ఈ బ్లాగును సెర్చ్ చేయండి

7, నవంబర్ 2019, గురువారం

లంచం అడిగితే కొట్టండి, లంచగొండులు ప్రజాద్రోహులు


                                  లంచగొండులు ప్రజాద్రోహులు 

లంచం అడిగితే కొట్టండి. వాళ్ళు ప్రజాసేవకులు. పనిచెయ్యని అధికారుల చేతిలో వేధింపులకు గురికావద్దు అని  కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ 18.9.2019                     న దేశప్రజలకు సెలవిచ్చారు.ఇప్పుడు అది కొట్టే స్థాయి దాటి చంపే స్థాయికి వెళ్ళింది . సజీవదహనం అయిన తహసీల్దారు విజయారెడ్డి పై ఎంతమంది సానుబూతి వ్యక్తం చేశారో సజీవదహనం చేసి చనిపోయిన సురేష్ అనేరైతుఎంత బాధ పడి ఉంటాడో కదా అని రెవిన్యూ వాళ్ళ అవినీతి గురించి రైతులు పుంఖానుపుంకంగా తమ అసంతృప్తి గళాలు విప్పారు.  ఒక్క రెవిన్యూనే కాదు ప్రతి శాఖా అవినీతి మయం అయ్యిందని అందుకే కడుపుమండి భారతీయులు తయారవుతున్నారని అంటున్నారు. రెవిన్యూ సిబ్బంది లో భయం మొదలయ్యింది. కుటుంబంతో సహావచ్చి ఆత్మహత్యలు చేసుకుంటామని , విజయారెడ్డి గతే నీకూపడుతుందని కొంతమంది తహసీల్దార్లకు బెదరింపులు వచ్చాయి.ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవటమే కారణం అని చెబుతున్నారు.అడ్డంగా తాడు కడితే ఏమిటి ప్రయోజనం ? మీ అవినీతిని ఆపి ప్రజలకు పనులు చెయ్యండి అదే చాలు అంటున్నారు. సజీవదహనం తరువాత కూడా లంచాలు తీసుకోవటం ఆగలేదు.మధ్యవర్తిని పెట్టుకొని తీసుకున్నారు.అనిశావాళ్ళకు చిక్కారు.ఈ అవినీతి ఆగదు.తిరిగి తిరిగి పనికాక వేసారినవాళ్లు రాజకీయులు,అధికారుల హాహాకారాలు వినాలని ఉవ్వీళ్ళూరుతున్నారు.
ఉద్యోగస్థుడైనా సాధారణ పౌరుడైనా తనకు న్యాయబద్ధంగా రావలసిన  ప్రయోజనం రాకపోతే చాలా బాధపడతాడు.మోసానికిగురైతే మానసికంగా కుంగిపోతాడు.చెయ్యాల్సిన పనిని చెయ్యకుండా జాప్యం చేసేవారిపట్ల కోపం పెంచు కుంటాడు.కాపు కరణం నాపక్కనుంటే కొట్టరా మగడా ఎలా కొడతావో చూస్తాను?అని పూర్వం ఒక సామెత ఉండేది.ఇప్పుడు రాష్ట్రం యావత్తూ రెవిన్యూ సంఘాలు తహసీల్దార్లకు రక్షణ కల్పించాలని ఉద్యమాలకు దిగారు.డిల్లీలో రక్షకులకు రక్షణ కల్పించాలని పోలీసులు ఉద్యమించారు.ప్రజల్లో అసహనం పెరిగిపోయిందని చంద్రబాబునాయుడు వాపోయారు. రోగికి సరైన వైద్యం చెయ్యలేదని డాక్టరుని, క్లయింట్ కు సరైన న్యాయం జరుగలేదని లాయర్ల ను,తగలబెట్టుకుంటూ పోతే ఎలా?  
ప్రజలకు జవాబుదారీగా అధికార యంత్రాంగం ఉండాలి. కోట్ల రూపాయల ఖర్చుతో మొదలు పెట్టిన 'రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పథకం' ఎన్నో లొసుగులతో నీరుగారిపోయింది. ఏదో ఒక రీతిలో పట్టా పుస్తకాలు ప్రదానం చేసి చేతులు దులుపుకోవాలన్న ఆరాటమే తప్ప ఆ పుస్తకాలు వాస్తవ స్థితిని ప్రతిబింబించాలి.ముందుగా భూముల సర్వే జరిపించాలి.భూముల సర్వే జరుపకుండా ఎప్పుడో  బ్రిటిష్ వాడు తయారుచేసిన సర్వే రిపోర్టుల ఆధారంగా పాస్ పుస్తకాల పంపిణీకి పూనుకోవటం వల్ల 'రికార్డ్ ఆఫ్ రైట్స్' అనేది ఒక ప్రహసనంగా మారింది. అప్పటి భూయజమానిగా మన తాతల పేర్లు ఉంటాయి.ప్రతి సంవత్సరం ఆడంగల్ ను తాజాపరచటం గ్రామపాలనాధికారి బాధ్యత.అది జరగటంలేదు.రెవిన్యూ వాళ్ళను భూరికార్డుల నిర్వహణకే పరిమితంచేస్తే బాగుంటుంది. రిజిస్ట్రేషన్ రుసుము  10 శాతం దాకా ఉంది. భూముల మార్కెట్ రేటు పెరుగుతూనే ఉంది.ఈ ఆర్ధిక భారాన్ని భరించలేక రైతులు క్రయవిక్రయాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవటం లేదు. దస్తావేజులు రాసే వాళ్ళ దగ్గర నుంచి సబ్ రిజిస్ట్రార్ ల వరకు అంతా రైతుల నుండి డబ్బు గుంజుతున్నారు.ఎవరికివారే దస్తావేజులు రాసుకొనే పద్దతి అందుకే ప్రవేశపెట్టారు. రిజిస్ట్రేషన్ ఉచితంగా చేయాలి.  రెవెన్యూ శాఖ వద్దకు వచ్చే వాళ్లలో ఎక్కువమంది పేద రైతులు ఉంటారు.స్టాంపు డ్యూటీ కట్టలేక చాలామంది కొన్న భూములకు రిజిస్ట్రేషన్ చేసుకోరు. రిజిస్ట్రేషన్ లేకుండా రికార్డులలో పేర్లు మార్చడం కుదరదు. అది నేరం. రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పనికాదు.  
రైతులందరికీ పట్టాదారు పాసుపుస్తకాలివ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం నెరవేర లేదు. “కుక్క దొరికితే రాయి దొరకదు. రాయి దొరికితే కుక్క దొరకదు. రెండూ దొరికితే రాజు గారి కుక్క” అన్నట్లుగా సాగుతోంది. రేషన్ కార్డుల కోసం విరగబడి వచ్చి క్యూలుగట్టే రైతులు పాసుపుస్తకాలిస్తామంటే మొఖం చాటేశారు.కాని “అవ్వను పట్టుకుని వసంతమాడినట్లు” ప్రభుత్వం రెవిన్యూ అధికార్లను పట్టుకుని ప్రగతి ఏదీ, పురోగతి ఏదీ అని నిలదీస్తున్నది. పాసు పుస్తకాలిచ్చే బాధ్యత రిజిస్ట్రేషన్ శాఖకు కూడా అప్పగిస్తే పని చాలా వేగంగా జరుగుతుంది. సవాలక్ష బాధ్యతలు తలపై వేసుకున్న రెవిన్యూ శాఖకు కొన్ని  భారాలు  తొలగించాలి. ఎన్నెన్నో ఒత్తిడుల మధ్య రెవిన్యూ అధికార్లు తమ బహుముఖ విధులను నిర్వర్తిస్తున్నారు.మంత్రులు, ముఖ్యమంత్రి ఇతర వి.వి.ఐ.పి.లు పర్యటనకొస్తున్నారంటే చాలు వారి గుండె గుభేలుమంటుంది. ప్రజా సదస్సులు, అధికార సభల నిర్వహణ భారం కూడా వారి మీదే పడుతుంది. రాత్రింబవళ్ళు శ్రమించడమే కాకుండా కొన్ని ఖర్చులు జేబు నుండే పెట్టుకోవాలి. వి.ఐ.పి.ల అతిధి సత్కార్యాల ఖర్చులకు ప్రభుత్వం ఇచ్చేది నామమాత్రం. వారికి మర్యాదలో ఏ మాత్రం లోటు వచ్చినా చీవాట్లు తప్పవు. అందువల్ల ఖర్చులన్నీ స్వయంగా భరించుకుని తంటాలు పడుతున్నారు. అయినా వీరిపై ఎవరికీ సానుభూతి ఉండదు.వి.ఐ.పి.ల ఖర్చులు ఎవరు భరిస్తున్నారో దర్యాప్తు చేయాలి. పౌరసరఫరాల కోసం ప్రత్యేక శాఖ లేదు. పని అంతా రెవెన్యూ శాఖ వారే చేస్తున్నారు. ఇందువల్ల రెవెన్యూ శాఖకు పనిభారం అధికమవుతోంది. ఈ సమస్య తీరాలంటే పౌరసరఫరాల పని భారాన్ని రెవెన్యూ శాఖ నుంచి తప్పించి పౌరసరఫరాల శాఖే స్వయంగా నిర్వహించాలి. తహసీల్దారు అడిగిన లంచం కోసం కొందరు రైతులు బిక్షమెత్తిన సందర్భాలు,కిడ్నీలు అమ్ముకున్న సందర్భాలు  ఉన్నాయి. లంచం ఇస్తేనే పట్టాదారు పాస్ పుస్తకం తయారీని వీయార్వోలు మొదలుపేడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  
ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి లంచగొండులను ఎరివేయకపోతే బలహీనులకు పనులు జరగవు. కొంతమంది ఉద్యోగులు   విపరీతమైన కాలయాపన చేస్తున్నారు.కొందరు తప్పులతడకలుగా పనులు చేస్తున్నారు.ఇవన్నీ కలిసి కొండల్లా పేరుకుపోతున్నాయి. రాష్ట్రస్తాయి ఆఫీసుల్లో జిల్లాలోని పెండింగ్ సంస్యలపట్ల సమీక్షలు క్రమగా జరగాలి. .ప్రజలకు తమశాఖ ద్వారా జరగవలసిన పనులను ఏవి ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి,ఎందుకు పెండింగ్ పెట్టారు ,ఎలా వాటిని పరిష్కరించాలి అని నెల నెలా శాఖాధిపతులు,మంత్రులు సమీక్షలు జరపాలి.ప్రతి అర్జీకి రశీదుఇచ్చి దానిమీద ముద్రించిన తేదీ లోపల పని చేస్తే చాలు.అదే మహాభాగ్యం.ఎంక్వయిరీ అధికారికి ఫలానా తేదీ లోపల విచారణ పూర్తి చేయాలని ఆదేశాలలో ఉన్నా అతను ఎంక్వయిరీ సకాలంలో మొదలుపెట్టకపోతే ఎప్పటికీ పనిపూర్తవుతుంది?స్పందన కార్యక్రమం రాష్ట్రప్రధాన కార్యాలయాల్లో,సచివాలయంలో  కూడా జరపాలి.జిల్లాకార్యాలయాలలో పనులు జరగని ప్రజలు రాజధానిలో మాత్రమే  పనులు కావలసినవాళ్ళు అర్జీలు  పెట్టుకుంటారు.ఎందుకంటే కొన్ని అర్జీల పరిష్కారానికి డైరెక్టర్లు,కమీషనర్లు,శాఖాధిపతులు ఆయా దీర్ఘకాలిక పెండింగ్ కేసులపై  దృష్టి పెట్టి  మార్గదర్శనం చెయ్యాలి.పెండింగ్ సమస్యల పరిపూర్తి పై శాఖాధిపతులు నిరంతర సమీక్షలు జరపాలి. ఆలస్యానికి కారకులైన అధికారులపై జరిమానా విధించే పద్ధతి రావాలి.నీతిగా పనిచేసే అధికారులను ప్రజలు మర్యాదగా కాపాడుకుంటారు.లంచం అడిగితే అధికారికి విలువ ఉండదు.అందుకే కొంతమంది అధికారులు మాకు లంచం ఇవ్వొద్దు ప్లీజ్ అని ఫ్లెక్సీలు తగిలించుకున్నారు.
నూర్ బాషా రహంతుల్లా 
విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

1, నవంబర్ 2019, శుక్రవారం

కేంద్రపాలిత ప్రాంతాలు ఇంకా అవసరమా?



కేంద్రపాలిత ప్రాంతాలు ఇంకా అవసరమా?
ఇప్పుడు రాష్ట్రాల సంఖ్య 28,కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 9.కేంద్రపాలితప్రాంతాలు ఇదివరకు  అండమాన్ నికోబార్ దీవులు,చండీగడ్, దాద్రా నగరహవేలీ, డయ్యూ డామన్,లక్షదీవులు,డిల్లీ,పాండిచ్చేరి అని ఏడే ఉండేవి.జమ్ము-కాశ్మీర్,లడఖ్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు కలిసి తొమ్మిది అయ్యాయి.మొదట్లో దేశానికి దూరంగా ఉన్న చిన్న దీవుల్నో,రాష్ట్రాల విభజనలో తగాదాలమూలంగా ఎవరికి బదిలీ చెయ్యని ప్రాంతాన్నో ,వలసదేశాల వారసత్వం నిలపాలనే కోరికతోనో వీటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ఇన్నాళ్ళూ ఉంచారు.కేంద్రం దేశపాలన రక్షణ వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించి రాష్ట్రాల పక్కనే ఉన్న చిన్నచిన్న కేంద్ర పాలిత ప్రాంతాల పాలనా  బాధ్యతలనుండి క్రమేణా తప్పుకోవాలి.వీటిని ఆనుకొనిఉన్న రాష్ట్రాలలో కలిపేసి రాష్ట్రాలను బలపరిచాలి.
మొదటి భాషాప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర అని గొప్పలు చెప్పుకోవటమేగానీ వాస్తవానికి తెలుగు ప్రజలు అనేక రాష్ట్రాల్లోకి చీలిపోయారు.ఇప్పటికీ  తెలుగు ప్రజలు నిజంగా ఒకే పాలన క్రిందకు రాలేదు.మద్రాసులేని ఆంధ్ర తలలేని మొండెం అని పొట్టి శ్రీరాములుగారు వాపోతూ చనిపోయారు. 1952 లో తెలుగు నేతలు చుట్టుపక్కల కొన్ని తెలుగు ప్రాంతాలను వదులుకున్నారు.ఫలితంగా పొరుగు రాష్ట్రాల్లో కొన్ని తెలుగు ప్రాంతాలు కలిసిపోయాయి. ఒడిసాలో  గంజాం,బరంపురం,కోరాపుట్,రాయగడ,పర్లాకిమిడి, కర్నాటకలో  చిత్రదుర్గ,కోలార్,బళ్ళారి, మహారాష్ట్రలో  చంద్రపూర్,గచ్చిబోల్ , చత్తీస్ ఘడ్ లో బీజాపూర్,బస్తర్,దంతెవాడ, తమిళనాడు లో మద్రాసు,హోసూరు,దేవనపల్లి, కృష్ణగిరి,డెంకణికోట, పాండిచేరి లో యానాం కలిసిపోయాయి. ఆనాడు మన తెలుగునాయకులే వీటిని వదిలేశారు.1956 లో తెలంగాణాతో కలిసిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు కానీ 2014 లో తెలంగాణా చీలిపోయినప్పుడు  కానీ  ఈ ప్రాంతాల విలీనం కోసం ఎవరూ ప్రయత్నించలేదు.పైగా తెలంగాణా ఏర్పాటు సందర్భంలో కొందరు తమిళనాయకులు తిరుపతి,శ్రీకాళహస్తి,నగరి,చిత్తూరు,సత్యవేడు,ప్రాంతాలను తమిళనాడులో కలపాలని పుండుమీద కారంచల్లినట్లు ఉద్యమాలు చేపట్టారు. అయితే ఇవన్నీ జరిగినా ఆనాడు తమిళనాడులో కలిపిన మద్రాసు,హోసూరు,దేవనపల్లి, కృష్ణగిరి,డెంకణికోట.పాండిచేరిలో కలిపిన  యానాం లను ఆంధ్రాలో  కలపాలి అని తెలుగునాయకులు ఎవరూ ఎదురు ప్రశ్నించలేదు.ఇప్పటికీ పొరుగు రాష్ట్రాల్లో కలిసిపోయిన తెలుగు ప్రాంతాలకోసం మనవాళ్ళెవరూ అడగటంలేదు.ఇక అడగలేరేమో.ఆనాడు 60 శాతం తెలుగు ప్రజలున్న మద్రాసును కలుపుకున్నారు. ఇంకా పుదుచ్చేరి తమిళులకు యానాం కూడా కావాలా?యానాం ప్రజలకే పుదుచ్చేరి కావాలా?ఎందుకో?
మనకు కాకినాడ పక్కన యానాం అనే కేంద్రపాలితప్రాంతం ఉంది.పక్కనే చుట్టూతా ఆంధ్ర  రాష్ట్రమున్నా  ఇది ఒక స్వతంత్ర దీవి లాగా మన రాష్ట్రంతో  సంబంధం లేనట్లు ఉంటున్నది.యానాంను కలిపితేనే మన రాష్ట్రానికి  ఓ సమగ్ర భౌగోళిక రూపం ఏర్పడుతుంది.కాకినాడ దగ్గర 32 చ.కి.మీ. విస్తీర్ణం,55 వేల జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం. యానాంకు రాజధాని పాండిచ్చేరి తమిళనాడులో 870 కి.మీ. దూరంలో ఉంది. యానాం  ఫ్రెంచ్ కాలనీగా  1954 లో విమోచనం చెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని గ్రేటర్ కాకినాడలో కలపాలని తీర్మానం చేసింది. కానీ అప్పటి యానాం నాయకులు పాండిచేరీతోనే కలిసి ఉంటామన్నారు.తెలుగురాష్ట్రంలో యానాన్ని కలపకపోటానికి వేరే కారణం ఏమీ లేదు. యానాం ను మన రాష్ట్రంలో కలపటానికి అక్కడి ప్రజలు ఇప్పటికీ ఇష్టపడటం లేదు. జై ఆంధ్రా,తెలంగాణా ఉద్యమాల  సమయంలో కూడా సమైక్యవాదులు కూడా వీళ్ళను ఒప్పించలేకపోయారు. విచిత్రంగా యానామీయులు సమైక్యాంధ్రకు మద్దతుగా ఎందుకోగానీ ఒక రోజు యానాంలో బందు పాటించారు.  యానాం ప్రజల భాష తెలుగే.వారిది తెలుగు సంస్కృతే.వారి చదువు,వ్యాపారం,వివాహసంబంధాలు అవసరాలు అన్నిటికీ  ఆంధ్ర పైనే ఆధారపడి ఉంటారు.పొద్దున లేస్తే కాకినాడ రావాలి. పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది. ఇన్ని దశాబ్దాల తరువాతకూడా యానాం ప్రజలు ఆంధ్రలో కలవటానికి, గ్రేటర్ కాకినాడలో విలీనానికీ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. యానాం అధికార కేంద్రం పుదుచ్ఛేరిలో ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయాలన్నీ పుదుచ్చేరిలోనే జరుగుతాయి. అధికారుల బదలీల్నుంచి అభివృద్ది, సంక్షేమ పథకాల అమలు వరకు అక్కడి ఆదేశాలకనుగుణంగానే యానాంలో అమలౌతాయి. యానాం ప్రజలు చిన్న బెయిల్‌ కావాలన్నా పుదుచ్ఛేరిలోకి పరుగులుదీయాల్సిందే. భాషాపాలిత  రాష్ట్రం అనే నినాదాన్నీ వినరు. పక్కనే ఉన్న కాకినాడలో కలవకుండా ఎక్కడో దూరాన ఉన్న పాండిచేరి పాలనలోనే ఉంటామంటారు. భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళనాడులో ఉన్న  పుదుచ్చేరి నుండి విడదీసి ఆంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుంది. ఆంధ్రాలో కలుస్తారా అంటే  లేదు అంటున్నారు. యానాంను ఆంధ్రలో కలవటానికి ఇష్టపడతం లేదు.ఎందుకో తెలుసా? కేంద్రపాలిత ప్రాంతంలకు ఇచ్చే  పన్ను రాయితీల కోసం.అక్కడ రేట్లు తక్కువగా ఉంటాయి. కేంద్ర పాలిత ప్రాంతాలు విస్తీర్ణంలో జనాభాలో చిన్నవి కాబట్టి  కేంద్రం ఇచ్చే నిధులు సరిపోతాయి. అక్కడి జనానికి ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. ట్యాక్సులు లేకుండా కొన్ని సరుకులు, మద్యం చవకగా దొరుకుతుంది.చాలామంది మద్యాన్ని మిగతా దేశానికి సరఫరా చేసే వ్యాపారులుగా స్థిరపడ్డారు.మధ్యలో యానాం ఉండగా రాష్ట్రంలో మద్యనియంత్రణ  చాలా కష్టం. ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు అడ్డుపడే దయ్యాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ గా కేంద్రం నియమించిందని పుదుచ్చేరి ముఖ్యమంత్రి బావురుమంటున్నాడు.
యానాం పాలన పూర్వం తూర్పు పాకిస్తాన్ లాగా  పుదుచ్చేరి నుండి జరుగుతుంది. అది బంగ్లాదేశ్ విముక్తి చెందినట్లు పాండిచ్చేరి నుండి విముక్తి పొందాలి.ఆంధ్రలో కలవాలి. 370 అధికరణం రద్దుతో కాశ్మీర్ లో ఉగ్రవాదం తగ్గిందట.అలాగే మిగతా కేంద్రపాలిత ప్రాంతాలకూ  ఈ ప్రత్యేక అధికారణాలు రద్దుచేసి,పక్కరాష్ట్రాలలో కలిపేస్తే  స్థానికంగా ఉన్న  రకరకాల మాఫియాలు,ముఠాలు తగ్గుతాయి.పక్కరాష్ట్రాలలో కలిపితే రాష్ట్రాల అధికారపరిధి పెరుగుతుంది.కొన్ని సరిహద్దు ప్రాంత  సమస్యలు తగ్గుతాయి.ముఖ్యమంత్రి జగన్‌ యానాంను ఆంధ్రలో కలపమని కేంద్రాన్ని కోరారట.యానాం ఒక్కటే కాదు కేంద్రపాలితప్రాంతాలన్నిటినీ రద్దుచేసి చుట్టుపక్కల రాష్ట్రాలలో కలపాలి.
---నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్, 6301493266

24, అక్టోబర్ 2019, గురువారం

ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే నో జాబ్‌!

ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే నో జాబ్‌!
(సూర్య 27.10.2019 లో నా సంపాదకీయం)
2021 నుండి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మందిని కంటే ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదని అస్సాం సర్కార్‌ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.ఉద్యోగం వచ్చాక మూడో బిడ్డను కంటే ఉద్యోగం ఊడబీకుతారట.ఎక్కువమంది పిల్లల్ని కన్నవారికి గృహ ,వాహన రుణాలు ప్రభుత్వ సహాయపథకాలు ఏమీ అందవట.స్థానిక సంస్థల్లో ఎన్నికలలో పాల్గొనే అవకాశం ఉండదట.ఇవేమి రూల్సు?ఎవరి పిల్లలు వాళ్ళ ఇష్టం అనేవాళ్ళకు చిన్నకుటుంబమే చింతలులేని కుటుంబం అని చెబుతున్నారట.
కానీ మరోపక్క మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి నేతలు ఒకరిద్దరితో ఆపొద్దు, ఉద్యోగాలిస్తాం ఎక్కువమంది పిల్లల్ని కనండి.జనాభాను పెంచండి అని పదేపదే చెప్పారు,చెబుతున్నారు.ప్రతి హిందూ జంట పదిమందిని కనాలి,పిల్లలను భగవంతుడే కాపాడుకుంటాడని శంకరాచార్య స్వామి,వాసుదేవానంద,సాక్షిమహారాజ్,పరిపూర్ణానంద,….   లాంటి స్వామీజీలు అదేపనిగా దేశమ్మీదపడి పిల్లలు కనే పోటీలుపెడుతున్నారు. పీజీలు చదివినా ఉపాధి లేదని మన యువకులు బాధపడుతున్నారు.ప్రస్తుతం దేశంలోని నిరుద్యోగ యువకులను ఉద్ధరించండి చాలు.ముందు మీరు సన్యాసం వదిలి పిల్లల్ని కంటారా అని కొందరు స్వామిజీలను అడుగుతున్నారు.ఎంత మంది పిల్లలను కనాలి అనేది కనేవాళ్ల ఆర్ధిక పరిస్థితిని బట్టి ఉంటుంది. చైనాలో ఇప్పుడు రెండో బిడ్డను కనమని ప్రోత్సహించినా వద్దులే అంటున్నారట.
“అరయన్ వంశము నిల్పనే కద వివాహంబు?" అన్నారు.అంతా బాగుంటే ఎక్కువ మంది పిల్లలు కావాలనే తల్లిదండ్రులు కోరుకుంటారు.తమ వంశం బాగా విస్థరిస్తోందని ఉబ్బితబ్బిబ్బులౌతారు.కానీ వర్ధమాన దేశాల్లో వాస్తవ జీవితం సుఖప్రధంగా లేదు.దోపిడీ,అన్యాయం, అవినీతి,కులమత వివక్షల మూలంగా అందరికీ సమాన అవకాశాలు లేక అభివృద్ధి చెందలేక పేదప్రజలు బాధలు పడుతున్నారు.మంది ఎక్కువైతే మజ్జిగ పలచన.ఇది పోటీ ప్రపంచం.వెనకబడితే వెనకే.ఆస్తిపాస్తుల కోసం అన్నదమ్ములు,అక్కచెల్లెళ్ళు ,తండ్రీ బిడ్డలు కూడా గొంతులు కోసుకుంటున్నారు.మానవ నైజం ఆదినుండీ ఇలాగే ఉంది.విశాలమైన భూమి మీద ఇద్దరే అన్నదమ్ములున్ననాడు కూడా కయీను హేబేలును చంపాడు.పేదరికం అనేక పాపాలకు పురికొలిపే ప్రధాన కారణం.మానవతా విలువలు అసలే లేని లోకంలో పిల్లల్ని అతిగా కని మనం అవస్థలు పడుతూ వారినీ అవస్థలలో తోసే దానికంటే మన ఆర్ధిక స్థితిని అంచనా వేసుకొని పరిమితం కావటం మంచిది. నారుపోసినవాడే నీరు పోస్తాడంటూ,మహత్యాలు చెయ్యాల్సిందేనని దేవుడిని పరీక్షకు గురిచెయ్యొద్దు.పెళ్ళి చేసుకునే వాడికి భార్యను పోషించే ఆర్ధిక శక్తి ఉండాలని ముహమ్మదు ప్రవక్త షరతు పెట్టారు.మరి బిడ్డల్ని కనటానికి మరిన్ని షరతులుండవా?

పిల్లలు అవసరమే.మతాలన్నీకుటుంబ నియంత్రణ ఆపరేషన్ పాపమనీ,అందరూ పిల్లల్ని కని భూమిని నింపాలనే చెబుతాయి.చాలావరకు ప్రజలు పాటిస్తున్నారు కూడా.అయితే నాగరికత పెరిగేకొద్దీ మతాల బోధను పక్కనబెట్టి ఎంతమందిని కనొచ్చు అనేది వారి వారి కుటుంబ ఆర్ధిక స్థోమతను బట్టి ఎవరికి వారే నిర్ణయించుకుంటున్నారు.పిల్లల్నిబాలకార్మికులుగా చేయాలని ఏ తల్లిదండ్రులూ కనరు.వారి భవిషత్తుగురించి ఎన్నోకలలు కంటారు.వారి కలల్ని కల్లలుగా చేసే వ్యవస్థ వేళ్ళూనుకు పోతే 'ఎదురీత బ్రతుకు' ఎవరు ఎంచుకుంటారు?పిల్లల్ని కొల్లగా కనాలని బోధించేవారు కనటం ఆపేసిన వారు ఎందుకంత కఠిన నిర్ణయానికి వస్తున్నారో గ్రహించాలి. పిల్లలకు విద్యాహక్కు,ఆహార హక్కు,పని హక్కులున్న దేశంలో నిర్భయంగా పిల్లల్ని కంటారు. 2011 జనాభాలెక్కల ప్రకారం  హిందూ జనాభా వృద్ధి రేటు 16.8 శాతంగా నమోదైతే, ముస్లిం జనాభా వృద్ధి రేటు 24.6 శాతంగా నమోదైంది. కుటుంబనియంత్రణ పాటించనందువల్ల ముస్లిముల జనాభా పెరిగిపోతున్నదని హిందూ నేతలు,ఎంతపెరిగినా మీ అంత జనాభా మాకు లేదులే అని ముస్లిం నేతలు వాపోతూ ఎవరి మతస్తులకు వాళ్ళు పిల్లల్ని కనటంలో పోటిలు పెడుతున్నారు.పైగా నారుపోసినవాడే నీరుపోస్తాడు అని,అవతలి మతం వాడికంటే మనదే పైచేయిగా ఉండాలంటే ఆ మాత్రం త్యాగం తప్పదని ఓదారుస్తున్నారు.ఇలాంటివాళ్ళ మాటలు విని అమాయకజనం శక్తికి మించి పిల్లల్ని కని నిరుపేదలైపోతున్నారు.అందువలన ఒకరు ఇద్దరు బిడ్డలతో ఆపరేషన్ చేయించుకోటానికి ముందుకొచ్చిన ముస్లింలకు హిందూ సంస్థలు,హిందువులకు ముస్లిం సంస్థలు పదివేల రూపాయల ఆర్ధిక సహాయం అందజేస్తే ఈ ముల్లాలు,స్వామీజీల మాటలు లెక్కచేయకుండా అన్ని మతాలలోని పేదలు ఆపరేషన్లకు బారులు తీరి నిలబడతారు.దేశంలో అధికజనాభా సమశ్య కూడా కొద్దిగా తగ్గుతుంది.ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టగలిగితే వారిదే విజయం,పుణ్యం. పుణ్యం ఎలాగంటే మనిషి కష్టాలన్నిటికీ పుట్టుకే గదా కారణం?అసలు ఎన్నో కష్టాలకు కారణ భూతమైన ఆజన్మే కలుగకుండా ఎంతోమందికి స్వచ్చంద ఆపరేషన్లనే శాంతియుత కార్యక్రమం ద్వారా ముక్తిని మోక్షాన్నిఅనగా జన్మరాహిత్యాన్ని ప్రసాదించే పుణ్యాత్ములకు కూడా పునర్జన్మ ఉండదు.మోక్షసిద్ధి ఖాయం.
నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత డిప్యూటీ కలక్టర్,6301493266