అరవై దాటిన బతుకులు
“మీరు ఎక్కడన్నా చావండి. మా ఇంటిలో మాత్రం ఉండొద్దు
వెళ్ళిపోండి “అని తల్లి దండ్రులకు వార్నింగ్ ఇచ్చిన ఒక కొడుకు కధ వార్తాపత్రికల్లో ఫేస్ బుక్ లో
వైరల్ కావటంతో ఆ వార్త చదివిన ఇతను కూడా
బాధపడ్డాడు.లక్నో కలక్టరు,జిల్లా మేజిస్ట్రేటు సీనియర్ సిటిజన్ల చట్టాన్ని సత్వరమే అమలు చేశాడని,ఆ కొడుకు దగ్గరకు వెళ్ళి కొడుకునే ఇల్లు ఖాళీ చేయించి ఆ తల్లిదండ్రులకు
ఆశ్రయం నిలిపాడని తెలిసి ఊరడిల్లాడు.తాను కష్టపడి కట్టుకున్న ఇంటిలో తన
ఒక్కగానొక్క కొడుకు ఉండవద్దు వెళ్ళిపోమ్మంటున్నాడని ఫేస్ బుక్ లో
బావురుమన్నాడట.తనకు గుండె జబ్బని,తనభార్యకు మోకాళ్ళనొప్పులని
ఈవయసులో కన్నకొడుకే ఇలా చేస్తే చావాలో బతకాలో తెలియడంలేదని వాపోయాడట.
ఈ మధ్య తల్లిదండ్రుల్ని వాళ్ళ ఇంటిలో వాళ్ళను ఉండనివ్వకుండా కొడుకులు బయటకు
నెట్టేసే కేసులు ఎక్కువౌతున్నాయి.పేపర్లలో,సోషల్ మీడియాలో వస్తున్న ఇలాంటి
కేసుల్ని ఎక్కడికక్కడే స్థానిక అధికారులు న్యాయమూర్తులు పట్టించుకొని ఇలాంటి
కొడుకుల్ని కోడళ్ళను బయటికి పంపి వృద్ధులకు న్యాయంచేయ్యాలి అనుకున్నాడు.కొడుకు
కోడలి బాధితులైన ముసలివారి కదనాలు ఎన్నో విని ఉండటం వలన రకరకాల హింసలు అతనికి
గుర్తువస్తూ ఉన్నాయి.తాను పదవిలో ఉన్నప్పుడైతే ఇలాంటివారి మీద విరుచుకుపడేవాడు. ఇప్పుడు
తానో విశ్రాంత ఉద్యోగి.తనవిషయాలే తనకు ఎదురుగా నిలబడ్డాయి.
అడ్డాలనాడు
బిడ్డలుగానీ గడ్డాలనాడూ బిడ్డలా?అనే సామెత రిటైరైనప్పటినుండి అతని మనసులో ఎందుకో తరచుగా వినిపిస్తోంది.
తక్కువ జీతమే అయినా లంచాలకు పాల్పడకుండా బతుకు నెట్టుకొచ్చాడు. శ్రావణుడిలాగా అమ్మను నాన్నను కావిళ్ళతో మోయకపోయినా . పెందరాళే భోంచేసి
పడుకో నాన్నా అని అంటాడని ,
అత్తయ్యను కోడలు ఆప్యాయంగా పలకరిస్తుందని,మనమరాలితో తరచుగా
ఫోన్లో మాట్లాడిస్తారనీ ఆశపడ్డాడు. కామ క్రోధాదులకు
అతీతమైన వార్ధక్య స్థితి మరో పసితనం చూస్తుండగానే వచ్చేసింది.నడకలో తూలుడు
మొదలయ్యింది. తాను పట్టి నడిపించిన వేలు చేతికర్రగా మారి తనకు సాయపడుతుందని
ఇన్నాళ్ళూ పడిన ఆశతీరదేమోననే విచారం. ఎవరి నీడన తృప్తిగా సేద దీరాలనుకున్నామో వారు తమ
నీడలోకి రానివ్వరేమో అనే దిగులు ఆవరిస్తోంది.మరొకరి సహకారం అవసరం.
తాను పెద్ద సంబంధాలకోసం పాకులాడక పేదింటి పిల్లను కోడలిగా చేసుకున్న ఆదర్శాన్ని వియ్యంకుల వారు గ్రహించనేలేదు. పైగా
తన చేతకానితనంగా భావించారు.”మా ముసలోళ్ళను మేము పోగొట్టుకోము,మమ్మల్ని
మా ముసలోళ్ళు పోగొట్టుకోరు” అనే కోడలి డైలాగు విని ఎంత ఐక్యత! వీళ్ళది చాలా గొప్ప సంప్రదాయం అనుకున్నాడు.కళ్యాణమండపం అద్దె దగ్గరనుండే
మొదలు. బ్యాండుమేళం ఖర్చులు దగ్గర,మనమరాలి పేరు దగ్గర అన్నీ
మాటతప్పడమే.కొడుకు కూడా వాళ్ళమాటే వింటున్నాడు.అబ్బాయి అద్దె ఇళ్ళలో అవస్థ పడకూడదని
పెళ్ళికిముందే మహానగరంలో ఇల్లు కొనిచ్చాడు.తరువాత ఇన్నేళ్ళకాలంలో కొడుకు కోడలు
అమ్మానాన్నలను ఆహ్వానించిందేలేదు.ఒకసారి మనమరాలిని చూద్దామని వెళితే మరునాడే
సాగనంపారుకానీ మరోరోజు ఉండమని ఇద్దరూ అడగలేదు.ఈ బాధ అదేపనిగా ముసలాయన మదిని
తోలుస్తోంది.ఏమి పాపం చేస్తే ఈ శిక్ష అని అనుకోని రోజులేదు.తనతండ్రిని తాను
చివరిదశలో ఆదుకోని ఫలితంగానే వచ్చింది
కాబట్టి ఇది తనకు న్యాయమైన శిక్షే అని సర్ది చెప్పుకుంటాడు.తన తండ్రి తనకు
పెద్దగా ఏ సౌకర్యాలూ కల్పించకపోయినా తనకు ఉన్నదాంట్లో కొంత పంచాను కానీ తన కొడుకు తనలాగానైనా ప్రవర్తించటం
లేదు.కొడుకును డబ్బులుకూడా అడగటంలేదు.పింఛనుతోనే
సరిపెట్టుకుంటున్నాడు.కొడుకుకు తాను ఇవ్వటమేగానీ కొడుకు దగ్గరనుండి ఏమీ
తీసుకోవద్దు అని భార్యతో చెప్పేవాడు.తీసుకుంటే వాడితో మన రుణానుబంధం తీరిపోతుంది
అనేవాడు.
ఈమధ్య తమ ముసలితనం ఎలా కడతేరుతుందో అనే భయం పట్టుకుంది.ఎందుకంటే తన
స్నేహితుడి మామ కేన్సర్ వ్యాధితో నగరంలోని ఆసుపత్రిలో చేరి చనిపోయాడు. అత్త,చెల్లెలు
ఆసుపత్రిలో చేరారు.వారికి సపర్యలు చేయటానికి చాలా కష్టపడ్డారు.ఆరోగ్యంగా ఉంటేనే పలకరించటమే ఇష్టం లేని కొడుకు కోడలు లేవలేని
రోగంవస్తే తమకు సేవలు,సపర్యలు చేస్తారా?మా పరిస్తితి ఎలా ముగుస్తుంది?... మొదలైన ఆలోచనలతో
నలిగిపోతున్నాడు.అప్పట్లో తమ నాన్నకూడా చిన్నపాటి ప్రోస్టేట్ ఆపరేషన్ చేయించండిరా
అని అడిగినా కొడుకులు పట్టీ పట్టనట్లు ఉండిపోయారు.తమ కొడుకుల్ని మాత్రం ఖరీదైన
చదువులు చదివిస్తున్నారు.అరవైదాటినతరువాత మా వృద్ధుల పరిస్తితీ ఇంతేగదా? అని ఆలోచిస్తున్నాడు.
నీకంటే ముందే నా చావురావాలి అన్నాడు భార్యతో.ఎందుకని అంది భార్య.నాకొడుకు
నన్ను చూచినా చూడకపోయినా వాడి పంచలోనైనా పడుకొని రాలిపోతానుగానీ వాడిని
పల్లెత్తుమాట అనను అనేదానివిగా అన్నాడు. నిజమే అప్పట్లో అలా అనేదానిని కానీ
రానురాను కొడుకు కోడళ్ళ వైఖరిలో మార్పు వచ్చిందయ్యా. నన్నొక అంటరానిదానిలా చూస్తున్నారు.నేను మనమరాలిని
తాకితే అనారోగ్యం పాలౌతుందన్నట్లు చూస్తున్నారు.మనమరాలి కోసం భోగిపళ్ళు పోసినా
దిష్టి తగులుతుంది , అసలు మీదగ్గర నా కూతురు ఉంటే
పిచ్చిదై పోతుంది అంటున్నాడు నీ
కొడుకు.మనమ రాలికి కోడలు పాలుకూడా ఇవ్వనప్పుడు,వెంట్రుకల
దిష్టి తాళ్ళు కడుతున్నప్పుడు, లోలోన మదనపడ్డామే గానీ
వాళ్ళను ఏమన్నా అడిగామా?అడిగినాకూడా మనల్ని ఖాతరు చేశారా?భవిష్యత్తు ఎలాఉన్నా సరే.ఎదుర్కొందాం. దిక్కులేనివాళ్ళలాగా పిల్లల్ని
ప్రాదేయపడకూడదు.తల్లిదండ్రులను చూడాలా వద్దా ,ఎలా చూడాలి అనే
సంగతి వాళ్ళే నిర్ణయించుకోవాలి.వాళ్ళేమీ పసిపిల్లలుకాడు అంది భార్య.
నిజమే.ఎవరి
ఆత్మాభిమానం వారిది.పశుపక్షులు కోరనిదీ,మనిషి మాత్రమే కోరేదీ ఇదొక్కటే.వృద్ధాప్యంలో పిల్లలు తమను తిరిగి చూడాలి
అనే కోరిక.అలాంటి ఆర్ధిక శక్తి వారికి కలగాలని ఆరాటం.సంతానం ఏదో గొప్పపని
చేయకపోయినా సంఘంలో తమ కాళ్ళమీద తాము నిలబడి స్వయంపోషకులయితే చాలు తమ మీద భారం
తగ్గిందని భావిస్తారు సగటు పేరెంట్స్.అందుకోసం కోపపడతారు,అలుగుతారు,తగాదా పెట్టుకుంటారు కానీ ఒకరినొకరు వదులుకోరు.సున్నితమైన సమశ్య.తనగోల తనది,తల్లిదండ్రుల గోల తల్లిదండ్రులది.ఇద్దరూ మంచోళ్ళే.తల్లిదండ్రులు బిడ్డల
మధ్య విడిపోని సంబంధం అది అన్నాడు భర్త.
అమ్మలరోజు
నాన్నలరోజు,అమ్మానాన్నలరోజు
ఇలా అందరికీ అన్నిరోజులు వస్తున్నాయ్ పోతున్నాయ్.కొడుకు కోడళ్ళనుండి.శుభాకాంక్షల
సందేశాలు కూడా రావు.కోడలితరుపు వారికి,అమెరికాలో ఉన్న
బంధువులకు మాత్రమే ఘనంగా సందేశాలు,ఫోన్లు వెళుతుంటాయిగానీ
తల్లిదండ్రులు పలకరించదగనివారు,వాళ్ళింటికి వెళితేనే పీడకలలు వస్తాయి అన్నంతగా అలర్జీ ఫీలౌతున్నారు. తల్లిదండ్రులను
నడిచే దైవాలుగా భావించాలని మాతృదేవోభవ.. పితృదేవోభవ అని పెద్దలు చెప్పారు.కానీ
కన్నవారికి నేటి బిడ్డలు కనీస కృతజ్ఞతనైనా ప్రకటిస్తున్నారా? తల్లిదండ్రులతో
అభిప్రాయభేదాలు రావచ్చు. కానీ బంధాల్ని తెంపుకునేలా వాటిని పెంచుకోకూడదు.కొడుకులూ,కోడళ్ళూ,కూతుళ్ళూ వాళ్ళ పెద్దలను
కనీసం పలకరించాలి. మిమ్మల్నే నమ్ముకున్న మీ పెద్దలను పలకరించకపోవటం
నేరమే.ఉగ్రవాదులు అమాయక జనాన్ని కూడా చంపుతారు.
తల్లిదండ్రుల్ని పలకరించకుండా వారిని మనస్తాపానికి గురిచేసే సంతానం కూడా ఉగ్రవాదులే.దుర్మార్గులే తల్లిదండ్రులను మనోవేధనలకు గురిచేస్తారు. ఉగ్రవాది తనకు స్వర్గం లభిస్తుందని కలలు కంటాడు.నరహంతకులకు స్వర్గం దొరకదు
తల్లిదండ్రులను కనికరించని దుష్టులకు కూడా స్వర్గం దొరకదు.తల్లిదండ్రులను పలకరించకుండా వేధించి చంపిన అపరాధభావనతో మిగతా జీవితమంతా నరకప్రాయం అవుతుంది.సంతానానికి ఎందుకింత అహంకారం ? చెప్పుకుంటూ పోతున్నాడు భర్త.
తల్లిదండ్రుల్ని పలకరించకుండా వారిని మనస్తాపానికి గురిచేసే సంతానం కూడా ఉగ్రవాదులే.దుర్మార్గులే తల్లిదండ్రులను మనోవేధనలకు గురిచేస్తారు. ఉగ్రవాది తనకు స్వర్గం లభిస్తుందని కలలు కంటాడు.నరహంతకులకు స్వర్గం దొరకదు
తల్లిదండ్రులను కనికరించని దుష్టులకు కూడా స్వర్గం దొరకదు.తల్లిదండ్రులను పలకరించకుండా వేధించి చంపిన అపరాధభావనతో మిగతా జీవితమంతా నరకప్రాయం అవుతుంది.సంతానానికి ఎందుకింత అహంకారం ? చెప్పుకుంటూ పోతున్నాడు భర్త.
భార్యమెప్పుకోసం అత్తమామల ముందు కొడుకులు తల్లిదండ్రుల్ని
అవమానిస్తున్నారు.తల్లిదండ్రులు వండింది తినకుండా భార్యకు హోటల్ నుండి టిఫిన్
తెచ్చి పెడుతున్నారు కొడుకులు.తల్లిదండ్రులు కొన్న ఇల్లు తమ సొంతం చేసుకొని కొడుకులు తల్లిదండ్రుల్నే బయటకు
వెళ్ళగోడుతున్నారు.అత్తమామల్ని కోడళ్ళుకూడా హింస పెడుతున్నారు.మనమళ్ళను మనమరాళ్ళను
తాతా నాయనమ్మల దగ్గరకు రానివ్వటంలేదు.
వాళ్ళ పెద్దరికానికి ఏ మాత్రం విలువనివ్వటం లేదు.ఇక పెద్ద వాళ్ళకు ఆర్ధిక సమస్యలు
కూడా ఉంటే కొడుకులు కోడళ్ళు కలిసి పెట్టే
యాతనలు చెప్పతరంకాడు.తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటో ఒక్కటన్నా ఉంటుందా వాళ్ళ
దగ్గర? సగర్వంగా తల్లిదండ్రులకు సేవ
చేస్తున్నట్లు ఒక్క ఫోటోగానీ వీడియోగానీ
చూపగలరా ఈ నాటి కుర్రపిల్లలు?అరవై దాటిన ప్రతి ఒక్కరూ తమ
అమ్మ నాన్నలతో చాలా ఫోటోలు దిగలేకపోయామే ,వారిని ఇంకా బాగా
చూసుకోలేకపోయామే అని తాము చనిపోయేలోగా
చాలాసార్లు తప్పక ఏడుస్తారు.
మంచానపడ్డ ముసలోళ్ళ కాలకృత్యాలు తీర్చటం,తీర్చుకోవటం బాధాకరమైన పనే.చేసేవాళ్ళకు
తెలుస్తుంది.చెప్పేవాళ్ళకు ఏం తెలుస్తుంది?ముసలోళ్ళకు
చేసీచేసీ రోగినైపోయాను.నేను చేయలేక నాతల్లిని
చెల్లికి అప్పజెప్పి బాగుపడ్డాను అని ఒక 66 ఏళ్ళ రిటైర్డ్ ఆఫీసర్
అన్నాడు.రోగులైన వృద్ధులకు అత్యవసరమైన పనులు దగ్గరుండి స్వయంగా చేసినవారైనా,దూరాన ఉండి డబ్బులిచ్చి మరొకరితో చేయించిన వారైనా ఇద్దరూ ధన్యులే.వృద్ధులకు
సహాయం మాత్రం అందించాలి అని నేనే వాదించేవాడినిగడా అని గతాన్ని గుర్తుచేసుకున్నాడు.
పేపరులో
మరోపేజీలో ఒకాయన చలంగారి వాదన వినిపిస్తున్నాడు.”పశువులు పక్షులు ముసలితనంలో
మమ్మల్ని ఆదుకొమ్మని తమ పిల్లల్ని అడుగుతున్నాయా?ముసలితనం వస్తే రోగాలతో ఆకలితో చచ్చిపోతాయిగానీ
తమ బిడ్డలమీద ఆధారపడవు.సమస్త ప్రాణికోటిలో బిడ్డలు తనను తిరిగి చూడాలి అంటున్నది
మనిషి ఒక్కడే.సిగ్గులేని జీవి.బిడ్డల్ని పీడించుకు తినే జీవి.కాబట్టి మేము
ముసలివాళ్ళం అయ్యాం మమ్మల్ని చూడండి అనడం సమంజసం కాదు. స్వార్దకాంక్షతొ పిల్లల్ని పెంచడం సమంజసం కాదు.
ముసలివాళ్ళం అయ్యాక పిల్లలు చూడాలి అనే కోరిక తప్పు. వృధ్ధుల మనస్దత్వం లో మార్పు రావాలి. వారి
భవిష్యత్ గురించి వారే ఆలోచించుకోవాలి. పిల్లలు చూడాలి అన్న ధోరణి మారాలి. తమ
రక్షణ కోసం భవిష్యత్ నిధిని ఏర్పరుచుకోవాలి.కోడల్ని కూతురు కన్నా ఎక్కువుగా
చూసుకొనే మనస్దత్వం రావాలి” అని జాగ్రత్తలు చెబుతూ సాగింది ఆ వ్యాసం.
రెండు
రకాల వాదనలు విన్నాక విశ్రాంత ఉద్యోగికి అసలు ఇప్పుడు ఎవరిని ఏమిఅడగాలో అర్ధం
కాకుండా పోయింది. ఒకలాంటి వైరాగ్యం కమ్మింది.ఎవడి సొమ్ము ఎవడు తిన్నాడు?నా కొడుకేకదా? పోనీ.ఎవరికి ఇవ్వకుండా ఎవరు బిగబట్టారు?తండ్రీ
కొడుకులే కదా?పోనీ.ఎవరిని ఎవరు మాటలతో హింసించారు? అత్తా కోడళ్ళేకదా?పోనీ.ఇక్కడ ఉండేది ఎన్నాళ్ళు?వానప్రస్థం కొన్నేళ్ళే కదా?పోతే పోనీ పోరా! ఈ పాపపు
జగతిన శాశ్వత మెవడురా? అనుకుంటే పోలా?కడుపు
చించుకుంటే కాళ్ళమీద పడుతుందంటే ఇదేనా?సరే
కానియ్.కన్నబిడ్డను అల్లరి చేసి హక్కుల్ని సాధించినాతృప్తిగా తినలేను.పశువులు ఉంటే
తింటాయి.లేకపోతే చస్తాయి.కాస్త ముందు జాగ్రత్త పడేది మనిషే.ఒకరికొకరు సహాయపడాలి
అనేదే మనిషి నేర్చుకున్న నాగరికత.పరస్పర సహకారమే మనిషి ఎదుగుదలకు సాయపడిన
మెట్టు.నేను నా కొడుక్కి సాయ పడుతూనే
ఉంటాను.నా అవసరానికి నా కొడుకు సాయపడుతున్నాడా సాయపడే గుణం ఉందా లేదా ఒకసారి ఆలోచించుకుంటాను అని
గతంలోకెళ్ళాడు.కొన్నేళ్ళ క్రితం తనకు జరిగిన యాంజియో పరీక్షకు ముప్పై వేల రూపాయలు
తన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులోంచి కట్టిన దృశ్యం కళ్ళముందు మేదిలింది.నగరం నుండి
శలవు పెట్టి వచ్చి ఆసుపత్రిలో తనతో ఒక రోజంతా ఉండటం, క్యాబ్ లో ఇంటికి తరలించటం. ఆరేళ్ళ మనమరాలు తన చేతులకు
మందు రాయటం,తనరోగం తగ్గించమని రెండు చేతులూ జోడించి దేవుణ్ణి
వేడుకోవటం,తన తమ్ముడు కూడా అన్నయ్యా అంటూ ఆసుపత్రికి రావటం మొదలైన దృశ్యాలు కళ్ళలో మెదిలాడాయి.వీళ్ళంతా
ఉండబట్టికదా నా ఆరోగ్యం బాగుపడింది?ఇంకేమి అడగటానికి అతనికి
తోయలేదు. తన తల్లిదండ్రులకు తాను చేయగలిగినంత సాయం చేయలేకపోయానని
పశ్చాత్తాపపడ్డాడు. తనఊళ్ళో ఒంటరిగా ఉంటున్న అత్తగారిని కూడా తన ఇంటికి తెచ్చి
భార్యను చూడమన్నాడు.తనలో వచ్చిన ఈ మార్పు
తన కొడుకు కోడలు గ్రహిస్తే చాలునన్నాడు.
---
నూర్ బాషా రహంతుల్లా 6301493266
https://www.facebook.com/photo.php?fbid=2545268815505093&set=a.233025936729404&type=3&theater
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి