ఈ బ్లాగును సెర్చ్ చేయండి

24, సెప్టెంబర్ 2020, గురువారం

వ్యవసాయ బిల్లులు రైతులకు మేలు చెయ్యాలి


వ్యవసాయ బిల్లులు రైతులకు మేలు చెయ్యాలి (గీటురాయి 2.10.2020)
దేశ జాతీయోత్పత్తి లో 18శాతం వ్యవసాయ రంగానిదే.మన దేశంలోని 60 శాతం మంది ప్రజలకు వ్యవసాయరంగమే జీవనాధారం.సాగుచేస్తున్నవారిలో 82శాతం మంది చిన్న సన్నకారు రైతులే. పార్లమెంటులో మోదీకి ఎదురులేదు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌ బిల్లుల కోసం దీక్షకు దిగారు. మూజువాణి ఓటుతో వ్యవసాయ బిల్లులు నేగ్గాయి.వ్యవసాయ బిల్లును తేనె పూసిన కత్తి అని కేసీఆర్ వ్య్తతిరేకించారు.స్వపక్ష మంత్రి హర్ సిమ్రత్ కౌర్ రాజీనామా చేషారు.హర్యానా జెజెపి ఎంఎల్‌ఎలు రోడ్డెక్కారు.18 పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ రాష్ట్రపతికి విజ్నప్తి చేశాయి.కనీసం సెలెక్ట్ కమిటీకి నివేదించాలని బిజూజనతాదళ్ కోరగా ఈ బిల్లులు సంపన్నులకే మేలు చేస్తాయని బిఎస్‌పి అధినేత్రి మాయావతి అన్నారు. వైసీపీ, టిడిపి,తమిళ మనీలా కాంగ్రెస్, బోడే పీపుల్స్ ఫ్రంట్ మద్దతు ప్రకటించాయి. గతంలో దళారీల దయాదాక్షిణ్యాలపై రైతులు బతికారని, ఈ బిల్లుల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర దక్కుతుందని వైసీపీ చెబుతోంది కానీ రైతు బంధు, రైతు ఆసరా లాంటి పథకాలు కొనసాగాలంటే ఎలా ? బడా వ్యాపారవేత్తలు, కార్పొరేట్‌ సంస్థలు, అగ్రి బిజినెస్‌ సంస్థలు రైతాంగాన్ని పెద్ద ఎత్తున దోపిడీ చేస్తారనే భయంతో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా హర్యానా, పంజాబ్‌, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు సాగాయి.ఆహార ధాన్యాల నిల్వలపై పరిమితులను ఎత్తివేశారు.పప్పు ధాన్యాలు, కాయ ధాన్యాలు, ఖాద్య తైలాలు, ఉల్లిపాయలు, బంగాళా దుంపలు నిత్యావసర సరుకుల జాబితా నుండి తొలగిస్తారు. వీటి నిల్వలపై పరిమితులను కూడా ఎత్తివేస్తారు. ఇందువలన బడా వ్యాపారస్తులు, కార్పొరేట్లు, బాగుపడతారు.నేరుగా రైతుల నుండి వర్తకులు,కొనుగోలు చేసే లావాదేవీలపై పన్నులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం వుండదు. కార్పొరేట్‌ సంస్థలు ప్రైవేట్‌ మార్కెట్‌ యార్డులను ఏర్పాటు చేసుకోవచ్చు. వీరు కేంద్రం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉండదు. టోకు వ్యాపారస్తులతో, ఎగుమతిదారులతో, పెద్ద రిటైల్‌ సంస్థలతో మన రైతులు కాంట్రాక్ట్‌ కుదుర్చుకోవాలి.రాష్ట్రాలకు ఎలాంటి హక్కులు ఉండవు. విత్తన చట్టం లేకపోవడం వల్ల విత్తనోత్పత్తి రైతులు కార్పొరేట్‌ విత్తన వ్యాపార సంస్థలకు వేల కోట్లు నష్టపోతున్నారు. కానీ విత్తన వ్యాపారులు మాత్రం పెద్ద ఎత్తున లాభాలు సంపాదిస్తున్నారు. రాష్ట్రాలకు జీఎస్టీ బకాయీలు 3 లక్షల కోట్లు చెల్లించటానికి 67వేల కోట్లు పెట్రోల్‌పై సెస్‌ వేశారు.మిగిలిన 2.33 లక్షల కోట్లను రాష్ట్రాలే బయట అప్పులు తెచ్చుకోవాలని... ఇది దైవ నిర్ణయమని చెప్పారు.మన ఆర్థిక వ్యవస్థ 24 శాతం పతనం అయింది.కరోనా దెబ్బకు ప్రపంచంలో 9.77లక్షలమంది చనిపోతే మన దేశంలో 90 వేలమంది చనిపోయారు.ఇటువంటి సమయంలో వైద్యంపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలి. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కోసం, మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చు చేయాలి. యంత్రాలు, భవనాలు, రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయాలి. అమెరికాలో 10 శాతం, జర్మనీలో జపాన్‌ లో 5 శాతం, ప్రజలకు సహాయం కింద కేటాయించారు. దేశం 5 కోట్ల ఉద్యోగాలను కోల్పోయింది.పెట్టుబడిదారుల్ని సంపద సృష్టికర్తలు అంటున్నారు.వారే ఆత్మనిర్భర సాయంతో ఆర్థిక వ్యవస్థను ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలి.ఇపిఎస్‌ -95 పెన్షన్‌ స్కీం ఎత్తివేసి మామూలు పెన్షన్ ఇవ్వాలి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటం కోసం వ్యవసాయ,గ్రామీణ రంగాల్లో రూ 25 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టాలి.దేశమంతటా గ్రామస్థాయిలో నిల్వ, రవాణా సదుపాయాలతో గిడ్డంగుల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయ్యాలి.నిల్వ చేసుకున్న ఉత్పత్తులకు గాను రుణాలు ఇవ్వాలి. రైతులకు పింఛను పథకం ,వడ్డీ లేకుండా కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు ఇవ్వాలి.నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలి. సహకార సంఘాల ద్వారా వ్యవసాయ, పాడి, మత్స్య ఉత్పత్తులను మార్కెట్ చేయాలి.చిన్న రైతులు తమ పంటలను నిల్వ చేసుకోకుండా కల్లాల వద్దనే పంటలు అమ్ముకుని అవసరాలు తీర్చుకుంటారు. నిలువ చేసుకుని, దేశంలో ఎక్కడైనా అమ్ముకుని లాభపడలేరు.దేశంలో 23 పంటలకు మాత్రమే కనీస మద్దతు ధర ఉంది.మరిన్ని పంటలకు మద్ధతు ధర ఇవ్వాలి.దేశంలో పండిన గోధుమ, వరిలో 6 శాతం మాత్రమే ప్రభుత్వం సేకరిస్తోంది. ద్రవ్యోల్బణం, రైతు పెట్టే పెట్టుబడి కంచె, బోరుబావి , పొలం చదునుచేయడం అన్నీ రైతుకు ఖర్చులే.కార్పొరేట్ కంపెనీలతో కలిసి రైతులు కాంట్రాక్టు వ్యవసాయం చేయలేరు.ఇంతకంటే మార్కెట్ కమిటీలు నయం. నిత్యావసర వస్తువుల ధరలు అదుపు తప్పితే ఎఫ్‌సీఐ తన వద్ద ఉన్న నిల్వలను మార్కెట్‌లోకి విడుదల చేసేది.లాభాలుంటేనే వ్యాపారం చేసే బహుళజాతి కంపెనీలు ప్రజాపంపిణీ వ్యవస్థకు సహకరించవు. వ్యవసాయ మార్కెట్ వ్యవస్థ బహుళజాతి కంపెనీలపరమైతే మార్కెట్‌ యార్డుల్లో స్థానికంగా ఉండే వ్యాపారులు, దళారులు , హమాలీలు, కూలీలకు ఉపాధి దొరకదు. కార్పొరేట్లకు 20 లక్షల కోట్లు పన్నుల రాయితీ దొరికింది.బ్యాంకులు, బొగ్గు గనులు, బీమా సంస్థలు, రైల్వేలు వంటి ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించారు. బడా వ్యాపారులు, నేరుగా రైతుల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేస్తారు.అంబానీ, ఆదానీ, వాల్‌మార్ట్‌ వంటి పెద్దపెద్ద కార్పొరేట్లకు రైతుల నుంచి భూమి సేకరించి ఇస్తే వాళ్లు కాంట్రాక్టు వ్యవసాయం చేస్తారు. రాష్ట్రాల జాబితాలోని వ్యవసాయ మార్కెట్‌ రంగాలపై కేంద్రం పెత్తనం వస్తుంది. మారిన కార్మిక చట్టాలతో ఉద్యోగ భయం, జీతాల కోత బెంగ పెరిగింది. ముందస్తు అనుమతి లేకుండా లే ఆఫ్‌లు, రిట్రెంచ్‌మెంట్‌లు చేయొచ్చు. లేదా మూసివేయొచ్చు.కార్మికుల పనిగంటలు పెంచారు. ప్రమాదాలలో చనిపోయిన కార్మికులకు సాయం పెంచాలి. వ్యవసాయ బిల్లుల ద్వారా ప్రజలకు అన్నంపెట్టే రైతులకు కూడా మేలు చెయ్యాలి.
నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266

 



20, సెప్టెంబర్ 2020, ఆదివారం

సెంట్ ఫకీర్ తెలుగు మీడియం ఇంగ్లీష్ కాన్వెంట్ ! (ఉబుసుపోక గీటురాయి1.8.1986 ,18.9.2020)

సెంట్ ఫకీర్ తెలుగు మీడియం ఇంగ్లీష్ కాన్వెంట్ !
(ఉబుసుపోక గీటురాయి1.8.1986 ,18.9.2020)


“ఇంటిపేరు క్షీరసాగరం వారు, ఇంట్లో మజ్జిగ చుక్కకు గతి లేదు” అన్నట్లు సెయింట్ల కాన్వెంట్లలో చదువు మహా డాబుసరి వ్యవహారంగా తయారయింది. ఇంటికూడు తిని, ఎవరి వెంటో పడినట్లుగా కాన్వెంట్ల యాజమాన్యం ప్రవర్తిస్తున్నది. అసలు ఈ ప్రపంచంలో ఏ మూల ఏ ప్రక్రియ సక్సెస్ అవుతుందో దాన్ని మనవాళ్లు ఇట్టే స్వతంత్ర్యం చేసుకుంటారు. ఆనవాలు పట్టడానికి కూడా వీలు లేకుండా దానికి నకిలీ తయారు చేస్తారు. నాణ్యతలో తప్ప మరి దేనిలోనూ తేడా మనకు కనపడదు.
ఏదో నాలుగు తెలుగక్షరాలు నేర్చుకొని కుదురుగా చదువుకొంటున్న మా అమ్మాయిని ఇంగ్లీసు మీడియం చదివించాల్సిందేనని మా ఆవిడ పట్టుపట్టింది. ఎందుకంటే మా పక్కింటివాళ్లమ్మాయి పొద్దున్నే బూట్లు, టై, బ్యాడ్జీ మరేవేవో వేసికొని టిప్‌టాప్‌గా కాన్వెంటుకు వెళ్లేది. ఇంటికొచ్చి “బటర్‌ఫ్లై.. బటర్ ఫ్లెయి” అని అరుస్తూ ఉండేది. పక్కింటివాళ్ల పిల్ల అరుపులు విన్న మా ఆవిడ ఒక్క ఉదుటున నా దగ్గరకు పరిగెత్తుకొచ్చి “మన పిల్లను కూడా కాన్వెంటులో చేరుస్తారా లేదా? అని నిగ్గదీసేది. ఈ ఇంటిపోరు పడలేక చివరికి కాన్వెంట్ల వేటలో పడ్డాను. దారిలో ఓ మిత్రుడు తోడయ్యి అచ్చంగా కాన్వెంట్లే ఉండే ఒక బజారుకు తీసికెళ్ళాడు.
అన్ని కాన్వెంట్లూ తిరిగి చూసాం. కొద్దో గొప్పో తేడాతో అందరూ మూడువేలదాకా ముట్టజెప్పుకోమని అడిగారు. మూడు రూపాయల ఖర్చు కూడా లేకుండా మా వూరి వీధి బడిలో చేరి చదివానే. ఇక్కడేంటి మూడు వేలు ఫీజంటున్నారు? ” అని వెంటొచ్చిన మిత్రుణ్ణి అడిగాను.
“ఊదు వేయందే పీరు లేవదోయ్ బాషా! అయ్యెలిమెంటరీ స్కూళ్ళూ, ఇయ్యేమో సెయింట్ స్కూళ్ళు. ఆటికి ఈటికి తేడాలేదా?” అన్నాడు సెయింట్ అనే మాటకు అంత విలువ ఉందట. “సెయింటంటే ఏందని అడిగాను. “సన్యాసి, రుషి లేదా ముని” అని తడుముకోకుండా జవాబిచ్చాడా బైరాగి. సన్యాసుల స్కూళ్ళకు సంపాదనాశ మెండా?”అని అనబోయి కూడా ఆపుకున్నాను.
ఇంకాస్త ముందుకొస్తే అతి విచిత్రమైన బోర్డు కనబడింది. అది “ఆల్ సెయింట్స్ హైస్కూల్” నాకు నానార్ధాలు గోచరించాయి.. ఇదేం పేరురా మిత్రమా ఇలా ఉంది? అన్నాను. అవునోయ్ రోజుకొక కాన్వెంట్ పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో కొత్త కొత్త సెయింట్ల పేర్లు వాటికి తగిలిస్తున్నారు. ఉదాహారణకు సెయింట్ వాణి, సెయింట్ రాణి, సెయింట్ జాక్‌పట్, సెయింట్ ఆయిషా, సెయింట్ ఖాదర్ వలీ, సెయింట్ ఫకీర్‌సాహెబ్, సెయింట్ లిల్లిపుట్.. ఇలా అడ్డమైన పేర్లన్నీ పెట్టేస్తున్నారు కదా? వీళ్లందర్నీ భూత, వర్తమాన భవిష్యత్కాలంలో చావుదెబ్బ తీయడానికి ఈ మహానుభావుడు “ఆల్ సెయింట్స్” అని పెట్టుకున్నాడు. తప్పేమిటి?” అని ఎదురు ప్రశ్న వేసాడు.
సరే ఆ రోజుకు పని కాలేదు ఇంటికి తిరిగొచ్చాను. పక్కింటి పాపాయిని పిలిచి, “పాపా! నీవు చదివే స్కూలు పేరేంటమ్మా?” అని అడిగాను. “సెయింట్ వోణి” అనుకుంటూ ఆ పిల్ల పరుగు తీసింది. “స్కూలు పేరడిగితే సెంటూ, వోణీ అంటుందేమిటి ఆ పిల్ల?” అని మా ఆవిడ ప్రశ్నించింది. అదేలే “సెంట్ వాణి” అన్నాను. “మధ్యలో ఆ సెంట్ ఏమిటండి. ఎంచక్కా వాణి కాన్వెంటో, వాణి స్కూల్ అనో పెట్టుకోక” అంది. “ఆ సెంటు లేకపోతే స్కూలు వాణికి విలువలేదే పిచ్చిమొగమా!” అన్నాను. నా ఫ్రెండుతో గడించిన జ్ణానాన్ని ఉపయోగించుకొని ఆ సెంట్ అంత ఖరీదైనదా? మళ్ళీ ప్రశ్న. చివరికెలాగో ఒక గంట సుధీర్ఘోపన్యాసం చేసి ఆమె చేత “అలాగా” అనిపించాను.
మరునాడు అమ్మాయిని తీసికెళ్ళి కేవలం రెండొందలు మాత్రమే అడ్మిషన్ ఫీజు తీసుకొన్న సెయింట్ చెన్నారెడ్డి ఇంగ్లీషు మీడియం స్కూలులో చేర్పించాను. పక్కింటి పాపాయితో ధీటుగా మా పిల్లను తయారుచేసి బండెడు పుస్తకాలను వీపుమీదకెత్తి పంపించాము. అలా సంవత్సరం గడిచింది. అమ్మాయి ఇంగ్లీషులో మాట్లాడేదింకెప్పుడు? అని నాకు ఆదుర్దాగా ఉండేది. “అమ్మా మీ స్కూల్లో టీచర్లు ఇంగ్లీషులో మాట్లాడతారా? ఆపుకోలేక అడిగాను “లేదు నాన్నా, ఎంచక్కా తెలుగులోనే మాట్లాడుకుంటారు. పాఠం మాత్రం ఇంగ్లీషులో చెబుతారు” అంది. ఇంతకు ముందు తెలుగులో పాఠాలు చదివి అర్ధం చేసుకునేది. ఇప్పుడు ఇంగ్లీషు, తెలుగు ఏదీ పూర్తిగా రావటంలేదు అనుకొన్నా. మా పక్కింటి పాపయ్య భార్యతో అంటున్నాడు. “సెంట్ వాణిలో అంతా తెలుగోళ్ళే. లాభం లేదు. సెంట్ పంగనామం స్కూలులో చేర్పిస్తేగాని పిల్ల బాగుపడదు. అక్కడ అంతా అరవోళ్లు..
---- నూర్ బాషా రహంతుల్లా (గీటురాయి ఉబుసుపోక 1.8.1986)

 

17, సెప్టెంబర్ 2020, గురువారం

అప్పులు భవిష్యత్తులో ముప్పులే

అప్పులు భవిష్యత్తులో ముప్పులే  (సూర్య 20.9.2020)



కరోనా దెబ్బకు దేశంలో కోట్లాదిమందికి ఉపాధి పోయింది.3.7 కోట్లమంది తీవ్ర దారిద్యంలోకి వెళ్లిపోయారని బిల్ గేట్స్ ఫౌండేషన్ వెల్లడించింది.అయితే మనదేశంలో ఎంతమంది వలస కార్మికులు చనిపోయారో మన కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖకు తెలియదట.ఎంతమంది వలస కార్మికులకు ఉచిత రేషన్‌ ఇచ్చారో తెలియదట.కనీసం కూలీలకు సాయంచేసిన సంస్థలను సోనూసూద్ లాంటి దాతలను అడిగి సమకూర్చుకోవలసింది. మార్చి 24 నుంచి విధించిన లాక్‌డౌన్‌ వలన స్వగ్రామాలకు నడకదారి పట్టిన కోటి అయిదు లక్షల మంది వలస కూలీలు ఉపాధి పోయి కష్టాల్లో పడ్డారని, తిరిగి వెళ్ళిన కూలీలు ఉత్తరప్రదేశ్‌కు 33 లక్షలమంది బిహార్‌ కు 15 లక్షలమంది పశ్చిమబెంగాల్‌ 14 లక్షల మంది ఉన్నారని అంచనా. నెల రోజుల తర్వాత 63లక్షలమందిని రైళ్ల ద్వారా చేరవేశామని చెబుతున్నారు. కాలినడకన వెళ్ళిన కొందరు ఒంట్లో సత్తువ కోల్పోయి ఆకలిదప్పులకు తట్టుకో లేక మరణించారు.రోడ్డు రైలు మార్గాలపై నిద్రపోతూ కొందరు ప్రమాదాలలో కొందరు చనిపోయారు.నగరాలలో భవనాలను రహదారులను నిర్మించేది వీళ్ళే. వీరు లేకపోతే అన్ని కార్యకలాపాలూ స్తంభించిపోతాయి. వలస కార్మి కుల శ్రమ విలువ జీడీపీలో పది శాతం. ఏ రిజిస్టర్‌లోనూ, రికార్డు ల్లోనూ వీళ్ళకు చోటు దొరకదు.వారి మరణాల గురించిన లెక్కలు అసలే లేవు.తమ వద్ద డేటా లేదనే కారణంతో మరణించినవారి కుటుంబాలకు సాయం అందించరా?కరోనావల్ల అమెరికాలో 2 లక్షలమంది,బ్రెజిల్ లో 134 వేలమంది ఇండియాలో 82 వేలమంది ప్రపంచంలో 9.48 లక్షల మంది చనిపోయారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల అతివృష్టి వరదలు కొనసాగుతుంటే కొన్నిచోట్ల నీటి కరువులున్నాయి. గోదావరి, కృష్ణ శ్రీశైలం,పోలవరం,పులిచింతల,కుందూ నదులు, వాగులు,పొంగిపొర్లి పంటలను నాశనం చేశాయి.దేశ ప్రజలు ఇంట అన్నం తిని బ్రతుకుతున్నారంటే అది రైతులు,వ్యవసాయ కూలీల శ్రమ ఫలితమే.అందులో 13 కోట్లమంది ఎకరా అర ఎకరా సాగుచేసే చిన్న రైతులున్నారు.పండించే పంటలకు మద్ధతు ధర పెరగలేదు.పైగా స్వేచ్చా మార్కెట్ లో రవాణా చేసుకొని ఎక్కడైనా ఎవరికైనా ఎంతధరకైనా అమ్ముకోమని కార్పొరేట్లకు అనుకూలంగా తెచ్చిన వ్యవసాయ సంస్కరణల బిల్లులు లోక్ సభలో ఆమోదించారు.గిట్టుబాటు ధర మద్దతు ధర ప్రకటించకపోతే వ్యవసాయం పెట్టుబడిదారుల పరం అవుతుందని, స్వామినాధన్ సిఫారసుల్ని పక్కనబెట్టారని స్వపక్ష కేంద్ర ఆహార పరిశ్రమల మంత్రి హర్ సిమ్రత్ కౌర్ రాజీనామా చేశారు.విపక్షాలు బిల్లుల్ని వ్యతిరేకించాయి.కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ గతంలోనే చైనా సాగు యంత్రాలను నిషేధిస్తే మన దేశానికి నష్టమన్నారు.భారత్‌, చైనా సరిహద్దు గొడవ వల్ల చైనా యాప్‌ల తోపాటు దోమలబ్యాట్లు పవర్‌ టిల్లర్లు, వీడర్లు, స్ప్రేయర్లు లాంటి చౌక పరికరాలు కూడా ఆగిపోయాయి.పురుగు మందులు చల్లే తైవాన్‌, జపాన్‌ స్ప్రేయర్‌లు రూ.17-18 వేలుంటే, చైనా స్ప్రేయర్‌ ఆరువేలే కాబట్టి రైతులు చైనా స్ప్రేయర్లు తీసుకుంటు న్నారు. చైనా యంత్రాలను దిగుమతి చేసుకొని వ్యాపారం చేసే కార్పొరేట్లు మాత్రం లాభాల బాట పట్టారు.పేరుకు రైతు బజారు అయినా వ్యాపారస్తులదే రాజ్యమన్నట్లు ఉంది. రైతులనుండి లక్షలకోట్ల ఆదాయాన్ని దళారులు పిండేస్తున్నారు. అప్పులతో నెట్టుకొచ్చే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు వేస్తాయి.కేంద్ర ప్రభుత్వం ఉల్లిపాయల ఎగుమతులను కూడా నిషేధించటం వలన ఉల్లి రైతులు నష్టపోతారు, సరుకు వ్యాపారుల చేతుల్లోకి చేరిన తర్వాత ధరలను విపరీతంగా పెంచి కార్పొరేట్లు,బడా వ్యాపారులు లాభాలు పొందుతారు.కాని వినియోగదారులకు మాత్రం తక్కువ ధరలకు ఉల్లిపాయలు దొరకవు.ఉల్లిపాయలు , ధాన్యాలు, పప్పులు, నూనెగింజలు, వంట నూనెలు, బంగాళాదుంపలను నిత్యావసర సరుకుల జాబితా నుండి తొలగించారు.వ్యాపారులు ఎంత సరుకునైనా నిలవ చేసుకోవచ్చు.పంటలు బాగా పండినప్పుడు ముందుగానే రైతుల నుండి పంటను కొని, నిల్వ చేసి, మార్కెట్‌లో కృత్రిమ కొరతను సృష్టించి, అధిక ధరలకు వినియోగదారులకు అమ్మి లాభాలను సంపాదిస్తారు.దేశంలో 2.2 కోట్ల టన్నుల ఉల్లిపాయలు ఉత్పత్తి అవుతాయి. కిలో 10 రూపాయలకు అమ్మే ఉల్లిపాయలు గతంలో 100 రూపాయలకు మించి పెరిగాయి.అప్పుడు పాకిస్థాన్‌ నుండి దిగుమతి చేసి చౌక డిపోల ద్వారా పంపిణీ చేశారు.ఉల్లిపాయల ఉత్పత్తిలో చైనాది మొదటి స్థానం , భారతదేశానిది రెండవ స్థానం. ఉల్లిపాయలను ఎక్కువ మంది రైతులు పంట చేతికి రాగానే అమ్ముకుంటారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు ఎలా చేస్తారు? ఏ పంటకైనా మద్దతు ధరలను ప్రకటించి,ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. రైతుల ఆత్మహత్యలలో రైతు కూలీలు,అప్పులు తీర్చలేని చిన్నరైతుల శాతమే ఎక్కువ. పెట్టుబడికోసం చేసిన అప్పులు తీర్చలేక వడ్డీలు చక్రవడ్డీలు వానలు వరదలు తెగుళ్లు కరువులు.ఇలా ఎన్నో కష్టాలు రైతువి.పంటకు భీమా లేదు.కౌలు రైతుకు ఏమి మిగులుతుందో నికరం లేదు.వానల్లో తడిచి ధాన్యం మొలకలొస్తే ఎవరూ కొనరు.సకాలంలో ఆరబెట్టుకోటానికి కల్లాలు ఉండవు.దళారులు,మిల్లర్లు ఇచ్చిందే ధర.దేశవ్యాప్తంగా బలవన్మరణాల మృతుల్లో కౌలురైతులే ఎక్కువ.దాటిరాలేని పేదరికమే కారణం. పేదలను కాపాడటానికి ఏమేమి చేయవచ్చు ?` రైతులకు ప్రకటించిన భరోసా సాయం మంచిదే.ఒక్కరోజులో రేషన్ కార్డు ఇవ్వటమూ మంచిదే.చేయూత సహకారమూ మంచిదే.సైకిళ్ళు తోపుడు బళ్లపై కూరగాయలు అమ్మే వీధి వ్యాపారులు,దర్జీలు,చాకలి,మంగలి,బేల్దారి పనివాళ్లకు ఇస్తున్న ఆత్మనిర్భర సాయమూ మంచిదే. ఇలాంటి పధకాలన్నీ పేదలను కాపాడతాయి. మన జిడిపి వృద్థి రేటు పడిపోయింది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి కాబట్టి లాక్‌డౌన్‌ కాలంలో పనులు కోల్పోయిన వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి మరీ ఆహార ధాన్యాలను ,ఆహారాన్ని అందించాలి. సాయంగా డబ్బులివ్వాలి.అమెరికా తన జిడిపిలో 10 శాతం జర్మనీ 5 శాతం సహాయ కార్యక్రమాలకు కేటాయించాయి.మార్కెట్‌లో పెట్టుబడులు తగ్గిపోయాయి ఉపాధి కూడా తగ్గిపోయింది. వినిమయం కూడా తగ్గింది.నిరుద్యోగం పెరిగిపోయింది. బ్యాంకుల అప్పులు తీర్చని బకాయిదారులూ పెరిగిపోయారు.నిరర్థక ఆస్థులు పెరిగి బ్యాంకులూ దివాళా తీస్తున్నాయి. కాబట్టి ప్రజల కొనుగోలుశక్తిని పెంచాలి.ప్రభుత్వం విద్య వైద్యరంగాలలో ప్రజా పధకాల మీద కోట్లాది రూపాయలు ఖర్చు చెయ్యాలి. కేంద్రం రాష్ట్రాలకు బకాయి పడ్డ 152 వేల కోట్ల రూపాయలు జిఎస్‌టి పరిహారాన్ని చెల్లించాలి. రిజర్వు బ్యాంకు రెపో రేటుకి రాష్ట్రాలకు అప్పులివ్వాలి.ఆత్మనిర్భరం కోసం అప్పులు చేసుకోమన్నారు కానీ అప్పులు దేశానికి భవిష్యత్తులో ముప్పులే కావచ్చు.ఉపాధిని ఉత్పత్తిని పెంచే కార్యక్రమాలను ప్రకటించాలి. పేద రైతులకు అప్పులిచ్చి ఆదుకోవాలి.అన్ని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. పెట్రోలు,డీజిల్ పై సర్చార్జీ పన్నులు తీసేయాలి.టెలికాం కంపెనీలకు లక్షల కోట్లు మినహాహింపులిచ్చినట్లు సెల్ ఫోను డేటా రీఛార్జీలను కూడా తగ్గించాలి. విదేశీ బ్యాంకులలోని నల్లధనం పూర్తిగా తెచ్చి రోడ్ల లేన్లు త్వరగా పూర్తి చేసి టోల్ గేట్ ఫీజులు తగ్గించాలి. --- నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

పెళ్లి వయస్సు పెంచితే నిరుద్యోగం ఆగుతుందా ?

పెళ్లి వయస్సు పెంచితే నిరుద్యోగం ఆగుతుందా ? (గీటురాయి 11.9.2020) పేదరికాన్ని ఆకలిని యుద్ధాలను నిరుద్యోగాన్ని ఆపటానికి ప్రసూతి మరణాల రేటు తగ్గించటానికి ఆడపిల్లల పెళ్లి వయస్సు పెంచాలని సుప్రీంకోర్టు 2017లోనే సూచించింది. ప్రస్తుతం యువతుల వివాహ వయసు 18 ఏళ్లు , యువకులకు 21 ఏళ్లు. ప్రసూతి మరణాలు తగ్గాలని ఐక్యరాజ్య సమితి లక్ష్యం. ఆడపిల్లలు డిగ్రీలో చేరేనాటికి పెళ్లి చేయటంవల్ల చదువు మానేస్తున్నారు కాబట్టి వారి వివాహ వయసు పెంచాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కోరింది.మగపిల్లల వయసును 18 ఏళ్లకు కుదిస్తే జనాభా నియంత్రణ లోకి రాదని హెచ్చరించింది. కానీ ఆడపిల్లలు 21 ఏళ్ల వయసులోపే లైంగికంగా చురుగ్గా వుంటారని , వారి వివాహ వయసు పెంచితే బాల్య వివాహాలు పెరుగుతాయని ఆరోగ్యమంత్రిత్వ శాఖ వాదించింది. అయితే 20 ఏళ్లు దాటాకే ఆడపిల్ల శరీరం గర్భధారణకు అన్నివిధాలా అనువుగా వుంటుందని,పద్దెనిమిదేళ్లకే పెళ్లయితే ఆడపిల్ల కుటుంబ ఒత్తిళ్లను తట్టుకోలేదని . చిన్న వయస్సులో గర్భం ధరించడం వల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతింటుందని , ప్రసవ మరణాలకు చిన్నవయసులో గర్భాలే కారణమని . ఆడపిల్ల ఇష్టాయిష్టాలను కూడా గమనించి మంచి చదువు చదివించాలని . ఆమె విద్యాధికు రాలయ్యేలా ప్రోత్సహించాలని వైద్యులు అన్నారు. జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయ్‌ ఫూలే దంపతులు ఆడపిల్లల్ని కూడా మగపిల్లలతో సమానంగా చదివించాలని 170 ఏళ్లనాడే కోరినా ఎంతోమంది ఆడ పిల్లల్ని చదివించటంలేదు.మగపిల్లల్లో అక్షరాస్యత 75 శాతమైతే ఆడపిల్లల్లో అక్షరాస్యత 54 శాతం మాత్రమే. ఆడపిల్లల్ని చదివిస్తే జీడీపీ గణనీయంగా పెరుగుతుంది. డిగ్రీ విద్య నాలుగేళ్లకు పెంచినట్లు ఆడపిల్లల వివాహ వయసు కూడా పెంచాలి. ఆడపిల్లలకు సరైన పోషకాహారం అందాలి. వారి విద్యకు ఆర్థికంగా తోడ్పడాలి. ఆడ పిల్లలు బాగా చదువుకోవడానికి, ప్రతి విద్యాసంస్థలోనూ మంచి టాయిలెట్లు కట్టాలి. పేదరికం వల్ల రక్తహీనత పౌష్టికాహారం పొందలేని గర్భిణీల శాతమూ ఎక్కువగా ఉంది. బాల్యవివాహాల వల్ల ప్రసూతి, శిశుమరణాలు, రక్తహీనత వంటివి సంభవిస్తున్నాయి . జమ్ము, కాశ్శీర్‌, మిజోరాం, మణిపూర్‌, గోవా, కేరళ రాష్ట్రాలలో సగటు వివాహ వయస్సు మహిళలలో 25 సంవత్సరాలు. యు.పి లో 18 సంవత్సరాలు. ఫీజుల రూపంలో బోలెడు చెల్లించి కష్టపడి చదివి పట్టా తెచ్చుకున్న తరువాత నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు దొరకటంలేదు.కన్నవాళ్లకు భారం కాకూడదని ప్రైవేటు సంస్థల్లో చేరితే అత్తెసరు జీతం.దేశంలో 3 కోట్లమంది వరకూ నిరుద్యోగులు ఏటా పరీక్షలు రాస్తారు. వీళ్ళంతా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వేర్వేరు ఉద్యోగాలకు విడిగా దరఖాస్తు చేసుకోవడం, శిక్షణ తీసుకోవడం, దూరప్రాంతాలకు పరీక్ష రాసేందుకు పోవడం తప్పడం లేదు. ప్రతి ఉద్యోగానికీ రుసుము చెల్లించడం దరఖాస్తుల కే వందలాది రూపాయలు ఖర్చుపెట్టవలసి వస్తోంది. గజిటెడ్,స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు , బ్యాంకింగ్‌ , నాన్‌–గెజిటెడ్‌ పోస్టులన్నిటికీ కలిపి ఉమ్మడి అర్హత పరీక్ష పెడితే ఖర్చు తగ్గుతుంది.ఈ పరీక్ష నిర్వహణ కోసం జాతీయ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ(ఎన్‌ఆర్‌ఏ) సంస్థ ఏర్పాటు కావాలి.ఇందులో వచ్చే స్కోరు మూడేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది.జిల్లాకొక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తారు. పూర్వం పదో తరగతి పాసైన నిరుద్యోగులు ఉపాధి కల్పనా కేంద్రాలలో పేర్లు నమోదు చేయించుకునేవారు. విద్యార్హతలు పెరుగుతున్నకొద్దీ వాటిని అదనంగా చేర్పించుకునేవారు. జీవితంలో ఒక్కసారి కూడా కాల్ లెటర్ రాకపోవడం చాలామందికి అనుభవమే. ఉపాధి కల్పన శాఖ ద్వారా నోటిఫికేషన్‌ ఇచ్చాకే ప్రభుత్వోద్యో గాలను భర్తీ చేయాలన్న నిబంధనను సుప్రీంకోర్టు గతంలో కొట్టేసింది. అందువలన ఉపాధి కల్పనా కేంద్రాలపై నిరుద్యోగులు ఆశలు వాదులుకున్నారు. 1978లో నాకు ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ఛేంజీ ద్వారా ఎల్.డీ.సీ.పోస్టు కోసం ఇంటర్వ్యూకార్డు వచ్చింది. అదే చివరి సంవత్సరమట.తరువాత ప్రస్థానానికి ఆ ఉద్యోగమే నాకు ఆర్ధిక ఆసరా అయ్యింది.ఉద్యోగం వచ్చింది కాబట్టి వివాహమూ అయ్యింది.ఇద్దరు పిల్లలు చదువుకున్నారు.అందువలన ఉపాధి కల్పనా కేంద్రాలద్వారా చిన్న చిన్న ఉద్యోగాలు రావాలి.ఉద్యోగాలు రాకపోతే ఎక్స్ఛేంజీలలో నమోదవుతున్న నిరుద్యోగుల సంఖ్య వెక్కిరిస్తూఉంటుంది.చదువుకున్నవారిలో నిరుద్యోగం 18 శాతానికి చేరుకుంది.చదువు పెరిగేకొద్దీ నిరుద్యోగం ఎక్కువవుటోంది.ప్రభుత్వ విభాగాల్లో నియామకాలు నానాటికీ తగ్గిపోతున్నాయి . రిటైరవుతున్నవారి ప్రభుత్వ ఉద్యోగుల స్థానాలను ఎప్పటికప్పుడు భర్తీ చేయడంలేదు.కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ నియామకాలు మాత్రమే చేస్తున్నారు. ఉద్యోగం ఉన్నా జీవితంలో ఎప్పుడు స్థిరపడతారో తెలియదు. ప్రభుత్వోద్యోగులకు వేతన సవరణలు , జీతాల పెంపు వుంటుంది. రిటైరయ్యాక పెన్షన్‌ వుంటుంది.కంట్రిబ్యూటరీ పెన్షన్ వద్దు పాత పద్ధతిలో రెగ్యులర్ పెన్షన్ ఇవ్వండి అని కోరుతున్న వారికి ఉద్యోగ సంఘాలు మద్దతిస్తున్నాయి. ప్రైవేటు ఉద్యో గాల్లో ఇవన్నీ లేవు.చాలా తేడా.దేశ జనాభాలో 35 శాతం యువకులే ఉన్నారు. రాష్ట్రంలో కరోనా మరణాలు నాలుగు వేలు దాటాయి. దేశంలో 66 వేలు దాటాయి.రైతులు ఎంతోమంది ప్రాణాలు తీసుకున్నారు. కష్టజీవుల ఆత్మహత్యలు ఏటికేడు పెరిగిపోతున్నాయి. జీవించే హక్కు మానవ హక్కు అని సుప్రీంకోర్టు తేల్చింది. సంపదను సృష్టించేది శ్రమజీవులే . నవ రత్నాలు ఉచిత విద్యుత్‌ లాంటి సంక్షేమ పథకాల గురించి పేదలు ఆశిస్తున్నారు. కార్పొరేట్లకు సంపద బదిలీ సాగుతోంది . పేదరికం మాత్రం తగ్గడంలేదు.1957 లోనే శ్రామికునికి కనీసవేతనం ఎంత ఇవ్వాలో సుప్రీం కోర్టు తీర్పుల్లో తెలియజేసింది. కనీసవేతనాల చట్టాల ప్రకారం కార్మికులకు యజమాని చెల్లించవలసిన వేతనాన్ని చెల్లించేలా చట్టాలు కూడా చేశారు. ప్రపంచ దేశాల్లో సంభవిస్తున్న మరణాల్లో దాదాపు సగం ఈ దేశాల్లోనే జరుగుతున్నాయి.గర్భధారణ సమయంలో మహిళలకు అవసరమైన పోషకాలు దొరకాలంటే ఉపాధి ఉండాలి. ఆరోగ్య ఉప కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలి.ప్రసవాల కోసం నేటికీ మంత్ర సానులను ఆశ్రయిస్తున్నారు. ప్రజాసంక్షేమము,కార్పొరేట్ల సంక్షేమము, ప్రభుత్వానికి ఎదురౌతున్న రెండు పరస్పర విరుద్ధ అంశాలు. మంచుపొగలు ముసిరితే సూర్యోదయమాగునా? మనసుపొరలు కమ్మితే అసలు నిజం దాగునా? ఆ కిరణాలుదయిస్తే , ఆ నిజమే ఋజువైతే కమ్ముకున్న తెరలన్నీ కరిగిపోక ఆగునా ? అని 1973 లో డబ్బుకులోకం దాసోహం లో సినారె గారు అన్నట్లు పెళ్లి వయస్సు పెంచితే నిరుద్యోగం తగ్గుతుందా ? --- నూర్ బాషా రహంతుల్లా,రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266

5, సెప్టెంబర్ 2020, శనివారం

కొన్నాళ్లు స్కూళ్ళు తెరవద్దు

 


కొన్నాళ్లు స్కూళ్ళు తెరవద్దు (సూర్య 30.8.2020)
మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును అన్నాడు గురజాడ. పాఠశాల విద్య రాజ్యాంగ హక్కు. విద్య శాస్త్రీయతను ,ఆలోచనా శక్తిని వికసింపజేస్తుంది.పిల్లల మేధో వికాసానికి స్కూళ్ళు తప్పనిసరిగా కావాలి. కానీ జ్నానబోధ చేసే పాఠశాలలన్నీ కరోనా కాలంలో మూతబడినందువల్ల దేశవ్యాప్తంగా 25 కోట్లమంది పిల్లలు చదువులకు దూరమయ్యారు.పిల్లలు బడిలో గుంపుగా కూర్చోనే పద్ధతి ఇప్పుడు భయంకరంగా మారింది.మాతృభాషలలో ప్రాధమిక విద్య బోధించాలన్న కేంద్ర నిర్ణయం మంచిదే.అంగన్ వాడీలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చటమూ,పిల్లల పూర్తి ఫీజు రీ ఇంబర్స్ చేయటము మంచి పనులే.5 ఏళ్ళ లోపు పిల్లలను బరువు ఎత్తు చూడటానికి కూడా తల్లిదండ్రులు అంగనవాడీలకు పంపటంలేదట.అందువలన పిల్లలకు బాలామృతం చిక్కీలు పాలు లాంటిపోషకాహారాలు ఇళ్లకే సరఫరా చేశారు.ఇప్పుడు చిన్నపిల్లలకు బడి ఎలా?
కరోనాకు వాక్సిన్‌ వచ్చేదాకా ప్లాస్మానే మందు.భక్తులు గుమిగూడకుండా గుడులు కూడా మోసేశారు.పండుగల ఉత్సవాలు లేవు.కళ్యాణ మండపాలు బంద్ అయ్యాయి.సమస్యలెన్నివున్నా జీవనం సాగుతూ వుండాల్సిందేనని ప్రవేశ పరీక్షలు నిర్వహిం చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.విద్యార్థుల కెరీర్‌ అయోమయంలో పడుతుందన్న కారణంతో ప్రవేశ పరీక్షలు యధావిధిగా జరపాలంటున్నారు. పరీక్షా కేంద్రాల అధికారులు ఈ పరీక్షల్ని పకడ్బందీ జాగ్రత్తలు తీసుకుని జరుపుతామంటున్నారు.కరోనా లక్షణాలున్న అభ్యర్థుల్ని అనుమతించరు. లక్షణాలు కనబడనివారి సంగతేమిటి ?ఇలాంటివారివల్ల వ్యాధి వ్యాపించదా? లాక్‌డౌన్‌ వల్ల అనేకచోట్ల సరైన రవాణా సదుపాయాలు లేవు. హోటళ్లు ఇంకా తెరుచుకోలేదు. కరోనాకు చిక్కకుండా అందరూ సురక్షితంగా ఇళ్లకు స్వస్థలాలకు చేరతారన్న గ్యారెంటీ లేదు. ఈ పరి స్థితుల్లో విలువైన విద్యా సంవత్సరం వృథాగా పోతుందన్న ఆత్రుతలో పిల్లల ఆరోగ్యాన్ని విస్మ రించడం మంచిదికాదు. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉన్న బంధం అలాంటిది.కరోనా దెబ్బకు మనిషికీ మనిషికీ మధ్య భౌతికదూరం తప్పనిసరయింది.ఇంటివాళ్లే దూరం జరిగే పరిస్థితి. కరోనా ప్రాణాలతో పాటు కుటుంబంలోని అనుబంధాలను, రక్తపాశాలను కూడా మింగేస్తోంది.తల్లి తండ్రి తాత చనిపోయినా అయినవారే దగ్గరకు వెళ్లడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. చనిపోయినవారిని జెసిబిలతో ఎత్తిపడేస్తున్నారు.కరోనా కఠోరమైనదైనా బంధాలు అంతకంటే దృఢమైనవి.
పేదరిక నిర్మూలన పధకాలు ఎన్నో సాగాయి కానీ పేదలు ఇంకా తగ్గలేదు.పేదలు అతి కష్టంపై జీవనం సాగిస్తున్నారు. ఎక్కడా పని దొరకని పరిస్థితి నెలకొంది. పేదల బతుకులు చిధ్రమైపోయాయి.ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమేఉంది.కరోనా కష్టకాలంలో ఆదాయాలు తగ్గిపోయి 55 శాతం మంది ప్రజలు ముప్పూటలా తిండికి నోచుకోక అరకొర భోజనం తోనే సరిపుచ్చుకుంటూ పౌష్టికాహారానికి దూరమయ్యారు. జాతీయ ఆహార భద్రత చట్ట ప్రకారం మధ్యాహ్న భోజన పథకం, అంగన్‌వాడీ, పౌర పంపిణీ పథకాలకు ఆహారధాన్యాలు అందాలి.గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, బియ్యము,గోధుమలు తృణ ధాన్యాలు ఉచితంగా ఇచ్చి వారి పిల్లల ఆకలి తీర్చాలి. కరోనా కాలంలో పేదరికం బాగా పెరిగిపోయింది.2 అమెరికన్‌ డాలర్లతో అమెరికాలో వచ్చేన్ని సరుకులు కొనగల వాళ్ళు పేదరికంలో లేనట్టేనని ప్రపంచ బ్యాంకు నిర్ధారించింది .2 డాలర్ల తక్కువ ఆదాయంతో అమెరికాలో మనుషులు బ్రతకగలరని ప్రపంచ బ్యాంకు లెక్క. రోజుకు 2700 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని పొందగలిగితే ఒక వ్యక్తి పేదరిక స్థాయికంటే ఎగువన ఉన్నట్టు లెక్క. కనీస పోషక విలువలున్న ఆహారం ఖరీదు రోజుకు కనీసం 5 డాలర్లు ఉంటుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజులు కట్టలేక అంత ఖరీదైన వైద్యం చేయించలేక వేలమంది రోగులు ఆగిపోతున్నారు. పేదలకు ప్రభుత్వ వైద్య శాలలే దిక్కు.
కేసీఆర్ చెప్పినట్లు బలుసాకు తినైనా బ్రతకాలనే ప్రజలు అనుకుంటున్నారు.సినిమాహాళ్ళు తెరిచినా ఇకమీదట జనం గుంపులుగా వెళ్లకపోవచ్చు అని సామాజిక కార్యకర్తలు భావించారు.కానీ క్యూలలో నిలబడి గొడుగులు వేసుకొని మరీ కరోనాలో మద్యం కొనుగోలు దిగ్విజయం చేసిన తాగుబోతులను చూశాక దేని జనం దానికి ఉంటారని తీర్మానించుకొన్నారు.చికెను,చేపలు,మాంసము కోట్ల దగ్గర గుమిగూడిన జనాన్ని విలేఖరులు కారణం అడిగితే కరోనా ను గెలవాలంటే రోగనిరోధక శక్తి బాగా పెరగాలనే ఇలాఎగబడుతున్నాము అన్నారట.మరోపక్క కొందరు ప్రైవేటు పాఠశాలల టీచర్లు ఉపాధికోల్పోయి ఏదో ఒక దుకాణం పెట్టుకొని జీవనం నెట్టుకొస్తున్నారు.కరోనా బారినపడి ప్రముఖులు చాలామంది చనిపోయారు.కొంతమంది ఇళ్లలోనే ఏకాంతవాసంచేసి బయటపడ్డారు.పరిస్తితి అందరికీ ఆందోళనకరంగానే ఉంది.
కొందరు ప్రైవేటు విద్యాసంస్థల వాళ్ళు మాత్రం ఆన్‌లైన్‌ విద్యా బోధన, పరీక్షలు మొదలుపెట్టారు. ఢిల్లీ యూనివర్సిటీ కూడా ఓపెన్‌ బుక్‌ పరీక్షా విధానాన్ని ప్రకటించింది.కేరళ ప్రభుత్వం విద్యార్థులకు స్మార్ట్‌ ఫోన్‌/ ల్యాప్‌టాప్‌/ ట్యాబ్‌ సమకూర్చి దూర విద్య ద్వారా పదో తరగతి పరీక్షలు నిర్వహించింది. కానీ దేశంలో 36 శాతం మందికి మాత్రమే ఇంటర్నెట్‌ కనెక్టివిటీ ఉంది కాబట్టి ఖరీదైన ఫీజులతో పిల్లలందరికీ ఆన్ లైన్ విద్య కష్టమే. మెజార్టీ విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరు కాలేరు.పరీక్షలు రాయలేరు.విద్యా సంస్థల ఫీజులపై నియంత్రణలు ఉండాలి. విద్యను వ్యాపారం కానీయకూడదు.5వ తరగతి వరకు తేలికైన పిల్లల అమ్మ భాష లో పాఠ్యపుస్తకాలు తయారు చేసి పిల్లలకు పాఠాలు చెప్పాలి. ఏమి చేసినా కరోనా వాతావరణంలో పిల్లల్ని బడికి పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు.ప్రభుత్వాలకు ఏమిచెయ్యాలో ఎలా చెయ్యాలో పాలుపోవటంలేదు.నిపుణులుకూడా మార్గాలు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే చిన్నపిల్లల్లో కరోనా ఇన్ ఫెక్షన్ లక్షణాలు కనపడకపోయినా రోగుల్లో కంటే వైరస్ ఎక్కువగా ఉంటున్నదట .కాబట్టి టీకా వచ్చి కరోనా అదుపులోకి వచ్చేదాకా పిల్లలైనా పెద్దలైనా గుంపులు కూడటంతగదు.ప్రస్తుతానికి పిల్లల క్షేమంకోసం స్కూళ్ళు తెరవటం మంచిది కాదు.
--నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266


 

తీరప్రాంత కష్టాలు తీరాలంటే ?

 



తీరప్రాంత కష్టాలు తీరాలంటే ?
(గీటురాయి 4.9.2020) (సూర్య 6.9.2020)
వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి.కాళేశ్వరం దగ్గర నుంచి ధవళేశ్వరం దాకా వరదలే. వరంగల్ నగరం తోసహా గోదావరీతీర ప్రాంత గ్రామాలన్నీ ముంపు బారిన పడ్డాయి. మన దేశంలో కూడా విపత్తుల చట్టాన్ని విపత్తుల నిర్వహణా వ్యవస్థలను ఏర్పాటు చేశారు కానీ, ఇప్పటికీ పూర్తిస్థాయి యంత్రాంగం ఏర్పడలేదు.1977 దివిసీమ ఉప్పెన తరువాత, కోస్తా ప్రాంతంలో తుఫానుల నుంచి రక్షణకు ఏమిచేయాలన్న ఆలోచన జరిగాయి.ప్రకాశం బ్యారేజికి దిగువన చోడవరం,తూర్పుపాలెం దగ్గర ఇంకోరెండు బ్యారేజీలు కట్టాలని తలపెడుతున్నారు.ధవళేశ్వరం ఆనకట్ట కట్టడానికి ముందు ఆ ప్రాంతంలో తరచు గోదావరి నదికి వరదలు వచ్చేవి. కోరంగి రేవు వరదల్లోనే ధ్వంసమయింది.సర్ఆర్ధర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజి నిర్మించడం తో వరదలు తగ్గాయి. హైదరాబాద్ నగరంలో 1908లో వచ్చిన మూసీ వరదల తరువాత, అప్పటి నిజాం పాలకుడు, హైదరాబాద్ లో శాశ్వత వరద నివారణ వ్యవస్థను, మంచినీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేశారు. పాలకులలో ఉండే దూరదృష్టికి అవి ఉదాహరణలు. పెరుగుతున్న పట్టణీకరణ- ఒకనాటి చెరువులను, నీటి వ్యవస్థలను తుడిచిపెట్టి కాంక్రీట్ మయంగా మారుస్తున్నది. హైదరాబాద్‌ వరంగల్ ముంబై , చెన్నై, బెంగుళూరులో వికృతపట్టణీకరణ ఫలితాలను చూస్తున్నాము. నీటిదారులకు అడ్డుకట్టలు వేసి, భూములు ఆక్రమించి, భవనాలు నిర్మిస్తే ఏమవుతుంది, ఇళ్లలోకి నీళ్లు వస్తాయి, రోడ్లు కాలువలవుతాయి.
కోస్తా ఆంధ్ర ప్రాంతంలో తరచుగా వచ్చే వరదలు హైదరాబాద్లో, వరంగల్లో తెలంగాణలో రావు. అటు కృష్ణ, ఇటు గోదావరి రెండూ కూడా పీఠభూమికి లోతట్టునే ప్రవహిస్తున్నాయి. ఎగువున ఉండే నివాసప్రాంతాలలో చెరువులే జలవ్యవస్థలు. విపత్తు అంటే, వరదలు, తుఫానులు , కరువులు, వర్షాభావ పరిస్థితులు.వానలు, వరదలు ముంచెత్తిన ప్రతిసారీ ముంపు ప్రాంతాల్లో వేలు లక్షల్లో ప్రజలు సర్వం కోల్పోయి నిర్వాసితులవుతున్నారు. ఇళ్లూ వాకిళ్లు వదిలేసి ఉన్న ఊళ్ల నుంచి కట్టుబట్టలతో తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో వరద తీసే వరకు తలదాచుకోవడం, మరలా సొంత గూటి బాట పట్టడం ముంపు బాధితులకు పరిపాటైంది. అత్యవసర సాయం కింద నిర్వాసితులకు , ముంపు బాధితులకు రూ.2 వేలు 5 కిలోల బియ్యం ఇస్తున్నారు. పునరావాస కేంద్రాలలో తలదాచుకున్న ఒక గర్భిణి సహా ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. కృష్ణ గోదావరి నదులకు వరదలొచ్చినప్పుడు పంటలు, తోటలు దెబ్బతింటున్నాయి. గొడ్డు గోదా, ఇళ్లూ, పశువుల కొట్టాలు, పడవలు, వలలు, మరమగ్గాలు నష్టపోతున్నారు. పరిహారాల చెల్లింపులకు ఏళ్లూ పూళ్లు పడుతున్నాయి. ప్రాజెక్టులకు భూములిచ్చిన వారే మొదటి బాధితులు.జాతీయ ప్రాజెక్టు పోలవరం లో 300 గ్రామాల ప్రజలు ఆదివాసీలున్నారు. కాంటూరు పరిధి దాటి గ్రామాలు మునిగిపోయాయి.నేటికీ నిర్వాసితులకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ పూర్తిగా అందలేదు. పునరావాసం బాధ్యత తనకు లేదని కేంద్ర బిజెపి ప్రభుత్వం అంటోంది. గోదావరి పోటెత్తితే కాఫర్‌డ్యామ్‌ వలన గ్రామాలు మునుగుతున్నాయి. కృష్ణా వరదలతో 'పులిచింతల' గ్రామాలు మునుగుతున్నాయి. వంశధారకు వరదలొచ్చినా అంతే. శ్రీశైలం నిర్వాసితుల సమస్య నేటికీ తేల్లేదు. గోదావరి, కృష్ణా నదుల కరకట్టలను ఇంకా పటిష్టం చేయలేదు. కేంద్రం నుంచి సాయం రాలేదు. వరదలొచ్చినప్పుడు లీకేజీల దగ్గర సిమెంట్‌, ఇసుక బస్తాలు అడ్డం వేసి సరిపెడుతున్నారు. కృష్ణకు, బుడమేరుకు వరదలొచ్చినా బెజవాడ లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ కర్నూలును ఏ విధంగా బురదమయం చేసిందో మనకు తెలుసు. 20 లక్షల కోట్ల రూపాయల 'ఆత్మ నిర్భర భారత్‌' ప్యాకేజీ మొత్తం అంబానీ, అదానీలకు, పోగా నీటిపారుదల ప్రాజెక్టులకు ఏమీ మిగలలేదు. ప్రభుత్వరంగ సంస్థలను కూడా తెగనమ్ముతున్నారు. కోవిడ్‌ సమయంలో పనుల్లేక పూట గడవని కోట్లాది కుటుంబాలకు నెలకు పది కిలోల ఉచిత బియ్యం ఇవ్వాలని కోరుతున్నారు. పైగా గ్రామ సచివాలయాల ద్వారా చెత్త సేకరణ పన్ను కూడా వసూలు చేస్తారట. 972 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతమున్న రాష్ట్రం మనది.రోడ్లు వేసి అభివృద్ధి చేస్తే ఎన్నో రుషి కొండలు,మరెన్నో రామకృష్ణాబీచ్ లు తయారౌతాయి.అభివృద్ధి ఖర్చంతా హైదరాబాదు,విశాఖపట్టణం లోనే పెట్టారు.ఇంకా పెడుతున్నారు. మిగతా కోస్తా బారుకీ పేద మురికి సముద్రముంది గానీ అందాలకు నోచుకోలేదు. 1946 లో పుచ్చలపల్లి సుందరయ్య గారు వరదలు తుఫానులనుండి తీరప్రాంత ప్రజలను కాపాడటానికి కోరిన కోస్తా రైలుమార్గం కోస్తా రహదారి నేటికీ పూర్తిగా ఏర్పడలేదు. కటిక పేదరికం తాండవిస్తోంది.సెజ్ లు వచ్చాక తీరంలోని ఇసుక దిబ్బలు,సరివి తోటలు గ్రామాలకు గ్రామాలే క్రమంగా మాయమైపోయాయి,పోతున్నాయి.తీరప్రాంత ప్రజలే వరదలు మొయ్యాలి. తుఫానులు కాయాలి . వాగులపై వంతెనలుండవు.కోస్తావాసుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.తుఫానులు వరదలు వచ్చినప్పుడు ఉన్నతాధికారులు కోస్తాను దర్శించిపోవటం కాకుండా కోస్తా ప్రాంతాభివృద్ధికోసం కనీసం రెవిన్యూ జోనల్ కార్యాలయాలన్నా ఏర్పాటుచెయ్యాలి.ప్రయాణం అనుత్పాదక వ్యయం.రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలి.జిల్లాల నుండి రాజధానికి ప్రయాణించే అవసరం దూరం కోస్తా ప్రజలకు తగ్గించాలి. సముద్ర తీర ప్రాంతానికి మేలు చేయాలి.ఒక్కచోటే పేరుకుపోయిన పరిశ్రమలను మిగతా ప్రాంతాలకు తరలించకపోతే కోస్తా ఎడారికాక ఏమౌతుంది? ఎన్టీ రామారావు గారు మండలాలు పెట్టి ప్రజలకు మహోపకారం చేశారు.అలాగే ఇప్పుడు కొత్తజిల్లాల ఏర్పాటుపై దృష్టి సారించారు.పార్లమెంటు స్థానాలన్నీ జిల్లాలుగా మారుతాయి.తుఫానులు వరదల సమయంలో అలవిమాలిన పెద్దజిల్లాల అవస్థ తీరుతుంది.తీరప్రాంతాలలో కోట్ల మంది ప్రజలు సరైన రవాణా వ్యవస్థ లేక నదులు,వాగులు,మురుగుకాలవలు దాటలేక అవస్థలు పడుతున్నారు.తలదాచుకోటానికి పాత కాలం నాటి చర్చీలు,గుడులు,తుప్పుఊచలు బయటపడిన తుఫాను షెల్టర్లు మరింత భయపెడుతున్నాయి.ఎవరి పక్కా బిల్డింగ్ వారికి రావాలి.జిల్లాలలోని మన యువకులంతా ఉపాధికోసం మరో దిక్కు లేక రాజధానికి వెళ్ళిపోతున్నారు.జిల్లాలు వృద్ధాశ్రమాలలాగా తయారయ్యాయి.ముసలోళ్ళకు మందుబిళ్ళ తెచ్చిచ్చేవాళ్ళుకూడా లేరు.భారీ వర్షాలు,తుఫానుల సమయంలో వాళ్ళు అనాధల్లా విలవిలలాడుతున్నారు.మన పిల్లలకు మన ఊళ్ళలోనే ఎక్కడికక్కడ దగ్గరలో ఉద్యోగాలు దొరకాలంటే పరిశ్రమల వికేంద్రీకరణ తప్పదు.వికేంద్రీకరణలో దూరం భారం తగ్గించే మానవత్వం ఉంది.మిగతావారికీ ఫలాలు సమానంగా దక్కాలని చేసే త్యాగం ఉంది.కేంద్రీకరణలో అంతా నాకే కావాలి అనే స్వార్దం,అంతా నాదే అనే నిరంకుశత్వం ఉంది.అవినీతి ఉంది.విభజనవాదానికి విరుగుడు,సమైక్యత సాధించే సాధనం అభివృద్ధి కేంద్రాల వికేంద్రీకరణ.972 కి.మీ.పొడవైన సముద్ర తీరం వెంబడి మడ అడవులను పెంచాలి. తీరం పొడవునా 6 లైన్ల కోస్తా జాతీయ రోడ్డు , రెండు లైన్లతో కోస్తా రైల్వే మార్గాన్ని వేయాలి. తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే దేశానికి మేలు.ఎక్కడికో వలసపోవటంకంటే కళింగపట్నం,భీమునిపట్నం,విశాఖపట్నం,కాకినాడ, మచిలీపట్నం,నిజాంపట్నం.చీరాల,బాపట్ల,రామాయపట్నం,మైపాడు లాంటి ఎన్నో ఓడ రేవులను బాగు చేసుకోవటం నయం కదా?ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కాలం గడిపే ప్రజల దుస్థితి ఎప్పటికీ ఇంతే.కీర్తి తమకు మాత్రమే దక్కాలని ఒకరు తెచ్చిన పనికి మరొకరు అడ్డంపడటం,ఇలా ఎన్నో కారణాలతో కోస్తా వాసులు బాధలు పడుతున్నారు.విమానం ఎక్కగలిగేవాళ్ళకు ఈ కష్టం తెలియకపోవచ్చుగానీ ఆర్టీసీ బస్సులతో అవస్థలుపడేవాళ్ళకు బాగా తెలుసు.సముద్ర తీరప్రాంత వాసుల సమస్యలు ప్రత్యేకమైనవి.
--- నూర్ బాషా రహంతుల్లా విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266