ఈ బ్లాగును సెర్చ్ చేయండి

29, నవంబర్ 2019, శుక్రవారం

స్త్రీ బాల వృద్ధులను చట్టాలతో కాపాడాలి


స్త్రీ బాల వృద్ధుల తెగవేత ఆపాలి  
స్త్రీలు దేవతలుగా కొలవబడతారని చెప్పుకునే దేశంలో ఆడబిడ్డను కనేందుకు తల్లిదండ్రులు ముందుకురావటం లేదు. దుర్మార్గులకు మహిళలు,పసిపిల్లలు,వృద్ధులు బలౌతున్నారు.ఏడేళ్ళ చిన్నారి దీప్తిశ్రీ ఇషానిని చంపి మురుగు కాలవలో పడేసిన సవతితల్లి శాంతకుమారి 13 నెలల బిడ్డ ను సాకటానికి అమ్మమ్మ కు అప్పగించారు.సవతితల్లి చేసిన తప్పు అందరికీ శాపంగా చుట్టుకుంది. ఆ పసిపిల్ల చేసిన నేరమేంటి? రెండో పెళ్ళి ఇందుకేనా? రాక్షస సవతి తల్లిని ఏమి చెయ్యాలి? అన్నము అడిగితే వాతలుపెట్టే దొకరు, సొంత అక్క కూతురుపైనే దాష్టీకం చూపేదొకరు.నాగరీక ప్రపంచం లో నాగరికత ఏది? బాలలు,స్త్రీలపై ఈ అమానుష కృత్యాలకు అడ్డుకట్ట ఎప్పుడు,ఎలా?ఇటువంటివారికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చెయ్యాలి. గోడ దూకిన వాడేవడంటే ఆలు చచ్చిన వాడన్నట్లు చాలా మంది తండ్రులు తమ పిల్లల కళ్ళెదుట చక్కని మాదిరి కరమయిన జీవితాన్ని ఉంచలేకపోతున్నారు. కొంతమంది ముసలి వాళ్ళకు పశ్చాత్తాపం రాదు గదా పిల్లల్ని గూడ చెడగొడతారు. “నీ వయసే నాకుంటే ఊరిని ఇరగదీసే దాన్నికదమ్మా” అని చింతామణీదేవిని చెడ్డ పనికి ప్రోత్సహించిన అరవై ఏళ్ళ శ్రీహరికుమారి ఇందుకు చక్కని ఉదాహరణ. కల్లు కుండ ఇంట్లో నిలవపెట్టి రోజూ తప్ప తాగే తండ్రి, సారాయి షాపు పెట్టిన తండ్రి, వ్యభిచార గృహాన్ని నడిపే తండ్రి, తల్లిని చితకబాది కొంగున దాచుకున్న రూకల్ని లాక్కెళ్ళి తాగొచ్చే తండ్రి, దొంగతనమే వృత్తిగా గల తండ్రి, దున్నపోతులాంటి ఆరోగ్యమున్నా అడుక్కుతినటమే అలవాటు చేసుకొన్న తండ్రి, లంచగొండి తండ్రి తమ పిల్లలకు ఏ నీతులు బోధించగలరు? చచ్చిన దాని పిల్లలు వచ్చిన దాని కాళ్ళ క్రింద అన్నట్లు అనేక మంది పిల్లలు సవతి తల్లుల చేత రాచి రంపాన పెట్టబడుతున్నారు. రెండవ భార్యగా వస్తున్న స్త్రీ తాను తల్లి బాధ్యతను గూడా నెరవేర్చే సిద్ధపాటుతోనే రావాలి. కొత్త బార్య మోజులో పది మొదటి భార్య పిల్లల్ని ఆలనాపాలనా లేకుండా గాలికి వదిలేసే తండ్రిని ఏమనాలి ? పిల్లల్ని కనటంపై నియంత్రణ లేకుండా గుంటలో బిడ్డ, కడుపులో బిడ్డ అన్నట్లుంటుందికొందరి వ్యవహారం.పుట్టిన వాళ్ళందరినీ సరయిన రీతిలో పోషించే ఆర్ధికశక్తి లేకపోయినా దేవుడు పోషిస్తాడులెమ్మని కనేస్తారు.మంచి శీల సంపదను నేర్పరు.నారు పోసిన వాడు నీరు పోస్తాడని గాలికి వదిలేస్తారు.పది సంవత్సరాలు దాటక ముందే పిల్లల్ని కాయకష్టం చేయటానికి పంపుతారు.నారు పోసిన వాడు దేవుడు కాదు. మనిషే. నీరు పోయవలసింది కూడా మనిషే. నారు పోసిన వాడు నీరు కూడా పోస్తున్నాడా లేదా అని ఎవరు కనిపెట్టి చూస్తారు? చేసేవి లోపాలు చెప్పితే కోపాలు.తల్లి దండ్రులకేదయినా చెబితే మాకే నీతులు చెబుతావా అంటారు. విపరీతంగా తాగి ఆరోగ్యం చెడగొట్టుకొని నలభయ్యేళ్ళకే ఒకతను చనిపోయాడు ఈ మధ్య. ఆరుగురు పిల్లలు, ఇంకా యవ్వనం గడవని భార్య, ముసలి తల్లిదండ్రులు అనాధలయ్యారు. బ్రతికి బాధించారు చచ్చీ బాధించారు. అసమర్ధుల జీవితమొక వ్యాధి. బాధ్యతారహితులు,సోమరిపోతులకు నిద్ర ఉపశమనం, మరణమే ఆరోగ్యం. మరణానంతరం లెక్కఉన్నా లేకపోయినా కన్నపిల్లల్ని ఎవరూ పోషించరు.బాధ్యతలేని పెద్దవాళ్ళ కాముకత్వ కారణంగా పుట్టిన పిల్లల రక్షణ దేవుడే ఎందుకు చూసుకోవాలి? అది మూర్ఖత్వము దుర్మార్గమూ కాదా?బాలల హక్కుల కమిషన్ వంటినిండా వాతలు గాయాలతో ఉన్న ఎందరో బాలలను కాపాడింది.కన్నతండ్రులు కబోదుల్లా మారినా,తండ్రులు త్రాగుబోతులైనా పిల్లలకు నరకమే. ఇలాంటి దుర్మార్గులను వెంటనే ఉరితిస్తే మిగతా వారికి హెచ్చరికగా ఉంటుంది.చట్టాలు కూడా దుర్మార్గులకు భయాన్ని కలిగించేలా మార్చాలి.షీ టీములు నిరంతరం కదులుతూ ఉండాలి. కాలుతున్న గంజి పోసి, కర్రతో కొట్టి, చేయి విరగ్గొట్టి ,మర్మాగంపై వాతలు పెట్టి,బందించి చితకబాది,ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి,ఒళ్ళుహూనం చేసి,సిగిరెట్టుతో అట్లకాడతో వాతలుపెట్టి, కిరాతకంగా చంపి,పిల్లలను అడ్డుతొలగించుకునే దుర్మార్గులను సమాజంనుండి తొలగించాలి.ఇలాంటి కిరాతకులు సంఘానికి హాని.
అత్యాచారాలకు మహిళలే కారణమనిచెప్పే భాగ్యరాజ్ లాంటి నటులు నెలల పిల్లలు కూడా ఆగమైపోతున్నారే అని ఆలోచించాలి.చీరను బురఖా లాగా మార్చి యాంటీ రేప్ చీర అని పేరు పెట్టినా అత్యాచారాలు ఆగలేదు.ప్రతిచోటా మృగాళ్ళు చెలరేగిపోతున్నారు.సంపూర్ణ మద్యనిషేధం రావాలి.లైంగిక నేరస్తులను నపుంసకులుగా మార్చే మందులు,వారికి కుటుంబ నియంత్రణ మందులు నిర్బంధంగా ఇవ్వాలి. జీవితంలో పెళ్లి , పిల్లలు, కుటుంబం ప్రతి మనిషికీ ఓ వరం.అందమైన జీవితాన్ని ఆస్వాదించడానికి, అనుభవించడానికి పిల్లల్ని కంటారు.పుట్టబోయే బిడ్డ మగ అయితే ఊరుకుంటున్నారు.ఆడబిడ్డఅయితే అబార్షను చేపిస్తున్నారు. భార్య, భర్త, బిడ్డ, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు,వీరందరితో కలిసి జీవించటానికి మనిషి ఇష్టపడటం లేదు. స్వార్థం, ఈర్ష్య అసూయల్లో కొట్టుమిట్టాడుతున్నారు.కామంతో కళ్లుమూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. రొమ్ములుకోసి ,పళ్లుపీకి,మర్మాంగంలో చెయ్యి జొనిపి ,చిత్రహింసలు పెట్టి మహిళలను చంపిన కేసులున్నాయి.ఆయేషా మీరా, ప్రత్యూష,ఇంకా అనేకమంది ఆడపిల్లలపై జరిగిన హత్యాచారాలకూ శిక్షలు పడ లేదు.వాళ్ళ తల్లిదండ్రులు నేటికీ ఏడుస్తూ తిరుగుతున్నారు. కొన్నేళ్లక్రితం జ్యోతీసింగ్ అనే మెడికల్ స్టూడెంట్ అత్యాచారం తర్వాత నిర్భయ చట్టం వచ్చినా స్త్రీలు నిర్భయంగా తిరగలేని దుస్థితి పోలేదు.జనం తిరిగే దారిలో లారీ అడ్డంపెట్టి ఒక మహిళా డాక్టర్ ను రేప్ చేసి చంపారట.వాళ్ళంతా 25 ఏళ్ల లోపువాళ్లేనట.అదే రోజు మరో అమ్మాయిని రప్పించి ఊరంతా తిప్పి చంపారట.హైదరాబాదు లో ప్రియాంకా రెడ్డి,హనుమకొండ లో మానసలపై హత్యాచారాలు బ్రతుకంటేనే భయ పడేలా చేస్తున్నాయి. పిల్లలను వ్యభిచారంలోకి దింపి పాపపు సొమ్ము గడించే ముఠాలను ఎవరు ఎప్పుడు అరికడతారు? ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టడమే నేరమా? ఆడ పిల్లల్ని కంటే ఎలా కాపాడుకోవాలో అని తల్లిదండ్రులు ఆందోళనకు గురౌతున్నారు. ఆడపిల్ల హత్యను చూడకుండాపోయిన ప్రయాణించిన ప్రజలదా వెంటనే స్పందించని పోలీసులదా ?అని విలేకరులు తెగ ఆలోచిస్తున్నారు.నాగరికులు రౌడీల నుండి తమనుతాము రక్షించుకొటానికే సతమతమౌతున్నారు.మహిళలు బాలికలపై నిరంతరం అత్యాచారమో హత్యాచారమో జరుగుతూనే ఉన్నాయి. ఆడవాళ్లకి మనుగడలేదు. మగ చూపులనించి రక్షణలేదు. ఆడదాని కష్టాలు ఆడదానికే తెలుస్తాయి అంటారు.కానీ అత్యాచారాలు ఈ భూమి పుట్టినప్పటినుంచి జరుగుతున్నాయి అని కొందరు మహిళా నాయకులే చవకగా మాట్లాడుతున్నారు.భయం పుట్టే చోట ఆడపిల్లలు ఉండకూడదు. ప్రాణం కంటే వాహనాలు ముఖ్యంకాదు.పారిపోవాలి,పారిపోవటం నేరం కాదు.చిన్నపిల్లలను కూడా బలితీసుకుంటున్నారు. వయసుతో పనిలేకుండా మైనారిటీ తీరని బాలురు మొదలు అరవైఏళ్లు దాటిన ముసలివాళ్లు కూడా అత్యాచారాలు చేస్తున్నారు. సవతి తల్లుల ఆగడాలు,పిల్లల కిడ్నాపులు చంపటాలు లాంటి ప్రమాదాలు ఎదురైనప్పుడు 100,112,181,1090,1091 లాంటి మా హెల్ప్ లైన్లకు ఫోన్ చెయ్యండి అని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఐరాస ప్రధాన కార్యదర్శి అత్యాచార నిందితులకు ఉరిశిక్ష వేయమని భారత ప్రభుత్వానికి సూచించారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మొదలు చాలామంది పెద్దలు,సామాన్య గృహిణులు ఇలాంటి హత్యాచారులను నడిరోడ్డుపై కసబ్ లాగా ఉరితీయ్యాలి లేదా వెంటనే కాల్చి పారెయ్యాలి అన్నారు. వరంగల్లు యాసిడ్ దాడి నిందితుల్ని ఆనాడు కాల్చేస్తే ఎవరూ ఏమీ అనలేదు.హత్యాచార నిందితుల్నికూడా అలా చంపేయ్యాలన్నదే ప్రజావాక్యం.కీడు శంకించిన అబలలు వెంటనే అత్యాచారుల ఫోటో తీసి వాట్సప్ లో తమ ఏరియా పోలీసులకు పంపాలి.తాము ఎక్కడ ఆపదలో ఇరుక్కున్నారో పోలీసులకు ఆ యాప్ ద్వారా తెలిసిపోతుందట. షీ టీములు , పోలీసులు కూడా వెంటనే స్పందించాలి.మన చట్టాలను కూడా కఠిన శిక్షలు పడేలా మార్చుకోవాలి. ప్రజలు ఇచ్చే మంచి సలహాలు పాటించాలి.మనతోటి ప్రజలను దుష్టులనుండి కాపాడాలి.దుష్ట శిక్షణ సజ్జన రక్షణ నిరంతర ప్రక్రియ.
నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266

19, నవంబర్ 2019, మంగళవారం

అర్జీలపై స్పందన పెరగాలి


                                                        అర్జీలపై స్పందన పెరగాలి

మీరంతా బాధ్యతగా ఒక ఏడాది పాటు పనిచేస్తే అర్జీల సంఖ్య తగ్గిపోతుందని ముఖ్యమంత్రి సలహాదారు అజేయ కల్లం తహసీల్దారులు ఆర్డీవోలను ఉద్దేశించి అన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ మహిళలు కూడా పోలీసు స్టేషన్ కు దైర్యంగా వచ్చి ఫిర్యాదులు ఇస్తున్నారని అన్నారు.అర్జీతో వచ్చినమనిషిని ఎలా ట్రీట్ చేస్తామన్నది ముఖ్యమని మనమంతా ప్రజాసేవకులమని జగన్ గారు చెప్పారు. కడప డీ యస్పీ సూర్యనారాయణ స్పందన కార్యక్రమలో అర్జీదారులకు భోజనం పెట్టి మరీ అర్జీలు నమోదు చేయిస్తున్నారట.అర్జీ ఒకందుకు ఇస్తే పరిష్కారం మరొకటి చూపించారని మరికొంతమంది జిల్లా అధికారులు అర్జీలను రాసిపెట్టేవాళ్లను అక్కడ పురమాయించారు. ప్రతి అర్జీపై అధికారులను నిర్ణీత సమయం లోపల స్పందించమని ముఖ్యమంత్రి కోరారు.అవినీతి,ఆలశ్యము లేకుండా వ్యవస్థను కడిగేద్దామని ఉద్బోధించారు. స్పందన కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. అధికారులు పరిష్కారాలు కూడా అంతేస్థాయిలో ప్రజలకు అందిస్తారని కోరుకుందాం.పూర్వం రాజుగారు ప్రజలు పడుతున్న పాట్లు స్వయంగా తెలుసుకోవటానికి మారువేషంలో తిరిగేవాడట.ప్రజలమధ్య పాదయాత్రలు చేసి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించేవాడట.ఇంకోరాజు కోట గుమ్మందగ్గర ధర్మగంట బిగించాడట. ఎవరైనా బాధితుడు వచ్చి ఆ గంట మోగిస్తే రాజుగారు బయటకొచ్చి బాధితుని మొరవిని న్యాయం తీర్చేవాడట. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఫిర్యాదులపట్ల ప్రభువులు తప్పక స్పందించాలి.
అంతులేని సమస్యలు
రేషన్‌ కార్డు లేదని.. పాఠశాల, కళాశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని.. పింఛన్లు, తాగునీరు, రోడ్లు, భూ ఆక్రమణలు.. ఇలా ఏదో ఒక సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. మండల స్థాయిలో ఉన్న అధికారులను కలిసి వారి సమస్యలను విన్నవించుకుంటారు. అయితే ఆ స్థాయిలో వారి సమస్యలకు పరిష్కారం దొరకకపోవడంతో ప్రతి సోమవారమూ కలెక్టరేట్‌కు వస్తుంటారు. కలెక్టర్‌కు తమ సమస్యలను విన్నవించుకుంటే పరిష్కారం దొరుకుతుందని ఆశపడుతుంటారు.ఇప్పటివరకు ప్రజావాణి,మీకోసం,ప్రజావేదిక,ప్రజలవద్దకు పాలన,రచ్చబండ లాంటి రకరకాల పేర్లతో పాలకులు ప్రజల సమస్యలు తీర్చటానికి ప్రయత్నించారు.అదే కోవలో నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార కోసం స్పందన అనే కార్యక్రమం ఏర్పాటుచేశారు.కొత్తజిల్లాల ఏర్పాటుతో ప్రజాఫిర్యాదులకు స్పందించే కలక్టర్ల సంఖ్య పెరుగుతుంది, స్పందనాకేంద్రాలు ప్రజలకు దగ్గరకొస్తాయి.దూరం భారం తగ్గుతాయి. పనులు త్వరగా అవుతాయి. అయితే ముఖ్యమంత్రి నివాసం వద్ద ప్రజాదర్బార్,కలక్టరేట్ల దగ్గర స్పందన కార్యక్రమం రెండూ సమాంతరంగా జరుగుతూ ఉంటే దూరప్రాంతాలనుండి ప్రయాణం చేసి మరీ జనం ప్రజా దర్బార్ కే వస్తారు.అర్జీ రాజుగారికిస్తేనే తృప్తి.
అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ప్రత్యేకంగా కుర్చీలు వేసి అర్జీదారులను కూర్చోబెట్టి ఆయా శాఖల అధికారుల ఎదుట తక్షణమే సమస్యలను పరిష్కరిస్తున్నారు.నెల్లూరు కలక్టరు ఒక వికలాంగుడికి స్పందన కార్యక్రమంలోనే మూడు చక్రాల కుర్చీ అందజేస్తే అర్జీదారుడు ఆనందంతో తబ్బిబ్బు అయ్యాడట. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి ఎదుటే వాటిని పరిష్కరించటం విశేషమే. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన ఫిర్యాదుల దినాల్లో ప్రజల అర్జీలను నమోదు చేశారు.అర్జీదారులందరికీ రశీదులు కూడా ఇచ్చారు.అర్జీదారులను కూర్చోబెట్టి ఆయా శాఖల అధికారుల ఎదుట తక్షణమే సమస్యను పరిష్కరిస్తామనటమే ఈ కార్యక్రమంలో గొప్పతనం.తక్షణమే పరిష్కరించకపోయినా ఫలానా తేదీ లోగా సమస్యను పరిష్కరిస్తామని రశీదులు ఇచ్చారు.అధికారులు ఇచ్చినమాట నిలుపుకుంటే కార్యక్రమం విజయవంతమౌతుంది.
తీసుకున్న వినతుల్ని ఎక్కడ పెట్టామో తెలియని అయోమయ దశ ఉండకూడదు.తీసుకున్న ప్రతిఅర్జీకి ఒక లెక్క ఉండాలి.అర్జీదారుని పట్ల బాధ్యత ,సానుభూతి ఉండాలి.జవాబుదారీ తనం లేని బద్దకస్థులు,జాప్యగాళ్ళు,లంచగొండులు పనులు సకాలంలో చేయకుండా ప్రజలను పీక్కుతింటున్నారు. రైతులు పాస్ పుస్తకాలు రాక ఆత్మహత్యలు చేసుకోబోవటం,ఉద్యోగులు రిటైర్ అయ్యి ఏళ్ళుగడిచినా పెన్షన్,గ్రాట్యుటీ రాకపోవటం,సొంత ఆఫీసులో వాళ్ళే పనులు చెయ్యకపోవటం వార్తల్లో చూస్తున్నాం. ఇలాంటి సభ్యత సంస్కారం లేని లంచగొండులను వెంటాడి పట్టుకోవాలి.కనీసం వాళ్ళు తీసుకున్న దరఖాస్తులను ఎన్నిరోజుల్లో పరిష్కరించాలో ఎన్నాళ్ళకు పరిష్కరించారో ఎందుకు ఇంత జాప్యం చేశారోజవాబు చెప్పే వ్యవస్థ ఉండాలి.అసలు తనక్రింది ఉద్యోగులను ఇలాంటి ప్రశ్నలు నిలదీసి అడగాలంటే శాఖాధికారి దగ్గర వివరాలు ఉండాలికదా? అర్జీలు పెరిగి పోతున్నాయి.సమాచారహక్కు ,వినియోగదారుల హక్కు చట్టాల పుణ్యాన సమాధానాలు ఇస్తున్నారు.సిబ్బంది కూడా పెరగాలి. మోసం లేకుండా ఉద్యోగం శ్రద్ధగా చేయటానికి అవకాశాలు పెంచాలి. కార్యాలయాలలోని పనులలో రాజకీయ నాయకుల జోక్యం తగ్గాలి.సిబ్బందికి వారు చేసే పనిలో పరిజ్ఞానం పెరగాలి. అనవసరమైన పనులకు ఆర్భాటాలు ప్రచారాలు తగ్గాలి. సమీక్షలకు సమయాలు కచ్చితంగా పాటించాలి.ఎవరు చేయ వలసిన పనిని వారిని చేయ నివ్వాలి.పెరిగిన సాంకేతికత కంప్యూటర్లతో పని వేగం..నిబద్ధత.. స్వచ్ఛత... కనపడాలి.మార్పు అందరిలోనూ వచ్చింది.ప్రభుత్వాధికారులు కూడా ప్రజలలో భాగమే. బాల్యం నుండే నీతిని బోధించాలి. ఎవరి స్వార్ధం వారిది.ఎప్పటి కప్పుడు వారి వారి అవసరాలు తీరిపోవాలి.సమాజం ఏమైనా పరవాలేదు చెడ్డ లక్షణాలు ప్రజలలో కూడా ఉంటాయి కాబట్టే పోలీస్ స్టేషన్లు, కోర్టులు. విత్తనాన్ని బట్టే ఫలం.
శాఖాధిపతుల కార్యాలయాల్లో కూడా స్పందన జరగాలి
సోమవారం కలక్టర్ల దగ్గర జరిగే స్పందనలో జిల్లా స్థాయిలోని సమస్యలే దాఖలవుతాయి.జిల్లాస్థాయిలో తేలని విషయాలు,శాఖాధిపతులకే చెప్పుకోవలసిన విషయాలు,శాఖాధిపతుల కార్యాలయాల్లోనే పేరుకుపోయిన విషయాలు కొన్ని ఉంటాయి.ఇప్పుడు ఆ అవకాశం కల్పిస్తూ వివిధ శాఖల డైరెక్టర్లు,కమీషనర్లు ఈ కార్యక్రమాన్ని సొంతం చేసుకోవాలి. స్పందన కార్యక్రమాన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లోకూడా జరపాలి. శాఖాధిపతుల కార్యాలయాల్లో కూడా అర్జీలు తీసుకొని వారి స్థాయిలో పరిష్కార ప్రయత్నం చెయ్యాలి. లేకపోతే ప్రతివిషయానికీ అర్జీ తీసుకొని సచివాలయంలోని సెక్రెటరీలు, మంత్రుల దగ్గరకు,ముఖ్యమంత్రి నివాసానికి జనం వెళ్ళలేరు. అనంతపురం నుండి వచ్చిన విశ్రాంతమ్మ తోపులాటలో స్పృహ తప్పిపడిపోయిన సమస్య మళ్ళీ రాకుండా చూడాలి.ముఖ్యమంత్రిగారికి స్వయంగా అర్జీ అందిస్తేనే త్వరగా పని జరుగుతుందనే అపోహ పోవాలి.స్పందనలో అందుతున్న అర్జీల పరిష్కారం ఎంత బాగా జరిగితే అంతబాగా ప్రజలు అధికారులను నమ్ముతారు.జిల్లా అధికారులు అర్జీలను చక్కగా పరిష్కరిస్తూ ఉంటే రాష్ట్రం నలుమూలలనుండి ప్రజలు తాడేపల్లి పరుగెత్తరు.కొడుకు విదేశీ విద్య ఉపకారవేతనం కోసం దరఖాస్తు లాంటివి ఇవ్వటానికి కూడా ఎంతోదూరం ప్రయాణం చేసి ముఖ్యమంత్రి నివాసం దాకా రాకూడదు. జిల్లాల్లో స్పందన విజయవంతం అయితే రాజధానికి ప్రజల ప్రయాణం తగ్గుతుంది.
పెండింగ్ అర్జీల పై నిరంతర పరిశీలన జరపాలి
జిల్లా కార్యాలయ మాన్యువల్ లో ఫైళ్ళ నిర్వహణ,పెండింగ్ ఫైళ్ళ పరిష్కారం పద్ధతులు సవివరంగా ఉన్నాయి.దానిప్రకారం ప్రతి అధికారీ తనకార్యాలయ గుమాస్తాల వ్యక్తిగత రిజిస్టర్లను నెలకొకసారి ఖచ్చితంగా సమీక్షించేవారు. అందువలన తన కార్యాలయంలో ఏ గుమాస్తా దగ్గర ఏ ఏ ఫిర్యాదులు ఎందుకు పెండింగ్ లో ఉంటున్నాయి, ఎందుకు ఆగిపోతున్నాయి తెలిసిపోయేది. జాప్యానికి అధికారే కారణం కానక్కరలేదు.కిందిస్థాయి సిబ్బంది చేసే అహేతుక జాప్యం కూడా అధికారి అసమర్ధతగానే పరిణమిస్తుంది. అందువలన ప్రతి అధికారీ తన కార్యాలయంలోని పెండింగ్ అర్జీల పై నిరంతర పరిశీలన జరపుతూనే ఉండాలి.జాప్యం లేకుండా అర్జీలు పరిష్కరిస్తూనే ఉండాలి. శాఖాధిపతుల కార్యాలయాల్లో కూడా స్పందన కార్యక్రమం జరగాలి.సోమవారం కలక్టర్ల దగ్గర జరిగే స్పందనలో జిల్లా స్థాయిలోని సమస్యలే దాఖలవుతాయి.జిల్లాస్థాయిలో తేలని విషయాలు,శాఖాధిపతులకే చెప్పుకోవలసిన విషయాలు కొన్ని ఉంటాయి.శాఖాధిపతుల కార్యాలయాల్లో కూడా అర్జీలు తీసుకొని వారి స్థాయిలో పరిష్కార ప్రయత్నం చెయ్యాలి.అర్జీదారుని పట్ల బాధ్యత ,సానుభూతి ఉండాలి.జవాబుదారీ తనం లేని బద్దకస్థులు,జాప్యగాళ్ళు,లంచగొండులు పనులు సకాలంలో చేయకుండా ప్రజలను పీక్కుతింటున్నారు. 21వ శతాబ్దంలో కూడా ప్రజలు పనులకోసం ఏళ్ళతరబడి ఆఫీసులచుట్టూ కాళ్ళరిగేలా తిరగాల్సిరావటం ఎంత అనాగరికం? ఒకే సమస్య తీరక పదే పదే దరఖాస్తులు ఇవ్వాల్సిరావటం,లంచాలు ఇస్తేతప్ప పనికాకపోవటం , పనికాలేదనే దిగులుతో మనుషులే రాలిపోవటం,రాలిపోయిన వాళ్ళ వారసులనూ తిప్పటం లాంటి సంఘటనలు తలుచుకుంటే ప్రజలకు ఎలాంటి గతి పట్టించారో అర్ధమవుతుంది.ఇలాంటి లంచగొండులను వెంటాడి పట్టుకోవాలి.కనీసం వాళ్ళు తీసుకున్న దరఖాస్తులను ఎన్నిరోజుల్లో పరిష్కరించాలో ఎన్నాళ్ళకు పరిష్కరించారో ఎందుకు ఇంత జాప్యం చేశారోజవాబు చెప్పే వ్యవస్థ ఉండాలి.అసలు తనక్రింది ఉద్యోగులను ఇలాంటి ప్రశ్నలు నిలదీసి అడగాలంటే శాఖాధికారి దగ్గర వివరాలు ఉండాలికదా?విచారణ అదికారి ఫోనుచేస్తే పలకడు.పలికినా లంచం ఆశిస్తాడు.లంచం తీసుకొనికూడా కాలయాపన చేసి రిపోర్టు ఇస్తాడు.కనీసం జవాబు ఇచ్చే అధికారులను లబ్ధిదారులు కృతజ్నతగా చూస్తారు.ఆ అధికారి జన్మ సార్ధకమౌతుంది.కొందరు అధికారులు జన కంటకులుగానీ జీవితం గడిపేస్తారు. అర్జీదారులను చిరునవ్వుతో పలకరించి వారి సమస్యలను పరిష్కరించటం పెద్ద పాలనా సంస్కరణే. లంచం ఆశించే ఉద్యోగులను,రిపోర్టులు సకాలంలో ఇవ్వకుండా కాలయాపన చేసేవారిని వదలకూడదు.
నూర్ బాషా రహంతుల్లా
విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266



7, నవంబర్ 2019, గురువారం

లంచం అడిగితే కొట్టండి, లంచగొండులు ప్రజాద్రోహులు


                                  లంచగొండులు ప్రజాద్రోహులు 

లంచం అడిగితే కొట్టండి. వాళ్ళు ప్రజాసేవకులు. పనిచెయ్యని అధికారుల చేతిలో వేధింపులకు గురికావద్దు అని  కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ 18.9.2019                     న దేశప్రజలకు సెలవిచ్చారు.ఇప్పుడు అది కొట్టే స్థాయి దాటి చంపే స్థాయికి వెళ్ళింది . సజీవదహనం అయిన తహసీల్దారు విజయారెడ్డి పై ఎంతమంది సానుబూతి వ్యక్తం చేశారో సజీవదహనం చేసి చనిపోయిన సురేష్ అనేరైతుఎంత బాధ పడి ఉంటాడో కదా అని రెవిన్యూ వాళ్ళ అవినీతి గురించి రైతులు పుంఖానుపుంకంగా తమ అసంతృప్తి గళాలు విప్పారు.  ఒక్క రెవిన్యూనే కాదు ప్రతి శాఖా అవినీతి మయం అయ్యిందని అందుకే కడుపుమండి భారతీయులు తయారవుతున్నారని అంటున్నారు. రెవిన్యూ సిబ్బంది లో భయం మొదలయ్యింది. కుటుంబంతో సహావచ్చి ఆత్మహత్యలు చేసుకుంటామని , విజయారెడ్డి గతే నీకూపడుతుందని కొంతమంది తహసీల్దార్లకు బెదరింపులు వచ్చాయి.ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవటమే కారణం అని చెబుతున్నారు.అడ్డంగా తాడు కడితే ఏమిటి ప్రయోజనం ? మీ అవినీతిని ఆపి ప్రజలకు పనులు చెయ్యండి అదే చాలు అంటున్నారు. సజీవదహనం తరువాత కూడా లంచాలు తీసుకోవటం ఆగలేదు.మధ్యవర్తిని పెట్టుకొని తీసుకున్నారు.అనిశావాళ్ళకు చిక్కారు.ఈ అవినీతి ఆగదు.తిరిగి తిరిగి పనికాక వేసారినవాళ్లు రాజకీయులు,అధికారుల హాహాకారాలు వినాలని ఉవ్వీళ్ళూరుతున్నారు.
ఉద్యోగస్థుడైనా సాధారణ పౌరుడైనా తనకు న్యాయబద్ధంగా రావలసిన  ప్రయోజనం రాకపోతే చాలా బాధపడతాడు.మోసానికిగురైతే మానసికంగా కుంగిపోతాడు.చెయ్యాల్సిన పనిని చెయ్యకుండా జాప్యం చేసేవారిపట్ల కోపం పెంచు కుంటాడు.కాపు కరణం నాపక్కనుంటే కొట్టరా మగడా ఎలా కొడతావో చూస్తాను?అని పూర్వం ఒక సామెత ఉండేది.ఇప్పుడు రాష్ట్రం యావత్తూ రెవిన్యూ సంఘాలు తహసీల్దార్లకు రక్షణ కల్పించాలని ఉద్యమాలకు దిగారు.డిల్లీలో రక్షకులకు రక్షణ కల్పించాలని పోలీసులు ఉద్యమించారు.ప్రజల్లో అసహనం పెరిగిపోయిందని చంద్రబాబునాయుడు వాపోయారు. రోగికి సరైన వైద్యం చెయ్యలేదని డాక్టరుని, క్లయింట్ కు సరైన న్యాయం జరుగలేదని లాయర్ల ను,తగలబెట్టుకుంటూ పోతే ఎలా?  
ప్రజలకు జవాబుదారీగా అధికార యంత్రాంగం ఉండాలి. కోట్ల రూపాయల ఖర్చుతో మొదలు పెట్టిన 'రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పథకం' ఎన్నో లొసుగులతో నీరుగారిపోయింది. ఏదో ఒక రీతిలో పట్టా పుస్తకాలు ప్రదానం చేసి చేతులు దులుపుకోవాలన్న ఆరాటమే తప్ప ఆ పుస్తకాలు వాస్తవ స్థితిని ప్రతిబింబించాలి.ముందుగా భూముల సర్వే జరిపించాలి.భూముల సర్వే జరుపకుండా ఎప్పుడో  బ్రిటిష్ వాడు తయారుచేసిన సర్వే రిపోర్టుల ఆధారంగా పాస్ పుస్తకాల పంపిణీకి పూనుకోవటం వల్ల 'రికార్డ్ ఆఫ్ రైట్స్' అనేది ఒక ప్రహసనంగా మారింది. అప్పటి భూయజమానిగా మన తాతల పేర్లు ఉంటాయి.ప్రతి సంవత్సరం ఆడంగల్ ను తాజాపరచటం గ్రామపాలనాధికారి బాధ్యత.అది జరగటంలేదు.రెవిన్యూ వాళ్ళను భూరికార్డుల నిర్వహణకే పరిమితంచేస్తే బాగుంటుంది. రిజిస్ట్రేషన్ రుసుము  10 శాతం దాకా ఉంది. భూముల మార్కెట్ రేటు పెరుగుతూనే ఉంది.ఈ ఆర్ధిక భారాన్ని భరించలేక రైతులు క్రయవిక్రయాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవటం లేదు. దస్తావేజులు రాసే వాళ్ళ దగ్గర నుంచి సబ్ రిజిస్ట్రార్ ల వరకు అంతా రైతుల నుండి డబ్బు గుంజుతున్నారు.ఎవరికివారే దస్తావేజులు రాసుకొనే పద్దతి అందుకే ప్రవేశపెట్టారు. రిజిస్ట్రేషన్ ఉచితంగా చేయాలి.  రెవెన్యూ శాఖ వద్దకు వచ్చే వాళ్లలో ఎక్కువమంది పేద రైతులు ఉంటారు.స్టాంపు డ్యూటీ కట్టలేక చాలామంది కొన్న భూములకు రిజిస్ట్రేషన్ చేసుకోరు. రిజిస్ట్రేషన్ లేకుండా రికార్డులలో పేర్లు మార్చడం కుదరదు. అది నేరం. రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పనికాదు.  
రైతులందరికీ పట్టాదారు పాసుపుస్తకాలివ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం నెరవేర లేదు. “కుక్క దొరికితే రాయి దొరకదు. రాయి దొరికితే కుక్క దొరకదు. రెండూ దొరికితే రాజు గారి కుక్క” అన్నట్లుగా సాగుతోంది. రేషన్ కార్డుల కోసం విరగబడి వచ్చి క్యూలుగట్టే రైతులు పాసుపుస్తకాలిస్తామంటే మొఖం చాటేశారు.కాని “అవ్వను పట్టుకుని వసంతమాడినట్లు” ప్రభుత్వం రెవిన్యూ అధికార్లను పట్టుకుని ప్రగతి ఏదీ, పురోగతి ఏదీ అని నిలదీస్తున్నది. పాసు పుస్తకాలిచ్చే బాధ్యత రిజిస్ట్రేషన్ శాఖకు కూడా అప్పగిస్తే పని చాలా వేగంగా జరుగుతుంది. సవాలక్ష బాధ్యతలు తలపై వేసుకున్న రెవిన్యూ శాఖకు కొన్ని  భారాలు  తొలగించాలి. ఎన్నెన్నో ఒత్తిడుల మధ్య రెవిన్యూ అధికార్లు తమ బహుముఖ విధులను నిర్వర్తిస్తున్నారు.మంత్రులు, ముఖ్యమంత్రి ఇతర వి.వి.ఐ.పి.లు పర్యటనకొస్తున్నారంటే చాలు వారి గుండె గుభేలుమంటుంది. ప్రజా సదస్సులు, అధికార సభల నిర్వహణ భారం కూడా వారి మీదే పడుతుంది. రాత్రింబవళ్ళు శ్రమించడమే కాకుండా కొన్ని ఖర్చులు జేబు నుండే పెట్టుకోవాలి. వి.ఐ.పి.ల అతిధి సత్కార్యాల ఖర్చులకు ప్రభుత్వం ఇచ్చేది నామమాత్రం. వారికి మర్యాదలో ఏ మాత్రం లోటు వచ్చినా చీవాట్లు తప్పవు. అందువల్ల ఖర్చులన్నీ స్వయంగా భరించుకుని తంటాలు పడుతున్నారు. అయినా వీరిపై ఎవరికీ సానుభూతి ఉండదు.వి.ఐ.పి.ల ఖర్చులు ఎవరు భరిస్తున్నారో దర్యాప్తు చేయాలి. పౌరసరఫరాల కోసం ప్రత్యేక శాఖ లేదు. పని అంతా రెవెన్యూ శాఖ వారే చేస్తున్నారు. ఇందువల్ల రెవెన్యూ శాఖకు పనిభారం అధికమవుతోంది. ఈ సమస్య తీరాలంటే పౌరసరఫరాల పని భారాన్ని రెవెన్యూ శాఖ నుంచి తప్పించి పౌరసరఫరాల శాఖే స్వయంగా నిర్వహించాలి. తహసీల్దారు అడిగిన లంచం కోసం కొందరు రైతులు బిక్షమెత్తిన సందర్భాలు,కిడ్నీలు అమ్ముకున్న సందర్భాలు  ఉన్నాయి. లంచం ఇస్తేనే పట్టాదారు పాస్ పుస్తకం తయారీని వీయార్వోలు మొదలుపేడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  
ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి లంచగొండులను ఎరివేయకపోతే బలహీనులకు పనులు జరగవు. కొంతమంది ఉద్యోగులు   విపరీతమైన కాలయాపన చేస్తున్నారు.కొందరు తప్పులతడకలుగా పనులు చేస్తున్నారు.ఇవన్నీ కలిసి కొండల్లా పేరుకుపోతున్నాయి. రాష్ట్రస్తాయి ఆఫీసుల్లో జిల్లాలోని పెండింగ్ సంస్యలపట్ల సమీక్షలు క్రమగా జరగాలి. .ప్రజలకు తమశాఖ ద్వారా జరగవలసిన పనులను ఏవి ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి,ఎందుకు పెండింగ్ పెట్టారు ,ఎలా వాటిని పరిష్కరించాలి అని నెల నెలా శాఖాధిపతులు,మంత్రులు సమీక్షలు జరపాలి.ప్రతి అర్జీకి రశీదుఇచ్చి దానిమీద ముద్రించిన తేదీ లోపల పని చేస్తే చాలు.అదే మహాభాగ్యం.ఎంక్వయిరీ అధికారికి ఫలానా తేదీ లోపల విచారణ పూర్తి చేయాలని ఆదేశాలలో ఉన్నా అతను ఎంక్వయిరీ సకాలంలో మొదలుపెట్టకపోతే ఎప్పటికీ పనిపూర్తవుతుంది?స్పందన కార్యక్రమం రాష్ట్రప్రధాన కార్యాలయాల్లో,సచివాలయంలో  కూడా జరపాలి.జిల్లాకార్యాలయాలలో పనులు జరగని ప్రజలు రాజధానిలో మాత్రమే  పనులు కావలసినవాళ్ళు అర్జీలు  పెట్టుకుంటారు.ఎందుకంటే కొన్ని అర్జీల పరిష్కారానికి డైరెక్టర్లు,కమీషనర్లు,శాఖాధిపతులు ఆయా దీర్ఘకాలిక పెండింగ్ కేసులపై  దృష్టి పెట్టి  మార్గదర్శనం చెయ్యాలి.పెండింగ్ సమస్యల పరిపూర్తి పై శాఖాధిపతులు నిరంతర సమీక్షలు జరపాలి. ఆలస్యానికి కారకులైన అధికారులపై జరిమానా విధించే పద్ధతి రావాలి.నీతిగా పనిచేసే అధికారులను ప్రజలు మర్యాదగా కాపాడుకుంటారు.లంచం అడిగితే అధికారికి విలువ ఉండదు.అందుకే కొంతమంది అధికారులు మాకు లంచం ఇవ్వొద్దు ప్లీజ్ అని ఫ్లెక్సీలు తగిలించుకున్నారు.
నూర్ బాషా రహంతుల్లా 
విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

1, నవంబర్ 2019, శుక్రవారం

కేంద్రపాలిత ప్రాంతాలు ఇంకా అవసరమా?



కేంద్రపాలిత ప్రాంతాలు ఇంకా అవసరమా?
ఇప్పుడు రాష్ట్రాల సంఖ్య 28,కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 9.కేంద్రపాలితప్రాంతాలు ఇదివరకు  అండమాన్ నికోబార్ దీవులు,చండీగడ్, దాద్రా నగరహవేలీ, డయ్యూ డామన్,లక్షదీవులు,డిల్లీ,పాండిచ్చేరి అని ఏడే ఉండేవి.జమ్ము-కాశ్మీర్,లడఖ్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు కలిసి తొమ్మిది అయ్యాయి.మొదట్లో దేశానికి దూరంగా ఉన్న చిన్న దీవుల్నో,రాష్ట్రాల విభజనలో తగాదాలమూలంగా ఎవరికి బదిలీ చెయ్యని ప్రాంతాన్నో ,వలసదేశాల వారసత్వం నిలపాలనే కోరికతోనో వీటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ఇన్నాళ్ళూ ఉంచారు.కేంద్రం దేశపాలన రక్షణ వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించి రాష్ట్రాల పక్కనే ఉన్న చిన్నచిన్న కేంద్ర పాలిత ప్రాంతాల పాలనా  బాధ్యతలనుండి క్రమేణా తప్పుకోవాలి.వీటిని ఆనుకొనిఉన్న రాష్ట్రాలలో కలిపేసి రాష్ట్రాలను బలపరిచాలి.
మొదటి భాషాప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర అని గొప్పలు చెప్పుకోవటమేగానీ వాస్తవానికి తెలుగు ప్రజలు అనేక రాష్ట్రాల్లోకి చీలిపోయారు.ఇప్పటికీ  తెలుగు ప్రజలు నిజంగా ఒకే పాలన క్రిందకు రాలేదు.మద్రాసులేని ఆంధ్ర తలలేని మొండెం అని పొట్టి శ్రీరాములుగారు వాపోతూ చనిపోయారు. 1952 లో తెలుగు నేతలు చుట్టుపక్కల కొన్ని తెలుగు ప్రాంతాలను వదులుకున్నారు.ఫలితంగా పొరుగు రాష్ట్రాల్లో కొన్ని తెలుగు ప్రాంతాలు కలిసిపోయాయి. ఒడిసాలో  గంజాం,బరంపురం,కోరాపుట్,రాయగడ,పర్లాకిమిడి, కర్నాటకలో  చిత్రదుర్గ,కోలార్,బళ్ళారి, మహారాష్ట్రలో  చంద్రపూర్,గచ్చిబోల్ , చత్తీస్ ఘడ్ లో బీజాపూర్,బస్తర్,దంతెవాడ, తమిళనాడు లో మద్రాసు,హోసూరు,దేవనపల్లి, కృష్ణగిరి,డెంకణికోట, పాండిచేరి లో యానాం కలిసిపోయాయి. ఆనాడు మన తెలుగునాయకులే వీటిని వదిలేశారు.1956 లో తెలంగాణాతో కలిసిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు కానీ 2014 లో తెలంగాణా చీలిపోయినప్పుడు  కానీ  ఈ ప్రాంతాల విలీనం కోసం ఎవరూ ప్రయత్నించలేదు.పైగా తెలంగాణా ఏర్పాటు సందర్భంలో కొందరు తమిళనాయకులు తిరుపతి,శ్రీకాళహస్తి,నగరి,చిత్తూరు,సత్యవేడు,ప్రాంతాలను తమిళనాడులో కలపాలని పుండుమీద కారంచల్లినట్లు ఉద్యమాలు చేపట్టారు. అయితే ఇవన్నీ జరిగినా ఆనాడు తమిళనాడులో కలిపిన మద్రాసు,హోసూరు,దేవనపల్లి, కృష్ణగిరి,డెంకణికోట.పాండిచేరిలో కలిపిన  యానాం లను ఆంధ్రాలో  కలపాలి అని తెలుగునాయకులు ఎవరూ ఎదురు ప్రశ్నించలేదు.ఇప్పటికీ పొరుగు రాష్ట్రాల్లో కలిసిపోయిన తెలుగు ప్రాంతాలకోసం మనవాళ్ళెవరూ అడగటంలేదు.ఇక అడగలేరేమో.ఆనాడు 60 శాతం తెలుగు ప్రజలున్న మద్రాసును కలుపుకున్నారు. ఇంకా పుదుచ్చేరి తమిళులకు యానాం కూడా కావాలా?యానాం ప్రజలకే పుదుచ్చేరి కావాలా?ఎందుకో?
మనకు కాకినాడ పక్కన యానాం అనే కేంద్రపాలితప్రాంతం ఉంది.పక్కనే చుట్టూతా ఆంధ్ర  రాష్ట్రమున్నా  ఇది ఒక స్వతంత్ర దీవి లాగా మన రాష్ట్రంతో  సంబంధం లేనట్లు ఉంటున్నది.యానాంను కలిపితేనే మన రాష్ట్రానికి  ఓ సమగ్ర భౌగోళిక రూపం ఏర్పడుతుంది.కాకినాడ దగ్గర 32 చ.కి.మీ. విస్తీర్ణం,55 వేల జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం. యానాంకు రాజధాని పాండిచ్చేరి తమిళనాడులో 870 కి.మీ. దూరంలో ఉంది. యానాం  ఫ్రెంచ్ కాలనీగా  1954 లో విమోచనం చెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని గ్రేటర్ కాకినాడలో కలపాలని తీర్మానం చేసింది. కానీ అప్పటి యానాం నాయకులు పాండిచేరీతోనే కలిసి ఉంటామన్నారు.తెలుగురాష్ట్రంలో యానాన్ని కలపకపోటానికి వేరే కారణం ఏమీ లేదు. యానాం ను మన రాష్ట్రంలో కలపటానికి అక్కడి ప్రజలు ఇప్పటికీ ఇష్టపడటం లేదు. జై ఆంధ్రా,తెలంగాణా ఉద్యమాల  సమయంలో కూడా సమైక్యవాదులు కూడా వీళ్ళను ఒప్పించలేకపోయారు. విచిత్రంగా యానామీయులు సమైక్యాంధ్రకు మద్దతుగా ఎందుకోగానీ ఒక రోజు యానాంలో బందు పాటించారు.  యానాం ప్రజల భాష తెలుగే.వారిది తెలుగు సంస్కృతే.వారి చదువు,వ్యాపారం,వివాహసంబంధాలు అవసరాలు అన్నిటికీ  ఆంధ్ర పైనే ఆధారపడి ఉంటారు.పొద్దున లేస్తే కాకినాడ రావాలి. పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది. ఇన్ని దశాబ్దాల తరువాతకూడా యానాం ప్రజలు ఆంధ్రలో కలవటానికి, గ్రేటర్ కాకినాడలో విలీనానికీ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. యానాం అధికార కేంద్రం పుదుచ్ఛేరిలో ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయాలన్నీ పుదుచ్చేరిలోనే జరుగుతాయి. అధికారుల బదలీల్నుంచి అభివృద్ది, సంక్షేమ పథకాల అమలు వరకు అక్కడి ఆదేశాలకనుగుణంగానే యానాంలో అమలౌతాయి. యానాం ప్రజలు చిన్న బెయిల్‌ కావాలన్నా పుదుచ్ఛేరిలోకి పరుగులుదీయాల్సిందే. భాషాపాలిత  రాష్ట్రం అనే నినాదాన్నీ వినరు. పక్కనే ఉన్న కాకినాడలో కలవకుండా ఎక్కడో దూరాన ఉన్న పాండిచేరి పాలనలోనే ఉంటామంటారు. భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళనాడులో ఉన్న  పుదుచ్చేరి నుండి విడదీసి ఆంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుంది. ఆంధ్రాలో కలుస్తారా అంటే  లేదు అంటున్నారు. యానాంను ఆంధ్రలో కలవటానికి ఇష్టపడతం లేదు.ఎందుకో తెలుసా? కేంద్రపాలిత ప్రాంతంలకు ఇచ్చే  పన్ను రాయితీల కోసం.అక్కడ రేట్లు తక్కువగా ఉంటాయి. కేంద్ర పాలిత ప్రాంతాలు విస్తీర్ణంలో జనాభాలో చిన్నవి కాబట్టి  కేంద్రం ఇచ్చే నిధులు సరిపోతాయి. అక్కడి జనానికి ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. ట్యాక్సులు లేకుండా కొన్ని సరుకులు, మద్యం చవకగా దొరుకుతుంది.చాలామంది మద్యాన్ని మిగతా దేశానికి సరఫరా చేసే వ్యాపారులుగా స్థిరపడ్డారు.మధ్యలో యానాం ఉండగా రాష్ట్రంలో మద్యనియంత్రణ  చాలా కష్టం. ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు అడ్డుపడే దయ్యాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ గా కేంద్రం నియమించిందని పుదుచ్చేరి ముఖ్యమంత్రి బావురుమంటున్నాడు.
యానాం పాలన పూర్వం తూర్పు పాకిస్తాన్ లాగా  పుదుచ్చేరి నుండి జరుగుతుంది. అది బంగ్లాదేశ్ విముక్తి చెందినట్లు పాండిచ్చేరి నుండి విముక్తి పొందాలి.ఆంధ్రలో కలవాలి. 370 అధికరణం రద్దుతో కాశ్మీర్ లో ఉగ్రవాదం తగ్గిందట.అలాగే మిగతా కేంద్రపాలిత ప్రాంతాలకూ  ఈ ప్రత్యేక అధికారణాలు రద్దుచేసి,పక్కరాష్ట్రాలలో కలిపేస్తే  స్థానికంగా ఉన్న  రకరకాల మాఫియాలు,ముఠాలు తగ్గుతాయి.పక్కరాష్ట్రాలలో కలిపితే రాష్ట్రాల అధికారపరిధి పెరుగుతుంది.కొన్ని సరిహద్దు ప్రాంత  సమస్యలు తగ్గుతాయి.ముఖ్యమంత్రి జగన్‌ యానాంను ఆంధ్రలో కలపమని కేంద్రాన్ని కోరారట.యానాం ఒక్కటే కాదు కేంద్రపాలితప్రాంతాలన్నిటినీ రద్దుచేసి చుట్టుపక్కల రాష్ట్రాలలో కలపాలి.
---నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్, 6301493266