ఈ బ్లాగును సెర్చ్ చేయండి

27, ఫిబ్రవరి 2020, గురువారం

సారె జహాసే అచ్చా హిందూ సితా హమారా!


సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా! (సూర్య 1.3.2020)


ఢిల్లీలో ట్రంప్ యాత్ర కొనసాగుతుండగానే మరోపక్క మత కలహాలు జరిగి కొంతమంది చనిపోయారు.శాంతి వహించాలని నేతలందరూ ప్రజలకు మనవిచేశారు. గతంలో నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళిన మోడీ ఆదేశానికి వస్తూపోతూ ఉంటానని చెప్పినప్పుడు, అంబానీసోదరులు విడిపోయి,తమ్ముడు దివాలాతీస్తే అన్న సహాయంచేసినప్పుడు ప్రజలలో సంతోషం వెల్లివీరిసింది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు!ఎంత మనోహరము! అని బైబిల్ వాక్యం. పైడిమర్రి వెంకట సుబ్బారావు  రాసిన ఈ ప్రతిజ్న మన పాఠ్య పుస్తకాలలో ఉండేది.దానిని పిల్లలతో కంఠతా పట్టించేవారు:
“భారత దేశము నా మాతృభూమి.భారతీయులందరూ నా సహోదరులు,
అన్నదమ్ములు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను.సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణము.
దీనికి అర్హుడనగుటకై సర్వదా నేను కృషి చేయుదును.నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరిని గౌరవింతును.ప్రతివారితోను మర్యాదగా నడచుకొందును.నా దేశముపట్లను, నా ప్రజలపట్లను సేవానిరతి కలిగియుందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను.వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందమునకు మూలము.”
క్షీరసాగరమదనం నాటినుంచీ ఈ అన్నదమ్ముల పోరాటం జరుగుతూనే ఉంది.భూమిమీద మొదటి అన్నదమ్ములు కయీను హేబేలు.అన్న తమ్ముడిని చంపి మొదటి హంతకుడయ్యాడట.అప్పుడు అంత అవసరం ఏమివచ్చింది?జనాభా ఎక్కువయ్యిందా అంటే వాళ్ళిద్దరే సంతానమట.ఆస్తులు ఏమన్నా దోచుకోటానికా అంటే విస్తారమైన భూభాగం పంచుకోగలిగినంత ఉంది.మరెందుకు ఈ కక్ష? ఇటు క్రైస్తవులు అటు ముస్లిములు కూడా తమలేఖనాలనుబట్టి సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు.కేవలం దేవుడే కారణమట.ఆయన హెబేలు తనకు బలి ఇచ్చిన గొర్రెను అంగీకరించి,కయీను అర్పించిన పంటకు ప్రాధాన్యత ఇవ్వలేదట.దానితో కయీనుకు అసూయరేగి తమ్ముడు హెబేలును చంపేశాడట.
 తోబుట్టువుల డిష్యూం..డిష్యూం జీవితాంతం ఉంటుందిఅంటున్నారు మానసిక నిపుణులు. చిన్నప్పటినుంచి  తోబుట్టువుల మధ్య గొడవలూ, కొట్లాటల మూలాలు మనసు లోలోతుల్లో రహస్యంగా ఎదుగుతాయి. పెద్దయ్యాక విషం కక్కే కొమ్మలవుతాయి. మరి వాటిని మొగ్గలోనే తుంచటం దేవుడి వల్లా కాలేదు. తల్లిదండ్రులు ఇద్దరిలో ఒకరిపై చూపే ఎక్కువ ప్రేమ ఈ అసూయకు కారణం. దేవుడు కూడా ఒకరి వైపు నిలవటం భక్తులు పక్షపాతంగా భావిస్తారు.దేవుడిని ఏమీ చేయలేక సోదర భక్తుడిని హతమారుస్తారు.తమకు పోటీ లేకుండా అవతలి మతం సోదర భక్తులను తుడిచేసి ఆ హత్యాకాండకూడా  గొప్పభక్తి అనుకుంటాడు.
పిల్లల్లో కామం, క్రోధం, ఈర్షా, అసూయ వంటివన్నీ ఉంటాయి. ఇంటికి తనే మహారాజునని అనుకునేవాడికి రెండోవాడు పోటీగా పుడితే కంటగింపు, కొత్తగా వచ్చిన  పాపాయిపై తల్లిదండ్రులు అకస్మాత్తుగా ప్రేమ కురిపించడాన్ని తట్టుకోలేడు. కోపం, దిగులూ పెంచుకుంటాడు. అతని పనులు తనకు అప్పగిస్తే అలుగుతాడు. అమ్మానాన్నా ఇదివరకటిలా తనని ముద్దుచేయడం లేదని బాధపడి అంతర్లీనంగా కొత్త పాపాయిమీద కోపం పెంచుకుంటాడు. బిడ్డల్లో ఎవరిమీదనానా కాస్త ఎక్కువ ప్రేమ ఉంటే తట్టుకోలేరు. బయటికి చెప్పుకోలేరు. లోలోన ద్వేషం పెంచుకుంటారు.ఒకరు వికలాంగులైతే రెండోవారిలో ద్వేషాన్ని పెంచుతుంది. చంపాలనేంత కసి పెరుగుతుంది.కొందరు పిల్లలకు జన్యుపరంగానే అసూయా, ద్వేషం, కోపం ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్లు సహజంగానే తోబుట్టువులతో గొడవ పడతారు. ఆ అయిష్టతే పెద్దయ్యే కొద్దీ తీవ్ర ద్వేషంగా మారుతుంది. అన్నాచెల్లీ, అక్కా తమ్ముడి మధ్య తగవులు రావటం తప్పనిసరి . పిల్లలు తోబుట్టువుపై ద్వేషం పెంచుకొని  కొడతారు.పై నుంచి కిందకి తోసేస్తారు. చాడీలు చెబుతారు.నోటు పుస్తకాలని చించేస్తారు. సూటిపోటి మాటలతో వెక్కిరిస్తారు. ఈ గొడవలు చూసే ఎక్కువమంది పిల్లలు వద్దు,ఒక్క బిడ్డ చాలని తల్లిదండ్రులు  అనుకుంటున్నారు.
            “ బాబ్రీ మసీదు నేలమట్టం తరువాత దేశంలో హిందూ ముస్లింల మధ్యగల సామరస్య వాతావరణానికి తీవ్ర విఘాతం కలిగింది. ముస్లింలు మనుషులు కారా ? వారికి ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు ఉండవా ? ఎందుకు సోదర భావంతో మెలగుతున్న వారిని విడగొట్టడం ? దేశానికి హిందువులు అజంతా, ఎల్లోరాలనిస్తే, ముస్లింలు తాజ్ మహల్, కుతుబ్ మీనార్ లను ఇచ్చారు. హిందువులు కె.ఎల్. సైగల్, మన్నాడే లాంటి అద్భుత గాయకులనిస్తే, ముస్లింలు రఫీ, నౌషాద్ లనిచ్చారు. హిందువులు లతామంగేష్కర్ నిస్తే, ముస్లింలు నూర్జహాన్ నిచ్చారు. ఒకరు గవాస్కర్ నిస్తే మరొకరు అజహరుద్దీన్ నిచ్చారు. ఇలా ఏ రంగంలో చూసుకున్నా ముస్లింల ప్రతిభ కనబడుతుంది. వారిపై కక్ష గట్టడం భావ్యమా ?” అని వి.పి.సింగ్ అన్నారు.  అమెరికాలో మన రాయభారిగా పనిచేసిన ఆబిద్ హుస్సేన్ వాషింగ్టన్ ప్రముఖ వర్గాల్లో తలలో నాలుకగా మెలగి భారత ప్రతిష్టను ఇనుమడింపజేశారు.ఆబిద్ హుస్సేన్ భారత్ – అమెరికాల మధ్య అవగాహన వారధిని పటిష్టం చేశారు.
            ఎవరు ఎన్ని విధాలుగా చెబుతున్నప్పటికీ మత సామరస్యం అనేది నాయకుల ప్రసంగాలలోను, కవుల కల్పనల్లోను కనిపిస్తున్నదే గాని, వర్తమాన సమాజంలో కలికానిక్కూడా కానరావడం లేదు. సామరస్య సాధనకోసం త్యాగధనులు కొందరు శ్రమించి బలై పోతున్నారు. మరోవైపు మతపిచ్చి పట్టిన నరరూప రాక్షసుల హింసాబోధనలకు ప్రేరితులైన యువతరం భ్రష్టుపట్టిపోతున్నది. “ఉంటే హిందువులుగా ఉండండి లేదా పాకిస్తాన్ కి వెళ్ళిపోండి”,“మా దగ్గర మూడువేల మసీదుల జాబితా ఉంది, వాటిని మేము కూలగొట్టాలి” లాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడేవాళ్లు కాస్త తగ్గాలి. మత సామరస్యం వెల్లివిరియాలి. అంటే దేశం కోసం సేవలందించినవారిని సమాదరించాలి. “మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి మమ్మావల పారబోతురు గదా నరజాతికి నీతి యున్నదా” అని నోరులేని పువ్వులుకూడా విలపించాయట. హత్యాకాండలు చూసిన భారతీయ సమాజం “పోతే పోనీ పోరా, ఈ పాపపు జగతిన శాశ్వతమెవడురా” అనే నిర్వేదంలో పడిపోయినా సరే , “సారే జహాసే అచ్చా, హిందూసితా హమారా” అనే ఇక్బాల్ గీతం భారతీయుల మనోభిప్రాయాన్ని ఆశా గీతంలా సదా వినిపిస్తూనే ఉంది.

--  నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266

19, ఫిబ్రవరి 2020, బుధవారం

శాంతికోసం పాలస్తీనా, కుర్దిస్థాన్ దేశాలు ఏర్పడాలి

ఆదేశాల ఏర్పాటుతో శాంతి (సూర్య 23.2.2020)

శాంతికోసం పాలస్తీనా, కుర్దిస్థాన్ దేశాలు ఏర్పడాలి
పాలస్తీనా-ఇజ్రాయిల్‌ మధ్య మంటలు దశాబ్దాలుగా ఆరని కారుచిచ్చులా రగులుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇశ్రాయెల్ , పాలస్తీనా రెండింటిని 'స్వతంత్ర రాజ్యాలు'గా గుర్తించానన్నాడు. అతని దృష్టి మొత్తం ఇజ్రాయిల్‌ పక్షమే. 2017లో ఇజ్రాయిల్‌ జెరూసలేం లో తన రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది . ట్రంప్ రెండు స్వతంత్ర రాజ్యాల ప్రతిపాదన ప్రకారం పాలస్తీనియన్లు తమ భూభాగాలను ఇంకా వదులుకోవాలి. వెస్ట్‌ బ్యాంకు లోని యూదుల సెటిల్‌మెంట్లతో పాటు జోర్డాన్‌ లోయను కూడా ఇజ్రాయిల్‌కు పాలస్తీనా వదులుకోవాల్సి వస్తుంది. తూర్పు జెరూసలేం పాలస్తీనియన్ల రాజధాని అవుతుందట. మిగతా జెరూసలేం ఇజ్రాయిల్‌కు రాజధాని కావాలట . ఇజ్రాయిలీలకు జెరూసలేం ఎంత పవిత్రమైనదో.పాలస్తీనీయన్లకూ అంతే పవిత్రమైనది. ఇది ఇరువురికీ అత్యంత ముఖ్యమైన ప్రాంతం. అలాంటి పవిత్రస్థలంపై మీకు హక్కు లేదంటే ఎలా?
గాజాను విస్తరించటానికి ఇజ్రాయిల్‌లో ఉన్న అరబ్‌ పట్టణాలతో వెస్ట్‌బ్యాంకు లోని ప్రాంతాలను మార్పిడి చేసుకొనే ప్రతిపాదన వల్ల 30 శాతం వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతాన్ని పాలస్తీనా కోల్పోతుంది. పాలస్తీనా స్వతంత్ర పోరాటంలో వివిధ దేశాలకు తలదాచుకునేందుకు వెళ్లిన పాలస్తీనియన్లు తిరిగి తమ సొంత గడ్డపై అడుగు పెట్టేందుకు వీల్లేదట. శరణార్థులు ఎవ్వరైనా తమ సొంత స్థలాలకు వెళ్లడం అంతర్జాతీయంగా ఆమోదయోగ్యమైన హక్కు. ఇజ్రాయిల్‌ చేతిలో హత్యకు గురైన బాధిత కుటుంబాలకు సాయం చేయరాదట. ఇజ్రాయిల్‌ జైళ్లలో బందీలుగా ఉన్న పాలస్తీనియన్లపై అమానుష చర్యలను అంతర్జాతీయ వేదికలపై నిలదీయరాదట. స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవించ వచ్చుననే ఆకాంక్షతో ఒకవేళ ట్రంప్‌ ప్రతిపాదనలన్నిటిని పాలస్తీనా అంగీకరిస్తే ఇప్పుడున్న స్వేచ్ఛ, స్వతంత్రత కూడా అది కోల్పోవడం ఖాయం. చుట్టూతా ఉన్న ప్రాంతాలన్నీ ఇజ్రాయిల్‌ ఖాతా లోకి వెళ్లడం వల్ల కుచించుకుపోయిన వెస్ట్‌బ్యాంకుతో పాలస్తీనా ఇజ్రాయిల్‌ చేతిలో ఒక బందీ లాగా బతుకు వెళ్లదీయాల్సిందే. ఆ కొంచం కూడ కబళించెస్తే ,పాలస్తీనా అనే దేశమే ఉండదు . చిన్నప్పుడు మూడవతరగతిలో బలిచక్రవర్తిని భూమిలోకి తోక్కెసిన వామనావతారం,ముందు ముడ్డి పెట్టుకోటానికి చోటు అడిగి చివరికి అరేబియావానిని బయటికి నెట్టేసి పూర్తిగా గుడారాన్ని ఆక్రమించిన ఒ౦టె కధ చెప్పేవారు. అలాగే దేవుడు తమజాతికి ఏనాడో చేసిన వాగ్దాన భూమి అంటూ ఇస్రాయెల్ దేశం అమెరికా వత్తాసుతో పాలస్తీనాను క్రమంగా ఆక్రమిచింది. ఐరాస ఏమీ చేయలేక ఊరుకుంది.చుట్టూ ఉన్న అరబ్ దేశాలు తమ తమ అంతర్గత యుద్ధాలలో మునిగితేలుతూ పాలస్తీనాకు ఏమీ చేయలేదు.1946 లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటినుండి పాలస్తీనా ఎలా చిక్కిశల్యమైపోయిందో చూడండి:
 
ఇప్పుడు అక్కడి దేశం వాస్తవానికి ఇజ్రాయెలే. ఎక్కడెక్కడో చెదిరిపోయిన యూదులు ఇశ్రాయెల్ వచ్చి దేశాన్ని ఏర్పాటుచేసుకోగా అక్కడ ఉన్న పాలస్తీనీయులు పలుదేశాల్లో చెల్లాచెదురు అయ్యారు. మిగిలిన అవశేష పాలస్తీనా అయినా ఈనాటికీ స్వతంత్ర రాజ్యం కాలేదు. చిత్రమేమంటే ప్రపంచంలో ఇజ్రాయెల్‌ ఒక్కటే కుర్దుల రిఫరెండాన్ని సమర్ధించింది. కుర్దులు , పాలస్తీనీయులు తమ భూభాగాలలోనే శరణార్ధుల్లాగా బ్రతుకుతున్నారు. ఇరాక్, ఇరాన్, టర్కీ, సిరియాలు కుర్డుల భూభాగాలను కలిపేసుకున్నాయి. కుర్దులు,పాలస్తీనీయులు తీవ్ర అణచివేతనూ, వేధింపులనూ ఎదుర్కొంటున్నారు. స్వతంత్ర పాలస్తీనా, స్వతంత్ర కుర్దిస్తాన్‌ ఏర్పాటు అమెరికాకు ఇష్టం లేదు.జాతుల స్వయంప్రతిపత్తిని గౌరవిస్తేనే ప్రశాంతత ఏర్పడుతుంది.ఐక్యరాజ్యసమితి వాయిదాలతో పొద్దుపుచ్చకూడదు. చరిత్ర పొడవునా రణరంగం యుద్ధాలేనా? యుద్ధాల వల్ల ఏమి సాధించాము ? ఒక మనిషిపై మరో మనిషి అధికారం, ఒక జాతిపై మరొకజాతి ఆధిపత్యం ఇంకా చెల్లాలా? ఏ యుద్ధమూ మానవజాతి మనుగడకోసం కాదు.యుద్ధాలలో జరిగేది నరబలి,మానవ హననమే. అశోకుడు యుద్ధంలో జరిగిన మారణ కాండను, రక్తపాతాన్ని చూసి శాంతి మార్గంలోకి మారాడట. ఆర్య ద్రవిడుల యుద్ధాల వల్ల ఫలితం ఏమీలేదు. అమెరికన్లు నీగ్రోలపై శ్వేతజాతి ఆధిపత్యాన్ని చూపారు. జాత్యహంకారంతో హిట్లర్ నియంతగా మారి లక్షలాది మందిని చంపించాడు. రష్యా, చైనాల్లో జరిగిన సాయుధ విప్లవాల్లో ఎంతో జన నష్టం జరిగింది. ప్రపంచాన్ని ఆయుధాలతో నింపుతూనే ఉన్నా రు. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ సామ్రాజ్యవాద,ఆధిపత్య ధోరణినే చూపిస్తున్నారు.ప్రాణ నష్టంతో పాటు,వేలఏళ్లు శ్రామికులు కష్టపడి నిర్మించిన నాగరికత కూడా ఎందుకు నాశనమై పోవాలి? ఎవరికి ప్రయోజనం?ఎప్పుడూ తుపాకులతో కొట్టుకు చచ్చే వీళ్ళకు దేశాలెందుకు అనిపించవచ్చు. యుద్ధం ఆటవికం, శాంతి ప్రజాస్వామికం. శాంతి సామరస్యాలు ప్రజాస్వామ్య మూలగుణాలు.అందరినీ సుఖంగా బ్రతకనివ్వటమే నాగరికత . భూతాపం(గ్లోబల్ వార్మింగ్‌ ) తో భూగోళంపై మాన వ జాతి ఇంకో 200 ఏళ్ళు మాత్రమే ఉంటుందని శాస్త్రజ్నులు చెప్పారు.మన దేశాల అధిపతులు ఇది గుర్తెరిగి, శాంతిదూతలు, మానవతా మూర్తులు కావాలి.ప్రపంచ దేశాలలో యుద్ధ తాపాలను తగ్గించటం కూడా ఐరాస బాధ్యతల్లో ఒకటి.
 నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266