ఈ బ్లాగును సెర్చ్ చేయండి

25, నవంబర్ 2020, బుధవారం

అబలల రక్షణ కోసం నైతిక విద్య,మానసిక వైద్యం పెరగాలి


 
అబలల రక్షణ కోసం నైతిక విద్య,మానసిక వైద్యం పెరగాలి ( వ్యూస్ 25.11.2020)
ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారనే మన దేశంలో దేవదాసీలు జోగినులకు ఒంటరి మహిళలకు పెన్షన్, రేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు భర్త చనిపోయినట్లు గతంలో సర్టిఫికేట్ అడిగేవారు. అనేక మహిళా ఉద్యమాలు జరిగాక ఇప్పుడు అలాంటి నిర్హేతుక సర్టిఫికెట్లు అడగటంలేదు. పైగా ఒంటరి మహిళలకు కొంత భద్రత, భరణమూ దొరికాయి. మహిళల టాయ్‌లెట్‌ అవసరాలకు కొందరు దాతలు వ్యానిటీ వాన్‌లు ఏర్పాటు చేశారు. కొందరు దాతలు బహిష్టు సమయంలో స్త్రీలకు శానిటరీ న్యాప్‌కిన్లు ప్యాడ్లు పంచారు. కొందరు స్త్రీలకోసం కమ్యూనిటీ కిచెన్స్‌ కూడా నడుపుతున్నారు. కొందరు దాతలు అక్రమ రవాణా, కార్మిక బాలికల కోసం అంకురం, సఖి, రెయిన్‌బో కేంద్రాలలో వసతి గృహాలు పెట్టి వలస శ్రామికులకు భోజన, వసతి సౌకర్యాలతో పాటు ఆరోగ్య సేవలనూ అందిస్తున్నారు. చిన్నపిల్లలను పనిలో పెట్టుకోవడం, అమానుషంగా వేధించటం, అమ్మాయిల ఒంటిమీద వాతలు పెట్టటం లాంటి నేరాల నుండి కాపాడుతున్నారు. గృహహింస బాధితులకు ప్రభుత్వాస్పత్రులలో సహాయ కేంద్రాల ద్వారా ఆరోగ్య, న్యాయ, కౌన్సెలింగు సేవలు కల్పించి సహాయపడుతున్నారు.
మ‌హిళ‌ల‌కు స‌మ‌స్య‌లు త‌గ్గాలి
విడాకుల తర్వాత నిరాధార మహిళలకు సమస్యలు తగ్గాలి . ఒంటరి మహిళలు పిల్లలను పోషించుకోవాలి. ఇంటి నుంచి వెళ్ళిన మహిళ క్షేమంగా తిరిగొస్తుందన్ననమ్మకం లేదు. దారిలో ఎక్కడ ఏ అపాయం పొంచి ఉందో ఊహించలేని పరిస్థితి. వారికి రోజులు గడవటం జీవన్మరణ సమస్య. దిక్కూ మొక్కూ లేని ఒంటరి మహిళల సంక్షేమం చూడటం శ్రేయోరాజ్య బాధ్యత. ఆకలితో అలమటించే వారికి అన్నమే పరబ్రహ్మ స్వరూపం. వేలిముద్రలు, కంటిపాపలు, ఐరిస్‌, ఆధార్‌ కార్డుల ఆధారంతో దేశవ్యాప్తంగా తామెక్కడ ఉంటే అక్కడే నిత్యావసర సరుకులు తీసుకొనేలా రేషన్‌ కార్డులు ఇస్తున్నారు. ఇంటర్నెట్‌ వేగం పెంచామంటున్నారు. నేటికీ విడాకులు పొందిన మహిళలు భరణం కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. అప్పులు చేస్తున్నారు. ప్రాణాంతకమైన కూలీ పనులు చేస్తున్నారు. మనోవర్తి ఉద్దేశమే భర్త నుంచి విడివడిన భార్య మనుగడకు అవసరమైన మొత్తం అందుబాటులో వుండేలా చూడటం. మనోవర్తి కేసు తేలడానికి 20 సంవత్సరాలు పడుతోంది. భర్త నుంచి వేరుపడి విడిగా వుంటున్న భార్యకు న్యాయస్థానంలో మహిళ పిటిషన్‌ వేసిన తేదీనుంచే మనోవర్తి చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఒకే ఇంట్లో ఒక వితంతువు ఒక ఒంటరి స్త్రీ ఉంటే పింఛను రాదు. 30 ఏళ్ళు దాటిన బ్రహ్మచారిణులకు, విడాకులు పొందిన ఒంటరి మహిళలకు పేదవాళ్లైతే వారి సంక్షేమం కోసం వారికి విడిగా రేషన్ కార్డు పెన్షను ఇవ్వాలి.గంట‌కు ఇద్ద‌రిపై అత్యాచారం
ప్రతీ గంటకు ఇద్దరు మహిళలు అత్యాచారానికి గురి అవుతున్నారు. వరకట్నం కోసం మహిళలు బలి అవుతున్నారు. 70 శాతం మంది మహిళలు గృహ హింసను ఎదుర్కొంటున్నారు. మహిళలను సంభోగ వస్తువుగా, పిల్లల్ని కనే యంత్రంగా, వంటింటి కుందేలుగా, వరకట్నం తీసుకువచ్చేవారిగా చూస్తున్నారు. ఆడది అంటే చులకన. సినిమాల్లో సీరియళ్లలోనూ మహిళలపై దౌర్జన్యాలనే చూపిస్తున్నారు. అమ్మాయి తనకు దక్కలేదని కసి, పగ, ద్వేషాలు పెంచుకొంటున్నారు. అత్యాచారాలతో ఆగకుండా హత్యలు చేస్తున్నారు. వరకట్న నిషేధ చట్టం, గృహ హింస చట్టం, పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం, భ్రూణ హత్యల నియంత్రణ చట్టం, నిర్భయ చట్టం లాంటివి ఎన్ని వచ్చినా మహిళలపై నేరాలు ఆగటంలేదు. ఎంపీలు, ఎమ్మెల్యేలపైనే అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. అత్యాచారాలకు గురైన మహిళలు దిశ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు.మ‌హిళ‌ల‌కు స‌త్వ‌ర న్యాయం పొందే హ‌క్కు
మహిళలందరూ సత్వర న్యాయం పొంది ఆత్మగౌరవంతో జీవించే హక్కు ఉంది. న్యాయ స్థానాల్లో కేసులు చాలా కాలంగా పేరుకుపోయి ఉంటున్నాయి. నేరస్తులకు శిక్షలు ఎంత వేగంగా పడితే అంత మంచిది. భార్యపై భర్తకు సర్వ హక్కులు లేవు. బలవంతం చేస్తే భర్త కూడా నేరస్థుడే. అత్యాచార బాధితురాలికి సమీపంలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రి కూడా చికిత్స నిరాకరించడానికి వీలు లేదు. పోలీసులకు సమాచారం అందిస్తూనే చికిత్స ఆరంభించి, ఉచితంగా సేవలందించాలి. ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లండని తప్పించుకోవడానికి వీల్లేదు. చికిత్స నిరాకరించడం నేరం అవుతుంది. ఆత్మరక్షణార్థం చేసే హత్య నేరంగా పరిగణించరాదు. అత్యాచారానికి పాల్పడే నేరగాడిని బాధితురాలు హత్య చేస్తే దాన్ని ఆత్మ రక్షణ హక్కుగా గుర్తిస్తారు. నిర్భయ అత్యాచారం కేసులో నిందితుల్లో ఒకడు బాల నేరస్థుడు. ఆమె తీవ్రంగా గాయపడటానికి ఇతను ముఖ్య కారకుడు. భర్త దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండకుండా భార్య ఒక హక్కుగా భర్త ఇంటిలోనే ఉండొచ్చు.
ఆగ‌ని ప‌రువు హ‌త్య‌లు
కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న ప్రేమికులను పరువు హత్యలు చేస్తున్నారు. ప్రేమ వివాహాలు కొన్ని లవ్ జిహాద్‌ పాలవుతుంటే ఉత్తరాఖండ్‌లోని బీజేపీ ప్రభుత్వం అన్య మతస్తులను మనువాడితే రూ. 50 వేలు పారితోషికం ప్రకటించింది. భార్య, భర్తలలో ఎవరైనా ఒకరు షెడ్యూల్డ్ కులాలకు చెందినవారై ఉండాలని షరతు పెట్టింది. దుర్మార్గులు చంటి పిల్లల్ని కూడా అత్యాచారం చేయడానికి వెనకాడటం లేదు. చట్టాల ద్వారా ఒంటరి మహిళలకూ ఆత్మ నిర్భరం కలగాలి. కట్నం ఇచ్చిన వారికి శిక్ష నుంచి మినహాయింపు నివ్వటం, 18 ఏళ్ళు నిండిన వారి పరస్పరామోద శృంగారం నేరం కాదనటం , అగ్రవర్ణాల పురుషులు దళిత మహిళలను ముట్టుకోరని, ముట్టుకోనప్పుడు అత్యాచారం ఎలా చేస్తారనటం లాంటి కొన్నితీర్పుల్ని మహిళలకు మేలుచేసే విధంగా మెరుగుపరచుకోవాలి.
ఉన్న స‌మ‌స్య‌లు చాల‌వా?
షష్ఠి పూర్తి వయసులోనూ పాతికేళ్ల యవ్వనాన్ని సొంతం చేసుకోవచ్చని ఆక్సిజన్ చాంబర్ల ద్వారా వయసు వెనక్కి నెట్టి వృద్ధులకు తిరిగి యవ్వనం తెప్పించే ప్రయోగాలు చేస్తున్నారట ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు. వృద్ధుల క్రోమోజోముల్లో టెలోమెర్‌ తొడుగులు పూయించి జాంబీ కణాలను తగ్గించి వృద్ధాప్య ఛాయలు త్వరగా అలుముకోకుండా చేశారట. మళ్ళీఈ నవ యవ్వనం దేనికి? సమాజాన్ని సర్వమంగళం చేయడానికేనా? మహిళలపై గృహ హింస కేసులు పెరుగుతాయి. ఇప్పుడున్న సమస్యలు చాలవా ? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అబలల పట్ల మర్యాదగా నడుచుకునేలా జనానికి ఈ నవయవ్వనం నేర్పుతుందా?అని అడుగుతున్నారు. నేరగాళ్లకు శిక్షలు తప్పవు. అబలల రక్షణ కోసం నైతిక విద్య, మానసిక వైద్యం పెరగాలి అంటున్నారు.
---- నూర్ బాషా రహంతుల్లా, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266

 

14, నవంబర్ 2020, శనివారం

సంగీతం,చేపలు మెదడుకు మంచిమేత

 




సంగీతం,చేపలు మెదడుకు మంచిమేత (గీటురాయి 27.11.2020)
పౌష్టికాహారలోపంతో బాధపడే గర్భిణులు,బాలింతలు,బాలికలు,చిన్నారులకు అంగన్ వాడీలు ,ప్రాధమిక పాఠశాలల్లో భోజనంలో ఎండు చేపలకూరను అందించాలని ఒడిశా ప్రభుత్వం తలపెట్టింది. ఆహార పదార్ధాలు చవకగా ప్రజలకు అందితేనే ఆరోగ్యం.ప్రజలు బాగా తినాలనే ఉద్దేశంతో ‘కోడిగుడ్డు శాకాహారమే’ Egg is vegetarian అని కూడా ప్రచారం చేశారు.గుడ్డుకు బదులు పాలు పళ్ళు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి చౌహాన్ వాదనను కాదని ఆయన సమక్షంలోనే పిల్లలకు గుడ్డుతోపాటు చేపలకూర కూడా వండి వడ్డించాలని మధ్యప్రదేశ్ మంత్రి కుసుమ మెహ్డెల్ ఆదేశించారు.
ఆకలి తీర్చుకోవడానికి జంతువులను వేటాడి చంపి పచ్చి మాంసం తిన్న ఆదిమ మానవుడు తరువాత నిప్పులమీద కాల్చుకున్నాడు.క్రమేణా చేపలు కూడా ఆహారమై పోయాయి.జంతు బలుల హింసలేకుండా శాకాహారమే బెస్ట్ అని కొందరు ఉద్యమస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. తాను ఇకపై పూర్తి స్థాయి శాకాహారిగా మారిపోతున్నానని,మాంసాహారంతోపాటు గుడ్లు, పాలు, పాలతోచేసే ఇతర పదార్థాలూ కూడా వదిలేస్తున్నానని ఆమీర్‌ఖాన్ ప్రకటించారు.రాజస్థాన్, పంజాబ్, హర్యానా,యూపీ రాష్ట్రాల్లో కూడా అంగన్ వాడీల్లోగానీ, బడిపిల్లల మధ్యాహ్న భోజనంలోగానీ గుడ్లు అందించడంలేదు. ఎండుచేపలు,ఉప్పుచేపల వేపుడు,కూర,పులుసు ఎంతగానో ఇష్టపడతామని చిరంజీవి లాంటి సెలబ్రిటీలు గర్వంగా చెప్పుకున్నారు.గుడ్లు,చేపలు తిననివాళ్లు తినేవాళ్లకూ మాంసకృత్తులు దొరకకుండా చేయకూడదని కొందరి వాదన.
సంగీతం,చేపలు మెదడుకు మంచిమేత ఆన్నారు.పిల్లలకు సంగీతం నేర్పించండి అని సంగీత విద్వాంసులు చెబుతుంటే,చేపలు కూడా బాగా తినిపించండి అని వైద్యులు సలహాలిస్తున్నారు. అయితే ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో పెరిగిన ఆకుకూరల్లాగా శుభ్రమైన నీళ్ళలో పెరిగిన మంచి చేపలను మాత్రమే తినాలి.చీకాకు పరిచే రణగొణ ధ్వనులను కాకుండా హాయిగొలిపే సంగీతాన్ని మాత్రమే వినాలి.చేపలకు కరోనా వైరస్ శోకిందన్న భయంతో ఇండియా,ఇండోనేషియా,రష్యా,బ్రెజిల్,దేశాల కటిల్ చేపల దిగుమతులను చైనా నిషేధించింది. కొల్లేరు సరస్సులో ఉప్పు రసాయనాలు పెరిగి నల్లజాతి చేపలు అంతరిస్తున్నాయి. కూరగాయ పంటలపై విచ్చలవిడిగా చల్లుతున్న రసాయనాలు చేపలలోకి కూడా వెళుతున్నాయట. ఈ రసాయనాలు ప్రజల శరీరాల్లోకి వెళ్ళి కేన్సర్ నాడీ వ్యాధులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. నదుల్లో నీరు స్నానం చేసేందుకూ పనికిరాని స్థితికి చేరింది. చేపలు ఆ నీటిలో బతకలేని స్థితి.నదుల్లో హానికరమైన కోలిఫామ్‌ బ్యాక్టీరియా ఉంది. పట్టణాలు,సముద్రాల నిండా ప్లాస్టిక్ చేరింది. నగరాల్లోని మురుగు నీటిని పరిశ్రమల నుంచి వెలువడే ప్రాణాంతకమైన రసాయన వ్యర్థాలను శుద్ధి చేయకుండా నేరుగా నదుల్లోకి వదిలేస్తున్నారు. నదులు కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాలను శుభ్రం చేయటంలేదు. అలాంటి మురుగు నీళ్ళలో పెరిగిన మొక్కలైనా చేపలైనా తిన్నవారి ఆరోగ్యానికి హానికరమే. ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తున్న కారణంగా స్థానికంగా చందువా లాంటి చేపలు దొరకటం,లేదు. మన చేపలు మన ప్రజలకే అండటంలేదు. స్థానిక ప్రజల ఆరోగ్యం కోసం చేపల ఉత్పత్తి కోసం ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తుంటే తినే తిండిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే ఎలా?
చేపలలో 25 వేల జాతులున్నాయట.మట్టగిడిస, కొర్రమేను, బొమ్మిడాయి,ఎర్రమట్ట, కోయంగ, మోసు, వాలుగ, పాలబొంత, వంజరం , బంగారు తీగ మట్టగడిస, కొయ్యింగ,రాగండి,వానమట్ట, సవ్వలు, టేకుచేప, కట్టిపరిగ, పిత్తపరిగ, బొచ్చెలు, మెత్తాళ్ళు, పండుగప్పలు, సాల్మన్, కొరమీనులు శీలావతి, గొరక, ఇంగిలాయి, జల్ల, బొచ్చ, జడ్డువాయి, చేదుపరిగె,పండుకప్ప, గండి బొడిగి, కొయ్యంగ, మునగపాము, గుడగ్గాయి, చామరాయి, పొట్టిదిలాసు, కట్టినెరసు, బుడపార, చాకిరొయ్య, గడ్డికొయ్య, మాలతప్పడాలు, ఏటిజల్ల, మార్పులు, పల్లెంకాయ, పాలజల్ల, పారాటాయి , పరిగెలు,పిత్త పరిగెలు, కొయ్యంగలు, తుళ్ళు, జలుగులు, కర్నింగాయలు, అరటి చేపలు, శాక రొయ్యలు, బుంగ రొయ్యలు, గాజు రొయ్యలు, గొల్లిగాయలు, జల్లలు, రామలు, ఆకు పరిగెలు, సీసం రొయ్యలు, బెత్తెలు, ఇసుక దొందులు, ఇంగిలాయలు, మార్పులు, బొచ్చె, పులస, పండుగొప్ప, శీలవతి, జడ్డువా, బంగారుతీగ, గడ్డి చేప, నల్లగండు మేను, తెల్లగండు మేను, కట్ల, ఇల్లంబ్రాయిలు...ఇలా ఎన్నో రకాల చేపలు దొరుకుతాయి.
చేపల మొప్పలు ఎత్తి చూసినపుడు లోపల ఎర్రగా, పింక్ కలర్లో కాంతివంతంగా ఉండాలి.ఎర్రగా కనపడటానికి రంగుకూడా వేస్తారు.చేపల ఉపరితలం చొట్టపడకుండా గట్టిగా ఉండాలి. చేపల కళ్ళు మెరుస్తూ కాంతిగా ఉండాలి. ఉప్పునీటిలో పెరిగే పండుగప్పను ఇప్పుడు మంచినీటి చెరువుల్లో కూడా పెంచుతున్నారు. సాల్మన్ చేపలలో ప్రొటీన్లు, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ డిలు పుష్కలంగా లభిస్తాయి. వీటి మాంసం ఎరుపురంగులో ఉంటుంది. రవ్వచేపలని కూడా పిలుస్తారు. లక్షల విలువ చేసే కచ్చిడి చేపల పొట్టలో ఔషధ గుణాలున్నాయంటారు.ఆపరేషన్ తరువాత కుట్లు వేసే దారాన్నికచ్చిడి పొట్ట భాగంతో తయారుచేస్తారట.నల్లమట్ట చేప మనిషంత పొడవు ఉంటుంది.ట్యూనా చేప 70 కిలోల వరకు బరువు పెరుగుతుంది. చేపలలో విటమిన్-A, D, E, K లు ఉంటాయి. క్రొవ్వు తక్కువగా ఉంటుంది.గర్భిణులు చేపలు తింటే పుట్టబోయే శిశువులకు ఉబ్బసం రాదని నమ్మకం.వాటిలోని ఒమేగా3 ఆమ్లాలు కేన్సర్ కణితులను నివారిస్తాయట. గుండెజబ్బుతో బాధపడుతున్నవారు చేపల్ని తినడం మంచిది.తేలిగ్గా అరుగుతాయి. వీటిలో లైసీన్‌, మిథియోనిన్‌, సిస్టీన్‌ అమైనోయాసిడ్లు లభిస్తాయి. చేపలలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్లు పిల్లల పెరుగుదలకు అవసరం.సముద్రపు చేపల్లో అయోడిన్‌ ఉంటుంది. చేతి పరికెలు ముల్లుతో సహా తింటే కాల్షియం, భాస్వరం, ఐరన్‌ అధికంగా లభిస్తాయి.రోజూ చేపలు తీసుకునేవారిలో గుండెజబ్బులు, మధుమేహం, పక్షవాతం తక్కువ.బొజ్జ, అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర పెరగటం, మంచి కొలెస్ట్రాల్‌ తగ్గటం, ట్రైగ్జిరైడ్లు ఎక్కువ కావటమే ఈ జబ్బులకు కారణం.చేప నూనె మాత్రలు అధిక రక్తపోటుతో పాటు గుండెజబ్బు మూలంగా వచ్చే మరణాలనూ తగ్గిస్తాయి. చేపలు పెద్దపేగుకు మేలు.మాంసం కన్నా చేపలు తినటం మంచిది. మెదడుకు మేలు చేసేవి చేపలు.చెరువు చేపలకంటే సముద్రపు చేపలు మంచివి. చేపలు తినటం వలన రక్తనాళాలలో రక్తం గడ్డకట్టదు. ట్రైగ్లిజరేడ్లు తగ్గుతాయి. బిపిని కంట్రోల్ లో ఉంచుతాయి. శస్త్రచికిత్సలు జరిగిన తరువాత కొరమీనులు తినడం వల్ల గాయాలు, కోతలు త్వరగా మానుతాయంటారు. చందువాలు జీర్ణకోశానికి మేలు చేస్తాయి. నూనెకవ్వలు సార్టెన్ చేపలలో ఒమేగా 3, ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువ. బీపిని కంట్రోల్ లో ఉంచుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచివి. ఎండుచేపలలో పోషకాలు పెరగటంతో పాటు, రుచి కూడా పెరుగుతుంది. పిల్లల పెరుగుదలకు మంచిది.
ఎండు చేపలు
నక్కపల్లి,చందోలు,గుంటూరు ఎండు చేపల సంతలలో చప్పిడి చేపలు,ఉప్పుచేపలు,వంజరం,కానగంతలు,కాకిపరిగెలు,గులివిందలు,తట్టాలు లాంటి ఎన్నోరకాల ఎండు చేపలు అమ్ముతారు. దేశవ్యాప్తంగా ఉన్న సముద్రతీరాలలో రోడ్లమీద బోట్లపైన చేపలను ఎండ బెట్టి వ్యాపారం చేస్తారు.పచ్చి చేపలకు ధీటుగా ఎండు చేపల వ్యాపారం సాగుతోంది.దుమ్ము ధూళి లేకుండా చేపలను ఎండబెట్టటానికి మత్స్య శాఖ వారు హార్బర్లకు దగ్గరలో కొన్నిచోట్ల సోలార్ డీహైడ్రేటర్ ప్లాంటులను కూడా ఏర్పాటు చేశారు.పూర్వం ఎండు చేపలపై ఎలాంటి పన్ను ఉండేది కాదు.ఈమధ్యే 12 శాతం జీయస్టీ పన్ను తీసేయ్యాలని చేపల వ్యాపారులు ఆందోళన చేశారు.
చేపలను ఎక్కువ నూనె పోసి వండకుండా తక్కువ నూనెతో వండుకోవాలి. ఎక్కువ నూనెలో వేపుడు చేసిన చేపలతో క్యాన్సర్ల ముప్పు పెరుగుతుంది. మెత్తాళ్ళను చింతచిగురుతో కలిపి వండుకుంటారు.పండుగప్ప,కొరమీనుల ఖరీదు కొంచెం ఎక్కువ. బొమ్మిడాయిలు చింతకాయతో కలిపి పులుసు చేస్తారు.చప్పిడి చేపలను మునక్కాయ,కోడిగుడ్డు,చిక్కుడుకాయ కాంబినేషన్ తో చేస్తారు.ముళ్లుతీసేసి పిట్టు లాగా కూడా చేసుకుంటారు. గోదావరి నదిలో దొరికే పులసచేపలు అత్యంత ఖరీదైనవి.
కరోనా ప్రభావంవల్ల చేపల వేట వ్యాపారం రెండూ దెబ్బతిన్నాయి. కోవిడ్‌ వ్యాక్సిన్‌ కూడా అందుబాటు లోకి రాలేదు.పర్యావరణ హితమైన బాణసంచా కాల్చడంపై ఆంక్షలకు ప్రజలు అంగీకరించారు.అందరికీ ఎంతో కొంత సంపద పంచిచ్చిన నేలతల్లి,గాలి.నీరు కలుషితమై విషమై పోయాయి. రసాయన విషప్రయోగశాలలో రోగి అయ్యింది సేంద్రియ భారతి . కలుషిత పంట ఎవరి కడుపు నిండుతుంది?విషపూరిత పండ్లు చేపలు తిని ప్రాణాలమీదకు తెచ్చుకోకూడదు. ఆనాటి పచ్చదనం పరిశుభ్రత మళ్ళీ వస్తుందా? కాలువల్లో నీళ్ళు అనాటిలాగా అలాగే తాగగలమా?చేలల్లో చేపలు బ్రతుకుతాయా?కాలువల్లో మంచి చేపలు దొరుకుతాయా?అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
--- నూర్ బాషా రహంతుల్లా, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

 

11, నవంబర్ 2020, బుధవారం

మ్యానిఫెస్టోలకు చట్టబద్ధత కల్పించాలి

మ్యానిఫెస్టోలకు చట్టబద్ధత కల్పించాలి (సకలం 11.11.2020)

నవరత్నాల మ్యానిఫెస్టోనే మాకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఎన్నికల వాగ్దానాలు సకాలంలో అమలు అవుతుంటే ఓటర్లు నాయక వశం, పార్టీ వశం అవుతారు. ఎందుకంటే మ్యానిఫెస్టో అంటే తాము పరిపాలనలోకి వస్తే ప్రజలకు ఏమేమి పనులు చేస్తామో చెప్పే ప్రణాళిక అన్నమాట. 17 సార్వత్రిక ఎన్నికలు నిర్వహించిన అనుభవం మనది.
రాజకీయ విద్యాగంధం అందించే ఎన్నికల మ్యానిఫెస్టోలు
ఎన్నికల మ్యానిఫెస్టోలు ప్రజలకు రాజకీయ విద్యాగంధం అందిస్తాయని అద్వానీ అన్నారు. పేదరిక నిర్మూలన వంటి పడిగట్టు వాగ్దానాలతో ఉచిత వాగ్దానాల ఎరలతో ఓటర్లను బురిడీ కొట్టిస్తారని మ్యానిఫెస్టోలను ప్రజలు పట్టించుకోవటమే లేదు. ఎన్నికల మేనిఫెస్టో రాజకీయ వాగ్దానాల పట్టిక. పార్టీల దూరదృష్టికి ప్రతీక. ప్రజలు అది ఆచరణసాధ్యం కాని వాగ్దానాల జాబితా చిట్టాగా అనుకొంటున్నారు. పార్టీల మ్యానిఫెస్టోల అమలును పరిశీలించడం ఎన్నికల సంఘానికి బాధ్యతగాలేదు. ఎన్నికల వాగ్దానాల అమలుకు కట్టుబడేలా పార్టీలను ఆదేశించలేమంటూ సుప్రీం కోర్టే నిస్సహాయత వెలిబుచ్చింది. సీఈసీగా శేషన్‌ తరువాత పార్టీలు ప్రజలు మ్యానిఫెస్టోల విలువను గుర్తించలేదు.
అమెరికాలో 2 నెల‌ల‌ముందే మ్యానిఫెస్టో విడుద‌ల‌
అమెరికాలో రెండు నెలలు, మెక్సికోలో అయిదునెలల ముందే మ్యానిఫెస్టోలు వెలువడతాయి. 2014 సార్వత్రిక ఎన్నికలలో పోలింగ్‌ తేదీనాడే భాజపా మ్యానిఫెస్టో విడుదల చేసింది. మ్యానిఫెస్టోలపై జన బాహుళ్యంలో సరైన చర్చ జరగటంలేదు. ఓట్లకోసం ప్రజల అవసరాలను తీరుస్తామని ప్రకటించే పార్టీలు మ్యానిఫెస్టోలను కూరలో కరివేపాకుగా మార్చేశాయి. నిరుద్యోగ భయం మన దేశాన్ని వెంటాడుతోంది. కోవిడ్‌ లాక్‌డౌన్‌ అనంతరం లక్షలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. సరైన ఆదాయం లేక తగిన వైద్యం కూడా పొందలేని పరిస్థితుల్లో కుటుంబాలు ఉన్నాయి.
పెరిగిన రోజుకూలీల ఆత్మహత్యలు
ఇదే సమయంలో చిన్నారులను పాఠశాలలకు పంపలేక, కుటుంబానికి అవసరమైన ఆహారంపై వ్యయం కూడా చేయలేక రోజువారీ కూలీల ఆత్యహత్యల రేటు కూడా పెరిగింది. లక్షలాది ఉద్యోగ ఖాళీలను సర్కార్‌ భర్తీ చేయడం లేదు.ఉద్యోగాల కల్పన , నిరుద్యోగ భృతి హామీ ప్రతిరాష్ట్రంలో ఇస్తున్నారు. అవినీతి గడ్డి- నేను తినను, తిననివ్వను అన్న మోదీ, స్వయం సమృద్ధ భారత్‌ లక్ష్యసాధనకు అవినీతి పెద్ద అవరోధంగా మారిందని అన్నారు. ఆర్థిక నేరాలు, మాదక ద్రవ్యాల సరఫరా, నకిలీ నగదు చలామణి, ఉగ్రవాద నిధులు కలిసి పని చేస్తున్నాయట. 180 దేశాల అవినీతి సూచీలో ఇండియా 80వ స్థానంలో ఉంది. అవినీతి కేసుల్లో సత్వరం సరైన శిక్షలు పడటం లేదు. రాజకీయ అవినీతి పెరిగిపోయింది. విజిలెన్స్‌ కార్యాలయాలు తపాలా పనికే పరిమితమవుతున్నాయని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
న‌గ‌దు అక్ర‌మ ప్ర‌వాహానికి అడ్డుక‌ట్టేది?
కాలం చెల్లిన చాలా పాత చట్టాలను రద్దుచేశారు కానీ ఎన్నికల్లో అక్రమ నగదు ప్రవాహాల్ని ఆపలేకపోతున్నారు. ఎన్నికల్లో నల్లధనం స్వేచ్ఛగా ప్రవహించి, సంపన్నుల మాటే చెల్లుబాటవుతోంది. రాజకీయ నిధుల సేకరణలో పారదర్శకత లేదు. ఎన్నికల వ్యయానికి పార్టీలు పోటీపడుతున్నాయి. అవినీతి సంపాదనే ఎన్నికల పెట్టుబడిగా మారుతోంది. ఏ పార్టీ మేనిఫెస్టో చూసినా లక్షలాది ఉద్యోగాలు ఇస్తామంటున్నాయి. కరోనా టీకా ఉచితమని వాగ్దానం చేశాయి. రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేలా హామీలు గుప్పించడం ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించాలన్న స్ఫూర్తిని దెబ్బతీయడమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
జీవించే హక్కు, ఆహారహక్కు, భద్రతహక్కు
మన దేశంలో పోలియో లాంటి 12 రకాల వ్యాక్సిన్‌లు ఉచితంగానే ఇస్తున్నారు. సంక్షేమ రాజ్యం కోసం కరోనా వ్యాక్సిన్‌ కూడా ఉచితంగానే ఇవ్వాలి . మన ఆర్థిక, పాలనావిధాన ప్రక్రియలు, ఆచరణలు, విధానాలు మారాలి. కూలీలకు జీవించే హక్కు, ఆహార హక్కు, భద్రత హక్కు కావాలి. శ్రమను గౌరవించాలి. కరోనా వ్యాధి తొలి దశలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూలీలు నడిచి పోతున్న భయానకమైన దృశ్యాలు చూశాం. పట్టణాలలోని భవన నిర్మాణ స్థలాల్లో ఇటుకబట్టీల్లో వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే వలస కూలీలు కార్మికులు బస్సులు రైళ్ళులేక స్వస్థలాలకు కాలినడకనే ప్రయాణమయ్యారు.
వలసల వెనుక వ్యథ గుర్తించాలి
వివిధ ప్రాంతాలకు కోట్లమంది వలస వెళతారు. ఈ వలసలకు కారణాలు ఏంటి? ఆకలి బాధ ఉపాధి లేమి. జీవనం గడపడంకోసం, మనుగడకోసం పోరాటం . దేశంలో 3 కోట్ల వ్యాపార సంస్థలలో 21 కోట్ల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ కార్మికులను తొలగించకపోతే ఎక్కడికీ వెళ్లరు. లే ఆఫ్‌లు,రిట్రెంచ్ మెంట్ల వల్ల ఉద్యోగాలు దొరికే చోటికి వెళుతున్నారు. కరోనా లాక్‌ డౌన్‌. కోట్లాది మంది వలస కార్మికుల జీవితాలను దెబ్బ తీసింది. నగరాల నుంచి భారీస్థాయిలో వలస కార్మికులు తిరుగుముఖం పట్టారు. చాలామంది చనిపోయారు. ఇంతమందికి ఉపాధి పునరుద్ధరణ కష్టమే. తమ ప్రాంతాల్లో పనులు దొరకని,పనుల కోసం ఎదురు చూస్తున్న కూలీలు అధిక సంఖ్యలో ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. వలస కార్మికులను భారీగా ఇముడ్చుకునే నిర్మాణం రంగం పుంజుకోవాలి.
పాఠ‌శాల‌లు తెరిచిన రాష్ట్రాల్లో పెరిగిన కేసులు
అనేక జాగ్రత్తలు తీసుకుని దశలవారీగా పాఠశాలల్ని తిరిగి తెరవడానికి సంసిద్ధమైన రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగాయి. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కూడా కొవిడ్‌ సోకింది కాబట్టే ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, హరియాణా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు జంకుతున్నాయి. విద్యను చట్టబద్ధ హక్కుగా నిర్ధారించిన దేశం మనది. రోగ లక్షణాలు వ్యక్తంకాని విద్యార్థులతో సన్నిహితంగా మెలగిన పిల్లల ద్వారా తోబుట్టువులకు, వృద్ధులకు కొవిడ్‌ సోకవచ్చు. దేశంలో 32లక్షల స్వచ్ఛంద సంస్థలున్నాయి. ఇవి హెచ్‌ఐవీ వంటి వ్యాధుల నియంత్రణ, దళితులు, ఆదివాసుల హక్కుల పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్య సేవలు అందిస్తూ నిరుపేదలకు అండగా ఉన్నాయి. పార్టీలు విడుదల చేస్తున్న ఎన్నికల ప్రణాళికలలో చర్విత చర్వణంగా మునుపటి వాగ్దానాలే ఉంటున్నాయి. మునుపటి ఎన్నికలలో చేసిన వాగ్దానాలను ఏ మేరకు అమలు చేశారో తెలుసుకోవాలి. జీవనోపాధి కల్పన హామీ అమలుకు గెలిచిన పార్టీలు కట్టుబడి కృషి చెయ్యాలి. అత్యంత ధనికులైన వారి మీద అదనపు పన్ను విధిస్తామని సమాజ్ వాదీ పార్టీ ప్రణాళికలో ప్రతిపాదించింది.
హామీల‌ను మ‌రిచిపోతున్న పార్టీలు
రాజకీయం అంతా పేదల చుట్టూనే రకరకాల హామీలు ఇచ్చి ఎన్నికలు ముగిశాక ఆ హామీలను మరచిపోతున్నారు. అందుకే ఎన్నికల్లో ఇచ్చే హామీలకు పార్టీలను జవాబుదారీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్‌ ఆనాడే అన్నారు. పార్టీల మేనిఫెస్టోలన్నీ అమలుకు నోచుకోని చిట్టాలుగానే మిగిలిపోతే ఏమి లాభం? పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలకు విలువ ఇవ్వకపోతే అడిగే వాళ్లేరి? ఎన్నికల హామీలకు చట్టబద్ధత ఏది? ఎన్నికల ప్రణాళికల మీద ఆడిట్‌ ఏది? మాట తప్పిన పార్టీలను నిలదీసే ఏర్పాట్లు ఏవి? అన్నీ ఉచితంగా ఇచ్చేస్తారా? మేనిఫెస్టోలలో అమలుకు సాధ్యంకాని వాగ్దానాలు ఎందుకు? తాగునీరు, ఆహారం, ఆరోగ్యం వంటి ప్రాథమిక అవసరాలు తీర్చటానికి ఖర్చు ఎంత అవుతుంది?ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంతో తెలియకుండా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపితే ఎలా?
ఏరు దాటాక తెప్ప తగలేసే పార్టీలు
ఎన్నికల మేనిఫెస్టోలకు చట్టబద్ధత కల్పింఛాలి.ఏరుదాటాక తెప్ప తగలేసే పార్టీలకు ముకుతాడు వెయ్యాలి. మేనిఫెస్టోల్లో హామీలకు తాము బాధ్యత వహిస్తామంటూ పార్టీలు కోర్టు ప్రమాణపత్రం జత చేయాలి.ఎన్నికల వాగ్దానాల అమలుకు పార్టీలనే బాధ్యులను చేయాలి. ఎప్పటిలోగా వాటిని అమలు చేస్తారో పార్టీలు చెప్పాలి. పార్టీలు ఎన్నికల సంఘం ఆమోదం తీసుకున్నాకే హామీలు ఇవ్వాలి. అప్పుడు అసాధ్యమైన హామీలు గుప్పించే వ్యక్తులు, పార్టీలు వెనక్కు తగ్గుతారు. అమలులో విఫలమైన పార్టీలను కొన్నేళ్లు నిషేధించాలి.క్రిమినల్‌ కేసుల్లో శిక్షలు ఖరారైన ఎంపీలు, ఎమ్మెల్యేలు పదవులకు అనర్హులవుతారు.అలాగే మాటతప్పిన పార్టీలను బోనులో నిలబెట్టాలి.
--- నూర్ బాషా రహంతుల్లా, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

 

6, నవంబర్ 2020, శుక్రవారం

జలవాయు కాలుష్యాలకు కళ్ళెమేది?

జలవాయు కాలుష్యాలకు కళ్ళెమేది? (సకలం 6.11.2020) ,(గీటురాయి 20.11.2020)


కరోనా వల్ల ఇంతవరకూ ప్రపంచంలో 12.33 లక్షలమంది, ఇండియాలో 1.24 లక్షలమంది చనిపోయారు. కరోనా రోగుల ప్రాణాలకు ప్రమాదం కాబట్టి దీపావళి టపాకాయలు కాల్చొద్దని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రజలకు విజ్నప్తి చేశారు. దేశ రాజధాని ప్రాంతంలో బాణసంచా విక్రయాలను నిషేధించాలని సుప్రీం కోర్టు సూచించింది. నివాస ప్రాంతాల్లో బాణసంచా కాల్చటంపై బాంబే హైకోర్టు ఆంక్షలు విధించింది. చుట్టుపక్కల పొలాలలో గడ్డిని తగలబెట్టకూడదని కేంద్రం పదే పదే రైతులను కోరింది. వాయుకాలుష్యం పెచ్చుమీరి దిల్లీలో కేజ్రీవాల్‌ ప్రభుత్వం పాఠశాలల్ని మూసేసింది. ఒడిశా, పశ్చిమబెంగాల్ , రాజస్థాన్‌, హర్యానా, డిల్లీ బాణసంచా వినియోగం, విక్రయాలపై నిషేధాంక్షలు ప్రకటించాయి. దేశంలో వాహన, పారిశ్రామిక కాలుష్యం మూలాన ఏటా మూడున్నర లక్షల శిశువుల్లో ఉబ్బసం కేసులు పెద్దల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్లు బయటపడుతున్నాయి. ధూళికణాలు గాలిలో పేరుకుపోయి నగరాల్ని ‘గ్యాస్‌ ఛాంబర్లు’గా మారుస్తున్నాయి. తగలబెడుతున్న కోట్లాది టన్నుల పంట వ్యర్థాలనుంచి కార్బన్‌ మోనాక్సైడ్‌, బొగ్గుపులుసు వాయువు, ధూళి, బూడిద, సల్ఫర్‌ డయాక్సైడ్‌ వెలువడి గాలిని, నేలను, నీటిని విషతుల్యం చేస్తున్నాయి. త్రాగునీటిలో ఫ్లోరైడ్‌ పెరిగి ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తోంది.
ట‌పాసుల ఉత్ప‌త్తిత‌నే నిషేధిస్తే మేలు
దీపావళిరోజుల్లో వాయుకాలుష్యం పెరిగిపోతుంది. బాణసంచా కాల్చిన తరువాత వాతావరణంలో కొన్ని రోజులపాటు ప్రమాదకర రసాయనాలు పేరుకుపోయి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. వాటి విక్రయాలపై ఆంక్షలు కంటే వాటి ఉత్పత్తినే నిషేధించటం మంచిదంటున్నారు. శివకాశీలో టపాకాయల కర్మాగారాలలో ప్రతి ఏటా అగ్ని ప్రమాదాలు జరిగి పనివాళ్లు ఒళ్ళుకాలి చనిపోతుంటారు. దీపావళి రోజున బాణసంచా కాల్చడంవల్ల ఆ ఒక్క రోజే అతి సూక్ష్మ ధూళి కణాలు మూడున్నర రెట్లు పెరిగి పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు మూడింతలు పెరుగుతున్నాయి. టపాకాయల తయారీ కర్మాగారాలలో ప్రతియేటా అగ్ని ప్రమాదాలే. ఎంతో మంది చనిపోతున్నారు. లైసెన్సులు ఎలా ఇస్తున్నారో? టపాసులకు తోడు రహదారి ధూళి వాహనాల ధూళి , డీజిల్‌ జనరేటర్లు, బొగ్గు కర్మాగారాలు పిల్లల వూపిరితిత్తుల్ని దుర్బలం చేస్తున్నాయి. వాయు కాలుష్యం అన్ని దేశాల్లో ఏటా 65 లక్షల నిండు ప్రాణాల్ని కబళిస్తోంది.తీవ్ర వాయుకాలుష్యం పాలబడి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ డిల్లీ గ్యాస్‌ ఛాంబర్‌లా మారిపోయిందనీ డిల్లీలో సరి, బేసి సంఖ్యల ప్రాతిపదికన రోజు విడిచి రోజు వాహనాల రాకపోకల్ని నియంత్రించారు. కనుచూపు మేర ఏముందో కానరానంతటి కాలుష్యంతో కొన్ని పట్టణాలలో ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది. ఎన్నో విద్యాసంస్థలు మూసివేశారు. ధూళికణాల పెరుగుదల వల్ల గాలి కలుషితమై, పీల్చే గాలి కాలకూటమై లక్షలాది పసికందులు చనిపోతున్నారు.
5 ఏళ్ళు త‌రుగుతున్న ఆయువు
నల్లటి దట్టమైన పొగ, దుమ్మూ ధూళి కణాలు, ఎక్కడ పడితే అక్కడ చెత్తకుప్పలు కాల్చడం వల్ల పౌరుల ఆయుర్దాయం 5 ఏళ్ళు తగ్గుతోంది. వాయుకాలుష్యం పెరిగి ఇండియాకు ఏటా రూ.4 లక్షల కోట్ల దాకా నష్టం వాటిల్లుతోంది. గాలిలో ఆర్సెనిక్‌, సీసం, నికెల్‌ శాతాలు పెరిగి శ్వాసకోశ వ్యాధులు ముమ్మరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 4.8 కోట్లకు చేరాయి. మళ్ళీ ఐరోపాలోని దేశాలన్నీ లాక్‌డౌన్లుతో హడావుడి చేస్తున్నాయి. ఉష్ణోగ్రతల తీవ్రతనూ తట్టుకొన్న కరోనా వైరస్‌ శీతకాలంలో మరింతగా విజృంభిస్తోందనీ, వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్నచోట్ల నర మేధం సృష్టిస్తుందనీ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల్లో 17 శాతం మంది వాయు కాలుష్య బాధితులే. మనకేం కాదన్న ధిలాసా ప్రాణాంతకం. మన దేశాన్ని డోనాల్డ్‌ ట్రంప్‌ కాలుష్య దేశమన్నాడు. వాయు కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మంది మరణిస్తే అందులో 2 లక్షల మంది భారత్‌కు చెందినవారేనట. ఢిల్లీ పరిసరాల్లో వున్న రాష్ట్రాలు పంట వ్యర్థాలను తగులబెడుతున్నందువల్ల పౌరుల ప్రాణాలకు ముప్పు కలుగుతున్నదనీ, అలా పంట వ్యర్థాలను రైతులు తగులబెట్టకుండా నివారించాలనీ సుప్రీంకోర్టు కోరింది.
గర్భిణులకు కూడా హానికరం
కాలుష్యపు గాలిని గర్భిణులు పీలిస్తే గర్భంలో పిండం నెలలు నిండకుండానే శిశువులు తక్కువ బరువుతో బలహీనమైన ఊపిరితిత్తులతో పుడతారు. చెడుగాలి పీల్చిన వారికి శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియా, గుండెపోటు, కేన్సర్, మధు మేహం, రక్తంలో గడ్డలు ఏర్పడటం లాంటి వ్యాధులొస్తాయని వైద్యులు చెబుతున్నారు. మన దేశ జనాభాలో 84 శాతంమంది వాయు కాలుష్యం అధికంగా వుండే ప్రాంతాల్లోనే జీవిస్తున్నారు. కార్మికుల శ్రమించే శక్తి తగ్గి ఉత్పాదకత ఆమేరకు తగ్గు తోంది. మన జీడీపీలో 8.5 శాతాన్ని వాయు కాలుష్యం మింగేస్తోంది. దిల్లీ ఏటా శీతకాలంలో ప్రజలకు ఊపిరి పీల్చుకోవడమే కష్టతరమవుతోంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో వేల మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. గడ్డిని దహనం చేయకుండా జీవ ఇంధనం వంటి ఉత్పత్తుల తయారీకి రైతులనుండి కొనుగోలు చేయాలి. కరోనా ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తోంది.
కాలుష్య భూతంతో ఆరోగ్యంపై దుష్ర‌భావాలు
ఈ పరిస్థితుల్లో కాలుష్య భూతం కూడా పంజా విసిరితే ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పెరుగుతాయి. జీవనదులకు వ్యర్థాల ఉరిగా మారాయి. మన దేశంలో ఫ్లోరోసిస్ బాధితులు కోటీ 17 లక్షల మంది. ఫ్లోరైడ్‌ అధికస్థాయికి చేరి- శరీరానికి పోషకాలు అందక రక్తహీనత ఎదుర్కొంటున్నారు. ఎముకలు గుల్లబారి నడవలేకపోతున్నారు. తాగునీటిని నదుల నుంచి సురక్షిత నీరుగా మార్చి సరఫరా చేయటం, మంచి ఆహారం ఫ్లోరోసిస్‌కు విరుగుడు. అల్యూమినియం పాత్రల్లో ఆహారం వండటం వల్ల అందులోని అల్యూమినియం ఫ్లోరైడ్‌ వల్ల నరాల జబ్బులు వస్తున్నాయి. ఫ్లోరైడ్ ఉన్నచోట్ల వర్షపు నీటిని వాడుకోవాలి. పటిక,సున్నంతో నీటిని శుద్ధి చేయాలి. మధ్యాహ్న భోజనం కింద రక్తహీనతను దూరం చేసే ఆహారం ఇవ్వాలి. విటమిన్‌ మాత్రలు పంపిణీ చేయాలి.
కృష్ణాగోదావరి జలాల ప్రక్షాళన
కృష్ణా గోదావరి మొదలైన నదుల్ని ప్రక్షాళన చేయమని ప్రజలు చాలా ఏళ్లనుండి కోరుతున్నారు. దేశంలో 70 శాతం నదుల జలాలు మనుషుల వినియోగానికి పనికి రానిరీతిలో కలుషితం అవుతున్నాయి. కృష్ణా నదికి ఉపనది అయిన మూసీ ఒకప్పుడు హైదరాబాద్‌ దాహార్తిని తీర్చేది. ఇప్పుడు మురికినీటి నాలా.దేశంలోనే అత్యంత కలుషితమైన నాలుగో నది మూసీ. అన్నినదులను ప్రక్షాళించాలి. గోదావరి, కృష్ణా నదులు మంజీర, పెన్నా, తుంగభద్ర, నాగావళి లాంటి ఉపనదులు కాలుష్యం కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. నదులు కూడా మనుషుల్లాంటివేనని వాటికీ కాలుష్యరహితంగా బ్రతికే హక్కు ఉందని న్యాయస్థానం చెప్పింది. కొన్ని నదుల్లో నీరు స్నానం చేసేందుకూ పనికిరాని స్థితికి చేరింది. చేపలు ఆ నీటిలో బతకలేని స్థితి. కృష్ణా నదిలో హానికరమైన కోలిఫామ్‌ బ్యాక్టీరియా ఉంది. పట్టణాలు, నగరాల్లోని మురుగు నీటిని పరిశ్రమల నుంచి వెలువడే ప్రాణాంతకమైన రసాయన వ్యర్థాలను శుద్ధి చేయకుండా నేరుగా నదుల్లోకి వదిలేస్తున్నారు. నదులు కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాలను శుభ్రం చేయటంలేదు. కరకట్టలు ఆక్రమణకు గురై కలుషితం కాకుండా ఇరువైపులా మొక్కలు పెంచాలి. 60 కోట్ల జనాభా నీటి ఎద్దడితో సతమతమవకుండా మన నదులు సజీవంగా ప్రవహించాలి.
---నూర్‌బాషా ర‌హంతుల్లా
( ఏపీ రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్, మొబైల్;‌ 6301493266)

https://www.sakalam.in/where-are-the-precautions-to-prevent-water-and-air-pollution/



2, నవంబర్ 2020, సోమవారం

నదులకు కరకట్టలు పటిష్టం చెయ్యాలి, మురుగుకాలువలు తవ్వించాలి!

 నదులకు కరకట్టలు పటిష్టం చెయ్యాలి, మురుగుకాలువలు తవ్వించాలి! (సకలం 31.10.2020)


వర్షాలు పడితే చాలు హైదరాబాద్‌ మునిగిపోతుందని కొన్నేళ్లనుంచి అందరూ అనుకొంటున్నారు. నగరాన్ని వర్షం వదలకుండా ముంచెత్తుతోంది. నిత్యం భారీ వర్షం నగరాన్ని వణికిస్తోంది. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మూసీ నదికి రెండు వైపులా రెయిలింగ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించించింది. నగరంలో ఉన్న మూడు వంతెనలు అఫ్జల్, ముస్సాలం జంగ్, చాదర్‌ఘాట్‌ తెగిపోవడంతో, పూరానాపుల్ వంతెన మాత్రమే నగరంలోని రెండు ప్రాంతాల మధ్య మిగిలి వుంది. ఆనాటి వరదల్లో అప్పటి పాలకుడు నిజాం మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ నిరాశ్రయులకు తమ సంస్థానాల్లోని భవనాల్లో ఆశ్రయం కల్పించారు . ఆఫ్జల్‌ దవాఖాన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ భవనం కూలిపోయింది. దానిపక్కనే 150 మంది ప్రాణాలను కాపాడిన చింత చెట్టు ఇప్పటికీ ఉంది.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య నివేదిక

మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1909, అక్టోబరు 1న ఇచ్చిన రిపోర్టు మేరకు ఏడవ నిజాం మీర్‌మహబూబ్‌ అలీ ఖాన్‌ బహదూర్‌ హైదరాబాదు నగరానికి త్రాగునీటిని అందించటానికి వరదలను నివారించటానికి 1920లో మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ ఆనకట్టను, 1927లో హిమాయత్ సాగర్ జలాశయాలను నిర్మించాడు. కుంభవృష్టి హైదరాబాద్‌ తో పాటు వరంగల్లు, విజయవాడలను కూడా ముంచెత్తింది. సహజంగా పారవలసిన నాలాలు పారలేదు. కాలువల స్థానంలో భవంతులు, షాపులు కట్టారు. వరదలను ఆపటానికి నదులపై ఆనకట్టలు డ్యాంలు, బ్యారేజ్‌ లు కట్టి ప్రకృతి విపత్తుల నిర్వహణ వ్యయమంతా కేంద్రమే భరించాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. ఆనాడు కోరంగి రేవు పట్టణం భారీ ఉప్పెనలో నేలమట్టమయి పోయింది.

దిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తానన్న కేంద్రం ఏం చేసింది?

దిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని చెప్పిన కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చి తరువాత రాజధానితో మాకు సంబంధం లేదని హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేసింది. రాజధానిలో రాజధాని లేకుండా ప్లాట్లు ఇస్తే ప్రయోజనం ఏముందని భూములు ఇచ్చిన రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం అంటోంది. రాజధాని నిర్మాణం వలన ప్లాట్లకు విలువ పెరుగుతుందని, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని, ఉపాధి దొరుకుతుందని భూములిచ్చిన రైతుల ఆశ. రాజధాని చుట్టూ నవనగరాలు లేకపోయినా ఇప్పటికే కట్టిన నిర్మాణాలను పూర్తిచేయ్యాలి. అభివృద్ధి వికేంద్రీకరణ మంచిదే. ప్రజావేదిక లాగా కట్టినవాటిని కూలగొట్టకుండా వాడుకోవాలి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారి వరద పోటెత్తింది. దీంతో సాగునీరును దాచుకునే సాగరాలు, చెరువులు, రిజర్వాయర్లు లేక వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు ఉప్పుసముద్రంలోకి విడుదల చేశారు.

వరదలు వచ్చి ప్రాణాలు హరించినా అడ్డుకునే ప్రయత్నం లేదు

చరిత్రలో కోరంగి,దివిసీమలతోపాటు హైదరాబాద్, మద్రాసు, మైసూరు, బొంబాయిలు కూడా పెనుతుపానులకుగురయ్యాయి. ప్రజలు మృత్యు వాత పడ్డారు.వరదలను అడ్డుకునే నిర్మాణాలు జరుగలేదు. ప్రకృతి సహజ పరిసరాలను దోచు కోవడమే ఈ వరదలకు వినాశనానికి కారణం. నాలాలు ఆటంకం లేకుండా ప్రవహించటం లేదు. నాలాలనూ, చెరువులనూ దురాక్రమించారు. మురికి మూసీని నది అనగలమా? భారీ వర్షంతో పాచిపోయిన నిల్వ నీటి వాడకంవల్ల ఆరోగ్య సమస్యలొచ్చాయి. నీటి పైప్‌లైన్ల కింద నేల కోసుకు పోయి గుంటూరులో సప్లయి అయిన మురుగునీరే తాగి అక్కడి జనం డయేరియా పాలయ్యారు. ఉప్పెనలో మునిగి ఉన్న కుటుంబాల పునరావాసం ఎప్పటికి పూర్తి చేస్తారో? హైదరాబాదులో వరదాబాధితులకు పదివేలరూపాయల చెక్కులిచ్చారట. వరదనీరు తీసేంతవరకు తమ ఇళ్లకు వెళ్లలేరు. మళ్ళీ మళ్ళీ వానలు వరదలు సద్దుమణగకుండా అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. వీధులు అంధకారంలో మగ్గుతున్నాయి.

చేసిన తప్పే చేస్తున్నారు

వరదల సమయంలో అక్రమనిర్మాణాలను కూల్చివేసిన తరువాత మళ్ళీ నిర్మాణాలు చేస్తున్నా పట్టించుకోవటంలేదు. అధికారులూ, ప్రజాప్రతినిధులూ మౌనంగా ఉంటున్నారు. ఇళ్ళు మునిగిపోయినప్పుడు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నాలాల కబ్జాలను నిర్మొహమాటంగా తొలగించాలన్నారు. కబ్జాలను కూల్చివేసి, నాలాలకు బౌండరీలు నిర్ణయించి గోడలు కట్టాలని ఆదేశించారు. స్వాతంత్ర్యం అనంతరం గోదావరికి 11 సార్లు వరదలు వచ్చాయి 1953, 1986 లలో చాలా పెద్ద వరదలు వచ్చాయి. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 20లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని సముద్రంలోకి వదిలారు. 1986 వరదల్లో సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన బ్యారేజ్ ద్వారా 35 లక్షల క్యూసెక్కుల వరద జలాలు పారి గోదావరి గట్లు తెగిపోయాయి. వందలాది గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 1986 నాటి వరదల స్థాయికి మరో 5 అడుగుల ఎత్తులో 550 కిలోమీటర్ల మేర గోదావరి ఏటి గట్ల ఆధునికీకరణ చేశారు.

మురుగు కాల్వలు కావాలి

పోలవరం ప్రాజెక్ట్ లో కట్టిన కాఫర్ డ్యాములవల్ల గోదావరి నీటి ప్రవాహం దిశ మారి వరద జలాలు ఎగబడి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రవాహం చాలా తీవ్రంగా పెరిగింది. ఇంకా కొన్ని చోట్ల ఏటిగట్లు బలహీనంగా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆరికరేవుల, కుమారదేవం , దొంగరావిపాలెం గండ్లు , తూర్పు గోదావరి జిల్లాలోని వేమగిరి, కూళ్ల, సుందరపల్లి, బొబ్బిల్లంక గండ్లు ఇలాంటివే. కృష్ణానదికి వరదలొచ్చి విజయవాడలోని వివిధ కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. చంద్రబాబు నాయుడు నదిలో నివాసం ఉన్నందుకు హైదరాబాదులో ఇల్లు కట్టుకున్నందుకు ఇక్కడి ప్రజలు కొందరు ఆక్షేపిస్తున్నారు. కృష్ణలంక తోట్లవల్లూరు వద్ద పీకల్లోతు వరదనీరు వచ్చింది. కృష్ణా తీర ప్రజలు కరకట్ట నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజికి ఎగువన ఉన్న రాజధాని నగరానికి మురుగు కాలువ కావాలి. మురుగును నదిలో కలపకూడదు. రెండు రాష్ట్రాలలో నదులకు కరకట్టలు పటిష్టం చెయ్యటంతో పాటు మురుగును నదుల్లో కలపకుండా విడిగా మురుగుకాలువలు తవ్వించటం తక్షణ అవసరం.



 

ఆకలి రోగాల భయాల నుంచి ఎప్పటికి కోలుకుంటామో?

 

ఆకలి రోగాల భయాల నుంచి ఎప్పటికి కోలుకుంటామో? (సంకల్పం 2.11.2020)

 
ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16 న జరుపుకున్నారు.ఈ ఏడాది నోబెల్‌ శాంతి పురస్కారం 88 దేశాల్లో పదికోట్ల మందికి 42 లక్షల టన్నుల ఆహారాన్ని, అందజేసిన ప్రపంచ ఆహార సంస్థకు ఇచ్చారు. ఆకలితో అలమటించే వారికే తెలుస్తుంది ఎదుటి వారి ఆకలి గురించి అది పశువైనా,మనిషైనా సరే.ఆకలితో అలమటించే సమాజంలో అరాచకం ప్రబలుతుంది.అది సాయుధ ఘర్షణలకు,యుద్ధాలకు కారణమవుతుంది.కొన్నిచోట్ల ఆకలికితాళలేక చిన్నారులు మట్టి తింటే పిల్లల్ని ఏమార్చటానికి తల్లిగులకరాళ్ళు ఉడకేసిందట. లాక్ డౌన్ వలన ఏమీదొరకక రోడ్లపై పోతున్న వలస కూలీలు ముళ్లతోకూడిన పామాయిల్ గెలలను తిన్నారు.వారిపై రసాయనాలు చల్లారు.ఆహారం ఎక్కడపెడుతుంటే అక్కడికి పరుగులుతీశారు.యెమెన్ లాంటి దుర్భిక్ష దేశాలకు సంపన్న అరబ్ దేశాలు చేసే సాయం సరిపోవటంలేదు.శరణార్ధులను అమెరికాలోకి రానియ్యని ట్రంప్ ను సిరియా బాలిక ఆలాబెద్ నీకు ఆకలి అంటే తెలుసా?ఎప్పుడైనా 24 గంటలు అన్నపానీయాలు లేకుండా ఉన్నావా అని అడిగింది. అమెరికా లాంటి సంపన్నదేశాలు ఆయుధ వ్యాపారంలో మునిగితేలుతున్నాయి. వేలాదిమంది ఆకలితో అలమటించి మరణిస్తారు.పోషకాహారం లోపించి వ్యాధులబారిన పడి చనిపోతారు. ఆహార పంపిణీ శాంతి సాధనకు తోడ్పడుతుంది. ఐక్యరాజ్య సమితి లక్ష్యాల్లో 2030 నాటికి ఆకలిని అంతం చేయడం కూడా ఒకటి. ఐరాస ప్రజానీకానికి అన్నదాతగా నిలుస్తోంది. అటు ఆహార పంపిణీ కార్యకలాపాలను, ఇటు శాంతి స్థాపన కృషిని మిళితం చేస్తూ పనిచేస్తోంది.భూస్వాములు, వడ్డీ వ్యాపారస్తులు సమాజాన్ని పట్టి పీడిస్తున్నారు.చాలా మంది ప్రజలు కూరలు చేసుకోకుండా కేవలం పప్పు అన్నం తిని బ్రతుకుతున్నారు. పంట కోతలు,నూర్పిళ్ళు వంటి పనులకు మహిళలను వదిలిపెట్టి పురుషులు పని వెతుక్కుంటూ వెళతారు. ఒక్కోసారి వారి కుటుంబాలతో పాటు వెళతారు.అందుబాటులో వున్న పనులతో మహిళలు ఇల్లు గడుపుకుంటూ వస్తారు.ఉపాధి కోల్పోయి ఆదాయాలు ఆగిపోయిన కార్మికులు, వ్యవసాయ కూలీ మహిళలు వేరే ప్రాంతాలకు వలస వెళ్ళినవారు తమకు దొరికిన వాహనాలను పట్టుకుని నడుచుకుంటూ ఇళ్ళకు చేరుకున్నారు.వందలాది జాలర్లు సముద్రంలో చిక్కుకుపోయారు. కరోనా సోకినవారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు లేవు. మిగిలిన వ్యాధులతో బాధపడేవారికి ప్రజారోగ్య వ్యవస్థలు పనిచేయనందువలన గర్భిణులు దెబ్బతిన్నారు. ఆన్‌లైన్‌ చదువులతో తమకు చదువులు అక్కర్లేదంటారేమోనని పలువురు యువతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు కరోనా భయం కన్నా ఆకలి చావుల భయం ఎక్కువగా ఉందని పేదవారు అంటున్నారు. వీరిలో చాలామంది స్మార్ట్‌ ఫోన్లు కొనలేరు. కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు పిల్లలు వుంటే వారిలో కేవలం మగపిల్లలను మాత్రమే చదువుకోనిస్తున్నారు .కుటుంబ భారాన్ని తగ్గించేందుకు ఆడపిల్లలను మధ్యలో చదువు మానిపిస్తున్నారు.ఆడపిల్లలకు ఆన్‌లైన్‌ చదువులు వద్దంటున్నారు. ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌)లో 107దేశాల ర్యాంకులలో మన దేశం 94వ స్థానంలో ఉన్నది. ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లల జాబితాలో మన దేశం బంగ్లాదేశ్‌ (75), పాకిస్తాన్‌ (88) కన్నా దిగువ స్థాయిలో ఉన్నది. మన దేశ జనాభాలో 14 శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. పౌష్టికాహార లోపం వలన 3.7 శాతం మంది పిల్లలు మరణిస్తున్నారు.
కరోనా మహమ్మారి వలన ఆహార సమస్య దేశంలో తీవ్రంగా ఉంది. ప్రజల కొనుగోలుశక్తి దారుణంగా పడిపోయింది. ఆహార ద్రవ్యోల్బణం ప్రభావంతో ఆహార పదార్ధాల ధరలు పెరిగి ప్రజలకు ఆహారం దూరమవుతోంది. కరోనా లాక్‌డౌన్‌ లో ప్రజలకు అవసరమైన ఆహార ధాన్యాలను విడుదల చేయాలి. పేదలు మరింత పేదలుగా మారుతుండగా రెండవ వైపు అంబానీ, అదానీల సంపద ఇంకా ఇంకా పెరుగుతోంది. అవసరమైనంత ఆహారం తీసుకోక మన పిల్లలు వయసుకు తగినంత బరువు,ఎత్తు లేరు.బాలల మరణాల శాతం 3.7 శాతం ఉంది. ప్రజలకు ఆహార కొరత ఉంది. కుటుంబాలు దరిద్రంలో ఉండటం వలన ,తక్కువ క్వాలిటీ ఆహారం తీసుకొంటున్నారు. తల్లులకు తగిన విద్య లేదు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లు కూడా మనకన్నా ముందు స్థానాలలో ఉన్నాయి.మేకిన్‌ ఇండియా, ఆత్మ నిర్భర్‌ భారత్‌ ల వల్ల కూడా ఆకలి సమస్య తగ్గలేదు.మనమూ సుడాన్‌ ఒకే స్థానంలో వున్నాం. కేవలం చైనా, బెలారస్, ఉక్రెయిన్, టర్కీ, క్యూబా, కువైట్‌ దేశాలు మాత్రమే ఉత్తమంగా నిలిచాయి.
ఒకపక్క శ్రీమంతుల జాబితా పెరుగుతోంది. దానికి సమాంతరంగా, సమానంగా ఇటు ఆకలిమంటలు కూడా విస్తరిస్తున్నాయి. 2,189 ప్రపంచ కుబేరుల సంపద పదిన్నర లక్షల కోట్ల డాలర్లు. టెక్, హెల్త్‌కేర్, పారిశ్రామిక రంగాలు వారిని మరింత కుబేరుల్ని చేస్తాయి. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఆదాయం తీవ్రంగా పడిపోయి , అప్పులబారిన పడి 12 కోట్లమంది పేదరికంలోకి జారుకున్నారు.
ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌వంటి అధిక జనాభావున్న పెద్ద రాష్ట్రాలు ఎప్పటికీ వెనకబడే వుంటున్నాయి. ఈ రాష్ట్రాల్లో పౌష్టికాహారలోపం తీవ్రత ఎక్కువుంది. శిశువుల్లో 5% మంది ఉత్తరప్రదేశ్‌ పిల్లలే. పిల్లలకు సురక్షితమైన, పుష్టికరమైన ఆహారం చవగ్గా అందించాలి. మాతా శిశు సంరక్షణ పథకాలను బాగా అమలు చేస్తూ బిడ్డ కడుపులో పడినప్పటినుంచీ మంచి పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం తల్లికి పిల్లలకూ అందేలా చూస్తే తక్కువ బరువుండటం, ఎత్తు తక్కువగా వుండటం, పసి వయసులోనే మృత్యువాత పడటం వంటి సమస్యలు తగ్గుతాయి. దేశంలో రోజూ 20 కోట్లమంది ప్రజలు కడుపుకింత ముద్ద దొరక్క పస్తులుంటున్నారట. పౌష్టికాహారం దేశ జనాభాకు అందుబాటులో లేకపోవడమే అనారోగ్య హేతువు.బలమైన ఆర్ధికశక్తి అమెరికాతో పోటీ పడుతున్న చైనా యుద్ధానికి సై అంటోంది.భారతదేశం వెనుకబడిన పాకిస్థాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ లతో పోటీపడుతోంది. ప్రపంచవ్యాప్త క్షుద్బాధితుల్లో పాతికశాతం భారత్‌లోనే పోగుబడి ఉన్నారు.వృద్ధిరేటు 4శాతానికి పడిపోయింది.అంబానీ ఆదాయం గంటకు 90కోట్లు కాగా, గ్రామీణ పేదల ఆదాయం నెలకు 5వేలు. ఆర్ధిక అసమానతలు పెరిగాయి.కార్పొరేట్ల కుబేరుల సంపద పెరిగింది కానీ ఉద్యోగాలూ ఉపాధీ కోల్పోయిన సాధారణ ప్రజల ఆదాయాలు పడిపోయాయి.ఉద్యోగులకు కరువుభత్యం క్రమంగా రావటం లేదు.పెన్షనర్లు అర్జీలు పెట్టుకున్నా విచారణ నివేదికలు ఏళ్లకుఏళ్లు జాప్యం చేయటం వల్ల ఆర్ధికేతరకేసులు కూడా తెమలక పూర్తి పెన్షన్ రాక రిటైర్ అయిన వారు బాధపడుతున్నారు.సకాలంలో రిపోర్టులు పంపని అధికారుల్ని అదిలించాలి. స్పందనలో వచ్చే ప్రతి అర్జీకి బాధ్యతగా సకాలంలో జవాబులు ఇవ్వండని ముఖ్యమంత్రి చెబుతూనే ఉన్నారు.కానీ ఉద్యోగులు తమ ప్రతి జాప్యానికీ కరోనాను ఒక కారణంగా చూపుతున్నారు. ఫోన్ ఇన్ కమింగ్ కు కూడ డబ్భులు చెల్లించాలట.కేబుల్ సెట్ టాప్ బాక్స్ రెండు వేల రూపాయలు చెల్లించి కొనుక్కోవాలి.వంద చానళ్ళకు నెలకు నూటయాబై రూపాయల ఫీజు వేయి రూపాయలు దాకా అయ్యింది. పెట్రోల్ కంటే డీజిల్ రేట్ పెరిగింది. ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ సంస్థలకు అమ్మారు. ఉద్యోగాలు ఊడాయి. కులం,మతం పేరుతో పరువు హత్యలు హత్యాచారాలు పెరిగాయి.ప్రజారోగ్యంకోసం కొత్తగా ప్రభుత్వ హాస్పటల్స్ పెరగాలి.విదేశాలనుండి నల్లదనం తీసుకురావాలి.కరోనా మహమ్మారి ప్రజల దుస్థిని మరింత పెంచింది. ప్రాణాంతక వైరస్‌లు, యుద్ధాల భయం మనల్ని ఆవరించింది. చిరంజీవి లాంటి ఆకలి మహమ్మారి కూడా కరోనాకు తోడై లక్షలాది మందిని బలితీసుకున్నది. ఆకలి రోగాల భయాల నుంచి ఎప్పటికి కోలుకుంటామో? వండిన తాజా ఆహారాన్ని ప్రజలకు అందించడం ప్రజల్లో ఆదరణ చూరగొంటున్న ప్రక్రియ. తమిళనాడు లో అమ్మ క్యాంటీన్లు , రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ (దీన్‌దయాళ్‌ భోజనాలయ), తెలంగాణ (అన్నపూర్ణ) ఆంధ్రప్రదేశ్‌ (అన్న క్యాంటీన్లు/రాజన్న క్యాంటీన్లు/ గోరుముద్ద ), కర్ణాటక లో (‘నమ్మ క్యాంటీన్‌’),ఒడిశా, దిల్లీ, యూపీ, హరియాణా, పంజాబ్‌ లలో వేరువేరు పేర్లతో పెదప్రజలకు సబ్సిడీ ధరలకు ఆహారం అందించే కార్యక్రమాలకు పేదలు బ్రహ్మరథం పట్టారు.కరోనా తగ్గేవరకు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకొని ఉచితంగాగానీ చవక ధరలతోగానీ ఆన్నదాన కార్యక్రమాలు చేపట్టటం మంచిది. తక్కువ ధరకే పేదల ఆకలి తీర్చే ఒక్కో క్యాంటీన్‌ కనీసం పది మంది మహిళలకు ఉపాధి కూడా కల్పిస్తుంది.సబ్సిడీ క్యాంటీన్లే ఆహార హక్కుకు దగ్గరి దారి! దేశంలో పేదరికం తాండవిస్తున్న అన్నీ ప్రాంతాలకూ ఈ క్యాంటీన్లను విస్తరించాలి. క్యాంటీన్ల నిర్వహణలో పరిశుభ్రత మెరుగుపరచి ఆహారం ధర కొద్దిగా పెంచినా చెల్లించడానికి వినియోగదారులు వెనకాడరు.దేశాభివృద్ధికి పౌష్టికాహారమే పునాది.
-- నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266