ఈ బ్లాగును సెర్చ్ చేయండి

24, జులై 2020, శుక్రవారం

ఇంటికో దోమల బ్యాటు ఇప్పించండి


ఇంటికో దోమల బ్యాటు ఇప్పించండి
ప్రపంచ విజేత అలెగ్జాండర్ ఒక చిన్న దోమ చేతిలో చనిపోయాడని మనకు పాఠాలు నేర్పారు. 2030 సంవత్సరం నాటికి దేశంనుంచి మలేరియాను తుడిచిపెడతామని మోదీ ప్రభుత్వం ప్రతిన పూనింది. మానవాళికి మహా శత్రువులు దోమలు.దేశంనుండి దోమలను నిర్మూలించటానికి మేమేం దేవుళ్ళము కాదు.దేవుడుమాత్రమే చేయగలపని మమ్మల్ని అడగొద్దు అని దానేష్ ఈషేదాన్ కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.సౌరబ్ గంగూలీ ఇంట్లో కూడా డెంగీ దోమలున్నాయని, దోమలు 290 మీటర్ల ఎత్తులో గాలిలో ఎగురుతూ కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణిస్తాయని వాటికి ఎవరిరక్తాన్ని పీల్చాలో కూడా తెలుసని శాస్త్రవేత్తలు తేల్చారు. దోమకాటుతో మరణం ప్రమాదంతో సమానమని జాతీయ వినియోగదారుల కమీషన్ తీర్పు నిచ్చింది.మనిషికో పది దోమలను చేతులతో కొట్టి చంపండి అని గతంలో రోశయ్య గారు అన్నారు. చేతులతో చంపలేము.దోమలపై దండయాత్ర అనే కార్యక్రమాన్ని గతంలో లోకేశ్ బాబుకూడా కొన్నాళ్లు నడిపారు స్వఛ్చభారత కార్యక్రమం మొదలుపెట్టిన మోడీ కరోనా సొంత ఉత్పత్తులపై ఆధారపడటాన్ని నేర్పిందన్నారు. భారత్‌పై పడుతున్న ఆర్థిక భారం ఏటా మలేరియాకు 12 వేలకోట్లు డెంగీ కి 7వేల కోట్లు. దోమలు పుట్టుకొచ్చే ప్రాంతాల్ని ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా కనిపెట్టాలన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నిపుణుల ప్రతిపాదన ఆమలులోకి తేవాలి .
తెలుగు నేలపైనే మలేరియా పరాన్నజీవి ప్లాస్మోడియం ను నోబెల్‌విజేత సర్‌ రోనాల్డ్‌ రాస్‌ కనుక్కున్నారు . దేశానికి స్వాతంత్య్రం లభించే సమయానికి ఏటా ఏడున్నర కోట్ల మలేరియా కేసులు, ఎనిమిది లక్షల వరకు మరణాలు ఉండేవి. మలేరియా ముప్పు అన్నిరాష్ట్రాలలో తీవ్రతరంగా ఉంది.ప్రతి ఆరుగురిలో ఒకరు దోమకాటుకు గురవుతూ ఏటా రూ.15 వేలకోట్ల దాకా ఉత్పాదకతను నష్టపోతున్న దేశం మనది. దేశం నుంచి మలేరియాను పారదోలడానికి లక్షా పాతిక వేల కోట్ల రూపాయల దాకా ఖర్చుపెట్టాల్సి ఉంటుంది.తేమ వాతావరణంలో, చిత్తడి నేలల్లో దోమ తాకిడి జోరెత్తుతుంది.ఇండియా కన్నా నాలుగింతలు ఎక్కువ వర్షపాతం, భూభాగంలో అధిక అడవుల శాతం కలిగిన శ్రీలంక మూడేళ్ల క్రితమే మలేరియాను అరికట్టగలిగింది. ఇప్పటివరకు కరోనాతో ప్రపంచంలో 6.32 లక్షల మంది ,అమెరికాలోనే 1.46 లక్షల మంది,ఇండియాలో 29 వేల మంది చనిపోయారు. రానున్న రోజుల్లో కరోనా రానివారంటూ ఎవ్వరూ ఉండరు. మలేరియా జ్వరం లాగే అది కూడా వస్తుంది పోతుంది . కరోనాతో కలిసి జీవించక తప్పదు అంటున్నారు .మలేరియా నివారణ కోసం కనీసం ఇంటింటా దోమలబ్యాట్లు ఉండక తప్పదు.ప్రతి ఏటా మలేరియా చాలా మందికి జీవన్మరణ సమస్యగా పరిణమించింది. గిరిజన ప్రాంతంలో కష్టాలు తీవ్రంగా వున్నాయి. జగన్ గారి పచ్చతోరణం లో రెండు కోట్ల మొక్కలు నాటుతామన్నారు.మన్యం అడవుల్లో క్లోరోక్వీన్ మందును అందించే సింకోనా మొక్కలు భారీ ఎత్తున పెంచాలన్న శాస్త్రవేత్తల సూచన అమలు కాలేదు.గిరిజనులకు మందు పూసిన దోమలతెరలు ఇస్తున్నారు.గిరిజనులకు సింకోనా మొక్కల బెరడు తీసే పని అప్పగించవచ్చు,మన్యంప్రజలచేత దోమల బ్యాట్లు ,మందులు తయారుచేయించవచ్చు.
చైనాతో గొడవలు మొదలయ్యాక మన మార్కెట్లో దోమల బ్యాట్లు లేవు.గతంలో చైనా బ్యాట్లు వందరూపాయలకు దొరికేవి.ఇప్పుడు నిప్పో బ్యాటు వెయ్యి రూపాయలట.లేదా ఇంటర్నెట్ లో అమెజాన్ వాళ్ళకు ఆర్డరిచ్చి తెప్పించుకోవాలి.సామాన్యులు వాడే దోమల బ్యాట్లు ఎక్కువ ధర పెట్టి కొనక తప్పటం లేదు.కాబట్టి కుటీరపరిశ్రమలలో చైనాతో పోటీపడి,సబ్సిడీ ఇచ్చి,పన్నులు తగ్గించి చౌక ధరలకు దోమలబ్యాట్లు సరఫరా చేయించాలి.దేశం సాధించిన వైజ్ఞానిక పురోగతి మలేరియాను నిర్మూలించలేక బాధపెడుతోంది.కరోనా కాలంలో వానలు కురుస్తున్నాయి.వర్షాలతోపాటు విషజ్వరాలు కమ్ముకుంటాయి. ముసురుపట్టి మన్యంతోపాటు,పల్లపు ప్రాంతాలు వణుకుతున్నాయి.కరోనా క్రిమికి అమెరికాలాంటి చల్లటి దేశమే హాయి,భారతదేశపు వేడి ఎండ గిట్టదంటే బతికిపోయామని అనుకున్నాం.గాలిద్వారా,మురుగునీటి పైపులద్వారా కూడా కరోనా పాకుతుందని క్రమేణా వార్తలు వచ్చాయి. చెత్త పోగుపడి దోమల సంతతి పెరగకుండా పారిశుద్య కూలీలు శ్రామిస్తూనే ఉన్నారు. డెంగీ, మలేరియా కేసులు పెరగకుండా ఇళ్ల చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకూడదని మున్సిపాలిటీ వారు మైకు ప్రచారం చేస్తున్నారు.
దోమకాటుతో కరోనా రాదని ఓదార్పు పొందినా మలేరియా, డెంగూ,జీకా,చికన్ గున్యా , మెదడు వాపుల వంటి ప్రాణాంతక వ్యాధులు కాచుకొని ఉన్నాయి. సంవత్సరం పొడవునా అనునిత్యం మనుషుల్ని వేధించే దోమల నుండి ప్రజలను కాపాడుకోవాలి. దోమలసీజన్ నిరంతరాయంగా దేశంలో తిష్టవేసి ఉన్నందువలన దోమల బ్యాట్లతయారీదారుల్ని,యువకుల్నీ ఆహ్వానించాలి.దోమల బ్యాట్లు తయారుచేసే కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి.ఇది దేశ ప్రజల తక్షణ అవసరం.భారతీయ వైద్యులందరూ దోమల బ్యాట్ల తయారీకి మద్దతు తెలపాలి.ప్రభుత్వానికి సిఫారసు చెయ్యాలి.ప్రజల ప్రాణ రక్షణ కోసం ఏదేశపు ఉత్పత్తినైనా వ్యాక్సిన్లనైనా వాడుకోవలసిందే.ప్రజలప్రాణ రక్షణకోసం ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ వాడుతాం, ఊహాన్ వ్యాక్సిన్ ను కూడా వాడుతామని ట్రంప్ చైనా రాయబారకార్యాలయాన్ని మూయించాకకూడా అన్నారు. ప్రాణరక్షక మందుల్ని నిత్యావసరాలను వాడుకోవచ్చు.యుద్ధ ఆయుధాలకు ప్రాణ రక్షక మందులకు ఎంతో తేడా ఉంది. మనుషులతో యుద్ధానికి - క్రిములు,దోమలతో యుద్ధానికి తేడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా దోమ కోట్లమందిని చంపింది. దోమలకు గిట్టని వాసన అంటూ ప్రజలు వేప, కొబ్బరి, నిమ్మ, యూకలిప్టస్‌ నూనెల్ని వాడుతున్నారు.లార్వా దశలోని దోమల్ని మటుమాయం చేస్తాయని చెరువుల్లోకి గంబూషియా చేపల్ని వదిలారు.సెప్టిక్‌ ట్యాంకుల పైపుల పైభాగంలో తీగల వలలు బిగించారు. రసాయనాలు కలిపిన కోడి ఈకల‘స్వీట్‌ కేకు’ దోమల లార్వా నియంత్రణకోసం పెట్టారు. బోదకాలు వ్యాధి మందు ఎవర్ మెక్టిన్ వాడిన రోగుల రక్తం తాగిన దోమలు 14 రోజుల్లోనే చనిపోతున్నట్లు తెలుసుకున్నారు. దోమల మందు లిక్విడ్‌,ఆయిల్ బాల్స్, కాయిల్స్‌ , డీడీటీ, ఫాగింగ్‌, దోమతెరలు.స్ప్రేలు,క్రీములు,టాయిలెట్ల గొట్టాలపై తీగల వలలు,దోమల బ్యాటులు లాంటి వాటితో మనిషి దోమలపై యుద్ధంచేస్తూనే వస్తున్నాడు. చివరికి ఆర్టీఎస్ అనే మలేరియా వ్యాక్సిన్ తయారుచేసి మలావి,ఘనా,కెన్యాలో పిల్లలకు వేశారట.దోమలబాధతో పాటు కరోనా లాక్ డౌన్లు తోడై దేశం అల్లాడుతోంది. ఇళ్ల లోపల,వెలుపల ప్రజలు దోమలను చంపే పనులు చేయనివ్వాలి.ప్రతి ఇంటికీ ఒక దోమలబ్యాట్ ను


ఉచితంగా గానీ చౌకధరకు గానీ ఇప్పిస్తే మంచిది.
 నూర్ బాషా రహంతుల్లా , విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ , 6301493266

13, జులై 2020, సోమవారం

కొత్తజిల్లాల ఏర్పాటుతో ప్రజలకు దూరం తగ్గాలి



కొత్తజిల్లాల ఏర్పాటుతో ప్రజలకు దూరం తగ్గాలి
దేశంలో ఇప్పుడు 543 పార్లమెంటు స్థానాలు 739 జిల్లాలున్నాయి.అంటే పార్లమెంటు స్థానాల కంటే జిల్లాలే ఎక్కువ ఉన్నాయి. పార్లమెంటు స్థానానికి సగటు వైశాల్యం 6054 చదరపు కి.మీ ఉంటే జిల్లాల సగటు వైశాల్యం 4459చ,కి,మీ.ఉంది. తెలంగాణాలో 17 పార్లమెంటు స్థానాలకు 33 కొత్తజిల్లాలు చేశాక వారి జిల్లాల సగటు విస్తీర్ణం 3396 చదరపు కిలోమీటర్లకు బాగా తగ్గిపోయింది.ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలు ఏర్పడినా వాటి సగటు వైశాల్యం 6162 చ.కి.మీ.లు ఉంటుంది.తెలంగాణా లాగా కావాలంటే ఆంధ్రకు 47 జిల్లాలు వస్తాయి.పార్లమెంటు స్థానాలు 2026 లో మారినా మారకపోయినా తెలంగాణాకు కొత్త జిల్లాల అవసరం ఇప్పట్లో రాదు.ఎందుకు ఇన్ని జిల్లాలు అనుకోవద్దు. జిల్లా కేంద్రం అంటే జిల్లా అభివృద్ధికి కేంద్రం.సాధారణంగా రాజధాని చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతం అవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అంతా రాజధాని హైదరాబాద్‌ కేంద్రంగానే జరిగింది.జనాభాలో ఆంధ్రా కంటే చిన్న రాష్ట్రాలైన అరుణాచలప్రదేశ్ లో 25జిల్లాలు, పంజాబ్ లో 22,హర్యానాలో 22,చత్తీస్ గడ్ లో 28 , జార్ఖండ్ లో 24 , అస్సాం లో 33 , తమిళనాడులో 38, కర్ణాటకలో 30 , ఒరిస్సాలో 30 ,కేరళలో 14,మణిపూర్ లో 16 ,తెలంగాణాలో ౩౩ జిల్లాలు ఉన్నాయి.అలాగే విస్తీర్ణంలో ఆంధ్రా కంటే చిన్న రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ లో 55 , తమిళనాడులో 38, రాజస్ధాన్ లో 33, కర్ణాటక లో 30, గుజరాత్ లో 33 , ఒడిషా లో 30, అస్సాం లో 33, చత్తీస్ గడ్ లో 28, తెలంగాణాలో ౩౩ జిల్లాలున్నాయి. సాధారణంగా ఒక జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. తెలంగాణాలో అయితే రెండు నియోజకవర్గాలతో కూడా జిల్లా ఏర్పడింది.
1956 లో మనరాష్ట్రం ఏర్పడింది మొదలు ఈ 64 ఏళ్ళ కాలం లో కేవలం రెండే జిల్లాలు కొత్తగా ఏర్పాటయ్యాయి.అవి ప్రకాశం (1970), విజయనగరం (1979) జిల్లాలు.కొత్త జిల్లాల ఏర్పాటు సమస్య మన రాష్ట్రం లో అలా నానుతూనే ఉంది.ఎన్టీఆర్ మండలాల స్థాపనకు తెలుగు జనం అంతా హర్షించారు. ఇప్పుడు13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 26 జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నారు. 2008 లో బొబ్బిలి,పార్వతీపురం.తెనాలి లోక్ సభ నియోజకవర్గాలను రద్దుచేశారు.ఇప్పుడు కొత్తగా జిల్లా కేంద్రాలుగా మారే 12 పార్లమెంటు నియోజకవర్గాలు ఇవి : 1 అరకు 2 బాపట్ల3 అనకాపల్లి 4 అమలాపురం 5 హిందూపురం 6 నంద్యాల 7 నరసాపురం 8 నరసరావుపేట9రాజమండ్రి 10 రాజంపేట 11 తిరుపతి 12 విజయవాడ. ఇప్పుడు నెట్లో లోక్ సభ నియోజకవర్గాలలోని ఓటర్ల సంఖ్య , గెలిచిన అభ్యర్ధులు వారి పార్టీల సమాచారం దొరుకుతుంది కానీ నియోజకవర్గాల విస్తీర్ణాలు దొరకటంలేదు. వీటిపై సమగ్ర అధ్యయనం చేసి మార్చి 2021 నాటికి రిపోర్టు సమర్పించే కమిటీకి నియోజకవర్గాల విస్తీర్ణాలు పోల్చి చూసుకోవడం పెద్ద పని
.
కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన పక్షంలో పాలనా భవనాలు లాంటి మౌలిక సదుపాయల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు ఒక్కసారి చేసే పెట్టుబడి మాత్రమే. కానీ దీనివల్ల అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు పొందే శాశ్వత ప్రయోజనాలు చాలా ఉన్నాయి.వెనుకబడిన ప్రాంతాలను అభివద్ధి చేయాలన్న లక్ష్యంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని సిఎం తెలిపారు. చిన్న జిల్లాలు పరిపాలనను సులభ సాధ్యం చేస్తాయి.ప్రజలకు దూరం భారం తగ్గుతాయి. అరకు పార్లమెంటు నియోజకవర్గం శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం ,అనకాపల్లి,రాజమండ్రి , ఏలూరు అనే నాలుగు జిల్లాల పొడవునా కొండల్లో ఉంటుంది.రోగులను ఆసుపత్రికి తీసుకెళ్ళటానికి అంబులెన్సులు వెళ్ళక రోడ్లులేక డోలీలమీద మోసుకెళుతూ ఉంటారు. అరకు జిల్లా సరిహద్దులో 6 జిల్లాలు ఉంటాయని ఏ జిల్లా సరిహద్దులో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలను పక్కనే ఉన్న ఆ జిల్లాలోనే కలిపి కొండ ప్రాంతాలలో గిరిజన ప్రజలకు దూరం తగ్గటం కోసం పుష్పశ్రీ వాణి అభ్యర్ధన మేరకు అరకు నియోజకవర్గాన్ని రెండు జిల్లాలు చేద్దామని ఈ ప్రాంత సమస్యను అర్ధం చేసుకున్న జగన్ సూచించారు . జిల్లాల విభజన వల్ల తమ జిల్లా అభివృద్ధి కుంటుపడుతుందన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు,స్పీకర్ తమ్మినేని సీతారాం లాంటి వారికి జవాబుగా హైదరాబాదు రాజధానిగా ఉన్నప్పుడు చిత్తూరు శ్రీకాకుళం వాళ్ళు దూరం గురించి బాధపడకుండా వెళ్ళి వచ్చారు కదా? చిన్న చిన్న సమస్యలను పట్టించుకోవద్దు అని ముఖ్యమంత్రి సర్ది చెప్పారు.ఒంగోలు కు దగ్గరగా ఉండే సంతనూతలపాడు(13) అద్దంకి(37) లను 84 కి.మీ.దూరంలో ఉండే బాపట్లలో కాకుండా ఒంగోలు జిల్లా లోనే ఉంచాలనే డిమాండును ఆదిలోనే కాదన్నారు.
కోర్కెలు అనంతములు అన్నట్లు వివిధ ప్రాంతాలలో తమకు జిల్లాలు కావాలని డిమాండ్లు వస్తున్నాయి.అరకు బదులు పాడేరు,పాలకొండ,పార్వతీపురం లలో జిల్లాకేంద్రంఏర్పాటుచెయ్యమని,పార్వతీపురం,పుట్టపర్తి,రాయచూరు,మదనపల్లె,ప్రొద్దుటూరు లను జిల్లాలు చేయాలని కోరుతున్నారు.బాపట్ల,నరసాపురం బదులు రైల్వే జంక్షన్లు అయిన తెనాలి,భీమవరాలను జిల్లాలు చేయాలని, నూజివీడును ఏలూరులో కాకుండా విజయవాడలోనే ఉంచాలని,తాడేపల్లి మంగళగిరి మండలాలను విజయవాడ జిల్లాలో కలపాలని రకరకాల కోర్కెలు స్థానికులు అడుగుతున్నారు. అయితే ప్రజల సౌకర్యం కోసం ఏ గ్రామాలనైనా మండలాలనైనా ఒక జిల్లాలో కలపడానికి తక్కువ దూరమే శాస్త్రీయ నిర్ణయం కావాలి . కులాలు,రాజకీయ సమీకరణాలు కాదు. పార్లమెంటు స్థానాలు జిల్లాలు అయితే అసెంబ్లీ స్థానాలకు జిల్లాకేంద్రం దూరం తగ్గాలి.దూరం పెరిగిందంటే ప్రజలకు దీర్ఘకాల నష్టమే. 100 కి.మీ దూరం పైబడిన అసెంబ్లీ స్థానాలను వందలోపలికి వచ్చేలా దగ్గరలో ఉన్న జిల్లా కేంద్రాలకు కలపాలి.వీటికి వంద కిలోమీటర్ల లోపు రేడియస్ నిర్ణయించాలి.
అరకు జిల్లాకు మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు పేరు పెట్టమని కోరారు కొందరు.అలాగే మచిలీపట్నానికి నందమూరి తారకరామారావు పేరును జగన్ గతంలోనే ప్రతిపాదించారు. ప్రకాశం,గోదావరి,కృష్ణా,వైయస్ఆర్ పేర్లతో 5 జిల్లాలు ఉన్నాయి.మహనీయుల పేర్లు ప్రసిద్ధ ప్రాంతాలకు పెట్టుకోవటం మన ఆనవాయితీ.కానీ పేరు ఒక్కటే సమస్యలు తీర్చదు.జిల్లా కేంద్రం మిగతా ప్రాంతానికి ఎంత దూరం ఉంది,ప్రజల రాకపోకలకు సౌకర్యంగా ఉందా అని ప్రజలు సీరియస్ గా చూస్తారు.సముద్రతీర ప్రాంతాలలోని జిల్లా కేంద్రాలు జిల్లా మధ్యకు రావలసిన అవసరం,దూరం భారం సమస్య ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతో కొంత తీరుతుంది.ఎందుకంటే ఓట్లు వేయటానికే కాక ప్రజలు తమ నిత్యవసరాల కోసం ఇతర అనేకమైన పరిపాలన పనుల కోసం జిల్లా కేంద్రాలకు నిరంతరం తిరుగుతుంటారు.మండలాల ఏర్పాటు ప్రజలకు దూరంతగ్గించింది.అలాగే స్పందన కార్యక్రమం ఊరూరా వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తున్నారు.అందువలన అవకాశం ఉన్నవరకు జిల్లా కేంద్రాలకు ప్రజలు వెళ్ళే ప్రయాణ దూరాన్ని తగ్గించాలి.చిన్న జిల్లాల ఏర్పాటు పుణ్య కార్యమే.జిల్లా కేంద్రానికి వంద కిలోమీటర్లు దాటిన ఈ అసెంబ్లీ స్థానాలకు దూరం తగ్గించటానికి కమిటీ ప్రయత్నించాలి.
అరకు జిల్లా లో కురుపాం 133 (విజయనగరం 87), పార్వతీపురం 104 (విజయనగరం 57), రంపచోడవరం 283 కి.మీ (రాజమండ్రి 59). ఒంగోలు జిల్లా లో ఎర్రగొండపాలెం 133 కి.మీ (మార్కాపురం 40) గిద్దలూరు 142 కి.మీ (మార్కాపురం 65)కర్నూలు జిల్లా లో పత్తికొండ 102 కి.మీ (అనంతపురం 87) కౌతాళం 134 కి.మీ ఆదోని 118 కి.మీ ఆలూరు 130 కి.మీ . హిందూపురం జిల్లా లో సింగనమల 128 (అనంతపురం 22) నెల్లూరు జిల్లా లో కందుకూరు 112 (ఒంగోలు 44) ఉదయగిరి 126 (కడప 107) తిరుపతి జిల్లా లో సర్వేపల్లి 121 (నెల్లూరు 13)రాజంపేట జిల్లా లో తంబళ్లపల్లి 118 (కడప 95) మదనపల్లి 135 (తిరుపతి 113) పుంగనూరు 152 (తిరుపతి 114) నగరి 110 (తిరుపతి 48)
--- నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266


3, జులై 2020, శుక్రవారం

ఇల్లు కట్టి చూడు



ఇల్లు కట్టి చూడు (సూర్య 4.7.2020)


“మేడంటే మేడా కాదు
గూడంటే గూడూ కాదు
పదిలంగా అల్లూకున్నా
పొదరిల్లూ మాదీ”
అంటూ ముఖ్యమంత్రి జగన్ ఇల్లులేని పేద వారికి ఇళ్ళు కట్టిస్తామని శుభవార్త వినిపించారు. అడిగిన అర్హులందరికీ ఇళ్ళు ఇళ్లస్థలాలు పంచుతామని,నవరత్నాలలో ఇల్లు మూడవ రత్నమనీ ఆనందవార్త వినిపించారు.30 లక్షల ఇళ్లపట్టాలు గ్రామ సచివాలయాల ద్వారా రాజశేఖరరెడ్డి జయంతి రోజున జులై 8 వతేదీన ఇస్తామని చెప్పారు.ప్రభుత్వం ఇచ్చిన ఉచిత స్థలంలో ఇల్లు కట్టుకొని అయిదేళ్ళ తరువాత అవసరమైతే అమ్ముకోవచ్చని జీవో ఇచ్చారు. ప్రజా సాధికార సర్వేలో ఇళ్లులేని వారిగా 32 లక్షల కుటుంబాలు నమోదయ్యాయి.30 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తే చాలా మందికి నివాస స్థలం సమకూరుతుంది. ఇల్లు కట్టే కార్యక్రమానికి పెద్ద ఎత్తున డబ్బు సమకూర్చాలి కాబట్టి బ్యాంకు రుణాలు కూడా ఇప్పిస్తామన్నారు.నిరాశ్రయుల సంఖ్య ప్రతిఏటా పెరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామన్నారు. కేంద్రంకూడా కరోనా కారణంగా ఇళ్లనిర్మాణ ప్రాజెక్టుల గడువును ఆరునెలలు పొడిగించింది.1987 లోనే అంతర్జాతీయ ఆశ్రయ కల్పనా సంవత్సరం అయిపోయింది కానీ ఇల్లు లేని ప్రజలు కోట్లలో ఉండిపోయారు.అంతర్జాతీయ ఆశ్రమం లాంటిది ఏదైనా ఒకటి కట్టించినా ఆ సంవత్సరానికి పెట్టిన పేరు సార్ధకం అయ్యేది.పార్టీలు ఏవైనా మంచి పనులు చేసినపుడు జనంసంతోషిస్తారు. తెలుగురాష్ట్రాలు రెంటిలోనూ అభివృద్ధి కార్యక్రమాలు పోటాపోటీగా జరుగుతున్నాయి.తెలంగాణాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ,కొత్త జిల్లాల ఏర్పాటు,30 కోట్ల మొక్కలు నాటే హరిత కార్యక్రమం,ఆంధ్రలో పచ్చతోరణం మంచిఫలితాలనే ఇస్తాయి.నాటినమొక్క ఎండితే బిడ్డ ఎండినట్లేనని కేసీఆర్ జనానికి భయంపెట్టారు.రాష్ట్రాల్లో జనం మాత్రం నిరాశ్రయులకు ఇళ్ళు కట్టించి ఎప్పుడిస్తారు అని దేశనాయకుల చెవుల్లో ఇల్లు ఇల్లు అని గోల పెడుతూనే ఉన్నారు. వాళ్ళ చెవుల్లో ఇళ్ళు కట్టుకుని పోరుతూనే ఉన్నారు.ఇళ్లు కట్టిన ప్రతి నాయకుడిని పేదలు అభిమానించారు.ఆనాడు ఎన్టీఆర్ పక్కా ఇళ్ళ స్కీముకు,రెండురూపాయల బియ్యానికి,మద్య నిషేధ కార్యక్రమానికి ప్రజలలో మంచి పేరు వచ్చింది.పక్కా ఇళ్ళు పెరిగే కొద్దీ అగ్నిప్రమాదాలు తగ్గాయి. కూలీల వలసలూ తగ్గాయి. అర్హులందరికీ అడిగినా అడగకపోయినా ఇల్లు సమకూర్చే బాధ్యతను కలక్టర్లకు అప్పగించారు జగన్.ఇల్లు లేదు అని ఎవరూ బాధపడకూడదని, నాకు ఓటు వేయనివారికి కూడా అర్హత ఉంటే ఇంటిపట్టా ఇచ్చితీరాలని,నేను గ్రామాల్లో పర్యటించినపుడు ఇంటిపట్టాలేదని ఎవరూ చెయ్యి ఎత్తకూడదని తన ఆశ,ఆశయం వెల్లడించారు.పేదవాడికి ఇళ్ళు కట్టటం పుణ్యకార్యం.దేశానికి అవసరమైన పని.ప్రతిఏటా చేయవలసిన పని. ఊరికి ఆనుకొని దగ్గరగా ఉన్న మెరకప్రాంతాలలో భూమిని సేకరించి ,పల్లపు ప్రాంతాలలో మెరక పోయించి ,ఇళ్లను నాణ్యంగా కట్టాలి. అందరికీ ఇళ్ళు పథకాన్ని విజయవంతంగా అమలుచెయ్యాలి.ఎందుకంటే అప్పుడే విమర్శల గోల మొదలయ్యింది.మెరకతోలకుండా నీళ్ళు నిలబడే పల్లపు భూమిలో పట్టాలు ఇచ్చారని,ఆవ భూములు కొన్నారనీ,పేదలకు ఎప్పుడో ఇచ్చిన పాత పట్టాలు తీసుకొని ఊరికి దూరంగా కొత్తచోట మళ్ళీ ఇచ్చారనీ ,పేర్లు మార్చారని,జాబితాలు మార్చారనీ,న్యాయస్థానానికి వెళతామని,ఇసుక మాఫియా ఆగలేదని,స్థానిక దళారులు ప్లాటులు అమ్ముకున్నారని పుట్టుకొచ్చిన రకరకాల సమస్యలను అధికారులు సకాలంలో పరిష్కరించాలి.
ఇల్లు కట్టడం కంటే కూలగొట్టడం తేలిక. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అని సామెత.అందుకని ఇప్పటికే కట్టిన భవనాలను వృధా కానివ్వకుండా ప్రజాసేవకు వాడుకోవటం మంచిదని కొందరు ప్రజావేదిక శిధిలాల దగ్గర బావురుమంటున్నారు. అంత్యదినాలలో జనం పెళ్లిళ్లు చేసుకుంటూ ఇళ్ళు కట్టుకుంటూ ఉంటారని ఏసుక్రీస్తు చెప్పాడట.పెళ్ళి చేయటం కంటే ఇల్లు కట్టటమే గొప్ప,అసలు ఇల్లు లేని వాడికి వెనుకటి రోజుల్లో పిల్లనిచ్చే వారు కాదట.ఇల్లు చూచి ఇల్లాలిని చూడమన్నారు.నాయకుడు తన ఇల్లు తమప్రాంతంలోనే కట్టుకుంటేనే ఓటర్లు తృప్తి పడుతున్నారు.చంద్రబాబు గారు ఇప్పటికైనా ఆంధ్రలో ఇల్లుకట్టుకోవాలని హితవు చెబుతున్నారు,ఈ దేశ నాయకులు కూడా ఇళ్ల ఇంపోర్టెన్స్ ను గుర్తిస్తూ ఇంట గెలిచి రచ్చ గెలవవోయ్ అని ఒకరినొకళ్ళు సవాలు చేసికుంటున్నారు.ముఠా కుమ్ములాటలతో, ముసుగులో గుద్దులాటలతో నిండి వున్న పార్టీని చూచి “ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అంటూ ఈసడిస్తూ ఉంటారు.
ఇంటికి గుట్టు మడికి గట్టు ఉండాలి అంటారు. కానీ ఇంటి గుట్టును బయటపెట్టి లంకంత పార్టీకి చేటు తెచ్చే ప్రమాదకరమైన వ్యక్తుల్ని ఒక కంట కాదు వెయ్యి కళ్ళతో కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే మరి ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్నారు. ఇంటి దీపమని ముద్దు పెట్టుకుంటే మూతి మీసాలన్నీ తెగకాలినవట.అలాగే పార్టీ సభ్యుల్లో ఎవర్ని కూడా నెంబర్ టూ నువ్వే అని గారాబం చేయకూడదు. నెత్తిన ఎక్కించుకోగూడదు. ఇవతలికి రమ్మంటే ఇల్లంతా నాదేననే రకాలు ఉంటారు. ఇంట్లో చొరబడి ఇంటి వాసాలు లెక్క పెట్టుకొనే కక్కుర్తి మనుషులూ ఉంటారు. “ ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా నీ ఒళ్ళు జాగరతే తుమ్మెదా “ అని సినీకవి దాసం గోపాల కృష్ణ 1978 లోనే హెచ్చరించాడు కూడా.
ఇల్లు కాలింది జంగమయ్యా అంటే నా జోలే నా కప్పరా నా దగ్గరే ఉన్నాయిలే అన్నాడట. పార్టీ నాశనమైపోయినా సరే తన బతుకు బాగుపడితే చాలు అనుకునే స్వార్ధపరులు, ఇల్లు పీకి పందిరి వేసేవాళ్ళు రాజకీయాలలో అతి సహజం. పక్క ఇంటిలో పోరును పండుగంత వేడుకగా భావిస్తూ పచ్చని ఇంటిలో చిచ్చు పెట్టేవారు, పొరుగింటి వారు పచ్చగా ఉంటే చూడలేక ఓర్వలేక పోయేవారు. చివరికి ఇంట్లోవాళ్ల చేతనే ఇంటికి నిప్పంటిస్తారు. అలా ఇల్లు కాలి ఏడుస్తుంటే త్వరగా బావి తవ్వించండి అని ఉచిత సలహాలిస్తారు, చుట్టకు నిప్పివ్వమని కూడా అడుగుతారు. అందువలన ఇరు పోటీలు పడి ఇల్లు చెడగొట్టుకోకుండా, పక్కింటి వాళ్ళ తొక్కుకు ఆశపడకుండా, పరాయి పంచన చేరకుండా, ఇంటిని కనిపెట్టుకుని పడి ఉండటం ఇంట్లో సభ్యుల కర్తవ్యం, కనీస ధర్మం. ఇంట్లో క్రమశిక్షణ, ఇంటివాడిపట్ల, ఇంటిపేరు పట్ల, ఇంట్లో జనానికి గౌరవ విధేయతలు కొరవడితే “ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాల కంపు” అన్నట్లుంటుంది.
--- నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

యుద్ధాలు వద్దు -ప్రాణదాతలే ముద్దు

యుద్ధాలు వద్దు -ప్రాణదాతలే ముద్దు(సూర్య 5.7.2020)
యుద్ధం అంటే నరబలే.యుద్ధాలకు , ఉగ్రవాదులకు నిలయాలైన పాకిస్తాన్,ఆఫ్ఘనిస్తాన్,ఇరాక్,సిరియా లాంటిదేశాలు నాశనమైపోయాయి.ప్రభుత్వాల కన్నా ప్రజాభిప్రాయం బలమైనది.ప్రజలు ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోరు.మహాభారత యుద్ధం చేసిన వాళ్ళుకూడా యుద్ధమంటే అసహ్యించుకున్నారు.పల్నాటి యుద్ధంచేసిన బ్రహ్మనాయుడు. కళింగ యుద్ధం చేసిన అశోకుడు యుద్ధాన్ని ప్రారంభించడానికి ముందు తమలో ఉన్న కోపం, ద్వేషం,వదిలి విరాగులుగా మారిపోయారు.పీనుగులతో నిండిన యుద్ధభూమిని ఏలుకోవటానికి ఇష్టపడలేదు. యుద్ధం ఏ సమస్యను పరిష్కరించదు. యుద్ధానికి చర్చలే పరిష్కారం.యుద్ధం దేనికీ పరిష్కారం కాదు. మహాత్మాగాంధీ లాంటి పెద్దలెందరో యుద్ధం వద్దన్నారు.చివరికి యుద్ధంలోని సైనికుడు కూడా యుద్ధాన్ని ఎట్లా ఆపాలో ఆలోచించాలని కోరారు. లడక్ వెళ్ళిన మోడీ ధైర్యవంతులే శాంతిని కోరుకుంటారని అన్నారు.ఐక్యరాజ్యసమితికి యుద్దాలు ఆపే శక్తి లేదు. శోచనీయ పరిస్థితి.
ఇప్పటికి రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఆటంబాంబు దాడికి గురైన జపాన్,వియత్నాం దేశాల దురవస్థలను,బాంబువేసిన అమెరికా దుర్మార్గాన్ని నేటికీ తలుచుకొని బాధపడుతూ ఉంటాం.మళ్ళీ ప్రపంచయుద్ధం వస్తే భస్మీపటలమే అనుకునే రోజుల్లో కరోనా వచ్చిపడింది.ప్రపంచంలో 5.21 లక్షలమంది చనిపోతే,అమెరికాలోనే 131 వేల మంది చనిపోయారు.ఇండియాలో కూడా 17 వేలమంది చనిపోయారు.చైనాలో సరైన సంఖ్య తెలియదు కానీ కొన్ని వేల మంది అక్కడే మొదట చనిపోయారు.అసలు కరోనాతో పాటు జి4 వైరస్ కూడా అక్కడే పుట్టుకొస్తోందని విమర్శలు వస్తున్నాయి.చైనా సరుకులు ఏమీ కొనొద్దని వాణిజ్య యుద్ధం చైనా యాప్ ల నిషేధంతో మొదలుపెట్టారు.మానవాళికి మహా శత్రువులు దోమలు.మలేరియా లాంటి రకరకాల రోగాలకు కారణమైన దోమలను చంపే తేలికైన ఆయుధాలు దోమల బ్యాట్లు కూడా చైనా నుండే కోనాల్సివస్తోంది.పేద దేశానికి అన్నము కావాలి కానీ యుద్ధవిమానాలు ఎందుకు?యుద్ధప్రాతిపాధికన దోమలబ్యాట్లు ఇండియాలోనే తయారు చేయించండి అని ప్రజలు కోరుతున్నారు.ఆయుధాలు అమ్ముకునే దేశాలు ఇండియాకు దోమల మందులు ఇవ్వాలని కోరుతున్నారు. వలసకూలీలకు రైళ్లు కూడా ఇవ్వకుండా వందల కిలోమీటర్లు నడిపించారు.నవంబర్ దాకా ఉచిత రేషన్ ధాన్యాలు ఇవ్వటమే గొప్ప పని అయ్యింది.అమెరికాలో ఎప్పుడూ యుద్ధాలనే కోరుకునే ఆయుధవ్యాపారి ట్రంప్ మాదిరిగానే రష్యా కూడా ఉంది.యుద్ధాలు చేసుకునే దేశాలమధ్య మధ్యవర్తిత్వం పేరుతో దూరటం ఆయుధాలు అమ్మటం ఎన్నో ఏళ్లుగా నడిచింది. మాకు ఎవరి జోక్యం అక్కర్లేదని తేల్చి చెప్పినా గొర్రెలకు తోడేలు కాపలాలాగా ఉంటాననటం యుద్ధాలకు తెగబడే దేశాలు ఆలోచించుకోవాలి.ఇప్పటికే మీ దగ్గర కొన్న ఆయుధాలు చాలులేఅంటే తన వద్ద నిల్వ ఉన్న ఆయుధాలను అమ్ముతానంటారు. ప్రపంచంలో ఆయుధాల కొనుగోళ్ళలో మనది రెండవ స్థానం. చైనాతో యుద్ధం జరిగితే అమెరికా,రష్యా తమ ఆయుధాలు అమ్మాలని చూస్తున్నాయి.కోర్టులో ఓడిపోయినవాడు అక్కడే ఎడిస్తే,గెలిచినవాడు ఇంటికొచ్చి లెక్కలు వేసుకున్నాక ఎదుస్తాడట.యుద్ధ విమానాల కొనుగోలుకోసం 39 వేల కోట్ల రూపాయలు కేటాయించారు.స్వదేశీ సరుకు కొనడానికి ప్రజల్ని ముందుకురమ్మంటున్నారు.రహదారులు రైల్వేల నిర్మాణాల చైనా కాంట్రాక్టులు రద్దుచేశారు.యుద్ధంలో ఇరుదేశాలకూ నష్టమే.సైనికులభార్యలు,పిల్లలు అనాధలు అవుతారు.ఎన్నిశౌర్యపతకాలు వచ్చినా అమరుల కుటుంబాలలో చెప్పుకోలేని బాధ.
రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు మానవప్రాణాలే ముఖ్యమంటూ ముస్లిం దేశాలలో ఆ సంస్థ పేరు రెడ్ క్రీసెంట్ గా మార్చి మరీ తన ప్రాణదాన కార్యక్రమాన్ని కొనసాగించాడు.యుద్ధాలు ఏ దేశాలమధ్య జరిగినా అక్కడికి ఆ సంస్థ వెళ్లింది.గాయపడ్డ సైనికుల్ని మందులిచ్చి వైద్యం చేసి ఆదుకోంది.పెన్సిల్లిన్,టెట్రాసైక్లిన్ లాంటి మందులు ప్రాణాధార మందుల్ని కనుగొని వైద్యులు మానవసేవ చేస్తూనే ఉన్నారు.యుద్ధాన్ని ఆపి ఇలాంటి ప్రాణదాతలను వ్యాక్సిన్ శాస్త్రవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహించాలి.అప్పుడే ప్రజలకు శాంతి సౌఖ్యం.
ఆరోగ్యంగా ఉన్న పౌరులే దేశానికి నిజమైన సంపద. ప్రజల ఆరోగ్యంతోటే సుఖము సంతోషము. యుద్ధాలకంటే ప్రాణదానం చేసే ప్రతిపనీ మంచిదే.అది ప్రభుత్వపరంగా జరిగినప్పుడు మెచ్చుకోకతప్పదు.130 కోట్ల జనాభా ఉన్న మన దేశానికి 12 లక్షల మంది డాక్టర్లు మాత్రమే అదీ ఎక్కువమంది మహా నగరాల్లో, పట్టణాల్లో స్థిరపడిపోయారు. వైద్యులు,ఆసుపత్రుల పరంగా మనం చాల వెనుకబడి ఉన్నాం.పల్లెటూళ్ళ ప్రజలు వైద్యం కావాలంటే ఒక మోస్తరు టౌనుకు రావలసిందే.ఇలాంటి దశలో 1.7.2020 న ఒకే రోజు మొత్తం 1088 అంబులెన్సులు విజయవాడనుండి జిల్లాలకు ‘కుయ్‌...కుయ్‌’మంటూ వెళ్లాయి.108,104 వాహనాలను ప్రతిమండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు. వీటి ద్వారా పేదలకు వైద్య అత్యవసర సేవలు అందుతాయి.ప్రైవేటు వైద్యం చాలా ఖరీదు.అందరూ భరించలేరు.ఆరోగ్యసేవలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో యూజర్ ఛార్జీలు వసూలు చేసిన గతం మనది. మంగళగిరిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పెడతామంటే పక్కనే ఉన్న విజవాడలోనే పెట్టాలని అడ్డుకొన్న నాయకులకు రెండుచోట్లా పెడదామని ఆనాడు రాజశేఖరరెడ్డి హితవు చెప్పారు.ఇప్పుడు మంగళగిరిలో జాతీయస్థాయి ప్రభుత్వాసుపత్రీ ఏర్పడింది.క్రమంగా ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగు పరచాలి. అంబులెన్సు సర్వీసుల గురించి చెప్పనవసరం లేదు. మన్యంలో పల్లెలకు అంబులెన్సులు పోలేక ఈనాటికీ డోలీలు కావడులే గతి.ఇప్పుడు ఈ అంబులెన్సుల రాకతో రాష్ట్రంలో ప్రతి 75 వేల మందికి ఒక అంబులెన్సు ఉంటుంది. రోగులను,ప్రమాద బాధితులను ఆసుపత్రులకు చేర్చటానికి అరగంటలో అంబులెన్సు వస్తుంది. ప్రాణాపాయస్థితినుంచి కాపాడటానికి కావలసిన అత్యా ధునిక ఉపకరణాలు అంబులెన్సుల్లో ఏర్పాటు చేశారు.అయితే వీటిని ప్రజలకోసం సరిగా నడిపి వైద్యసేవలు అందించే వారిపై ఈ పధకం విజయం ఆధారపడి ఉంటుంది.యుద్ధాలు ప్రాణాలు తీస్త్తుంటే డాక్టర్లు ప్రాణాలు పోస్తున్నారు.మనం డాక్టర్ల పక్షానే ఉందాం.
--నూర్ బాషా రహంతుల్లా, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,6301493266