ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, అక్టోబర్ 2020, శుక్రవారం

దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నిరంతరం జరుగుతూనే ఉండాలి

 

 

                  



దుష్ట శిక్షణ శిష్ట రక్షణ
నిరంతరం జరుగుతూనే ఉండాలి 

 (సూర్య 3.10.2020,4.10.2020,గీటురాయి 16.10.2020 )  

కులములేనివాడు కలిమిచే వెలయును ,కలిమి లేని వాని కులము దిగును ,కులముకన్న నెన్న గలిమి ప్రధానంబు అన్నాడు వేమన. వలచి గెలిచి కలలు పండిన జంట లేదీ ఇలలో కులము మతము ధనము బలము గొంతు కోసెను తుదిలో అన్నారు మనసుకవి ఆత్రేయ. ఎవరిది ఎక్కువ కులము ?ఎవరిది తక్కువ కులము ?ఎవరు తెచ్చినారు ఈ బేధాలు? కులాలు మతాలు కూటాలన్నీ కలిమివల్ల కల్పించిన వేరా మనమంతా కుల మత్తును వీడి మనుషులంతా ఒకటేనని చాటరా అని సినారె ఆనాడే చాటారు. గోదాదేవి లాగానే బీబీ నాంచారి కూడా విష్ణుపత్నిగా ఆరాధించ బడుతుంది.వెంకటేశ్వరుడు లౌకికవాదానికి ప్రతీకగా మారి మతాంతరవివాహాలకు మార్గం సుగమం చేసి మార్గదర్శకుడయ్యాడు అని డా.సి.వి. సుబ్బన్న శతావధాని తన బీబీ నాంచారి ప్రబంధములో చెప్పారు. సమాజంలో దుర్మార్గుల దౌర్జన్యం నుంచి బలహీనులను రక్షించటం కోసమే నైతిక విలువలు , చట్టము , ప్రభుత్వము,పోలీసులు,కోర్టులు ఉన్నాయి. హేమంత్ లాంటివారు బలైతే వారి తల్లిదండ్రులు రక్షణ కోసం రోడ్డున పడి ఉద్యమాలు చేయవలసి వస్తోంది. శ్మశానానికి వెళుతుంటే కూడా హంతకులు వెంటాడుతూనే ఉన్నారట.మహిళలపై అత్యాచారాలు, హత్యాచారాలు చేస్తున్నారు.కులాంతర వివాహితుల్ని చంపుతున్నారు. ఉత్తరప్రదేశ్‌ లో ఒక దళిత అమ్మాయిని నలుగురు అగ్రకుల యువకులు అత్యాచారం చేసి నాలుక కోశారు.ఎముకలు విరిగిపోయి ఆ అమ్మాయి మరణించింది.కుటుంబీకులకు శవాన్ని ఇవ్వకుండా పోలీసులే అర్ధరాత్రి అంత్యక్రియలు చేశారట.పరామర్శకు రాహుల్ ప్రియాంకలనూ వెళ్లనివ్వలేదు.అసలు అత్యాచారమే జరగలేదు,ఇదంతా దేశాన్ని కల్లోలపరచటానికి కొందరి కుట్ర అని ఆ రాష్ట్ర డీజీపీ అన్నారు.14 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి చెట్టుకు వేళ్లాడదీసి ఆమె ప్రాణాలు తీశారు. మూడేళ్ల బాలికను కూడా ఇలాగే హింసించి చంపారు. నిర్భయ చట్టం ప్రకారం ఈ అత్యాచారహంతకులకు ఉరిశిక్ష అమలు కావాలి.కులపోటీ హత్యల వల్ల వ్యక్తిగత కక్షలు తీరవచ్చుగానీ మరే లాభం లేదు.పోయినప్రాణం తిరిగిరాదు.చట్టం వల్ల నేర భయం కలిగేలా సాంఘిక సంస్కరణలు రావాలి.మృగాళ్ల బారిన పడిన ఈ ఆడపిల్లలు దళితులు, వెనకబడిన కులాలవారు.పిల్లలపై లైంగిక నేరాల నిరోధక(పోక్సో) చట్టంలోని శిక్షలు అమలు కావాలి.నిర్భయ ఉదంతం తరువాత 150మంది నేరగాళ్లకి శిక్ష పడినా కూడా దేశంలో అత్యా చారాలు తగ్గలేదు. ఉత్తరప్రదేశ్‌లో లైంగిక నేరాలు అరికట్టడానికి పెట్టిన 1,023 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు 206 కు తగ్గాయి.లైంగిక వేధింపుల ఆరోపణ లపైనా, అత్యాచారం జరిగిందన్న ఫిర్యాదులపైనా పోలీసులు ఉదాసీనంగా ఉండటంవల్లే దోషులకు సరిగా శిక్షలు పడటం లేదని పార్లమెంటరీ సంఘం తేల్చింది.మరి కఠిన చట్టాలు తెచ్చి ప్రయోజనం ఏమిటి? నిర్భయ కేసులో దోషులు ఉరికంబం ఎక్కటానికి ఎనిమిదేళ్ల జాప్యం జరిగింది.నిర్భయ లాగా మనిషా కు సత్వర న్యాయం జరగలేదు . మహిళలపై లైంగిక నేరాలు జరిగినప్పుడు పోలీసు విభాగం సత్వరం స్పందించాలి. నిందితులను పట్టుకుని త్వరగా శిక్షలు పడేలా చూడాలి. నేరానికీ, శిక్షకూ మధ్య జాప్యాన్ని నివారించాలి. నేరగాళ్లలో భయం కలగాలి. షీ టీమ్‌ , దిశ లాంటివన్నీ మహిళలపై నేరాలు అరికట్టడానికే. దిశ చట్టంప్రకారం లైంగిక నేరస్తులను పట్టుకుని 21 రోజుల్లో శిక్షించాలి. బాధిత మహిళలు వెంటనే పోలీసులకు తెలిపే దిశ యాప్‌ ను కొన్ని రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకున్నాయి.ఈనాడు మనలో ఎవరికైనా  ‘కూతుళ్ల దినోత్సవం' వల్ల సంతోషం కలుగుతుందా? పిల్లలు పుట్టలేదని కన్నీళ్ళు, పిల్లల్ని కాపాడుకోలేకా కన్నీళ్ళు, మానాభిమానాల కోసం కన్నీళ్ళు,కూతుళ్ళు హత్యాచారానికి గురై చనిపోతే కన్నీళ్ళు,కన్నీటితో తడవని ఇల్లేది? కులాంతర వివాహం చేసుకున్నయువతీయువకులను తల్లిదండ్రులే దుర్మార్గంగా ప్రాణాలు తీస్తున్నారు. గద్వాల జిల్లాలో ఒక బాలిక వేరే కులం అబ్బాయి వల్ల గర్భవతి అయిందన్న కోపంతో తల్లిదండ్రులే హతమార్చారు. వందల ఏళ్లనుండీ ఇదే చరిత్ర. కరీంనగర్‌ జిల్లా గద్ది కుమార్‌, భువనగిరి జిల్లా నరేశ్‌ అంబోజి, పెద్దపల్లి జిల్లా మంథని మధుకర్‌ , మిర్యాల గూడ పెరుమాళ్ల ప్రణయ్‌ … ఇవన్నీ కులోన్మాద హత్యలే. పుట్టుకతో ఎవరికీ పాపం రాదు.తక్కువకులంలో పుట్టటం శాపంగా జనమే మార్చారు.ఎక్కువకులంలో పుట్టటం పరువు గా తలపోశారు. కానీ పిల్లలకు ఇవేమీ తెలియవు.కులంవల్లనే ఏదో ఆధిక్యత సంక్రమించిందని, వేరే కులం వాళ్ళను పెళ్లి చేసుకుంటే పరువు పోతుందనీ , కులానికి, వంశానికి ఉన్న పరువును హత్యలద్వారా కాపాడుకోగలమని హంతకులు నమ్ముతున్నారు. ప్రాణంతీస్తే కులానికిగానీ తల్లిదండ్రులకు గానీ పరువు వస్తుందా? రాదు.పైగా ఉన్న పరువు పోతుంది. పెద్ద కులాల యువకులు, చిన్నకులాల అమ్మాయిలను ప్రేమిస్తే, పెళ్లి చేసుకుంటే సర్దుకుపోతున్నారు. పెద్ద కులాల అమ్మాయిలను చిన్నకులాల అబ్బాయిలు ప్రేమిస్తే మాత్రం సహించడం లేదు. నాలుగు వర్ణాలు అన్నారు కానీ ఎన్నో కులాలు ఉన్నాయి.కూటికి పేద అయినా, కులానికి కాదట. కులాంతర వివాహాలకు కూడా చదువు ఉద్యోగము ఆస్తి చూసుకుంటున్నారు. కులము కంటే బ్రతకటానికి ఆస్తి,ఉపాధి,సంపాదన ముఖ్యం అనుకుంటున్నారు.సరిసమానుల మధ్య వివాహానికి కులాలు మతాలు అడ్డుకావని కులాంతర మతాంతర వివాహాలను పనిగట్టుకొని చేసే వారూ ఉన్నారు. ప్రభుత్వం కూడా కులాంతర మతేతర వివాహాలకు ప్రోత్సాహకాలు ఇస్తోంది.ఎందరో జ్నానులు ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ కులం ఎంతో బలీయంగా తయారయ్యింది.ఎవరైనా తమకు ఇష్టమైన మతానికి మారవచ్చు కానీ కులం మారలేరు.కులం శాపంగానో వరంగానో మనిషికి జీవితాంతము పట్టి ఉంటోంది. కులములోన నొకఁడు గుణహీనుఁ డుండిన,కులము చెడును వానిగుణమువలన,ఎలమి చెఱకునందు వెన్నుపుట్టినరీతి అని చెప్పిన వేమనే కులములోన నొకడు గుణవంతు డుండెనా,కులము వెలయు వాని గుణము వలన,వెలయు వనములోన మలయజంబున్నట్లు అనికూడా అన్నాడు. కొంతమంది అత్యాచారాలు హత్యలతో తమ కుల మతాలకున్న మంచి పేరును చెడగొడుతున్నారు.వారు చేసే చేదుపనులు అనుసరించే హింసా మార్గం అందరికీ సమస్యలే తెచ్చిపెడుతూ ఉంది.కుల మతాల పేరుతో హత్యలకు ,విధ్వంసాలకూ పాల్పడే వ్యక్తులు ఆ ఖర్చుతో తమ ఊరిలో మంచి రోడ్లు వేయించి,వంతెనలు, విద్యాలయాలు,ఆసుపత్రులు కట్టించి ప్రజలను కాపాడవచ్చు. మంచిపనులేమీ చేయకుండా కేవలం విధ్వంసాలకు పాల్పడే వారికి మంచిపేరేం వస్తుంది?పైగా వీళ్ళ హింసాప్రవృత్తివలన వారి మతానికీ,కులానికీ ఏ తప్పూ చెయ్యని శాంతిని కోరే వారికీ కూడా సభ్య సమాజంలో తలెత్తుకు తిరగలేని అవమానం,హానీ కలుగుతాయి. మానవత్వం చూపుతూ  కులము మతము అడగకుండా అందరికీ అన్నదానం చేస్తున్నవారికి, ప్రమాద బాధితులకు ,రోగులకు సహాయపడుతున్నవారికి,సత్రాలు చలివేంద్రాలు పెట్టి బాటసారుల దాహార్తిని,క్షుద్బాధను తీరుస్తున్న మానవతామూర్తులు అందరికీ వందనం.ఆడబిడ్డల మాన ప్రాణ రక్షణ కోసం మంచివాళ్లు అందరూ భగవంతుడిని కన్నీటితో ప్రార్ధిస్తున్నారు.రక్షణ కల్పించమని ప్రభుత్వాలను వేడుకొంటున్నారు. ప్రజా క్షేమంకోసం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నిరంతరం జరుగుతూనే ఉండాలి.

--
నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,6301493266

 


 

24, సెప్టెంబర్ 2020, గురువారం

వ్యవసాయ బిల్లులు రైతులకు మేలు చెయ్యాలి


వ్యవసాయ బిల్లులు రైతులకు మేలు చెయ్యాలి (గీటురాయి 2.10.2020)
దేశ జాతీయోత్పత్తి లో 18శాతం వ్యవసాయ రంగానిదే.మన దేశంలోని 60 శాతం మంది ప్రజలకు వ్యవసాయరంగమే జీవనాధారం.సాగుచేస్తున్నవారిలో 82శాతం మంది చిన్న సన్నకారు రైతులే. పార్లమెంటులో మోదీకి ఎదురులేదు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌ బిల్లుల కోసం దీక్షకు దిగారు. మూజువాణి ఓటుతో వ్యవసాయ బిల్లులు నేగ్గాయి.వ్యవసాయ బిల్లును తేనె పూసిన కత్తి అని కేసీఆర్ వ్య్తతిరేకించారు.స్వపక్ష మంత్రి హర్ సిమ్రత్ కౌర్ రాజీనామా చేషారు.హర్యానా జెజెపి ఎంఎల్‌ఎలు రోడ్డెక్కారు.18 పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ రాష్ట్రపతికి విజ్నప్తి చేశాయి.కనీసం సెలెక్ట్ కమిటీకి నివేదించాలని బిజూజనతాదళ్ కోరగా ఈ బిల్లులు సంపన్నులకే మేలు చేస్తాయని బిఎస్‌పి అధినేత్రి మాయావతి అన్నారు. వైసీపీ, టిడిపి,తమిళ మనీలా కాంగ్రెస్, బోడే పీపుల్స్ ఫ్రంట్ మద్దతు ప్రకటించాయి. గతంలో దళారీల దయాదాక్షిణ్యాలపై రైతులు బతికారని, ఈ బిల్లుల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర దక్కుతుందని వైసీపీ చెబుతోంది కానీ రైతు బంధు, రైతు ఆసరా లాంటి పథకాలు కొనసాగాలంటే ఎలా ? బడా వ్యాపారవేత్తలు, కార్పొరేట్‌ సంస్థలు, అగ్రి బిజినెస్‌ సంస్థలు రైతాంగాన్ని పెద్ద ఎత్తున దోపిడీ చేస్తారనే భయంతో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా హర్యానా, పంజాబ్‌, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు సాగాయి.ఆహార ధాన్యాల నిల్వలపై పరిమితులను ఎత్తివేశారు.పప్పు ధాన్యాలు, కాయ ధాన్యాలు, ఖాద్య తైలాలు, ఉల్లిపాయలు, బంగాళా దుంపలు నిత్యావసర సరుకుల జాబితా నుండి తొలగిస్తారు. వీటి నిల్వలపై పరిమితులను కూడా ఎత్తివేస్తారు. ఇందువలన బడా వ్యాపారస్తులు, కార్పొరేట్లు, బాగుపడతారు.నేరుగా రైతుల నుండి వర్తకులు,కొనుగోలు చేసే లావాదేవీలపై పన్నులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం వుండదు. కార్పొరేట్‌ సంస్థలు ప్రైవేట్‌ మార్కెట్‌ యార్డులను ఏర్పాటు చేసుకోవచ్చు. వీరు కేంద్రం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉండదు. టోకు వ్యాపారస్తులతో, ఎగుమతిదారులతో, పెద్ద రిటైల్‌ సంస్థలతో మన రైతులు కాంట్రాక్ట్‌ కుదుర్చుకోవాలి.రాష్ట్రాలకు ఎలాంటి హక్కులు ఉండవు. విత్తన చట్టం లేకపోవడం వల్ల విత్తనోత్పత్తి రైతులు కార్పొరేట్‌ విత్తన వ్యాపార సంస్థలకు వేల కోట్లు నష్టపోతున్నారు. కానీ విత్తన వ్యాపారులు మాత్రం పెద్ద ఎత్తున లాభాలు సంపాదిస్తున్నారు. రాష్ట్రాలకు జీఎస్టీ బకాయీలు 3 లక్షల కోట్లు చెల్లించటానికి 67వేల కోట్లు పెట్రోల్‌పై సెస్‌ వేశారు.మిగిలిన 2.33 లక్షల కోట్లను రాష్ట్రాలే బయట అప్పులు తెచ్చుకోవాలని... ఇది దైవ నిర్ణయమని చెప్పారు.మన ఆర్థిక వ్యవస్థ 24 శాతం పతనం అయింది.కరోనా దెబ్బకు ప్రపంచంలో 9.77లక్షలమంది చనిపోతే మన దేశంలో 90 వేలమంది చనిపోయారు.ఇటువంటి సమయంలో వైద్యంపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలి. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కోసం, మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చు చేయాలి. యంత్రాలు, భవనాలు, రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయాలి. అమెరికాలో 10 శాతం, జర్మనీలో జపాన్‌ లో 5 శాతం, ప్రజలకు సహాయం కింద కేటాయించారు. దేశం 5 కోట్ల ఉద్యోగాలను కోల్పోయింది.పెట్టుబడిదారుల్ని సంపద సృష్టికర్తలు అంటున్నారు.వారే ఆత్మనిర్భర సాయంతో ఆర్థిక వ్యవస్థను ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలి.ఇపిఎస్‌ -95 పెన్షన్‌ స్కీం ఎత్తివేసి మామూలు పెన్షన్ ఇవ్వాలి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటం కోసం వ్యవసాయ,గ్రామీణ రంగాల్లో రూ 25 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టాలి.దేశమంతటా గ్రామస్థాయిలో నిల్వ, రవాణా సదుపాయాలతో గిడ్డంగుల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయ్యాలి.నిల్వ చేసుకున్న ఉత్పత్తులకు గాను రుణాలు ఇవ్వాలి. రైతులకు పింఛను పథకం ,వడ్డీ లేకుండా కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు ఇవ్వాలి.నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలి. సహకార సంఘాల ద్వారా వ్యవసాయ, పాడి, మత్స్య ఉత్పత్తులను మార్కెట్ చేయాలి.చిన్న రైతులు తమ పంటలను నిల్వ చేసుకోకుండా కల్లాల వద్దనే పంటలు అమ్ముకుని అవసరాలు తీర్చుకుంటారు. నిలువ చేసుకుని, దేశంలో ఎక్కడైనా అమ్ముకుని లాభపడలేరు.దేశంలో 23 పంటలకు మాత్రమే కనీస మద్దతు ధర ఉంది.మరిన్ని పంటలకు మద్ధతు ధర ఇవ్వాలి.దేశంలో పండిన గోధుమ, వరిలో 6 శాతం మాత్రమే ప్రభుత్వం సేకరిస్తోంది. ద్రవ్యోల్బణం, రైతు పెట్టే పెట్టుబడి కంచె, బోరుబావి , పొలం చదునుచేయడం అన్నీ రైతుకు ఖర్చులే.కార్పొరేట్ కంపెనీలతో కలిసి రైతులు కాంట్రాక్టు వ్యవసాయం చేయలేరు.ఇంతకంటే మార్కెట్ కమిటీలు నయం. నిత్యావసర వస్తువుల ధరలు అదుపు తప్పితే ఎఫ్‌సీఐ తన వద్ద ఉన్న నిల్వలను మార్కెట్‌లోకి విడుదల చేసేది.లాభాలుంటేనే వ్యాపారం చేసే బహుళజాతి కంపెనీలు ప్రజాపంపిణీ వ్యవస్థకు సహకరించవు. వ్యవసాయ మార్కెట్ వ్యవస్థ బహుళజాతి కంపెనీలపరమైతే మార్కెట్‌ యార్డుల్లో స్థానికంగా ఉండే వ్యాపారులు, దళారులు , హమాలీలు, కూలీలకు ఉపాధి దొరకదు. కార్పొరేట్లకు 20 లక్షల కోట్లు పన్నుల రాయితీ దొరికింది.బ్యాంకులు, బొగ్గు గనులు, బీమా సంస్థలు, రైల్వేలు వంటి ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించారు. బడా వ్యాపారులు, నేరుగా రైతుల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేస్తారు.అంబానీ, ఆదానీ, వాల్‌మార్ట్‌ వంటి పెద్దపెద్ద కార్పొరేట్లకు రైతుల నుంచి భూమి సేకరించి ఇస్తే వాళ్లు కాంట్రాక్టు వ్యవసాయం చేస్తారు. రాష్ట్రాల జాబితాలోని వ్యవసాయ మార్కెట్‌ రంగాలపై కేంద్రం పెత్తనం వస్తుంది. మారిన కార్మిక చట్టాలతో ఉద్యోగ భయం, జీతాల కోత బెంగ పెరిగింది. ముందస్తు అనుమతి లేకుండా లే ఆఫ్‌లు, రిట్రెంచ్‌మెంట్‌లు చేయొచ్చు. లేదా మూసివేయొచ్చు.కార్మికుల పనిగంటలు పెంచారు. ప్రమాదాలలో చనిపోయిన కార్మికులకు సాయం పెంచాలి. వ్యవసాయ బిల్లుల ద్వారా ప్రజలకు అన్నంపెట్టే రైతులకు కూడా మేలు చెయ్యాలి.
నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266

 



20, సెప్టెంబర్ 2020, ఆదివారం

సెంట్ ఫకీర్ తెలుగు మీడియం ఇంగ్లీష్ కాన్వెంట్ ! (ఉబుసుపోక గీటురాయి1.8.1986 ,18.9.2020)

సెంట్ ఫకీర్ తెలుగు మీడియం ఇంగ్లీష్ కాన్వెంట్ !
(ఉబుసుపోక గీటురాయి1.8.1986 ,18.9.2020)


“ఇంటిపేరు క్షీరసాగరం వారు, ఇంట్లో మజ్జిగ చుక్కకు గతి లేదు” అన్నట్లు సెయింట్ల కాన్వెంట్లలో చదువు మహా డాబుసరి వ్యవహారంగా తయారయింది. ఇంటికూడు తిని, ఎవరి వెంటో పడినట్లుగా కాన్వెంట్ల యాజమాన్యం ప్రవర్తిస్తున్నది. అసలు ఈ ప్రపంచంలో ఏ మూల ఏ ప్రక్రియ సక్సెస్ అవుతుందో దాన్ని మనవాళ్లు ఇట్టే స్వతంత్ర్యం చేసుకుంటారు. ఆనవాలు పట్టడానికి కూడా వీలు లేకుండా దానికి నకిలీ తయారు చేస్తారు. నాణ్యతలో తప్ప మరి దేనిలోనూ తేడా మనకు కనపడదు.
ఏదో నాలుగు తెలుగక్షరాలు నేర్చుకొని కుదురుగా చదువుకొంటున్న మా అమ్మాయిని ఇంగ్లీసు మీడియం చదివించాల్సిందేనని మా ఆవిడ పట్టుపట్టింది. ఎందుకంటే మా పక్కింటివాళ్లమ్మాయి పొద్దున్నే బూట్లు, టై, బ్యాడ్జీ మరేవేవో వేసికొని టిప్‌టాప్‌గా కాన్వెంటుకు వెళ్లేది. ఇంటికొచ్చి “బటర్‌ఫ్లై.. బటర్ ఫ్లెయి” అని అరుస్తూ ఉండేది. పక్కింటివాళ్ల పిల్ల అరుపులు విన్న మా ఆవిడ ఒక్క ఉదుటున నా దగ్గరకు పరిగెత్తుకొచ్చి “మన పిల్లను కూడా కాన్వెంటులో చేరుస్తారా లేదా? అని నిగ్గదీసేది. ఈ ఇంటిపోరు పడలేక చివరికి కాన్వెంట్ల వేటలో పడ్డాను. దారిలో ఓ మిత్రుడు తోడయ్యి అచ్చంగా కాన్వెంట్లే ఉండే ఒక బజారుకు తీసికెళ్ళాడు.
అన్ని కాన్వెంట్లూ తిరిగి చూసాం. కొద్దో గొప్పో తేడాతో అందరూ మూడువేలదాకా ముట్టజెప్పుకోమని అడిగారు. మూడు రూపాయల ఖర్చు కూడా లేకుండా మా వూరి వీధి బడిలో చేరి చదివానే. ఇక్కడేంటి మూడు వేలు ఫీజంటున్నారు? ” అని వెంటొచ్చిన మిత్రుణ్ణి అడిగాను.
“ఊదు వేయందే పీరు లేవదోయ్ బాషా! అయ్యెలిమెంటరీ స్కూళ్ళూ, ఇయ్యేమో సెయింట్ స్కూళ్ళు. ఆటికి ఈటికి తేడాలేదా?” అన్నాడు సెయింట్ అనే మాటకు అంత విలువ ఉందట. “సెయింటంటే ఏందని అడిగాను. “సన్యాసి, రుషి లేదా ముని” అని తడుముకోకుండా జవాబిచ్చాడా బైరాగి. సన్యాసుల స్కూళ్ళకు సంపాదనాశ మెండా?”అని అనబోయి కూడా ఆపుకున్నాను.
ఇంకాస్త ముందుకొస్తే అతి విచిత్రమైన బోర్డు కనబడింది. అది “ఆల్ సెయింట్స్ హైస్కూల్” నాకు నానార్ధాలు గోచరించాయి.. ఇదేం పేరురా మిత్రమా ఇలా ఉంది? అన్నాను. అవునోయ్ రోజుకొక కాన్వెంట్ పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో కొత్త కొత్త సెయింట్ల పేర్లు వాటికి తగిలిస్తున్నారు. ఉదాహారణకు సెయింట్ వాణి, సెయింట్ రాణి, సెయింట్ జాక్‌పట్, సెయింట్ ఆయిషా, సెయింట్ ఖాదర్ వలీ, సెయింట్ ఫకీర్‌సాహెబ్, సెయింట్ లిల్లిపుట్.. ఇలా అడ్డమైన పేర్లన్నీ పెట్టేస్తున్నారు కదా? వీళ్లందర్నీ భూత, వర్తమాన భవిష్యత్కాలంలో చావుదెబ్బ తీయడానికి ఈ మహానుభావుడు “ఆల్ సెయింట్స్” అని పెట్టుకున్నాడు. తప్పేమిటి?” అని ఎదురు ప్రశ్న వేసాడు.
సరే ఆ రోజుకు పని కాలేదు ఇంటికి తిరిగొచ్చాను. పక్కింటి పాపాయిని పిలిచి, “పాపా! నీవు చదివే స్కూలు పేరేంటమ్మా?” అని అడిగాను. “సెయింట్ వోణి” అనుకుంటూ ఆ పిల్ల పరుగు తీసింది. “స్కూలు పేరడిగితే సెంటూ, వోణీ అంటుందేమిటి ఆ పిల్ల?” అని మా ఆవిడ ప్రశ్నించింది. అదేలే “సెంట్ వాణి” అన్నాను. “మధ్యలో ఆ సెంట్ ఏమిటండి. ఎంచక్కా వాణి కాన్వెంటో, వాణి స్కూల్ అనో పెట్టుకోక” అంది. “ఆ సెంటు లేకపోతే స్కూలు వాణికి విలువలేదే పిచ్చిమొగమా!” అన్నాను. నా ఫ్రెండుతో గడించిన జ్ణానాన్ని ఉపయోగించుకొని ఆ సెంట్ అంత ఖరీదైనదా? మళ్ళీ ప్రశ్న. చివరికెలాగో ఒక గంట సుధీర్ఘోపన్యాసం చేసి ఆమె చేత “అలాగా” అనిపించాను.
మరునాడు అమ్మాయిని తీసికెళ్ళి కేవలం రెండొందలు మాత్రమే అడ్మిషన్ ఫీజు తీసుకొన్న సెయింట్ చెన్నారెడ్డి ఇంగ్లీషు మీడియం స్కూలులో చేర్పించాను. పక్కింటి పాపాయితో ధీటుగా మా పిల్లను తయారుచేసి బండెడు పుస్తకాలను వీపుమీదకెత్తి పంపించాము. అలా సంవత్సరం గడిచింది. అమ్మాయి ఇంగ్లీషులో మాట్లాడేదింకెప్పుడు? అని నాకు ఆదుర్దాగా ఉండేది. “అమ్మా మీ స్కూల్లో టీచర్లు ఇంగ్లీషులో మాట్లాడతారా? ఆపుకోలేక అడిగాను “లేదు నాన్నా, ఎంచక్కా తెలుగులోనే మాట్లాడుకుంటారు. పాఠం మాత్రం ఇంగ్లీషులో చెబుతారు” అంది. ఇంతకు ముందు తెలుగులో పాఠాలు చదివి అర్ధం చేసుకునేది. ఇప్పుడు ఇంగ్లీషు, తెలుగు ఏదీ పూర్తిగా రావటంలేదు అనుకొన్నా. మా పక్కింటి పాపయ్య భార్యతో అంటున్నాడు. “సెంట్ వాణిలో అంతా తెలుగోళ్ళే. లాభం లేదు. సెంట్ పంగనామం స్కూలులో చేర్పిస్తేగాని పిల్ల బాగుపడదు. అక్కడ అంతా అరవోళ్లు..
---- నూర్ బాషా రహంతుల్లా (గీటురాయి ఉబుసుపోక 1.8.1986)