ఈ బ్లాగును సెర్చ్ చేయండి

23, డిసెంబర్ 2019, సోమవారం

నాలుగు జోనల్ కార్యాలయాలు కావాలి


నాలుగు జోనల్ కార్యాలయాలు అవసరం (సూర్య 27.12.2019)

1952 లో చెన్నపట్నం,బళ్ళారి,బరంపురం,హోస్పేట మొదలైన తెలుగు ప్రాంతాలు కొన్ని  వదులుకొనిమరీ  తెలుగు రాష్ట్రాన్ని సాధించుకొన్నారు. భాషా ప్రాతిపదికన ఏర్పడిన ఆంధ్రోదయం నాడు కర్నూలులో తాత్కాలిక రాజధానిని పెట్టారు.కర్నూలులో అసెంబ్లీ,సచివాలయం, గుంటూరులో హైకోర్టు పెట్టి రెండు ప్రాంతాలవారిని తృప్తి పరిచారట.రైలు.బస్సు,విమానం దిగగానే సుఖంగా ఆఫీసుకు చేరే హైదరాబాదు నగరంలాగా అమరావతిలేదే అని కొందరు బాధపడుతున్నారు.విజయవాడనుంచి అమరావతికి పోయేదాకా శ్మశానంలాగా,ఎడారి లాగా ఉంది అని కొందరు పెదవి విరిచారు. కర్నూలులో దూరం భారం, సౌకర్యాల లేమి మొదలైన కష్టాలపై ఆనాటి ఆస్థానకవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు ఇలా పద్యం చెప్పారు:

“తుంగానదీ గర్భ శ్రుంగార భవనంబు

ప్రభుతా నిలయంబుగా పాదుకొలిపి

జిల్లాకలక్టరు ఇల్లు ఊడలాగి

వానిని మరియొక ఊర నిలువజేసి 

మూలమూలలనున్న మురికి కొంపలలోన 

దత్తతుద్యోగుల దాగజేసి

మరికొందరు ఊరి దరిని కాపురముండ

గుడ్డ గుడారముల్ కొన్ని వైచి

మరియు కొన్ని రికార్డులు మనుప కోయిల

కుంట జూపించి , అట గవర్నరుంట కనువు

పడమిని ,అనంతపురమున నిడగదలిచి

రాంధ్ర రాష్ట్రము కర్నూలునందు నిలిపి” 

రాజధాని నగరాలనే ప్రజలు ఎందుకు కోరుకుంటారు?అనేకరంగాలలోని ప్రముఖులంతా రాజధాని నగరాలకు వలసలతో చేరుకుంటారు.ఒకనాడు సినిమాలకు ,సాహిత్యానికి,కర్ణాటక సంగీతానికి మద్రాసు కేంద్రబింధువై నిలిచింది.దక్షిణాది రాష్ట్రాల విద్వాంసులెందరో తమిళనాడు చేరారు.తెలంగాణా తో విలీనం తరువాత ఎంతోమంది ప్రముఖులు హైదరాబాదు చేరారు.మళ్ళీ ఇప్పుడు మన రాజధాని నగరాలు ఎక్కడ ఏర్పడితే అక్కడికి వెళతారు.రాజధానినగరాలకు ప్రయాణం చేసి చేరుకునే దారులు ఏర్పడతాయి.రవాణా తో పాటు విద్య వైద్యం లాంటి ప్రాధమికసదుపాయాలన్నీ ఏర్పడతాయి.ఉద్యోగాల కల్పన,వ్యాపార విస్తరణ జరుగుతుంది.అందుకే పల్లెటూర్ల ప్రజలు పట్టణబాట పడతారు.తనకృషి వల్లనే హైటెక్సిటీ,సైబరాబాద్ ఏర్పడ్డాయని చంద్రబాబు నాయుడు గర్వపడతాడు.ఆయననివాసం కూడా ఆక్కడే కట్టుకున్నాడు.హైదరాబాదు.బెంగుళూరుల్లో నివాసాలు ఉన్న జగన్మోహనరెడ్డి తాడేపల్లిలో కూడా ఇల్లు కట్టుకున్నాడు.పవన్ కళ్యాణ్ కాజలో ఇల్లుకట్టుకున్నాడు.విజయవాడ,రాజమండ్రి,తిరుపతి పట్టణాలు జిల్లా కేంద్రాలు కాకపోయినా ప్రజల వలసలతో గొప్పనాగరాలు అయ్యాయి.ప్రముఖులు తమనివాసాలను ఎక్కడ కట్టుకుంటే అక్కడ నగరం అభివృద్ధి చెందుతుంది.నగరాలు ఏవీ ఒక్కసారి ఏర్పడవు.ఏళ్ల తరబడి పొగుబడిన అభివృద్ధే మహా నగరం.కష్టాలకొర్చుకున్ననే సుఖాలు దక్కును,ఈలోకమందు సోమరులై  ఉండకూడదు అని కవి కొసరాజు జాగ్రత్తలు చెప్పాడు.ఎవరు ఎన్ని చెప్పినా  ఎక్కడికక్కడే మాప్రాంతం రాజధానికావాలి ,ప్రాంతీయ కేంద్రం కావాలి అని పోటీ పడుతున్నారు.తమప్రాంతం అనుకూలతలు అవతలిప్రాంత అననుకూలతలు రాసుకొచ్చి మరీ చెబుతున్నారు. రాజధానిని గతంలో పోగొట్టుకున్నాం , శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టు మా ప్రాంతంలో పెట్టాలి అని రాయలసీమవాసులు కోరుతున్నారు.

మూడు రాజధానులతోపాటు 4 ప్రాంతీయ మండళ్ళు (జోన్లు,కమీషనరేట్లు) ఉండాలని జి.ఎన్.రావు కమిటీ నివేదించింది.1972 ప్రాంతంలో వచ్చిన జై ఆంధ్ర ఉద్యమ ఫలితంగా మనరాష్ట్రంలో 6 జోన్లు ఏర్పాటు చేశారు.2014 లో తెలంగాణా విడిపోయి మనకు ఆంధ్రలో 3 రాయలసీమలో 1 మొత్తం నాలుగు జోనుల నేల మాత్రమే మిగిలింది. ఏ జోనులోని ఉద్యోగాలు ఆ జోను వారికే ఇచ్చేవారు.అంటే సీనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాలవరకు జిల్లా,డిప్యూటీ తహసీల్దారు స్థాయి వరకు జోను పరిధిగా ఉండేది.స్థానికుల్ని సంతృప్తి పరచడమే జిల్లాలు,జోనుల ఏర్పాటు లక్ష్యం.నాలుగు కమీషనరేట్ల పంపకం కూడా నాలుగు ప్రాంతాలవారినీ సంతృప్తి పరుస్తుంది.1. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం జిల్లాలు 2.మధ్యకోస్తా : తూర్పుగోదావరి ,పశ్చిమ గోదావరి,కృష్ణాజిల్లాలు 3.దక్షిణకోస్తా: గుంటూరు,ప్రకాశం,నెల్లూరు జిల్లాలు 4.రాయలసీమ:కర్నూలు,కడప,అనంతపురం,చిత్తూరు జిల్లాలు.పార్లమెంటు నియోజకవర్గాల ప్రకారం జిల్లాల సంఖ్య 25 అవుతుంది.పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన తరువాత వాటి సంఖ్య మళ్ళీ పెరగవచ్చు.అయితే ప్రజలకు ఒరిగేది ఏమిటంటే ఇప్పుడున్నట్లు అందరూ విశాఖకో,కర్నూలుకో, అమరావతికో ప్రయాణం కట్టనక్కరలేదు.ఎవరి రాజధాని నగరం వారికి చాలా దగ్గర అవుతుంది. ప్రజలకు దగ్గరలో పనులు జరుగుతాయి.అన్ని డిపార్టుమెంట్లూ జోనల్ వ్యవస్థను అమలుచేస్తుంటే రెవిన్యూ డిపార్టుమెంట్ లో జోనల్ కార్యాలయాలు ఇప్పటికీ లేవు.జోనల్ కమీషనర్ జిల్లా కలక్టర్ కంటే పై స్థాయి అధికారి.కలక్టర్ల స్థాయిలో పనులు కాకపోతే ఇదివరకు రాజధాని హైదరాబాదుకు వెళ్లాల్సివచ్చేది. జోనల్ కార్యాలయాలు ఉంటే కొన్ని పనులు మధ్యలోనే జరుగుతాయి.నాలుగు ప్రాంతాలకు మధ్యలో ఉన్న కేంద్రాలుగా విజయనగరం,ఏలూరు,ఒంగోలు,కడప నగరాలను చేయవచ్చు.ప్రాంతాలకు భౌగోళికంగా మధ్యలో ఉండటం కూడా ప్రాంతీయ కేంద్రానికి మంచి అర్హతే.తుఫానులు,భూకంపాలు ,వరదలు తగలని ప్రాంతాలూ మంచివే. జిల్లా కేంద్రాలు జిల్లా మధ్యలో కాకుండా అంచులో ఉన్న జిల్లాల్లో ప్రజలు జిల్లా కేంద్రాలకు ప్రయాణించేటప్పుడు మాట్లాడే అసంతృప్తి మాటలను కూడా పాలకులు పట్టించుకోవాలి.
ఎన్టీ రామారావుగారు తాలూకాలను చీల్చి మండలాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రజలు హర్షామోదాలు తెలియజేశారు.మళ్ళీ మండలాలను రద్దుచేసి తాలూకాలే పెట్టమని ఇంతవరకు ఎవరూ అడగలేదు.కొత్త జిల్లాల కోసం ఆయా ప్రాంతాల ప్రజలు ఎదురు చూస్తున్నారు.కొత్తజిల్లాలు వద్దని ఎవరైనా వారిస్తున్నారా?అలాగే ఇదీ.వాస్తవానికి రాజధాని నగరాన్ని మరోచోటికి మార్చటం కంటే నాలుగు చోట్ల ప్రాంతీయ నగరాలు పెట్టటం మరింత ప్రయోజనకరం.పూర్వం జోన్లు ఏర్పాటు చేశారు కానీ జోనల్ కార్యాలయాలను పెట్టలేదు.అక్కడ కలక్టర్లకంటే పై స్థాయి అధికారి ఉంటాడు.ఆ కొరత కూడా ఇప్పుడు నాలుగు ప్రాంతీయ కమీషనర్ల కార్యాలయాలతో తీరుతుంది.సచివాలయాన్ని కూడా నాలుగు ప్రాంతాలకు నాలుగు విభాగాలుగా విడదీస్తే నాలుగు ప్రాంతాలకు పరిపాలన సమంగా అందుతుంది.అమరావతిలో అసెంబ్లీ,సచివాలయం,హైకోర్టు కట్టేశారు కాబట్టి కర్నూలు విశాఖల్లో  హైకోర్టు బెంచీలు మినీ సచివాలయాలు ఏర్పాటు చేస్తే రాజధాని స్థాయి పాలన మూడు ప్రాంతాలకు విస్తరిస్తుంది.

---నూర్ బాషా రహంతుల్లా , విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266

19, డిసెంబర్ 2019, గురువారం

నిజమైన శరణార్ధులను ఆదుకోండి


నిజమైన శరణార్ధులను ఆదుకోండి (సూర్య 22.12.2019)
'ఏ దేశచరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం, బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావించారు, నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధి కెక్కారు అని అన్నాడు మహాకవి శ్రీశ్రీ. శరణార్ధి,కాందిశీకుడు,వలసదారుడు ,స్వదేశీయుడు,విదేశీయుడు లాంటి పేర్లు మారతాయిగానీ శరణార్ధులు ప్రాణభయంతో బ్రతుకుతున్నారు . నిరంతర ఘర్షణలు, యుద్ధ వాతావరణం, ఉగ్రదాడులు, మతపరమైన వేధింపులు, కరువులు,వరదలు,భూకంపాల వల్ల  పొట్టచేత పట్టుకుని స్వదేశాన్ని విడిచి తమ కుటుంబాలను కాపాడుకోవడానికి వలసబాట పడుతున్నారు.తన అస్తిత్వాన్నీ కోల్పోయి దినదిన గండంగా చస్తూ బతుకుతున్నారు.ప్రపంచవ్యాప్తంగా 7.1  కోట్ల మంది తమ ఇళ్లు, వాకిళ్లు వదిలిపోయారు.ఇథియోఫియాలో తెగల మధ్య ఘర్షణలు, వెనెజువెలాలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి ఆహారం, మందుల కొరతతో నిత్యం వేలాదిమంది వలసపోతున్నారు. వీరిలో 4.13 కోట్ల మంది తమతమ దేశాల్లోనే ఇతర ప్రాంతాలకు వెళ్లి జీవిస్తున్నారు. 2.59 కోట్ల మంది ఇతర దేశాల్లోని శరణార్థి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.మరో 35 లక్షల మంది ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్నారు. 2011 నుంచి యుద్ధంతో ఛిన్నాభిన్నమైన సిరియాలో ఎక్కువమంది స్వదేశంలోనే ఇతర ప్రాంతాలకు తరలివెళ్లి జీవిస్తున్నారు. అలాగే, కొలంబియాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న హింసకు ఎక్కువమంది వలస పోతున్నారు. పాలస్థీనాకు చెందిన 55 లక్షల మంది వివిధ దేశాల్లో ప్రత్యేకించి లెబనాన్‌, జోర్డాన్‌లలో శరణార్థులుగా జీవిస్తున్నారు. సూడాన్‌లో 1983లో పౌర యుద్ధం లో 50 లక్షలమంది తమ ఇళ్ళనుండి పారిపోయారు.తమ కుటుంబాల నుండి వేరైపోయిన వేలాదిమంది పిల్లలు ఇతియోపియాలోని శరణార్థి శిబిరాలకు పారిపోయి, దాదాపు మూడు సంవత్సరాలు అక్కడే ఉండిపోయారు.
భారీ వలసలు తీవ్ర సవాళ్లుగా మారుతున్నాయని చెప్పారు. సంపన్న దేశాల ద్వారా దీన్ని అధిగమించవచ్చని, ఇందులో జర్మనీ కృషి ప్రశంసనీయమన్నారు. ఈ విషయంలో జర్మనీ చాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ రాజకీయంగా భారీ మూల్యాన్ని చెల్లించినప్పటికీ, ఆమె మరింత సాహసోపేతంగా ఉంటారని ఆమె చర్యలు నిరూపించాయని కొనియాడారు.
 టర్కీ అధ్యక్షుడు రిస్సెప్‌ తయ్యిబ్‌ ఎర్డోగన్‌ 30లక్షల మంది శరణార్థులకు టర్కీ ఆశ్రయం కల్పిస్తున్నదని అన్నారు. సిరియాలో 2011 అంతర్యుద్ధం కారణంగా ప్రాణభయంతో వలసవస్తున్న శరణార్థులను తమ దేశం ఆదుకుందని ,సిరియా సరిహద్దులో యుద్ధరహిత  జోన్‌ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామని, వలసదారులను అక్కున చేర్చుకునేందుకు టర్కీ సిద్ధంగా ఉందని ఆన్నారు.పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ద్వారా ముస్లింలలో అభద్రతా భావం నెలకొనే ప్రమాదముందని అన్నారు. పాకిస్థాన్‌ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ 14 లక్షల ఆఫ్ఘన్ శరణార్థులకు ఆశ్రయం ఇస్తోందని ఇంతకుమించి వలసదారులకు ఆశ్రయం కల్పించే స్థితిలో పాక్‌ లేదని తెలిపారు.పలు దేశాల్లో శరణార్థులు దినసరి కూలీలుగా అవతారమెత్తారు. చాలీచాలని వేతనాలు తీసుకుంటూ ఇబ్బందిపడుతున్నారు. అనేక దేశాలు వలసదారులకు గ్రామ శివారుల్లో శిబిరాలను ఏర్పాటు చేశాయి. వీరిని తమ దేశ పౌరులతో కలవనీయకుండా వివక్ష కనబరుస్తున్నాయి.  శరణార్ధులు ప్రాథమిక అవసరాల కొరతతో ఇబ్బందిపడుతున్నారు. శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న అనేక దేశాలు పౌరసత్వం ఇచ్చేందుకు ససేమిరా నిరాకరిస్తున్నాయి. అంతర్యుద్ధాలు చెలరేగిన దేశాల నుంచి వస్తున్న శరణార్థులను పలు దేశాలు అక్కున చేర్చుకోలేకపోతున్నాయి.  
మయన్మార్ ప్రభుత్వం తమ దేశంలోని రోహింగ్యాల జాతి ప్రజలను మయన్మార్ ప్రజలుగా గుర్తించడానికి నిరాకరించి తరిమేస్తుంటే లక్షలాది మంది రోహింగ్యా శరణార్ధులు కట్టుబట్టలతో పొరుగునే ఉన్న ఇండోనేసియా , భారత్, బంగ్లాదేశ్ లోకి వచ్చారు. రోహింగ్యాలకు పౌరసత్వం ఇవ్వము అన్నారు అమిత్ షా.  ఎందుకంటే రోహింగ్యాల ముసుగులో ఉగ్రవాదులు, అసాంఘీక శక్తులు దేశంలోకి ప్రవేశిస్తారని కేంద్రం వాదన. మయన్మార్ రోహింగ్యాలను తరిమేసి తిరిగి రానివాటంలేదు.రోహింగ్యాల పునస్థాపన ఎలా?దిక్కుతోచని స్థితిలో నిరాశ్రయులైన రోహింగ్యాలు కట్టుబట్టలతో తమ పసిపిల్లలను, వృద్ధులను, మహిళలను వెంటపెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో పడ్డారు.లక్షలాది మందికి శాశ్వతంగా ఆశ్రయం కల్పించడం ఏ దేశానికైనా చాలా కష్టమే. రోహింగ్యా ముస్లింలు ఇండో ఆర్యన్ జాతికి చెందిన వాళ్ళు. మయన్మార్ సైనిక ప్రభుత్వం 1982లో రోహింగ్యాల పౌరసత్వాన్ని రద్దుచేస్తూ చట్టాన్ని మార్చేసింది.పౌరసత్వాన్ని నిరాకరించడం అంటే రోహింగ్యాలకు భూమి మీద యాజమాన్య హక్కు లేకుండా చేయడమే. అంతేగాక వాళ్ళు ఇతర తెగల్ని పెళ్ళి చేసుకోరాదనీ, స్వంత తెగలో పెళ్ళి చేసుకోవడానికైనా, పిల్లల్నికనడానికైనా, చదువుకోవడానికైనా, పనిలో చేరాలనుకున్నా తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలనీ అమానుష నిబంధనలు విధించింది.రోహింగ్యాలను దేశ సరిహద్దులు దాటక ముందే చంపి భూమిలో పూడ్చివేయడానికి సైన్యానికి సకల అధికారాలు ఇచ్చారు. ఇతరదేశాలకు వెళ్ళి అక్కడి భద్రతాదళాల చేతుల్లో చావడంకన్నా స్వదేశంలో స్వదేశీ సైనికుల చేతుల్లోనే చనిపోవడం మేలని రోహింగ్యా శరణార్ధులు భావిస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి శరణార్ధుల సంస్థ అధికార ప్రతినిధి ఆంద్రూస్ మెహసిక్ పేర్కొన్నారు. రోహింగ్యాలు శ్రీలంక లోని జాఫ్నా రాష్ట్ర తమిళుల్లాగా ప్రత్యేక ఇస్లామిక్ దేశo కోసం హింసాయిత లిబరేషన్ ఉద్యమాలు,గొరిల్లా నక్సలైట్ ఉద్యమాల లాంటివి చేపట్టారని,కొన్ని తెగలను ఇస్లాం లోకి బలవంతంగా మార్చే ప్రయత్నం చేశారని , ఇస్లాం జనాభా పెరగటానికి ఎక్కువ భార్యలు, ఎక్కువ సంతానాన్ని కంటారని  అక్కడి ప్రభుత్వం ఆరోపిస్తూ వారి ఉద్యమాలను అణచివేసింది. రోహింగ్యాలు  ముస్లిం మతస్తులే అయినా వారికి మలేషియా,ఇండోనేషియా,బంగ్లాదేశ్ సహా  ఏ ఇస్లామిక్ దేశమూ ఆశ్రయం ఇవ్వలేదు.వాస్తవానికి ఎవరిదేశంలో వాళ్ళు ఉండాలి.శరణు కోరిన హింసాత్మకులను,ఉగ్రవాదులను, ఆర్ధిక ఆధ్యాత్మిక మోసగాళ్లను దేశంలోకి అసలు రానివ్వకూడదు.అహింసకు కట్టుబడిన  శ్రామికశరణార్ధులకు మాత్రమే తాత్కాలిక ఆశ్రయం ఇవ్వాలి.
అంతర్యుద్ధాల కారణంగా అనేక దేశాలకు వలసల తాకిడి పెరిగింది. 80 శాతం మంది శరణార్థులు అభివృద్ధి చెందుతున్న, నిరుపేద దేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే, వీరిలో 20 శాతం మంది రెండు దశాబ్దాలకుపైగా శిబిరాల్లోనే కొనసాగుతున్నారు.శాంతి స్థాపనలో మనం దాదాపు విఫలమయ్యాం. కొత్తకొత్త ఘర్షణలు, సమస్యలు శరణార్థులను ఉత్పత్తి చేస్తున్నాయి. అదే సమయంలో పాత శరణార్థుల సమస్యలను పరిష్కరించలేకపోతున్నాం. యుద్ధాలు, హింస, విద్వేషపూరిత ఘటనలతో ప్రపంచ వ్యాప్తంగా 7.1 కోట్ల మంది ప్రజలు శరణార్ధులై థాయ్‌ల్యాండ్‌ జనాభాను దాటేశారు,  ప్రపంచవ్యాప్తంగా 27.2 కోట్ల మంది ప్రజలు వివిధ దేశాల్లో వలస జీవనం సాగిస్తున్నారు. ఆశ్రిత దేశాలు ఆశ్రయం పొందుతున్న వలసదారుల భద్రత కోసం ప్రత్యేక చట్టాలు చేసి శరణార్ధులకు  రక్షణ కల్పించాలి.ప్రపంచ దేశాలు శరణార్థులను ఆదుకోవాలి.తమ దేశంలో సుస్థిర పరిస్థితులు నెలకొన్నాక ఇళ్లకు తిరిగి వెళ్ళాలి. శరణార్థుల భారాన్ని అన్ని దేశాలు సమానంగా పంచుకోవాలి. వలసదారులపై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి ,ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ విధివిధానాలను రూపొందించుకోవాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్‌ అభ్యర్థించారు.
--నూర్ బాషా రహంతుల్లా
విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

 గీటురాయి 3.1.2020

12, డిసెంబర్ 2019, గురువారం

భిన్నత్వంలో ఏకత్వాన్నికాపాడాలి

భిన్నత్వంలో ఏకత్వాన్నికాపాడాలి(గీటురాయి 27.12.2019)
పౌరసత్వ సవరణ బిల్లుతో ప్రజల మతాల గెలుకుడు మొదలయ్యింది.పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంటులో నెగ్గినా అది నేరంతో సమానమని మక్కల్‌ నీధి మయ్యం అధినేత కమల్‌హాసన్‌ అభివర్ణించారు. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు ఏ రోగం లేని వ్యక్తికి ఆపరేషన్‌ చేసినట్లుందని కమల్‌ హాసన్‌ ఎద్దేవా చేశారు. కేవలం ఏ ఒక్క వర్గంపై పక్షపాత ధోరణి లేని భారత్‌ కోసం తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు. వ్యాధి లేని వ్యక్తికి ఆపరేషన్‌ చేయడం ఎంతనేరమో కేంద్ర చట్టం కూడా అంతే నేరమని కమల్‌ అభిప్రాయపడ్డారు.పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మతాలపేరుతో పౌరుల్ని విడదీయకూడదని అందరూ కలిసే ఉండాలని కోరారు.దేశంలో ఎవరు నివశించవచ్చో ఎవరు నివశించకూడదో చెబుతున్నారు.రాజ్యాంగాన్ని జూరాసిక్ పార్కు లాగా మార్చవద్దని కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ అన్నారు.బిల్లు మిశ్రమసంస్కృతిని దెబ్బతీస్తుందని మతాలవారీగా సమాజాన్ని చీలుస్తుందని అసోమ్ మాజీ ముఖ్యమంత్రి ప్రపుల్లకుమార్ మహంత అన్నారు. శివసేన ఎంపీ సంజరు రౌత్ హిందూ-ముస్లింలను మళ్లీ విడగొట్టే ప్రయత్నాలు చేయరాదన్నారు. ఈ బిల్లుతో రాజకీయాల కంటే మానవత్వం ప్రశ్నార్థకమైందన్నారు. ఈ బిల్లు లౌకికవాద విధానాలకు వ్యతిరేకమని ఎన్నికల నిపుణుడు ప్రశాంత్ కిషోర్ విమర్శించారు.
ఘర్ వాపస్ ,ట్రిపుల్ తలాక్ బిల్లుల్లో లాగా మనిషికి మంచిచేసే మానవత్వంకనిపించాలి.పాకిస్తాన్,బంగ్లాదేశ్,ఆఫ్ఘనిస్తాన్ దేశాలనుండి 2014 డిశంబరు కు ముందు ఇండియాకు వలస వచ్చిన శరణార్ధులు పౌరసత్వం పొందటానికి ఇక్కడ 6 సంవత్సరాలు నివసించి ఉండాలి.కానీ హిందూ,జైన,శిక్కు,,ఫార్శీ,బౌద్ధ.క్రైస్తవ మతస్తులకు మాత్రమే ఈ అవకాశం ఇస్తూ ముస్లిం శరణార్ధులకు లేదన్నారు.ఇతరదేశాలనుండి వచ్చిన ముస్లిములకు కూడా మన పొరసత్వం ఇవ్వాలా అని హోంశాఖ మంత్రి అడిగారు.బంతిలో వలపక్షం కూడదని మన పెద్దల నీతి. మతాలు వేరైనా నిన్నటిదాకా సోదరుల్లా మెలిగిన వారు ఒకరినొకరు అనుమానంగా చూసుకోవాల్సిరావటం అమానుషం.సమభావం సమన్యాయం మన రాజ్యాంగం మూలసూత్రం.14 వ ఆర్టికిల్ ప్రజలందరినీ సమాన హక్కులతో ఆదరించమనే ఆదేశించింది.పాకిస్తాన్ లో పీడనకు గురై ఇండియా వచ్చిన షియాలు,అహ్మదియాలు,శ్రీలంక శరణార్డులు ,రోహింగ్యాలు అల్లకల్లోలం అవుతారు. బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వలసవచ్చి దశాబ్దాలతరబడి ఇక్కడే నివసించిన ఆరుమతాలవాళ్ళకు లభిస్తున్న పౌరసత్వం ముస్లిములకు మాత్రం లభించకపోవటంతో వారిలో భయోత్పాతం నెలకొంది.ఎక్కడికిపోవాలో అర్ధంకాదు.ఆదేశం వీళ్ళను తిరిగితీసుకొంటుందా?మళ్ళీ రోహింగ్యాలలాగా ఎవరు ఆశ్రయమిస్తే ఆ దేశానికి వెళ్లాలా? ఒక్క బిల్లుతో ముస్లిములకు ఎన్ని సమశ్యలు వచ్చిపడ్డాయో? మనిషి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పాగా వెయ్యటానికి ఇప్పుడు కుదరదు.ఆదికజనాభాతో అన్నిదేశాలూ కిటకిట లాడుతున్నాయి.ఏమతానికి ఆమతం నాయకులు తమ మతం సంతానం ఎక్కువకావాలని పోటీలుపెడుతున్నారు.
ఇది భిన్నత్వంలో ఏకత్వం సాధించిన దేశం.ఎన్నోమతాలు కలగలిసిన పూదోట,సఖ్యత,సామరస్యత తప్పక విలసిల్లాల్సిన అనేకమతాల దేశం. ఈశాన్యరాష్ట్రాలు బిల్లుకు వ్యతిరేకంగా భగ్గుమన్నాయి. పోలీసులు లాఠీ చార్జి చేశారు. బాష్ప వాయుగోళాలను, రబ్బర్‌ బుల్లెట్లను ప్రయోగించారు.అక్కడ పారా మిలిటరీ బలగాలను దించారు.ఇంటర్నెట్ ,టీవీ సేవలు ఆపుచేశారు.అసోం లో భద్రతా సిబ్బందితో జరిగిన ఘర్షణవల్ల ముగ్గురు విద్యార్ధులు చనిపోయారు.ఇండో జపాన్ సదస్సు వేదికను అసోమ్ సచివాలయంలో నిరసనకారులు కూల్చివేశారు.బిల్లు దేశబహుళత్వానికి వ్యతిరేకంగా ఉండని ముంబై ఐపియస్ అధికారి అబ్దుర్రహమాన్ రాజీనామా చేశారు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత షిరీన్ దల్వీ బిల్లుకు నిరసనగా తన అవార్డును వెనక్కి ఇస్తానని ప్రకటించారు.పశ్చిమబెంగాల్ అసోం లలో వలస శరణార్డులు ఎక్కువగా ఉన్నారు. ఇది ఈశాన్యజాతులను తుడిచిపెట్టే ప్రయత్నం,క్రిమినల్ దాడి అని రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగవిరుద్ధమైన ఈ బిల్లు ఆమోదంపొందితే దేశ చరిత్రలో ఇది చీకటి దినంగా మిగిలిపోతుందని సోనియాగాంధీ, పి.ఓ.డబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య అన్నారు. ఈ బిల్లు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉందని, దేశ సమగ్రతకు, సమైక్యతకు తీవ్ర విఘాతం కలిగించేలా ఉందని, ఈ బిల్లు మతంపై ఆధారపడిన బిల్లు, సుప్రీంకోర్టులో ఈ బిల్లు నిలబడదని,ఇది మతపరమైన వివక్ష అని ముస్లిమ్ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు..ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని మాజీ జస్టిస్ చంద్రకుమార్ అభిప్రాయపడ్డారు.ఈబిల్లు అసహ్యకరం,అప్రజాస్వామికం,అసహ్యకరం దీనిని బంగాళాఖాతంలో కలిపేయ్యాలి అని తమిళనాడు ఎంపీ వైకో అన్నారు.ఒవైసీ అయితే బిల్లు ప్రతిని లోక్ సభలో చింపివేశారు.
ఇది దేశానికి మైలురాయి , విపక్షాలది పాకిస్తాన్ భాష అని మోడీ అన్నారు.మనదేశంలో రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి,చీఫ్ జస్టిస్ లాంటి పదవులను ముస్లిములు కూడా అధిష్టించారు మరి అలాగా పాకిస్తాన్ లోకానీ బంగ్లాదేశ్ లో కానీ జరగలేదు కదా అని అమిత్ షా ప్రశ్నించారు.రోహింగ్యాలు నేరుగా మయన్మార్ నుంచి కాకుండా మధ్యలో బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడినుంచి ఇండియా శరణుజొచ్చారు అందువలన రోహింగ్యాలకు పౌరసత్వం ఇవ్వము అన్నారు.6 మతాలవారిని చేరిస్తే మమ్మల్ని పొగడారు,ముస్లిముల్ని చేర్చకపోతే మాత్రం విమర్శిస్తారు.ఈ మూడుదేశాల నుంచి బాధలు పడుతున్న 566 ముస్లిములకు కూడా పౌరసత్వం ఇచ్చాము.9 లక్షలమంది శ్రీలంక శరణార్ధులకు పౌరసత్వం ఇచ్చాం అని అమిత్ షా సమాధానమిచ్చారు.వేలాది భారతీయులు అమెరికా,ఆస్ట్రేలియా, గల్ఫ్ లాంటి ఇతర దేశాల్లో పనిచేస్తున్నారు.వీళ్ళంతా వారికి పౌరసత్వం ఇస్తామంటే తీసుకోటానికి సిద్ధమేనా? రెండుదేశాల చీలికకు జిన్నా ,ముస్లింలీగ్ కారణమని కొందరంటే,సావర్కర్ కారణమని కొందరు వాదిస్తున్నారు.భవిష్యత్తులో ఇదే దేశంలో మేము నివసించాలి ఇలా మతాలవారీగా దేశాన్ని ముక్కలుచేయవద్దు,పొరసత్వ సవరణ బిల్లుతో సామాన్య ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయవద్దు అని కొందరు బాధపడుతున్నారు.హిందూత్వ బిల్లు ఇది,నాజీల కాపీబుక్ దీనికి స్పూర్తి.ఇంకానయం రాజ్యాంగసవరణ చేయలేదు.బిల్లుపెట్టి మందబలంతో నెగ్గించుకున్నారు.న్యాయస్థానం ఈ బిల్లును కొట్టివేస్తుంది అని చిదంబరం,డెరెక్ ఒబ్రెయిన్ లాంటివారు అన్నారు.విజయసాయిరెడ్డి ముస్లిముల్లోకూడా బోహ్రా,అహ్మదియ్యా లాంటి వర్గాలలో వేధింపులకు గురై ఇక్కడికి తరలివచ్చిన శరణార్డులకు పౌరసత్వం ఇవ్వాలని కోరారు.1951 ఐరాస శరణార్డుల అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రకారం అభివృద్దిచెందిన, చెందుతున్న దేశాలు శరణార్డులకు తమదేశాల్లో ఆశ్రయం కల్పించాలి,ఇండియా కూడా మానవతాదృక్పదంతో శరణార్ధులకు ఆశ్రయం కల్పించాలని కోరారు.
పౌరసత్వం ద్వారా పాలకులను ఎన్నుకునే ఓటు హక్కు నుండి నచ్చిన మతాన్ని అనుసరించడం, భావ వ్యక్తీకరణ స్వేచ్చ మొదలైన హక్కులు వస్తాయి.పౌరసత్వం కోల్పోతే తరతరాల వారసుల హక్కుల్నీ కోల్పోతారు.ఈశాన్య ప్రాంతంలోనేకాదు దేశంలో ఎక్కడైనా అక్రమ చొరబాటుదారుల సమస్య తలెత్తితే వారి ఏరివేతను ఆ ప్రాంతానికి పరిమితం చేసి పరిష్కరించాలి. 1955 పౌరసత్వ చట్టం ప్రకారం భారత పౌరసత్వానికి మతం అక్కరలేదు. దేశంలో నివసిస్తున్న వారందరికి మతప్రమేయంలేకుండా పౌరసత్వాన్ని రాజ్యాంగం ఇచ్చింది . ఇప్పుడు బిజెపి ప్రతిపాదించిన సవరణల ప్రకారం బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ల నుండి 2014 డిసెంబర్‌ 31 నాటికి వచ్చి వున్న ముస్లిమేతర శరణార్ధులకు మాత్రమే పౌరసత్వం ఇస్తారు.ఆ మూడు దేశాలలో చెలరేగే మతహింస కారణంగా తరలి వచ్చే బాధిత మైనార్టీ మతస్తులకు పౌరసత్వం ఇచ్చి రక్షణ కల్పిస్తారట. శరణార్ధులందరికీ పౌరసత్వం అంటే బాగుండేది.భూటాన్ లో బుద్దిజం అధికార మతం అయితే అక్కడ క్రిస్టియన్లపట్ల వివక్ష ఉంది. శ్రీలంకలో తమిళ హిందువులు వేధింపులకు గురవుతున్నారు. ముస్లిం రోహింగ్యాలు మయన్మార్‌ బుద్ధుల నుండి ప్రాణరక్షణకోసం బంగ్లాకు భారత్‌కు చెల్లాచెదురయ్యారు.పాకిస్తాన్‌లోని అహ్మదీయులు, షియాలను ముస్లింలుగా ఆ దేశం ఇప్పటికీ గుర్తించలేదు.మతపిచ్చితోనే చంపుకుంటున్నారు.ఈ బిల్లులో శ్రీలంకలోని తమిళ హిందువులు, నేపాల్‌లోని హిందువుల గురించి ఏమీలేదు. వీళ్ళకు న్యాయం ఎవరు ఎలా చేస్తారు? విపక్షాలసందేహాలకు జవాబులు , చర్చకూ తగినంత సమయం ఇస్తే బాగుండేది. ఈ దేశంలోని మైనార్టీ హక్కులను రక్షిస్తే చాలు.పొరుగు దేశాలలో మైనార్టీలకు రక్షణ కల్పిస్తామనడం తనకుమాలినపనే. భారతీయ ముస్లిములు కూడా వారిలోని అహ్మదియాలు,షియాలు, మెహతార్లు , దూదేకుల లాంటి వివిధకులాల ముస్లిములను దర్గాలు,విగ్రహారాధన వంకతో వివక్షతో చూడకుండా తమలో కలుపుకోవాలి.మతంకంటే మానవత్వమే ముఖ్యం అనేది నినాదాలస్తాయి దాటి ఆచరణలోకి రావాలి. లౌకిక స్ఫూర్తి, సర్వమత సమానత్వ భావన, భిన్నత్వంలో ఏకత్వాన్ని పునాదిగా చేసుకుని ముందుకు సాగుతున్న సమాజం మనది! ఈ ఐక్యతను ముక్కలు చేయడం మహాపాపం.
--నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266
https://www.facebook.com/williams32143/posts/2857008764331095 


5, డిసెంబర్ 2019, గురువారం

మూఢనమ్మకాల నిషేధచట్టం రావాలి


చేతబడుల నిషేధచట్టం రావాలి
అమానవీయ సాంఘిక చర్యలు, చేతబడి నివారణ, నిర్మూలన బిల్లు-2017’ ను కర్ణాటక శాసనసభ ఆమోదించినా మూఢనమ్మకాల విషయంలో దేశంలో ఎలాంటి మార్పు రాలేదు.భారత రాజ్యాంగంలోని 51-A (h)  పౌరుల ప్రాథమిక విధుల  ప్రకారం ‘‘ప్రతి పౌరుడు ఇతరులలో శాస్త్రీయ దృష్టినీ, మానవతా వాదాన్నీ, పరిశోధనాసక్తినీ, సంస్కరణాభిలాషను పెంపొందించేందుకు కృషిచేయాలి.’’ మూఢ, అనాగరిక విశ్వాసాలకు వ్యతిరేకంగా పౌరులందరూ ప్రచారం చేయాలి.ఈ చట్టం ప్రకారం అమానవీయ చర్యలను శిక్షించదగిన నేరాలుగా పరిగణిస్తారు.
మూఢనమ్మకాల పనిపట్టేలా ప్రత్యేక చట్టం కోరుతూ జనవిజ్ఞాన వేదిక వంటి సంస్థలు ఆందోళన బాటపట్టాయి. నరేంద్ర ధబోల్కర్‌, కల్బుర్గీ, పన్సారే, గౌరీ లంకేశ్‌ లాంటి మేధావులను దుండగులు హతమార్చారు. జయలలిత,బీజేపీ మీద విపక్షాలు చేతబడి చేయించారని ఎంపీ ప్రజ్నాసింఘ్ లాంటివారు వాపోతే దమ్ముంటే నాపైన చేతబడి చేయండని మంత్రి కామినేని శ్రీనివాస్  సవాలు విసిరారు. ఈ కుతంత్రాలకు కఠిన చట్టాలే విరుగుడు అని జాతీయ మహిళా కమిషన్‌ సూచించడంతో- ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, బిహార్‌, మహారాష్ట్రలు మూఢనమ్మకాల్ని నిరోధించే చట్టాల్ని ప్రవేశపెట్టాయి. మంత్రగత్తె అని అనుమానించి ఏ మహిళకైనా శారీరక హాని కలిగిస్తే, దోషులకు గరిష్ఠంగా అయిదేళ్ల కారాగారవాస శిక్ష పడేలా బిహార్‌ 1999లో చట్టం తెచ్చింది. గ్రామాల్లో దురాచారాలు, దురాగతాలకు కారకులయ్యే వ్యక్తులకు జరిమానాతో పాటు మూడేళ్ల శిక్ష విధిస్తూ 2013లో బిహార్‌ ప్రభుత్వం చట్టం చేసింది. మహరాష్ట్ర ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తించేవాళ్లకు ఏడేళ్ల జైలుశిక్ష, క్షుద్రపూజలపై నిషేధం విధిస్తూ 2013లో  చట్టాన్ని తీసుకొచ్చింది. ఏ వ్యక్తినైనా శారీరకంగా మానసికంగా సామాజికంగా హింసించి ఆత్మహత్యకు పురికొల్పేలా చేసిన నేరగాళ్లకు యావజ్జీవ శిక్ష  అమలులోకి తెస్తూ  2015లో అసోం చట్టం చేసింది.
ఈదురాచారాల  నివారణకు  పటిష్టమైన చట్టమే మార్గమని జాతీయ మహిళా కమిషన్‌  సూచించింది. భారత రాజ్యాంగం నిర్దేశించిన విధంగా ప్రతి పౌరుడూ శాస్త్రీయ దృష్టినీ, మానవతా వాద భావాలనూ, పరిశోధనాసక్తినీ, సంస్కరణాభిలాషనూ పెంపొందించడానికి కృషిచేయాలి.అమానవీయ సాంఘిక చర్యలు, చేతబడి దురాచారాలు,అనాగరిక, అశాస్త్రీయ విశ్వాసాలు అన్నిటినీ నిషేధించాలి.
 మంత్రాలతోనే రోగాలు నయంచేస్తామనీ, ఎలాంటి పరికరాలూ లేకుండా ఒట్టి చేతులతోనే శస్త్ర చికిత్సలు చేసి శరీరంలోని కణుతులను తీసేస్తామని మోసంచేస్తున్నారు. దెయ్యం విడిపిస్తామంటూ జనాన్ని చిత్రహింసలకు గురిచేయడం, గుప్త నిధులకోసం నరబలులూ, క్షుద్రపూజలు చేయడం, నగ్న పూజలు, గర్భంలోని శిశువు ఆడపిల్ల అయితే మగపిల్లవాడిగా మార్చేస్తామనే పేరుతో మోసాలు చేస్తున్నారు , అగ్నిగుండాలలో నడుస్తున్నారు. కొన్ని  దేవాలయాలలో తమ దుష్కర్మలు నశిస్తాయనీ, రుగ్మతలు తొలగిపోతాయని మడె స్నాన పులివిస్తర’ (ఎంగిలాకు), దురాచారం  పాటిస్తారు.కర్ణాటక ప్రభుత్వం మడె స్నానను నిషేధించింది. తెలుగు రాష్ట్రాలలో బాణామతి లేక చేతబడి పేరిట చాలా దౌర్జన్యాలు, మోసాలు జరుగుతున్నాయి.తమకు లొంగని  కుటుంబాన్ని సాధించదలచిన గ్రామ పెత్తందార్లు ఆ అమాయకుల ఇండ్ల ముందు తమ మనుషులతో రాత్రికి రాత్రే పసుపు, కుంకుమ, నిమ్మకాయలు వేయించి, వారికి మంత్రగాళ్లనే ముద్రవేసి, వారి జుట్టు గొరిగించి, పళ్ళు ఊడగొట్టించి వీధుల్లో నగ్నంగా ఊరేగించి కసి తీర్చుకుంటున్నారు.చేతబడి చేస్తామని, ఇతరులు చేసిన చేతబడిని తిరగగొడతామనీ ఇంకొందరు  సొమ్ముచేసుకుంటున్నారు. పక్షవాతం కారణంగా కోమాలో ఉన్నవారిని ఎవరో చేతబడి చేసిన కారణంగానే వారలా అయ్యారని చెబుతారు. కొందరు అమ్మలూ, అవధూతలూ, బాబాలూ, స్వాములూ  రాజకీయ దళారులుగా, కొందరు డేరా బాబాలు అక్రమార్జనాపరులకు రహస్య ధనాగారంగా మారుతున్నారు.అత్యాచారాలు చేస్తున్నారు.
స్వామిజీలను ఆధ్యాత్మిక గురువులను, బాబాలను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరిగేకొద్దీ  కొందరు స్వార్థపరులు స్వామిజీల అవతారం ఎత్తి ప్రజలను మోసం చేయడమేకాక చేయరాని పనులు కూడా చేస్తున్నారు.కొందరు తమ ఆశ్రమాలకోసం ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారు. నిత్యానందస్వామి పోలీసులకు చిక్క కుండా విదేశాలకు వెళ్లి ఏకంగా ఒక ద్వీపాన్నే కొనుగోలు చేసి అక్కడ స్వతంత్రంగా కైలాస రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారట. అన్నివేల కోట్ల రూపాయలు ఎలా కూడబెట్టగలి గాడు?ఎంతమందిని మోసం చేశాడు? ఎలా తప్పించుకొని విదేశాలకు వెళ్లిపోయాడో మరి? ఇక మరికొందరు స్వామిజీలు, బాబాలు జైళ్లల్లో కాలం గడుపుతున్నారు.భక్తి కూడా ఒక వ్యాపారంగా మారి పోయింది. పెట్టుబడి పెట్టకుండా కుబేరులుగా మారడానికి బాబాలు కావటం దగ్గరదారి అయ్యింది.
ఎక్కడపడితే అక్కడ స్వామిజీలు, బాబాలు వెలుస్తున్నారు ఏవేవో చెప్పి ప్రజలను నమ్మిస్తున్నారు. కొందరు చేసే వికృతచేష్టలు అమాయకుల ప్రాణాల మీదకు కూడా తెస్తున్నాయి. మంత్రాల పేరుతో రోగాలను నయం చేస్తామంటూ కిందపడేసి తొక్కడం, వాతలు పెట్టడం ఇష్టానుసారంగా కొట్టడం ఒకటేమిటీ వారికి తోచిన అటవిక చర్యలన్నీ చేస్తున్నారు.భైరవకోనలో గుప్తనిధులకోసం అమావాస్య నాడు క్షుద్రపూజలు నిర్వహిస్తున్నవారిని  పోలీసులు పట్టుకున్నారు.ఆలయఅధికారిని సస్పెండ్‌ చేశారు. కదిరి కొర్తికోటలో క్షుద్రపూజలు చేస్తూ ముగ్గురిని బలి ఇచ్చారు.బలికి గురైనవారిలో ఇద్దరు మహిళలు కాగా ఒక పురుషుడు ఉన్నారు. చేతబడులతో ప్రాణాలు తీస్తున్నారు. క్షుద్రపూజలతో  దేశంలో పదేళ్లలో రెండువేలకుపైగా హత్యలు జరిగాయట.ఒక్క జార్ఖండ్‌లోనే  చేతబడులు చేశారనే అనుమానంతో 58 మందిని మట్టుపెట్టారు. మహారాష్ట్రలో విదర్భలో పుత్రసంతానం కోసం 11 మంది చిన్నారులను బలి ఇవ్వాలన్న భూతవైద్యుడి సలహా ప్రకారం ఐదుగురు పసికందులను పొట్టనపెట్టుకున్నారు.భూతవైద్యులు,క్షుద్ర పూజలు చేసే పూజారుల సలహాలు విని నరబలులు కూడా ఇచ్చారు . భార్య ఆరోగ్యంకోసం, పక్షవాతం నయమౌతుందని, కొడుకు పుట్టాలనే ఆశతో యాగంచేసిమరీ పసిపాపలను బలి ఇచ్చారు.కొత్త పొక్లైయినర్‌కు నరబలి , గంగాలమ్మ తల్లికి ఒక మహిళను బలిచ్చారు.అత్యాచారం చేసినతరువాత మహిళలను తగలబెడుతున్నారు.
క్షుద్రపూజలపై జాతీయ స్థాయిలో చట్టం తేవాలని కేంద్రం సన్నాహాలు చేసింది . చేతబడులు, బాణామతి, క్షుద్రపూజలంటూ ప్రజల్ని మోసం చేసే వారికి కఠిన శిక్షలు పడేలా ఆయా రాష్ట్రాల్లో ఉన్న చట్టాల గురించి తెలపాలని  అన్ని రాష్ట్రాలకూ లేఖ రాసింది. క్షుద్రపూజలను నమ్మి మోసపోవద్దంటూ కొన్ని  సామాజిక సేవా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి మూఢనమ్మకాలను పాటించేవారు ఆ సంస్థ కార్యకర్తలను చంపేశారు. హైదరాబాద్‌లో కూడా క్షుద్రపూజలు చేస్తామంటూ వచ్చి ఓ ఇంట్లో సొమ్మంతా దోచుకుపోయారు. దీనిపై ప్రత్యేక చట్టం లేనందున పోలీసులు కూడా దీన్ని నేరం కింద పరిగణిచలేకపోతున్నారు. బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే, క్షుద్రపూజలు చేసినవారిపై కేవలం మోసం కేసు మాత్రమే పెట్టగలుగుతున్నారు. గతంలో  కొంతమంది ఎంపీలు ప్రజలు ఇంతలా మోసపోతున్నా, భాదపడుతున్నా ఎందుకు చట్టం తేలేదని ప్రశ్నించారు. దీంతో కదిలిన కేంద్రం.. చేతబడి, క్షుద్రపూజల నియంత్రణకు దేశవ్యాప్తంగా ఓ కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు నడుం బిగించింది.ఇంకా బిల్లు రావాలి. దేవుళ్లకు, దెయ్యాలకు బలులిస్తే తమ కోరికలు నెరవేరుతాయని ఇప్పటికీ కొంతమంది జనం నేరమనస్తత్వంతో  నమ్ముతున్నారు. జంతువులు కన్నా నరబలి ఇస్తే తమ కోరికలు నెరవేరుతాయనే మూఢత్వంతో ఉన్నారు.అశాస్త్రీయమైన విషయం ఏదైనా అది మూఢవిశ్వాసమే.మనిషిలో శాస్త్రీయ దృక్పథం పెరగాలి. ఇలాంటి బలుల మూఢత్వాన్ని తిప్పికొట్టాలి.మూఢ విశ్వాసాలు తాము చేస్తున్నది ఏమిటో కూడా తెలియనంతగా మనిషిని లొంగదీసుకుంటాయి. ఇలాంటి అమానుష చర్యలు తప్పుకావని, ఫలానా గ్రంథంలో ఉంది. ఫలానా శాస్త్రంలో ఉంది అంటూ సమర్ధించుకునే మానసిక స్థితి వారిలో ఉంటుంది. జంతుబలి, నరబలి, మూఢత్వ నిర్మూలనకు విస్తృతమైన ప్రచారం జరగాలి.
---నూర్ బాషా రహంతుల్లా
విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266
 https://www.facebook.com/photo.php?fbid=2844906868874618&set=a.233025936729404&type=3&theater