ఈ బ్లాగును సెర్చ్ చేయండి

29, జూన్ 2019, శనివారం

నిరుద్యోగం తగ్గేదెలా ?


నిరుద్యోగంపై రకరకాల నిరుద్యోగులపై 2017 లో నీతి అయోగ్ సర్వే జరిపింది.నిరుద్యోగులకు ఎలా మేలు చెయ్యాలో చెప్పమని అభిప్రాయాలూ కోరింది. పనీపాటా లేక ఖాళీగా ఉండే యువతరం ఇండియాలోనే అధికమని,అది 30 శాతం ఉందని ఇటీవల ఐఎమ్ఎఫ్ ఆర్ధికవేత్త జాన్ బ్లూడోర్న్ అన్నారు. అమెరికా, జపాన్‌, చైనా దేశాల జనాభాలో మూడోవంతు 65 ఏళ్ల వృద్ధాప్యంలో ఉంటే, 64 శాతం పనిచేసే 29 సంవత్సరాల వయసులో ఉన్న జనావళితో ఇండియా పరవళ్లెత్తుతోందట. అందుకని బాగా పిల్లల్ని కనండి,వాళ్ళను భారతమాతే పోషిస్తుంది అని కొందరు నాయకులు అదేపనిగా జనాన్ని రెచ్చగొడుతున్నారు.ఉద్యోగాల కల్పనకు మాత్రం వారిదగ్గర పధకాలు ఏమీ లేవు.చివరికి సైన్యంలో చేరటానికి పోటెత్తిన యువకులను కంట్రోల్ చేయలేక కూడా పోలీస్ లాఠీలు విరుగుతున్నాయి. 
 కళాసీ ఉద్యోగాలకు పీహెచ్ డీ లు
దేశంలో నిరుద్యోగిత రేటు 9.7  శాతానికిచేరింది. దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా ఉపాధి కోల్పోయారు. వీళ్లలో 84 శాతం మంది గ్రామీణులే. వ్యవసాయ రంగ సంక్షోభంతో పల్లెల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోయి పనిని వెతుక్కుంటూ పట్నాలకు వస్తున్న లక్షల మందికి ఇక్కడా రిక్తహస్తాలే ఎదురవుతున్నాయి.దేశంలో విద్యావంతులైన యువత తక్కువ జీతాలు లభించే ఉద్యోగాల్లోకి తమ నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలు దుర్లభమవుతున్న దుస్థితిలో చేరుతున్నారు. యువతరం ఏదో ఒక ఉద్యోగం దొరికితే చాలు అనుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ లో 6వేల నాలుగవ తరగతి  ఉద్యోగాలకు ప్రకటన ఇస్తే 25 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఎనిమిదో తరగతి విద్యార్హత సరిపోయే ఈ ఉద్యోగాలకు పీజీలు, పీహెచ్‌డీలు చేసిన వారూ వరసలో నిలబడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 368 బంట్రోతు ఉద్యోగాలకు 23 లక్షల మంది పోటీపడ్డారు. వీళ్లలో లక్షన్నర మంది డిగ్రీ పట్టాదారులు, డాక్టరేట్లు సాధించిన వారు 250 మందికి పైగా ఉన్నారు. కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ ఇటీవల ఇలాంటి దృశ్యాలే చోటుచేసుకున్నాయి. 18- 23 ఏళ్ల వయసులో ఉన్నత విద్యలో చేరే వారి శాతం 2005లో 12 శాతంగా ఉండేది. 2015 నాటికి ఇది 24.5 శాతానికి పెరిగింది. దశాబ్దకాలంలో దేశంలో ఉన్నత విద్యావంతులు రెట్టింపు పెరిగారు గానీ  వారి సంఖ్యకు తగినట్టు ఉపాధి అవకాశాలు మాత్రం పెరగలేదు.కొన్నిరాష్ట్రాల్లో ఉద్యోగాలు కల్పించలేక నిరుద్యోగ భృతిని కూడా ప్రవేశపెట్టారు.
నిరుద్యోగ విద్యావంతులు పెరిగారు
ఉద్యోగాలసృష్టి లేకపోగా ఉన్న ఉపాధి అవకాశాలన్నీ అతితక్కువ ఆదాయాన్ని సమకూర్చేవే కావడం వల్ల ఎక్కువ జీతాలు వచ్చే దేశాలకు మన పిల్లలు వలస పోతున్నారు.దేశవ్యాప్తంగా 67.6 శాతం కుటుంబాల ఆదాయం నెలకు రూ.10 వేల లోపే. వీటిలో 22 శాతం కుటుంబాలైతే నెలకు రూ.5 వేల కన్నా తక్కువ ఆదాయంతోనే జీవనం సాగిస్తున్నాయి. 13  శాతం కుటుంబాలు మాత్రమే నెలకు రూ.20 వేలకు పైన సంపాదిస్తూన్నాయి. గల్ఫ్‌, మలేసియా, సూడాన్‌, థాయిలాండ్‌ తదితర దేశాలకు మూడేళ్లలో 17  లక్షల మంది వలసెళ్లారు.
స్వయంఉపాధి కల్పన
 ‘125 కోట్ల జనాభా ఉన్న దేశంలో ప్రతి ఒక్కరికీ ఉద్యోగం చూపించడం సాధ్యం కాదు. మేం స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం 8 కోట్ల మందికి స్వయంఉపాధి కల్పించిందిఅని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు.ఇన్నికోట్లమందికి స్వయం ఉపాధి కల్పించినా నిరుద్యోగులు తగ్గనేలేదు. ఇంకా పెరుగుతూనే ఉన్నారు.
రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) గ్రూప్‌-డి కేటగిరీలోని దాదాపు 63 వేల కళాసీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తే- రెండు కోట్లమందికి పైగా నిరుద్యోగులు పోటీపడ్డారు. రైల్వే గేట్‌మెన్‌, కార్యాలయంలో సహాయకుడు, పట్టాల బాగోగుల్ని పరీక్షించే గ్యాంగ్‌మెన్‌ ఉద్యోగాలకు పదో తరగతే  అర్హత కానీ  82 లక్షల మంది ఉన్నత విద్యావంతులు బారులు తీరారు.ఎంటెక్‌ చేసినవారు కళాసీ ఉద్యోగాలకు క్యూలు కట్టడం నిరుద్యోగం  ఎంతగా ఊడలు దిగిందో వెల్లడిస్తోంది. నాలుగున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతస్థాయిలో నిరుద్యోగిత జడలు విరబోసుకొంది. ఉన్నత విద్యావంతుల్లోని నిరుద్యోగుల గోడు అన్నిచోట్లా ప్రతిధ్వనిస్తోందిప్పుడు! పనిమంతులు దొరకట్లేదని కార్పొరేట్లు, అసలు పనే దొరకట్లేదని పట్టాలు చేతపట్టుకొన్న నిరుద్యోగులూ వాపోతున్నారు.ఉపాధికి ఊతమిచ్చే చదువులు కావాలిగానీ  విద్యారుణాల మాఫీతోనే ఉద్యోగాలొస్తాయా?రెండేళ్ళ విలువైన సమయాన్నీ,లక్షలాది రూపాయల కష్టార్జితాన్ని ఇంటర్మీడియేట్ అనే పనికిరాని చదువుకు ధారపోయించకుండా,పోలిటెక్నిక్ కోర్సులను బహుళప్రయోజకంగా తీర్చిదిద్దాలి.స్వయం ఉపాధి పధకాలు ఇంకా కొన్ని కోట్లమందికి చేరాలి.
వ్యవసాయాధార , చిన్న తరహా పరిశ్రమలే కీలకం    
ప్రస్తుతం ప్రపంచంలో 22 కోట్ల మందికి పైగా నిరుద్యోగులున్నారు.ఉద్యోగాల కల్పనలో ప్రైవేటు రంగందే కీలకమైన పాత్ర. ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేటు రంగంలో 280 కోట్ల మంది పనిచేస్తున్నారు.ఉద్యోగుల సంఖ్యలో ఇది 87 శాతం. ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చే విషయంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలే కీలకం. 132 దేశాల్లో చిన్న, మధ్యతరహా రంగం 52 శాతం ఉద్యోగాలు కల్పించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని దాదాపు 78 కోట్ల మంది కార్మికులు ఇప్పటికీ తీవ్రమైన పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు.140 కోట్ల మంది కార్మికులు భద్రత లేని ఉద్యోగాల్లో ఉన్నారు. వారికి శాశ్వత ఉద్యోగాలు లేవు, స్థిరమైన ఆదాయాలు లేవు, సాంఘిక భద్రతా లేదు. పరిశ్రమలకు చౌకగా కేటాయించిన  మన ప్రజల భూముల్లో మన యువకులకు వచ్చిన ఉద్యోగాలెన్నో ఆరా తీయాలి.
వలస భారమై - తల్లిదండ్రులకు దూరమై
నగరాల్లో ఉపాధికోసం గ్రామాలనూ తల్లిదండ్రుల్నీ వదలక తప్పని పరిస్థితి దాపురించింది.రాజధాని నగరాల చుట్టుపక్కల తప్ప ఇంకెక్కడా ఉద్యోగాలు దొరకనంతగా ఉపాధికల్పనా వ్యవస్థ కేంద్రీకృతమయ్యింది.ముందు మద్రాసుకు,ఆ తరువాత హైదరాబాదుకు,ఇంకా విదేశాలకూ ఉపాధి కోసం మన యువకులు వలసలు పోవటంతో మన పల్లెలన్నీ వృద్ధాశ్రమాల్లాగా తయారయినాయి.తల్లిదండ్రుల్ని కూడా ఆ మహానగరాల్లో తమతో పాటు ఉంచుకుందామంటే చాలీ చాలని అద్దె అపార్టుమెంట్లలో అందరికీ కుదరదు.ఇక్కడ ఉండే ముసలోళ్ళకు మందుబిళ్ళ తెచ్చిఇచ్చే వాళ్ళు కూడా కరువయ్యారు.మంచానపడిన వృద్ధులకు కావలసింది డబ్బు ఒక్కటే కాదు.వాళ్ళ కడుపున పుట్టిన బిడ్డల ఆత్మీయ పలకరింపు, స్పర్శ కూడా.
దూరమైపోయిన పిల్లల కోసం తల్లిదండ్రులు బెంగతో మనోవ్యాధుల బారిన పడుతున్నారు.చాలీచాలని జీతంతో భార్యాబిడ్డల్ని పోషించుకుంటూ, తల్లిదండ్రులకేమీ చేయలేకపోతున్నామనే వ్యధతో నగరంలోనే బ్రతుకులీడుస్తున్న యువకులు జీవితంపై విరక్తి చెందుతున్నారు.మావాడు హైదరాబాదులోనో మరో నగరంలోనో జాబ్ చేస్తున్నాడని గొప్పలు పోవటమేగానీ,అతనికి అక్కడ ప్రైవేటు కంపెనీలలో తన సొంత పని చూసుకొనేంత ఖాళీ సమయం కూడా లేని వెట్టిచాకిరీని తలుచుకుంటే తల్లిదండ్రుల మనసు నీరౌతోంది.కలిసి ఉంటే కలదు సుఖము అన్నారు.లక్షలాది కుటుంబాలు కలిసి ఉండాలంటే ఇకనైనా మండలస్థాయి వరకు ఉపాధికేంద్రాల వికేంద్రీకరణ జరగాలి.పల్లెటూళ్ళలో కూడా పనులు దొరకాలి.నిరుద్యోగికి ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టి ఆత్మవిశ్వాసము సన్నగిల్లి ఆత్మహత్యలు కూడా చేసుకొంటూ ఉంటారు.అందువలన నిరుద్యోగులపట్ల సానుబూతి కలిగి వాళ్ళకు ఉద్యోగాలు ఎలా కల్పించాలో అని పాలకులు సదా ప్రణాళికలు రూపొందిస్తూ ఉండాలి.కేవలం చదివి ఉంటే లాభంలేదు.చదివిన చదువు వల్ల ఉపాధి దొరికినప్పుడే చదువు సార్ధకం అవుతుంది.
గ్రామ వాలంటీర్లు
మన రాష్ట్రంలో సొంత ఊళ్ళోనే  పనిదొరికే గ్రామ వాలంటీర్ల నియామకం నిరుద్యోగులకు కొంత ఉపశమనమే. కానీ మరీ చిన్న జీతమని కొందరు పెదవి విరుస్తున్నారు.అసలు ఉద్యోగమే లేని రోజుల్లో చిన్నదో పెద్దదో మన ఊళ్ళోనే రావటం నయమేలే సర్దుకుపోదాం అని కొందరు సంబరపడుతున్నారు.అయితే ఈ ఉద్యోగాలఎంపిక హడావుడిగా రాజకీయనాయకులతో కూడిన కమిటీలద్వారా కాకుండా ఒక అర్హతా పరీక్షపెట్టి సర్వీస్ కమీషన్, జిల్లా ఉపాధికల్పనా కేంద్రాల ద్వారా నియమిస్తే బాగుండేది. ఎందుకంటే లక్ష్యం మంచిది కాబట్టి ఈ వాలంటీర్లకు పూర్వ నేరచరిత్ర ,త్రాగుడు లాంటి గుణగణాలను ముందుగానే పోలీసు ఎంక్వైరీ రిపోర్టు తీసుకోవాలి.లేకపోతే కొంతమంది అవినీతిపరులైన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా ఎదురైన సమస్యలే మళ్ళీ ఎదురౌతాయి. ఉద్యోగకల్పన సంస్తలన్నిటినీ ఒకే శాఖ పరిధిలోకి తెచ్చి అయోమయాన్ని పోగొట్టాలి.ఉద్యోగంకోసం ఎవరిని ఎప్పుడు ఎలా కలవాలి అనే విషయమై స్పష్టత తేవాలి.కార్మిక,ఉపాధికల్పన కేంద్రాలు,సర్వీసు కమీషన్లాంటివన్నీ ఒకే గొడుగు కిందకు రావాలి.అన్ని రకాల ఉద్యోగాలలో ఏర్పడే ఖాళీలను ప్రతిఏటా భర్తీ చేస్తూ ఉండాలి.
--నూర్ బాషా రహంతుల్లా 6301493266  (సూర్య 30.6.2019)

1 కామెంట్‌: