ఈ బ్లాగును సెర్చ్ చేయండి

11, సెప్టెంబర్ 2013, బుధవారం

ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించాలి



ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించాలి
నూర్ బాషా రహంతుల్లా  ఫోన్ 9948878833


           ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరినీ తిరస్కరించే హక్కు ఓటర్లకు ఉందని ,అభ్యర్థులను తిరస్కరిస్తూ ఓటు వేసేందుకు అనుమతించాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది. తిరస్కార ఓటుకు అనుమతించడం వల్ల ఎన్నికల్లో పారదర్శకత పెరుగుతుందని, పార్టీలు మంచి అభ్యర్థులను మాత్రమే పోటీలో నిలబెట్టేలా ప్రభావం పడుతుందని న్యాయస్థానం పేర్కొంది. పార్లమెంట్‌లోనూ ఓటింగ్‌ సమయంలో తిరస్కార ఓటుకు అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఓటు వేయడం చట్టబద్ధమైన హక్కు, అభ్యర్థులను తిరస్కరించడం ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు పేర్కొంది. 13 దేశాలలో తిరస్కార ఓటు అమల్లో ఉందని వెల్లడించింది.

          ఎన్నికల్లో తిరస్కార ఓటుకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ,ఎవరికీ ఓటు వేయడం ఇష్టం లేదని ఇంట్లో కూర్చునే వారు కనీసం వారి ఓటు ద్వారా నిరసనను తెలిపే అవకాశం ఉంటుందని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ అ న్నారు. ఎన్నికల్లో తిరస్కార ఓటుకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించడం ప్రజాస్వామ్యానికి ఉపయోగకరమైన కీలక తీర్పు అని, రాజకీయపార్టీలు ఈ తీర్పును అంగీకరించకపోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం మాజీ సలహాదారు కేజే రావు అభిప్రాయపడ్డారు.ఈ సూచన తప్పనిసరిగా ఆహ్వానించదగినదే. అయితే ఈ సూచనతో పాటు సమాజసంపదను వృధా కాకుండా కాపాడేదీ ,సమాజంలో ప్రజాస్వామ్యయుతంగానే శాంతి సామరస్యాలను పెంపొందించేది అయిన ఏకగ్రీవ ఎన్నికల పద్ధతిలోని లోపాలను సవరించుకొని మరింత కట్టుదిట్టంగా అమలుజరపాలి :
 

ఈ మధ్య అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ముఖ్యమైన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలబరిలోనుంచి తప్పుకున్నాయి.కానీ ఇద్దరు స్వతంత్ర అభ్యర్డులు మాత్రమే  పోటీలో నిలబడ్డారు.ఎన్నికలో నిలబడ్డవారు తక్కువమందే అయినా ప్రభుత్వానికి ఎన్నికల ఖర్చు తప్పలేదు.అధికారులకు శ్రమా తప్పలేదు.ఇద్దరే నిలబడ్డా ఎన్నికలతంతు మాత్రం షరా మామూలే.ఈ ఎన్నికల ఖర్చు మన దేశానికి పెద్ద అనుత్పాదకవ్యయం.ప్రజలకు ఎన్నో పనిదినాలు దండుగ.అయినా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎన్నికలు తప్ప మరో మార్గం కనుచూపుమేరలో కనబడటం లేదు.ఎన్నికలు పెట్టకపోతే నియంతృత్వం అంటారు.పెడితే విపరీతమైన ఖర్చు.ఖర్చు ప్రభుత్వానికే కాక పార్టీలకూ అభ్యర్ధులకూ కూడా ఉంటుంది.ఓటర్లకు ఎర వెయ్యాలి.సారా పోయించాలి.లంచమివ్వాలి.వాగ్దానాలు చెయ్యాలి.తగాదాలు,కొట్లాటలు జరుగుతాయి.వాటిని ఆపటానికి , శాంతి భద్రతలు కాపాడటానికి పోలీసులు సైన్యము రంగంలో దిగాలి.ఇదంతా సమాజంలోని ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతుంది.ఇవన్నీ ఆలోచించే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహక నగదు బహుమతి అందజేస్తోంది.
ఏకగ్రీవ ఎన్నిక పద్దతి వలన లాభాలు

1. ఎన్నికల కోసం అభ్యర్దులు, ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఏకగ్రీవ ఎన్నికల ద్వారా మిగులుతుంది.ప్రజలనుండి కంపెనీల దగ్గర విరాళాలు వసూలు చేయనక్కరలేదు.తద్వారా అవినీతి,ధరలు తగ్గుతాయి.
2. ఘర్షణలు కొట్లాటలు హత్యలు ఉండవు. సామరస్య వాతావరణం నెలకొంటుంది.
3. ప్రచారం, సారాయి లాంటి అనుత్పాదక ఖర్చులు తగ్గటమేకాక ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నగదు బహుమతిని ఆయా ప్రాంతాల అభివృద్ధికే వినియోగించవచ్చు.
4. అధికారుల యొక్క సమయం శ్రమ ఆదా అవుతుంది.
5. అభ్యర్థుల ప్రచారం ఉండకపోవుటచే శబ్ద కాలుష్యం బాధ తగ్గుతుంది.విద్యార్ధుల చదువులు ఆటంకం లేకుండా సాగుతాయి.
నిర్లక్ష్యం నీరుగార్చటానికి తలోచెయ్యి  
ఇంత మంచి ప్రయోజనమున్న పధకాన్ని ప్రభుత్వయంత్రాంగం ఒకసారి నీరుగారిస్తే ప్రజలు అభ్యర్డులు కూడా ఇక నమ్మరు.అసలు ఈ ప్రోత్సాహకమే వద్దు ఎత్తేయమంటారు.ఓటింగ్ మెషీన్లలో తప్పులొస్తున్నాయనే నెపంతో అసలు మెషీన్లే వద్దన్నట్లు లోటుపాట్లు సవరించమని అడగకుండా స్కీమునే ఎత్తేయండని కోరే జనం కూడా ఉంటారు.నిజానికి ఓటింగ్ మేషిన్ల వల్ల కౌంటింగ్ సిబ్బందికి ఎంతో మేలు జరిగింది.ఒక్కోసారి కౌంటింగ్ పూర్తయ్యే సరికి మరుసటి రోజు తెల్లారేది.నిద్రాహారాలు మాని జోగుతూ సిబ్బంది బ్యాలెట్ పేపర్లు లెక్కపెట్టేవారు.ఇలాంటి పరిస్థితిలో ఎన్నికల సిబ్బందికి వరం లా వచ్చాయి ఓటింగ్ యంత్రాలు.ఈ మంచి ఉపకరణాలను మరింత మెరుగుపరచాలి.లోపరహితంగా తీర్చిదిద్దాలి.ప్రజలకు ప్రయోజనాలు అందించే మంచి పధకాల అమలులో నిర్లక్ష్యం పనికి రాదు.ఫలితాలను అందించటంలో ఆలస్యం చేయకూడదు. ఉదాహరణకు  2008 పంజాబ్  ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలు 2806 ఉంటే 2013 లో 2019 కు తగ్గిపోయాయి.కారణం ఏకగ్రీవ పంచాయతీలకి 3 లక్షల చొప్పున  ఇస్తామన్న ప్రోత్సాహక బహుమతి 84 కోట్లు 2008 నుండి 2013 వరకు ఇవ్వకపోవటమే.
మన రాష్ట్రంలో పరిస్థితి  
మన రాష్ట్రంలో 1964 లోనే ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు మెంబర్లకు రూ. 2000 సర్పంచులకు రూ. 5000, పంచాయతీలకు రూ. 25000 ఇస్తే అప్పట్లో 6000 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి.రాజకీయ కక్షలు మాని,అలా వచ్చిన డబ్బుతో గ్రామాలలో అందరికీ అవసరమైన స్థిరాస్తులు ఏర్పాటు చేసుకుంటారనీ,అభివృద్ధి పనులు చేసుకుంటారనేదే ప్రభుత్వ ఉద్దేశం.2006 లో మేజర్ గ్రామ పంచాయతీలకు 15 లక్షలు మైనర్ పంచాయతీలకు 5 లక్షలకు ప్రోత్సాహకం పెంచారు.2006 ఎన్నికలలో ఏకగ్రీవంగా గెలిచిన 2924 గ్రామపంచాయతీ సభ్యులకు 146.50 కోట్ల రూపాయలు 101 పంచాయతీలకు 5.15 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో సక్రమంగానే చెల్లించారు. 2013 లో ఈ ప్రోత్సాహకాలను ఇంకా పెంచారు.ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలకు 5 లక్షలు ఇవ్వాలని ప్రతిపాదించారు. 15వేల జనాభాలోపు గ్రామాలకు 7 లక్షలు,15 వేల జనాభా పైబడ్డ గ్రామాలకు 20 లక్షలు చేశారు.అయితే ప్రభుత్వ సదుద్దేశాన్నీ నీరుగార్చుతూ అభ్యర్డులు వేలంపాటల రేటుకూడా పెంచేశారు.
అమ్ముడుపోతున్న ప్రజాస్వామ్యం
కొన్ని చోట్ల సర్పంచి పదవుల్ని గ్రామాలలో వేలం పాట పెట్టి ఎవరు ఎక్కువమొత్తానికి పాడుకుంటే వారికే ఆ పదవి వచ్చేలా ఏకగ్రీవం చెయ్యటం లాంటి దొంగపనులకు పాల్పడ్డారు.అలా వచ్చిన డబ్బుతో కొన్ని చోట్ల గుడులు బాగుచేసుకున్నారు తప్ప రోడ్లు,మురుగుకాలువలు లాంటి సామూహిక అవసరాలు తీర్చుకోలేదు.కొన్ని చోట్ల కులానికింత అని తలా కొంత పంచుకున్నారు.మన రాష్ట్రంలోని 21441 గ్రామ పంచాయతీలలో 1000 పంచాయతీలు మొన్న జరిగిన ఎన్నికలో ఏకగ్రీవం అయ్యాయి.తప్పుడు ఏకగ్రీవాలతో నైతిక విలువలు పతనమైన నేటి సమాజానికి ఈ ప్రోత్సాహక బహుమతులు ఇవ్వటం అనవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే యోచనలో రాష్ట్ర ఎన్నికల సంఘం పడిందట.
మరో ప్రయోగం
2001 లో గుజరాత్ లోని కుంకువా గ్రామం లో ప్రభుత్వం ప్రకటించిన ఎన్నికల తేదీ కంటే ముందే  గ్రామ ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రైవేటుగా ఎన్నికలు పెట్టుకున్నారు.ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్ధి  మాత్రమే నామినేషన్ వేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ పద్ధతి తాపీ జిల్లా అంతటా పాకింది.2011 లో మోడీ కూడా ఈ పద్ధతిని మెచ్చుకొంటూ కొన్ని అదనపు హంగులు చేర్చి ప్రోత్సాహకాలను మరింతగా పెంచాడట. దాని ప్రకారం మహిళా అభ్యర్ధిని ఎన్నుకుంటే 7 లక్షలు అదనం గా వస్తాయి.రెండోసారి ఏకగ్రీవం అయితే 25% నిధులు, సిమెంటు రోడ్డు,మూడోసారి ఏకగ్రీవం అయితే ఇంకో 25% అదనపు నిధులు, అప్పర్ ప్రైమరీ స్కూలు వస్తాయి.ఏకగ్రీవ పంచాయతీలకు అభివృద్ధి పనుల్లో ప్రాధాన్యతా ఉంటుంది.
మన రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యులు

* 1952 : షేక్ షాజహాన్ బేగం పరిగి శాసనసభ నియోజకవర్గం
* 1952 : కె.వి.పడల్ పాడేరు శాసనసభ నియోజకవర్గం
* 1952 : ప్రకాశం పంతులు శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం
* 1952 : కె.వి.పద్మనాభరాజు ఉత్తరపల్లి
* 1952 : శ్రీరంగం చిత్తూరు శాసనసభ నియోజకవర్గం
* 1952 : వీరాస్వామి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం
* 1952 : పి.వి.జి.రాజు విజయనగరం శాసనసభా నియోజకవర్గం
* 1952 : గంట్లాన సూర్యనారాయణ విజయనగరం శాసనసభా నియోజకవర్గం
* 1955 : ఎన్.వెంకటరత్నం బూరుగుపూడి
* 1955 : రామారావు కామారెడ్డి
* 1955 : టి.ఎన్.వి.రెడ్డి తంబళ్ళపల్లి
* 1956 : అల్లం కృష్ణయ్య వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం
* 1957 : సీతాకుమారి బన్స్ వాడ
* 1957 : పద్మనాభరెడ్డి వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం
* 1957 : పి.మహేంద్రనాద్ నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1957 : భాట్టం శ్రీరామమూర్తి విజయనగరం శాసనసభా నియోజకవర్గం
* 1960 : జి.డి. నాయుడు శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం
* 1962 ,1972 : బి.వి.సుబ్బారెడ్డి కోయిలకుంట్ల
* 1962 : డి.లక్ష్మీకాంతరెడ్డి ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం
* 1962 : టి.రంగారెడ్డి ఆర్మూరు
* 1962 : కె.పున్నయ్య ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం
* 1962 : కె.రాంభూపాల్ గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం
* 1962 : కే.వి.రెడ్డి బోదన్
* 1962 : ఎ.రామస్వామి వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం
* 1967 కె.లక్ష్మీనరసింహరావు జగిత్యాల శాసనసభ నియోజకవర్గం
* 1968 ఎ.సంజీవరెడ్డి రాపూరు
* 1968 కె.రామయ్య బూర్గుంపహాడ్
* 1970 ఎం.ఎస్.సంజీవరావు రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం
* 1972 ఎస్.భూపాల్ అమరచింత
* 1972 చింతలపాటి వరప్రసాద మూర్తి ఉంగుటూరు శాసనసభ నియోజకవర్గం
* 1972 ఎమ్.రామమోహనరావు చింతలపూడి శాసనసభ నియోజకవర్గం
* 1972 ఎన్.రామచంద్రారెడ్డి డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం
* 1972 ఇ.అయ్యపురెడ్డి పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 ఎం.మాణిక్ రావు తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 కళ్యాణ రామచంద్రరావు మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 జి.గడ్డెన్న ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 ఎం.సుబ్బారెడ్డి నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 డి.మునుస్వామి కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 ఎస్.పి.నాగిరెడ్డి మైదుకూరు శాసనసభ నియోజకవర్గం
* 1972 వి.రామకృష్ణచౌదరి అనపర్తి శాసనసభ నియోజకవర్గం
* 1972 పి.నర్సారెడ్డి నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 : అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం : మండలి వెంకటకృష్ణారావు
* 1972 : చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం (ఆదిలాబాదు జిల్లా) : కోదాటి రాజమల్లు
* 1972 : పెనుమత్స సాంబశివరాజు గజపతినగరం శాసనసభా నియోజకవర్గం
* 1974 ఆర్.సురేందర్ రెడ్డి డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం
* 1975 ఎన్.యతిరాజారావు చెన్నూరు
* 1981 టి.అంజయ్య రామాయంపేట
* 2002 : దేవరకొండ శాసనసభ నియోజకవర్గం : రాగ్యానాయక్ భార్య దీరావత్ భారతి
ఎమ్మెల్యేలకూ ఎంపీలకూ కూడా
గ్రామ పంచాయతీలకు ఇచ్చినట్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైన  ఎమ్మెల్యేలకు ప్రోత్సాహక బహుమతి ఏమన్నా ఇచ్చారో లేదో నాకు తెలియదు.ఏమైనా ఇంతమంది ఎమ్మేల్యేలు ఏకగ్రీవంగా ఎన్నికకావటం సంతోషదాయకం,గర్వకారణం.ఏకగ్రీవ ఎన్నికల పద్ధతిలో లోపాలు ఏమన్నా వుంటే సరిదిద్దుకోవాలి,ప్రోత్సహించాలి గానీ ఇం మంచి పద్ధతిని ఎండగట్టకూడదు.మన ఎన్నికల సరళి బ్యాలెట్ పేపర్ దశనుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల వరకూ ఎన్ని సంస్కరణల్కు గురయ్యిందో మనకు తెలుసుకదా?అందుకే ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఎంపీ నియోజకవర్గాలకు కూడా భారీగా ప్రోత్సాహక నిధులు కేటాయించాలి.ఎంపీ ల్యాడ్స్ పేరుతో ఇప్పుడిస్తున్న నిధులు దుర్వినియోగమౌతున్నాయని కాగ్ అక్షింతలు వేసిందని నిధులివ్వటం ఆపేయలేదు కదా?అలానే ఎంతో మంచిదైనా ఏకగ్రీవ పద్ధతిని కూడా మేధావులు నాయకుల మధ్య చర్చకు పెట్టి అనుమానిస్తున్న లోపాలకు పరిష్కారమార్గాలు కనుగొని భవిష్యత్తులో శ్రేయస్కరమైన ఏకగ్రీవ ఎన్నికలను మరింత విస్తరించి ప్రోత్సహించాలి.
గీటురాయి  10.1.2014
 https://www.facebook.com/nrahamthulla/posts/693264554038871?notif_t=like
 https://www.facebook.com/photo.php?fbid=731098140255512&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater
గీటురాయి 28.3.2014


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి