ఈ బ్లాగును సెర్చ్ చేయండి

28, సెప్టెంబర్ 2019, శనివారం

అందరికీ మరుగుదొడ్లు కట్టి కాపాడండి


అందరికీ మరుగుదొడ్లు కట్టి కాపాడండి
మధ్యప్రదేశ్‌ లోని శివ్‌పురి జిల్లా భావ్‌ఖేడి గ్రామ పెత్తందారులు ఇద్దరు దళిత పిల్లలను పంచాయతీ భవనం ఎదుట బహిరంగ మలవిసర్జన చేస్తున్నారని ఆగ్రహించి కొట్టి చంపారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చి 72 ఏళ్లు గడుస్తున్నా కులం పడగనీడన బతుకీడ్చక తప్పనిస్థితిలోనే దళితులున్నారనటానికిదే తాజా సాక్ష్యం.దేశంలో కులవివక్ష,మత వివక్షలు నానాటికీ పెరిగి బలహీనుల ఉసురు తీస్తున్నాయి. అందువలన అందరికీ మరుగుదొడ్లు కట్టి బలహీనుల ప్రాణాలు కాపాడటం ప్రభుత్వాల తక్షణ బాధ్యత.లేకపోతే కొందరు పసిపిల్లలని కూడా చూడకుండా మలవిసర్జకుల అంతు చూసే కార్యక్రమం మొదలుపెట్టవచ్చు.
గత అయిదేళ్లలో 11 కోట్లకుపైగా మరుగుదొడ్లు నిర్మాణమయ్యాయని, దేశంలో బహిరంగ మలవిసర్జన చేసే55 కోట్లమంది 2019 నాటికి  5 కోట్లకు తగ్గారని చెబుతున్నారు.మరుగుదొడ్డి లేకపోవడం వల్ల గ్రామీణప్రాంతాల్లో మహిళలు, బాలికలు వేకువజామునే లేచి తమ కాలకృత్యాలు తీర్చుకోవాలి. లేదా రాత్రి చీకటి పడేవరకూ వేచి ఉండాలి. ఊరిబయటకు పోయే  మహిళలు  అత్యాచారాలకూ, అపహరణలకూ గురవుతున్నారు.ఇప్పుడు ఆ జాబితాలో హత్యలూ చేరాయి.పాకీదొడ్లను కడిగి బాగుచేసిన వాళ్ళను కృతజ్నతలేకుండా చంపుతున్నారు.రాజ్యాంగం రాసినప్పుడు మేధావులు ఈ కులవివక్ష మతవివక్ష ఇంతగా దేశాన్ని అతలాకుతలం చేస్తాయని ఊహించి ఉండరు. కులాలను రాజ్యాంగ పట్టికలో పేర్చి షెడ్యూళ్ళలో అమర్చి రిజర్వేషన్లు కల్పించారుగానీ కులాంతర మతాంతర వివాహాలను వివక్షలకు విరుగుడుగా భావించలేదు.మొన్న 10.9.2019 న సుప్రీం కోర్టు జస్టిస్ అరుణ్ మిశ్రా,షాల నేతృత్వంలో కులాంతర మతాంతర వివాహాలు దేశానికి మంచివేనని ,అవి లౌకిక భావనను పరివ్యాప్తం చేస్తాయని తీర్పు ఇచ్చారు.ఈ తాజా తీర్పును అందిపుచ్చుకొని పాలకులు చట్టాలు చెయ్యాలి.కులాల నెపంతో ఎవరూ హత్యలకు పాల్పడకూడదు. మరుగుదొడ్లు కట్టిస్తే ఆ ఇంటి జనం ఊరిబయటకు వెళ్ళారు.వీధిలో మలవిసర్జన చెయ్యకుండాఉంటారు.తక్కువ కులం ,తక్కువ మతం వాళ్ళనే బేధభావం తొలగిపోతుంది.వారిలో పరిశుభ్రత పెరుగుతుంది. ఈ సదుద్దేశంతోటే కులాంతర మతాంతర వివాహాలకు లక్షరూపాయల నగదు ప్రోత్సాహం కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఎన్ని ప్రోత్సాహకాలు ప్రకటించినా రిజర్వేషన్లు ఇచ్చినా అవి మరింత కడుపుమంటకు,నరనరాన పాకే ద్వేషానికి తావు ఇస్తున్నాయేకానీ కులమత ద్వేషాలను నేటివరకు చల్లర్చలేకపోయాయి.మరో కులం పిల్లలు వీధిలో దొడ్డికి కూర్చున్నారనే సాకుతోకూడా చంపుతున్నారంటే  ఎంత కులద్వేషం పేరుకుపోయి ఉంటుంది?నాలుగు తిట్టి లేదా కొట్టి తరిమేసే నేరానికి పిల్లల్ని కొట్టి చంపటామా?ఈ హత్యలను ఎవరైనా ఎలా సమర్ధిస్తారు?     
అందువలన మనుషుల్ని కలిపే మరోదారిలో పాలన సాగాలి. దేశంలో 72 ఏళ్ళ సుదీర్ఘ కాలం కుల మత పోరాటాలతోనే గడిచిపోయింది.ఇకనైనా కులాంతర,మతాంతర వివాహాలకు మాత్రమే రిజర్వేషన్లను పరిమితం చేయటం మంచిదని నా భావన. కులాంతర మతాంతర వివాహాలు మన దేశంలోని కులమత ద్వేషాలకు శాంతియుత విరుగుడు మందులు.ఏకులమో ఏమతమో చెప్పుకోలేని హైబ్రీడ్ పిల్లలు భారీగా పుట్టాలి.ఈసంకర పిల్లలే రేపటి భారతావనికి శాంతి దూతలు కావచ్చు.కులం లేకుండా పోవడం వల్లనే మనలో నిజమైన ఐక్యత వస్తుంది.కులవ్యవస్థ అందరూ కలిసి పాల్గొనే ఉమ్మడి కార్యక్రమాన్ని అడ్డగిస్తుంది.ఇది మన అందరి పని అనే స్పృహ లేకుండా, అందరూ కలిసి పోకుండా చేస్తుంది.అయా కులాలు మతాలలోని ధనవంతులు తమకులంలోనే ఉన్న నిరుపేదలను పెళ్ళిళ్ళు చేసుకొని ఉంటే ఇప్పటికే చాలావరకు అంతర్గత ఆర్ధిక అంతరాలు తొలిగిపోయేవి.కులాంతర మతాంతర వివాహాలు భారీగా జరగాలని అంబేద్కర్ తోపాటు గాంధీజీ కూడా కోరారు.కాకపోతే అటువంటి వివాహాలకు తగిన ప్రోత్సాహకాలను ఆనాడే ప్రకటించలేదు. వారి మరణానంతరం వంద సార్లు రాజ్యాంగ సవరణలు జరిగినా ఈ అంశం ఎవరూ ముట్టుకోలేదు.స్వచ్చందంగా ఇలాంటి పనులు భారీగా జరగవు.పైగా కులాన్నే తమ జాతిగా కూడా పిలుస్తున్నారు.అందుకే ఇప్పటికైనా కులాంతర,మతాంతర వివాహాలు చేసుకున్న పేదలకు మాత్రమే రిజర్వేషన్లను పరిమితం చేయాలి.కులమత ప్రసక్తిలేని, ఏ కులమో చెప్పలేని భారత జాతి గణనీయంగా పెరిగితే కుల,మత కలహాలు,రిజర్వేషన్ల గొడవలు సమసిపోయి మన దేశం మరింత బాగుపడుతుంది.
నూర్ బాషా రహంతుల్లా
విశ్రాంత డిప్యూటీ కలక్టర్,6301493266


21, సెప్టెంబర్ 2019, శనివారం

గతుకులరోడ్లకు టోల్ ఫీజులా?



గతుకులరోడ్లపై టోల్ ఫీజులు
రహదారులు బాగుంటే ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి ఆస్కారం ఉంది.అలాంటి రోడ్లపైనే వాహనాలను అమిత వేగంతో నడుపుతున్నారు. గతుకుల రోడ్లపై తక్కువ వేగంతో వాహనాలు వెళ్తాయి కాబట్టి ప్రమాదాలు పెద్దగా జరగవు అని కేంద్రమంత్రి డీవీ సదానంద గౌడ అన్నారు.
ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులు లేని కారణంగానే టోల్‌ వ్యవస్ధ కొనసాగుతున్నదని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. ప్రజలు మంచి సేవలను కోరుకుంటున్నట్లయితే టోల్‌ఫీజు కట్టాల్సిందేనని లోక్‌సభలో సెలవిచ్చారు. గడిచిన ఐదేళ్ళలో ప్రభుత్వం 40 వేల కిలోమీటర్ల జాతీయ రహదార్లను నిర్మిం చిందని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో టోల్‌ వసూలు జులుము  పై కొంత మంది ఎంపీలు ఆందోళన చేశారు. గడ్కరీ సమాధానమిస్తూ ఆయా ప్రాంతాలలో వసూలు చేస్తున్న టోల్‌ ఫీజును గ్రామీణ, పర్వత ప్రాంతాలలో రోడ్ల నిర్మాణానికి ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. టోల్‌ వ్యవస్ధ కొనసాగుతుందని, కాలాను గుణంగా టోల్‌ పీజులు మారతాయని చెప్పారు.గడ్కరీ రోడ్లు టోళ్ళు ఉండాలంటే గౌడ అవేమీ అక్కరలేదు అంటున్నాడు. 
వేగంగా రోడ్లను నిర్మించడం ద్వారా మోదీ ప్రభుత్వం రూ. 3 లక్షల కోట్లు  ఆదా చేసిందట. రహదారుల భూసేకరణలో కూడా రూ. 16 వేల కోట్లను ఆదా చేసిందట. ఇప్పటివరకూ వసూలు చేసిన టోల్‌ గేట్ ఫీజుల డబ్బును  పల్లెల్లో, పర్వత ప్రాంతాల్లో రోడ్లు నిర్మించడానికి ఏమాత్రం ఉపయోగపెట్టారో చెప్పలేదు.రాష్ట్రాలు కోరేచోట్ల రోడ్ల విస్తరణకు కేంద్రం ముందుకు రాదు.ప్రజలు కోరేచోట్ల రోడ్లు ఇంకా పూర్తికాలేదు.సరైన నష్టపరిహారం ఇస్తే భూసేకరణ సమస్య ఎదురుకాదు. పైగా  రాష్ట్ర ప్రభుత్వాలు భూసేకరణ సమస్యను  అధిగమించడానికి కొత్త ప్రణాళికలు రచించాలట.
ఢిల్లీ నుంచి ముంబైకి 12 గంటల్లో చేరుకునేలా రహదారి నిర్మిస్తారట. రహదారి పొడవునా పచ్చదనాన్ని పెంచుతారట.  రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్రలోని పలు గిరిజన, వెనుకబడిన ప్రాంతాల మీదుగా ఈ దారిని నిర్మిస్తామన్నారు. ఒకపక్క రహదారులు బాగుంటే ప్రమాదాలు తెగ జరుగుతాయని  సదానంద గౌడ గారు స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు. భూసేకరణలో రూ. 16 వేల కోట్లను ఆదా చేశారు అంటే భూయజమానులకు ఆమేరకు తక్కువ పరిహారం చెల్లించారన్నమాట.పాఠశాలలు, రాష్ట్ర బస్సు సర్వీసులకు టోల్‌ ఫీజు మినహాయించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఇది ఎప్పుడో చేయవలసిన పని. టోల్ ఫీజులమీద ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఉంది.ఆయా రోడ్ల నిర్మాణవ్యయం తిరిగి వసూలు అయ్యాక కూడా టోల్ గేట్లను ఎత్తేయటం లేదని ,రోడ్ల నిర్మాణం పూర్తికాకముందే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని వాటి వసూళ్ళలో పారదర్శకత లేదని ,ప్రయాణీకులపై దౌర్జన్యం చేస్తున్నారని,వాటివల్ల కేవలం కాంట్రాక్టర్లు బలిసిపోతున్నారని, అవి మూసేయ్యాలని లేదా ధరలు తగ్గించాలని చాలా చోట్ల ఆందోళనలు కూడా చెలరేగాయి.
ప్రజల ఆందోళనలు గమనించిన మహారాష్ట్ర ప్రభుత్వం ఆరాష్ట్రంలో ఏర్పాటు చేసిన 44 టోల్‑ప్లాజాలను మూసేయాలని నిర్ణయించింది.రోడ్డు నిర్మాణానికి అయిన వ్యయం చాలావరకు వెనక్కి వచ్చేసిన  టోల్‑ప్లాజాలను డెవలపర్లకు రూ. 309 కోట్లను చెల్లించి ముందుగానే మూసేయాలని నిర్ణయించింది.మహారాష్ట్రలో టోల్ గేట్ వసూళ్ళ వ్యతిరేక ఉద్యమం ఊపందుకుంది. టోల్ వసూళ్ళ పక్రియను నిరసిస్తూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) రాస్తారోకో పిలుపు నేపథ్యంలో మహారాష్ట్రలో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. టోల్ సుంకానికి తాము వ్యతిరేకం కాదని, అయితే వసూలు చేస్తున్న వేలకోట్ల రూపాయలు ఏమవుతున్నాయన్న విషయంలో పారదర్శకత లోపించిందని, టోల్ వసూళ్ళ సొమ్ము అనధికారికంగా కొద్ది మంది వ్యక్తుల జేబుల్లోకి వెళ్ళడాన్ని తాము అడ్డుకుంటామని ఎంఎన్ఎస్ ప్రకటించింది. కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ల్లో కూడా టోల్ వసూళ్లకు వ్యతిరేకంగా ప్రజలు గతంలో ఉద్యమించారు. మహారాష్ట్రలోని ఎనిమిది నగరాల్లోని టోల్‌బూత్‌లను అగ్నికి ఆహుతి చేశారు.
 దేశంలో టోల్‌టాక్స్‌ల పేరుతో సాగుతున్న దోపిడీని నిలువరించాలి.రోడ్ల అభివద్ధికి,నిర్మాణానికి పెట్టిన పెట్టుబడిని శాస్త్రీయంగా అంచనావేసి దానికనుగుణంగా రోడ్లపై టోల్‌టాక్స్ వసూలు చేయడానికి అనుమతి ఇవ్వాలి లాంటి నినాదాలతో దేశవ్యాప్తంగా ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు.వాహనం తీసుకుని రోడ్డుమీది కెక్కాలంటే గుండె దడ పుడుతున్నది.ఇంధనానికి అయ్యే ఖర్చు కన్నా టోల్‌ టాక్స్ ఖర్చు తడిసిమోపెడు అవుతున్నది. ప్రతి నలభై, యాభై కిలోమీటర్లకు ఒకటి చొప్పున టోల్‌గేట్లు పెట్టి వాహనదారుల నుంచి టోల్ వసూలు చేస్తున్నారు. టోల్ గేట్ కాంట్రాక్టర్లు ఈ దోపిడీ ఏకంగా 20- 30 ఏళ్లపాటు ప్రజల నుంచి ముక్కు పిండి వసూళ్లు చేస్తారు. దేశవ్యాప్తంగా టోల్ మాఫియా దోపిడీ ఎక్కువైందని ప్రజల నుంచి స్వచ్ఛంద సంస్థ లు, లారీ యజమానులు, వాహనదారులు, ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
టోల్ పన్ను ఎంత ఉండాలి?
దేశవ్యాప్తంగా ప్రైవేటు వారికి రోడ్ల నిర్మాణాన్ని అప్పజెప్పి వారు పెట్టిన పెట్టుబడులకు గాను రోడ్డుపై ప్రయాణించే ప్రతివాహనం నుంచీ కొంత చొప్పున రుసుము వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే అది ఎంత ఉండాలి , ఎంతకాలం? అనేవాటిలో గోప్యత  దేశ ప్రజలందరినీ వేధిస్తున్నాయి.
మహారాష్ట్ర నవనిర్మాణ సేననేత రాజ్ ఠాక్రే ఏకంగా టోల్ గేట్ల దగ్గర ఎవరూ టోల్ ఫీజును కట్టొద్దని ప్రజలకు పిలుపునిచ్చాడు. ఎవరైనా, ఎక్కడైనా టోల్ నిర్వాహకులు బలవంతంగా టోల్‌టాక్స్ వసూలుకు సిద్ధపడితే తిరగబడండి అని పిలుపునిచ్చాడు.
కర్నాటకలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు హెచ్.ఎస్. దొరైస్వా మి టోల్‌గేట్ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాన్నే చేశారు.. దేశవ్యాప్తంగా రోడ్లపై పట్టపగలు నిలువుదోపిడీ జరుగుతున్నదనీ, దీనికి వ్యతిరేకంగా ప్రజలంతా కదిలి ఉద్యమించాలని పిలుపునిచ్చారు.బెంగళూరులో వేలాదిమంది స్కూటర్, కారు వాహనదారులు టోల్‌టాక్స్‌కు వ్యతిరేకంగా పెద్ద ప్రదర్శన నిర్వహించారు. టోల్ టాక్స్ నిర్వాహకులు తాము వెచ్చించిన డబ్బుల కన్నా వెయ్యి రెట్లు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నోయిడా లో రహదారుల నిర్మాణానికి సదరు కంపెనీ వెచ్చించిన డబ్బులు కేవలం మూడేళ్లలోనే వసూలయినా ఆ టోల్ నిర్వాహకులు ఇంకా వసూ లు చేస్తూనే ఉన్నారు.ఆ కంపెనీ రెండేళ్లలోనే వాహనదారుల నుంచి 748 కోట్లు వసూలు చేసిందని సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడి అయ్యింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఓ రోడ్డు నిర్మాణ సంస్థ రహదారి నిర్మాణానికి 420 కోట్లు వెచ్చించింది. కానీ ఆ సంస్థ వాహనదారులనుంచి ఒక ఏడాది లోనే 750 కోట్లు వసూలు చేసింది. ఇంతటితో ఇది ఆగిపోతుందా అంటే అదీ లేదు. ఏకంగా 30 ఏళ్లు ప్రజలనుంచి టోల్‌ను వసూలు చేయడానికి ప్రభుత్వం నుంచి హక్కు పొంది ఉన్నారు. అంటే టోల్ నిర్వాహకుల నిర్వాకం, దోపిడీ ఏ స్థాయిలో ఉన్నదో ఊహించుకోవాల్సిందే.

ప్రజలపై పెనుభారం
 రోడ్ల నిర్వహణకు,నిర్మాణానికి 60 వేల కోట్లు కావాలి.పెట్టుబడుల కోసం ప్రైవేటు పెట్టుబడిదారులకు అవకాశమివ్వాలికానీ ప్రజలను నిలువు దోపిడీ చేయడానికి ప్రైవేటు వ్యక్తులకు లైసెన్సులు ఇవ్వకూడదు.  అలాగే ఈ రోడ్ల నిర్వహణ కోసమే ప్రభుత్వం ఇంధనాలపై రెండు శాతం సెస్ విధిస్తున్నది. దీని ద్వారా ప్రభుత్వానికి ఏటా 50వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నది. అలాగే ప్రైవేటు వాహనాలపై పర్మిట్‌ల పేరుమీద 30వేల కోట్లు వసూలు చేస్తున్నది. దీన్ని సక్రమంగా వినియోగిస్తే చాలా వరకు జాతీయ రహదారుల అవసరాలను పూడ్చవచ్చు. కానీ రహదారుల అభివృద్ధి, నిర్మాణం పేర ప్రైవేటు పెట్టుబడిదారులకు  అపార లాభాలు కట్టపెట్టడం దారుణం.
1997లో ప్రభుత్వం విధించిన టోల్‌టాక్స్ ప్రకారం చిన్న వాహనానికి కిలోమీటర్‌కు 40 పైసలు. పెద్ద వాహనానికి70 పైసలు. ట్రక్కులు, లారీల లాంటి వాటికి కిలోమీటర్‌కు 1.40 పైసలుగా నిర్ణయించారు. ఇదే 2006 వచ్చే నాటికి టోల్ టాక్స్ కిలోమీటర్‌కు రెండు రెట్ల నుంచి పదిరెట్లదాకా పెంచారు.
మరో వైపు టోల్ నిర్వాహకుల నిర్వాకం అంతా ఇంతా కాదు. ఒక్కోసారి టోల్‌గేట్ దాటడానికి వాహనానికి గంటల సమయమే కాదు ఇంధనం కూడా వృథాగా ఖర్చు అవుతున్నది. కాబట్టి ఇప్పటికైనా దేశంలో టోల్‌ పేరుతో సాగుతున్న దోపిడీని నిలువరించాలి. వారి అరాచకాలను అరికట్టాలి. రోడ్ల అభివద్ధికి, నిర్మాణానికి వారు పెట్టిన పెట్టుబడిని శాస్త్రీయంగా అంచనావేసి దానికనుగుణంగా రోడ్లపై టోల్‌టాక్స్ వసూలు చేయడానికి అనుమతి ఇవ్వాలి. టోల్‌టాక్స్ వసూలుకు ఏ శాస్త్రీయమైన పద్ధతి లేకుండా ఉంటే..అది దారి దోపిడీ తప్ప మరోటి కాదు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే.. రానున్న రోజుల్లో టోల్‌గేట్లకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఉద్య మం చెలరేగే అవకాశం ఉన్నది. టోల్ ధరని తగ్గించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాని ఉంది. 1956 టోల్ చట్టాల ప్రకారమే టోల్ చార్జీలను ఖరారు చేస్తున్నా రాష్ట్రంలో ప్రతిరోజూ టోల్ పన్నుల రూపం లో రోజుకు రూ.5 కోట్లు వసూలు అవుతున్నాయి. ప్రజలపై భారం కొంచమైనా తగ్గించాల్సిందే.
అమరావతిలోపలా  చుట్టూ టోల్ గేట్లే 
అమరావతిలో రాజధాని పెట్టారనే  సంతోషం  రాజధానికి వచ్చే పోయే జనాలకు లేదు. గుంటూరు,విజయవాడ పరిసరాల ప్రజలకు , ప్రయాణీకులకు ఇంకాలేదు. ఎందుకంటే బెజవాడకు నాలుగువైపులా ఎటువైపు వెళ్లినా టోల్ గేట్ పన్ను కట్టాలి. నగరానికి నలువైపులా నాలుగు టోల్ గేట్లు  ఉన్నాయి. బెజవాడనుంచి మచిలీపట్నం వైపు దావులూరు, గుంటూరు వైపు  కాజ, హనుమాన్ జంక్షన్ వైపు పొట్టిపాడు, హైదరాబాద్ వైపు  కీసర. ఇలా నాలుగు వైపులా టోల్ గేట్లు భారంగా మారాయి. మచిలిపట్నం రోడ్డు నిర్మాణమే పూర్తికాకుండా టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు.
రాజధాని పరిధిలో ఉన్న గుంటూరు, విజయవాడ మధ్య ఎటు వెళ్లాలన్నా.ఈ టోల్ ఫీజు కట్టాల్సిందే. కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు సిటీల మధ్యలో ఈ టోల్ గేట్లు  ఎందుకని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇలా గత పదిహేనేళ్లుగా టోల్ గేట్ కడుతూనే ఉన్నారు. బీవోటీ పద్దతిలో (బిల్ట్ ఆపరేట్, ట్రాన్స్ ఫర్) ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించారు. ఇప్పటికి పదిహేనేళ్లు పూర్తైనా టోల్ గేట్ వసూలు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎన్నేళ్లు వసూలు చేస్తారో కూడా తెలీని పరిస్థితి.
బెజవాడ నుంచి హైదరాబాద్ ,నెల్లూరు,వైజాగ్ ఎటువెళ్ళినా ఆరేసి టోల్ గేట్లు దాటాలి.
ప్రభుత్వాలు నిర్మించాల్సిన రోడ్లు ప్రైవేట్ సంస్థలకు ఎందుకు అప్పగిస్తున్నారు. ఎప్పుడో వేసిన రోడ్డుకి టోల్ ఫీజు వసూళ్లు చేయడంపై జనాలు షాక్ అవుతున్నారు. టోల్ గేట్ గడువు పూర్తయ్యాక.. ఆయా ప్రైవేట్ సంస్థలు రోడ్లు ప్రభుత్వానికి అప్పగించి టోల్ గేట్ వసూళ్లు ఆపేయాలి.కానీ అలా ఆపకుండా ఇష్టారాజ్యంగా టోలు ఫీజులు వసూలు చేస్తున్నారని జనాలు మండిపడుతున్నారు.
ఆర్టీసీకి  కూడా టోల్ పన్ను ఎందుకు ?
ఈ మధ్యనే ఆర్టీసీ ప్రభుత్వ సంస్థ గామారింది. టోల్‌ పన్ను  ఏటా దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా ప్రయాణీకుల నుండి ఆర్టీసీ వసూలు చేసి టోల్‌ గేట్ల వద్ద ప్రైవేటు కాంట్రాక్టర్లకు  చెల్లిస్తోంది. రహదార్లపై ఉన్న టోల్‌ గేట్ల మీదుగా వెళ్లే బస్సుల్లో టోల్‌ ఫీజు కింద ఆర్టీసీ వాటిల్లో ప్రయాణిస్తున్న ప్రయాణీకుల నుండి వసూలు చేస్తోంది.గ్రామీణ ప్రజలకు సేవచేసే ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆర్టీసీకి   నష్టాలు రాకుండా టోల్  ఫీజు మినహాయించ వచ్చుగాదా? ఆర్టీసీ ది వ్యాపార దృక్పథం కాదు. అదొక సేవా సంస్థ. ఆ సంస్థలో జరుగుతున్న దుబారాను అరికట్ట లేని ఆర్టీసీ యాజమాన్యం ఇన్నాళ్ళూ టోల్‌ గేట్ల పన్నును మాత్రం ప్రయాణీకుల నుండి వసూలు చేసింది. నష్టాలు నష్టాలని గగ్గోలు పెడుతున్న ఆర్టీసీ రకరకాల భారాలను మౌనంగా భరించింది కానీ  కనీసం  టోల్‌ గేట్ల పన్ను భారాన్ని అయినా సంస్థ వదిలించుకోలేదు. దాన్ని ప్రయాణీకులే భరించాలనే విధంగా వ్యవహరించింది.  భారీగా పెంచిన బస్సు ఛార్జీలతో ప్రయాణీకుల నడ్డి విరుగుతున్న నేపథ్యంలో దీనికి అదనంగా టోల్‌  ఫీజులు మరింత భారంగా తయారయ్యాయని ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులకు టోల్‌ గేట్ల పన్ను నుండి మినహాయింపు ఇస్తున్న ప్రభుత్వం సామాన్యులు ప్రయాణించే బస్సులకు కూడా ఆ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. ప్రైవేట్‌ బస్సు  సంస్థలు అధిక లాభాలు ఎలా పొందుతున్నాయో ఆర్టీసీకి నష్టాలు ఎందుకొస్తున్నాయో ప్రభుత్వం పట్టించుకోవాలి.గ్రామీణ విద్యార్ధులు, ప్రయాణికుల రవాణా అవసరాలు తీరుస్తున్న ఆర్టీసీ ని ప్రభుత్వంలో కలిపి ఆదుకొన్నందుకు ప్రజలు హర్షిస్తున్నారు.అలాగే ఆర్టీసీకి టోల్ ఫీజు  నుండి మినహాయింపు ప్రభుత్వమే ఇవ్వాలని కోరుతున్నారు.
 స్థానికులను గుర్తించాలి
టోల్ గేట్‌కు  20 కిలోమీటర్లు పరిధిలో ఉన్న వాహనదారులకు  ఉచితంగా పాస్ ఇవ్వాలి.. అలా ఇవ్వకుండా వాహనం మీద రిజిస్ట్రేషన్ అడ్రస్, యజమాని అడ్రస్ ప్రూఫ్ ఒకేలా ఉంటే 300 కడితే పాస్ ఇస్తున్నారు. తమ భూముల్ని టోల్ గేట్ కోసం త్యాగం చేస్తే.. తమ దగ్గరే టోల్ గేట్ వసూలు చేస్తారా అంటూ భూయజమానులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. 20 కి,మీ కంటే తక్కువ దూరం ప్రయాణించిన వారి నుంచి కూడా టాక్స్ వసూలు చేస్తున్నారు. స్థానికులను గుర్తించి ప్రత్యేక పాస్‌లు అందించాలి. టోల్ రుసుం చెల్లించలేక కొందరు వాహనదారులు  పక్క దారుల్లో  దొంగల్లా రాకపోకలు సాగిస్తున్నారు. ఐతే టోల్ గేట్ నిర్వాహకులు  ఆ దారులగుండా వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.
టోల్ గేట్లు ఎంతెంత దూరంలో ఉండాలి?
70 కి.మీ. వరకూ టోల్ గేట్ ఏర్పాటు చేయకూడదని సుప్రీమ్ కోర్ట్ సూచించినప్పటికీ రోడ్ భద్రతా చర్యలు, ప్రజల అవసరాలు పూర్తి చేయకుండానే 60 కి.మీ.కి ఒకటి చొప్పున టోల్‌గేట్లు  ఏర్పాటు చేశారు.
టోల్ వ్యాపారులు,మాఫియా
వాహనాల నుంచి ఇష్టమొచ్చిన తీరులో కోట్లాది రూపాయలను టోల్ రూపంలో వసూలు చేసేందుకు అవకాశం లభించడంతో ప్రైవేట్ పెట్టుబడులు టోల్ రంగంలోకి వేగంగా దూసుకొచ్చాయి. టోల్ విధానం వల్ల కాంట్రాక్టర్లు రద్దీగా ఉన్న మార్గాల్లోనే రహదారుల నిర్మాణం, నిర్వహణ జరుపుతుండడంతో గ్రామీణ రహదారులు దారుణమైన నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. అయితే అధికారికంగా అనుమతించిన 14-16 శాతం ఆదాయం కంటే అధిక ఆదాయం టోల్ వసూళ్ళ ద్వారా లభించే అవకాశముండడంతో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు కాంట్రాక్టర్లు పోటీపడుతున్నారు. కాంట్రాక్టర్లు, స్థానిక మాఫియా ముఠాలు, రాజకీయనాయకులు, ప్రభుత్వాధికారులు కుమ్మక్కై టోల్ మాఫియా ఏర్పడింది.అంచనాలకు తగినట్లు వాహనాల రాకపోకలు లేక నష్టాలు వస్తున్నాయని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు.అంతమాత్రాన అక్రమంగా టోల్ వసూలు చేసుకోవడం క్షంతవ్యం కాదు.టోల్ పేరుతో భారీ అక్రమాలు జరుగుతున్నాయి.నిబంధనల ప్రకారం రెండు టోల్ బూత్‌లకు మధ్య కనీసం 80 కిలోమీటర్ల దూరం ఉండాలన్న నిబంధనను టోల్ మాఫియా ఖాతరు చేయకుండా, అనేక టోల్ బూత్‌లను నిర్మించి అక్రమ వసూళ్ళకు పాల్పడుతోంది.




జాతీయ రహదారులపై ప్రయాణం ప్రయాణికులకు భారమైంది. టోల్‌గేట్లు వల్ల  ప్రయాణికులపై టోల్‌ వసూళ్ల మోత మోగుతోంది. మరో పక్క అధిక లోడుతో వెళ్లే వాహనాలను వే - బ్రిడ్జీల వద్ద తూకం వేసి భారీగానే పన్నులు వడ్డిస్తున్నారని వాహనదారులు లబోదిబోమంటున్నారు.
60 కిలో మీటర్లకొకటి  చొప్పున ఉన్న ఈ  టోల్‌గేట్ల ద్వారా పెద్దమొత్తంలో వసూళ్లు సాగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 6 టైర్ల లారీలో 10 టన్నులు, 10 టైర్ల లారీలో 17 టన్నులు, 12 టైర్ల లారీలో 21 టన్నుల బరువు తీసుకువెళ్లేందుకు మాత్రమే అవకాశముంది. అంతకంటే అధిక బరువుతో రోడ్డెక్కితే అదనంగా రూ.75 నుండి 100 రూపాయలు టోల్‌గేట్లకు చెల్లించాల్సిందే. వే-బ్రిడ్జిల ద్వారా అతిబరువుతో వెళ్తున్న వాహనాలను గుర్తించి వారి నుంచి అదనపు వసూళ్లు చేస్తుండడంపై వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. వే-బ్రిడ్జీల ఏర్పాటుపై గుత్తేదారు సంస్థ ప్రతినిధులు ఓవర్‌ లోడు నివారణకు ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసే వీలు లేక తామే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్తున్నారు. ఓవర్‌ లోడు వల్ల రహదారి దెబ్బతినే అవకాశం ఉండటం వల్ల అదనపు వసూళ్లు తప్పని సరిఅని వారు పేర్కొంటున్నారు. రోడ్డు  పనులు అసంపూర్తిగా ఉన్నప్పటికీ టోల్‌గేట్‌ను ప్రారంభించటంపట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడి పనులు అక్కడే ఉన్న  రహదారిపై టోల్‌గేట్లు వేయటంలో అత్యుత్సాహం చూపిన  కంపెనీలు  వాహన దారుల రాకపోకలకు సరైన సౌకర్యాలు కల్పించటంలో మాత్రం శ్రద్ధ చూపించలేదు. ఇంకా  పనులు పూర్తి చేయకుండానే గేట్లు వేయటం ఏమిటి అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అసంపూర్తి రోడ్ నిర్మాణాల వల్ల తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రమాదాల నివారణకు ప్రయాణికులకు, వాహనదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నాలుగు ఆరు లైన్ల రోడ్ నిర్మాణాన్ని చేపట్టింది. కంపెనీల  నిర్లక్ష్యంతో ఎక్కడికక్కడే నిర్మాణాలు నిలిచిపోయి ప్రమాదాల సంఖ్య పెరిగింది. ఇంత జరిగినప్పటికీ సదరు కంపెనీల్లో మార్పు రాకపోగా యథేచ్ఛగా టోల్ ట్యాక్స్ వసూలుకు చక చకా ఏర్పాట్లు చేసుకున్నారు.చాలా చోట్ల సర్వీస్ రోడ్ లేకపోవటం, ఎత్తు కట్టల పనులు సకాలంలో పూర్తి చేయకపోవటం, అండర్ పాసింగ్ బ్రిడ్జిలను ఎక్కడికక్కడే నిర్మించి వదిలి వేయటంతో ప్రజలు ఇబ్బందులెదుర్కొంటున్నారు.ఈమధ్య ట్రాఫిక్ నియమాల పేరుతో భారీ జరిమానాలు విధించినట్లే ప్రభుత్వం ఈ అక్రమ టోల్ ఫీజుల వసూళ్ళు, గేట్ల ఏర్పాటు ఉల్లంఘనులపై కూడా చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు పెట్టూబడిదారుల డబ్బుతోనే రోడ్లు వెయ్యనవసరం లేదు.ప్రభుత్వానికి వసూలౌతున్న పన్నుల ఆదాయంతోనే ఎన్నో  రోడ్లు టోల్ లేకుండా బాగుచేయవచ్చు.సంక్షేమ రాజ్యంలో మంచి రోడ్లే మనకు అవసరం.టోల్ గేట్లు కాదు.  
----నూర్ బాషా రహంతుల్లా
విశ్రాంత డిప్యూటీ కలక్టర్, 6301493266  
 https://www.facebook.com/photo.php?fbid=2675421232489850&set=a.233025936729404&type=3&theater