ఈ బ్లాగును సెర్చ్ చేయండి

30, జనవరి 2020, గురువారం

నదుల్ని మురికి చేయకండి! బాగుచేసుకోండి !

నదుల్ని మురికి చేయకండి! బాగుచేసుకోండి ! (సూర్య 2.2.2020)
 ఎక్కడికక్కడే మురుగు నీళ్ళు,మురికి నదులు దర్శనమిస్తున్నాయి.తల్లీ గోదారికే వెల్లువస్తే అందం,బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొర్లుతాయని మురిసిపోయిన జాతి మనది. ఇప్పుడు నదుల్లో  మురికి, చెత్త భయంకరమైన యాసిడ్లు, పారిశ్రామిక వ్యర్థాలు చివరికి మలమూత్రాలు కూడా కలిపేసి చేతులు కడిగేసుకుంటున్నారు. గోదావరి నీళ్ళలో ప్రమాదకర ఈ-కొలి బ్యాక్టీరియా మిల్లీ మీటరుకు 480 ఉన్నట్టు తేలింది. ఇక నదిలో కలిసిన మానవ వ్యర్థాలు పారిశ్రామిక కాలుష్యం, ఆక్వా సాగు,మురుగు, మాల మూత్రాలకు లెక్కేలేదు. నదుల పొడవూనా ఇదే తంతు.సాక్షాత్తూ పభుత్వ యంత్రాంగమే ఈ పాపానికి ఒడిగడుతుంటే ఇక ప్రైవేటు సంస్థల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? దీన్ని తక్షణం ఆపకపోతే.సాగు నీటి నుంచి తాగు నీటి వరకూ వరకూ అన్నింటికీ నదుల మీదే ఆధారపడిన ప్రజల భవిష్యత్తు ఏం కానుంది?
స్వచ్ఛ భారత్ , చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని చెప్తున్నారు కానీ నేరుగా గొంతులోకే గరళం పంపేస్తున్నారు.
జనం దాన్నే జీవజలంగా తాగుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. చరిత్రలో నాగరకతలన్నీ నదుల ఒడ్డున వెలిశాయి. నగరాలకు నదులు నీటి ఆధారాలయ్యాయి. మన నదుల్లో ఆక్సిజన్‌ స్థాయి తగ్గింది.నదుల్ని దేవతలుగా కొలిచే సంప్రదాయం ప్రజల్లో ఉంది. నదిలో స్నానమాడితే పాపాలు హరించు కుపోతాయన్న విశ్వాసాలున్నాయి. మహాకవి నన్నయ,తిక్కన నదుల ఒడ్డునే కావ్యాలు రాశారట. కానీ ఇప్పుడు నది ఒడ్డున నగరం ఉండటమే పెద్ద ప్రమాదంగా తయారైంది.నగరం నది ఒడ్డున ఉన్నదంటే ఆ వూళ్ళోని వ్యర్ధాలు, కాలుష్యాలన్నీ నది ఒడిలోకి చేరతాయి. నదీ స్నానాన్ని పరమ పవిత్రంగా భావిస్తాం.భక్తులే కొన్ని నదుల్లోని ఘాట్లలో తమ ధీక్షా దుస్తులు ,పూజా సామాగ్రి లాంటివి వదిలి వాటిని మురికి కాసారాలుగా చేస్తున్నారు.
పరిశ్రమల నుంచి రసాయన వ్యర్థాలు భారీఎత్తున నదిలో కలిసిపోయి నీళ్లు రంగు మారిపోయి కనబడుతున్నాయి. దుర్వాసన,విషాలతో కూడిన ఈ నీటినే తాగి ప్రజలు రోగాలకు గురవుతున్నారు. థర్మల్‌ విద్యుత్కేంద్రాలు, బీరు ఫ్యాక్టరీల  నుంచి విడుదలయ్యే నీటిని శుద్ధి చేశాకే వదులుతున్నట్టు నిర్వాహకులు పగలు చెబుతూ,రాత్రికి వ్యర్థాలను నేరుగా నదిలో  కలిపేస్తున్నారు.ఇక ప్రజలు బట్టలుతకటం,పాత్రలు తోమటం వల్ల ఇళ్ల నుంచి వచ్చే మురికి నీరంతా ఓపెన్‌ డ్రెయిన్‌లో కలిపి, అక్కడ్నించి నదిలోకి వదిలేస్తున్నారు. ప్రభుత్వమే ఇలాంటి మురికి పనులు చేస్తోంది. కొన్ని వేల కుటుంబాలకు మరుగుదొడ్లు లేవు. మల మూత్రాలు, మరుగు దొడ్లలోని నీటిని కూడా నదిలోకే చేరుస్తున్నారు.ఆ చుట్టుపక్కల ఇప్పుడు బోర్లు వేస్తే మంచినీళ్లు పడని దుస్థితి నెలకొంది.లక్షల మందికి అదే విషం!వీరందరికీ అందుతున్నది నదీజలం కాదు- మానవ వ్యర్థాలు, పారిశ్రామిక కాలుష్యం, ఆక్వా పురుగు మందులతో కశ్మలమైపోయిన గరళం!ఈ త్రాగునీటివల్ల నీళ్ల విరేచనాల నుంచి క్యాన్సర్‌ వరకూ నానా జబ్బులు ప్రజలను పీడిస్తున్నాయి.
కాలుష్యం ఒక నది నుంచి మరో నదికి చేరిపోతోంది. నదిలోకి కలుషితాలను వదిలేందుకు ఏ పరిశ్రమకూ అనుమతులు ఉండవు.కొన్ని పరిశ్రమలు రాత్రిపూట, నదీ ప్రవాహం అధికంగా ఉన్న సమయాల్లో నదిలోకి వదిలేస్తున్నాయి. జీవధారలు, వరప్రదాయినిలు అయిన నదుల్ని కాలుష్య కాసారాలుగా మారుస్తున్నాయి. దేశవ్యాప్తంగా నదుల్ని పరిరక్షించడానికి రూ. 33,000 కోట్లు అవసరమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇప్పుడది రెట్టింపు దాటిపోతుంది.ఇంత పెద్దస్థాయిలో సొమ్ము వెచ్చించడం పెదదేశానికి సాధ్యమవుతుందా?
నదులు ప్రజలకు జీవన దాతలు. కాబట్టి దేశంలో అటువంటి జీవజల నదుల్లోని నీరు విషకలుషితం కాకుండా కాపాడుకోవాలి.వందలాది నదులలో తగినంత నీరు లేదు. జలప్రవాహాల్ని చేజార్చుకుంటే మున్ముందు మిగిలేది కన్నీరే.దేశవ్యాప్తంగా అనుదినం మూడున్నర వేలకోట్ల లీటర్లకు పైగా కలుషిత వ్యర్థాలు నదుల్ని మురికి కూపాలుగా మార్చేస్తున్నాయి. వందలాది మురికి పరిశ్రమల్ని కట్టడి చేసినా నమామి గంగేప్రాజెక్టు విఫలమయ్యింది. జరగాల్సింది మరెంతో ఉంది. నదులు కూడా మనుషుల్లాగా జీవనహక్కు కలిగిన వ్యవస్థలంటూ ఉత్తరాఖండ్‌ ఉన్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దేశంలోని నదులన్నిటినీ మనుషుల్లాగా  చట్టబద్ధంగా రక్షించుకోవాలి. దేశం లోని 275 అంతర్రాష్ట్ర నదులు కలుషితమై ఎవరికీ పనికిరాకుండా పోయాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చెప్పింది.
పందొమ్మిది ఐరోపా దేశాల్లో ప్రవహించే డాన్యూబ్‌, ఆరు దేశాలగుండా వెళ్లే రైన్‌ నదులను ఒక మంచి వ్యూహంతో బాగుచేసుకున్నారు.1958లో ఒక్క చేపపిల్లా బతకలేని దుస్థితిలో మగ్గిన ఇంగ్లాండ్‌ లోని థేమ్స్‌ నది నేడు నూట పాతిక రకాల మత్స్య జాతులకు నెలవయ్యింది. అలాగే దక్షిణ కొరియా సియోల్‌ లోని చంగెచాన్‌, మెక్సికోలోని  లా పియెదాద్‌,బ్రిటన్ లోని  క్వాగీ లాంటి నదులన్నీ బాగుచేసుకున్నారు.అలా మన నదులకు కూడా ప్రాణప్రతిష్ఠ జరపాలి. యమున మృతనదిగా మారిపోయిందట . సరస్వతీ నది కనుమరుగైపోయిందట.ఇసుక మాఫియా, దురాక్రమణలు, వ్యర్థాల బారిన పడి మృతనదిగా మారిన కుట్టెంపెరూర్‌ను కేరళలోని అలప్పుజ ప్రజలు రెండు నెలలు శ్రమించి బాగు చేసుకున్నారు. ఇలాంటి ప్రజల భాగస్వామ్యం ఉంటే ఎన్నో నదులు జవజీవాలు పొంది ప్రాణప్రదాతలుగా నిలబడతాయి. ఇప్పటికైనా జలసంరక్షణ ప్రజాఉద్యమంగామారాలి. నదీనదాలు,కాలువలు,వాగులు,చెరువులు,దొరువులు మంచినీళ్ళతో నిండాలి.రాబోయే వేసవిలో నీటి కటకటను పారదోలాలి.
--  నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266  




23, జనవరి 2020, గురువారం

2 వేల కుబేరులు - 460 కోట్ల కుచేలులు (సూర్య 26 1.2020)


2 వేల కుబేరులు - 460 కోట్ల కుచేలులు


“మాకండలు ఒడిసిన రుధిరం
 మీ గుండెలు నిండిన మధురం
మీ మోటారు లేపిన గాలి
 మా మోమున పోసేను ధూళి
పైకిపోవు మేడలు మీవి
కూలిపోవు గుడిశలు మావి”
ఈ గేయం ఎవరురాశారో గానీ నిజమేకదా అని నాకు మనసులో ముద్రపడ్డాయి.

“ కలిగినవానికే యియ్యబడును
వానికి సమృద్ధి కలుగును;
లేనివానికి కలిగినదియు
వానియొద్దనుండి తీసి వేయబడును” (మత్తయి 13:12)
అనే వాక్యం చదివినప్పుడు దేవుడికి ఇది న్యాయమేనా ? అనిపించిది.

నిజానికి మేడిపండు లాగా ఉంది మన ఆర్ధిక వ్యవస్థ. ఎందుకంటే కార్మికుల ఆదాయం 2 శాతం పెరిగితే సంపన్నుల ఆదాయం 600 శాతం పెరుగుతోందట. ఒక పక్క కుబేరులు మరోపక్క కుచేలులు.ఈ ఆర్ధిక అసమానతలను రూపుమాపటంకోసం ఉపాధిహామీ,జన్ ధన్,దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ నైపుణ్య యోజన,స్టాండ్ అప్ ఇండియా లాంటి ఎన్ని పథకాలు అమలుచేసినా అంతరాలు తొలగటమే లేదని ఐరాస రిపోర్టు . ప్రపంచ సంపద పెరిగిందట.ఆ సంపాదనంతా 2,153 మంది శత కొటీశ్వరుల దగ్గర పోగుపడిందట. ప్రపంచ జనాభాలో 60 శాతం అంటే 460 కోట్ల మంది దగ్గర ఉన్న సంపదతో ఇది సమానం.ఇండియాలో అయితే 63 మంది కుబేరుల చేతిలో 24 వేల కోట్ల సంపద పోగుపడిందట.ఇది భారతీయ బడ్జెట్ మొత్తంతో సమానం.96 కోట్ల మంది కుచేలుల సంపద కంటె నాలుగు రెట్లు ఎక్కువ. ఒక వైపు కుబేరులు అపర కుబేరులుగా మారుతుంటే, మరో వైపు కోటానుకోట్ల పేదలు కటిక దరిద్రులుగా మారుతున్నారు. కర్షకులు, శ్రామికులు పేదరికంలో మగ్గుతూ ఉంటే, ఆర్థిక మాంద్యంలో కూడా కుబేరులు ఎన్ని తరాలు తిన్నా తరగని ఆస్తులను సంపాదిస్తున్నారు.సంపన్న వర్గాల మహిళలతో పోల్చితే నిరుపేద మహిళల ఆయుఃప్రమాణం 15 ఏళ్లు తక్కువట. జీవనోపాధికి లంచం కట్టాల్సి వస్తోంది.కష్టార్జితంలో విద్య, వైద్యాలకే సగం పోతున్నది.ఫీజులు, చార్జీలు, పన్నులు. పెరుగుతున్నాయి. ఇవి తగ్గించని ప్రభుత్వాలు కార్పొరేట్లకు, సంపన్నులకు భారీ రాయితీలు ఇస్తున్నాయి. పన్ను ఎగవేసినా ఆమ్నెస్టీ స్కీమ్‌ క్షమాభిక్ష పథకం ఇస్తూ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్లకు అమ్మేస్తూ ఉంది. కుబేరుల వద్ద పోగుపడుతున్న ఈ సంపదంతా కార్మికుల శ్రమ దోపిడీ వల్ల వచ్చిందేనట.
నిరుద్యోగులు 50 కోట్ల మందట.స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు కావస్తున్నా పేదరికం, నిరుద్యోగం, దేశాన్ని వదలలేదు. మన తరువాత రెండేళ్లకు స్వాతంత్య్రం పొందిన, మనకంటే ఎక్కువ జనాభా కలిగినా చైనా మానవాభివృద్ధి సూచికల్లో మనకంటే మెరుగైన సామర్థ్యం కనబరుస్తున్నది.అనేక వస్తువులు ఇప్పటికీ చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.దేశ ప్రజలకు విస్తృత సేవలందించిన ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ లాంటివెన్నో ప్రైవేటు పాలయ్యాయి.'మాట్లాడుతూనే ఉండండి' అంటూ ప్రైవేటు సంస్థలు ప్రజలను ఆకట్టుకొని బలిసిపోయ్యాయి. ప్రభుత్వానికి కట్టవలసిన 92 వేల కోట్లు కట్టకుండా సుప్రీంకోర్టును క్యురేటివ్‌ పిటిషన్ల ద్వారా గడువు కోరుతున్నారు.మరిన్ని రాయితీలు కావాలట. ఇన్నిరాయితీలు ప్రభుత్వ సంస్థలకే ఇచ్చి ఉంటే బాగుండేదికదా? ప్రైవేటు టెలికాం కంపెనీలేవీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని కట్టలేదు. ప్రైవేటు టెలికాం సంస్థలు ప్రభుత్వ అంతరిక్ష ప్రయోగాల ఫలితంగా లభించిన అత్యున్నత సాంకేతికతను,5జి స్పెక్ట్రమ్‌, జి.పి.ఎస్‌ వంటి ఎన్నో ప్రయోజనాలను ఊరికే వాడుకుంటున్నాయి.ప్రజలకు మాత్రం రీఛార్జ్‌ చేయకుండా ఒక్క నిమిషమైనా అవి ఉచితంగా సేవలందించవు.ఇప్పుడు జనాభాతో సమానంగా మొబైల్‌ ఫోన్లు ఉన్నాయి.కాలం గడిచేకొద్దీ దేశ జనాభా కన్నా ఫోన్ల సంఖ్య ఎక్కువవుతోంది. ఫోన్ల వినియోగం పెరుగుతున్న కొద్దీ పెరిగే ఆదాయమూ ప్రైవేటు సంస్థలదే! అయినా తాము చెల్లించవలసిన బకాయిలను చెల్లించడంలేదు.పన్ను బాకీలు కట్టకపోతే సమాజానికి అన్యాయం చేసినట్లేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వాపోయారు. పైగా 5జి స్ప్రెక్టమ్‌కు పోటీ పెడుతున్నారు.డిజిటల్‌ ఇండియా ఆగిపోతుందని హెచ్చరిస్తున్నారు.కార్పొరేట్‌ న్యాయం అంటే ఇదేనా? జిడిపి పెరుగుదల దెబ్బ తిని పోతుందంటున్నారు! కార్పొరేట్లు కట్టాల్సిన రుసుములు కట్టకపోతే దేశ ఖజానాకి కన్నం పడదా? కార్పొరేట్ల దేశభక్తి ఇదేనా?
దారిద్య్రం, నిరుద్యోగ నిర్మూలన, సంపన్నులు పేదల మధ్య అసమానతల తొలగింపు ఎలా జరుగుతుంది? నిరుద్యోగులు చేయడానికి పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడటం సామాజిక అశాంతికి దారి తీస్తుంది.రానున్న రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పవు.ఈ ఏడు నిరుద్యోగులు మరో 25లక్షలు పెరుగుతారట. మాంద్యం అంటే కూలీలు పెరుగుతారు, మార్కెట్‌లో తగినన్ని ఉద్యోగాలు ఉండవు.శ్రేయోదాయక రాజ్యంలో కూలీలందరికీ తగిన పని ,మెరుగైన జీవితాలు, సామాజిక న్యాయాన్ని కల్పించాలి,మంచి కార్మిక ప్రమాణాలను రూపొందించాలి. 28.5 కోట్ల మంది తమ సామర్థ్యానికి తగిన పని దొరక్క ఉసూరుమంటున్నారు. 50 కోట్ల ప్రపంచ నిరుద్యోగులలో 27 కోట్లమంది 25 సంవత్సరాలలోపు వయస్కులేనట. వీళ్ళు ఉపాధి శిక్షణాకోర్సులలో గానీ, వృత్తివిద్యకోర్సులలో గానీ ఎటువంటి నైపుణ్య శిక్షణ పొందలేదట.60 శాతం కూలీలు రోజుకు రూ.200 లోపు ఆదాయంతో అసంఘటిత రంగంలో ఉన్నారు. 36 కోట్లమంది పేదరికంతో బతుకులీడుస్తున్నారు. ఇక మనదేశ నిరుద్యోగ రేటు 7.5 శాతం.చదువుకున్న యువతలో నిరుద్యోగ రేటు 9 శాతం. గ్రామీణ భారతంలో నిరుద్యోగ రేటు 6.8 శాతం.నిరుద్యోగం గ్రామీణ భారతంలో 66 శాతం. పట్టణ యువతలో చదువుకున్న వారిలో నిరుద్యోగరేటు 37 శాతం. నిరుద్యోగులుగా వున్న గ్రాడ్యుయేట్లు 60శాతం. కోటి విద్యలూ కూటికొరకే అని పెద్దల సామెత.రానురానూ చదువు కున్న నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. ఇలాంటి వాళ్ళకు సరైన ఉద్యోగాలు ఎప్పుడు దొరుకుతాయి?అసలు ఇప్పుడున్న నిరుద్యోగులకు ఉద్యోగకల్పనా దిశగా ప్రభుత్వ ప్రణాళికలు ఏమిటి? నీవునేర్పినవిద్యయే నీరజాక్షీ అన్నట్లు నిరుద్యోగులు ఇంగ్లీషులో దబాయిస్తున్నారు. ఈ నిరుద్యోగుల పెరుగుదల సామాజిక అశాంతికి దారితీస్తుందని ఐఎల్‌వో అభిప్రాయపడింది.దేశంలో ఇప్పటికే పౌరసత్వసవరణ చట్టాల వ్యతిరేక ఉద్యమాల వల్ల అశాంతి ఉంది. అగ్గిమీద గుగ్గిలంలా ఈ నిరుద్యోగ సమస్య తోడయ్యింది.దారిద్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలన్నీ తమ దరిద్రాన్నీ,నిరుద్యోగ సంతానాన్నీ , తమ తలరాతగా భావిస్తూ విధాతను తిట్టుకుంటున్నారు. తమ పక్కనే విలాసజీవితాలు గడుపుతున్న కుబేరులను చూసి కుళ్లుకుంటున్నారు. సామాన్య ప్రజలు ఏమీ చేయలేని పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.పేదలలో ఉపాధి కోసం పరమేశా గంగ విడుము పార్వతి చాలు! లాంటి వేడుకోళ్ళు దేశంలో నలుదిశలా వెల్లువెత్తుతున్నాయి. కాబట్టి ఉన్నవాళ్ళు లేనివాళ్లను చూడాలి.సంపన్న దేశాల దాతృత్వం పెరగాలి.మనదేశంలో కూడా సంపన్నుల దాతృత్వం పెరగాలి. ఇక్కడ సంపాదించి విదేశాలకు పారిపోయినవారి ఆస్తుల్ని ,నల్లధనాన్ని పట్టుకొచ్చి మన పేదలకు పంచాలి.మన నాయకులు అధికారులలో అవినీతి,దుబారా తగ్గాలి.పొదుపు పెరగాలి. స్పందన ,ఇంటికే పెన్ షన్,ఆరోగ్యశ్రీ,మద్యనిషేధం లాంటి పథకాలు పెరగాలి. మీరు ఎక్కువమంది పిల్లల్ని కనండి ఉద్యోగాలు ఇస్తాం లాంటి దొంగవాగ్ధానాలు చెయ్యకుండా , దేశ ప్రజల క్షేమం సౌభాగ్యం కోసం ఇంటికి ఒక్క బిడ్డ చాలు అనే కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలుచెయ్యాలి.
 నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,6301493266

16, జనవరి 2020, గురువారం

మానవహక్కుల్ని కాపాడాలి


మానవహక్కుల్ని కాపాడాలి (సూర్య 19,22.1.2020)
రాజధానిని అమరావతి నుండి తరలించవద్దని అహింసాయుత ధర్నాలతో పోరాడుతున్న వారిపై పోలీసులు బలప్రయోగం చేస్తున్నారని వారితో చర్చలు జరపాలని మానవ హక్కుల వేదిక డిమాండ్‌ చేసింది.ఇదేసమయంలో జమ్మూకాశ్మీర్ మీడియాకు మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కర్ఫ్యూ విధించకుండా 144 వ సెక్షన్ విచ్చలవిడిగా విధించకూడదనీ తెలిపింది.తెలంగాణ భైంసాలో ఇరువర్గాల ప్రజల్లో హింసాత్మక గొడవలు చెలరేగి అక్కడ 144 సెక్షన్ విధించారు. ఆ గొడవల్లో వీధుల్లో పార్క్ చేసిన వాహనాలు, బైకులు, ఆటోలు,కార్లకు,ఇళ్లకు నిప్పంటించారు. అక్కడున్న ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. డిల్లీ జేఎన్‌యూలో కలహాలను రేపిన గూండాలను,దుండగులను కఠినంగా శిక్షించకపోగా ఫోనులు,ఇంటర్నెట్ ఆపేశారట.ప్రత్యేకహోదా పోరాటం ఎటోపోయింది.ఎటుచూసినా చివరికి అమరావతి గ్రామాల్లో కూడా మానవహక్కుల పోరాటాలే కోర్టులదాకా వెళ్ళాయి. హింసలేని శాంతియుత నిరసనలపై 144 సెక్షన్,పోలీసు కవాతులు ఎందుకని హైకోర్టు ఆగ్రహించింది.దాడుల వార్తలు సుమోటోగా స్వీకరించింది.తప్పుచేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలంది.శాంతియుత ఉద్యమాలను అడ్డుకోవద్దు అని హితవు చెప్పింది. ఇళ్లలోకి వెళ్లి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు , గ్రామాల్లో పోలీసులతో కవాతు ఎందుకు?ఆ గ్రామాల్లో ఏమైనా కర్ఫ్యూ విధించారా? ప్రశాంతంగా నిరసన తెలియజేస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు? మహిళల్ని మగ పోలీసులు అరెస్టు చేస్తారా? చట్ట నిబంధనలు ఇలా చేయమని చెబుతున్నాయా? మనం ప్రజాస్వామ్యదేశంలో ఉన్నామనేది మరిచిపోయారా? పౌరులకు నిరసన తెలిపే హక్కు ఉందన్న విషయం గుర్తుందా? నిరసనకారులపై పోలీసులు వ్యవహరించిన తీరు సీఆర్‌పీసీ సెక్షన్‌ 46కు విరుద్ధం అని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జేకే మహేశ్వరి బెంచ్‌ వ్యాఖ్యలు చేసింది.
పౌరుల ప్రాథమిక హక్కులను, మానవ హక్కులను పరిరక్షించేందుకు హైకోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులు,మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది:
.
జీవనోపాధి నిమిత్తం ప్రజలను వారి వారి ఇళ్ల నుంచి స్వేచ్ఛగా బయట తిరగనివ్వాలి.శాంతియుత నిరసనలకు అనుమతి ఇవ్వాలి.గ్రామ దేవతలకు, ఇతర దేవుళ్లకు తమ తమ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల ప్రకారం పూజలు చేసుకునేందుకు ప్రజల్ని అనుమతించాలి.సీఆర్‌పీసీ నిర్దేశించిన నిబంధనల మేర తప్ప, గ్రామస్థుల ఇళ్లలోకి వెళ్లి తనిఖీలు చేయరాదు.అరెస్టుల విషయంలో సీఆర్‌పీసీ సెక్షన్‌ 46ను తప్పక పాటించాలి.నిరసనకారులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లలో అక్రమంగా నిర్బంధించిన పోలీసులపై విచారణ జరపాలి.గాయపడినట్లు పత్రికలు, టీవీల్లో కనిపించిన వారికి తక్షణమే వైద్యసదుపాయం కల్పించాలి.అరెస్టు చేసిన వ్యక్తులను తక్షణమే సంబంధిత మేజిస్ట్రేట్ల ముందు హాజరుపరచాలి.సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, సీఆర్‌పీసీ సెక్షన్‌ 46 తదితరాలను ఉల్లంఘించిన పోలీసులపై విచారణ జరపాలి. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.చట్టాన్ని అమలు చేయని సహచర సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో అలాగే ప్రభుత్వ చర్యలపై శాంతియుతంగా ప్రజలు నిరసన తెలియజేస్తుంటే 144 సెక్షన్‌ ఎందుకు విధించాల్సి వచ్చిందో ప్రభుత్వం కోర్టుకు వివరణ ఇవ్వాలి.
న్యాయం ఎవరికైనా ఒకటే.ఆంక్షల చట్రంలో నలుగుతున్న జమ్మూ కశ్మీర్‌కు సర్వోన్నత న్యాయస్థానంలో ఉపశమనం దొరికింది. భావప్రకటనా స్వేచ్ఛకు గ్యారెంటీ ఇస్తున్న రాజ్యాంగంలోని 19వ అధికరణ పరిధిని విస్తృతం చేస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పు ఇంటర్నెట్‌ సేవల పునరుద్ధరణకు తోడ్పడింది.జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న 370వ అధికరణాన్ని రద్దు చేసి, రాష్ట్ర ప్రతిపత్తిని మార్చి కేంద్రపాలిత ప్రాంతంగా చేసినప్పుడు అక్కడ అల్లర్లు జరగొచ్చుననే సాకుతో నెలల తరబడి ఇంటర్నెట్, ఫోన్‌ సదుపాయాలను అడ్డుకొన్నారు. మొబైల్‌ సర్వీసుల పునరుద్ధరణ ఇంటర్నెట్‌ పునరుద్ధరణ ఇంతవరకూ పూర్తికాలేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు పర్యవసానంగా ఇంటర్నెట్‌ను నిలిపేసే ప్రభుత్వాల తీరు మారక తప్పదు. ప్రభుత్వాలు ఇంటర్నెట్‌ను ఆపకుండా సుప్రీం అడ్డుపడింది. 2011లో గూగుల్, యాహూ, ఫేస్‌బుక్‌ లను ప్రభుత్వ వడబోత తర్వాతే ఏ సమాచారాన్నయినా, వ్యాఖ్యలనైనా తమ సైట్లలో ఉంచాలని ఆనాటి కేంద్రమంత్రి కోరారు. శాంతి భద్రతల కోసం ఇంటర్నెట్‌ సేవలు ఎక్కడికక్కడ నిలిపేస్తున్నారు. సుప్రీం తీర్పు అలాంటి చర్యలను ప్రశ్నించడానికి పౌరులకు అవకాశం ఇచ్చింది. ఎంతకాలం ఆపుతారన్న స్పష్టత లేకుండా నిరవధికంగా ఈ సేవలను నిలిపేయడం టెలికాం నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. అవసరమా, అనవసరమా అనేదానితో నిమిత్తం లేకుండా 144వ సెక్షన్‌ విధించే తీరును కూడా ధర్మాసనం తప్పుబట్టింది.సహేతుకమైన శాంతియుత నిరసనలను ఎందుకు అణచాలి? చీటికీ మాటికీ 144 సెక్షన్‌ విధిస్తున్నారు. 144 సెక్షన్‌కు సంబంధించిన ఉత్తర్వులను కూడా వారం రోజుల వ్యవధిలో సమీక్షించాలని ఆదేశించారు. అయితే భావప్రకటనా స్వేచ్చను అలుసుగా తీసుకొని ఇంటర్నెట్‌లో దుర్వ్యాఖ్యలు, దుష్ప్రచారాలు, విద్వేషపూరిత రాతలు, వగైరా అంశాలు పెట్టినవాళ్లపై చర్యలు తీసుకొని వాటిని ఆపాలి అదుపు చేయాలి. సహేతుకమైన శాంతియుత అసమ్మతి గొంతు నొక్కకూడదు.
మూకదాడులు,హింసా ప్రవృత్తిని కఠినంగా అణచివేయాలి. కోడిపందాలు,పందుల పందాలు, జల్లికట్టు లాంటివాటికి పండుగలు సంప్రదాయాల పేరుతో రాజకీయనాయకులు సినిమానటులు కూడా వెళ్ళి పాల్గొంటున్నారు.మూగజీవాల ప్రాణాలకూ హక్కులుంటాయని గతంలోనే తీర్పులు ఉన్నప్పటికీ ఎవరూ లెక్కచేయటంలేదు.హింసతో కూడిన ప్రాణాంతకమైన బలులు, సతీసహగమనం లాంటి ఆచారాలను,సంప్రదాయాల్నీ,పనుల్ని సభ్యసమాజం ఏనాడో తిరస్కరించింది.
సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు దేశం మొత్తానికీ వర్తిస్తాయి.అన్ని మతాల పౌరుల ప్రాధమిక హక్కుల్ని కాపాడమనే కోర్టుల న్యాయ సూత్రానికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఇస్లాం అంటేనే శాంతి.సహనావవతు
సహనౌభునక్తు అనే ఉపనిషత్తు శ్లోకాల సారం శాంతే. మన ఇద్దరినీ దేవుడు రక్షించు గాక. మనల నిద్ధరిని పోషించు గాక. మన మిద్దరం ఎప్పుడును ద్వేషము లేకుండ ఉండెదము గాక అని. నిన్నువలే నీ పొరుగువాడిని ప్రేమించు లాంటి శాంతి మంత్రాలను ప్రజలు ప్రభుత్వము ఇద్దరూ పాటించాలి.అహింసకు పెట్టనికోటలాంటి మన రాజ్యాంగ సూత్రాలను కాపాడుకుందాం.రాజ్యాంగమే ప్రజలకు రక్ష.
-- నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,6301493266



11, జనవరి 2020, శనివారం

కొత్తజిల్లాల ఏర్పాటూ వికేంద్రీకరణే



కొత్తజిల్లాల ఏర్పాటూ వికేంద్రీకరణే   
స్థానిక సంస్థల ఎన్నికల తరువాత లోక్ సభ స్థానాలవారీగా జిల్లాల పునర్విభజన మొదలుపెడతామని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు మార్చి 3 వతేదీకి పూర్తవుతాయి.మూడు రాజధానుల గోలలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం పక్కకు పోయింది గానీ కొత్తజిల్లాల కోసం ఆయా ప్రాంతాల ఆశ చావలేదు.1972 జైఆంధ్ర ఉద్యమానికి విరుగుడుగా ఏర్పాటు చేసిన జోనులకొసం ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారు.లోక్ సభ స్థానాలతో సమానంగా కొత్త జిల్లాల ఏర్పాటు చేయబూనడం దానికి మరో మేలు.దేశంలో జిల్లాల సంఖ్య 1983  లో 418 నుండి2020 నాటికి 732 కి పెరిగి 314కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. తెలంగాణలో  పది జిల్లాలను 33 జిల్లాలుగా కేసీఆర్ ఏర్పాటు చేశారు. అందువలన అక్కడ ఇప్పుడు 64 రెవిన్యూ డివిజన్లు.624 మండలాలు ఏర్పడ్డాయి. కొత్తగా  26 రెవిన్యూ డివిజన్లు,125 కొత్త మండలాలు,4380 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి.1956 లో మనరాష్ట్రం ఏర్పడింది మొదలు ఈ 64 ఏళ్ళ కాలం లో కేవలం రెండే జిల్లాలు కొత్తగా ఏర్పాటయ్యాయి.అవి ప్రకాశం (1970), విజయనగరం (1979) జిల్లాలు.మన రాష్ట్రంలో ఎన్టీరామారావుగారి కాలంలో జరిగిన మండలాలస్థాపనే రాష్ట్రంలో అతిపెద్ద పరిపాలనా సంస్కరణ. పరిపాలనను ప్రజల దగ్గరకు తీసుకొనివెళ్ళాలనే ఉద్దేశ్యంతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావు గారు రాష్ట్రంలోని 315 తాలూకాలను విడగొట్టి, వాటి స్థానంలో 1110 మండలాలను 1985 మే 25న ఏర్పాటు చేశారు.మండలాల మాదిరిగానే కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు చేయమని కోరగా మండల వ్యవస్థ కుదురుకోగానే కొత్త జిల్లాల ఏర్పాటుపై ద్రుష్టి సారిస్తామని సచివాలయం నుండి నాకు 21.9.1988 న జవాబు ఇచ్చారు.
జగన్ గారి మ్యానిఫెస్టోలో మన రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను పార్లమెంటు నియోజకవర్గాలతో సమానంగా 25 జిల్లాలుగా  ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు.కొత్తగా జిల్లా కేంద్రాలుగా మారవలసిన 12 పార్లమెంటు నియోజకవర్గాలు :1 అరకు 2 బాపట్ల3 అనకాపల్లి 4 అమలాపురం 5 హిందూపురం 6 నంద్యాల 7 నరసాపురం 8 నరసరావుపేట9రాజమండ్రి 10 రాజంపేట 11 తిరుపతి 12 విజయవాడ.విజయవాడ,రాజమండ్రి,తిరుపతి,భీమవరం,గుడివాడ,తెనాలి పట్టణాలు జిల్లా కేంద్రాలు కాకపోయినా ప్రజల సహజ వలసలతో గొప్పనగరాలు అయ్యాయి.రైల్వే జంక్షన్లు ప్రజల చౌక ప్రయాణానికి సరుకుల రవాణాకు మంచికేంద్రాలుగా,పట్టణాలుగా  మారుతాయి. జిల్లాల సంఖ్య పెరిగేకొద్ది వాటి సైజు తగ్గుతుంది గనుక జిల్లా అభివృద్ధి రధానికి సారధుల్లాంటి ఐ. ఎ. ఎస్. ఆఫీసర్లు జనానికి దగ్గరవుతారు. జిల్లా కేంద్రానికి మారుమూల గ్రామాల ప్రజలు ప్రయాణం చెయ్యడానికి దూరం భారం తగ్గుతాయి. అధికార వికేంద్రీకరణ జరిగి మరిన్ని ప్రాంతాలు అభివృద్ధి    చెందుతాయి.జిల్లాస్థాయి అధికారులు దగ్గరకావటం  వల్ల స్పందన కార్యక్రమం విజయవంతం అవుతుంది. విపరీతమయిన జనాభారంతో ఉబ్బిపోయిన నగరాల నుండి జనమూ, ఉద్యోగులు చెదిరిపోయినందువల్ల ఆయా నగరాలు ఊరట చెందుతాయి. ప్రతి జిల్లాలోను భారీ పరిశ్రమలు ఉండాలనే కేంద్ర ప్రభుత్వ ఆశయం మేరకు జిల్లాల సంఖ్యతో పాటు పరిశ్రమల సంఖ్య పెరుగుతుంది. పరిశ్రమలన్నీ ఒకే చోట కేంద్రీకృతం కాకుండా అన్నీ ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందుతాయి.జిల్లా కేంద్రాల్లో ప్రాధమిక సదుపాయాలన్నీ కల్పించాలి. జిల్లాల విభజనకు ఒక ప్రామాణిక సూత్రం గానీ, శాస్త్రబద్ధమైన విధానంగానీ ఏదీ లేకుండానే కాలం గడుపుకొచ్చారు. జాతీయ స్ధాయిలో జిల్లాల సగటు వైశాల్యం ఈనాడు 4534 చ.కి.మీ.లకు తగ్గిపోగా ఆంధ్ర ప్రదేశ్ 12323 చ.కి.మీ. తో దేశంలోనే మొదటి స్ధానంలో ఉంది. మనరాష్ట్రంలో ఒక్కొక్క పార్లమెంటు సభ్యుడు సగటున 20 లక్షలమందికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఒక్కొక్క జిల్లా కలెక్టర్ 38 లక్షల మంది అవసరాలను ఆలకిస్తున్నాడు.దేశంలో సగటున 18 లక్షల జనాభాకు ఒక జిల్లా ఉంది. అరుణాచలప్రదేశ్ లో అయితే 86 వేల మంది జనాభాకే ఒక జిల్లా ఉంది. మన రాష్ట్రం లో మాత్రం 38 లక్షల మందికొక జిల్లా ఉంది.అలాగే త్రిపుర లో 1311 చ.కి.మీ.లకు ఒక జిల్లా కలక్టర్ ఉంటే మన రాష్ట్రం లో 12323 చ.కి.మీ ల భూబాగానికి ఒక కలక్టర్ ఉన్నాడు.పనులకోసం వచ్చే ప్రజలకు అత్యంత దూరం భారం కలిగించే రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ దేశం లో మొదటి స్ధానంలో ఉంది. జిల్లాల సంఖ్య పెరిగితే అధికార వికేంద్రీకరణ జరుగుతుంది.ప్రస్తుతం ఉన్న ఏడు కేంద్రపాలిత ప్రాంతాల వైశాల్యం కలిసి 10,973 చ. కి.మీ. అంటే మన తూర్పు గోదావరి జిల్లా అంత అన్నమాట. గోవా, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్ లాంటి రాష్ట్రాలంకంటే మన జిల్లాలు పెద్దగా ఉన్నాయి. కొన్ని దేశాలు కూడా మన జిల్లాల కంటే చిన్నవి. అనంతపురం జిల్లా వైశాల్యం 19130 చ.కి.మీ. కర్నూలు 17658, ప్రకాశం జిల్లా 17626 చ.కి.మీ. ల భారీ సైజుతో హడలు పుట్టిస్తున్నాయి. రాష్ట్రంలోని  నాలుగు  జోనుల్లో రవాణా సదుపాయం బాగా ఉన్న కేంద్రాలలోగానీ ఆ జోనుమధ్య జిల్లాకేంద్రంలోగానీ  జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి.కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా పరిపాలన వేగవంతంగా జరుగుతుంది. ప్రతి చిన్న అంశానికి రాజధానికి వెళ్లనక్కర లేకుండా మూడు ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజల్లో ప్రభుత్వం తమకు దగ్గరగా ఉందనే భావన పెరుగుతుంది.ప్రతి పార్లమెంటు నియోజక వర్గానికి ఒక జిల్లా వల్ల జిల్లాలలో వాణిజ్యం పెరగడంతో పాటు, భూముల విలువ పెరుగుతాయి,దానివల్ల ఖజానాకు ఆదాయం కూడా సమకూరుతుంది. స్పందన కార్యక్రమం 25 చోట్ల కలక్టర్ల అధ్వర్యంలో జరుగుతున్నందువలన ప్రజలకు దూరం భారం తగ్గుతాయి.అధికారం అంతా ఒక్కచోటే ఉండదు. అన్ని జిల్లాలకూ పలచగా పంచబడుతుంది.శాఖాధిపతులకు కలెక్టర్లకు మధ్య ప్రాంతీయ అధికారులు ఉంటారు.ప్రజలకు అధికారులు చేరువఅవుతారు.తాలూకాలను మండలాలుగా విడగొట్టినందువలన ప్రజలకు పాలనా యంత్రాంగం దగ్గరయ్యింది.ఇప్పుడు మండలాలు తీసేసి మళ్ళీ తాలూకాలనే పెట్టమని ఎవరూ అడగరు. చిన్న జిల్లాల ఏర్పాటు వలన అధికారులందరికీ పని సమానంగా పంచబడుతుంది.తీవ్ర పని భారం తగ్గి ప్రజలకు పనులు త్వరగా జరుగుతాయి.కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల కేంద్రాలు కూడా కొన్ని జిల్లాల కేంద్రాలలాగా చాలా దూరంగా అంచుల్లో ఉన్నాయి.వాటిని మధ్యలోకి మార్చాల్సిన అవసరం ఉంది.
నాలుగు కమీషనరేట్ల పంపకం కూడా నాలుగు ప్రాంతాలవారినీ సంతృప్తి పరుస్తుంది.
1. ఉత్తరాంధ్ర జోను:శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం,అరకు,అనకాపల్లి 5 జిల్లాలు
2.మధ్యకోస్తా జోను : తూర్పుగోదావరి ,పశ్చిమ గోదావరి,కృష్ణా,రాజమండ్రి,అమలాపురం,నరసాపురం,విజయవాడ 8 జిల్లాలు 3.దక్షిణకోస్తా జోను : గుంటూరు,ప్రకాశం,నెల్లూరు, బాపట్ల,నరసరావుపేట 5 జిల్లాలు
4.రాయలసీమ జోను :కర్నూలు,కడప,అనంతపురం,చిత్తూరు,తిరుపతి,రాజంపేట,హిందూపురం,నంద్యాల 7 జిల్లాలు.
నాలుగు జోనుల్లో కలక్టర్ల కంటే పైహోదా కలిగిన నలుగురు కమీషనర్లు రాజధానికి కలక్టర్లకు మధ్య వారధుల్లాగా పనిచేస్తారు.ప్రతిపనికి ప్రజలు రాజధానికి రాకుండా ఈ కలక్టర్లు,కమీషనర్లు జిల్లాలు,జోనులు వారీగా స్థానిక ప్రాంతాలలోనే ఉండి పనిచేస్తారు.కలక్టర్ల దగ్గర పనులు కానివాళ్లు కమీషనర్లను ఆశ్రయిస్తారు.దూర ప్రయాణాలు అనుత్పాదక వ్యయం.అష్టకష్టాలలో దూర ప్రయాణం కూడా ఒకటి.అలాగే రాజధానిలో కొత్త కట్టడాల కొత్త ఖర్చులను కుదించుకొని నాలుగు చోట్ల జోనల్ కార్యాలయాలను కట్టించాలి.అమరావతిలో కట్టిన భవనాలను వాడుకుంటూనే సమన్యాయం కోసం హైకోర్టుకు రెండు చోట్ల బెంచీలు పెట్టాలి.రాజధాని కోసం ప్రజలు రానక్కరలేని పరిస్తితి జోనులవల్ల వస్తుంది.రాజధాని మాకు కావాలంటే మాకని పెద్దగా పోరాడవలసిన అవసరమూ.ఆరాటమూ ఉండదు.
-- నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,6301493266

2, జనవరి 2020, గురువారం

ఆకలి అనారోగ్య మంటలు

ఆకలి అనారోగ్య మంటలు (సూర్య 5.1.2020)
కొత్త సంవత్సరం జనవరి ఒకటిన ప్రపంచవ్యాప్తంగా 4 లక్షల మంది పుడితే అందులో 67385 మంది పిల్లలు ఇండియాలో పుట్టారట.చైనాలో 46299 మంది పుడితే మనదేశం ఆ సంఖ్యను దాటేసిందట.ప్రపంచ శిశువుల మొత్తం లో సగం మంది ఇండియా,చైనా,నైజీరియా,పాకిస్తాన్,ఇండోనేసియా,అమెరికా,కాం గో,ఇథియోపియాల వాళ్లేనట. నీతి ఆయోగ్‌ చేసిన మదింపులోదారిద్ర్యం, పోషకాహారలోపం వంటివి దేశాన్ని వెనక్కు లాగుతూనే ఉన్నాయి.ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌ స్థానం దిగజారిపోయింది. 2014లో 76 దేశాల జాబితాలో మన దేశం 55వ స్థానంలో వుంది. 2017లో 119 దేశాల్లో 100వ స్థానంలోనూ, 2018లో 103వ స్థానంలోనూ వుండగా, 2019లో 117 దేశాల జాబితాలో 102వ స్థానానికి దిగజారింది. ఇండియా ఇప్పుడు పశ్చిమాఫ్రికా లోని నైజర్‌, సియెర్రా, లియోన్‌ దేశాల స్థాయికి చేరింది. ప్రపంచంలో ఆకలితో బాధపడుతున్న మెజారిటీ ప్రజలు భారతదేశంలో నివసిస్తున్నారు. దేశంలోని పేదలు నిరుపేదలుగా మారుతున్నారు. రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడుతున్నారు. చిన్న, మధ్య తరహా వర్తకులు వ్యాపారాలను వదిలేస్తున్నారు. ఉపాధి లేక నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారు. కార్పొరేట్ల ఆస్తులు మాత్రం రెట్టింపవుతూనే వున్నాయి.భారతదేశంలో ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న ముఖేష్‌ అంబానీ లాంటి దేశంలోని 100 మంది అత్యధిక ధనవంతుల ఆస్తి నాలుగో వంతు పెరిగింది. సిరులూరే బాబుల దాపులకైనా చేరలేని ఆకలి అగ్గిలాంటిది. అగ్గికి యేదో ఆహారం వెయ్యకపోతే మనిషినే కాల్చేస్తుంది.ఆకలి నిరుపేదల బతుకులను కాల్చేస్తోంది. ఆకలికి జాలి వుండదు. సృష్టిలో ప్రతి జీవికీ ఆకలి తీరిన మీదటే అన్నీనూ.అయిదేళ్లలోపు పిల్లల మరణాలు ప్రపంచంలో పెద్దసంఖ్య ఇండియాదే. ప్రతి సంవత్సరం సుమారు రెండు కోట్ల 60 లక్షల జననాలు శిశుమరణాలు.దేశంలో 20 శాతం మంది చిన్న పిల్లలు వారానికి ఒక గుడ్డు, రెండు వారాలకు ఒక పండు తినలేని పరిస్థి తిలో ఉన్నారు. వారి ముఖాలు ఏ విటమిన్లు లేక కళ తప్పి కనిపిస్తున్నాయి. ఎందరో శిశువులు ఆకలి తో మరణిస్తున్నారు. 117 దేశాల వరుసలో ఆకలిసూచిలో భారత్‌ 102వ స్థానం.భారతదేశ గోదాముల్లో మూలు గుతున్న ధాన్యాగారాలన్నీ ఎలుకలు, పందికొక్కులు తింటుంటే దేశంలోని అతి పేదలకు ఆహారం దొరకటంలేదు.ప్రతి సంవత్సరం రెండు కోట్ల 60 లక్షల జననాలు నమోదవుతున్నాయి. భూ సంస్కరణలను ప్రభుత్వాలు పూర్తిచేయలేదు. పేదలు వ్యవసాయంలోకి యాంత్రిక పరికరాలు రావడం వల్ల భవన నిర్మాణ కార్మికులుగా రూపొందారు. వ్యవసాయం, భవననిర్మాణం, పరిశ్రమల నిర్మాణం, పోర్టుల నిర్మాణం, సాగినప్పుడే యువతకు పని లభ్యమవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా నవజాత శిశుమరణాల్లో భారత్ ది 27శాతం.అంతర్జాతీయ వ్యాధుల భారంలో అయిదోవంతు. డయేరియా, తట్టు, గవదలు, టైఫాయిడ్‌, పచ్చకామెర్లు, మలేరియా, స్వైన్‌ఫ్లూ, డెంగ్యూల తాకిడితో జనా రోగ్యానికి తీవ్రంగా తూట్లుపడుతున్నాయి. భారత రాజ్యాంగం 45వ అధికరణలో ఆరు సంవత్సరాలోపు బాలబాలికల పరిరక్షణ ప్రభుత్వానిది . 86వ రాజ్యాంగ సవరణతో ప్రభుత్వాలకు నిర్బంధ విద్య బాధ్యత కలిగించింది. భారత్‌ 16 దేశాలతో అణు ఒప్పందాలు చేసు కుంది. అణురియాక్టర్ల దిగుమతికి సులభమైన మార్గదర్శకాలను రూపొందించుకుంది.
పల్లెలూ పట్టణాలన్న తేడా లేకుండా ఇటుకబట్టీలు, రాతిక్వారీలు, గనులు, కార్పెట్లూ బీడీల తయారీ, మరమగ్గాల పనుల్లో ఎందరో బడిఈడు పిల్లలు రెక్కలు ముక్కలు చేసుకుంటూనే ఉన్నారు. బాలలెందరో రెక్కాడితేగాని డొక్కాడని దుస్థితిలో పలుగూ పారా చేతపట్టాల్సి వస్తోంది. నామమాత్ర కూలీకి ఆశపడి చాకిరి యంత్రాల్లా మారాల్సి వస్తోంది.దేశంలో ఉత్తరప్రదేశ్‌ తరవాత బాలకార్మికులు ఎక్కువగా పోగుపడ్డ రాష్ట్రం ఆంధ్రప్రదేశే. ఇక్కడ రమారమి 14లక్షలమంది పిల్లలు వయసుకు మించిన శరీర శ్రమతో కునారిల్లుతున్నారు . ప్రపంచంలోనే అత్యధికంగా ఇండియాలో సుమారు ఆరుకోట్ల మంది పిల్లలు చదువులకు దూరమై సంపాదన వనరులుగా మారి ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. ఎంత బీద తల్లిదండ్రులైనా సంతానం తమకన్నా మెరుగైన స్థితిలో ఉండాలనే కోరుకుంటారు. ఆకలిమంటలు చల్లారే మార్గాంతరం కానరాని దశలోనే లేతరెక్కలు సంపాదన వనరులవుతున్నాయి .
ప్రపంచ ఆకలి సూచీలో మొత్తం 119 దేశాల్లో 100వ స్థానంతో ఉత్తరకొరియా, బంగ్లాదేశ్‌ల కన్నా వెనుకబడి ఉన్నాం.అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నాం. అభివృద్ధి దిశగా అడుగులేస్తున్నాం. కానీ ఆకలిని మాత్రం జయించలేకపోతున్నాం. దేశంలో తిండికి నోచుకోని వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆకలి సూచీలో ఆఖరుకు ఉత్తరకొరియా, బంగ్లాదేశ్‌, నేపాల్‌, ఇరాక్‌ల కన్నా మన దేశం వెనుకబడి ఉంది.సహారాకు దక్షిణాన ఉన్న ఆఫ్రికాలో మాత్రమే ఇంతటి తీవ్రత ఉంది.దేశంలోని ఐదేళ్లలోపు పిల్లల్లో కనీసం ఐదోవంతు ఎదుగుదల లోపంతో బాధపడుతున్న బాలల శాతం 38.4 . ప్రపంచంలో అత్యధికంగా ఆహారాన్ని ఉత్పత్తిచేస్తున్న దేశాల్లో భారత్‌ది రెండోస్థానం. అదే సమయంలో ఎక్కువమంది పౌష్టికాహార లోపంతో బాధపడున్న వారు ఉంటున్న దేశాల్లో భారత్‌ది రెండోస్థానం.దేశంలో దాదాపు 22 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు. అదే సమయంలో ప్రపంచ కుబేరుల్లో దాదాపు 84 మంది భారత్‌లోనే ఉన్నారు. భారతదేశంలోని దాదాపు సగం సంపద కేవలం ఒకే ఒక్క శాతం మంది చేతిలో ఉంది.ధనిక దేశాల జాబితాలో ప్రస్తుతం ఆరోదిగా ఉన్న భారత్‌ 2027 సంవత్సరం నాటికి బ్రిటన్‌, జర్మనీలను అధిగమించి నాలుగో స్థానానికి ఎదగనుందట. భారత జనాభాలో ఒక్కశాతం అపర కుబేరుల చేతుల్లో 22 శాతం మేర సంపద పోగుపడిందట. ఒక దేశం ఎంత సంపన్నమైందో నిర్ధారించడానికి ఇదా సరైన కొలమానం? ఆకలి అనారోగ్యాలు అంతమొందకపోగా ధనిక దేశంగా భారత్‌ పురోగమిస్తున్నదనటం క్రూరపరిహాసం! గ్రామీణుల్లో మూడొంతుల మంది నెలకు అయిదు వేల రూపాయల బొటాబొటీ ఆదాయంతో కాయకష్టంతో బతుకీడుస్తున్నవారే. మూడోవంతు గ్రామీణులకు సెంటు భూమైనా లేక ఆరు లక్షల గ్రామాలపై పేదరికం దట్టంగా ఆవరించింది. దేశంలో దాదాపు 58 శాతం పట్టభద్రులు, 62 శాతం స్నాతకోత్తర పట్టభద్రులు నిరుద్యోగులుగా నిరాశా నిస్పృహల్లో కూరుకుపోతున్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యమంటారు. ఆరోగ్య ర్యాంకుల్లో స్విట్జర్లాండ్‌, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్‌ తొలి వరసకు పోటీపడుతుండగా ఆ జాబితాలో ఎక్కడో అడుగున 131 స్థానంలో, జాతీయ ఆనంద సూచీలో పాక్‌, నేపాల్‌ కన్నా భారత్‌వెనకబడింది.పౌరసత్వాలు,శరణార్ధులు,మతాల గొడవల నుండి పేద ప్రజలందరికీ ఆకలితీర్చే,ఆరోగ్యం కూర్చే దిశగా దేశాన్ని నడిపించటం మంచిది.ఆనందమే జీవిత మకరందం కదా?
--నూర్ బాషా రహంతుల్లా
విశ్రాంత డిప్యూటీ కలక్టర్,6301493266
 https://www.facebook.com/williams32143/posts/2905667139465257

గీటురాయి 17.1.2020