ఈ బ్లాగును సెర్చ్ చేయండి

21, నవంబర్ 2013, గురువారం

నిర్వాసితులు



భూసేకరణ – నిర్వాసితులు

నూర్ బాషా రహంతుల్లా 9948878833

"సంపదపై , భూమిపై అంతిమంగా అధికారం ప్రభుత్వానిదే (ఏమినేంట్ డొమైన్ ) " అనే సూత్రంతో 1894 భూసేకరణ చట్టం ఏర్పడింది. దాని ప్రకారం ప్రజోపయోగపనులకు అంటే రోడ్లు, రైలు మార్గాలు,కాలువలు, కార్యాలయభావనాలు లాంటి వాటి కోసం అవసరమైన భూమిని సేక రించవచ్చు. ప్రజల ఉపయోగం కోసం భూములను తీసుకోవచ్చుగానీ ప్రైవేటు కంపెనీలకోసం ప్రభుత్వం భూమి కొనివ్వటం తగదని , భూములను కార్పోరేట్, మల్టీనేషనల్ కంపనీలకు ధారాదత్తం చేయకూడదనీ  ప్రజలను అమానవీయంగా నిర్వాసితుల్ని చేయకూడదనీ ఉద్యమాలు చెలరేగాయి. ఉండటానికి ఇల్లు,ఇంటిస్థలం కూడా లేక ఒకటో రెండో  సెంట్లు భూమి ఇప్పించమనికోరే నిర్భాగ్యులు  ఒకపక్క , పరిశ్రమలు  పెట్టుకుంటానికి వందలాది ఎకరాలు ఇప్పించమని కోరే భాగ్యవంతులు మరోపక్క ఏకకాలంలో దర్శనమిచ్చే విచిత్రదేశం మనది.

అందరికీ భూమే కావాలి

ఏదీ ధ్వంసం కాకుండా ఏదీ నిర్మించడం కుదరదట. రైతులు వేలకు అమ్ముకుంటే పరిశ్రమలవాళ్ళు  కోట్లకు అమ్ముకుని కొల్లగొట్టిన దానిపేరే కదా అభివృద్ధి? రియల్‌ మాయ.ఇది  రైతు భూముల్ని మింగేసిన కొండచిలువ. భూమిపుత్రులకు నేలతో బంధాన్ని తెంపేసిన రాక్షసి అంటూ  భూసేకరణ చట్టాన్ని కవులు వర్ణించారు.ఇది  నిర్వాసితుల  బతుకుల్ని ఆగం చేసిన అభివృద్ధి  అంటూ ప్రాజెక్టుల్ని తిట్టిపోశారు. పెద్ద నగరాల చుట్టూ ఉన్న లక్షలాది ఎకరాల భూమి  సెజ్ లకు, హై టెక్ సిటి, రింగ్ రోడ్, గ్రేటర్, ఎయిర్ పోర్ట్, లాంటివాటికి ఖర్చయిపోయింది. ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిస్స,ఆదివాసీ ప్రాంతాలలోని భూముల కోసం  టాటా, జిందాల్, మిట్టల్, ఆర్సెలర్, సలీం, వేదాంత, పోస్కో లాంటి బహుళజాతి కంపనీలు భూమి కోసం నిరంతర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి.

గోవా, సింగూరు,నందిగ్రామ్, నారాయణ పాట్నా, పోస్కో, నియమగిరి, కళింగనగర్, సోంపేట, గంగవరం పోర్ట్, కాకరాపల్లి, కొవ్వాడ, పోలవరం,లాంటి ప్రాంతాల్లో ఉద్యమాలు జరిగాయి. ఇటీవల జరిగిన జన సత్యాగ్రహంలో  దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన లక్ష మంది రైతులు గ్వాలియర్‌ నుంచి ఢిల్లీ దాకా ఊరేగింపుగా వెళ్లి తమదని చెప్పుకోగలిగేలా తమకు తలో పది సెంట్ల భూమి అయినా ఇప్పించాలని ఆందోళన జరిపారు.

 

నిర్వాసితుల వాదన,ఆవేదన
“పరిహారంగా లభించిన మొత్తానికి మరోచోట అంతే మొత్తం భూమి రాదు. తిండికీ, ఉపాధికీ.. రెంటికీ భూమి కీలకం. భూమి లేకపోతే ఎందుకూ కొరగాము.పని పోయి, విద్య లేక, మరో పని రాక..మరింత పేదలవుతున్నాము. పరిహారంలో కొంత మొత్తాన్ని బ్యాంకుల్లో దాచుకుంటున్నాము. అప్పులు తీరుస్తున్నాము. ఇంటి ఖర్చుల కోసం, పెళ్లిళ్ల కోసం, ఖర్చు పెత్టేస్తున్నాం. పరిహారంలో ఎక్కువ భాగం నిరుపయోగమైన రీతిలో ఖర్చైపోతోంది. పునరావాస కేంద్రాలు కనీస వసతులు లేక అధ్వానంగా ఉన్నాయి. ఎలాగూ మీ  గ్రామం ప్రోజెక్టు  కింద పోతుందంటూ కొన్ని ఏళ్ళ పాటు అభివృద్ధి పనులు చేపట్టలేదు. పునరావాసం త్వరగా కల్పించరు . పరిహారం పెండింగ్‌లో పెడతారు. ఇండ్ల సర్వేలు కొనసాగుతూనే ఉంటాయి. వ్యవసాయమన్నా చేసుకోనియ్యకుండా పొలాలు  బీళ్ళుబారతాయి.తినే మా చేతిలో కంచం గుంజుకుని వట్టి మెతుకులు చేతుల్లో చల్లినట్లు ఉంది మా నిర్వాసితుల పరిస్థితి. నిర్వాసితులకు కనీస ఉపాధి కానీ  కాంట్రాక్ట్ పనులు కానీ లభించటంలేదు. ఎక్కడి నుంచో  వచ్చే  కాంట్రాక్టర్లు లేబర్‌ను కూడా వాళ్ళ ప్రాంతం నుంచే తెచ్చుకుంటారు. చివరికి మట్టి లెవలింగ్ చేసే పనులు, టార్పాలిన్ కట్టే పనులు లాంటివి కూడా మాకు ఇవ్వడం లేదు.సరిపడా పరిహారం చెల్లించాలి , పునరావాసం వెంటనే కల్పించాలి. లేకపోతే మా భూమిని మాకు వదిలిపెట్టాలి. మీరిచ్చిన ఆ డబ్బులు ఎటు పోయాయో తెలియదు. మొత్తం మోసమే. నిరుద్యోగులకు 350 రోజుల కూలీ ఇవ్వలేదు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు పునరావాసంతోపాటు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామన్నారు. అదీ లేదు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాకపోవడంతో గుడిసెల్లో నివసిస్తున్నాము . మరుగుదొడ్లు, దీపం గ్యాస్ కనెక్షన్లు లేవు.  గ్రామంలో గుడి నిర్మించలేదు. భూములిచ్చి ఇతర మండలాలకు, ఇతర జిల్లాలకు వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యంత దుర్భరమైన జీవితాలను గడుపుతున్నాం. సర్వం కోల్పోయి పరిహారం కోసం అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా పట్టించుకునే నాథుడే కరవయ్యారు. మా  త్యాగానికి విలువ లేకుండా పోతోంది. పరిహారం త్వరగా అందించకుండా  నలిపేస్తున్నారు . భూములను కోల్పోయిన రైతులు పొట్టకూటి కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారు. ఇంతకాలం ఉన్న ఊళ్లో నలుగురికి ఉపాధి చూపించిన రైతులు ఇప్పుడు బతకడం కోసం కూలీలుగా మారుతున్నారు”.
పోరాటాల ఫలితం
సుప్రీం ధర్మాసనం- భూసేకరణ చట్టాన్ని సంస్కరించాలని , పరిశ్రమలు, సెజ్‌ల ఏర్పాటుకోసం ప్రభుత్వం భూ సేకరణదారుగానే కాదు, పేదల పక్షాన వారి ప్రయోజనాల పరిరక్షకురాలిగానూ వ్యవహరించాలని సూచించింది. భూసేకరణ జరగకముందున్న జీవన స్థితిగతులే ఆ తరువాతా కొనసాగేలా నిర్వాసితులకు పరిహారం ఉండాలని లా కమిషన్‌ 1958లో సూచించింది. సాగుకు పనికిరాని పడావు భూముల్లోనే ప్రత్యేక ఆర్థికమండళ్లను అనుమతించాలంటూ 2006నాటి నైనిటాల్‌ సదస్సులో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులకు సోనియా చెప్పారు. ప్రైవేటు పరిశ్రమల కోసం ప్రభుత్వం రైతుల భూమి ఎందుకు సేకరించాలి? బలవంతపు భూసేకరణ  రైతు జీవితాలను ఛిద్రం చేస్తుంది. రైతులకు భూమి తప్ప ఇంకేముంది? అత్యవసరమైతేనే భూ సేకరణ జరపాలి. అదీ పనికిరాని భూములనే సేకరించాలి” అని అజిత్‌ సింగ్‌, మేధా పాట్కర్ ,మమతా బెనర్జీ ,ములాయంసింగ్‌ యాదవ్‌ లాంటివారు ప్రశ్నించారు.
ఈ నేపద్యం లో "జాతీయ భూసేకరణ -నష్ట పరిహారం, పునరావాస చట్టం-2011 వచ్చింది. 29.7.2013 న చరిత్రాత్మక భూసేకరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించింది.ప్రాజెక్టుల నిర్వాసితులకు సహాయ పునరావాస  ప్యాకేజీల ద్వారా  మానవీయ కోణంలో న్యాయం చేయటం. రైతులకు న్యాయబద్ధంగా, హేతుబద్ధంగా పరిహారం అందించడం, బలవంతపు భూ సేకరణను నివారించడం , సేకరణ వల్ల భూమి కోల్పోయిన వారిని సేకరణ అనంతరం జరిగే అభివృద్ధిలో భాగస్వాములను చేయడం, వారి సామాజిక, ఆర్థిక స్థాయిని మెరుగుపర్చడం బిల్లు ప్రధాన లక్ష్యాలు.
2013 భూసేకరణ బిల్లులోని ముఖ్యాంశాలు
 గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్‌ విలువకు నాలుగు రెట్ల దాకా, పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్ల దాకా పరిహారం అందివ్వాలి.
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) ప్రాజెక్టులకు భూసేకరణ చేయాలంటే 70 శాతం దాకా, ప్రైవేటు కంపెనీలకు భూసేకరణ చేయాలంటే 80 శాతం దాకా తప్పనిసరి సమ్మతి ఉండాలి.
 భూమికి భూమి, ఇళ్ల మంజూరు, ఉపాధి, సేకరించిన భూమికి ఏకమొత్తంలో చెల్లించిన నగదుకు అదనంగా జీవితాంతం వడ్డీ లాంటి ప్రతిఫలం తదితర ప్రయోజనాలు.
గతంలో భూసేకరణ జరిగీ, పరిహారం ఇవ్వని కేసులకూ ఈ చట్టం వర్తింపు.
షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గ్రామసభల ఆమోదం లేకుండా భూసేకరణకు వీల్లేదు. పరిహారం పూర్తిగా చెల్లించేంతవరకు, పునరావాసానికి ప్రత్యామ్నాయ స్థలాలు సిద్ధం చేసేంతవరకు ఎవరి దగ్గర నుంచీ భూమిని తీసుకోవడానికి వీల్లేదు.
ఆహారభద్రతకు భంగం కలగకుండా, ఏకపక్షంగా భూసేకరణ జరగకుండా ఉండేందుకు వ్యవసాయ భూముల సేకరణపై పరిమితులు విధించాలని రాష్ట్రాలకు సూచన.
సేకరణ జరిగిన తర్వాత భూమిని ఉపయోగించుకుండా ఖాళీగా అట్టిపెడితే... ఆ భూమిని తిరిగి సొంతదారుకు అప్పగించడం లేదా రాష్ట్ర భూ బ్యాంకుకు జమ చేసే అధికారం రాష్ట్రాలకు.
భూమిని అప్పగించిన వ్యక్తికి అందే మొత్తంపై ఆదాయపు పన్ను విధించరాదు. స్టాంపు రుసుం వసూలు చేయరాదు.
సేకరించిన భూమిని మూడో పార్టీకి అధిక ధరకు విక్రయించిన పక్షంలో లాభంలో 40శాతాన్ని అసలు సొంతదారుకు ఇవ్వాలి.
ప్రాజెక్టుల్లో భూమిని కోల్పోయే ఎస్సీ/ఎస్టీ వర్గాల వారికి భూమికి భూమి ఇవ్వాలి .వారిని మరో జిల్లాకు తరలించాల్సి వస్తే అదనంగా 25శాతం పునరావాస పరిహారం చెల్లించాలి.
*చైనాలో 'త్రీ గోర్జెస్' డ్యామ్ నిర్మాణ వ్యయంలో ఇంచుమించు సగాన్ని పదమూడు లక్షలమంది నిర్వాసితుల పునరావాస కార్యక్రమాలకే ప్రత్యేకించారు.వారికి జీవితకాల పింఛను, శాశ్వత వసతి కల్పించారు"

*జపాన్‌లో  

స్వాధీనం చేసుకున్న భూమికి బదులుగా అటువంటి భూమినే అంతే పరిమాణంలో మరో చోట కొనుగోలు చేసుకోవడానికి అవసరమైన ధనం సమకూరుస్తారు.కొత్త ప్రాంతానికి తరలివెళ్ళి,అక్కడ పునరావాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అయ్యే వ్యయాన్ని భరిస్తారు.కొత్త ప్రదేశానికి తరలివెళ్ళడంలో కోల్పోయే లాభాన్ని కూడా చెల్లిస్తారు.స్వాధీనం చేసుకున్న భూమికి భవిష్యత్తులో లభించే ధరలో వాటా ఇస్తారుప్రాజెక్ట్‌ను నిర్మించడం వల్ల స్వాధీనం చేసుకొనే భూమి ధరను పెంచుతారు.పునరావాసం ఏర్పాటు చేసుకోవడానికై కొత్త ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవడంలో అయ్యే వ్యయాన్ని భరిస్తారు.భూమిని పరస్పర సంప్రతింపుల ద్వారానే కొనుగోలు చేస్తారు.భూమి అవసరం సాధ్యమైనంత తక్కువగా ఉండేలా ప్రాజెక్ట్‌కు పునఃరూపకల్పన చేస్తారు.
మిగులు మనుషులు-అక్కరలేని మనుషులు
నిర్వాసితులు కొత్త స్థలంలో  కొత్త జీవితాన్ని మొదలుపెట్టేలా మంచి వసతులతో కూడిన పున:స్థిరీకరణ, పునరావాసం ఉంటే వాళ్ళను వాళ్ళే త్వరగా ఉద్ధరించుకుంటారు. కాని నిర్వాసితులు ప్రభుత్వం ఇచ్చే తాయిలాల మీద మాత్రమే ఆధారపడి, దీర్ఘకాలం పరాన్నభుక్కు జీవితాలు  గడిపేలాగా పునరావాస కార్యక్రమం నడుస్తుంది.  ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించే రక్షకురాలిగా కనబడకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచుకొని  వారు సంఘవ్యతిరేక శక్తులుగా మారి, అసాంఘిక కార్యకలాపాలకు దిగుతున్నారు. మరికొందరు భవిష్యత్తు మీద ఏ ఆశాలేక విరక్తి చెంది ఆత్మహత్యలతో తనువులు చాలిస్తున్నారు.
నిర్వాసితులను శాంతింపజేయడానికి పాలకులుకూడా ఎప్పటికప్పుడు  ఎక్కువ తాయిలాల ఆశ చూపిస్తూ , కొత్త పథకాలను ప్రకటిస్తూ పోతారు తప్ప శాశ్వత పరిష్కారం చూపరు. నిర్వాసిత ప్రజలు తమదని చెప్పుకునే చిన్న మడిచెక్క కావాలని కోరుతారు. నిర్వాసితులకు ప్రధాన పాత్ర ఇవ్వకుండా, నిర్వాసితుల్ని  అభివృద్ధి కార్య క్రమాలలో కలుపుకోకుండా సమాజ పరివర్తన జరగదు.

నిర్వాసితులు ఆర్ధికశాస్త్ర పరిభాషలో ‘మిగులు మనుషులు’ మన సమాజ భాషలో “అక్కరలేని మనుషులు” అవుతారు.
సొంత స్థలం  ఆర్థిక స్తోమత లేనందువల్ల,మరేపనీ చేయలేక నిర్వాసితుల్లో ఇతరులపై ఆధారపడే   మానసికస్థితి తలెత్తుతుంది.ఈ మానసిక స్థితి వల్ల వాళ్లలో  చైతన్యం నశించి, చేష్టలుడిగిన ప్రేక్షకుల్లా మారి తమ తలరాతకు దేవుణ్ణి తిట్టుకుంటారు.వ్యవస్థనుంచి పరాయి అయిపో తారు. ప్రభుత్వం నుంచి ఇంకా ఇంకా ఎక్కువ తాయిలాలు వస్తాయని ఆశిస్తారు, రావాలని కోరుతారు. పాలకులు కూడా తమ పదవులు కాపాడుకోవాలి కాబట్టి  తాయిలాలు ప్రకటిస్తూనే ఉంటారు. నిర్వాసిత ప్రజలు తమకు వీలయినంత ఎక్కువ కావాలని కోరడం, సాధించడానికి ప్రయత్నించడం వల్ల దేశం మీద భరించరాని భారం పడుతుంది.భూమిని పొందిన ప్రైవేటు పారిశ్రామికవేత్తలెవరూ ఈ అదనపు భారాన్ని మోయరు.వాళ్ళు కూడా అనేక రకాల రాయితీలు అడుగుతారు.సాధించుకుంటారు.నిర్వాసితుడూ పెట్టుబడిదారుడూ ఇద్దరూ తృప్తిగా ఉండరు. నిర్వాసితుల్లో వంటరితనం, కుటుంబ సభ్యుల్ని, బంధుమిత్రుల్ని కోల్పోవడం – కుంగుబాటు, దిగులు, ఆందోళన, భయం, సామాజిక సంబంధాలు తెగిపోవడం, మారిపోవడం – హింస, నేరం పెరిగిపోవడం –ఆడపిల్లలను స్త్రీలను అమ్మివేయడం లేదా ‘కాంట్రాక్ట్’ పనుల్లో కుదర్చడం, పనికొరకు విదేశాలకు  పంపడం – నిత్యకృత్యం అవుతాయి . 



భూమితో అనుబందం
నిర్వాసితులు ఎవరైనా పుట్టి పెరిగిన ప్రాంతం నుంచి మరొక కొత్త ప్రదేశానికి తరలి వెళ్ళడానికి ఎంతో ఘర్షణ మనోవేదన పడతారు. పుట్టిన నేలను విడిచి కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా కొత్త జీవన మార్గాలను ఆవిష్కరించుకోవడం నిర్వాసితులకు పెద్ద క్షోభ కలిగిస్తుంది. ప్రవాస జీవితం లోని ప్రయాస అనుభవించినవారికే తెలుస్తుంది.
కులం, మతం,వివక్ష మూర్తీభవించిన మన దేశ వ్యవస్థలోనైతే ఆ కష్టాలు ఇంకా  ఎక్కువ .
కొత్త ప్రాంతానికి తరలి వెళ్తున్నపుడు కొత్త ఇల్లు నిర్మించుకోవడం , జీవితాన్ని పునర్మించుకోవడం చాలా కష్టం,కఠినం. ముంపుకు గురైన నిర్వాసితులు సంక్షోభాన్ని నిబ్బరంగా నిలకడగా ఎదుర్కొంటానికి  ఎంత గుండే ధైర్యం కావాలి? ఎన్ని వాగ్దానాలు కావాలి? కుటుంబ సభ్యులు ఇంటి యజమానులకు చేదోడు వాదోడుగా ఉండి ఓదార్చాలి. కష్టపడేవాళ్ళకు కంచంలో వెలితి ఉండదు. ఆ కట్టమీదకు పోయి తట్ట ఎత్తినా కడుపు నిండుతుంది. ఏడవద్దు అని కన్నీరు తుడవాలి.
మాతృభూమి, పురిటిగడ్డ, జన్మభూమి, పశువులు పరిసరాల చుట్టూ ఉన్న ప్రకృతితో కలిగే సంబంధాలన్నీ  అనిర్వచనీయ బంధాలు. 
బహుళ జాతి కంపని మాయల్లోనలిగి పోయి కుమిలిపోయిన భారత పల్లెల దుస్థితి గురించి  గోరటి వెంకన్నగారు రాసిన పాటను వందేమాతరం శ్రీనివాస్ గారు పాడారు.ఈ పాట అర్ధంచేసుకుంటూ వింటే కన్నీళ్ళు పెట్టనివాడుండడు.

పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల,
నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల

కుమ్మరి వామిలో తుమ్మలు మొలిచెను
కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను
పెద్దబాడిస మొద్దు బారినది
సాలెల మగ్గం సడుగులిరిగినవి.
చేతివృత్తుల చేతులిరిగిపాయే నా పల్లెల్లోనా
అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోనబాయే ఈ దేశం లోనా

మడుగులన్ని అడుగంటి పోయినవి
బావులు సావుకు దగ్గరయ్యినవి
వాగులు వంకలు ఎండిపోయినవి
చాకలి పొయ్యిలు కూలిపోయినవి
పెద్దబోరు పొద్దంతా నడుస్తుందో బలిసీన దొరలది
మరి పేద రైతుల బావులెందుకెండే నా పల్లెల్లోనా

ఈదులన్నివట్టిమొద్దులయ్యినవి
ఈతకల్లు బంగారమయ్యినది
మందుకలిపిన కల్లును దాగిన
మంది కండ్లనెండూసులయ్యినవి
చల్లని బీరు విస్కిలెవడు పంపె నాపల్లెల్లోకి
బుస్సున పొంగె పెప్సికోల వచ్చె నాపల్లెల్లోకి

పరకచేపలకు గాలాలేసే తురకల పోరలు యాడికి పోయిరి
లారీలల్ల క్లీనర్లయ్యిరా, పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా
తల్లీ దూదు సేమియాకు దూరమయ్యినారా సాయిబుల పోరలు
ఆ బేకరి కేఫులో ఆకలితీరిందా ఆ పట్టణాలలో

అరకల పనికి ఆకలిదీరక గడమనగలకుగాసమెల్లక
ఫర్నీచరు పనులెదుక్కుంటూ పట్నంపోయర విశ్వ కర్మలూ
ఆసామూలంతా కూసూనేటీ వడ్రంగుల వాకిలి
నేడు పొక్కిలి లేసి దు:ఖిస్తున్నదిరో నా పల్లెల్లోనా

మేరోళ్ళ చేతులకత్తెర మూలపోయి సిలువెక్కిపోయినది
చుట్టుడురెక్కల బనీన్లు బోయినవి కోడెలాగులు జాడకేలేదు
రెదీమేడు ఫ్యాషన్ దుస్తులొచ్చెనంటా నా పల్లె పొలిమేరకు
ఆ కుట్టు మిషన్ల చప్పుడాగినాదా నా పల్లెల్లోనా

నానా కెంపుతెల్లలు జెల్లలు
పరులకు తెలియని మరుగు భాషతోబేరం జేసే
కంసలి వీధులు వన్నె తగ్గినవి చిన్నబోయినవి
చెన్నై బాంబె కంపని నగలొచ్చి మనస్వర్ణ కారుల,
అరె చెర్నకోలలై తరుముతున్నయీరా మనపల్లెలనుంచీ.

మాదిగ లొద్ది నోరు తెరచినది, తంగెడు చెక్క భంగపడ్డది
తొండం బొక్కెన నిండమునిగినది, ఆరె రంపె పదునారిపోయినది
పాత రేకు వలె మోతలు మోగేటి ప్లాస్టిక్కు డప్పులు
నా మేదరి డప్పును పాతరేసె కదరా? నాపల్లెల్లోనా.

కుంకుమ దాసరి బుక్కమీదగూడ కంపెనీ రక్కసి కన్నుబడ్డది
పూసలోల్ల తాలాము కప్పలు, కాశీల కలసి ఖతమౌతున్నవి
బొట్టు బిళ్ళలూ నొసటికొచ్చెగదరా నా పల్లెలజూడా
మన గుడ్డి దాసరీ బతుకులాగమాయే ఈపల్లెల్లోనా

ఇల్లు కట్టుకొనె ఇటుకల రాయితో, సెలకల చల్లె ఎరువుకుళ్లుతో
ఎద్దు బండి ఉన్నోనికి సేతిలో ఏడాదంతా పని దొరికేది
టాటా ట్రాక్టరు టక్కరిచ్చినాదో, నా డొంక దారిని
నా ఎద్దు బండి గిల్లెగిరిపడ్డదమ్మో నా పల్లెల్లోనా.

తొలకరి జల్లుకు తడిసిన నేల
మట్టిపరిమళాలేమైపాయెరా
వానపాములు నత్త గుల్లలు భూమిలో ఎందుకు బతుకతలేవూ
పత్తిమందుల గత్తర వాసనరా ఈ పంట పొలాల
ఆ మిత్తికి దెచ్చిన అప్పే కత్తాయే నా రైతు కుతికెపై

హరిశ్చంద్ర పద్య నాటకాల పంతులార్మోనియం చెదలు పట్టినది
యక్షగానము నేర్పేపంతులు ఉప్పరి పనిలో తట్టపట్టినడు.
యాచకులు, నా బుడగా జంగాలూ, ఈ పల్లెల నిడిచీ
దేవా హరిహరా ఓ
ఆ పాతబట్టల మూటలమ్ముతుండ్రా తమపొట్టకూటికై

పిండోలెన్నల రాలుచుండగ రచ్చబండపై కూసొని ఊరే
ఎనకటి సుద్దులు ఎదలూ కదలూ యాదిజేసుకొని బాధలె మరిచిరి
బుక్కనోటిలో బడ్డదంటే నేడు మన పల్లెల్లోనా
అయ్యో ఒక్కడు రాతిరి బయటకెళ్ళడమ్మో ఇది ఏమి చిత్రమో

బతుకమ్మాకోలాటపాటలు భజన కీర్తనలమద్దెల మోతలు
బైరాగుల కిన్నెర తత్వమ్ములు కనుమరుగాయెర నాపల్లెల్లో
అరె స్టార్ టీవీ సకిలిస్తాఉన్నదమ్మో నా పల్లెల్లోనా
సామ్రాజ్య వాద విషమెక్కుతున్నదమ్మో మెల్లంగా పల్లెకు

వృత్తులు కూలె ఉపాధి పోయె, ప్రత్యామ్నాయం లేకనె పోయె
కూలిన బ్రతుకులు నిలుపుటకైనా కుటీర పరిశ్రమలైనా పెట్టరు.
అరె బహుళ జాతి కంపని మాయల్లోనా మా అన్నల్లారా
భారత పల్లెలు నలిగి పోయి కుమిలె ఓ అయ్యల్లారా.
 

సూర్య 7.12.2013
http://www.suryaa.com/opinion/edit-page/article-161837

https://www.facebook.com/photo.php?fbid=675715882460405&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater

10, నవంబర్ 2013, ఆదివారం

కొత్త రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటు ప్రగతికి తోడ్పాటు



కొత్త రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటు ప్రగతికి తోడ్పాటు
నూర్ బాషా రహంతుల్లా 9948878833

కొత్త రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటు ప్రతిపాదనకు ఎప్పటికప్పు డు బ్రేకులు పడుతున్నాయి. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి, నేతల ఒత్తిళ్ళు ఈ ప్రతిపాదనను కార్యరూపం దాల్చకుండా మోకాలడ్డు తున్నాయి. ఇద్దరు, ముగ్గురు మంత్రులున్న కొన్ని జిల్లాల్లో అక్కడ కొత్త రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటులో తనదంటే తన మాట నెగ్గాలనే ఆదిపత్యపోరు అసలుకే ఎసరు తెస్తోంది. దానికితోడు ప్రత్యేక సమైక్య ఉద్యమాలు; అన్నీ  వెరసి కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కాకుండా రాజకీయ గ్రహణం పట్టింది.

మండలాల ఏర్పాటుతో మొదలు  
57 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మండలాల ఏర్పాటు మహా గొప్ప పాలనా సంస్కరణ.క్షేత్రస్థాయిలో ఇదే అతి గొప్ప వికేంద్రీకరణ. పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రజలంతా హర్షించిన సంస్కరణ . అలాగే కొత్త రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని మన నేతలు కసరత్తులు  చేసారు కానీ  శాస్త్రీయ పద్ధతిలో పూర్తిగా అమలు కాలేదు. చేయగలిగితే ప్రజలకు అది కూడా గొప్ప వరం అవుతుంది. కొత్త రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటు వలన ప్రజలకు ప్రయాస తగ్గి, మెరుగైన పాలన అందుతుంది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం, ఆరు జోనుల్లోను జోనల్ రెవిన్యూ కార్యాలయాలు తెరవటం వల్ల రాష్ట్ర ప్రజలకు ఎంతో వెసులుబాటు కలుగుతుంది. రాజధాని నగరం మీద పెనుభారం తగ్గుతుంది. ప్రజలకు ఖర్చు తగ్గుతుంది. పేదవారికి పాలనా సదుపాయాలు చేరువవుతాయి.
కొత్త రెవిన్యూ డివిజన్ల కోసం ప్రతిపాదనలు
కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్,లేదా హుస్నాబాద్, ఖమ్మం జిల్లా లో కల్లూరు లేదా సత్తుపల్లి, కడప జిల్లాలో బద్వేలు లేదా పులివెందుల,గుంటూరు జిల్లాలో బాపట్ల, ప్రకాశం జిల్లాలో అద్దంకి లేదా మార్టూరు,కృష్ణా జిల్లాలో నందిగామ, నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరు, అనంతపురం జిల్లాలో తాడిపత్రి లేదా గుంతకల్లు, మెదక్ జిల్లాలో జహీరాబాద్ లలో రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తారని వార్తలొస్తున్నాయి.కర్నూలు,చిత్తూరు జిల్లాల నుండి ప్రతిపాదనలు ఇంకా రావలసి ఉందట.ఇలా ఎవరికి బలమున్న చోట్ల వారు డివిజన్ కేంద్రాన్ని సాధించుకోవటం కాకుండా  డివిజన్ల ఏర్పాటులో ఒక ప్రామాణిక పద్ధతిని ముందు నిర్ణయించాలి.    

గజిబిజి
అరకు పార్లమెంటు స్థానానికి పాడేరు డివిజన్ కేంద్రం.అలాగే జహీరాబాదుకు  కామారెడ్డి,బాపట్ల కు  తెనాలి ,హిందూపురం కు  ధర్మవరం ,రామగుండం కు మంచిర్యాల డివిజన్ కేంద్రాలు.ఇలా కొన్ని చోట్ల అసెంబ్లీ ,పార్లమెంటు నియోజకవర్గాలకు రెవిన్యూ డివిజన్లకూ భౌగోళిక హద్దుల సారూప్యత సామీప్యత ఏకరూపత లేదు.ఒక అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతం రెండు మూడు నాలుగు రెవెన్యూ డివిజన్ల లో కూడా ఉంది.ఉదాహరణకు పామర్రు శాసన సభ నియోజకవర్గం  మచిలీపట్నం,గుడివాడ,నూజివీడు,విజయవాడ అనే నాలుగు రెవిన్యూ డివిజన్లలోనూ ఉంది.అలాంటి చోట్ల  ఎమ్మెల్యే ఏదైనా పని కావాలంటే నలుగురు ఆర్డీవోలను సంప్రదించాలి పర్యవేక్షించాలి.ప్రజలకు కూడా ఇలాంటి అమరిక ఎంతో శ్రమ కలిగిస్తుంది.

కొత్త రెవెన్యూ డివిజన్లకు మార్గదర్శకాలు:

ఇలాంటి గజిబిజి గందరగోళాన్ని నివారించి పాలనా యూనిట్లలో స్పష్టత సౌలభ్యతా తేవటానికి భూపరిపాలన కమీషనర్ అధ్యకతన ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది :

  • ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో 10-15 మండలాలు, 2-3 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉంటాయి. చిట్టచివరి మండలం కూడా రెవెన్యూ డివిజన్ కేంద్రానికి 70 కిలోమీటర్ల పరిధిలోనే ఉండాలి.
  • గిరిజన ప్రాంతాల్లోనైతే ఈ దూరం 50-60 కిలోమీటర్లలోపు ఉండేలా చూడాలి.వీలైతే ఏజెన్సీ మండలాలన్నీ ఒక రెవెన్యూ డివిజన్ కిందకు తీసుకురావాలి, పట్టణ ప్రాంతాల్లో 7-9 మండలాలతోనే ఒక డివిజన్ ఏర్పాటు చేయాలి.
  • డివిజన్ కేంద్రం దాని కిందకు వచ్చే మండలాలకు మధ్యలో ఉండాలి.

రెవిన్యూ డివిజన్లలో  జరిగే పనులు

భూమి శిస్తు వసూలు, జమాబందీ, చౌకడిపో డీలర్ల నియామకం, శాంతి భద్రతలు, భూసేకరణ , రెవిన్యూ కోర్టుల నిర్వహణ, పంచాయతీ ల పర్యవేక్షణ, ఆహారధాన్యాల కొనుగోలు, జనాభా లెక్కల సేకరణ, ఎన్నికల నిర్వహణ, పొదుపు పధకాలు, పెన్షన్లు, సినిమాహాళ్ళ లైసెన్సులు, పంచనామా లు, భూతగాదాలు, ఇలా ఎన్నో పనులకు రెవిన్యూ డివిజినల్ అధికారులు హాజరవుతూ ఉంటారు.

ఆన్ లైన్ లో రెవిన్యూ సేవలు

ప్రజలకు ప్రయాణయాతన తప్పించే ఉద్దేశంతో భూమి రికార్డులు, జమాబందీ, పాస్ పుస్తకాలు ద్రువపత్రాలు, పాస్ పుస్తకాలు,కుల,నివాస,ఆదాయ ధృవపత్రాలు వంటి రెవెన్యూలోని కీలక సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే మీసేవ కేంద్రాలద్వారా అందజేస్తున్నారు.రిజిస్ట్రేషన్ చేస్తున్న భూమి ప్రభుత్వానిదా? అసైన్‌మెంట్‌దా? పోరంబోకా? అన్నది తెలియడం కోసం  ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండటం కోసం  తహసిల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం చేసి భూముల క్రయ, విక్రయాల్లో రెండు శాఖల మధ్య సమన్వయం తీసుకొస్తున్నారు.

అసెంబ్లీ స్థానాలతో సమానంగా రెవిన్యూ డివిజన్లు లేవు  

ప్రస్తుతం రెవిన్యూడివిజన్లు  ఆంధ్ర లో  35,రాయలసీమ లో 15,తెలంగాణా లో 42 ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలుంటే , రెవిన్యూ డివిజన్లు 92 మాత్రమే ఉన్నాయి.జిల్లాల వారీగా రెవిన్యూ డివిజన్లు ఇలా ఉన్నాయి: 1.శ్రీకాకుళం: శ్రీకాకుళం , పాలకొండ , టెక్కలి 2. విజయనగరం: విజయనగరం , పార్వతీపురం 3. విశాఖపట్నం: విశాఖపట్నం , పాడేరు , నర్సీపట్నం , అనకాపల్లి 4. తూర్పుగోదావరి: కాకినాడ , పెద్దాపురం , రంపచోడవరం , రాజమండ్రి , అమలాపురం , రామచంద్రాపురం 5. పశ్చిమ గోదావరి: ఏలూరు , నర్సాపురం , కొవ్వూరు , జంగారెడ్డిగూడెం 6. కృష్ణా: మచిలీపట్నం , గుడివాడ , విజయవాడ , నూజివీడు 7. గుంటూరు: గుంటూరు , తెనాలి , నరసరావుపేట , గురజాల 8. ప్రకాశం: ఒంగోలు , మార్కాపురం , కందుకూరు 9. పొట్టి శ్రీరాములు నెల్లూరు: నెల్లూరు , గూడూరు , కావలి ,నాయుడుపేట , ఆత్మకూరు 10.వైఎస్సార్  కడప: కడప , రాజంపేట , జమ్మలమడుగు 11. కర్నూలు: కర్నూలు , ఆదోని , నంద్యాల 12. చిత్తూరు: చిత్తూరు , తిరుపతి , మదనపల్లి , చంద్రగిరి 13. అనంతపురం: అనంతపురం , పెనుగొండ , ధర్మవరం, కళ్యాణదుర్గం , కదిరి 14. హైదరాబాదు: సికింద్రాబాదు , హైదరాబాదు 15. రంగారెడ్డి: వికారాబాదు , చేవెళ్ళ , రంగారెడ్డిఈస్ట్ ,రాజేంద్రనగర్ , మల్కాజ్ గిరి 16. మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ , వనపర్తి , నాగర్‌కర్నూల్ , నారాయణపేట , గద్వాల 17. కరీంనగర్: కరీంనగర్ , పెద్దపల్లి , జగిత్యాల , సిరిసిల్ల , మంథని 18. నిజామాబాద్: నిజామాబాద్ , బోధన్ , కామారెడ్డి 19. వరంగల్: వరంగల్ , మహబూబాబాద్ , పరకాల , జనగాం , నర్సంపేట 20. ఖమ్మం: ఖమ్మం , పాల్వంచ , కొత్తగూడెం , భద్రాచలం 21. నల్గొండ: నల్గొండ , మిర్యాలగూడ , భువనగిరి , సూర్యాపేట , దేవరకొండ 22. సంగారెడ్డి: సంగారెడ్డి , మెదక్ , సిద్దిపేట 23. ఆదిలాబాద్: ఆదిలాబాద్ , ఆసిఫాబాద్ , ఉట్నూర్ , నిర్మల్ , మంచిర్యాల.

రైలు మార్గాలు లేని రెవిన్యూడివిజన్ కేంద్రాలు 25.

25 రెవిన్యూ డివిజన్ కేంద్రాలకు ప్రజలు చేరుకునేందుకు రైలు మార్గాలు ఇంకా ఏర్పడలేదు. శ్రీకాకుళం,మెదక్,భద్రాచలం,అమలాపురం,నాగర్ కర్నూల్,ఉట్నూర్,బోధ్,పాలకొండ,చేవెళ్ళ,నారాయణపేట,వనపర్తి,జమ్మలమడుగు,మదనపల్లి,కందుకూరు,కొత్తగూడెం,పరకాల,నర్సీపట్నం,పాడేరు,సూర్యాపేట,రంపచోడవరం,జంగారెడ్డిగూడెం,పాల్వంచ,సంగారెడ్డి,రామచంద్రాపురం,దేవరకొండ.ఈ 25 డివిజన్ కేంద్రాలకూ రైలుమార్గాలు విస్తరిస్తే రాష్ట్రం చాలావరకు బాగుపడినట్లే.
కంటితుడుపు కమిటీలు – కాలయాపన
1956 లో మన రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్టమొదట 1957 లో ఆర్థిక కమిటీ ప్రభుత్వ పాలనలో పొదుపు చర్యలు సూచించటానికి  ఏర్పడింది. ఆ తరువాత పాలనా సంస్కరణల గురించి 1960 లో ఉన్నితన్ కమిటీ, 1964 రామచంద్రారెడ్డి కమిటీ, 1967 లో ఎంటి రాజు కమిటీ, 1976 లో ఎన్జీవోల సదస్సు, 1980 లో లాల్ కమిటీ, చంద్రశేఖర్ కమిటీ, 1981 లో శ్రీరాములు కమిటీ, 1985 లో రుస్తుంజీ కమిటీ ఎన్నో సూచనలు చేశాయి. వాటిలో కొన్ని అమలు అయ్యాయి. కొన్ని సిఫారసులు నేటికీ అమలు కాలేదు. జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలని, వివిధ డైరెక్టరేట్లను సెక్రటేరియట్ లో విలీనం చెయ్యాలని 1960 లో ఉన్నతన్ కమిటీ సిఫార్సు చేసింది. పంచాయతీరాజ్, మున్సిపల్, రెవిన్యూ శాఖలను విలీనం చెయ్యాలని 1964 లో రామచంద్రారెడ్డి కమిటీ సిఫార్సు చేసింది. పౌరసరఫరాల బాధ్యతలను జిల్లా కలెక్టర్ల నుంచి తప్పించాలని 1967 లో ఎం.టి.రాజు కమిటీ నివేదించింది. ఈ సిఫార్సులేవీ ఈనాటికీ అమలుకు నోచుకోలేదు.  అలాంటప్పుడు అసలు ఆ కమిటీలను ఎందుకు నియమించినట్లు ? సమస్య పరిష్కారం పట్ల నిజమైన శ్రద్ధ ఉండి, సమగ్ర నివేదికల కోసం కమిటీలను ఏర్పాటు చేస్తే ఆ కమిటీల సిఫార్సులను అమలు చేయాలి. అంతేగాని ప్రతిపక్షాలు కోరాయనో, ప్రజలు అడిగారనో కంటితుడుపుగా ఏర్పాటుచేసే కమిటీలు ఖజానాకు భారమే తప్ప వాటి వల్ల ప్రజలకు ఒరిగేదేమిటి ?

ఎమ్మెల్యేకొక ఆర్డీవో ఉంటేనే స్పష్టత ,సౌలభ్యం
1956 లో ఒక్కొక్క రెవిన్యూ డివిజినల్ అధికారి 4 లక్షల ప్రజల అవసరాలకు హాజరయ్యేవాడు. ఇప్పుడు 10 లక్షల మందికి పైనే ప్రజలు ఒక్కొక్క ఆర్.డి.ఓ. పరిధిలో ఉంటున్నారు.రెవిన్యూ డివిజన్ల సంఖ్య జనాభాకు అణుగుణంగా పెరగాల్సి ఉంది.ప్రతి ఎమ్మెల్యే నియోజక వర్గాన్నీ ఒక డివిజన్ గా ప్రకటిస్తే బౌగోళిక సరిహద్దులు ఎమ్మెల్యేకి, డిప్యూటీ కలెక్టర్ కు సమానంగా ఉంటాయి. పాలనా వ్యూహాలు ఉమ్మడిగా రూపొందిస్తారు.ఇద్దరూ ఒకే ప్రాంగణంలో ప్రజలకు దొరుకుతారు.ఎమ్మెల్యేలకు కూడా కార్యాలయ భవనాలు శాశ్వతంగా ఏర్పడతాయి. పోలీసు శాఖలో ప్రతి ఎమ్మెల్యేకి ఒక డిఎస్పీ వచ్చేలా చేశారు.అదేపద్ధతి రెవిన్యూలో కూడా పాటిస్తే  ఒక ఎం.పీ.కి ఒక కలక్టర్, ఒక ఎమ్మెల్యే కు ఒక ఆర్.డి.వో. అనే పద్దతిలో రాష్ట్రం  42 జిల్లాలు,294 రెవిన్యూ డివిజన్లు గా చేయాల్సి వస్తుంది. రాయలసీమలో 37 కోస్తాలో 88 తెలంగాణా లో 77 మొత్తం రాష్ట్రంలో ఇంకా 202 కొత్త రెవిన్యూ డివిజన్లు ఏర్పడాలి. అవసరమైతే రెవిన్యూ,పంచాయతీరాజ్,మునిసిపల్ లాంటి శాఖలను ఒకటిగా కలిపి సీనియర్ అధికారుల్ని శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి అధికారులుగా ప్రజాసేవకోసం వినియోగించుకోవాలి.రాష్ట్రం కలిసున్నా విడిపోయినా ఇలాంటి పాలనా సంస్కరణలు మాత్రం చేపట్టక తప్పదు.ఇది చారిత్రక ప్రజావసరం.
 సూర్య 10.1.2014
https://www.facebook.com/photo.php?fbid=693090090722984&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater



5, నవంబర్ 2013, మంగళవారం

ఆరోగ్య రక్షణ కోసం అందరికీ మరుగు దొడ్లు


 
ఆరోగ్య రక్షణ కోసం అందరికీ  మరుగు దొడ్లు 
నూర్ బాషా రహంతుల్లా 9948878833


"నూట ఇరవై కోట్ల భారత జనాభాలో 53 శాతానికి రోజువారీ కనీస అవసరమైన మరుగుదొడ్లు అందుబాటులో లేవు. దాదాపు సగానికిపైగా అంటే 60 కోట్ల మందికిపైగా భారతీయులు రోజూ బహిర్భూమిలోనే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు.ఇది పౌష్టికాహారలోపానికి మూలకారణమవుతోంది.ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల మందికి మరుగుదొడ్లు అందుబాటులో లేవు.వందకోట్ల మంది బహిర్భూమిలోనే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు.పారిశుద్ధ్యం పెంచితే పిల్లల్లో పరోక్షజ్ఞానం పెరుగుతుంది".ఐక్యరాజ్య సమితి తొలిసారిగా ప్రపంచ మరుగుదొడ్డి దినాన్ని 19.11.2013 న నిర్వహించిన సందర్భంగా ప్రపంచ బ్యాంకు నివేదికలోని మాటలివి.



“ఆరోగ్య రక్షణ మానవ హక్కు” అనే అంశం మీద డిల్లీలో 5.11.2013 న జాతీయ సదస్సు జరిగింది.ఆ సదస్సులో “ఆరోగ్యాన్ని మించిన ప్రాథమిక హక్కేదీ లేదు. దేశంలో ప్రజారోగ్య సేవలు అంతంతమాత్రంగా ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చాలా ఖరీదు అయ్యింది. ఆరోగ్య హక్కు కంటే ప్రాథమికమైనది ఇంకేమీ లేదు. ఆరోగ్య హక్కు విషయంలో కమిషన్‌ సందర్భోచితంగా స్పందిస్తుంది” అంటూ  జాతీయ మానవ హక్కుల కమిషన్‌ అధ్యక్షుడు జస్టిస్‌ కె.జి.బాలకృష్ణన్‌ ఎంతో విచారం వ్యక్తం చేశారు.”ప్రస్తుతం జీడీపీలో 1.2 శాతం మాత్రమే ప్రజారోగ్యానికి ఖర్చు చేస్తున్నాము. ఇది ఇంకా పెరగాలి , డబ్బుతో సంబంధం లేకుండా వైద్యం పొందే అవకాశాలు కల్పించాలి” అని  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి మనోజ్‌ ఝలానీ పేర్కొన్నారు. 
నేను అబ్బాయినయితే
 నేను అబ్బాయినయితే మూత్ర విసర్జన ఎక్కడయినా చేసుకోగలుగుతాను అని ఒక అమ్మాయి జవాబిచ్చింది.బహిరంగంగా చర్చించుకోవడానికి ఇష్టపడని విషయాల్లో మల మూత్ర విసర్జన అంశం ఒకటి. కనీస సౌకర్యాలు లేకపోవడం వల్ల కలిగే అనర్థాలపై చాలామందికి అవగాహన లేదు. అందుకే దీనిని అప్రధాన అంశంగా భావిస్తూ సమస్యను దాటవేస్తుంటారు. పట్టణ ప్రాంతాల్లో జనసమ్మర్దం ఎక్కువగా ఉండే బస్టాండులు, రైల్వేస్టేషన్లలో తగినన్ని మరుగుదొడ్లు లేకపోవడం, వాటి నిర్వహణలో లోపాల వల్ల కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. కలిమి కలిగినవారికి ఇదొక సమస్య కాకపోవచ్చు కాని, పట్టణ ప్రాంత మురికివాడల్లోని పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంత వాసులకు ఇదొక తీవ్ర సమస్యే. ప్రపంచవ్యాప్తంగా ఆరుబయట మల విసర్జన చేసే ప్రజల్లో అరవై శాతం మన దేశానికి చెందినవారే.

అశుద్ధ వాతావరణంలో ఆరోగ్య రక్షణ సాధ్యమేనా ?
కేంద్ర మంత్రి జయరాం రమేష్‌. గతంలో  దేశంలో మరుగు దొడ్ల కంటే మందిరాలే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని చెప్పినందుకు నిరసనలు ఎదుర్కొన్నారు. ఈ మధ్య గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా దేశానికి మందిరాలు కాదు, మరుగు దొడ్లు అవసరం , అందరికీ మరుగు దొడ్లు ఏర్పాటైతే అది దేశాభివృద్ధికి పెద్ద సూచికగా నిలుస్తుంది అన్నారు. మరుగు దొడ్లు ఏర్పాటు అంత సులభం కాదు. మరుగు దొడ్లు లేమి వల్ల పరిసరాల పరిశుభ్రత లోపించి కోట్లాదిమంది రోగాల బారిన పడుతున్నారు. జ్నానీ జైల్ సింగ్ రోజుల్లో నిషేధించినా ఈ రోజు కూడా మన దేశంలో తలపై తట్ట పెట్టుకుని అశుద్ధాన్ని మోసుకెళ్ళటం జరుగుతున్నది. బాలవుడ్‌ హీరో ఆమీర్‌ ఖాన్‌ ఈ మధ్యనే తన సత్యమేవ జయతే కార్యక్రమంలో ఈ అశుద్ధాన్ని మోసేవారి బాధలు చూపిస్తే ప్రధానమంత్రి ఆయన్ని స్వయంగా  పిలిచి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కానీ ఫలితం శూన్యం. అందరికీ సరైన మరుగు దొడ్లు ఏర్పడితే ఈ దురదృష్టాచారం రూపుమాసిపోతుంది. మరుగు దొడ్లకంటే ఆహారమే ఎక్కువ అవసరం అని వాదించేవారూ ఉన్నారు. ఆహార భద్రత చట్టం చేసింది అందుకేనంటుంది ప్రభుత్వం.’హృదయమే నీ ఆలయం’, ‘దేహమేరా దేవాలయం’ అని మనసులోనే మందిరాలు కట్టుకోవచ్చుకానీ మరుగు దొడ్లు మాత్రం మనసుల్లో కట్టుకోలేం. వాటికోసం తప్పనిసరిగా స్థలం కావాలి.నివసించటానికి రెండు సెంట్లు జాగా కూడా లేనివాళ్ళు మరుగుదొడ్డి మాకెందుకంటున్నారు.మరుగుదొడ్డి తప్పనిసరి చేస్తూ ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేసినా కొంతమంది మరుగుదొడ్డిని మరుగుపరచి మిగతా ఇల్లు కట్టుకున్నారు.

దేశంలో మొత్తం పేదల సంఖ్య 33  కోట్లు. దేశంలోని బాలల్లో 46 శాతంమందికి పౌష్టికాహారం లభించడంలేదు. ప్రతి లక్ష మందిలో 258మంది మహిళలు గర్భవతులుగా ఉన్న సమయంలో మృతి చెందుతున్నారు. 20 లక్షలమంది బాలలు ప్రతి సంవత్సరం తమ మొదటి జన్మదినంకు ముందే చనిపోతున్నారు.ప్రపంచంలోని క్షయవ్యాధి గ్రస్తులలో ఐదవ వంతుమంది మన దేశంలో ఉన్నారు. క్షయ వ్యాధి పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధి. పారిశుద్ధ్యం లేదు. దేశంలో సగంమంది ప్రజలకు మరుగుదొడ్లు అందుబాటులో లేవు. గ్రామీణ ప్రాంతాలలో అయితే మరుగుదొడ్ల  సదుపాయం లేని ప్రజల సంఖ్య 66 శాతం వుంది.వీళ్ళంతా చెంబు తీసుకొని ఊరి బయటకు వెళ్ళి అశుద్ధాన్ని తొక్కుకుంటూ మలవిసర్జన చేసి వస్తుంటారు.ఇంతటి అపరిశుభ్ర వాతావరణాన్ని పరిశుభ్రం చేయకుండా ప్రజల ఆరోగ్యాన్ని ఎలా రక్షిస్తారు? రోగం వచ్చాక మందులకు తగలేసేదానికంటే రోగం రాకుండా కాపాడుకోవటం మంచిదికదా?
నిర్మల భారత అభియాన్‌
ఈ కార్యక్రమం ఉద్దేశం దేశంలో అన్ని గ్రామాలలో ఉన్ననివాసాలలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయడమే. 2010 కల్లా బహిరంగ మల విసర్జన లేకుండా చేయాలనే లక్ష్యంతో 1999 లో భారత ప్రభుత్వం Total Sanitation Campaign అనే పధకం మొదలుపెట్టింది.2013 వచ్చినా ఫలితం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.ఎన్ని పధకాలు ప్రవేశపెట్టినా అందరికీ మరుగుదొడ్లు సమకూరటంలేదు.పైగా ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అన్నట్లు ఎవరికి తోచిన సలహా వారిస్తున్నారు. నిర్మల భారత్ సాధన కోసం మరుగుదొడ్లు,మూత్రశాలలూ విస్తారంగా నిర్మించాలి.


జైరాం రమేష్‌ ఉచితసలహాలు :
“భారతదేశంలో ప్రతిఇంటికి మరుగుదొడ్లు మంజూరు చేసే కార్యక్రమం చేపట్టాం. అత్త వారింట్లో  మరుగుదొడ్లు ఉంటేనే వివాహం చేసుకోవాలి . అత్తారింటిలో మరుగుదొడ్లు ఉంటేనే అత్తారింటికి వెళ్ళాలి  లేకుంటే పోనవసరం లేదు . గ్రామీణ ప్రాంతాలలో పలు నివాసాలలో  మరుగుదొడ్లు లేవు. ఇప్పటికీ ఆరు బయట మల విసర్జనచేస్తున్నారు. సాధారణంగా వివాహాలు జరిగే టపుడు వధూవరుల జాతకాలు చూస్తాము. కానీ వరుడి నివాసంలో మరుగు దొడ్లు ఉన్నాయా లేదా అనే విషయాన్ని విచారించాలి. తనభర్త నివాసంలో మరుగుదొడ్డి లేనందువలన  మధ్యప్రదేశ్‌లో అనితా నారే అనే ఆమె పెండ్లి అయినరెండు రోజులకే  పుట్టింటికి వెళ్లి పోయింది. మహిళల గౌరవాన్ని కాపాడే విధంగా మనం వ్యవహరించాలి.”
చందనా ఖాన్ నీతిసూత్రం :
ఐఏఎస్ అధికారిణి చందనా ఖాన్ “మరుగు దొడ్లు కడగటం శ్రమదానంగా భావింఛాలి.  పాకీ పనివాళ్ళు , ఆయాలు మాత్రమే ఈ పని చేయాలని భావించకూడదు. మహాత్మా గాంధీజీ స్వయంగా మరుగు దొడ్లు కడిగారు.మరుగుదొడ్లు కడిగితే విద్యార్థుల్లో సేవా భావం పెరుగుతుంది.వారిచేత పాఠశాలల్లో మరుగుదొడ్లను కడిగిస్తే మన పని మనం చేసుకోవడంలో తప్పులేదు అనే నీటిని వారికి నేర్పినట్లవుతుంది”  అని చెప్పి, పిల్లల తల్లిదండ్రుల నుండి నిరసన ఎదుర్కొన్నారు. 

ప్రకృతి వైద్యుల  హితబోధలు 
ప్రముఖ ప్రకృతి వైద్యుడు మంతెన సత్యనారాయణరాజు “సుఖ విరేచనం సుఖమయ జీవనం” అనే పుస్తకంలో మనిషి ఆరోగ్యానికి మలవిసర్జనకూ ఉన్న ఎన్నో లింకులు చక్కగా వివరిస్తారు.పశువులు పక్షులు మలవిసర్జనకు సంకోచించవనీ మలాన్ని కడుపులోనే ఆపుకోవనీ అలా మలాన్ని కడుపులోనే ఆపిఉంచి రోగాలు కొనితెచ్చుకుంటున్నది ఒక్క మనిషేననీ చెప్పారు.మసీదుల్లో మలమూత్ర విసర్జనకోసం మరుగుదొడ్లు ఖచ్చితంగా ఉంటాయి. మలమూత్ర విసర్జన చేయకుండా, అవయవాలు కడిగి శుభ్రం చేసుకోకుండా నమాజుకు రాకూడదని నియమం.భక్తుల ప్రకృతిపరమైన ఈ అవసరాన్ని గుర్తించి  మందిరాలన్నిటిలో ఏదో ఒక పక్కగా మరుగుదొడ్లు కడుతున్నారు.ఆయుర్వేద,ప్రకృతి వైద్యులందరూ మలబద్దకాన్ని రోగంగానే పరిగణించారు.పశుపక్షులన్నీ ఎక్కడబడితే అక్కడ మలమూత్ర విసర్జన చేస్తూ పరిసరాలను పాడు చేస్తుంటాయి.నాగరీకుడైన మానవుడు అలా చేయలేడు.అంగారక గ్రహం మీదకు ఉపగ్రహాన్ని పంపి అభివృద్ధి చెందిన దేశంగా మారిన మన దేశంలో నేటికీ భారతీయులకు  మలవిసర్జనకోసం సరైన శుభ్రమైన మరుగుదొడ్లు  లేకపోవటం సిగ్గుపడాల్సిన విషయం.  

మహిళల అవస్థలు
మరుగుదొడ్ల సౌకర్యం లేని కారణంగా అధికంగా ఇబ్బందుల పాలవుతోంది మహిళలే. చీకట్లో తప్ప మల విసర్జనకు అవకాశం లేని పరిస్థితుల్లో వీరు- అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. మలబద్దకం, మొలల సమస్య, అజీర్ణం వంటి సమస్యలకు ఇది కారణమవుతోంది. ఆరు బయట మల విసర్జన జరిగే ప్రాంతాల్లో పాదరక్షలు లేకుండా తిరగడం వల్ల బద్దెపురుగు బాక్టీరియా సోకే అవకాశం ఉంది.మున్సిపాలిటీ సామూహిక మరుగుదొడ్లు పనిచేయడంలేదు. నరకం అనుభవిస్తున్నాం. మహిళల బాధలను అర్ధం చేసుకోండి. మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురండి మీకు పుణ్యముంటుంది. అంటూ పట్టణాలలోని మహిళలు రచ్చబండ కార్యక్రమంలో వేడుకుంటూ ఉంటారు. పల్లెటూళ్ళలోనైతే రాత్రి చీకటి పడేదాకా ఆగి కడుపు బిగబట్టుకొని మహిళలు ఉరిబయటకు రోడ్ల మార్జిన్లలోకి పోతారు.మగవాళ్ళోస్తే సిగ్గుతో చితికిపోతూ లేచినిలబడుతుంటారు.మాలవిసర్జన ఆరోగ్యకరంగా , హాయిగా, సాఫీగా సాగదు.ఎన్నో అవాంతరాలు.మరుగుదొడ్లు లేని  ఆడవాళ్ళు మలవిసర్జన కోసం బయటికెళ్ళినప్పుడు అనేక చోట్ల అత్యాచారాలు కూడా జరిగాయి.
50 లక్షల కోట్ల రూపాయలనష్టం
మన దేశంలో శిశు మరణాలకు ప్రధాన కారణం డయేరియా, శ్వాసకోశ వ్యాధులు. మల విసర్జన తరవాత సబ్బుతో చేతులు కడుక్కునే చిన్న చర్య ద్వారా డయేరియాని 40శాతం, శ్వాసకోశ వ్యాధులను 30శాతం తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరుగుదొడ్ల వినియోగం లేకపోవడం, సరైన పారిశుద్ధ్య వసతులు లేకపోవడం వల్ల కలిగే అనారోగ్యంతో మనదేశం ఎంతో  నష్టపోతోంది.మన రాష్ట్రంలోని చాలా పట్టణాల్లో మరుగుదొడ్ల పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. రాష్ట్రంలోని సగం పాఠశాలల్లో మరుగుదొడ్ల సౌకర్యం లేదు. అరవై ఆరు శాతం పాఠశాలల్లో అమ్మాయిలకు శౌచాలయ సౌకర్యం లేదు. మరుగుదొడ్లు ఉన్నా వాటి నిర్వహణ లోపం వల్ల అవి నిరుపయోగమవుతున్నాయి. అమ్మాయిలు చదువు మానివేయటానికి ఇదీ ఓ కీలక కారణం.భారతదేశంలో మరుగు దొడ్లు అందరికీ అందుబాటులో లేనందువల్ల ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రతి యేటా సుమారు 50 లక్షల కోట్ల రూపాయల నష్టం సంభవిస్తూందట. ఈ నష్టం ఎలాగంటే బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన వల్ల కలిగే వ్యాధులనుండి వైద్యం చేయించుకోవడానికి , జబ్బు పడ్డందువల్ల పనులు మానేసి నందుకు, స్కూళ్ళలో టాయిలెట్లు లేక  అమ్మాయిలు చదువుమానినందుకు, శుభ్రత లేనందువల్ల విదేశీ టూరిస్టులు రానందుకు, ఇలా అన్ని కలిపి భారత దేశానికి ప్రత్యక్షంగా,పరోక్షంగా కలిగే నష్టం అన్నమాట.

పల్లెటూళ్ళు పట్టణాలలోని మురికి వాడల్లో బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జనవల్ల నీరు కలుషితమయ్యి ఆ నీటినే తాగడం వల్ల డయేరియా లాంటి అంటురోగాలొచ్చి జనం చనిపోతుంటారు.  మన దేశంలో 36 కోట్ల మందికే మరుగు దొడ్డి సౌకర్యం ఉంది. ఇందులో అధిక భాగం ఉమ్మడి మరుగుదొడ్లు . 
 
ఆరోగ్య శాఖ సూచనలు:
డయేరియా,కలరా,టైఫాయిడ్ లాంటి అనేక రకాల జబ్బులు మానవ మలంలోని  క్రిముల  కారణంగా వస్తాయి. ఈ క్రిములు వ్యాప్తి చెందకుండా మానవ మలాన్ని మరుగుదొడ్డి ద్వారా తొలగించాలి. మరుగు దొడ్డిని ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచాలి. మరుగుదొడ్డిని ఉపయోగించే సౌలభ్యం లేకపోతే, ప్రతి ఒక్కరూ మల విసర్జన కోసం ఇళ్లు, బాటలు, నీటి వనరులు, పిల్లలు ఆడుకునే స్థలాలకు దూరంగా వెళ్లాలి. విసర్జన తర్వాత వెంటనే మలంపై ఒక పొర మందం మట్టిని కప్పి పూడ్చివేయాలి.మరుగు దొడ్లను తరచూ శుభ్రపరచాలి. మల విసర్జన తర్వాత, భోజనానికి ముందు ఎల్లప్పుడూ చేతులు కడుక్కోవాలి . స్థానిక సంస్థలు ప్రభుత్వాలు, ఊరు, వాడల్లో ప్రజలు మరుగు దొడ్లు నిర్మించుకోవటానికి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే డిజైన్లు ఇచ్చి సహాయపడాలి.
సులభ్‌ ఇండియా
వివిధ రాష్ట్రాల్లో విసర్జకాలను ఎత్తిపోయవలసిన మరుగుదొడ్లు ఉండటం వల్ల, ఆ పనికి మనుషుల్నే ఉపయోగిస్తున్నారు. ఈ అమానవీయ వృత్తిని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం 1993లో ఒక చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం డ్రై లెట్రీన్స్‌ నిర్మాణాన్నీ నిషేధించింది. కానీ, ఇప్పటికీ వాటి నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ఈ వృత్తిపై నిషేధం, అందులో ఉన్న వారి ఉపాధికి సంబంధించిన తాజా బిల్లును కేంద్ర క్యాబినెట్‌ మొన్న ఆగస్టులో ఆమోదించింది. ఈ వృత్తిలో సుమారు పదమూడు లక్షల మంది కొనసాగుతున్నారు. లాభాల బాటలో నడుస్తున్న రైల్వే శాఖ సైతం విసర్జకాన్ని ఎత్తివేయడానికి మనుషుల్నే ఉపయోగిస్తోంది. ప్రత్యామ్నాయాలను అన్వేషించడంలో ఈ శాఖ దశాబ్దాలుగా నిర్లక్ష్యం వహిస్తోంది. ఫలితంగా ప్రపంచంలోనే 'అతిపెద్ద ఆరుబయట మరుగుదొడ్డి'గా భారత రైల్వే శాఖ అపకీర్తిని మూటకట్టుకుంది.తలల మీద మానవ మలాన్ని మోసే పాకీపనిలోంచి బయటపడి, వివిధ వృత్తుల్లో స్ధిరపడినవాళ్ళు. ఆగష్టు 17, 2010 న పార్లమెంటులో అడుగుపెట్టి ఎం.పి.లను కదిలించారు. ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా పాకీపనిలాంటి పరమ నికృష్టమైన పనిని కొనసాగిస్తున్న రాజకీయ వ్యవస్థ  సిగ్గుతో తలదించుకునేలా చేశారు. సఫాయి కర్మచారుల ఆందోళనలను వెలుగులోకి తెచ్చారు. మలాన్ని తలమీద  మోసిన ఆ తల్లులకు దేశవాసులు పాదాభివందనం చేసేలా తమ కధలు వివరించారు.
డా.బిందేశ్వర్ పాథక్ 2003 నుండి సులభ్ ఇంటర్నేషల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ పేరిట మాన్యువల్ స్కావెంజర్ల కోసం "కొత్త దిక్కు" (NEW DIRECTION) అనేకేంద్రం పెట్టి వాళ్ళతో కొత్త వ్యాపారాలు పెట్టించాడు. వంట పదార్ధాల తయారీ, కుట్టుపనులు, ఎంబ్రాయిడరీ వంటివి నేర్పించాడు. మొదట్లో మాత్రం అవి ఎవరూ కొనేవారుకాదు. అంటరాని, పారిశుధ్య కార్మికులు చేసినవా అని చీదరించుకొనేవారు. పోను పోనూ పరిస్ధితులు మారాయి. వాళ్లు తయారుచేసే వస్తువులే మరింత నాణ్యంగా ఉన్నాయని జనం గ్రహించారు. సేమియా, అప్పడాలు, ఊరగాయలు వాళ్ళ ఇళ్ళలోనే తయారుచేసినా తెగ అమ్ముడుపోయాయి. 

 
అంటరానితనం పూర్తిగా పోవాలి
అంటరానితనం పల్లెటూర్లలోనే కాదు, పట్టణాలలో కూడా ఉంది. వ్యక్తిగత పరిశుభ్రత లేని వాళ్ళను ఆరోగ్యవంతులు దగ్గరకు రానివ్వరు.శుభ్రతకి కులంతో సంబంధం లేదు.చాలినన్ని నీళ్ళు దొరకని ప్రాంతాలు మురికివాడలుగా మారుతాయి. మురికివాడలలో దుర్వాసన,సకల రోగాలు,పెరిగిపోవటం సహజం. అక్కడ నివాసం ఉండే ఏ కులస్తులకైనా ఈ రోగాలు వస్తాయి. దోమ కులం చూసి కాటేయ్యదు. ఒకప్పుడు విద్యుత్ శాఖ వారు మురికివాడలకి కరెంట్ కనెక్షన్లు ఇచ్చేవాళ్ళు కాదు. కబ్జా చేసిన స్థలాలలో కట్టిన అనధికారిక ఇళ్ళకి కరెంట్ కనెక్షన్ ఇవ్వడం సాధ్యం కాదు అని సమాధానం చెప్పేవారు. మురికివాడవాసులు అక్రమ కనెక్షన్లు వినియోగించడం, విద్యుత్ శాఖ వారు కేసులు నమోదు చెయ్యడం కూడా జరిగేవి. తరువాత ప్రభుత్వం మురికివాడలకి కూడా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించింది. మురికివాడలకి విద్యుత్ సౌకర్యం కల్పించారు కానీ మరుగు దొడ్లు లాంటి సౌకర్యాలని నిర్లక్ష్యం చేశారు. మురికివాడవాసులలో 78% మంది ఖాళీ స్థలాలలో, రైలు పట్టాల పక్కనా మల విసర్జన చేస్తుంటారు. 22% మంది మాత్రమే పబ్లిక్ టాయ్లెట్లు వాడుతారు.మురికివాడలలో బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా ఉంటారు.వాళ్ళు ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉండాలంటే వ్యక్తిగత మరుగుదొడ్లు విస్తారంగా ఉచితంగా కట్టించాలి.దేశం సుభిక్షంగా ఉండాలంటే పేదలందరికీ భారీ స్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణం జరపక తప్పదు. ఆహారభద్రత ఎంత ముఖ్యమో మలవిసర్జన భద్రత కూడా అంతే ముఖ్యం.ఆహారం దొరక్క పస్తుంటే  పస్తున్న వ్యక్తికి మాత్రమే ఆకలి బాధ కలుగుతుంది .మల విసర్జనకు తావుదొరక్క ఎక్కడబడితే అక్కడ కూర్చుంటే చుట్టూ ఉండే అసంఖ్యాక జనానికీ రోగాల బాధ తగులుకుంటుంది.యుద్దాలలో హతులయ్యేవారికంటే అపరిశుభ్రతవల్లనే ఎక్కువమంది చనిపోతున్నారు.తగినన్ని నిధులు కేటాయించి మరుగుదొడ్లను అందరికీ తప్పనిసరి చెయ్యాలి.

సఫాయి పని నిషేధం
కేంద్ర ప్రభుత్వం మరో చారిత్రక చట్టాన్ని అమలులోకి తెస్తోంది. మనుషులతో మరుగుదొడ్లు శుద్ధి చేయించే పనిని నిషేధించింది.అపరిశుభ్ర మరుగుదొడ్లనూ తీసివేయాలని నిర్ణయించింది.యంత్ర పరికరాలు లేకుండా చేతుల ద్వారా మరుగుదొడ్లను శుభ్రం చేసే సఫాయి పనికి పూర్తి స్థాయిలో చెక్ పెడుతోంది. ఇందుకోసం కేంద్రం చేసిన 'ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ యాస్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దెయిర్ రిహాబిలిటేషన్ చట్టం-2013'ను దేశవ్యాప్తంగా 2013 డిసెంబర్ 6 నుంచి అన్ని పట్టణ ప్రాంతాల్లోనూ అమలులోకి తేనుంది. కేంద్ర గణాంక శాఖ వివరాల ప్రకారం రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 1,73,690 అపరిశుభ్ర మరుగుదొడ్లున్నాయి. వీటిలో 14,015 మరుగుదొడ్ల నుంచి మలాన్ని మురుగు కాల్వల్లోకి వదిలేస్తున్నారు. 7,111 మరుగుదొడ్లను మనుషుల ద్వారా శుభ్రం చేయిస్తున్నారు.
కేంద్ర చట్టం త్వరలో అమలులోకి రానుండడంతో అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించిన మరుగుదొడ్లు అన్నిటినీ ఆరు నెలల్లోగా తొలగించి, వాటిని పరిశుభ్ర మరుగుదొడ్లుగా మార్చాల్సి ఉంటుంది. చట్టాన్ని అతిక్రమించిన వారిపై తొలుత రూ.50 వేల జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. చట్టం అతిక్రమణలు కొనసాగితే గరిష్ఠంగా రూ.5 లక్షల జరిమానా లేదా ఐదేళ్ల జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. అన్ని పట్టణ ప్రాంతాల్లోనూ సర్వే చేపట్టి, అపరిశుభ్ర మరుగు దొడ్లు శుభ్రం చేసే సఫాయి పనివారిని గుర్తించి వారికి విధిగా ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పిస్తారు.

- See more at: http://www.andhrajyothy.com/node/35126#sthash.B6QH9N2A.dpuf
 http://www.suryaa.com/opinion/edit-page/article-158935  (సూర్య 10.11.2013)

https://www.facebook.com/photo.php?fbid=660883877276939&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater

గీటురాయి  22.11.2013







సాక్షి 6.12.2013