేకుండా ఒకేలా ప్రతి ప్రయాణికుడిపై  భారాన్ని వేస్తున్నారు.

 స్థానికులను గుర్తించాలి
 వాస్తవానికి ఒక టోల్ టాక్స్ పరిధిలో కనీసం ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించే వారిని టాక్స్ లేకుండా వాహనాలను, ఇతరులను పాస్ చేయాలి. అయితే తక్కువ దూరం ప్రయాణించిన వారి నుంచి కూడా టాక్స్ వసూలు చేస్తున్నారు. స్థానికులను గుర్తించి ప్రత్యేక పాస్‌లు అందించాలని ప్రజలు  కోరుతున్నారు. ప్రతి ఏటా ఏప్రిల్ నెల మొదటి వారం నుంచి నూతన ధరలు అమల్లోకి వస్తున్నాయి. అధిక ధరలు వసూలు చేస్తుండటంతో పలుమార్లు టోల్‌గేట్ వద్ద ధర్నాలు, రాస్తారోకోలు, విధ్వంసానికి సైతం పాల్పడిన ఘటనలున్నాయి. టోల్ రుసుం చెల్లించలేక కొందరు వాహనదారులు  పక్క దారుల్లో  దొంగల్లా రాకపోకలు సాగిస్తున్నారు. ఐతే టోల్ గేట్ నిర్వాహకులు  ఆ దారులగుండా వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.
 పెరిగిన ధరలు
 ప్రస్తుతం కారు, జీపు, వ్యాన్ టోల్‌గేట్ నుంచి వెళితే రూ. 110 వసూలు చేస్తుండగా తాజాగా దాన్ని రూ.120 పెంచారు. ఒకసారి వెళ్లి మళ్లీ రావడానికి రూ.170 చెల్లించాల్సి ఉండగా, రూ.180కి పెంచారు. లైట్ గూడ్స్ వెహికిల్ వెళ్లడానికి రూ. 180 నుంచి రూ.195కి పెంచారు. వెళ్లి, మళ్లీ తిరిగి రావడానికి రూ. 270 ఉండగా రూ. 290 చేశారు. ట్రక్కు, బస్సులాంటివి వెళ్లడానికి రూ.380 నుంచి రూ.405, వెళ్లి, తిరిగిరావడానికి రూ.570 నుంచి రూ.610కు పెంచారు. కమర్షియల్ వాహనాలకు రూ.445 నుంచి తిరిగి రావడానికి రూ.665కు పెంచారు. ఎర్త్ మూవింగ్ ఎక్విప్‌మెంట్ లాంటి వాహనాలకు రూ. 595 నుంచి రూ.640కి, వెళ్లి, మళ్లీ తిరిగి రావడానికి రూ.890 నుంచి రూ.955కి పెంచారు. భారీ వాహనాలు వెళ్లడానికి రూ.725 నుంచి రూ.775కి, మళ్లీ తిరిగి రావడానికి రూ.1,085 నుంచి 1,165కి పెంచారు. జాతీయ రహదారులపై తిరిగే ఆర్టీసీ బస్సుల్లో టోల్‌ ఛార్జీ పెరిగింది. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో పయాణీకుడినుంచి ఒక్కో టోల్‌ గేట్‌ వద్ద రూ. 4 చొప్పున వసూలు చేస్తారు. డీలక్స్‌, సూపర్‌లగ్జరీ, ఇంద్ర, గరుడ బస్సుల్లో రూ. 5, గరుడ, ఫ్లస్‌, వెన్నెల బస్సులో రూ. 6 వసూలు చేస్తున్నారు.



టోల్ గేట్లు ఎంతెంత దూరంలో ఉండాలి?

విశాఖపట్నం షీలానగర్‌ టోల్‌గేట్‌లో మహిళ ఉద్యోగినులు విధులను నిర్వహిస్తున్నారు. నెలకు ఏడు వేల రూపాయల వేతనం చెల్లిస్తారు. ప్రధాన రహదారుల నిర్మాణ రంగంలో టోల్ వసూళ్ళ విధానాన్ని 2000 సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం బాగా ప్రోత్సహిస్తోంది. అయితే వాహనాల నుంచి ఇష్టమొచ్చిన తీరులో కోట్లాది రూపాయలను టోల్ రూపంలో వసూలు చేసేందుకు అవకాశం లభించడంతో ప్రైవేట్ మదుపులు ఆ రంగంలోకి వేగంగా దూసుకొచ్చాయి. టోల్ విధానం వల్ల కాంట్రాక్టర్లు రద్దీగా ఉన్న మార్గాల్లోనే రహదారుల నిర్మాణం, నిర్వహణ జరుపుతుండడంతో గ్రామీణ రహదారులు దారుణమైన నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. అయితే అధికారికంగా అనుమతించిన 14-16 శాతం ఆదాయం కంటే అధిక ఆదాయం టోల్ వసూళ్ళ ద్వారా లభించే అవకాశముండడంతో ఈ రంగంలో మదుపులు పెట్టేందుకు కాంట్రాక్టర్లు పోటీపడుతున్నారు. కాంట్రాక్టర్లు, స్థానిక మాఫియా ముఠాలు, రాజకీయనాయకులు, ప్రభుత్వాధికారులు కుమ్మక్కై టోల్ మాఫియా ఏర్పడింది.అంచనాలకు తగినట్లు వాహనాల రాకపోకలు లేక నష్టాలు వస్తున్నాయని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు.అంతమాత్రాన అక్రమంగా టోల్ వసూలు చేసుకోవడం క్షంతవ్యం కాదు.టోల్ పేరుతో భారీ అక్రమాలు జరుగుతున్నాయి.నిబంధనల ప్రకారం రెండు టోల్ బూత్‌లకు మధ్య కనీసం 80 కిలోమీటర్ల దూరం ఉండాలన్న నిబంధనను టోల్ మాఫియా ఖాతరు చేయకుండా, అనేక టోల్ బూత్‌లను నిర్మించి అక్రమ వసూళ్ళకు పాల్పడుతోంది.





జాతీయ రహదారిపై ప్రయాణం ప్రయాణికులకు భారమైంది. టోల్‌గేట్లు వల్ల  ప్రయాణికులపై టోల్‌ వసూళ్ల మోత మోగుతోంది. మరో పక్క అధిక లోడుతో వెళ్లే వాహనాలను వే - బ్రిడ్జీల వద్ద తూకం వేసి భారీగానే పన్నులు వడ్డిస్తు న్నారని వాహనదారులు లబోదిబోమంటున్నారు.ప్రజల కోసం పనిచేస్తున్న ఆర్టీసీపై టోల్‌ రుసుము రద్దు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. 60 కిలో మీటర్లకొకటి  చొప్పున టోల్ ‌గేట్లను ఏర్పా టు చేసారు. ఈ  టోల్‌గేట్ల ద్వారా పెద్దమొత్తంలో వసూళ్లు సాగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 6 టైర్ల లారీలో 10 టన్నులు, 10 టైర్ల లారీలో 17 టన్నులు, 12 టైర్ల లారీలో 21 టన్నుల బరువు తీసుకువెళ్లేందుకు మాత్రమే అవకాశముంది. అంతకంటే అధిక బరువుతో రోడ్డెక్కితే అదనంగా రూ.75 నుండి 100 రూపాయలు టోల్‌గేట్లకు చెల్లించాల్సిందే. వే-బ్రిడ్జిల ద్వారా అతిబరువుతో వెళ్తున్న వాహనాలను గుర్తించి వారి నుంచి అదనపు వసూళ్లు చేస్తుండడంపై వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. వే-బ్రిడ్జీల ఏర్పాటుపై గుత్తేదారు సంస్థ ప్రతినిధులు ఓవర్‌ లోడు నివారణకు ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసే వీలు లేక తామే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్తున్నారు. ఓవర్‌ లోడు వల్ల రహదారి దెబ్బతినే అవకాశం ఉండటం వల్ల అదనపు వసూళ్లు తప్పని సరిగా వారు పేర్కొంటు న్నారు. ప్రైవేట్‌ గుత్తేదారు సంస్థలు అధిక లాభాలు పొందుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రయాణికులపై భారంపడేలా ఆర్టీసీ సైతం ఛార్జీలు పెంచడంపై ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ప్రజలపై భారాలు లేకుండా చర్యలు తీసుకోవా లని కోరుతున్నారు. రోడ్డు  పనులు అసంపూర్తిగా ఉన్నప్పటికీ టోల్‌గేట్‌ను ప్రారంభించటంపట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడి పనులు అక్కడే ఉన్న  రహదారిపై టోల్‌గేట్లు వేయటంలో అత్యుత్సాహం చూపిన  కంపెనీలు  వాహన దారుల రాకపోకలకు సరైన సౌకర్యాలు కల్పించటంలో మాత్రం శ్రద్ధ చూపించలేదు. ఇంకా  పనులు పూర్తి చేయకుండానే గేట్లు వేయటం ఏమిటి అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అసంపూర్తి రోడ్ నిర్మాణాల వల్ల తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రమాదాల నివారణకు ప్రయాణికులకు, వాహనదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నాలుగు ఆరు లైన్ల రోడ్ నిర్మాణాన్ని చేపట్టింది. కంపెనీల  నిర్లక్ష్యంతో ఎక్కడికక్కడే నిర్మాణాలు నిలిచిపోయి ప్రమాదాల సంఖ్య పెరిగింది. ఇంత జరిగినప్పటికీ సదరు కంపెనీల్లో మార్పు రాకపోగా యథేచ్ఛగా టోల్ ట్యాక్స్ వసూలుకు చక చకా ఏర్పాట్లు చేసుకున్నారు.చాలా చోట్ల సర్వీస్ రోడ్ లేకపోవటం, ఎత్తు కట్టల పనులు సకాలంలో పూర్తి చేయకపోవటం, అండర్ పాసింగ్ బ్రిడ్జిలను ఎక్కడికక్కడే నిర్మించి వదిలి వేయటంతో ప్రజలు ఇబ్బందులెదుర్కొంటున్నారు.
70
కి.మీ. వరకూ టోల్ గేట్ ఏర్పాటు చేయకూడదని సుప్రీమ్ కోర్ట్ సూచించినప్పటికీ రోడ్ భద్రతా చర్యలు, ప్రజల అవసరాలు పూర్తి చేయకుండానే 60 కి.మీ.కి ఒకటి చొప్పున టోల్‌గేట్లు  ఏర్పాటు చేశారు.



ఆర్టీసీకి  కూడా టోల్ పన్ను ఎందుకు ?

టోల్‌ పన్ను  ఏటా దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా ప్రయాణీకుల నుండి ఆర్టీసీ వసూలు చేసి టోల్‌ గేట్ల వద్ద ప్రైవేటు కాంట్రాక్టర్లకు  చెల్లిస్తోంది. రహదార్లపై ఉన్న టోల్‌ గేట్ల మీదుగా వెళ్లే బస్సుల్లో టోల్‌ ఫీజు కింద ఆర్టీసీ వాటిల్లో ప్రయాణిస్తున్న ప్రయాణీకుల నుండి వసూలు చేస్తోంది.ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీకి ఈ ఫీజులో మినహాయింపు ఇవ్వొచ్చుగాదా?

ఆర్టీసీ ది వ్యాపార దృక్పథం కాదు. అదొక సేవా సంస్థ. ఆ సంస్థలో జరుగుతున్న దుబారాను అరికట్ట లేని ఆర్టీసీ యాజమాన్యం టోల్‌ గేట్ల పన్నును మాత్రం ప్రయాణీకుల నుండి వసూలు చేస్తోంది. నష్టాలు నష్టాలని గగ్గోలు పెడుతున్న ఆర్టీసీ రకరకాల భారాలను మౌనంగా భరిస్తోంది. కనీసం  టోల్‌ గేట్ల పన్ను భారాన్ని అయినా సంస్థ వదిలించుకోలేదు. దాన్ని ప్రయాణీకులే భరించాలనే విధంగా వ్యవహరించడం పద్దతిగా లేదు.   భారీగా పెంచిన బస్సు ఛార్జీలతో ప్రయాణీకుల నడ్డి విరుగుతున్న నేపథ్యంలో దీనికి అదనంగా టోల్‌  ఫీజులు మరింత భారంగా తయారయ్యాయని ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులకు టోల్‌ గేట్ల పన్ను నుండి మినహాయింపు ఇస్తున్న ప్రభుత్వం సామాన్యులు ప్రయాణించే బస్సులకు కూడా ఆ సౌకర్యాన్ని కల్పించాలీ. ఈ టోల్‌ గేట్ల పన్ను నుండి మినహాయింపు ఇవ్వాలని ఆర్టీసీ పాలకవర్గం ప్రభుత్వం మీద వత్తిడి తేవాలి. పాలకవర్గ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించాలి.  తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు సమ్మె నోటీసులు ఇచ్చే కార్మిక సంఘాలు  టోల్‌ గేట్ల పన్నుపై కూడా  నోరుమెదపాలి. కార్మిక సంఘాలు టోల్‌ గేట్ల పన్నును రద్దు చేయాలని  డిమాండ్‌ చేయాలి.

ప్రజాభిమానం ఇలా పొందవచ్చు

సమైక్య రాష్ట్రం చీలిపోయింది.ఆర్టీసీ కూడా రెండుగా చీలిపోయినా ఈ టోల్ గేట్ భారం రెండు చోట్లా పడుతుంది కాబట్టి తెలంగాణా ఆంధ్ర ప్రభుత్వాలు రెండూ టోల్ భారాన్ని తగ్గించుకోవటానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించాలి.ప్రజలు రెండు చోట్లా పాలనను పరిశీలిస్తున్నారు.పాలకులుకూడా ఒకరిపై మరొకరు పోటా పోటీగా ప్రజలకు కొత్త కొత్త సౌకర్యాలు ప్రకటిస్తున్నారు.టోల్ గేట్లు ఎత్తివేయడం ద్వారా ప్రజల ఆదరాభిమానాలను పొందవచ్చు.పాలకులు ఈ దిశలో కూడా ప్రయత్నించాలి. (సూర్య  5.7.2014)
https://www.facebook.com/photo.php?fbid=787153671316625&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater
  http://www.suryaa.com/opinion/edit-page/article-187001