ఈ బ్లాగును సెర్చ్ చేయండి

28, ఆగస్టు 2019, బుధవారం

నాలుగు రాజధానులు మంచిదేనా?




నాలుగు రాజధానులు మంచిదేనా?
రాజధానుల మార్పు అన్ని దేశాలలో జరిగింది.అది సహజం.పాకిస్తాన్‌ అధ్యక్షులు అయూబ్‌ ఖాన్‌ దేశ రాజధానిని తన స్వస్థలమైన అబ్బోత్తాబాద్‌లో ఏర్పాటు చేయాలని సంకల్పించినా అది  భూకంపాలు వచ్చే ప్రాంతంగా గుర్తించడంతో ఇస్లామాబాద్‌ రాజధానిగా ఏర్పాటు చేయడం జరిగింది. తుగ్లక్‌ రాజధాని ఢిల్లీని దేవగిరికి మారిస్తే , బ్రిటిష్‌ ప్రభుత్వం రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి తరలించింది. ఆస్ట్రే లియా, అమెరికా దేశాల రాజధానులు కేవలం పరిపాలన రాజధానులే. ఆర్థిక కేంద్రాలుగా మహానగరాలుగా ఇతర నగరాలు అభివృద్ధి చెందాయి. వీటిని వివిధ ప్రాంతాల ప్రజల తో మాట్లాడి వారి మధ్య సర్దుబాటు చేశాకే ఏర్పరచారు.అలాగే ఇటలీలో రాజధాని నగరాలను 42 సార్లు  మారిస్తే,వియత్నాం 28 సార్లు మయన్మార్ 24 సార్లు రాజధానుల్ని మార్చాయి.
ప్రపంచంలో మూడు రాజధానులున్న ఏకైక దేశం దక్షిణాఫ్రికా.దేశంలోని మూడు ప్రాంతాలకు మూడురాజధానులు ఏర్పాటుచేసి ప్రాంతీయ ప్రజలను సంతృప్తిపరచారు. 1910 లో దేశ ఏకీకరణ జరిగినప్పుడు పాలనా సౌలభ్యం కోసం కేప్ కాలనీకి కేప్ టౌన్, ఆరంజ్ రివర్ కాలనీకి డర్బన్,ట్రాన్స్ వాల్ కాలనీకి ప్రిటోరియా రాజధానులుగా ఏర్పరచారు. దక్షిణకొరియా,బొలీవియా,చిలీ,మలేషియా,నెదర్లాండ్స్,శ్రీలంక,టాంజానియా,యెమన్,ఇజ్రాయెల్,జర్మనీ,జపాన్,హోండురాస్,పెరు దేశాలకు కూడా రెండేసి  రాజధాని నగరాలు ఉన్నాయి.
మనదేశంలో బ్రిటీష్ పాలనలో కలకత్తా,డిల్లీ,సిమ్లా దేశ రాజధానులుగా ఉన్నాయి.జమ్ము కాశ్మీర్,మహారాష్ట్ర,హిమాచల్ ప్రదేశ్  రాష్ట్రాల్లో కూడా రెండేసి రాజధానులున్నాయి.జమ్మూకాశ్మీర్  రాష్ట్రానికి ఎండాకాలానికి శ్రీనగర్,చలికాలానికి జమ్ము రాజధానులు. మహారాష్ట్ర కు ముంబై,నాగపూర్ రాజధానులు.హిమాచల్ ప్రదేశ్ కు సిమ్లా ,ధర్మశాల రాజధానులు.
బీజేపీ  నాయకుడు అయిన టీజీ వెంకటేష్‌ రాష్ట్రానికి నాలుగు రాజధానులను నాలుగు ప్రాంతాలలో అంటే విజయనగరం.కాకినాడ,గుంటూరు,కడప లలో  ఏర్పాటు చేయటానికి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు  ఎవరి రాజధాని అమరావతిఅనే పుస్తకంలో  రాజధాని స్థల ఎంపిక ముందుగా అనుకూలతను  అధ్యయనం చేయకుండానే నిర్ధారణ చేశారని అన్నారు. శివరామకృష్ణన్‌  కమిటీ రాజధానిగా ఒక మహా నగర నిర్మాణము అక్కరలేదని, రాజధాని వికేంద్రీకరణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మేలని సూచించింది.ఆ కమిటీ సిఫారసులను పట్టించుకోకుండా  ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది ఒడ్డున రాజధాని నగరాన్ని కట్టడానికి  ప్రయత్నాలు ఆరంభించిందన్నారు.
మద్రాస్‌ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు వివిధ ప్రాంతాల మధ్య రాజీ చేయవలసి వచ్చింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు రాజధానిలో సరైన ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశంతో అసెంబ్లీని   కర్నూలులో, హైకోర్టును గుంటూరులో,ఆంధ్ర విశ్వ విద్యాలయాన్ని వాల్టేరులో  ఏర్పాటు చేసి రాయలసీమ,ఉత్తరాంధ్రులను కూడా శాంతింపజేశారు.నేటికీ విజయవాడ కనీసం జిల్లా కేంద్రం కూడా కాదు.అది మంచి రైల్వే జంక్షన్  కావటంవలన సహజంగానే ఎదిగిన నగరం. మారిన పరిస్థితుల్లో నిపుణులకమిటీ రిపోర్టు పై  చర్చ జరిపి  విజయవాడ పరిసర ప్రాంతాలలో రాజధాని నిర్మాణానికి తలపడినట్లయితే బాగుండేది.అసెంబ్లీ ఆమోదం తీసుకొన్నారు గానీ  ఇతర పార్టీల ప్రాంతాల ప్రజలఅభిప్రాయసేకరణకు ప్రయత్నించలేదు. నవ్యాంధ్ర రాజధానిని మారుస్తారనీ , లేదా నాలుగు ప్రాంతాలకు నాలుగు రాజధానుల్ని చేస్తారనీ ... ఇలా అనేక ప్రశ్నలు, అనుమానాలు అమరావతిపై రాష్ట్ర ప్రజలలో అలుముకొన్నాయి. అమరావతి నగర భవితవ్యంపై రాజధానికి భూములిచ్చిన రైతులు,ఆందోళన చేపట్టారు. శివరామకృష్ణన్‌ కమిటీ అమరావతి అనుకూలం కాదని తన నివేదికలో తెలిపినా చంద్రబాబు నియమించిన మంత్రుల కమిటీ దాన్నే ఎంపిక చేసిందనీ,రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండే వెసులుబాటు కారణంచూపి  విజయవాడను రాజధానిగా ఎంపిక చేశారనీ . అమరావతి ప్రాంతం శివరామకృష్ణ కమిటీ సిఫారసు చెయ్యని ముంపుప్రాంతమనీ, ఇక్కడ పంటపొలాలలో రాజధాని భవనాలు కట్టడం తప్పు అనీ ,నిర్మాణాలకు ఖర్చు ఎక్కువ అవుతుందనీ , రాయలసీమ ప్రజలు తమప్రాంతానికి ఏమీ దక్కలేదని రగిలిపోతున్నారనీ వారిని సంతృప్తిపరచటంకూడా అవసరమేననీ  ప్రజలలో మంత్రుల్లో వాదోపవాదాలు జరుగుతున్నాయి.
ముంపు కారణంగానే రాజధానిని మార్చేటట్లయితే  వరదలకు గురవుతున్న ముంబై,మద్రాసు , హైదరా బాద్‌లను కూడా మార్చాలి. ఒకసారి రాజధాని ఎంపిక జరిగి కొంత పనులు జరిగిన తర్వాత దాన్ని మార్చాలనుకోవడం అనవసరం, అర్థరహితం. భూ సమీకరణ ద్వారా రైతుల భూములను తీసుకున్నారని, రాజధాని మారిస్తే భూములిచ్చిన రైతులకు  నష్టం జరుగుతుందని కొందరు బాధపడుతున్నారు. ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు చేశారని ఇక  పునరాలోచన మంచిది కాదని కొందరి సలహా. ఎన్నికల ముందు జగన్‌ అధికారంలోకి వస్తే రాజధానిని దొనకొండకు మార్చేస్తారనే ప్రచారం జరిగింది. శివరామకృష్ణ కమిటీ సిఫారసు చేసిన దొనకొండ ప్రాంతానికి మారిస్తే మంచిది,అక్కడ వేలాది ఎకరాల ప్రభుత్వ భూమే దొరుకుతుంది కాబట్టి కొనుగోలు పునరావాసం సుళువు అని కొందరు వాదిస్తున్నారు. ప్రత్యేక హోదా ప్రసక్తి లేదనే మోడీ ప్రభుత్వం ఆంధ్రకు నిధులు ఇవ్వదు కానీ అమరావతే రాజధానిగా ఉండాలని కోరుతుంది కాబట్టి  వెంటనే ఒక అఖిలపక్ష సమావేశం జరిపి అందరి సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళాలని మరికొందరు కోరుతున్నారు.

అమరావతిని అడ్మినిస్ట్రేటివ్‌ క్యాపిటల్‌గా కొనసాగించి అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరణ చెయ్యాలనుకుంటే మంచిదే.1972 ప్రాంతంలో వచ్చిన జై ఆంధ్ర ఉద్యమ ఫలితంగా మనరాష్ట్రంలో 6 జోన్లు ఏర్పాటు చేశారు.తరువాత తెలంగాణా విడిపోయి మనకు ఆంధ్రలో 3 రాయలసీమలో 1 మొత్తం నాలుగు జోనుల నేల మాత్రమే మిగిలింది. ఏ  జోనులోని ఉద్యోగాలు ఆ జోను వారికే ఇచ్చేవారు.అంటే సీనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాలవరకు జిల్లా ,డిప్యూటీ తహసీల్దారు స్థాయి వరకు జోను పరిధిగా ఉండేది.స్థానికుల్ని సంతృప్తి పరచడమే జిల్లాలు,జోనుల ఏర్పాటు లక్ష్యం.ఇప్పుడు వెంకటేష్ గారు వెల్లడించినట్లు  నాలుగు రాజధానుల పంపకం కూడా నాలుగు ప్రాంతాలవారినీ సంతృప్తి పరుస్తుంది.1.విజయనగరం రాజధానిగా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం జిల్లాలు 2.కాకినాడ రాజధానిగా తూర్పుగోదావరి ,పశ్చిమ గోదావరి,కృష్ణాజిల్లాలు 3.గుంటూరు రాజధానిగా గుంటూరు,ప్రకాశం,నెల్లూరు జిల్లాలు 4.కడప రాజధానిగా రాయలసీమ కర్నూలు,కడప,అనంతపురం,చిత్తూరు జిల్లాలు.పార్లమెంటు నియోజకవర్గాల ప్రకారం జిల్లాల సంఖ్య 25 అవుతుంది. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన తరువాత  వాటి సంఖ్య మళ్ళీ పెరగవచ్చు.అయితే ప్రజలకు ఒరిగేది ఏమిటంటే ఇప్పుడున్నట్లు అందరూ అమరావతికే ప్రయాణం కట్టనక్కరలేదు. ఎవరి రాజధాని నగరం వారికి చాలా దగ్గర అవుతుంది. ప్రజలకు దగ్గరలో పనులు జరుగుతాయి.
చివరకు ప్రజల నిర్ణయమే పాలకులకు శిరోదార్యం అవుతుంది.
రాజధానినగరాన్ని మార్చడం ఒక ప్రయత్నం అయితే నాలుగు చోట్ల మినీ రాజధానుల్ని ఏర్పాటు చెయ్యటం ఇంకో ప్రయత్నం. రెండిటినీ ఎదుర్కొనేవాళ్ళు ఉంటారు.ప్రభుత్వం తన ఉద్దేశాన్నిప్రజలకు తెలియజెయ్యాలి. స్థానిక ప్రజలలో మెజారిటీ జనం ప్రభుత్వ ఉద్దేశాన్ని అర్ధం చేసుకుంటే చాలు ప్రభుత్వ ప్రయత్నం సఫలమౌతుంది.ఎన్టీ రామారావుగారు తాలూకాలను చీల్చి మండలాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రజలు హర్షామోదాలు తెలియజేశారు.మళ్ళీ మండలాలను రద్దుచేసి తాలూకాలే పెట్టమని ఇంతవరకు ఎవరూ అడగలేదు.కొత్త జిల్లాల కోసం ఆయా ప్రాంతాల ప్రజలు ఎదురు చూస్తున్నారు.కొత్తజిల్లాలు వద్దని ఎవరైనా వారిస్తున్నారా?అలాగే ఇదీ.వాస్తవానికి రాజధాని నగరాన్ని మరోచోటికి మార్చటం కంటే నాలుగు చోట్ల రాజధాని నగరాలు పెట్టటం మరింత ప్రయోజనకరం.పూర్వం జోన్లు ఏర్పాటు చేశారు కానీ జోనల్ కార్యాలయాలను పెట్టలేదు.అక్కడ కలక్టర్లకంటే పై స్థాయి అధికారి ఉంటాడు.ఆ కొరత కూడా ఇప్పుడు నాలుగు రాజధాని కార్యాలయాలతో తీరుతుంది.
--- నూర్ బాషా రహంతుల్లా విశ్రాంత డిప్యూటీ కలక్టర్ 6301493266 


https://www.facebook.com/photo.php?fbid=2648235411875099&set=a.233025936729404&type=3&theater

21, ఆగస్టు 2019, బుధవారం

మాన్ప వశమే మాటకోతలు


మాన్ప వశమే మాటకోతలు
ఈమధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని, భారత్‌కు వ్యతిరేకంగా వాడుతున్న పదజాలం తీవ్రత పరిధి దాటనివ్వకుండా చూసుకోవాలని సలహా ఇచ్చాడని వార్త. నోరుఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడటం మంచిదికాదు అని మనందరికీ తెలుసు.నోరుజారితే తీసుకోలేమనీ తెలుసు.అయితే తరచూ నోరుజారే ట్రంప్ ఇతరుల నోటి కంట్రోల్ గురించి సలహాయిస్తూ మాట్లాడటమే  ఇక్కడి వింత.అంతకుముందు కాశ్మీర్ విషయంలో భారత్ పాకిస్తాన్ దేశాలమధ్య  ట్రంప్ మధ్యవర్తిత్వం చేస్తానంటే ఇది గొర్రెలకు తోడేలు కాపలా అన్నట్లు ఉంటుందని కొంతమంది వ్యాఖ్యానించారు. ఆయనకున్న పేరుప్రఖ్యాతులు అలాంటివి.కూడుపెట్టడు,గుడ్డ ఇవ్వడు నామీద ప్రాణమే అన్నట్లు ఈయనవల్ల ఏదేశానికీ ఒరిగింది ఏమీలేదు.ఇరుదేశాలకు ఆయుధాలు అమ్ముతాడు.యుద్ధాలు ఆరిపోనీయడు.మధ్యవర్తిత్వం చేస్తానంటాడు.కొక్కిరాయి కొక్కిరాయి ఎందుకుపుట్టావు అంటే చక్కనివాళ్ళను ఎక్కిరించటానికి అందట. మన పార్లమెంటులో ఈయన మధ్వర్తిత్వంపై చిచ్చురేగి అసలు ట్రంప్ తో ఏం మాట్లాడావో  చెప్పమని విపక్షాలు నిలదీసే దాకా వెళితే అప్పుడు కాశ్మీర్ విషయం ఆ దేశాలే చూసుకోవాలి అని అమెరికా తాపీగా వివరణ ఇచ్చిందట. ఈయన మాటలు  ఒట్టి గొడ్డుకు అరుపులు మెండు అన్నట్లుంటాయి.నన్ను దింపేస్తే అమెరికా సర్వనాశనం అవుతుందని , అందరూ పేదవాళ్ళు అయిపోతారని,నాలాగా గొప్పపనులు  చేసేవాళ్ళను ఎందుకు తీసేయ్యాలనుకుంటారో అర్ధం కావటంలేదని అంటుంటారు.భారతదేశం ఇంకా వర్ధమాన దేశంఏంటీ? అభివృద్ధి చెందిన దేశమే కాబట్టి సబ్సిడీలు అవసరం లేదు. సుంకాలు విధిస్తాం అని బెదిరిస్తాడు. వివిధాదేశాల ఉద్యోగార్ధులపై మాదేశానికి రాకండి అని రంకెలు వేస్తాడు.ఈయన మనసు ఎప్పుడు ఎలా మారుతుందో నని మిగతా దేశాలు కలవరపడుతున్నాయి.
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. ఎదుటివారి మనస్సు నొప్పించే  మాట తీరు మంచిదికాదు. మాటలే మన మర్యాదకు కారణమవుతుంటాయి.అందరూ మెచ్చుకునేలా ఆహ్లాదకరంగా మాట్లాడటం అనేది ఓ కళ.కానీ ట్రంప్ గారు నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించేరకం.
అమెరికా జోలికి వస్తే ఉత్తరకొరియాను సమూలంగా తుడిచిపెట్టేస్తానని 193 దేశాలున్న ఐక్యరాజ్య సమితి  వేదికమీద తన తొలి ప్రసంగం చేశాడు. ఇరాన్‌, ఉత్తరకొరియాలపై ఆయన చేసిన దూకుడు వ్యాఖ్యలు ,ఆ భాష చూస్తే ఈయనకు మతి చలించిందేమో ఇతన్ని దించేయకపోతే అమెరికాకే నస్టమని కొందరు అనుకున్నారు.ఇతని భాషాచూస్తే ఆయన యుద్ధకండూతితో ఊగిపోతున్నాడనీ అని భయపడ్డారు కొందరు. అమెరికా యుద్ధోన్మాదదేశమనీ, అది ఉత్తరకొరియాను  మరో ఇరాక్‌లాగా, లిబియాలాగా కబళిస్తుందన్నారు  కిమ్‌.  దగ్గేవాని దగ్గర డొక్కలు ఎగరవేసినట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ ఒక్కడే ట్రంప్ ప్రసంగానికి సంతోషంతో గంతులేసింది.
కటువుగా మాట్లాడడం కోటి దోమల పెట్టు అన్నారు. మాటలతో కోటలు సాధించవచ్చు.మాటలతో మంటలు రగిలించవచ్చు.. వాక్కు కత్తికంటే పదునైనది.
వదరబోతుతనం కుసంస్కారానికి నిదర్శనం. సప్తవ్యసనాల్లో వాచాలత్వం  ఒకటి. మాటకు ప్రాణం సత్యం.మాట తీరును బట్టి మనిషిలోని మంచీ చెడ్డలను అంచనావేయవచ్చు. మృదువుగా మాట్లాడే వారితో వీలైనంత ఎక్కువ సేపు గడపటానికి అందరూ ఇష్టపడతారు.అతి తక్కువగా మాట్లాడేవారు ఎక్కువగా ఆలోచిస్తారట.
మాన్పగలిగితి  కత్తికోతలు
మాన్పవశమే మాటకోతలు
కత్తి చంపును
మాట వాతలు మానవేనాడున్‌  అన్నారు గురజాడ.
మన నేతలు సబ్జెక్టు మీద మాట్లాడటం మాని  చట్టసభల్లో చర్చను రచ్చ చేస్తున్నారు.పెదవి దాటితే పృథ్వి దాటుతుందన్నారు. అర్థంపర్థంలేని విపరీత వ్యాఖ్యలకు కోపతాపాలకు స్వస్తిపలికి మాటలు కలుపుకొంటే ఎంతమేలు?  మన చట్టసభల సమయం ఎంతో కలిసివస్తుంది. జనం సమస్యలెన్నింటికో చక్కని పరిష్కా రాలు దొరుకుతాయి. ఒక నోరు, రెండు చెవులు ఉన్నది ఎక్కువగా విని తక్కువగా మాట్లాడడానికి. నోరా వీపుకు దెబ్బలు తేకే అని సామెత . ప్రల్లదం అంటే కఠినమైన మాట పరుషవాక్యాలు కూడా సప్త వ్యసనాలలో ఒకటి.

చెట్టు సారం పండులో వ్యక్తం అయినట్లు- మనిషి సారం మాటలో వ్యక్తం అవుతుంది. ముస్లిములకు ఇళ్ళు అద్దెకు ఇవ్వవద్దు అని ప్రవీణ్ తొగాడియా, రాహుల్ గాంధీ ఆవుమాంసం తిని కేదారనాథ్ వెళ్ళినందువల్లనే భూకంపాలు వచ్చాయని సాక్షి మహారాజ్, సోనియాకు తెల్లతోలువల్లనే అధికారం వచ్చింది అని గిరిరాజ సింఘ్,  హిందువులు ఎక్కువమందిని కనాలి అని నరేంద్రజైన్, రష్యామహిళతో పంచె  కట్టడం కాదు విప్పడం నేర్పిస్తానని  బాబూలాల్, సూర్యనమస్కారాలు రానివారు సముద్రంలో డూకండని యోగి ఆదిత్యనాథ్, ఖాన్ త్రయం సినిమాలు చూడొద్దు అని సాధ్వి ప్రాచీ, భారత్ మాతాకీ జయ అనకుంటే లక్షమంది తలలు నరికేవాణ్ణి అని బాబా రాందేవ్ , బూట్లు పాలిష్ చేసినవాళ్ళు  పాలిస్తున్నారు అని మధు మిశ్రా, ... లాంటివారు విపరీత వ్యాఖ్యలు చేశారు.
మంచి వాక్పాటవం గల వక్త సత్యవాక్కుతో చెలిమి చేయాలట. అబద్దాలు చెప్పి అదే నిజమని నమ్మించే వారు నిత్య జీవితంలో మనకు అక్కడక్కడ తటస్థపడుతూనే ఉంటారు.నోరు కల్లలపుట్ట పేరు హరిశ్చంద్రుడు లాంటి నాయకులు దేశానికి ప్రమాదం.ఓదె కట్టే దొంగ పరిగే ఎరే వాడిని బెదిరించినట్లు మెజారిటీ బలంతో తమబుర్రకు తోచిన అసత్యాలను సత్యాలుగా ప్రకటించే పనిలో కొంతమంది నాయకులున్నారు.
కృష్ణార్జునయుద్ధం డ్రామా లో అర్జునుడు కృష్ణునితో ఇలా అంటాడు :-

చనినారార్వురు చక్రవర్తులు మహీ చక్రంబు పాలించి,
ధర్మనిరోధిన్ చనినారు షోడశ మహారాజులు మహేంద్రాభులై
తమతో వారలు మూటకట్టుకొని ఐశ్వర్యంబు గొంపోయిరే?
రాజ్యములేల, వైభవము లేల ధర్మమున్ లేనిచో !

జీవితమంతా అక్రమ సంపాదన ఐశ్వర్యం కోసమే అవజేసే వాళ్ళకీ పద్యం పారాయణ యోగ్యం.
https://www.facebook.com/photo.php?fbid=2617112941654013&set=a.233025936729404&type=3&theater

--నూర్ బాషా రహంతుల్లా విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

17, ఆగస్టు 2019, శనివారం

పెరిగిపోతున్న సహజీవనం కేసులు


పెరిగిపోతున్న సహజీవనం కేసులు
పెళ్ళి చేసుకోకుండా, జీవితాంతం కలిసి జీవిస్తామని ప్రమాణాలు చేసుకోకుండా,  ప్రేమికులైనా కాకపోయినా  స్త్రీ, పురుషుడు కలిసి ఉండడమే  సహజీవనం (లివ్ ఇన్ రిలేషన్‌షిప్). సహజీవనసంస్కృతి పాశ్చాత్య దేశాలకు పాతే కావచ్చు గానీ మన దేశానికి కొత్త . పెళ్లి అనేది పాత కాన్సెప్ట్ అంటూ సినీనటులు కొందరు సహజీవనం చేస్తున్నారుగానీ సామాన్యజనం మాత్రం సహజీవనాన్నీ సహజీవనుల్నీ చీదరించుకుంటూనే ఉన్నారు.
సమైక్యమా? సమన్యాయమా?
భార్య ఉంటుండగా, ఆమెతో పాటు మరో మహిళతో సహజీవనం సాగిస్తున్న వ్యక్తి ఇద్దరితోనూ సరిసమానమైన సమయం గడపాలంటూ మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో లోక్ అదాలత్ 1.12.2013 న విలక్షణమైన తీర్పునివ్వటంతో కొత్త చర్చకు తెరలేచింది.లోక్ అదాలత్ తీర్పు మీద అపీలుండదు.ఈ  తీర్పు బహుభార్యత్వాన్ని సమర్ధిస్తోందా ?భార్యలమధ్య సమాన న్యాయం పాటించాలనే షరియత్ కూ దీనికీ పెద్ద తేడా ఏముంది? అని విమర్శలు రేగాయి.ఏకపత్నీవ్రతాన్నీ ,ఏకపతీవ్రతాన్నీ,పెళ్లంటే నూరేళ్లపంట అనే భావనను ఇలాంటి తీర్పులు బలహీనపరుస్తున్నాయని,ఉత్తరోత్తరా బహుభర్తృత్వం కూడా దేశంలో ప్రబల వచ్చనీ , భారతీయ సంస్కృతి సంప్రదాయ పరిరక్షణ వాదులు గగ్గోలుపెడుతున్నారు. అంతకుముందు 28.11.2013 న సుప్రీంకోర్టు కూడా సహజీవనం నేరం కాదు అని తేల్చేసింది.అలాగే దీర్ఘకాలం సహజీవనం చేస్తే పెళ్ళి అయిపోయినట్లేనని మద్రాసు హైకోర్టు 6.3. 2016  న తీర్పు ఇచ్చింది. ఐదేళ్ళు సహజీవనం చేసి మరో పెళ్ళికి సిద్ధపడిన వ్యక్తికి  సహజీవనం చేస్తే పెళ్ళైపోయినట్లేనని రాజస్థాన్ హైకోర్టు 7.5.2019 న బుద్ధి చెప్పింది. సహజీవనం చేసి విడిపోయిన మహిళలకు , సహజీవనం ద్వారా పుట్టిన సంతానానికి రక్షణ కల్పించే చట్టాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు పార్లమెంటును కోరింది.'సహజీవనం మన దేశంలో సామాజికంగా ఆమోదం యోగ్యం కాకపోయినా అది నేరమో పాపమో కాదు. పెళ్లి చేసుకోవాలా, వద్దా అన్నది పూర్తిగా వ్యక్తిగతమైనది. అయితే ఈ మొత్తం ప్రక్రియలో నష్టపోయేది మహిళలు, పిల్లలే. అందుకే వారి రక్షణకు చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది' అని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. అదే సమయంలో ప్రభుత్వం తీసుకొచ్చే చట్టం పెళ్లికి ముందే శృంగారాన్ని  ప్రోత్సహించేదిగా ఉండకూడదని అభిప్రాయపడింది. సహజీవనాన్ని గుర్తించేందుకు ఎంతకాలంగా వారు కలిసి జీవిస్తున్నారు, వారి ఆర్థిక, సామాజిక పరిస్థితి, పిల్లలు ఉన్నారా లేదా, సహజీవనం చేసే వ్యక్తుల ప్రవర్తన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని బెంచ్ సూచించింది. ''సహజీవనం కూడా పెళ్లి లాంటిదే'' అనే అర్థం వచ్చేలా చట్టాలు తయారుచేయాలని, మహిళలకు రక్షణ కల్పించాలని ధర్మాసనం ఆదేశించింది. పార్లమెంటు ఈ అంశాలపై స్పందించాలని, తగిన చట్టం చేయడం లేదా ఉన్న చట్టాలకే సవరణ చేయడం ద్వారా మహిళలు, వాళ్ల పిల్లలకు రక్షణ కల్పించాలని తెలిపింది. ఇలాంటి సంబంధాలు పెళ్లిలాంటివి కాకపోయినా, ఈ రక్షణ మాత్రం వారికి అవసరమని ధర్మాసనం చెప్పింది. పెళ్ళైనా సహజీవనమైనా మహిళలు మగవాడి దాష్టీకానికి గురయినప్పుడు ,పురుషుడికి వ్యామోహం తీరినప్పుడో, అహం దెబ్బతిన్నప్పుడో ఆ మహిళలు  నిరాశ్రయులయితే వారిని రక్షించే చట్టం తయారు చెయ్యమని కోరింది.
ఎన్నో కారణాలు                        
స్త్రీ సంపాదన పెరిగే కొద్దీ పెళ్లి కొంచెం కొంచెంగా అంతరిస్తోంది.మన దేశంలో కూడా క్రమంగా  సహజీవనాలు పెరుగుతున్నాయి.సంతోషకరమైన పెళ్ళిళ్ళు-సులభమైన విడాకులు (హ్యాపీ మ్యారేజెస్ ఈజీ డైవోర్సెస్”) శకం ఆరంభమయ్యిందని సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయయపడ్డారు.విడాకుల కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండడంతో విడాకుల కేసుల విచారణ కోసం చెన్నై కోర్టు ప్రత్యేక విభాగాన్నే ఏర్పాటు చేసింది. కుటుంబ ఉమ్మడి లక్ష్యాలు లోపించడం, వ్యక్తిగత అహంకారాలకి ప్రాధాన్యం పెరగడం, దంపతులిద్దరూ చెరోలోకం అన్నట్టు ఉండడం.. వంటివన్నీ దాంపత్య బంధాల వైఫల్యానికి సహజీవనాలు పెరగడానికి దోహదం చేస్తున్నాయి. పాలు అమ్మే వ్యక్తి దగ్గర్నుంచి పక్కింటి వ్యక్తి వరకు ఎంతో మంది అనుమానపు చూపులు ఎదుర్కోవల్సి రావడం, కొన్నేళ్ల పాటు కలిసి జీవించినా ఒకరిపై ఒకరికి ఎటువంటి హక్కులూ సంక్రమించకపోవడం, అకస్మాత్తుగా భాగస్వామిని కోల్పోతే.. జరిగే నష్టాన్ని పూడ్చుకునేందుకు ఎటువంటి వీలూ లేకపోవడం లాంటి ప్రతికూలతలు కనబడుతున్నా బంధమే తప్ప నిర్బంధాలు లేకపోవడం, ఏ రోజైనా స్వేచ్ఛగా నిష్ర్కమించే వీలుండడం లాంటి కొన్ని ఆకర్షణలు సహజీవనం వైపు లాగుతున్నాయి.
 
ఏం చెప్పాలో ఎలా చెప్పాలో పెద్దలకే తెలియడంలేదు
సహజీవనులు చాలా మంది ఇష్టపూర్వకంగా దీనిలోకి దిగుతున్నారు. చిన్న చిన్న ఊర్లకు సైతం ఇది పాకింది. అనుకున్నదే తడవు కలిసిపోతున్నారు.దీనికి పెద్దగా సన్నాహాలేవీ అక్కర్లేదు కాబట్టి సులభంగా అనుబంధంలోకి దిగిపోతున్నారు. అంతే సులభంగా విసిగిపోతున్నారు,విడిపోతున్నారు. ఒంటరి వృద్ధులు కూడా సహజీవన జంటలుగా మారుతున్నారు. కొన్ని నగరాల్లో సీనియర్ సిటిజన్స్ కోసం సహజీవన మేళాలు జరుగుతున్నాయి. ఈ మేళాలకు వేలాదిమంది హాజరవుతున్నారు. హైదరాబాదులో కూడా తోడు నీడ అనే స్వచ్ఛందసంస్థ ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.  హక్కులు, బాధ్యతలు లేని సంబంధం కాబట్టి వారికి ఎలా సలహా ఇవ్వాలో కౌన్సిలర్లకు  అర్థం కావడం లేదు. సివిల్ కోర్టులలో ఈ తరహా కేసులు బాగా పెరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో ఇప్పటికే సహజీవనాన్ని చట్టబద్ధం చేశారు. వివాహం చేసుకోకుండా కలిసి జీవించడం నేరమో, పాపమో కాదని చెప్పిన మన సుప్రీంకోర్టు,సహజీవన  చట్టం పెళ్ళికి ముందే  శృంగారాన్ని ప్రోత్సహించేలా ఉండకూడదని , సహజీవనం పరిధిలోకి  అక్రమ సంబంధాలు రాకూడదని కూడా హెచ్చరించింది. 
సామాజిక కట్టుబాట్లూ జీవన విలువలు చెడిపోతాయి

సంస్కృతీ పరిరక్షకుల వాదన ఇది: సహజీవన విధానం అనేదే సరైంది కాదు. దీనివల్ల జీవన విలువలు చెడిపోతాయి.ఇది సంఘానికి  అనర్థదాయకం.శరీర కోరికలను సంతృప్తి పరుచుకోడానికే సహ జీవన విధానం కొనసాగుతున్నది. దీనిని సంఘం ఆమోదించదు. పెళ్లి చేసుకుంటే భవిష్యత్తు మీద భరోసా ఉంటుంది. కానీ యాంత్రికమైన సహజీవనంలో ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండదు.నమ్మకం అవసరం. సహజీవనులు పిల్లల్ని కనరు. ఒకవేళ కన్నా అప్పటికే వయసు మించిపోయి గర్భం దాలిస్తే పుట్టే పిల్లలు మానసికంగా, శారీరకంగా సరిగా ఎదగరు. సహజీవనుల పిల్లల్ని సంఘం కూడా ఆమోదించదు. పెళ్ళి జరిగితే సమస్యలు రావు. వస్తాయనటం  అపోహ,మూర్ఖత్వం. మన శాస్త్రాలూ పురాణాలన్నీ పెళ్లి గురించి ఎంతో గొప్పగా చెప్పాయి. అలాంటి పెళ్ళిని కాదని సహజీవనం సాగించడం మంచి పరిణామం కాదు. పెళ్ళి చేసుకునేవాళ్ళకే అన్ని హక్కులూ ఉంటాయి. సహజీవనం చేసేవాళ్ళకి హక్కులు ఏమీ ఉండవు. 
సహజీవనం అంటే కేవలం కామ సంబంధమే. పెళ్ళి కి కట్టిన తాళిబొట్టు కూడా బరువేనా? బాధ్యతల నుంచి తప్పించుకోవడం కోసమే ఇలాంటి వికృత చేష్టల్లో అడుగుపెడుతున్నారు.వికృత చేష్టలకు విపరీతమైన ఫలితాలే ఉంటాయి. సహజీవనం  ప్రతివాడికీ ఒక ఫ్యాషనై పోయింది. అలాంటి తప్పుడు సహజీవనం అవసరమా? మంత్రాల పెళ్ళి వద్దనుకునేవాళ్ళు  కనీసం రిజిస్టర్ పెళ్ళినైనా చేసుకోవాలి. దానివల్ల చట్టభద్రత ఉంటుంది. సహజీవనం సాగించే అమ్మాయికే అసలు సమస్య. ఆమెకు భార్య అనే స్టేటస్ ఉండదని తెలిసినా  అక్రమ సంబంధానికి తెగబడటం ఏమిటి?అక్రమ సంబంధం ఏదైనా తాత్కాలికమే. సహజీవనులకు అసలు బుద్ధి ఉందా?ఇష్టం లేనప్పుడు విడిపోతామని కూడా తెలుసు కాబట్టి వీళ్లు ఆచారాలకు, కట్టుబాట్లకు విలువ ఇవ్వరు. ఏ సమయంలోనైనా విడిపోవచ్చు అనే అనుకుంటారు.సహజీవనుల పిల్లలకు మరీ ఇబ్బంది. విడిపోతే ఆ పిల్లలు అనాథలే కదా? దీనివల్ల సమాజానికి చెడ్డ సంకేతాలు వెళతాయి. సహజీవనం సాగించేవాళ్ళకి భద్రత లేదు.ముఖ్యంగా ఆడవాళ్ళకి! మగవాడు ఆమెను విడిచిపెట్టి పారిపోతే? మహిళా సంఘాలు ఇలాంటి వాటిని ప్రోత్సాహించకూడదు. చట్ట ప్రకారం, సమాజంలో కూడా ఇది ఆమోద యోగ్యం కాదు. సహజీవనం అనేది విదేశీ కల్చర్. అక్కడ కేవలం అవసరం ఉన్నంతవరకు కలిసి ఉండి, ఇష్టం లేకపోతే విడిపోతారు. అలాంటి వాటిని ఆహ్వానించకూడదనే పెళ్ళి అనే సంప్రదాయాన్ని తీసుకొచ్చారు మనవాళ్లు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు మనదేశానికి మోసుకొచ్చిన పాప ప్రయోగమే ఈ సహజీవన విధానం.ఆడవాళ్ళు కూడా విదేశాలలో ఉద్యోగాలు చేస్తూ సంపాదన మొదలుపెట్టాకనే ఈ దరిద్రం మన దేశానికి చుట్టుకుంది.
పెళ్ళే కావాలా? కలిసుంటే చాలదా?
సహజీవనుల సమాధానం ఇది: సంసారం ఒక సాగరం.కష్టాలు అనంతం.జీవన పోరాటం దంపతులెవరికైనా తప్పదు. సహజీవనులకు కూడా గృహహింస చట్టం ఇస్తున్న భద్రత వర్తిస్తుంది. విడిపోయినప్పుడు  మహిళ , ఆమె పిల్లలు భరణం పొందవచ్చు. పెళ్ళి అనే తంతు అవసరం లేదు. పెళ్లి అంటే మతం,కులం, గోత్రం,పురోహితులు,మంత్రాలు, లాంటి తంతులన్నీ అవసరం. ఇద్దరు కలిసి ఉండాలంటే వారి మధ్య స్నేహం, పరస్పర గౌరవం అవసరంకానీ ,భారీ ఖర్చుతో కూడిన ఈ అనవసరమైన తంతులు ఎందుకు?ఈనాడు ఉమ్మడి కుటుంబాలు లేవు.ఎటో వెళ్ళి పోయాయి.సంప్రదాయవాదులు వాటిని కాపాడగలిగారా?ఎవరి ఆర్ధిక అవసరాలు వారివి. ప్రేమ వివాహాలు,వృద్ధాశ్రమాలు ఎందుకు పెరిగాయి?పెళ్ళి అనే అనవసరపు తంతు లేకుండా కలిసుంటే చాలదా? సరిపడకపోతే పెళ్ళి జీవితకాలం మంటే కదా? పెళ్ళినాటి బులుపు ఎల్లకాలం ఉంటుందా? కలిసున్నంతకాలం సుఖంగా, ప్రశాంతంగా ఉండి నచ్చనప్పుడూ అంతే ప్రశాంతంగా విడిపోకూడదా ? మనసులు కలవకపోయినా సమాజంకోసం కలిసుంటూ ఇల్లు నరకం చేసుకోవాలా ? అలాంటి కష్టాలను పిల్లలకు ఎందుకు పంచాలి?పెళ్లంటే ఒక యావజ్జీవ చెరసాల . సహజీవన పద్ధతిలో స్వేచ్ఛగా బతికేయొచ్చు.సహజీవన బంధానికి చట్టబద్ధత ఉంది.చాలాకాలంగా కలిసి సహజీవనం చేస్తే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 112 ప్రకారం దానిని భార్యభర్తల సంబంధంగానే  గుర్తిస్తారు.అది అక్రమ సంబంధం కాదు.సహజీవనం వేరు. అక్రమ సంబంధం వేరు. సహజీవనం ద్వారా ఒకరిమీద ఇంకొకరికి ఉన్న ప్రేమ నిజమో కాదో తెలుసుకోవచ్చు. అభిరుచులు, అభిలాషలు, అంతరంగాలు, అంతరాలు ఇష్టాలు, అయిష్టాలు, బరువు బాధ్యతలు అర్థం చేసుకోవచ్చు. జీవితంలో ఇద్దరి భాగస్వామ్యం అనుకూలంగా ఉంటుందో లేదో ఇద్దరికీ పొసగుతుందో లేదో తెలుసుకుని మార్పులు, చేర్పులు, చేసుకోవచ్చు. సహజీవనం ఒక శాస్త్రీయ ప్రయోగం. ఇందులో అంతా ప్రమోదమే కానీ ప్రమాదమేమీలేదు.సహజీవనులు ఎవరినీ నష్టపరచటం లేదే?మాకులేని బాధ మీకెందుకు?ఎప్పుడూ పొరుగువాళ్ళలో లోపాలు వెతకటం తప్ప  సంప్రదాయులకు వేరే  పని లేదా ? మత నియమాలతో ఖాఫ్ పంచాయతీల లాగా మనుషుల స్వేచ్ఛను నిరంకుశంగా నియంత్రించటం తప్పు కాదా ?ఇలాంటి ఘోరమైన హద్దులు గీసే పెద్దలమాట మేం వినం.మా జోలికి రాకండి.సహజీవనులు మీ జోలికొస్తే అడగండి.అడ్డదిడ్డంగా వాదిస్తున్నామని అనకండి. 
కష్టమొచ్చినప్పుడు తిరిగొస్తున్నారు 
ఇష్టమొచ్చినప్పుడు ఒకలాగా కష్టమొచ్చినప్పుడు మరొకలాగా ఉండటం మానవ నైజం.అయినా బాధితులకు న్యాయం చెయ్యటం ప్రభుత్వ బాధ్యత గనుక కొన్ని రక్షణ ఏర్పాట్లు చేశారు.
ఇష్టమొచ్చినంత కాలం కలిసి ఉండి ఆ తర్వాత విడిపోయినా సహజీవనంలో మోసపోయిన మహిళలకు ఆస్తిహక్కు, సంతాన హక్కులు, గృహహింస చట్టం ద్వారా రక్షణపొందే హక్కు ఉంటాయి. కాకపోతే మోసపోయిన మహిళ తాను సహజీవనం చేసిన చోట స్థానికులతో వారు భార్యాభర్తలుగా సహవాసం చేశారని సాక్ష్యం చెప్పించాలి.ఓటరు కార్డూ , రేషన్ కార్డు లాంటి ఋజువులతో వారిని భార్యభర్తలుగా గుర్తిస్తారు.మోసగాళ్ళను వడపోసేందుకు కొన్ని షరతులు పెట్టారు. సహజీవనులు అవివాహితులై ఉండాలి. జీవించి ఉన్న భర్త, భార్య ఉండకూడదు. ఇరువురికి మైనారిటీ తీరాలి. వివాహం అయినా కూడా కాలేదని తెలియజేయకుండా సహజీవనం చేసేవాళ్ళు శిక్షార్హులవుతారు. సహజీవనంలో మోసం చేస్తే
498/A కేసు నమోదు చేయొచ్చని తీర్పు వచ్చింది. దీనిలో మహీళ ఎలాంటి సాక్ష్యాలు చూపించాల్సిన అవసరం లేదు 498/A గ్రుహహింస,420 చీటింగ్,493 మభ్య పెట్టడం లాంటి  కేసులు  నమోదు చేసి సహజీవనం లో మోసపోయిన మహిళ న్యాయం పొందవచ్చు. సహజీవనంలో ఉండి విడిపోయే మహిళలకు విదేశాల్లో పాలీమనీపేరిట భరణం ఇస్తారు. భార్య హోదాలో భరణం కూడా పొందవచ్చు. 
సుఖాలున్నా కష్టాలే ఎక్కువ 
పెళ్లయిన మహిళ ఏ కారణాల వల్లనైతే గృహహింసకు గురవుతుందో ఆ కారణాలతోనే సహజీవనంలో కూడా మహిళ కడగండ్ల పాలవుతోంది. సహజీవనుల్లో సహోద్యోగులే ఎక్కువ. కలిసి పనిచేసే చోట ఉండే ఘర్షణ ఇంటి లోకీ విస్తరిస్తోంది.  మన దేశంలో పెళ్ళి  సహజీవనానికి ఒక లైసెన్స్. కొన్నిదేశాల్లో అది ప్రత్యామ్నాయం. అక్కడ  ఏమోకానీ ఇక్కడమాత్రం  సహజీవనంలో పిల్లలు పుట్టాకే సమస్యలు మొదలవుతున్నాయి. అటు బంధువులుకాని, ఇటు చుట్టుప్రక్కల వారుకానీ సహాయ సహకారాలు అందించరు.ఆటుపోట్లను వారిద్దరే భరించాలి. అసలు గొడవలు మొదలయ్యేది అక్కడనుంచే.
సహజీవనం చేసేవారికి ఇల్లు దొరకటం చాలా కష్టం. మన సమాజం వారిని చిన్నచూపు చూస్తుంది .మతపరంగా కూడా సహకారం లేదు.సహజీవనంలో సంతానం కలిగితే సంతానానికి అన్ని హక్కులు రావటం లేదు.సహజీవనం చేసిన మహిళ తాను మోసపోయినా ఎలాంటి న్యాయం జరుగక పోవడం, తల్లిదండ్రుల వైపునుంచి ఆదరణ,ఓదార్పు లేకపోవడంతో  మోసపోయిన కొందరు మహిళలు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. మనసుకు నచ్చిన వ్యక్తితో పేళ్ళీళ్ళూ పేరంటాలు కట్నాలు కానుకలు లాంచనాలు లేకుండా కలిసి సహజీవనం మొదలుపెట్టినప్పుడున్న సంతోషం కడదాకా మిగలటం లేదు. సహజీవనానికి ఒప్పుకున్న మహిళ అంటే  సంఘంలో చాలా  చిన్న చూపు ఉంది.అనుమానాలు అవమానాలు వేదింపులకు గురవుతున్నారు.పైగా శారీరక సంబంధాలు తీర్చుకోవటానికి మాత్రమే సహజీవనం చేస్తే అది వైవాహిక జీవితాన్ని పోలినటువంటి బంధం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అసూయ, అహంకారం , అనుమానం
సహజీవుడు వృత్తిపరమైన అసూయ కారణంగా హింసకు దిగుతాడు. సహజీవనంలో  అనుబంధానికి కట్టుబడి ఉండాలనే నియమమేదీ లేకపోవడంతో సహజీవనులిద్దరూ ఒకరిపై మరొకరు అనుమానాలు  పెంచుకుంటారు. అనుమానించిన సహజీవి డిటెక్టివ్‌ని ప్రయోగిస్తారు, ఆ విషయం తెలుసుకున్న సహజీవి అనుబంధాన్ని తెంచుకుంటారు.పెళ్లి వల్ల పురుషుడికి అపరిమిత అధికారాలు సంక్రమిస్తాయని సహజీవని అభిప్రాయం. చుట్టుపక్కల ఇళ్లలో మమ్మల్ని ఎవరూ దంపతులుగా గుర్తించకపోవడమే కాకుండా కనీసం ఎటువంటి సాయం కూడా చేయకపోయినా ఆ సమస్యలన్నీ నా సహజీవి పెట్టే చిత్రహింసల దెబ్బకు ఏ మూలకో పోయాయి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గానీ అసలు ఆ సహజీవన మార్గం ఎంచుకున్నందుకు మాత్రం  సహజీవనులెవరూ పశ్చాత్తాపం చెందడం లేదు.
 షరతులు వర్తిస్తాయి
స్త్రీ, పురుష సహజీవనం వివాహం ద్వారా ఏర్పడాలా, మరే ఇతర పద్ధతిలోనైనా ఉండవచ్చునా అనే సమస్య ఎప్పుడూ ఉంది. ఫలానా సంబంధం మాత్రమే సరైందని నిర్ధారించడానికి వీలులేదు. భిన్న మతాలు సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్న మన సమాజంలో ఏదో ఒకటి మాత్రమే సరైనదని చెప్పడానికి లేదు.సహజీవన సంబంధాలను కూడా  వివాహ స్వభావంగల సంబంధాలుగా పరిగణించడానికి సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను సూచించింది.
1.   సహజీవనం చేస్తున్న జంట భార్యాభర్తల తరహాలో ఉంటున్నట్లుగా సమాజానికి చాటాలి.
2. వివాహం చేసుకోవటానికి అవసరమైన చట్టబద్ధమైన వయస్సు వారిద్దరికీ ఉండాలి.
3. అవివాహితులుగా ఉంటూ చట్టబద్ధంగా వివాహం చేసుకోవటానికి అర్హులై వుండాలి.
4. సహజీవనం చెయ్యటానికి స్వచ్ఛంధంగా ముందుకొచ్చి ఉండాలి. కొంతకాలంగా భార్యభర్తల్లా జీవిస్తున్నట్లుగా సమాజంలో నమ్మకం కలిగించాలి.
ఒక మహిళ ఆర్థిక భారాన్ని భరిస్తూ ఆమెను ఎవడన్నా తన శారీరక అవసరాల కోసం వాడుకుంటున్నా, ఆమెను పనిమనిషిగా చూస్తూ చాకిరీలు చేయించుకుంటున్నా అది వైవాహిక జీవితం లాంటి సహజీవన బంధం కాదు.సహజీవనం పేరుతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మహిళలు, గృహ హింస చట్టం క్రింద ప్రయోజనాలను పొందలేరు.
ఆగని నేరాలు ఘోరాలు
    బుద్ధి కర్మానుసారిణి అంటారు కానీ మనిషి బుద్దే చెడ్డది.చట్టాలు ఉంటేనే నేరాలూ ఘోరాలూ ఆగటంలేదు.ఇక చట్టం కూడా లేకపోతే నేరగాళ్ళకు పట్టపగ్గలుండవు.సతీ సహగమనం విలసిల్లిన స్థితినుండి వేలాది సంస్కరణల ఫలితమే నేటి సమాజం.నాగరికత మనుషులకు మరింత మంచి సమాజాన్నీ,న్యాయాన్నీఅందించాలి. మహిళపై హింస అన్యాయం పెళ్ళి చేసుకున్న భర్త ద్వారా కలిగినా,సహజీవనుడి ద్వారా కలిగినా ఒకే చట్టాన్ని ఇద్దరికీ సమానంగా అమలు చెయ్యాలనేదే కోర్టు తీర్పు.ఇది చట్టం అయితే సహజీవనికి,పుట్టే పిల్లలకు ఆస్థి హక్కు,భరణంహక్కు సంక్రమిస్తాయనే భయంతో అక్రమసంబంధాలు తగ్గే అవకాశం కూడా ఉంది.హక్కులులేని అబల జీవితం మరీ అద్వాన్నంగా ఉంటుంది.కుటుంబవ్యవస్థలో నమ్మకం,నైతికత అవసరం.సహజీవనాన్ని ఏకపక్షంగా సమర్ధించలేము. పెడదోవపట్టిన వివాహితులను కూడా స్ప్రైట్ లాంటి బహుళజాతి కంపెనీలు సమర్ధిస్థాయి.సుప్రీంకోర్టు,సహజీవన చట్టం పెళ్ళికి ముందే శృంగారాన్ని ప్రోత్సహించేలా ఉండకూడదని , సహజీవనం పరిధిలోకి అక్రమ సంబంధాలు రాకూడదని కూడా హెచ్చరించింది.ఆడపిల్లకు ఆస్థిహక్కు కల్పించిన ఎన్టీఆర్ గారికి అందుకే అంత పేరు వచ్చింది.
--- నూర్ బాషా రహంతుల్లా  విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్  6301493266

https://www.facebook.com/photo.php?fbid=2615458061819501&set=a.233025936729404&type=3&theater