కోస్తాను ఆదుకోవాలి
ఆంధ్రభూమి 17-9-1990 ఎన్. రహంతుల్లా ఏలూరు
కోస్తా
జిల్లాలలో వరదలు, తుఫానులు రావటం పరిపాటి అయ్యింది. శాశ్వత నివారణ చర్యలు ఏవో
తీసుకోబోతున్నట్లు చెన్నారెడ్డి గారు ప్రకటించారు. రెవిన్యూ సిబ్బంది మీద పని భారం
తగ్గించటానికి కోస్తాలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆయన గతంలో అంగీకరించారు గాని అది
కార్యరూపం దాల్చలేదు. రెవిన్యూ డివిజన్ల సంఖ్యను పెంచటం కూడా జరుగలేదు. వరదలొచ్చిన
ప్రతిసారి కోట్లాది రూపాయలు జనానికి పంచుతున్నారు తప్ప నదుల మీద భారీ ప్రాజెక్టులు
కట్టటం లేదు. పోలవరం ప్రాజెక్టు గురించి ఎవరూ పట్టించుకోవటం లేదు.
భద్రాచలం
జిల్లా వెంటనే ఏర్పాటు చెయ్యాలి. నదీ పరీవాహక ప్రాంతంలో రోడ్లు, రిజర్వాయర్లు,
వంతెనలు కట్టవలసిన అవసరం ఉంది. ల్యాండ్ రెవిన్యూ కమీషనర్ కు కోస్తాలో ప్రాంతీయ
కార్యాలయం ఏర్పాటు చెయ్యాలి. తడ నుండి
ఇచ్ఛాపురం వరకు జాతీయ రహదారి నిర్మించాలి. కోస్తాను ఆదుకోవాలి.
కొల్లేరు పై రైలు మార్గం
వార్త 22-10-1999
కొల్లేరు
ప్రాంతాన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించటం హర్షదాయకం. 954
చ.కి.మీ. వైశాల్యం ఉన్న సరస్సులో 674 చ.కి.మీ.లు నీరు ఉంటుంది. అయిదో కాంటూర్ లోపల
80 వేల ఎకరాలలో 20 వేల ఎకరాలు చేపల చెరువులు ఉన్నాయి. అందులో 13 వేల ఎకరాలు
ఆక్రమణలు, కైకలూరు నుండి ఏలూరుకు కేవలం 25 కి.మీ. కొల్లేరు మీదుగా రైలు మార్గం
అనుసంధానమై కొల్లేరు ప్రాంతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. తుఫాను
సమయాల్లో ఈ రైలు మార్గం బైపాస్ గా ఉపయోగపడుతుంది. కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలకు
ఎంతో మేలు చేసే ఈ 25 కి.మీ. రైలు మార్గాన్ని వేయాలి.
తీర ప్రాంత మండలాలపై శ్రద్ధ
22-5-1995
ఏటా అకాల వర్షాలు, తుఫాన్ల కారణంగా కోస్తా
జిల్లాలు అపార నష్టానికి గురవుతున్నాయి. ప్రభుత్వం తాత్కాలిక సహాయాలు ప్రకటించడం
పరిపాటి. ఇలా కష్టాలపాలవుతున్న తీర ప్రాంత మండలాలు నెల్లూరు జిల్లాలో 12,
ప్రకాశంలో 10, గుంటూరులో 4, కృష్ణాలో 4, పశ్చిమ గోదావరిలో 3, తూర్పు గోదావరిలో 11,
విశాఖపట్నంలో 9, విజయనగరంలో 3, శ్రీకాకుళంలో 12 ఉన్నాయి. ఈ 66 మండలాలను ప్రత్యేక
శ్రద్ధతో అభివృద్ధి చేయాల్సి ఉంది. వీటన్నింటినీ కలుపుతూ జాతీయ రహదారి
నిర్మించాలి. పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న రొయ్యలు, చేపల చెరువులను నిషేదించి
సర్వి, కొబ్బరి తోటలను ప్రోత్సహించాలి. ఈ మండలాల్లో రెవిన్యూ శాఖను పటిష్టం
చేయాలి. స్వంత భవనాలు, వాహనాలు తగినంత సిబ్బంది కల్పించాలి. తుఫాను షెల్టర్లు,
లింకు రోడ్లు వంతెనలు,విస్తృతంగా నిర్మించాలి. అలాగే
రేపల్లె-బందరు-నరసాపురం-కాకినాడ-విశాఖపట్టణం టెర్మినల్స్ ను కలుపుతూ తీరం
వెంట కొత్త రైలుమార్గం వేస్తే ఆయా జిల్లాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి