ఈ బ్లాగును సెర్చ్ చేయండి

29, జూన్ 2019, శనివారం

నిరుద్యోగం తగ్గేదెలా ?


నిరుద్యోగంపై రకరకాల నిరుద్యోగులపై 2017 లో నీతి అయోగ్ సర్వే జరిపింది.నిరుద్యోగులకు ఎలా మేలు చెయ్యాలో చెప్పమని అభిప్రాయాలూ కోరింది. పనీపాటా లేక ఖాళీగా ఉండే యువతరం ఇండియాలోనే అధికమని,అది 30 శాతం ఉందని ఇటీవల ఐఎమ్ఎఫ్ ఆర్ధికవేత్త జాన్ బ్లూడోర్న్ అన్నారు. అమెరికా, జపాన్‌, చైనా దేశాల జనాభాలో మూడోవంతు 65 ఏళ్ల వృద్ధాప్యంలో ఉంటే, 64 శాతం పనిచేసే 29 సంవత్సరాల వయసులో ఉన్న జనావళితో ఇండియా పరవళ్లెత్తుతోందట. అందుకని బాగా పిల్లల్ని కనండి,వాళ్ళను భారతమాతే పోషిస్తుంది అని కొందరు నాయకులు అదేపనిగా జనాన్ని రెచ్చగొడుతున్నారు.ఉద్యోగాల కల్పనకు మాత్రం వారిదగ్గర పధకాలు ఏమీ లేవు.చివరికి సైన్యంలో చేరటానికి పోటెత్తిన యువకులను కంట్రోల్ చేయలేక కూడా పోలీస్ లాఠీలు విరుగుతున్నాయి. 
 కళాసీ ఉద్యోగాలకు పీహెచ్ డీ లు
దేశంలో నిరుద్యోగిత రేటు 9.7  శాతానికిచేరింది. దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా ఉపాధి కోల్పోయారు. వీళ్లలో 84 శాతం మంది గ్రామీణులే. వ్యవసాయ రంగ సంక్షోభంతో పల్లెల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోయి పనిని వెతుక్కుంటూ పట్నాలకు వస్తున్న లక్షల మందికి ఇక్కడా రిక్తహస్తాలే ఎదురవుతున్నాయి.దేశంలో విద్యావంతులైన యువత తక్కువ జీతాలు లభించే ఉద్యోగాల్లోకి తమ నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలు దుర్లభమవుతున్న దుస్థితిలో చేరుతున్నారు. యువతరం ఏదో ఒక ఉద్యోగం దొరికితే చాలు అనుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ లో 6వేల నాలుగవ తరగతి  ఉద్యోగాలకు ప్రకటన ఇస్తే 25 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఎనిమిదో తరగతి విద్యార్హత సరిపోయే ఈ ఉద్యోగాలకు పీజీలు, పీహెచ్‌డీలు చేసిన వారూ వరసలో నిలబడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 368 బంట్రోతు ఉద్యోగాలకు 23 లక్షల మంది పోటీపడ్డారు. వీళ్లలో లక్షన్నర మంది డిగ్రీ పట్టాదారులు, డాక్టరేట్లు సాధించిన వారు 250 మందికి పైగా ఉన్నారు. కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ ఇటీవల ఇలాంటి దృశ్యాలే చోటుచేసుకున్నాయి. 18- 23 ఏళ్ల వయసులో ఉన్నత విద్యలో చేరే వారి శాతం 2005లో 12 శాతంగా ఉండేది. 2015 నాటికి ఇది 24.5 శాతానికి పెరిగింది. దశాబ్దకాలంలో దేశంలో ఉన్నత విద్యావంతులు రెట్టింపు పెరిగారు గానీ  వారి సంఖ్యకు తగినట్టు ఉపాధి అవకాశాలు మాత్రం పెరగలేదు.కొన్నిరాష్ట్రాల్లో ఉద్యోగాలు కల్పించలేక నిరుద్యోగ భృతిని కూడా ప్రవేశపెట్టారు.
నిరుద్యోగ విద్యావంతులు పెరిగారు
ఉద్యోగాలసృష్టి లేకపోగా ఉన్న ఉపాధి అవకాశాలన్నీ అతితక్కువ ఆదాయాన్ని సమకూర్చేవే కావడం వల్ల ఎక్కువ జీతాలు వచ్చే దేశాలకు మన పిల్లలు వలస పోతున్నారు.దేశవ్యాప్తంగా 67.6 శాతం కుటుంబాల ఆదాయం నెలకు రూ.10 వేల లోపే. వీటిలో 22 శాతం కుటుంబాలైతే నెలకు రూ.5 వేల కన్నా తక్కువ ఆదాయంతోనే జీవనం సాగిస్తున్నాయి. 13  శాతం కుటుంబాలు మాత్రమే నెలకు రూ.20 వేలకు పైన సంపాదిస్తూన్నాయి. గల్ఫ్‌, మలేసియా, సూడాన్‌, థాయిలాండ్‌ తదితర దేశాలకు మూడేళ్లలో 17  లక్షల మంది వలసెళ్లారు.
స్వయంఉపాధి కల్పన
 ‘125 కోట్ల జనాభా ఉన్న దేశంలో ప్రతి ఒక్కరికీ ఉద్యోగం చూపించడం సాధ్యం కాదు. మేం స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం 8 కోట్ల మందికి స్వయంఉపాధి కల్పించిందిఅని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు.ఇన్నికోట్లమందికి స్వయం ఉపాధి కల్పించినా నిరుద్యోగులు తగ్గనేలేదు. ఇంకా పెరుగుతూనే ఉన్నారు.
రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) గ్రూప్‌-డి కేటగిరీలోని దాదాపు 63 వేల కళాసీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తే- రెండు కోట్లమందికి పైగా నిరుద్యోగులు పోటీపడ్డారు. రైల్వే గేట్‌మెన్‌, కార్యాలయంలో సహాయకుడు, పట్టాల బాగోగుల్ని పరీక్షించే గ్యాంగ్‌మెన్‌ ఉద్యోగాలకు పదో తరగతే  అర్హత కానీ  82 లక్షల మంది ఉన్నత విద్యావంతులు బారులు తీరారు.ఎంటెక్‌ చేసినవారు కళాసీ ఉద్యోగాలకు క్యూలు కట్టడం నిరుద్యోగం  ఎంతగా ఊడలు దిగిందో వెల్లడిస్తోంది. నాలుగున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతస్థాయిలో నిరుద్యోగిత జడలు విరబోసుకొంది. ఉన్నత విద్యావంతుల్లోని నిరుద్యోగుల గోడు అన్నిచోట్లా ప్రతిధ్వనిస్తోందిప్పుడు! పనిమంతులు దొరకట్లేదని కార్పొరేట్లు, అసలు పనే దొరకట్లేదని పట్టాలు చేతపట్టుకొన్న నిరుద్యోగులూ వాపోతున్నారు.ఉపాధికి ఊతమిచ్చే చదువులు కావాలిగానీ  విద్యారుణాల మాఫీతోనే ఉద్యోగాలొస్తాయా?రెండేళ్ళ విలువైన సమయాన్నీ,లక్షలాది రూపాయల కష్టార్జితాన్ని ఇంటర్మీడియేట్ అనే పనికిరాని చదువుకు ధారపోయించకుండా,పోలిటెక్నిక్ కోర్సులను బహుళప్రయోజకంగా తీర్చిదిద్దాలి.స్వయం ఉపాధి పధకాలు ఇంకా కొన్ని కోట్లమందికి చేరాలి.
వ్యవసాయాధార , చిన్న తరహా పరిశ్రమలే కీలకం    
ప్రస్తుతం ప్రపంచంలో 22 కోట్ల మందికి పైగా నిరుద్యోగులున్నారు.ఉద్యోగాల కల్పనలో ప్రైవేటు రంగందే కీలకమైన పాత్ర. ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటు రంగంలో 280 కోట్ల మంది పనిచేస్తున్నారు.ఉద్యోగుల సంఖ్యలో ఇది 87 శాతం. ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చే విషయంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలే కీలకం. 132 దేశాల్లో చిన్న, మధ్యతరహా రంగం 52 శాతం ఉద్యోగాలు కల్పించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని దాదాపు 78 కోట్ల మంది కార్మికులు ఇప్పటికీ తీవ్రమైన పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు.140 కోట్ల మంది కార్మికులు భద్రత లేని ఉద్యోగాల్లో ఉన్నారు. వారికి శాశ్వత ఉద్యోగాలు లేవు, స్థిరమైన ఆదాయాలు లేవు, సాంఘిక భద్రతా లేదు. పరిశ్రమలకు చౌకగా కేటాయించిన  మన ప్రజల భూముల్లో మన యువకులకు వచ్చిన ఉద్యోగాలెన్నో ఆరా తీయాలి.
వలస భారమై - తల్లిదండ్రులకు దూరమై
నగరాల్లో ఉపాధికోసం గ్రామాలనూ తల్లిదండ్రుల్నీ వదలక తప్పని పరిస్థితి దాపురించింది.రాజధాని నగరాల చుట్టుపక్కల తప్ప ఇంకెక్కడా ఉద్యోగాలు దొరకనంతగా ఉపాధికల్పనా వ్యవస్థ కేంద్రీకృతమయ్యింది.ముందు మద్రాసుకు,ఆ తరువాత హైదరాబాదుకు,ఇంకా విదేశాలకూ ఉపాధి కోసం మన యువకులు వలసలు పోవటంతో మన పల్లెలన్నీ వృద్ధాశ్రమాల్లాగా తయారయినాయి.తల్లిదండ్రుల్ని కూడా ఆ మహానగరాల్లో తమతో పాటు ఉంచుకుందామంటే చాలీ చాలని అద్దె అపార్టుమెంట్లలో అందరికీ కుదరదు.ఇక్కడ ఉండే ముసలోళ్ళకు మందుబిళ్ళ తెచ్చిఇచ్చే వాళ్ళు కూడా కరువయ్యారు.మంచానపడిన వృద్ధులకు కావలసింది డబ్బు ఒక్కటే కాదు.వాళ్ళ కడుపున పుట్టిన బిడ్డల ఆత్మీయ పలకరింపు, స్పర్శ కూడా.
దూరమైపోయిన పిల్లల కోసం తల్లిదండ్రులు బెంగతో మనోవ్యాధుల బారిన పడుతున్నారు.చాలీచాలని జీతంతో భార్యాబిడ్డల్ని పోషించుకుంటూ, తల్లిదండ్రులకేమీ చేయలేకపోతున్నామనే వ్యధతో నగరంలోనే బ్రతుకులీడుస్తున్న యువకులు జీవితంపై విరక్తి చెందుతున్నారు.మావాడు హైదరాబాదులోనో మరో నగరంలోనో జాబ్ చేస్తున్నాడని గొప్పలు పోవటమేగానీ,అతనికి అక్కడ ప్రైవేటు కంపెనీలలో తన సొంత పని చూసుకొనేంత ఖాళీ సమయం కూడా లేని వెట్టిచాకిరీని తలుచుకుంటే తల్లిదండ్రుల మనసు నీరౌతోంది.కలిసి ఉంటే కలదు సుఖము అన్నారు.లక్షలాది కుటుంబాలు కలిసి ఉండాలంటే ఇకనైనా మండలస్థాయి వరకు ఉపాధికేంద్రాల వికేంద్రీకరణ జరగాలి.పల్లెటూళ్ళలో కూడా పనులు దొరకాలి.నిరుద్యోగికి ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టి ఆత్మవిశ్వాసము సన్నగిల్లి ఆత్మహత్యలు కూడా చేసుకొంటూ ఉంటారు.అందువలన నిరుద్యోగులపట్ల సానుబూతి కలిగి వాళ్ళకు ఉద్యోగాలు ఎలా కల్పించాలో అని పాలకులు సదా ప్రణాళికలు రూపొందిస్తూ ఉండాలి.కేవలం చదివి ఉంటే లాభంలేదు.చదివిన చదువు వల్ల ఉపాధి దొరికినప్పుడే చదువు సార్ధకం అవుతుంది.
గ్రామ వాలంటీర్లు
మన రాష్ట్రంలో సొంత ఊళ్ళోనే  పనిదొరికే గ్రామ వాలంటీర్ల నియామకం నిరుద్యోగులకు కొంత ఉపశమనమే. కానీ మరీ చిన్న జీతమని కొందరు పెదవి విరుస్తున్నారు.అసలు ఉద్యోగమే లేని రోజుల్లో చిన్నదో పెద్దదో మన ఊళ్ళోనే రావటం నయమేలే సర్దుకుపోదాం అని కొందరు సంబరపడుతున్నారు.అయితే ఈ ఉద్యోగాలఎంపిక హడావుడిగా రాజకీయనాయకులతో కూడిన కమిటీలద్వారా కాకుండా ఒక అర్హతా పరీక్షపెట్టి సర్వీస్ కమీషన్, జిల్లా ఉపాధికల్పనా కేంద్రాల ద్వారా నియమిస్తే బాగుండేది. ఎందుకంటే లక్ష్యం మంచిది కాబట్టి ఈ వాలంటీర్లకు పూర్వ నేరచరిత్ర ,త్రాగుడు లాంటి గుణగణాలను ముందుగానే పోలీసు ఎంక్వైరీ రిపోర్టు తీసుకోవాలి.లేకపోతే కొంతమంది అవినీతిపరులైన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా ఎదురైన సమస్యలే మళ్ళీ ఎదురౌతాయి. ఉద్యోగకల్పన సంస్తలన్నిటినీ ఒకే శాఖ పరిధిలోకి తెచ్చి అయోమయాన్ని పోగొట్టాలి.ఉద్యోగంకోసం ఎవరిని ఎప్పుడు ఎలా కలవాలి అనే విషయమై స్పష్టత తేవాలి.కార్మిక,ఉపాధికల్పన కేంద్రాలు,సర్వీసు కమీషన్లాంటివన్నీ ఒకే గొడుగు కిందకు రావాలి.అన్ని రకాల ఉద్యోగాలలో ఏర్పడే ఖాళీలను ప్రతిఏటా భర్తీ చేస్తూ ఉండాలి.
--నూర్ బాషా రహంతుల్లా 6301493266  (సూర్య 30.6.2019)

22, జూన్ 2019, శనివారం

సూర్యుడు ఇలా నిప్పులు కక్కుతున్నాడేమీటీ?


సూర్యుడు ఇలా నిప్పులు కక్కుతున్నాడేమీటీ?
8.6.2019 తేదీన కువైట్ సిటీ లో 63 డిగ్రీ ల ఉష్ణోగ్రత నమోదైనట్లు ఒక వార్త వచ్చింది. కాలిఫోర్నియా లో 1913 లో నమోదైన 56.7 డిగ్రీలే ఇప్పటివరకు రికార్డట.దేశవ్యాప్తంగా ఎండలకు వందలాదిమంది చనిపోయారు. గయలో ఎండ మండిపోతోంది  బయటకురావద్దు అంటూ 144 వ సెక్షన్ విధించారు. అసలు ఇంతగా ఉష్ణం ఉగ్రత దాల్చడమేమిటి?సూర్యుడు ఇలా నిప్పులు కక్కుతున్నాడేమీటీ? ఇలాగైతే కార్చిచ్చు చెలరేగి అడవులు తగలబడిపోతాయి.వన్యప్రాణులు సజీవదహనమవుతాయి.అడవుల్లో దావానలం చెలరేగకముందే ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకోవాలని రితుపర్డ్ ఉన్యాల్ అనే ఉత్తరాఖండ్ వ్యక్తి  సుప్రీంకోర్టులో పిటీషన్ వేశాడు.తీర్పువచ్చేదాకా కార్చిచ్చు తగ్గేందుకు వరుణజపం చేస్తూ ఉండమని సుప్రీం కోర్టు అతనికి సలహా ఇచ్చింది.
చెట్లు కొట్టేస్తున్నారు
భూమిమీద మూడు లక్లల కోట్ల చెట్లు ఉన్నాయని 2015 లో యేల్ యూనివర్శిటీ లెక్కలు తేల్చి చెప్పింది. మనిషికి సగటున 422 చెట్లు మాత్రమే ఉన్నాయట.ఏటా 15 వందల కోట్ల చెట్లు అంతం అవుతున్నాయట. మూడువందలఏళ్ళలో చెట్లన్నీ అంతరించిపోతాయట. 2016 లో పారిశ్రమిక అభివృద్ధి వేగంగా జరగటం కోసం నివాస ప్రాంతాలలోని చెట్లు నరికే  నిబంధనలను సరళతరం చేశారు.ఎర్రచందనం,చందనం,రోజ్ ఉడ్ చెట్లు నరకకూడదు.టేకు,ఎగిస,నల్లమద్ది,బండారు,చెట్లు నరకటానికి రిస్కుగా భావిస్తారు. కరెంటు డిపార్ట్ మెంట్ వాళ్ళు చెట్లకొమ్మలను కొట్టినా ప్రజలు బాధపడుతుంటారంటే చెట్లు ఇస్తున్న నీడతో ,ఆ చెట్లతో మనిషి అనుబంధం తెంచుకోలేనిదన్నమాట. నారింజ,నిమ్మ,తాటి,జామ,సీమచింత,తుమ్మ,రేగు,మామిడి,పనస,కొబ్బరి,జీడిమామిడి లాంటి చెట్లు కొట్టుకోవచ్చు.చెట్లు నరకటానికి అనుమతి తీసుకోవాలి.చెట్లు నరికినవారు దగ్గరలో దానికి రెట్టింపు మొక్కలు నాటాలి. మొక్కలు నాటడానికి ఎక్కడికో వెళ్లి నాటనక్కరలేదు మన కున్న కొద్ది స్తలంలో  చాలు. నాటలని మనసు ఊండాలి. ఎంతమంది ఎన్నివిధాలుగా చెట్లు నాటవచ్చో?ఒక అమ్మాయి తన గుడిసె చుట్టూ పది రకాల చెట్లను పోషిస్తే ఇంకోకాయన తన కూతురుకోసం రోడ్డమ్మట వెయ్యిచెట్లను కాపాడాడు.ఎవరికి ఎలా చేతనైతే అలా పచ్చదనాన్ని పెంచండి.
చెట్లు నరకడం వల్ల భూగోళం వేడెక్కుతుంది తద్వారా మంచు ఖండాలు కరిగి  సముద్ర మట్టం పెరుగుతుంది. భూభాగం  సముద్రాలలో కలసిపోయి  మన భవిష్య తరాలకు ఊండటానికి చోటు ఉండదు.ఒక బోన్సాయ్ మొక్క  అణుబాంబుకాలుశ్యాన్నీ తట్టుకొని నిలబడిందట. ఇంట్లో  టీవీ,ఫ్రిజ్,ఎసి,కంప్యూటర్ ఇంకా ఇతరత్రా ఎలక్ట్రానిక్ వస్తువులు విడుదలచేసే వేడి వాయువుల్ని తగ్గించుకోవాలంటే  ఇంటిలో కూడా మొక్కలు పెంచు కోవాలని చెబుతున్నారు. ఇప్పటిదాకా  చెట్లు నరికివేసిన జనం ఇప్పుడు భూమివేడెక్కేటప్పటికి  చల్లదనం, పచ్చదనం కోసం భవనాలపై కూడా  మొక్కలు పెంచుతున్నారు.
మూఢనమ్మకాలు
కొన్ని మూఢనమ్మకాలతో మంచి మొక్కలనుకూడా ఇళ్ళల్లో పెంచటం లేదు.ఉదాహరణకు కరివేపాకు  చెట్లను ఇళ్ళల్లో కూడా పెంచితే పచ్చదనం,సువాసన,నీడ, వంట దినుసు...ఇలా ఎన్నో లాభాలున్నాయి.మన పరిసరాలు బాగుంటాయి.కానీ ఇళ్ళలో పెంచకూడదనే మూఢనమ్మకం ప్రజల్లో ఉంది.నేను ఉచితంగా మొక్కలు ఇచ్చినా కొంతమంది తీసుకోలేదు..'కరివేపాకు కాసులు కురిపించే లక్ష్మీదేవి'అని బాగా ప్రచారం జరగాలి.కరివేపాకు పెరట్లో పెంచితే మంచి జరుగుతుందని స్వాములవార్లు,సిద్ధాంతులు చెప్పాలి.ముళ్ళుకూడా లేని సుగంధ మొక్క కాబట్టి ప్రతి పెరడూ కరేపాకుతో కళకళ లాడాలి.మన పర్యావరణం బాగుపడాలి.
నదిలో ఇసుక తోడేస్తున్నారు
ఇష్టారాజ్యంగా ఇసుక మాఫియాలు తయారై నదిని నాశనం చేస్తున్నారు.నదీతీరంలో ఉండే పెద్ద వృక్షాలను నరికేస్తున్నారు. రోడ్లవెడల్పుకోసం నగరాలలో కొత్త కార్యాలయాల భవనాలకోసం  చెట్లు తొలగించారు.అత్యాధునిక సాంకేతిక యంత్రాలువాడి చెట్లను వేళ్ళతో సహా పెకలించి మరో చోట నాటుతామని చెప్పారుగానీ చెట్ల పునస్థాపన గానీ పునరుద్ధరణగానీ జరగలేదు.పచ్చదనలేమికి తోడు  ఏసీలు ఫ్రిజ్ లు విడుదల చేసే వేడి గాలులు పెరిగాయి. ఎండాకాలం అవస్థలు పెంచుతున్నారు భవిష్యత్తు ఇంకా ఘోరంగా ఉంటుంది.
 చెట్లు  ప్రాణవాయువును ఇస్తాయి  
చెట్టు కార్బన్‌ డై ఆక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మారుస్తుంది.30-40 చదరపు మీటర్ల పచ్చని ప్రాంతం నుంచి ఒక్క రోజులో తయారయ్యే ఆక్సిజన్‌ ఒక మనిషికి ఒక రోజుకు సరిపోతుంది.ఒక కారు వంద లీటర్ల పెట్రోలును వినియోగించుకొనేందుకు 350 కిలోల ఆక్సిజన్‌ అవసరం అవుతుంది. దానికి తోడు కాలుష్యాలను భారీ మొత్తాల్లో గాలి లోకి విడుదల చేస్తుంది. 25,000 కిలో మీటర్ల దూరం పాటు ప్రయాణించటం ద్వారా ఒక కారు విడుదల చేసిన కాలుష్యాన్ని ఒక చెట్టు పూర్తిగా పీల్చుకోగలుగుతుంది. ఒక చెట్టు సంవత్సర కాలంలో 330 కిలోల ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఆడవులు తగ్గే కొద్ది మన ఆయుప్రమాణం కూడా కాలుష్యం వలన తగ్గిపోతుంది. చెట్లు మన నేస్తాలు. పెరట్లో రెండు  చెట్లుఉంటే  రోజుకు నలుగురున్న కుటుంబానికి సరిపడా ప్రాణ వాయువు నిస్తాయి .పెద్ద చెట్టుకు రెండు నుండి నాలుగు లక్షల ఆకులు ఉంటాయి.ఇవన్నీ గాలిని వడపోసి శుభ్ర పరుస్తాయి..ఒక ఎకరం విస్తీర్ణం లో దట్టంగా ఉండే చెట్లు ఏటా 13 టన్నుల దుమ్ము,ధూళిని  తొలగిస్తాయి..చెట్లు లేని రోడ్ల దగ్గర లీటరు గాలిలో 10 నుండి 12 వేల ధూళి కణాలు ఉంటే చెట్లున్న  రోడ్ల దగ్గర కేవలం 3 వేలే ఉంటాయి. చెట్టు సహజ మయిన ఎయిర్ కండిషనర్  లాగా పనిచేస్తుంది.ఒక చెట్టు తన ఆకుల ద్వారా రోజుకు 100 గ్యాలన్ల  నీటిని గాలి లోకి తేమ రూపంలో వదులుతుంది.అందుకే చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుంది. ఒక చెట్టు ఇచ్చే చల్లదనాన్ని అయిదు  ఎయిర్ కండీషనర్లు  రోజుకు ఇరవై గంటల వంతున పని చేస్తేనే గాని ఇవ్వలేవు.ఒక ఎకరం విస్తీర్ణం లోని చెట్లు ఏడాదికి 2.6 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ను వాతావరణం నుండి తొలగిస్తాయి.చెట్ల వేళ్ళు భూగర్భ జలాలనుండి ప్రమాద కరమైన కాలుష్యాలను తొలగించి శుద్ధి చేస్తాయి. 400 చెట్లు ఒక  వాహనం ఏడాది పాటు వదిలే కాలుష్యాన్ని వాతావరణం నుండి తొలగిస్తాయి.
చెట్లు వాతావరణ కాలుష్యాన్ని  అరికడతాయి
 వాతావరణంలో 78 శాతం నత్రజని, 21 శాతం ఆక్సిజన్,  అర్గాన్, కార్బన్ డై అక్సైడ్, హీలియం, నైట్రస్ అక్సైడ్, మీథైన్ ,కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డై అక్సైడ్, ఓజొన్, అమ్మోనియా  ఉంటాయి. పెట్రోలియమ్,డీజిలు, కిరోసిన్ మండించడం , అడవులను నరకటం,పరిశ్రమలనుండి  రసాయన కాలుష్యాలు వెదజల్లటం  వల్ల వచ్చే కార్బన్ డై అక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్ లాంటి  విష వాయువులతో వాతావరణం కలుషితమవుతుంది.ఈ విషవాతావరణాన్ని  పచ్చని  చెట్లు బాగుచేస్తాయి.చెట్లు వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకుంటాయి.  కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఎండ,నీరు,కార్బన్ డై అక్సైడ్ లను వాడుకొని  పిండి పదార్థాన్ని తయారుచేసుకొని  అక్సిజన్ ని విడుదల చేస్తాయి. నీటిని ఆవిరి రూపంలో వెలువరించి వాతావరణాన్ని చల్లబరుస్తాయి.  పొగ, దుమ్ము, దూళి,మనఇళ్ళల్లోకి రాకుండా అడ్దుకుంటాయి.భగభగ మండే సూర్యుడికి మనకు అడ్డుగా ఉండి నీడగానిలిచే చెట్లను మన కోసమే మనం కాపాడుకోవాలి.
చెట్లు నరికేవాళ్ళను,నరికించే వాళ్ళను శిక్షించాలి
చెట్లు తగలబెట్టే వాళ్ళకు శిక్షలేవీ? చెట్లు లేకుంటే జీవజాతులు,మనం కూడా మనుగడ సాగించలేము.మీకు వీలైనప్పుడల్లా మొక్కలు నాటండి. మొక్కలు పాతే వారికీ సహాయం చేయండి.మొక్కల్ని రక్షించండి.పచ్చదనాన్నీ,చల్లని నీడను పెంచండి. చెట్టు నీడన అన్నీ కులాలవాళ్ళు,మతాలవాళ్ళు చేరతారు.బండరాళ్ళమధ్య కొద్దిగా మట్టి ఉన్నా మొక్కలు మొలుస్తాయి.మనిషికి సాధ్యంకానిడి మొక్కకు సాధ్యమౌతుంది. చెట్లను నిలువునా తగలబెడుతున్నారు.కొన్నిచోట్ల యాసిడ్ పోసి చెట్లను మాడుస్తున్నారు.కొన్నిచోట్ల చెట్టుకు చేతబడి చేసి చంపారని అబద్దాలు అల్లుతున్నారు. నీడనిచ్చే చెట్టుపై ఇన్నిరకాలమోసం ఎందుకు?  ఒక మొక్క నాటలేని వాడికి దాన్ని నరికే యోగ్యత ఉందా?
---నూర్ బాషా రహంతుల్లా 6301493266 (సూర్య23.6.2019)