ఈ బ్లాగును సెర్చ్ చేయండి

19, ఫిబ్రవరి 2020, బుధవారం

శాంతికోసం పాలస్తీనా, కుర్దిస్థాన్ దేశాలు ఏర్పడాలి

ఆదేశాల ఏర్పాటుతో శాంతి (సూర్య 23.2.2020)

శాంతికోసం పాలస్తీనా, కుర్దిస్థాన్ దేశాలు ఏర్పడాలి
పాలస్తీనా-ఇజ్రాయిల్‌ మధ్య మంటలు దశాబ్దాలుగా ఆరని కారుచిచ్చులా రగులుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇశ్రాయెల్ , పాలస్తీనా రెండింటిని 'స్వతంత్ర రాజ్యాలు'గా గుర్తించానన్నాడు. అతని దృష్టి మొత్తం ఇజ్రాయిల్‌ పక్షమే. 2017లో ఇజ్రాయిల్‌ జెరూసలేం లో తన రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది . ట్రంప్ రెండు స్వతంత్ర రాజ్యాల ప్రతిపాదన ప్రకారం పాలస్తీనియన్లు తమ భూభాగాలను ఇంకా వదులుకోవాలి. వెస్ట్‌ బ్యాంకు లోని యూదుల సెటిల్‌మెంట్లతో పాటు జోర్డాన్‌ లోయను కూడా ఇజ్రాయిల్‌కు పాలస్తీనా వదులుకోవాల్సి వస్తుంది. తూర్పు జెరూసలేం పాలస్తీనియన్ల రాజధాని అవుతుందట. మిగతా జెరూసలేం ఇజ్రాయిల్‌కు రాజధాని కావాలట . ఇజ్రాయిలీలకు జెరూసలేం ఎంత పవిత్రమైనదో.పాలస్తీనీయన్లకూ అంతే పవిత్రమైనది. ఇది ఇరువురికీ అత్యంత ముఖ్యమైన ప్రాంతం. అలాంటి పవిత్రస్థలంపై మీకు హక్కు లేదంటే ఎలా?
గాజాను విస్తరించటానికి ఇజ్రాయిల్‌లో ఉన్న అరబ్‌ పట్టణాలతో వెస్ట్‌బ్యాంకు లోని ప్రాంతాలను మార్పిడి చేసుకొనే ప్రతిపాదన వల్ల 30 శాతం వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతాన్ని పాలస్తీనా కోల్పోతుంది. పాలస్తీనా స్వతంత్ర పోరాటంలో వివిధ దేశాలకు తలదాచుకునేందుకు వెళ్లిన పాలస్తీనియన్లు తిరిగి తమ సొంత గడ్డపై అడుగు పెట్టేందుకు వీల్లేదట. శరణార్థులు ఎవ్వరైనా తమ సొంత స్థలాలకు వెళ్లడం అంతర్జాతీయంగా ఆమోదయోగ్యమైన హక్కు. ఇజ్రాయిల్‌ చేతిలో హత్యకు గురైన బాధిత కుటుంబాలకు సాయం చేయరాదట. ఇజ్రాయిల్‌ జైళ్లలో బందీలుగా ఉన్న పాలస్తీనియన్లపై అమానుష చర్యలను అంతర్జాతీయ వేదికలపై నిలదీయరాదట. స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవించ వచ్చుననే ఆకాంక్షతో ఒకవేళ ట్రంప్‌ ప్రతిపాదనలన్నిటిని పాలస్తీనా అంగీకరిస్తే ఇప్పుడున్న స్వేచ్ఛ, స్వతంత్రత కూడా అది కోల్పోవడం ఖాయం. చుట్టూతా ఉన్న ప్రాంతాలన్నీ ఇజ్రాయిల్‌ ఖాతా లోకి వెళ్లడం వల్ల కుచించుకుపోయిన వెస్ట్‌బ్యాంకుతో పాలస్తీనా ఇజ్రాయిల్‌ చేతిలో ఒక బందీ లాగా బతుకు వెళ్లదీయాల్సిందే. ఆ కొంచం కూడ కబళించెస్తే ,పాలస్తీనా అనే దేశమే ఉండదు . చిన్నప్పుడు మూడవతరగతిలో బలిచక్రవర్తిని భూమిలోకి తోక్కెసిన వామనావతారం,ముందు ముడ్డి పెట్టుకోటానికి చోటు అడిగి చివరికి అరేబియావానిని బయటికి నెట్టేసి పూర్తిగా గుడారాన్ని ఆక్రమించిన ఒ౦టె కధ చెప్పేవారు. అలాగే దేవుడు తమజాతికి ఏనాడో చేసిన వాగ్దాన భూమి అంటూ ఇస్రాయెల్ దేశం అమెరికా వత్తాసుతో పాలస్తీనాను క్రమంగా ఆక్రమిచింది. ఐరాస ఏమీ చేయలేక ఊరుకుంది.చుట్టూ ఉన్న అరబ్ దేశాలు తమ తమ అంతర్గత యుద్ధాలలో మునిగితేలుతూ పాలస్తీనాకు ఏమీ చేయలేదు.1946 లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటినుండి పాలస్తీనా ఎలా చిక్కిశల్యమైపోయిందో చూడండి:
 
ఇప్పుడు అక్కడి దేశం వాస్తవానికి ఇజ్రాయెలే. ఎక్కడెక్కడో చెదిరిపోయిన యూదులు ఇశ్రాయెల్ వచ్చి దేశాన్ని ఏర్పాటుచేసుకోగా అక్కడ ఉన్న పాలస్తీనీయులు పలుదేశాల్లో చెల్లాచెదురు అయ్యారు. మిగిలిన అవశేష పాలస్తీనా అయినా ఈనాటికీ స్వతంత్ర రాజ్యం కాలేదు. చిత్రమేమంటే ప్రపంచంలో ఇజ్రాయెల్‌ ఒక్కటే కుర్దుల రిఫరెండాన్ని సమర్ధించింది. కుర్దులు , పాలస్తీనీయులు తమ భూభాగాలలోనే శరణార్ధుల్లాగా బ్రతుకుతున్నారు. ఇరాక్, ఇరాన్, టర్కీ, సిరియాలు కుర్డుల భూభాగాలను కలిపేసుకున్నాయి. కుర్దులు,పాలస్తీనీయులు తీవ్ర అణచివేతనూ, వేధింపులనూ ఎదుర్కొంటున్నారు. స్వతంత్ర పాలస్తీనా, స్వతంత్ర కుర్దిస్తాన్‌ ఏర్పాటు అమెరికాకు ఇష్టం లేదు.జాతుల స్వయంప్రతిపత్తిని గౌరవిస్తేనే ప్రశాంతత ఏర్పడుతుంది.ఐక్యరాజ్యసమితి వాయిదాలతో పొద్దుపుచ్చకూడదు. చరిత్ర పొడవునా రణరంగం యుద్ధాలేనా? యుద్ధాల వల్ల ఏమి సాధించాము ? ఒక మనిషిపై మరో మనిషి అధికారం, ఒక జాతిపై మరొకజాతి ఆధిపత్యం ఇంకా చెల్లాలా? ఏ యుద్ధమూ మానవజాతి మనుగడకోసం కాదు.యుద్ధాలలో జరిగేది నరబలి,మానవ హననమే. అశోకుడు యుద్ధంలో జరిగిన మారణ కాండను, రక్తపాతాన్ని చూసి శాంతి మార్గంలోకి మారాడట. ఆర్య ద్రవిడుల యుద్ధాల వల్ల ఫలితం ఏమీలేదు. అమెరికన్లు నీగ్రోలపై శ్వేతజాతి ఆధిపత్యాన్ని చూపారు. జాత్యహంకారంతో హిట్లర్ నియంతగా మారి లక్షలాది మందిని చంపించాడు. రష్యా, చైనాల్లో జరిగిన సాయుధ విప్లవాల్లో ఎంతో జన నష్టం జరిగింది. ప్రపంచాన్ని ఆయుధాలతో నింపుతూనే ఉన్నా రు. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ సామ్రాజ్యవాద,ఆధిపత్య ధోరణినే చూపిస్తున్నారు.ప్రాణ నష్టంతో పాటు,వేలఏళ్లు శ్రామికులు కష్టపడి నిర్మించిన నాగరికత కూడా ఎందుకు నాశనమై పోవాలి? ఎవరికి ప్రయోజనం?ఎప్పుడూ తుపాకులతో కొట్టుకు చచ్చే వీళ్ళకు దేశాలెందుకు అనిపించవచ్చు. యుద్ధం ఆటవికం, శాంతి ప్రజాస్వామికం. శాంతి సామరస్యాలు ప్రజాస్వామ్య మూలగుణాలు.అందరినీ సుఖంగా బ్రతకనివ్వటమే నాగరికత . భూతాపం(గ్లోబల్ వార్మింగ్‌ ) తో భూగోళంపై మాన వ జాతి ఇంకో 200 ఏళ్ళు మాత్రమే ఉంటుందని శాస్త్రజ్నులు చెప్పారు.మన దేశాల అధిపతులు ఇది గుర్తెరిగి, శాంతిదూతలు, మానవతా మూర్తులు కావాలి.ప్రపంచ దేశాలలో యుద్ధ తాపాలను తగ్గించటం కూడా ఐరాస బాధ్యతల్లో ఒకటి.
 నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266



13, ఫిబ్రవరి 2020, గురువారం

రాజధానికి సరైన కేంద్రాలు రైల్వే జంక్షన్లే!

రాజధానికి సరైన కేంద్రాలు రైల్వే జంక్షన్లే! (సూర్య 16.2.2020)
రైల్వే జంక్షన్లే రాజధానికి సరైన కేంద్రాలు. చరిత్రలో వీటిని ప్రజల కోర్కెలతో, ప్రజల అవసరాలకు తగ్గట్లు, కాలానుగుణంగా ప్రభుత్వాలే ఏర్పాటు చేశాయి.ఇప్పుడున్న రైల్వే జంక్షన్ స్టేషన్లు ఆంధ్రలో 10 : విజయవాడ, తాడేపల్లి(కృష్ణా కెనాల్) , గుంటూరు,తెనాలి,భీమవరం,గుడివాడ, నిడదవోలు, సామర్లకోట, గూడూరు, నడికుడి. రాయలసీమలో 7: ధర్మవరం, ధోన్, గుత్తి,గుంతకల్లు ,పాకాల,పెనుకొండ, రేణిగుంట. మన సమాజ పురోగతి రైలుమార్గాలవల్లనే ఎక్కువగా జరిగింది.గతంలో ఊరికి రైలు ఉంటేనే కొంతమంది పిల్లనిస్తామనేవారట. సామాన్యప్రజలు కూడా తమప్రయాణాలకు రైలునే మొదట ఎంచుకుంటారు.చాలావరకు మన ప్రయాణ అవసరాలు తీర్చింది,తీరుస్తున్నది రైళ్లే కదా?విమానాలలో అందరూ వెళ్లలేరు.పుట్టపర్తిలో కూడా విమానాశ్రయం ఉంది.పూర్వం రాష్ట్రపెద్దలు తాడేపల్లిగూడెం,దొనకొండ లలోకూడా విమానాశ్రయాలకు ప్లాన్ చేశారు. ఇక గతుకుల రోడ్లపై బస్సులలో కుదుపులు.పదిమందీ కోరేది రైలునే. బెజవాడ (విజయవాడ) నేటికీ జిల్లా కేంద్రం కూడా కాలేదు.విజయవాడ సహజ సంపద రైల్వే జంక్షను కావటమే. రాష్ట్రానికి మూడు రైలు మార్గాల మధ్యస్థానం కాబట్టే విజయవాడను రాష్ట్ర రాజధానిగా చేసుకుందామని ప్రయత్నిస్తున్నారు.రైల్వే జంక్షన్లన్నీ సహజంగానే భవిష్యత్తులో అభివృద్ధి చెందే కేంద్రాలు.వాస్తవానికి అమరావతి అంటే విజయవాడే. గుంటూరు ,తెనాలి,విజయవాడ మూడూ రైల్వే జంక్షన్లే కాబట్టి అన్నీ వైపులనుండీ ప్రజలు ప్రయాణీకులు సులభంగా చౌకగా రాకపోకలు సాగిస్తారు.విజయవాడ ఎప్పుడో జిల్లా కేంద్రం కావలసింది.ఇప్పటికైనా అవబోతోంది సంతోషం.
బ్రిటీషు వాడు తనదేశానికి మన సంపదను తరలించుకుపోవటానికి అనుకూలంగా ఓడరేవులను రాజధానులుగా ఎన్నుకున్నాడని కొందరు చెబుతారు.ఇప్పుడు మనరాష్ట్రం భౌగోళిక స్వరూపాన్నిబట్టి మనం ఆలోచించుకోవాలి.రాజధానిని అన్నీ ప్రాంతాలవాళ్ళూ కోరుకుంటారు.వద్దని ఎవరూ అనరు. అయితే మధ్యస్థానానికి సెంటర్ అని ప్రత్యేకత సహజంగానే వస్తుంది.రాజధానిని అంచుల్లో పెట్టి కూడా అభివృద్ధి చేయవచ్చు,కానీ ప్రజలకు ఆ అంచులో దూరం భారమవుతుంది.ఒకరినొకరు దోచుకున్నారని అసూయలు పడటం కంటే కొత్త రైలు లైన్లు వేయించి జంక్షన్లు సాధించండి.కేంద్రస్థానం మధ్యలో ఉంటే నలువైపులవారికీ సమదూరంలో ఉంటుంది.పార్లమెంటు స్థానాలన్నీ జిల్లాలుగా చేస్తామనే హామీకి భిన్నంగా గురజాల పేరు వినబడగానే నరసరావుపేట వారిలో కలవరం మొదలయ్యింది.బాపట్ల జిల్లా కేంద్రం అయితే మాకు దూరం పెరుగుతుందని సంతనూతలపాడు వాళ్ళు గోలచేశారు.రాజమండ్రి జిల్లాలో కలపమని కొవ్వూరు వాళ్ళు,విజయవాడ జిల్లాలో కలపమని తాడేపల్లి వాళ్లు అడుగుతున్నారు. పార్లమెంటు నియోజకవర్గాలయినా సరే ప్రజలు దూరం పెరిగితే మొరపెడతారు.పాత తాలూకాలను చీల్చి మండలాలను ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ను నేటికీ గుర్తుంచుకొంటున్నారు జనం. రహదారి సౌకర్యం లేనిచోట్ల కూడా రాజకీయ పలుకుబడితో కొన్ని మండలాల కేంద్రాలను ఏర్పాటుచేస్తే ఇప్పటికీ జనం తిట్టిపోస్తున్నారు.అందువలన నలువైపులనుండి ప్రజల రాకపోకలకు రైలు,రహదారి సౌకర్యాలు ఉండటమే మండల కేంద్రాలకు గానీ ,రాజధానినగరానికి గానీ పెద్ద సంపద.వాటిని నిర్ణయించే ముందు పెద్దలుఇలా శాస్త్రీయంగా ప్రజల రోడ్డు రవాణా సౌకర్యాల గురించి ఆలోచించాలి.పూర్వం తెనాలి పక్కన చుండూరు కూడా జంక్షన్ గా ఉండేది.బ్రిటీష్ వాళ్ళు రైలుమార్గాలు తమకు అవసరమనుకున్న ప్రతిచోట్లకూ వేసుకున్నారు.ఆతరువాత రైలుమార్గం రావటం అంటే గొప్ప వారం దొరికినట్లే. నడికుడి-శ్రీకాళహస్తి రైలుమార్గం కోసం కొన్నితరాల జనం ఎదురుచూసి చనిపోయారు.కోనసీమకు నేటికీ రైలులేదు.తిరుమల వెంకటేశ్వరుని దేవాలయం జమ్మూలో కూడా కడతారట.దానివలన తిరుపతి గౌరవం తగ్గుతుందా?జమ్మూ ప్రజలకు ప్రయాణం కొంత తగ్గుతుంది.బ్రాంచీలు పెరగటం ఆయా ప్రాంతాల సౌకర్యాలు పెంచటానికే.
తెలంగాణాలో ప్రజలకు అవసరమైన పాలనామార్పులు చాలా సమయానుకూలంగా చకచకా జరిగాయి.కొత్తగా 23 జిల్లాలు ఏర్పడ్డాయి.ఇప్పుడు మొత్తం 33 జిల్లాలున్నాయి.పార్లమెంటు సభ్యులకంటే ఐ ఏ యస్ కలక్టర్లే ఎక్కువ ఉన్న రాష్ట్రం అది.చిన్నజిల్లాలతో గ్రామీణ ప్రజలకు దూరం భారం తగ్గాయి. జిల్లాలు పెరగటం వల్ల సబ్ కలక్టర్లు ,ఆర్డీవోలు ఉండే డివిజన్లు ,మండలాలు,గ్రామ పంచాయతీలు పెరిగాయి. దగ్గరలో పనులు జరగటం వల్ల ప్రజలలో సంతృప్తి స్థాయి పెరుగుతుంది..జిల్లా రెవిన్యూ అధికారుల వ్యవస్థను రద్దుచేసి వారి స్థానంలో అడిషనల్ కలక్టర్లను నియమించి పంచాయతీ రెవిన్యూ విధులను అందరికీ పంచటం జరిగింది.కొత్త రెవిన్యూ ,పంచాయతీ,మున్సిపల్ చట్టాలను ప్రవేశపెట్టే ప్రయత్నం జరుగుతోంది.సిరిసిల్ల,గజ్వేలు లలో రైలు కూత కూపిద్దామని శపధాలు చేస్తున్నారు.
ఉగాదినాటికి రాష్ట్రంలోని నిరాశ్రయులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంచాలని నవరత్నాలలో భాగంగా జగన్ ప్రభుత్వం తలపెట్టింది. 13 జిల్లాల్లో ఉగాది రోజునే మహిళల పేరుతో స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేసి పట్టాలు పంపిణీ వేగంగా చేసేందుకు తహసీల్దార్లనే జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్లుగా నియమించారు .ఈ ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ఫీజు, స్టాంప్‌ డ్యూటీ, యూజర్‌ చార్జీల చెల్లింపు నుంచి లబ్ధిదారులకు మినహాయింపునిచ్చింది.అవసరాన్నిబట్టి రెవిన్యూ వాళ్ళకు రిజిస్ట్రేషన్ బాధ్యతలు ఇచ్చారు.పనులు త్వరగా జరగాలి అంటే పనివిభజన బాధ్యతల విభజన తప్పదు.జిల్లాలవిభజనకూడా పూర్తయితే ఇంకా బాగుండేది.కొత్తగా కొన్ని జిల్లాలు వచ్చేవి.
ఆంధ్రలో కూడా తెలంగాణాను మించి కొత్తజిల్లాలు ఏర్పాటుఅవుతాయనే ఆశలో ప్రజలు ఉన్నారు . గ్రామసచివాలయాలతో గ్రామ స్థాయి ఉద్యోగులు అందుబాటులోకి వచ్చారు. అర్జీల స్పందన ఊపు అందుకోంది.అమరావతి నుండి రాజధానిని ఏ క్షణమైనా విశాఖకు తరలిస్తామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.60 రోజులనుండి అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని ధర్నాలు చేస్తున్న రైతులకు ఇది బాధాకరంగా ఉంది. ఈ గొడవల్లో కొత్త జిల్లాల ఏర్పాటు గానీ ,జోనల్ కార్యాలయాల ఏర్పాటుగానీ ప్రజలు మరచిపోయారు.కానీ అసలు సమస్యకు ఈ రెండూ చాలా వరకు పరిష్కారం చూపుతాయి. జోనల్ కార్యాలయాలతో సచివాలయ స్థాయి సేవలు కూడా అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తాయి. ఈనాటి మండల, డివిజను కేంద్రాలే రేపటి జిల్లా కేంద్రాలు అవుతాయి. నవరత్నాలు ప్రజారంజకంగా ఉన్నాయి,ఆపధకాలన్నీ దీర్ఘకాలంలో మేలుచేసేవే.అయితే పంటిలోనిరాయిలా ఈ రాజధాని తరలింపు సమస్యగా మారింది. ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోడీ దగ్గర మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చినట్లు వార్తలొచ్చాయి.ఇప్పటికే లక్షలజనాభాతో పెద్దదయిన తీర నగరాన్ని మరింత జనాభారాన్ని మోపటం అనవసరం.ఎంతపెద్దనగరమైనా అది రైలు జంక్షను కాదు.ఒక అంచులో ఉంది. రాజధానుల అభివృద్ధికి దూరదృష్టి ఉండాలి. ఉత్తరాంధ్ర రాజధాని కోసం శ్రీకాకుళం – విజయనగరం మధ్యస్థానం , రాయలసీమ రాజధాని కోసం మధ్యస్థానం కడప . వీటిని రైల్వే జంక్షన్లుగా అబ్జివృద్ధి చెయ్యాలి. ఆతరువాత రాజధాని కేంద్రాలుగా వాటంతట అవే అభివృద్ధి చెందుతాయి. 
 https://www.facebook.com/photo.php?fbid=3011228035575833&set=a.233025936729404&type=3&theater
 నూర్ బాషా రహంతుల్లా , విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,6301493266




6, ఫిబ్రవరి 2020, గురువారం

బాధ్యతలేని మాటలు ప్రేలాపనలు ఆపాలి


బాధ్యతలేని మాటలు ప్రేలాపనలు ఆపాలి (సూర్య 9.2.2020)
ఈ మధ్య కొందరు నాయకుల మాటలు విపరీతంగా ఉంటున్నాయి.గోముఖ వ్యాఘ్రాలలాగా విజృంభిస్తున్నారు. అసహన కోరలు చాస్తున్నారు. దేశ శాంతికాముకతను,సెక్యులర్ స్వరూపాన్ని తుడిచిపెట్టే మాటలు మాట్లాడుతున్నారు. నాగార్జునసాగర్ లాంటి నీటిపారుదల ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలు అన్న నెహ్రూను కించపరుస్తూ మాట్లాడుతున్నారు. జాతిపిత మహాత్మాగాంధీని చంపిన గాడ్సే మహానుభావుడని పార్లమెంటు సభ్యురాలు సాథ్వి ప్రజ్ఞాసింగ్ కీర్తిస్తే, మాజీ మంత్రి అనంత కుమార్ హెగ్డే అందుకు వంతపాడాడు.‘ఉపవాస సత్యాగ్రహ’ అనే డ్రామా ద్వారా గాంధీ మహా పురుషుడు అయిపోయారని అన్నారు.ఇందులో గాంధీజీ ప్రస్తావన నేరుగా లేదని ఆయన మరునాడు బుకాయించారు.
2014 లో  గాంధీ జయంతి నాడే స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని మోడీ ప్రారంభిస్తూ ప్రజలలోని శక్తిని సరైన మార్గంలో నడిపించి మార్పును సాధించిన మహానుభావుడు అని గాంధీజీని కీర్తించినా వీళ్ళకు బుద్ధిరాలేదు. జనానీకం ముందు నెహ్రూను గాంధీని విమర్శిస్తూనే ఉన్నారు.తరువాత మరోచోట మేము అలా అనలేదు అంటున్నారు.వీళ్ళకు మహాత్ముని అహింసా వాదం పట్ల లోలోపల ఇంత వ్యతిరేకత ఎందుకో? ఉపవాస సత్యాగ్రహం ద్వారా స్వాతంత్య్ర సాధన అనేది నాటకం కాదు. గాంధీజీ  అయాచితంగా, అనుచితంగా మహాపురుషుడయిపోలేదు. ఆయన అహింస,నిరాడంబరతలకు ప్రతీకగా నిలిచాడు,నడిచాడు.అంబేద్కర్ కూడా అణగారిన వర్గాలకు మేలుచేసే తన మంచి జ్నానము కృషి ఫలితంతోనే గొప్పస్థాయికి చేరాడు.
నోరుఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడటం మంచిదికాదు . నోరుజారితే తీసుకోలేము.నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.ఎదుటివారి మనస్సు నొప్పించే మాట తీరు మంచిదికాదు.మంచి మాటలే మనకు  మర్యాద తెస్తాయి. అందరూ మెచ్చుకునేలా ఆహ్లాదకరంగా మాట్లాడగలగటం గొప్ప వరం. కొందరు నాయకులు నోటితో మాట్లాడుతూ నొసటితోవెక్కిరిస్తూదెబ్బతింటున్నారు. కటువుగా మాట్లాడడం కోటి దోమల పెట్టు అన్నారు.మాటలతో కోటలు సాధించవచ్చు.మాటలతోమంటలురగిలించవచ్చు.వాక్కుకత్తికంటేపదునైనది. ‘మాటకు ప్రాణం సత్యం. మాట తీరును బట్టి మనిషిలోని మంచీ చెడ్డలను అంచనావేయవచ్చు. మృదువుగా మాట్లాడే వారితో వీలైనంత ఎక్కువ సేపు గడపటానికిఅందరూఇష్టపడతారు.మాన్పగలిగితికత్తికోతలు,మాన్పవశమేమాటకోతలు,కత్తిచంపును,మాటవాతలుమానవేనాడుఅన్నారుగురజాడ.పెదవి దాటితే పృథ్వి దాటుతుందన్నారు.అర్థంపర్థంలేని విపరీత వ్యాఖ్యలకు కోపతాపాలకు స్వస్తిపలికి మాటలు కలుపుకొంటే ఎంతమేలు? నోరా వీపుకు దెబ్బలు తేకే అనిసామెత.చెట్టు సారం పండులో వ్యక్తం అయినట్లు-మనిషి సారం మాటలో వ్యక్తం అవుతుంది.
 ముస్లిములకు ఇళ్ళు అద్దెకు ఇవ్వవద్దు అని ప్రవీణ్ తొగాడియా, రాహుల్ గాంధీ ఆవుమాంసం తిని కేదారనాథ్ వెళ్ళినందువల్లనే భూకంపాలు వచ్చాయని సాక్షి మహారాజ్, సోనియాకు తెల్లతోలువల్లనే అధికారం వచ్చింది అని గిరిరాజ సింఘ్, హిందువులు ఎక్కువమందిని కనాలి అని నరేంద్రజైన్, రష్యామహిళతో పంచె కట్టడం కాదు విప్పడం నేర్పిస్తానని బాబూలాల్, గంగానదిలో హిందువులు మాత్రమే స్నానం చేయాలని ముస్లిములకు అర్హతలేదని  సూర్యనమస్కారాలు రానివారు సముద్రంలో డూకండని యోగి ఆదిత్యనాథ్, ఖాన్ త్రయం సినిమాలు చూడొద్దు అని సాధ్వి ప్రాచీ, భారత్ మాతాకీ జై  అనకుంటే లక్షమంది తలలు నరికేవాణ్ణి అని బాబా రాందేవ్ , బూట్లు పాలిష్ చేసినవాళ్ళు పాలిస్తున్నారు అని మధు మిశ్రా, పాక్ ను పొగిడేవారిని బూట్లతో కొట్టి పాక్ కు పంపాలని సాధ్వి బాలికా సరస్వతి , సురేంద్రజైన్,గౌతమ్ గంభీర్ లాంటివారు  అన్నారు.ముస్లిములకు ఓటుహక్కు రద్దు చేయాలని శివసేన కోరింది. పౌరసత్వం కావాలని ఉద్యమాలు చేసే వారిని కుక్కల్ని కాల్చినట్లు కాలుస్తామని ,బాంబులువేస్తామని , 50 లక్షలమంది ముస్లిముల్ని దేశంనుండి పంపేస్తామని దిలీప్ ఘోష్ అన్నారు.ఇలాంటి విపరీత,అనాలోచిత,అనవసర  ప్రేలాపనలు,వ్యాఖ్యలవల్ల ఎవరికీ మేలులేదు, పైగా శాంతి సఖ్యతలను కోరే సామాన్యప్రజలు దూరమౌతారు.
మంచి వక్త సత్యవాక్కుతో చెలిమి చేయాలట. అబద్దాలు చెప్పి అదే నిజమని నమ్మించే వారు నిత్య జీవితంలో మనకు అక్కడక్కడ తటస్థపడుతూనే ఉంటారు.నోరు కల్లలపుట్ట పేరు హరిశ్చంద్రుడు లాంటి నాయకులు దేశానికి ప్రమాదం.ఓదె కట్టే దొంగ పరిగ ఏరే వాడిని బెదిరించినట్లు మెజారిటీ బలంతో తమబుర్రకు తోచిన అబద్దాలను సత్యాలుగా ప్రకటించేపనిలో కొంతమందినాయకులున్నారు.అధికారంలో కొనసాగాలనుకునే ఏ పార్టీ అయినా ఏనాయకుడైనా ప్రజలలో పలచబడకుండా జాగ్రత్తపడాలి.వెనకాముందూ చూసుకోకుండా ఏదిబడితే అది  మాట్లాడే అనుచరగణం వల్ల అధినాయకులకే ముప్పురావచ్చు.కాబట్టి అసత్య ప్రేలాపకుల్ని అనుచరుల్లోనుంచి ఎరిపారేయ్యాలి.
చంపదగినయట్టి శత్రువు,తనచేత చిక్కెనేని కీడుసేయరాదు, పొసగ మేలుజేసి పొమ్మనుటే చాలు లాంటి హితవాక్యాలు వేమన పద్యాలు  చదివి పెరిగిన జాతిమానది. ఎవరైనా శాంతిబాటలోకి రావలసిందే.చివరికి అహింసే పరమధర్మం అని మంచివాళ్లు తేల్చారు.కొన్నేళ్లు బ్రతికి భూమిని వదిలి వెళతామనుకునే భావనతో జ్నానులంతా జీవితం తాత్కాలికమనే అనుకున్నారు కానీ  నియంతలై తమ మాటలతో గానీ చేష్టలతో గానీ ప్రజల ఉసురు తీయలేదు.అందువలన తోటి మానవులకు కీడు చేయటం,పొరుగువాడి నాశనాన్ని కోరుకోవటం మనం ఏర్పాటు చేసుకున్న నాగరిక మానవతా ధర్మాలకు విరుద్ధం. పదవులను వదిలి సత్యంకోసం అడవుల పాలైన రాముడు,బుద్ధుడు పాలకులకు గుర్తు రావాలి.
--   నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,6301493266