ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, మే 2019, శుక్రవారం

ఇంటర్‌ మీడియేట్ బదులు పాలిటెక్నిక్ విద్య రావాలి

ఇంటర్‌ మీడియేట్ బదులు పాలిటెక్నిక్ విద్య రావాలి
ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడాన్ని ఆహ్వానిస్తున్నాయి. ఎందుకంటే విపరీతమైన పోటీ పెరగటం వలన తమ కాన్వెంట్లకు, కళాశాలలకు డిమాండ్ పెరుగుతుంది.లెక్కలేనంత సంపద సమకూరుతుంది. ఇంటర్‌ విద్యను రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యను ప్రవేశపెట్టడాన్ని మాత్రం అడ్డుకుంటాయి. తెలంగాణలో 20 మంది ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న తరువాత మార్కులను తిరిగి లెక్కిస్తామన్నారు. కానీ ప్రైవేట్‌ విద్యా సంస్థల గుత్తాధిపత్యాన్ని తొలగించే పనులేవీ చేపట్టలేదు. ప్రైవేటు జూనియర్‌ కాలేజీలలోనే విద్యార్ధులు చనిపోతున్నారు , ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ర్యాంకుల కోసం పిల్లల్ని పెట్టే చిత్రహింస భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అక్కడ చక్కటి విద్య దొరక్కపోగా , వేల కుటుంబాలు ఆర్థిక దోపిడికి గురై చిద్ర మౌతున్నాయి.విద్యార్ధి జీవితం లో విలువైన రెండేళ్ళ కాలం ఇంటర్ పేరుతో వృధాగా పాడుచేస్తున్నారు. కొన్నిదేశాలలో పదవతరగతి తరువాత పాలిటెక్నిక్ మాత్రమే ఉంటుందట. పాలిటెక్నిక్ చదువు ద్వారా విద్యార్ధి ఏదో ఒక పని వస్తుంది.ఏ పనీ రాని ఇంటర్ విద్య నేర్పి ,దానిలో మళ్ళీ ర్యాంకుల పోటీ తో విద్యార్ధుల్ని చంపి ఏమి సాదిద్దామని?పాలిటెక్నిక్ విద్యను తెలుగు మీడియం లోకి మార్చి పిల్లలకు నేర్పితే ఈ ఆత్మహత్యలు జరుగుతాయా? ఇంటర్ పేరుతో కార్పొరేట్‌ విద్యాసంస్థల పెత్తనం ఏమిటి?ఇంటర్ విద్యలో మాత్రమే ఇంత భయంకరమైన వాతావరణం ఉందేమిటి?
పనికిమాలిన నిరంకుశ నిర్ణయాలు
ఇంటర్మీడియట్‌లో తెలుగుకు బదులుగా సంస్కృతాన్ని ఎందుకు అనుమతించడం? ప్రజల భాష తెలుగులోనే పాలిటెక్నిక్ చదువు నేర్పవచ్చు కదా? తెలుగును తప్పనిసరి భాషగా నేర్పటమే కాకుండా తెలుగు మాధ్యమం లో పాలిటెక్నిక్ విద్య నేర్పాలి.అర్ధం కాని అనువాద పదాల బదులు ప్రజల వాడుకలో స్థిరపడిపోయిన ఇంగ్లీషు పదాలను సొంతం చేసుకోవచ్చు.అప్పుడు పిల్లలు అవసరమైన విద్య ఆసక్తిగా నేర్చుకుంటారు. చాలామంది నాయకులు ప్రైవేట్‌ ఇంగ్లిషు మీడియం పాఠశాలలను నిర్వహిస్తున్నారు. వాటిని ప్రభుత్వ స్కూళ్ళుగా మారుస్తామంటే వీళ్ళెవరూ ఒప్పుకోరు. తెలుగు మీడియం లోకీ మారనివ్వరు. పదవ తరగతి దాకా తెలుగుమీడియం లో బోధించటానికి అలవాటుపడిన ఉపాధ్యాయులు చాలామంది సిద్ధంగా ఉన్నారు. వాస్తవానికి డిగ్రీ,పీజీ స్థాయిల వరకు తెలుగు మాధ్యమం లో చదువు గతం లోనే కొనసాగింది.బ్యాంకుల్ని జాతీయం చేసినట్లు ప్రైవేటు కళాశాలలను కూడా ప్రభుత్వ పరం చేస్తే తెలుగు మాధ్యమానికి అడ్డం తొలగిపోతుంది.తమ ఇళ్ళలో అమ్మ నాన్నలతో స్నేహితులతో స్వేచ్చగా హాయిగా మాట్లాడుకున్న మాతృభాషను వదిలి మరో భాషలో చదువు నేర్చుకొమ్మన్నప్పుడే విద్యార్ధి సగం చచ్చిపోయాడు. అర్ధం కాకపోయినా మౌనంగా వినటానికి అలవాటైపోయాడు. నిరుదోగ ఇంజనీర్లు పెరిగిపోయారు. పాలిటెక్నిక్ కోర్సులు చేసిన వారిలో నిరుద్యోగులు లేరు. వాళ్ళు దేశానికి విలువైన సేవలు చౌకగా అందిస్తున్నారు.ఇంటర్ చేసే సంవత్సరాలలో పాలిటెక్నిక్ చేస్తే విలువైన కాలం కలిసి వస్తుంది.త్వరగా ఉపాధి దొరికి జీవితం లో స్థిరపడతారు. కావాలంటే పాలిటెక్నిక్ ద్వారా కూడా ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం లోకి వెళ్ళవచ్చు.
ప్రజలకు పనికొచ్చేలా పాలిటెక్నిక్ కోర్సులు
విద్యారంగమే కాదు వైద్యరంగం కూడా ఇలాగే ప్రైవేటు మయంగా ఉంది.” అందరికీ అక్షరాస్యత” అబ్బిందా? 'అందరికీ ఆరోగ్యం' అనే లక్ష్యం నెరవేరిందా? విద్య,వైద్యాలలో సింహ భాగం ప్రైవేటు పరం చేసిన ఫలితాలను ప్రజలు అనుభవిస్తున్నారు. రోగులకు వైద్య నిపుణులు దొరుకుతున్నారు గానీ మామూలు వైద్యులు దొరకటం లేదు. చౌకగా లభించాల్సిన వాటిని ఎంతో ఖర్చు పెట్టి కొనుక్కుంటున్నారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలలన్నీకలిపి ఉత్పత్తి చేస్తున్న ఎం.బి.బి.ఎస్. వైద్యుల సంఖ్య జనాభాకు అనుగుణంగా లేదు. గ్రామాలలో వైద్యుల అవసరం హెచ్చుగా ఉంది. అందువలన పదవ తరగతి అనంతరం ఆర్.ఎం.పి.కి, ఎం.బి.బి.ఎస్. కూ మధ్యస్ధంగా మూడేళ్ళ 'వైద్య డిప్లొమా' కోర్సు పాలిటెక్నిక్ లోనే పెట్టవచ్చు.ఈ కోర్సు చేసిన డాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రయోజనకరమైన సేవ చేస్తారు. అలాగే ఫార్మసిస్టుల్లో నిరుద్యోగం ఉంది. చాలా మంది ఎం.బి.బి.ఎస్. డాక్టర్లు గ్రామాల్లో పనిచేయడానికి ఆసక్తి కనబరచనందున గ్రామాల్లో ఏ మాత్రం అర్హత లేనివారు వైద్యం చేస్తున్నారు. ఏ రోగానికి ఏ మందు పనిచేస్తుందో ఫార్మసిస్టులకు బాగా తెలుసు. ఆపరేషన్లు అవసరం లేని తేలికపాటి రోగాలకు వైద్యం చేసే అవకాశం నర్సులకు, ఫార్మసిస్టులకు కల్పించవచ్చు. ఇందుకోసం ఫార్మసీ డిప్లొమా విద్యార్థులకు చికిత్సా పద్ధతులు కూడా సిలబస్ లో చేర్చితే వారు నేర్చుకునే విద్య ఉభయతారకంగా ఉంటుంది.ఫార్మసిస్టులను ఉన్నత వైద్య విద్య కోర్సుల్లోకి ఆహ్వానించి వారి ఔషద విజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి.రెండేళ్ళపాటు ఎందుకూ పనికిరాని ఇంటర్ విద్యను ర్యాంకుల పోటీలతో బలవంతాన నేర్పే కంటే,ఉపాధినిచ్చే వృత్తివిద్యా కోర్సులవైపు విద్యార్ధులను మళ్ళించటం జాతికి శ్రేయో దాయకం !
నూర్ బాషా రహంతుల్లా , స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ (విశ్రాంత), అమరావతి 6301493266