ఈ బ్లాగును సెర్చ్ చేయండి

4, డిసెంబర్ 2013, బుధవారం

పని నేర్పని చదువులు –భద్రతలేని బ్రతుకులు






పని నేర్పని చదువులు –భద్రతలేని బ్రతుకులు
                              నూర్ బాషా రహంతుల్లా 9948878833      

3.12.2013 న రాష్ట్ర ప్రభుత్వం 162 కోట్ల అదనపు ఖర్చుకు సిద్ధపడి 14 శాఖల్లో 14115 కొత్త ఉద్యోగాల భర్తీకి పచ్చ జండా ఊపింది.మరుసటి రోజే మరో 7173 ఉద్యోగాలభర్తీకీ అనుమతించింది. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇది పెద్ద శుభవార్త ,తీపి కబురు.ప్రస్తుతం రాష్ట్రమే కాదు దేశం ఎదుర్కొంటున్న సమస్యలలో అతిపెద్ద సమస్య నిరుద్యోగం. ఒక పక్క రేపోమాపో రాష్ట్ర విభజన జరిగే  అవసాన దశలోకూడా , కొత్త ఉద్యోగాలను ప్రకటించడమంటే తుఫాను గాలిలో పేలపిండి పెట్టినట్లేననీ ,ఈ కంటితుడుపు చర్యవలన పెద్దగా   ప్రయోజనముండదని కొందరు పెదవి విరుస్తున్నారు.కానీ నిరుద్యోగుల్లో మాత్రం ఏదో ఆశ మిగిలే ఉంది.చాలా ధైర్యంగా ఖాళీలు ప్రకటించారనీ, ఏజ్ బారైనా 45 ఏళ్ళకు గరిష్ట వయోపరిమితిని  పెంచుతారనీ ,రాష్ట్ర విభజన లేటైతే తమ అదృష్టం కొద్దీ ఉద్యోగాల చాన్సు తగలొచ్చనీ,ఒకవేళ ఈలోపు రాష్ట్రం చీలినా కొత్తగా ఏర్పడే రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ప్రకటించిన ఖాళీలు భర్తీ చెయ్యక తప్పదనీ సంబరంగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఏళ్ళతరబడి ఉద్యోగాలు రాక  పేద నిరుద్యోగ యువకులు అల్లాడిపోతున్నారు.ఎన్ని డిగ్రీలున్నా ఉద్యోగాలు దొరకడం లేదు. ప్రైవేట్ కంపెనీలు  పెట్టే  సవాలక్ష ఆంగ్ల నిబంధనలలో గెలిచి ఉద్యోగం సంపాదించుకున్నఆ ఉద్యోగాలకి భద్రత లేదు. ఎప్పుడైనా ఊడిపోవచ్చు. నిరుద్యోగంవల్ల విద్యాధికుల్లో కూడా బిక్షాటన, దొంగతనాలు, మోసాలు పెరిగిపోతున్నాయి.ఖాళీలు వెంటనే భర్తీచేయటం లేదు. పనిచేసే హక్కు లేదు. నిరుద్యోగులకు నెలవారీ జీవన భృతి కల్పించలేదు.
రాష్ట్ర జనాభాలో నిరుద్యోగం 13 నుండి 15 శాతానికి పెరిగింది. దేశ వ్యాప్తంగా 7  కోట్ల మంది యువకులు నిరుద్యోగంతో బాధపడుతున్నారు. ఔట్ సోర్సింగ్ , తాత్కాలిక ఉద్యోగాలతోనే యువత జీవనం సాగిస్తుంది. చాలీ చాలని వేతనాలతో సతమతమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వంలో 3.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉన్నా 2004 నుండి ఇప్పటి వరకు ఉపాధ్యాయులతో కలిపి 65 వేల ఉద్యోగాలు మాత్రమే కల్పించింది. .‘ముందుంది మరింత మంచి కాలం’ అంటూ నిరుద్యోగ యువతకు పెద్దసంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామన్న రాజీవ్ యువకిరణాలు పథకంలో ఉద్యోగాలు పొందిన వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంది. వీరిలో చాలామంది వేతనాలు తక్కువగా ఉండటంతో ఉద్యోగాలు మానివేశారు. 
రాష్ట్రంలోని ప్రైవేటు కంపెనీల్లో కూడా అత్యధికులు ఇతర రాష్ట్రాలవాళ్ళే ఉన్నారు. తక్కువ వేతనాలతో ఎక్కువ రోజులు ప్రైవేటు రంగంలో పనిచేయాల్సి రావడంతో ఆర్ధిక స్ధితిగతులు మారడం లేదు. జీవన ప్రమాణాలు మెరుగుపడటం లేదు. ప్రైవేటు కంపెనీల్లో కార్మిక చట్టాలను అమలు పర్చటంలేదు. 30 ఏళ్ల వయస్సు దాటితే కంపెనీల్లో పని దొరకటం లేదు.39 ఏళ్ళకు గరిష్ట వయో పరిమితిని పెంచాలని నిరుద్యోగులు ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని అభ్యర్దించారు. చట్టాలను సక్రమంగా అమలు జరపని కారణంగానే శ్రమకు తగిన మూల్యం లభించడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగ వేటలో తిరగడా నికే ఏళ్ళు పడుతోంది.

దళారులు మోసగాళ్ళు
ఉద్యోగాల భర్తీకి ఎక్కడ అవకాశముంటే అక్కడ దళారులు మోసగాళ్ళు తయారౌతున్నారు.ఉద్యోగాలిప్పిస్తామనిచెప్పి నిరుద్యోగుల దగ్గర డబ్బులు గుంజుతున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ యువకిరణాలు ప్రాజెక్టుల్లో చిన్న చిన్న ఉద్యోగాల పేరు చెప్పి కూడా 22 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలకు టోకరా వేసిన ఘరానా మోసగాడు తోట బాలాజీనాయుడు గుర్తున్నాడా? అతను ఉద్యోగాల పేరుతో సాక్షాత్తూ వీహెచ్, దేవేందర్‌గౌడ్, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి లాంటి ఎంపీల దగ్గర నుంచే మూడు లక్షలు గుంజగలిగాడు.ఇక అవినీతి ఆరోపణలు రుజువై కొంతమంది సర్వీసు కమీషన్ సభ్యులు కూడా గబ్బుపట్టారు.ఇంటర్వ్యూ లలో ఇచ్చే కొద్ది మార్కుల తేడా తోనే అభ్యర్డుల జాతకాలు మార్చేస్తున్నారు.ప్రతి పోస్టుకూ రాజకీయనాయకుల సిఫారసు కోసం తిరగాల్సి వస్తోంది.  
ముసలోళ్ళకు భారం
పక్షులూ,జంతువులూ కూడా తనబిడ్డలకు యుక్తవయసు వచ్చాక పోషించవు.పిల్లల పోషణ వాటికి యావజ్జీవిత బాధ్యత కాదు.అలాగే పిల్లలు తిరిగి తమ తల్లిదండ్రుల పోషణ బాధ్యత మోయవు కానీ తమ జీవన దారిని  తాము  చూసుకుంటాయి.ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకని ,ఉద్యోగం చేయలేని నిరుద్యోగ యువతలో ఆత్మాభిమానం తగ్గి పరాన్నజీవి స్వభావం  పెరుగుతోంది.  
 స్కూల్ విద్య ముగియడంతోనే తల్లిదండ్రులను వదిలి సొంత కాళ్లపై నిలబడడానికి ప్రయత్నించే యువకులు ఇప్పుడు సమస్యల సాగరాన్ని ఈదలేక స్వయం శక్తితో జీవనం గడిపే ఆలోచనలను విరమించుకుని తల్లిదండ్రులతోడిదే లోకం అంటున్నారు. వయసొచ్చాక కూడా తల్లిదండ్రుల కష్టార్జితం తినడానికి సిగ్గుపడటం లేదు. వివాహాన్నీవాయిదా వేస్తున్నారు,లేదా మానేస్తున్నారు. కొద్దిమంది మాత్రం దొరికిన చిన్న ఉద్యోగంతో సెటిల్ అవుతున్నారు.34 ఏళ్ళ వయసోళ్ళు కూడా తల్లిదండ్రులు, తాతా నాయనమ్మలతో కలిసి జీవిస్తున్నారు. నిరుద్యోగం వలన తల్లిదండ్రుల సహాయం, తోడు లేనిదే బతక లేకపోతున్నారు.ప్రైవేటు కంపెనీల్లో కఠినమైన పనులు చేయలేక గోడకుకొట్టిన బంతులు (బూమరాంగ్ కిడ్స్) లాగా తిరిగొచ్చి ఉద్యోగాల వెతుకులాటను కూడా మానేస్తున్నారు.ఇక నిరుద్యోగ భృతి కలలో మాటే.





చదువుతోపాటే నిరుద్యోగం
మన దేశంలో విద్యతో పాటూ నిరుద్యోగం కూడా పెరుగుతూనే ఉంది.15-29 ఏళ్ల మధ్య వయసున్న ప్రతిముగ్గురిలో ఒకరు నిరుద్యోగిగా ఉంటున్నారు. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారు ఉద్యోగం దొరక్క తిప్పలు పడుతుంటే... రాయడం...చదవడం తెలియని నిరక్షరాస్యులో మాత్రం నిరుద్యోగ సమస్య తక్కువగానే ఉందట.గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులు 36.6 శాతం ఉంటే పట్టణాల్లో నిరుద్యోగులు 26.5 శాతం ఉన్నారట.

యువతలో పట్టభద్ర నిరుద్యోగం పెరుగుతోంది. ఎన్ని పథకాలు వచ్చినా కనీస ఉపాధి దొరకడం లేదు. చదువుకుంటే ఉద్యోగాలొస్తాయని, జీవితంలో స్థిరపడవచ్చని కష్టపడి డిగ్రీ పూర్తి చేసినా ఉద్యోగాలు మాత్రం లేవు. చదువుకున్న వారిసంఖ్యతో పాటు.. నిరుద్యోగమూ అదేస్థాయిలో పెరుగుతోంది. డిగ్రీ చదివిన ప్రతి ముగ్గురు పట్టభద్రుల్లో ఒకరు నిరుద్యోగిగా ఉన్నారు. చేసే పనికన్నా చదువు ఎక్కువగా ఉండటం వల్ల  నైపుణ్యం పూర్తి స్థాయి లో వినియోగం కావట్లేదు. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం 12.6 శాతం ఉండగా, దేశంలో 31.1 శాతంగా నమోదైంది.యువతకు సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో పార్ట్‌టైం, తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్నారు. సాధారణ ప్రజలతో పోలిస్తే యువత సరైన ఉద్యోగాలు పొందడంలో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఉద్యోగం కోసం దీర్ఘకాల అన్వేషణ ఫలితంగా వారిలో అసంతృప్తి, అశాంతి నెలకొంటున్నాయి.యువతలో సరైన నైపుణ్యాలు లేకపోవడంతో అవకాశాలు అందుబాటులో ఉన్నా ఉద్యోగాలు రావడం లేదు. దీంతో తాత్కాలిక, ఒప్పంద కార్మికులుగా పనిచేస్తూ అసంఘటిత రంగంలోకి వెళ్తున్నారు.తయారీ, సేవా రంగాల్లో ఉద్యోగాలు పెరగడం లేదు. దీంతో ఉద్యోగాల కొరత పెరుగుతోంది. చదువుకుంటున్న వారి సంఖ్యకు, ఉద్యోగ అవకాశాలకు పొంతన లేదు.స్వయంఉపాధి మార్గాన్ని ఎంచుకున్నప్పటికీ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌ నైపుణ్యాలు ఉండటం లేదు. అనుభవం లేకపోవడం, అధిక వడ్డీరేట్లకు రుణాలు తీసుకోవడంతో సంక్షోభంలోకి వెళ్తున్నారు. పట్టభద్రులైనా బతుకుబండి సవ్యంగా సాగక జీవనభద్రత లేక నిరుద్యోగుల్ని కుంగదీస్తోంది. చదివిన చదువుకు దీటైన ఉద్యోగం దొరక్క, తాత్కాలిక ఉపాధితో జీవితం నెట్టుకొస్తున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. 90శాతం పట్టభద్రులు, 75శాతం ఇంజినీర్లకు ఉద్యోగార్హత లేదట.విద్యావ్యవస్థ పనికొచ్చే చదువులు నేర్పటం లేదు. పట్టాకూ పనికీ సంబంధమేలేని మేడిపండు చదువులు దేశంలో బతుకుతెరువు కరవైన విద్యావంతుల జనాభాను పెంపొందిస్తున్నాయి.

విద్యావంతులు ఎలాంటి వృత్తిపరమైన మెలకువలూ ఒంటపట్టక నిరుద్యోగులుగామిగలడానికి మూలకారణమేమిటి? మన పిల్లలు ప్రైవేటు కంపెనీలు కోరే స్థాయిలో భావవ్యక్తీకరణ నైపుణ్యం, సాంకేతిక ప్రజ్ఞాసామర్థ్యాలు, బృందంలో ఇమిడి పనిచేయగల స్వభావం, సమస్యా పరిష్కారశక్తి లేక ఉపాధి వేటలో డస్సిపోతున్నారు. చైనా, జపాన్‌, సింగపూర్‌, తైవాన్‌ లో లాగా పనికొచ్చే చదువులు నేర్పాలి. పరిశ్రమలు, ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు కలిసి మేలిమి మానవ వనరులను  తయారుచేయ్యాలి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఐరోపాలలో పాఠశాల విద్య సహా అన్ని స్థాయుల్లోనూ నాణ్యమైన బోధన ఉంటుంది. చదువుకు, ఉపాధికి లంకె లేదు. సాంకేతిక పట్టాదారులు కూడా గత్యంతరం లేక ఏ పనికైనా సిద్ధపడే దురవస్థ మన విద్యావ్యవస్థ కల్పిస్తోంది.


బోధన ప్రయోగాత్మకంగా సాగాలి. షికాగో, ఇల్లినాయిస్‌, స్టాన్‌ఫోర్డ్‌, క్యాలిఫోర్నియా లాంటి విశ్వవిద్యాలయాల్లో పనితో కూడిన చదువు ఉంటుంది కాబట్టే అక్కడ ఎక్కువమంది ఉద్యోగార్హత పొందుతున్నారు. చైనా విద్యావంతుల్లో 96శాతం మంచి ఉద్యోగాల్లో కుదురుకుంటున్నారు. మనదేశంలో  పీహెచ్‌డీ పట్టభద్రులు కూడా చిన్నాచితకా ఉద్యోగాలకోసం పోటీపడుతున్నారు.  తాత్కాలిక గ్రామపంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలకు కూడా కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడ్డాయి. పదో తరగతి అర్హత సరిపోయే అబ్కారీ కానిస్టేబుళ్ల కూ అయిదు లక్షల మంది పట్టభద్రులు; ఎంటెక్‌, ఎంబీయే, ఎంఫార్మసీలు అర్జీలు పెట్టుకున్నారు. దేశ జనాభాలో 24ఏళ్లలోపువారి సంఖ్య 55కోట్లు. బతికించే చదువులు, అక్కరకొచ్చే నైపుణ్యాలు నేర్పితే కదా అందరికీ తగిన పని దొరికేది?

ఉపాధి కల్పనా కేంద్రాలు ఏమయ్యాయి?
ఉపాధి కల్పన శాఖపై నిరుద్యోగుల్లో నమ్మకం పోయింది.ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి ప్రయోజనం ఒనగూరటంలేదు. కొత్త రిజిస్ట్రేషన్ల సంఖ్య పడిపోగా, పాత రిజిస్ట్రేషన్లు సైతం పునరుద్ధరణకు
నోచుకోవడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలు ఎప్పుడోకానీ రావు. ప్రైవేటు రంగంలో ఉపాధి అందరికీ దొరకదు. జాబ్ మేళాల్లో ప్రైవేటు కంపెనీలిచ్చే ఉద్యోగాలు, వేతనాలు నిరుద్యోగులకు ఏ మాత్రం సంతృప్తిని కలిగించలేకపోతున్నాయి. మార్కెట్లలో అమ్ముడుపోని ఉత్పత్తులను ఇంటింటికి తిరిగి విక్రయించే సేల్స్‌మేన్‌తో పాటు వాచ్‌మెన్, సెక్యూరిటీ గార్డులాంటి ఉద్యోగాలు  తప్ప ఇతర అవకాశాలు ఉండడం లేదు.
దిగువ స్థాయి ప్రభుత్వ ఉద్యోగానికి సైతం వేల సంఖ్యలో దరఖాస్తులు పెడుతున్నారు ఉన్నత విద్యావంతులైన నిరుద్యోగులు.ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ లలో నమోదు విషయానికి వస్తే ఆశలు వదులుకుంటున్నారు. గతంలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ  ఫలితాలొచ్చి పట్టాలు చేతికందిన వెంటనే ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ కోసం క్యూ కట్టేవారు. రోజూ వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగేవి. ప్రస్తుతం మారిన పరిస్థితుల వల్ల పదుల సంఖ్యకు రిజిస్ట్రేషన్లు పడిపోయాయి. గతంలో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నవాళ్లు ప్రతి మూడేళ్లకోసారి పునరుద్ధరించుకోవాల్సి ఉండగా.. మిన్నకుండిపోతున్నారు. గడువులోగా పునరుద్ధరించుకోవడంలో విఫలమైనవారికి మరో ఆరు నెలల సమయాన్ని గ్రేస్ పీరియడ్‌గా అవకాశమిస్తున్నా స్పందన ఉండడం లేదు. నిరుద్యోగ అభ్యర్థులు మొఖం చాటేస్తుండడంతో ఉపాధి కల్పన శాఖ కార్యాలయం వెలవెలబోతోంది. పునరుద్ధరణ కాక పాత రిజిస్ట్రేషన్లు క్రమంగా ల్యాప్స్ అవుతుండగా.. మరోవైపు కొత్త రిజిస్ట్రేషన్లు సైతం తగ్గిపోవడం వల్ల లైవ్ రిజిస్ట్రేషన్ల సంఖ్య లక్షల నుంచి వేలల్లోకి  పడిపోయింది. 2011 నాటికి రాష్ట్రంలోని ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ ల్లో 1,44,553 మంది అభ్యర్థులు పేర్లు నమోదు చేయించుకున్నారు. ఈ కేంద్రాలకు 4,156 ఉద్యోగాలు నోటిఫై చేయగా 816 మందికి ఉద్యోగాలు లభించాయి.ఎంప్లాయ్‌మెంట ఎక్స్చేంజ్‌ల లైవ్ రిజస్టర్లలో 18,33,231 మంది అభ్యర్ధులు నమోదై ఉన్నారు. 2013లో మన జనాభా 123 కోట్లు. సంవత్సరానికి 1.5 శాతం పెరు గుతోంది. అంటే ప్రతియేటా 1,84,50,000 మంది పెరుగుతున్నారు. 2021 నాటికి మన జనాభా 140 కోట్లు కావచ్చు. అంటే చైనాను మించిపోతాం. వీరందరికీ ఉపాధి కల్పించగలమా? కోట్ల సంఖ్యలో ఉపాధి రహితులు తయారైతే పర్యవసానం ఏమిటి?గతంలో చాలా మంది విద్య, నైపుణ్యం లేని వారే. ఇటీవల తరాల వారు బీటెక్, ఎం సీఏ, ఎంబీఏ, ఎంకాం, ఎంఏ, బీఈడీ, బీఏ, సీఏ వగైరా పట్టాలు తీసుకుంటున్నారు. ఇటు వంటి వారికి ఉపాధి అవకాశాలు లేకపోతే, వారు పెడదారి పడతారు.
 ప్రస్తుతం ఒక్క మన రాష్ట్రంలోనే 10 లక్ష ల మంది బీటెక్ ఇంజనీర్లు నిరుద్యోగులుగా ఉన్నారు. దేశంలో ఏడాదికి, 3,600 ఇంజనీరింగ్ కళాశాలల్లో, 13 లక్షల మంది యువతీ యువకులు చేరుతున్నారు. పెరుగుతు న్న జనాభాను సంపదను సృష్టించే వారిగా తయారు చేయనందువల్ల  విద్యావంతులైన నేరగాళ్లు పెరుగుతున్నారు. 

యువకులు నిరాశ నిస్పృహలతో పనీ పాటా లేకుండా ఉంటే ఎలా? దేశానికి దిక్కెవరు?   ప్రపంచంలో ఐదవ వంతు యువత మనదేశంలోనే ఉంది. కేంద్రం 13-35 ఏళ్ల మధ్య వయసు వారిని యువతగా గుర్తించింది. కాబట్టి యువత మన జనాభాలో 40 శాతానికిపైనే ఉంటుంది. చదువు వేరు. నైపుణ్యం వేరు. ప్రపంచీకరణ పుణ్యమా అని మన యువత వృత్తి నైపుణ్యానికి దూరమైంది. కానీ చాలినన్ని ఉద్యోగాలున్నా మన యువతకు వృత్తి నైపుణ్యం లేనందున ఉద్యోగ ఖాళీలు ఉన్నా నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారట. మన యువకుల్లో నైపుణ్యం కొరవడి ఉద్యో గాలు పొందలేకపోతున్నారని ప్రైవేటు కంపెనీలు దుర్మార్గంగా చెబుతున్నాయి.అవి తమ కంపెనీల స్థాపనకోసం ప్రభుత్వంనుండి  ఉచితంగా చవకగా భూములు,రకరకాల  సబ్సిడీలు పొందాయి.నిరుద్యోగ యువకులకు నైపుణ్యం కల్పించే సామాజిక బాధ్యత అవి తీసుకుంటున్నాయా? దేశ ప్రజలపై సేవా దృష్టితో ఉచితంగానో చవకగానో విద్యా, శిక్షణ, ఉద్యోగ కల్పన చేస్తున్నాయా? 

  
 ఆంధ్రప్రదేశ్ అవతరించిన 1956 నవంబర్ 1 న  స్థాపించిన ఉపాధి కల్పనా కేంద్రాలు నాలుగు దశాబ్దాల పాటు యువతకు ఉపాధి కల్పించడంలో కీలకపాత్ర పోషించాయి. కావలసిన నిధులు, ఉద్యోగాలు ఇవ్వకుండా వాటిని నిర్లక్ష్యం చేశారు. చాలా కాలంపాటు ఉపాధి కల్పనా కార్యాలయాలు యువతకు బాగా ఉపయోగపడ్డాయి. కానీ ఇప్పుడు ఉపాధి కల్పించడంలో మన ఉపాధి కల్పనా కార్యాలయాలు అట్టడుగు స్థానానికి ఎందుకు వెళ్ళాయి? గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు  యువతకు ఉపాధి కల్పించడంలో ముందున్నాయి. మన రాష్ట్రంలో రాజీవ్ ఉద్యోగశ్రీ, రాజీవ్ యువకిరణాలు వంటి ఉద్యోగ మేళాలు పెట్టినా అందరికీ ఉద్యోగాలు రావటంలేదు. రాష్ట్రంలోని 1,000 రాజీవ్ యువ కిరణాల శిక్షణా శిబిరాల ద్వారా ఇప్పటి దాకా 3 లక్షల మందికి ఉపాధి కల్పించారట,మరో 12 లక్షల మందికి 2015 లోపున కల్పిస్తారట.


 2011 నాటికి దేశంలో 1,000 ఉపాధి కల్పనా కేంద్రాలున్నాయి. మన రాష్ట్రంలో ఉన్నవి 31 మాత్రమే . వీటి ద్వారా 2,36,000 నిరుద్యోగ యువత ఉపాధి కోసం రిజిస్ట్రేషన్ చేసుకోగా, 2011లో ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 800 మాత్రమే. అదే గుజరాత్‌లో 41 కేంద్రాలలో 4,16,500 రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఆ ఒక్క ఏడాదిలో 2,25,600 మందికి ఉపాధి కల్పించారు.అక్కడ వందల కోట్లు ఉపాధి కల్పనాశాఖకు కేటాయించారు.ఇక్కడ పాతిక కోట్లు కూడా కేటాయించలేదు. అవి ఉద్యోగుల జీతాలకే సరిపోతాయి.  ఇక ఉపాధి కల్పనా కార్యక్రమాలు జరిగేదెలా? ‘యువకిరణాలు’ పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు కాకుండా జిల్లా ఉపాధి కల్పనా కేంద్రాలకు అప్పగిస్తే ఆ పని ఇంకా బాగా చేసేవి. యువతకు ఉపాధి కల్పించడం ఉపాధి శాఖ విధి. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఎంత మంది పనిచేస్తున్నది, ఉద్యోగ ఖాళీలు ఎన్ని అని  లెక్కించాల్సింది ప్రభుత్వ ఉపాధి కల్పనా కేంద్రాలే. సర్వీసు కమీషన్ కు జిల్లా ఉపాధి కల్పనా కేంద్రాలన్నిటినీ బ్రాంచి ఆఫీసులుగా మార్చేస్తే ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహించటానికీ,రికార్డులు నమోదు చేయటానికీ సర్వీసు కమీషన్ కు కూడా తగినంత బలం ఏర్పడుతుంది.
  నిరుద్యోగ భృతి
ఉపాధి కల్పనా కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకునే నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, జాతీయ ఉపాధి కల్పనా పోర్టల్‌కు అనుసంధానం చేసిన ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజిల ద్వారా ప్రైవేట్ కంపెనీల్లోని ఖాళీలను కూడా నోటిఫై చేయాలనీ పార్లమెంటు స్థాయీ సంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఉపాధి కల్పనా కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకునే అభ్యర్థులకు చండీగఢ్, హర్యానా, కేరళ, తమిళనాడు, పంజాబ్, పుదుచ్చేరి, జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రాలు మాత్రమే నిరుద్యోగ భృతిని ఇస్తున్నాయి. మిగతా రాష్ట్రాలు కూడా నిరుద్యోగభృతి ఇవ్వాలని కేంద్రం అభిప్రాయపడింది.
వికలాంగులకు పెన్షన్
 20 శాతం వైకల్యం ఉన్నా నెలకు రూ.200లు పింఛన్‌ చెల్లిస్తామని చెప్పడం బాగానే ఉంది. కానీ గత రెండేళ్లుగా రాష్ట్రంలో వికలాంగులను హింసించినంతగా వేరెవరినీ ఈ రాష్ట్ర ప్రభుత్వం హింసించలేదంటే అతిశయోక్తి కాదు. కంప్యూటర్‌ ద్వారా అంగవైకల్యాన్ని నిర్ణయించడానికి పెట్టిన సదరం క్యాంపుల్లో వికలాంగులు హింస అనుభవించారు.అంతకుముందు పింఛన్లు పొందుతున్న వేలాదిమంది వికలాంగులకు 'నీ వైకల్యం చాలదు-నీకు పెన్షన్‌ లేదు' అని నిర్దాక్షిణ్యంగా చెప్పారు. గతంలో మీ ఊళ్లో వృద్ధాప్య పింఛను పొందుతున్నవారెవరైనా చనిపోతే అప్పుడు నీకు పింఛనొస్తుంద చెప్పేవారు. వికలాంగులకు ప్రకటించిన ఈ రెండొందలకు కూడా మళ్లీ సదరం సర్టిఫికెట్ల హింస తప్పదట.
గీటురాయి  20.12.2013
 https://www.facebook.com/photo.php?fbid=679563828742277&set=pcb.679564122075581&type=1&theater
గీటురాయి 27.12.2013

http://www.suryaa.com/opinion/edit-page/article-165399 సూర్య  January 4, 2014

2, డిసెంబర్ 2013, సోమవారం

సహజీవనం


సహజీవనం

నూర్ బాషా రహంతుల్లా 9948878833

పెళ్ళి చేసుకోకుండా, జీవితాంతం కలిసి జీవిస్తామని ప్రమాణాలు చేసుకోకుండా,  ప్రేమికులైనా కాకపోయినా  స్త్రీ, పురుషుడు కలిసి ఉండడమే  సహజీవనం (లివ్ ఇన్ రిలేషన్‌షిప్). ఈ ‘సహజీవన’ సంస్కృతి పాశ్చాత్య దేశాలకు పాతే కావచ్చు గానీ మన దేశానికి కొత్త . ‘పెళ్లి అనేది పాత కాన్సెప్ట్’ అంటూ సినీనటులు కొందరు సహజీవనం చేస్తున్నారుగానీ సామాన్యజనం మాత్రం సహజీవనాన్నీ సహజీవనుల్నీ చీదరించుకుంటూనే ఉన్నారు.

సమైక్యమా? సమన్యాయమా?

భార్య ఉంటుండగా, ఆమెతో పాటు మరో మహిళతో సహజీవనం సాగిస్తున్న వ్యక్తి ఇద్దరితోనూ సరిసమానమైన సమయం గడపాలంటూ మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో లోక్ అదాలత్ 1.12.2013 న విలక్షణమైన తీర్పునివ్వటంతో కొత్త చర్చకు తెరలేచింది.లోక్ అదాలత్ తీర్పు మీద అపీలుండదు.ఈ  తీర్పు బహుభార్యత్వాన్ని సమర్ధిస్తోందా ?భార్యలమధ్య సమాన న్యాయం పాటించాలనే షరియత్ కూ దీనికీ పెద్ద తేడా ఏముంది? అని విమర్శలు రేగాయి.ఏకపత్నీవ్రతాన్నీ ,ఏకపతీవ్రతాన్నీ,పెళ్లంటే నూరేళ్లపంట అనే భావనను ఇలాంటి తీర్పులు బలహీనపరుస్తున్నాయని,ఉత్తరోత్తరా బహుభర్తృత్వం కూడా దేశంలో ప్రబల వచ్చనీ , భారతీయ సంస్కృతి సంప్రదాయ పరిరక్షణ వాదులు గగ్గోలుపెడుతున్నారు. అంతకుముందు 28.11.2013 న సుప్రీంకోర్టు కూడా సహజీవనం నేరం కాదు అని తేల్చేసింది. సహజీవనం చేసి విడిపోయిన మహిళలకు , సహజీవనం ద్వారా పుట్టిన సంతానానికి రక్షణ కల్పించే చట్టాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు పార్లమెంటును కోరింది.'సహజీవనం మన దేశంలో సామాజికంగా ఆమోదం యోగ్యం కాకపోయినా అది నేరమో పాపమో కాదు. పెళ్లి చేసుకోవాలా, వద్దా అన్నది పూర్తిగా వ్యక్తిగతమైనది. అయితే ఈ మొత్తం ప్రక్రియలో నష్టపోయేది మహిళలు, పిల్లలే. అందుకే వారి రక్షణకు చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది' అని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. అదే సమయంలో ప్రభుత్వం తీసుకొచ్చే చట్టం పెళ్లికి ముందే శృంగారాన్ని  ప్రోత్సహించేదిగా ఉండకూడదని అభిప్రాయపడింది. సహజీవనాన్ని గుర్తించేందుకు ఎంతకాలంగా వారు కలిసి జీవిస్తున్నారు, వారి ఆర్థిక, సామాజిక పరిస్థితి, పిల్లలు ఉన్నారా లేదా, సహజీవనం చేసే వ్యక్తుల ప్రవర్తన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని బెంచ్ సూచించింది. ''సహజీవనం కూడా పెళ్లి లాంటిదే'' అనే అర్థం వచ్చేలా చట్టాలు తయారుచేయాలని, మహిళలకు రక్షణ కల్పించాలని ధర్మాసనం ఆదేశించింది. పార్లమెంటు ఈ అంశాలపై స్పందించాలని, తగిన చట్టం చేయడం లేదా ఉన్న చట్టాలకే సవరణ చేయడం ద్వారా మహిళలు, వాళ్ల పిల్లలకు రక్షణ కల్పించాలని తెలిపింది. ఇలాంటి సంబంధాలు పెళ్లిలాంటివి కాకపోయినా, ఈ రక్షణ మాత్రం వారికి అవసరమని ధర్మాసనం చెప్పింది. పెళ్ళైనా సహజీవనమైనా మహిళలు మగవాడి దాష్టీకానికి గురయినప్పుడు ,పురుషుడికి వ్యామోహం తీరినప్పుడో, అహం దెబ్బతిన్నప్పుడో ఆ మహిళలు  నిరాశ్రయులయితే వారిని రక్షించే చట్టం తయారు చెయ్యమని కోరింది.

ఎన్నో కారణాలు                        
స్త్రీ సంపాదన పెరిగే కొద్దీ ‘పెళ్లి’ కొంచెం కొంచెంగా అంతరిస్తోంది.మన దేశంలో కూడా క్రమంగా  సహజీవనాలు పెరుగుతున్నాయి.సంతోషకరమైన పెళ్ళిళ్ళు-సులభమైన విడాకులు (“హ్యాపీ మ్యారేజెస్ ఈజీ డైవోర్సెస్”) శకం ఆరంభమయ్యిందని సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయయపడ్డారు.విడాకుల కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండడంతో విడాకుల కేసుల విచారణ కోసం చెన్నై కోర్టు ప్రత్యేక విభాగాన్నే ఏర్పాటు చేసింది. కుటుంబ ఉమ్మడి లక్ష్యాలు లోపించడం, వ్యక్తిగత అహంకారాలకి ప్రాధాన్యం పెరగడం, దంపతులిద్దరూ చెరోలోకం అన్నట్టు ఉండడం.. వంటివన్నీ దాంపత్య బంధాల వైఫల్యానికి సహజీవనాలు పెరగడానికి దోహదం చేస్తున్నాయి. పాలు అమ్మే వ్యక్తి దగ్గర్నుంచి పక్కింటి వ్యక్తి వరకు ఎంతో మంది అనుమానపు చూపులు ఎదుర్కోవల్సి రావడం, కొన్నేళ్ల పాటు కలిసి జీవించినా ఒకరిపై ఒకరికి ఎటువంటి హక్కులూ సంక్రమించకపోవడం, అకస్మాత్తుగా భాగస్వామిని కోల్పోతే.. జరిగే నష్టాన్ని పూడ్చుకునేందుకు ఎటువంటి వీలూ లేకపోవడం లాంటి ప్రతికూలతలు కనబడుతున్నా బంధమే తప్ప నిర్బంధాలు లేకపోవడం, ఏ రోజైనా స్వేచ్ఛగా నిష్ర్కమించే వీలుండడం లాంటి కొన్ని ఆకర్షణలు సహజీవనం వైపు లాగుతున్నాయి. 
ఏం చెప్పాలో ఎలా చెప్పాలో పెద్దలకే తెలియడంలేదు

సహజీవనులు చాలా మంది ఇష్టపూర్వకంగా దీనిలోకి దిగుతున్నారు. చిన్న చిన్న ఊర్లకు సైతం ఇది పాకింది. అనుకున్నదే తడవు కలిసిపోతున్నారు.దీనికి పెద్దగా సన్నాహాలేవీ అక్కర్లేదు కాబట్టి సులభంగా అనుబంధంలోకి దిగిపోతున్నారు. అంతే సులభంగా విసిగిపోతున్నారు,విడిపోతున్నారు. ఒంటరి వృద్ధులు కూడా సహజీవన జంటలుగా మారుతున్నారు. కొన్ని నగరాల్లో సీనియర్ సిటిజన్స్ కోసం సహజీవన మేళాలు జరుగుతున్నాయి. ఈ మేళాలకు వేలాదిమంది హాజరవుతున్నారు. హైదరాబాదులో కూడా ‘తోడు నీడ’ అనే స్వచ్ఛందసంస్థ ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.  హక్కులు, బాధ్యతలు లేని సంబంధం కాబట్టి వారికి ఎలా సలహా ఇవ్వాలో కౌన్సిలర్లకు  అర్థం కావడం లేదు. సివిల్ కోర్టులలో ఈ తరహా కేసులు బాగా పెరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో ఇప్పటికే సహజీవనాన్ని చట్టబద్ధం చేశారు. వివాహం చేసుకోకుండా కలిసి జీవించడం నేరమో, పాపమో కాదని చెప్పిన మన సుప్రీంకోర్టు,సహజీవన  చట్టం పెళ్ళికి ముందే  శృంగారాన్ని ప్రోత్సహించేలా ఉండకూడదని , సహజీవనం పరిధిలోకి  అక్రమ సంబంధాలు రాకూడదని కూడా హెచ్చరించింది.  

సామాజిక కట్టుబాట్లూ జీవన విలువలు చెడిపోతాయి

సంస్కృతీ పరిరక్షకుల వాదన ఇది: “సహజీవన విధానం అనేదే సరైంది కాదు. దీనివల్ల జీవన విలువలు చెడిపోతాయి.ఇది సంఘానికి  అనర్థదాయకం.శరీర కోరికలను సంతృప్తి పరుచుకోడానికే సహ జీవన విధానం కొనసాగుతున్నది. దీనిని సంఘం ఆమోదించదు. పెళ్లి చేసుకుంటే భవిష్యత్తు మీద భరోసా ఉంటుంది. కానీ యాంత్రికమైన సహజీవనంలో ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండదు.నమ్మకం అవసరం. సహజీవనులు పిల్లల్ని కనరు. ఒకవేళ కన్నా అప్పటికే వయసు మించిపోయి గర్భం దాలిస్తే పుట్టే పిల్లలు మానసికంగా, శారీరకంగా సరిగా ఎదగరు. సహజీవనుల పిల్లల్ని సంఘం కూడా ఆమోదించదు. పెళ్ళి జరిగితే సమస్యలు రావు. వస్తాయనటం  అపోహ,మూర్ఖత్వం. మన శాస్త్రాలూ పురాణాలన్నీ పెళ్లి గురించి ఎంతో గొప్పగా చెప్పాయి. అలాంటి పెళ్ళిని కాదని సహజీవనం సాగించడం మంచి పరిణామం కాదు. పెళ్ళి చేసుకునేవాళ్ళకే అన్ని హక్కులూ ఉంటాయి. సహజీవనం చేసేవాళ్ళకి హక్కులు ఏమీ ఉండవు.  
సహజీవనం అంటే కేవలం కామ సంబంధమే. పెళ్ళి కి కట్టిన తాళిబొట్టు కూడా బరువేనా? బాధ్యతల నుంచి తప్పించుకోవడం కోసమే ఇలాంటి వికృత చేష్టల్లో అడుగుపెడుతున్నారు.వికృత చేష్టలకు విపరీతమైన ఫలితాలే ఉంటాయి. సహజీవనం  ప్రతివాడికీ ఒక ఫ్యాషనై పోయింది. అలాంటి తప్పుడు సహజీవనం అవసరమా? మంత్రాల పెళ్ళి వద్దనుకునేవాళ్ళు  కనీసం రిజిస్టర్ పెళ్ళినైనా చేసుకోవాలి. దానివల్ల చట్టభద్రత ఉంటుంది. సహజీవనం సాగించే అమ్మాయికే అసలు సమస్య. ఆమెకు భార్య అనే స్టేటస్ ఉండదని తెలిసినా  అక్రమ సంబంధానికి తెగబడటం ఏమిటి?అక్రమ సంబంధం ఏదైనా తాత్కాలికమే. సహజీవనులకు అసలు బుద్ధి ఉందా?ఇష్టం లేనప్పుడు విడిపోతామని కూడా తెలుసు కాబట్టి వీళ్లు ఆచారాలకు, కట్టుబాట్లకు విలువ ఇవ్వరు. ఏ సమయంలోనైనా విడిపోవచ్చు అనే అనుకుంటారు.సహజీవనుల పిల్లలకు మరీ ఇబ్బంది. విడిపోతే ఆ పిల్లలు అనాథలే కదా? దీనివల్ల సమాజానికి చెడ్డ సంకేతాలు వెళతాయి. సహజీవనం సాగించేవాళ్ళకి భద్రత లేదు.ముఖ్యంగా ఆడవాళ్ళకి! మగవాడు ఆమెను విడిచిపెట్టి పారిపోతే? మహిళా సంఘాలు ఇలాంటి వాటిని ప్రోత్సాహించకూడదు. చట్ట ప్రకారం, సమాజంలో కూడా ఇది ఆమోద యోగ్యం కాదు. సహజీవనం అనేది విదేశీ కల్చర్. అక్కడ కేవలం అవసరం ఉన్నంతవరకు కలిసి ఉండి, ఇష్టం లేకపోతే విడిపోతారు. అలాంటి వాటిని ఆహ్వానించకూడదనే పెళ్ళి అనే సంప్రదాయాన్ని తీసుకొచ్చారు మనవాళ్లు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు మనదేశానికి మోసుకొచ్చిన పాప ప్రయోగమే ఈ సహజీవన విధానం.ఆడవాళ్ళు కూడా విదేశాలలో ఉద్యోగాలు చేస్తూ సంపాదన మొదలుపెట్టాకనే ఈ దరిద్రం మన దేశానికి చుట్టుకుంది.”

పెళ్ళే కావాలా? కలిసుంటే చాలదా?

సహజీవనుల సమాధానం ఇది: “సంసారం ఒక సాగరం.కష్టాలు అనంతం.జీవన పోరాటం దంపతులెవరికైనా తప్పదు. సహజీవనులకు కూడా గృహహింస చట్టం ఇస్తున్న భద్రత వర్తిస్తుంది. విడిపోయినప్పుడు  మహిళ , ఆమె పిల్లలు భరణం పొందవచ్చు. పెళ్ళి అనే తంతు అవసరం లేదు. పెళ్లి అంటే మతం,కులం, గోత్రం,పురోహితులు,మంత్రాలు, లాంటి తంతులన్నీ అవసరం. ఇద్దరు కలిసి ఉండాలంటే వారి మధ్య స్నేహం, పరస్పర గౌరవం అవసరంకానీ ,భారీ ఖర్చుతో కూడిన ఈ అనవసరమైన తంతులు ఎందుకు?ఈనాడు ఉమ్మడి కుటుంబాలు లేవు.ఎటో వెళ్ళి పోయాయి.సంప్రదాయవాదులు వాటిని కాపాడగలిగారా?ఎవరి ఆర్ధిక అవసరాలు వారివి. ప్రేమ వివాహాలు,వృద్ధాశ్రమాలు ఎందుకు పెరిగాయి?పెళ్ళి అనే అనవసరపు తంతు లేకుండా కలిసుంటే చాలదా? సరిపడకపోతే పెళ్ళి జీవితకాలం మంటే కదా? పెళ్ళినాటి బులుపు ఎల్లకాలం ఉంటుందా? కలిసున్నంతకాలం సుఖంగా, ప్రశాంతంగా ఉండి నచ్చనప్పుడూ అంతే ప్రశాంతంగా విడిపోకూడదా ? మనసులు కలవకపోయినా సమాజంకోసం కలిసుంటూ ఇల్లు నరకం చేసుకోవాలా ? అలాంటి కష్టాలను పిల్లలకు ఎందుకు పంచాలి?పెళ్లంటే ఒక యావజ్జీవ చెరసాల . సహజీవన పద్ధతిలో స్వేచ్ఛగా బతికేయొచ్చు.సహజీవన బంధానికి చట్టబద్ధత ఉంది.చాలాకాలంగా కలిసి సహజీవనం చేస్తే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 112 ప్రకారం దానిని భార్యభర్తల సంబంధంగానే  గుర్తిస్తారు.అది అక్రమ సంబంధం కాదు.సహజీవనం వేరు. అక్రమ సంబంధం వేరు. సహజీవనం ద్వారా ఒకరిమీద ఇంకొకరికి ఉన్న ప్రేమ నిజమో కాదో తెలుసుకోవచ్చు. అభిరుచులు, అభిలాషలు, అంతరంగాలు, అంతరాలు ఇష్టాలు, అయిష్టాలు, బరువు బాధ్యతలు అర్థం చేసుకోవచ్చు. జీవితంలో ఇద్దరి భాగస్వామ్యం అనుకూలంగా ఉంటుందో లేదో ఇద్దరికీ పొసగుతుందో లేదో తెలుసుకుని మార్పులు, చేర్పులు, చేసుకోవచ్చు. సహజీవనం ఒక శాస్త్రీయ ప్రయోగం. ఇందులో అంతా ప్రమోదమే కానీ ప్రమాదమేమీలేదు.సహజీవనులు ఎవరినీ నష్టపరచటం లేదే?మాకులేని బాధ మీకెందుకు?ఎప్పుడూ పొరుగువాళ్ళలో లోపాలు వెతకటం తప్ప  సంప్రదాయులకు వేరే  పని లేదా ? మత నియమాలతో ఖాఫ్ పంచాయతీల లాగా మనుషుల స్వేచ్ఛను నిరంకుశంగా నియంత్రించటం తప్పు కాదా ?ఇలాంటి ఘోరమైన హద్దులు గీసే పెద్దలమాట మేం వినం.మా జోలికి రాకండి.సహజీవనులు మీ జోలికొస్తే అడగండి.అడ్డదిడ్డంగా వాదిస్తున్నామని అనకండి.”  

కష్టమొచ్చినప్పుడు తిరిగొస్తున్నారు  

ఇష్టమొచ్చినప్పుడు ఒకలాగా కష్టమొచ్చినప్పుడు మరొకలాగా ఉండటం మానవ నైజం.అయినా బాధితులకు న్యాయం చెయ్యటం ప్రభుత్వ బాధ్యత గనుక కొన్ని రక్షణ ఏర్పాట్లు చేశారు.
ఇష్టమొచ్చినంత కాలం కలిసి ఉండి ఆ తర్వాత విడిపోయినా సహజీవనంలో మోసపోయిన మహిళలకు ఆస్తిహక్కు, సంతాన హక్కులు, గృహహింస చట్టం ద్వారా రక్షణపొందే హక్కు ఉంటాయి. కాకపోతే మోసపోయిన మహిళ తాను సహజీవనం చేసిన చోట స్థానికులతో వారు భార్యాభర్తలుగా సహవాసం చేశారని సాక్ష్యం చెప్పించాలి.ఓటరు కార్డూ , రేషన్ కార్డు లాంటి ఋజువులతో వారిని భార్యభర్తలుగా గుర్తిస్తారు.మోసగాళ్ళను వడపోసేందుకు కొన్ని షరతులు పెట్టారు. సహజీవనులు అవివాహితులై ఉండాలి. జీవించి ఉన్న భర్త, భార్య ఉండకూడదు. ఇరువురికి మైనారిటీ తీరాలి. వివాహం అయినా కూడా కాలేదని తెలియజేయకుండా సహజీవనం చేసేవాళ్ళు శిక్షార్హులవుతారు. సహజీవనంలో మోసం చేస్తే 498/A కేసు నమోదు చేయొచ్చని తీర్పు వచ్చింది. దీనిలో మహీళ ఎలాంటి సాక్ష్యాలు చూపించాల్సిన అవసరం లేదు 498/A గ్రుహహింస,420 చీటింగ్,493 మభ్య పెట్టడం లాంటి  కేసులు  నమోదు చేసి సహజీవనం లో మోసపోయిన మహిళ న్యాయం పొందవచ్చు. సహజీవనంలో ఉండి విడిపోయే మహిళలకు విదేశాల్లో ‘పాలీమనీ’ పేరిట భరణం ఇస్తారు. భార్య హోదాలో భరణం కూడా పొందవచ్చు.  

సుఖాలున్నా కష్టాలే ఎక్కువ  

పెళ్లయిన మహిళ ఏ కారణాల వల్లనైతే గృహహింసకు గురవుతుందో ఆ కారణాలతోనే సహజీవనంలో కూడా మహిళ కడగండ్ల పాలవుతోంది. సహజీవనుల్లో సహోద్యోగులే ఎక్కువ. కలిసి పనిచేసే చోట ఉండే ఘర్షణ ఇంటి లోకీ విస్తరిస్తోంది.  మన దేశంలో పెళ్ళి  సహజీవనానికి ఒక లైసెన్స్. కొన్నిదేశాల్లో అది ప్రత్యామ్నాయం. అక్కడ  ఏమోకానీ ఇక్కడమాత్రం  సహజీవనంలో పిల్లలు పుట్టాకే సమస్యలు మొదలవుతున్నాయి. అటు బంధువులుకాని, ఇటు చుట్టుప్రక్కల వారుకానీ సహాయ సహకారాలు అందించరు.ఆటుపోట్లను వారిద్దరే భరించాలి. అసలు గొడవలు మొదలయ్యేది అక్కడనుంచే.
సహజీవనం చేసేవారికి ఇల్లు దొరకటం చాలా కష్టం. మన సమాజం వారిని చిన్నచూపు చూస్తుంది .మతపరంగా కూడా
సహకారం లేదు.సహజీవనంలో సంతానం కలిగితే సంతానానికి అన్ని హక్కులు రావటం లేదు.సహజీవనం చేసిన మహిళ తాను మోసపోయినా ఎలాంటి న్యాయం జరుగక పోవడం, తల్లిదండ్రుల వైపునుంచి ఆదరణ,ఓదార్పు లేకపోవడంతో  మోసపోయిన కొందరు మహిళలు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. మనసుకు నచ్చిన వ్యక్తితో పేళ్ళీళ్ళూ పేరంటాలు కట్నాలు కానుకలు లాంచనాలు లేకుండా కలిసి సహజీవనం మొదలుపెట్టినప్పుడున్న సంతోషం కడదాకా మిగలటం లేదు. సహజీవనానికి ఒప్పుకున్న మహిళ అంటే  సంఘంలో చాలా  చిన్న చూపు ఉంది.అనుమానాలు అవమానాలు వేదింపులకు గురవుతున్నారు.పైగా శారీరక సంబంధాలు తీర్చుకోవటానికి మాత్రమే సహజీవనం చేస్తే అది వైవాహిక జీవితాన్ని పోలినటువంటి బంధం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అసూయ, అహంకారం , అనుమానం
సహజీవుడు వృత్తిపరమైన అసూయ కారణంగా హింసకు దిగుతాడు. సహజీవనంలో  అనుబంధానికి కట్టుబడి ఉండాలనే నియమమేదీ లేకపోవడంతో సహజీవనులిద్దరూ ఒకరిపై మరొకరు అనుమానాలు  పెంచుకుంటారు. అనుమానించిన సహజీవి డిటెక్టివ్‌ని ప్రయోగిస్తారు, ఆ విషయం తెలుసుకున్న సహజీవి అనుబంధాన్ని తెంచుకుంటారు.పెళ్లి వల్ల పురుషుడికి అపరిమిత అధికారాలు సంక్రమిస్తాయని సహజీవని అభిప్రాయం. చుట్టుపక్కల ఇళ్లలో మమ్మల్ని ఎవరూ దంపతులుగా గుర్తించకపోవడమే కాకుండా కనీసం ఎటువంటి సాయం కూడా చేయకపోయినా ఆ సమస్యలన్నీ నా సహజీవి పెట్టే చిత్రహింసల దెబ్బకు ఏ మూలకో పోయాయి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గానీ అసలు ఆ సహజీవన మార్గం ఎంచుకున్నందుకు మాత్రం  సహజీవనులెవరూ పశ్చాత్తాపం చెందడం లేదు.
 
షరతులు వర్తిస్తాయి
స్త్రీ, పురుష సహజీవనం వివాహం ద్వారా ఏర్పడాలా, మరే ఇతర పద్ధతిలోనైనా ఉండవచ్చునా అనే సమస్య ఎప్పుడూ ఉంది. ఫలానా సంబంధం మాత్రమే సరైందని నిర్ధారించడానికి వీలులేదు. భిన్న మతాలు సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్న మన సమాజంలో ఏదో ఒకటి మాత్రమే సరైనదని చెప్పడానికి లేదు.సహజీవన సంబంధాలను కూడా  ‘వివాహ స్వభావంగల సంబంధాలు’గా పరిగణించడానికి సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను సూచించింది.

1.    సహజీవనం చేస్తున్న జంట భార్యాభర్తల తరహాలో ఉంటున్నట్లుగా సమాజానికి చాటాలి.
2. వివాహం చేసుకోవటానికి అవసరమైన చట్టబద్ధమైన వయస్సు వారిద్దరికీ ఉండాలి.
3. అవివాహితులుగా ఉంటూ చట్టబద్ధంగా వివాహం చేసుకోవటానికి అర్హులై వుండాలి.
4. సహజీవనం చెయ్యటానికి స్వచ్ఛంధంగా ముందుకొచ్చి ఉండాలి. కొంతకాలంగా భార్యభర్తల్లా జీవిస్తున్నట్లుగా సమాజంలో నమ్మకం కలిగించాలి.
ఒక మహిళ ఆర్థిక భారాన్ని భరిస్తూ ఆమెను
ఎవడన్నా తన శారీరక అవసరాల కోసం వాడుకుంటున్నా, ఆమెను పనిమనిషిగా చూస్తూ చాకిరీలు చేయించుకుంటున్నా అది వైవాహిక జీవితం లాంటి సహజీవన బంధం కాదు.సహజీవనం పేరుతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మహిళలు, గృహ హింస చట్టం క్రింద ప్రయోజనాలను పొందలేరు. 

    బుద్ధి కర్మానుసారిణి అంటారు కానీ మనిషి బుద్దే చెడ్డది.చట్టాలు ఉంటేనే నేరాలూ ఘోరాలూ ఆగటంలేదు.ఇక చట్టం కూడా లేకపోతే నేరగాళ్ళకు పట్టపగ్గలుండవు.సతీ సహగమనం విలసిల్లిన స్థితినుండి వేలాది సంస్కరణల ఫలితమే నేటి సమాజం.నాగరికత మనుషులకు మరింత మంచి సమాజాన్నీ,న్యాయాన్నీఅందించాలి. మహిళపై హింస అన్యాయం పెళ్ళి చేసుకున్న భర్త ద్వారా కలిగినా,సహజీవనుడి ద్వారా కలిగినా ఒకే చట్టాన్ని ఇద్దరికీ సమానంగా అమలు చెయ్యాలనేదే కోర్టు తీర్పు.ఇది చట్టం అయితే సహజీవనికి,పుట్టే పిల్లలకు ఆస్థి హక్కు,భరణంహక్కు సంక్రమిస్తాయనే భయంతో అక్రమసంబంధాలు తగ్గే అవకాశం కూడా ఉంది.హక్కులులేని అబల జీవితం మరీ అద్వాన్నంగా ఉంటుంది.కుటుంబవ్యవస్థలో నమ్మకం,నైతికత అవసరం.సహజీవనాన్ని ఏకపక్షంగా సమర్ధించలేము. పెడదోవపట్టిన వివాహితులను కూడా స్ప్రైట్ లాంటి బహుళజాతి కంపెనీలు సమర్ధిస్థాయి.సుప్రీంకోర్టు,సహజీవన చట్టం పెళ్ళికి ముందే శృంగారాన్ని ప్రోత్సహించేలా ఉండకూడదని , సహజీవనం పరిధిలోకి అక్రమ సంబంధాలు రాకూడదని కూడా హెచ్చరించింది.ఆడపిల్లకు ఆస్థిహక్కు కల్పించిన అన్నగారికి అందుకే అంత పేరు వచ్చింది.

సూర్య 8.12.2013

 

 https://www.facebook.com/photo.php?fbid=676219635743363&set=p.676219635743363&type=1&theater