ఈ బ్లాగును సెర్చ్ చేయండి

14, సెప్టెంబర్ 2013, శనివారం

రిజర్వేషన్ల పరుగులో ' వెనకబడిన ' కులాలు


రిజర్వేషన్ల పరుగులో ' వెనకబడిన ' కులాలు
నూర్ బాషా రహంతుల్లా  9948878833



రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలు కదలాలని, బీసీ హక్కుల సాధన కోసం ఉద్యమించాలని వరంగల్ బీసీ డిక్లరేషన్ జాతీయ సదస్సు 15.9.2013 న పిలుపునిచ్చింది. జనాభా దామాషా ప్రకారం పార్టీలు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేసింది. స్వాతంత్య్రం వచ్చి 67 ఏళ్లు అయినా బీసీలు వెనుకకు నెట్టివేయబడ్డారని, ప్రభుత్వ ఉద్యోగాల్లో కేవలం 7శాతం మంది మాత్రమే బీసీలు ఉన్నారని, కేంద్రంలో రూ.16 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించినా అందులో బీసీలకు కేవలం 0.2 శాతం నిధులను మాత్రమే ఇచ్చారని అందువలన  జనాభాలో బీసీలు ఎంత శాతం ఉన్నారనే విషయం తేల్చి  అసెంబ్లీ, పార్లమెంటు చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేయాలని కోరింది. రాష్ట్రంలో 142 బీసీ కులాలు ఉంటే కేవలం నాలుగైదు కూలాలకే ప్రాతినిధ్యం లభిస్తోంది. జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యం లభించాలి. తమిళనాడులో 60శాతం, కర్ణాటకలో 62శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలవుతుండగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 27శాతం మాత్రమే అమలవుతున్నాయని ఆవేదన ప్రకటించింది.

రిజర్వేషన్లు వోట్లు రాబట్టే సాధనంగా పరిణమించింది. ఇష్టం ఉన్నా లేకపోయినా దేశంలోని అన్ని పార్టీలు రిజర్వేషన్లను సమర్ధించి తీరుతున్నాయి. 66  ఏళ్ళు గడిచినా రిజర్వేషన్ల అవసరం తీరలేదు. ఇంకా ఎంత కాలం అవసరమో చెప్పలేము. ఇన్ని ఏళ్ళ కాలంలో కనీసం ఫలానా కులాలను పైకి తీసుకురాగలిగాము అని చెప్పుకోటానికి తగిన గణాంక సేకరణ ప్రభుత్వం చేయలేదు. ఏదైనా ఒక కులం జనాభాలో 45 శాతం కుటుంబాలు తగిన ఉద్యోగాలు సాధించి, ఆర్ధికంగా సాంఘీకంగా రాజకీయంగా బలపడితే ఆ కులాన్ని రిజర్వేషన్ల పరిధి నుండి తప్పించాలని గతంలో కొందరు మేధావులు కోరారు. ఆ ప్రకారంగా రిజర్వేషన్లు పొందే కులాల జాబితా క్రమేణా తగ్గిపోయి, కొంత కాలానికి రిజర్వేషన్లే ఉండవని వారి వాదం. అయితే ఆయా కులాల జనాభా మీద ప్రభుత్వం సమగ్రమైన సర్వేలు జరుపుతూ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది.
     రిజర్వేషన్ల వల్ల అగ్ర కులాల వారిలో అసంతృప్తి, నిరాశ హెచ్చుతున్నది. క్రమేణా వారు తమ దుస్థితికి, ఉద్యోగాలు రాబట్టలేనితనానికి ఈ వెనుకబడిన కులాల వారే కారణమని వారి మీద కోపాన్ని పెంచుకుంటున్నారు. ఈ పరిస్థితిని గురించి కొందరు దళిత నాయకులని ప్రశ్నిస్తే కొన్ని శతాబ్దాల పాటు మమ్మల్ని పీడించినందుకు గాను ఇది ఈనాడు వారు అనుభవించాల్సిందేనని సమాధానమిచ్చారు. ఇంకా కొందరైతే అగ్ర కులాల వారికి కూడా రిజర్వేషన్ ఇచ్చుకోమనండి అన్నారు. అంటే దేశంలోని అన్ని కులాల వారికి వారి వారి జనభాను బట్టి నూరు శాతం రిజర్వేషన్ ఉండాలనేది వీరి వాదం. మరికొందరైతే సుప్రీం కోర్టు చెప్పినట్లు 50 శాతం రిజర్వేషను ఇచ్చి మిగతా 50 శాతం అందరికీ అందుబాటులో ఉంచాలన్నారు. ఏదిఏమైనా ఈ రిజర్వేషన్ పెద్ద ప్రజా సమస్యగా పరిణమించింది. ఉద్యోగాల ప్రమోషన్లలో వెనుకబడిన తరగతుల వారికి కూడా రిజర్వేషన్ కల్పిస్తామని, స్త్రీలకు 50 శాతం రిజర్వేషన్ ఇస్తామని రాజకీయ నాయకులు వాగ్ధానం చేస్తున్నారు. వెనుకబడిన తరగతుల ఉద్ధరణ కోసం ఈ రిజర్వేషన్లు అవసరమే గాని కొంతకాలం తరువాత అలాంటి ఉద్దరణ జరిగిందా లేదా, ఏమైనా కులాలు సాంఘికంగా అభ్యున్నతి సాధించాయా లేదా, ఆ కులాలను రిజర్వేషన్ల పట్టికలో ఇంకా కొనసాగించాలా లేదా అనే పరిశీలనలు ప్రభుత్వం చేయడం లేదు.
కులాల పరిశీలన అవసరం
షెడ్యూల్డ్ కులాలలో 59 , షెడ్యూల్డ్ తెగలలో 33, వెనుకబడిన తరగతులలో 144  ఇలా మొత్తం 236 కులాలున్నాయి. మన రాష్ట్రంలో 2005లో 93 కులాలున్న బీసీ కులాల జాబితా ఇప్పుడు 144 కి చేరింది. 'గ్రూప్ ఏ లో 54, 'గ్రూప్ బి లో 28, 'గ్రూప్ సి లో 1, గ్రూప్ డి లో 47, గ్రూప్ ఇ లో 14 కులాలున్నాయి.వెనుకబడిన కులాలకు మొత్తం ఉన్న 29 % రిజర్వేషన్లలో గ్రూపు-ఏ కు 7శాతం, గ్రూ పు-బీ కు 10 శాతం, గ్రూపు-సీ కు 1శాతం, గ్రూపు-డీ కు 7శాతం గ్రూపు - ఇ కు 4 శాతం రిజర్వేషన్లుంటాయి. కేంద్రం గుర్తించిన ఒబిసి జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీసీ కులాలు 107 మాత్రమే గుర్తింపు పొందాయి.. ఇన్ని ఏళ్ళ పాలనలో కనీసం ఒకటి రెండు కులాలైనా ఆర్ధికంగా పైకి వచ్చి ఉండవా? ఆచరణలో జరుగుతున్నదేమిటంటే, జనాభా ఎక్కువగా ఉండి, రాజకీయ శక్తులను భయపెట్టగలిగే కులాలు మాత్రమే ఈ రిజర్వేషన్ల వల్ల ఎక్కువగా లాభపడుతూ ఉండగా, జనాభా తక్కువగా ఉండి, రాజకీయ నాయకత్వమే లేని కులాలు నష్టపోతున్నాయి. అందువలన శక్తివంతమైన కులాలను, శక్తిహీనమైన కులాల సరసన ఉండకుండా వేరు చేయాలి. ఆ విధంగా శక్తిమంతమైన కులాలు, శక్తిహీనమైన కులాలకు అడ్డురాకుండా కాపాడాలి. శక్తిమంతమైన రాజకీయ పలుకుబడి గల కులాలను అంతకంటే  క్రిందివరస  వర్గంలోకి చేర్చాలి. అలాంటి నిరంతర వడపోత , పునర్వర్గీకరణ పద్ధతి ద్వారా కొంత కాలానికి రిజర్వేషన్లు అక్కరలేదని ఎత్తివేసే పరిస్తితి రావాలి.

 కులాలను వడపోయ్యాలి
 షెడ్యూల్డ్ కులాలు తెగలలోని శక్తిమంతమైన కులాలను వెనుకబడిన తరగతులు ' ' గ్రూపులోను, వెనుకబడిన తరగతులలోని శక్తిమంతమైన కులాలను దాని క్రింది గ్రూపులోను కాలక్రమేణా చేర్కుకుంటూ పోవాలి. ఆ విధంగా ప్రతి అయిదేళ్ళకొకసారి మార్పు తలపెట్టాలి. ప్రతి పంచవర్ష ప్రణాళికలోను ఆయా బలహీన కులాల అభివృద్ధి కోసం కులాల పేరు పేరు వరుసన నిధులు కేటాయించి సబ్ ప్లాన్ తరహాలో అవి వారికే అందేలా చూడాలి. అయిదేళ్ళు తిరిగి వచ్చేటప్పటికి ఆ కులం స్థాయి సాంఘికంగాను, ఆర్ధికంగాను,రాజకీయంగానూ బాగుపడాలి. ఆ విధంగా కాలక్రమేణా రిజర్వేషన్ల చట్రంలో నుండి అన్ని కులాలు తొలగిపోవాలి. కులం పేరు మీద ఇక ఎవ్వరూ రిజర్వేషన్ కోరలేని పరిస్థితి రావాలి. అన్ని కులాలలోని పేదలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తేనే ఇది సాధ్యమౌతుంది. మాకు ఓట్లొస్తే చాలు మనుషులు బాగుపడనక్కరలేదు అంటే పరిస్తితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లౌతుంది. ఒక శాస్త్రీయ దృక్పథం గాని సమస్యను పూర్తిగా తుడిచిపెట్టే మనసు గాని లేని ప్రభుత్వం కుల సమస్యను ప్రస్తుత పరిస్థితిలో శాశ్వతం చేస్తున్నది. దేశంలోని మేధావులు, కుల వ్యతిరేకులు ఈ పద్ధతిని మార్చేలా ప్రభుత్వంపై వత్తిడి తేవాలి. కులం ప్రాతిపదికగా ఉండటం పోయి, ఆర్ధిక ప్రాతిపదికమీద జన విశ్లేషణ జరగాలంటే ముందు కులాలు అభివృద్ధి చెందాలి. అన్ని కులాలు అభివృద్ధి చెందితే రిజర్వేషన్ అవసరమే ఉండదు. ప్రభుత్వం ఇక మీదట రూపొందించే పధకాలు ఆయా కులాలలోని ధనవంతులను తప్పించి, నిరుపేదలను ఉద్ధరించేలా ఉండాలి. కులానికి పేదలైన వారిలోనే కూటికి పేదలైన వారికి నిధులు చేరాలి. కేంద్రమూ, రాష్ట్రాలు సమన్వయంతో ఈ పనిని సాధించాలి.        

వర్గం
మొత్తం కులాల సంఖ్య
కొంత మెరుగైన కులాలు
మరీ వెనుకబడిపోయిన శక్తిహీన కులాలు
షెడ్యూల్డ్ కులాలు
59
ఆది ఆంధ్ర, అరుంధతీయ,మాల, మాదిగ
అనాముక, ఆది ద్రావిడ, బారికి,బుడగ జంగాలు, దొంబర, గోసంగి,కొలుపులవాళ్ళు, మాల దాసరి,మాల జంగం, మాల సన్యాసి, మాతంగి,మెహతార్, ముండల, పాకి, పంచమ,చిందోళ్ళు మొదలైన  కులాలు
షెడ్యూల్డ్ తెగలు
33
గౌడు, కొండ రెడ్లు, కమ్మర, నాయకులు,లంబాడీలు, యానాది, ఎరుకల, వాల్మీకులు
బగట, భిల్లులు, చెంచులు, గడబలు, మన్నేరు వాళ్ళు, గోండులు, కోయలు, సవరలు, మొదలైన  కులాలు
వెనుకబడిన తరగతులు ' ' గ్రూపు
54
అగ్నికుల క్షత్రియ,నాయీబ్రాహ్మణ, మేదరి, మంగలి, వడ్డెర, రజక
బాలసంతు, బుడబుక్కల, దాసరి,దొమ్మరి, గంగిరెద్దుల, జోగి, జంగం,కాటిపాపల, మందుల, మొండిబండ,పంబల, పాముల, పెరికి ముగ్గుల, పిచ్చిగుంట్ల,వీరముష్టి ,మెహతార్ మొదలైన కులాలు
వెనుకబడిన తరగతులు ' బి ' గ్రూపు
28
ఆర్యక్షత్రియ, గౌడ, కుమ్మర,పద్మశాలి, పెరిక బలిజ, విశ్వబ్రాహ్మణ, కురుమ
 అచ్చుకట్ల వాళ్ళు, దేవాంగులు, దూదేకుల,జాండ్ర, కరికాల భక్తులు,సెగిడి, తొగట మొదలైన  కులాలు
వెనుకబడిన తరగతులు ' సి ' గ్రూపు
1
క్రైస్తవులుగా మారిన షెడ్యూల్డ్ కులాల వారు

వెనుకబడిన తరగతులు ' డి ' గ్రూపు
47
భట్రాజులు, కళావంతులు,కొప్పులవెలమ, కృష్ణ బలిజ,ముదిరాజులు, మున్నూరు కాపులు, గవర,ఉప్పర, యాదవ
ఆగరు, ఆరెకటిక, చిప్పోళ్లు,కొడమి, జక్కల, జింగారు,కచ్చి, కండ్ర, కొష్టి, మాలి, నెల్లి,పస్సి, పూసల, సాతాని మొదలైన  కులాలు
వెనుకబడిన తరగతులు '  ' గ్రూపు
14
 షేక్,అచ్చుకట్లవాండ్లు, లబ్బి ,
అత్తరు సాయిబులు,తురక చాకలి, నాయి ముస్లిమ్,గంటా ఫకీర్లు,గారడీ సాయిబులు ,పకీరుసాయిబులు,ఎలుగుబంటు వాళ్లు,కుక్కుకొట్టె జింకసాయిబులు,మొదలైన  కులాలు

ఓట్లే ముఖ్యం కాదు
రాజకీయ లబ్ధికోసం రిజర్వేషన్లు పొందే కులాల సంఖ్య పెంచుతున్నారు. కోటా వాటా పెంచకుండానే రిజర్వేషన్ల జాబితాలో కొత్తకులాలు చేరుస్తున్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ కులాల మధ్య అంతర్గత విద్వేషాలు రేగుతున్నాయి. సుప్రీంకోర్టు రిజర్వేషన్లమీద 50 శాతం  పరిమితిని విధించింది. తమిళనాడులో 69 శాతం ,కర్ణాటకలో 73 శాతం కోటా అమల్లో ఉంది. ఇది చిలికి చిలికి గాలివానలాగా మారి కులాల మధ్య కొట్లాటలు పెరిగాయి. వివిధ కులాల జనాభా దామాషా ప్రకారం ఆయా కులాలకు రిజర్వేషన్ల కోటా దక్కేలా చట్టం చేయాలని ,వెనుకబడిన కులాలలో అభివ్ఱుద్ధి చెందిన కులాలను గుర్తించి కాలక్రమంలో వడపోసి మరీ వెనుకబడినకులాలకు మాత్రమే రిజర్వేషన్ల ఫలితాలు దక్కేలా చేయాలని ఇప్పుడు మరీ బడుగు కులాల వాళ్ళు కోరుతున్నారు.

ముదిరాజ్‌ కులాన్ని బిసి డిగ్రూపులో నుంచి- బిసి గ్రూపులోకి మార్చటం,ముస్లిం లను బిసి ఇ గ్రూపులో చేర్చటం, కాపుల్ని బిసిల్లో చేరుస్తామని హామీలివ్వటం , ఇంకా కొన్ని కులాల గ్రూపులు మార్చటం ,కొన్ని కులాలను జాబితాలోనుంచి తీసేయబూనటం వలన రకరకాల గొడవలు చెలరేగాయి.
వాటా పేదల జనాభా నిష్పత్తిలో ఉండాలి

కొత్త కులాలకు రిజర్వేషన్ ఇవ్వటం తప్పుకాదుగానీ  కొత్తగా చేర్చిన కులాల జనాభాకి తగినట్లు  రిజర్వేషన్‌ కోటా కూడా పెంచాలి .రిజర్వేషన్‌ కోటా బడుగు కులాల జనాభా దామాషాకి తగినంత లేదు.
కోటా పెంచకుండా 93 కులాల బిసి జాబితాని 144 కి పెంచారు. మురళీధర రావు కమిషన్‌ 1986లో బిసి కోటా 44 శాతానికి పెంచాలని సిఫార్సు  చేసినా బిసి కోటా ఇప్పటికీ 29 శాతమే ఉంది. 50 శాతం సీలింగ్‌ వలన పంచాయితీరాజ్‌ స్థానిక సంస్థల్లో బిసిలకు 34 శాతం కోటాను 24 శాతానికి తగ్గించారు. పరిమితిని జనాభా దామాషా ప్రకారం  పెంచుతూ  పార్లమెంట్‌లో చట్టం చెయ్యా లని దేశవ్యాప్తంగా  డిమాండు ఉంది .పూసల, బుడబుక్కల,కాటిపాపల,పంబల,పాముల,గంగిరెద్దుల  లాంటి  ఎంబిసిలను నష్టపరచకూడదు.కులాల సాంఘిక ఆర్ధిక స్థాయి,విద్యాభివృద్ధి , రాజకీయ ప్రాతినిధ్యం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని పునర్వర్గీకరణ చెయ్యాలి.అసెంబ్లీ గడపతొక్కని కులాలను కూడా ఎక్కదీసుకురావాలి.కులాలను రద్దుచేయటం కుదరదు కాబట్టి అభివృద్ధి చెందిన కొన్ని  కులాలు రిజర్వేషన్ల చట్రం నుండి తప్పుకొని త్యాగం చేయక తప్పదు.అలా స్వచ్ఛందంగా  కులమూ తప్పుకోదు కాబట్టి ప్రబుత్వమే కులాల అభివృద్ధి స్థాయిని జనాభా లెక్కలతో పాటుగానీ,పంచవర్ష ప్రణాళిక వారీగా గానీ నిక్కచ్చిగా తేల్చాలి.కులాలను వడపోయకుండా ఇలా శాశ్వతంగా రిజర్వేషన్లను కొనసాగిస్తే మరీ అడుగునబడిపోయిన కులాలు పైకి లేవనే లేవలేవు.ఇలాంటి పద్ధతి అట్టడుగు కులాలకు ఎప్పటికీ అన్యాయం చేసినట్లే అవుతుంది. 

(ఆంధ్రప్రభ 8.8.1989)



 (నమస్తే తెలంగాణ 22.9.2013) 
http://epaper.namasthetelangaana.com/Details.aspx?id=72011&boxid=808949368
గీటురాయి 11.10.2013
https://www.facebook.com/photo.php?fbid=635642593134401&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater

 https://www.facebook.com/nrahamthulla/posts/643350795696914

2 కామెంట్‌లు:

  1. Reservations are not on the basis of
    Poverty' but on the basis of 'Social and Educational Backwardness' whoever till know Govts and the commissions failed to identify Backwardness, thus made them to adopt Cast=Class formula which is not scientific.

    రిప్లయితొలగించండి