ఈ బ్లాగును సెర్చ్ చేయండి

20, జులై 2019, శనివారం

నవరత్నాలలో మద్యనిషేధమొక్కటే ఒక ఎత్తు... మిగిలిన ఎనిమిది ఒక ఎత్తు





నవరత్నాలలో మద్యనిషేధమొక్కటే  ఒక ఎత్తు... మిగిలిన ఎనిమిది ఒక ఎత్తు


తాగని నా కొడుకెందుకు లోకంలో ?
స్వర్గ లోకమగుపడతది మైకంలో
గవర్నమెంటు వాళ్ళు కూడా తాగమన్నారు
డబ్బులోస్తే అదే మాకు చాలునన్నారు
అందుకే తాగుతా నీ యబ్బా తాగుతా

అంటూ డబ్బుకులోకం దాసోహం సినిమా లో కొసరాజు రాసిన పాటకు పోటీగా మన పాలకులు ఇన్నాళ్ళూ సారాయి వేలం పాటలు పెట్టారు.మద్యం షాపులు చేజిక్కించుకొనేందుకు మహిళలు కూడా వేలం పాటల్లో పాల్గొన్నారు.  తాగినవాడిదే పాట, సాగిన వాడిదే ఆట అన్నట్లు మన (త్రాగుబోతు) నాయకులకు ఎవరి మొరా చెవికెక్కలేదు. తాగుబోతు తోడు కోరినట్లు ప్రజలందరినీ తనతో పాటు తాగి తందనాలాడమని కోరారు. తాగేది దమ్మిడీ సారాయి ఇల్లంతా చెడ ఉమ్ములన్నట్లు ఈ సారాయి వల్ల కోట్లాది ప్రజల ఇళ్ళు ముక్క చెక్కలై పోతున్నాయని చెప్పినా వినిపించుకోలేదు. తినే కూటిలో మట్టి పోసుకున్నట్లు ఈ సారాయి కంపు ఉండవలసిందేనన్నారు.
జాతికి పెను ఉత్పాతం
గాంధీ గారు చచ్చిపోయి ఇన్నేళ్ళయినా సంపూర్ణ మద్యపాన నిషేదందేశంలో అమలులోకి రాలేదు. రాజకీయ నాయకులు కూడా తామే సారా కాంట్రాక్టర్లై, సిండికేట్లై ఈ దేశాన్ని మత్తులో ముంచెత్తుతున్నారు. రాష్ట్రాల ఖజానా నింపేది సారాయి మాత్రమేనని జనాన్ని మోసపుచ్చుతున్నారు. కోట్ల సంసారాలను కూల్చి కొల్లగొట్టిన గబ్బుడబ్బే వారిని బలిపిస్తున్నది. తాగుబోతుల నేరాలు దిన దిన ప్రవర్ధమానమై పౌరజీవనం నరకప్రాయంగా మారింది. పోలీసు స్టేషన్ల ద్వారా సారాయి అమ్మించిన  ప్రభుత్వాన్ని ఏమనాలి?
 పాలకులు ఈ మద్యం వ్యాపారాన్ని వదిలిపెట్టలేకపోతున్నారు.మద్యంమత్తులో జరుగుతున్న నేరాలు, ఘోరాలు అన్నీ ఇన్నీ కావు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు,నేరాలలో తొంభైశాతం ఈ మత్తులో తూగుతున్నవాళ్ళవే . మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ అన్నెంపున్నెం ఎరుగని అమాయకులను బలితీసుకుంటున్నారు.లక్షలాది కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారు. ఎవరు ఎన్ని సంతాపాలు తెలిపినా, ఓదార్పు మాటలు చెప్పినా, పోయిన ప్రాణాలు తిరిగిరావు. వారి గర్భశోకాన్ని తీర్చలేవు. భర్తలను కోల్పో యిన ఆ ఇల్లాళ్ల దుఃఖం మాటల్లో తీర్చలేం. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, ప్రమాదాల్లో శాశ్వతంగా అంగవికలురై ,కుటుంబ సభ్యులకు భారమై దుర్భరంగా జీవితాన్ని సాగిస్తున్న  అభాగ్యులెందరో ఉన్నారు.
ఇండియాలో మద్యం వ్యాపారం  అయిదు లక్షల కోట్ల రూపాయలు. మద్యం కారణంగా మన దేశానికి  ఆర్థికంగా ఏటా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 1.45 శాతం మేర నష్టం వాటిల్లుతున్నది. కాలేయ వ్యాధులు, క్యాన్సర్లు, లాంటి  రెండు వందలకుపైగా రోగాలకు కారణం మద్యమే.  మద్యం వల్ల కలుగుతున్న రోగాల చికిత్సకు  దేశం చెల్లిస్తున్న మూల్యం రూ.98 లక్షలకోట్లు.ఎక్సైజ్‌ సుంకాల బాదుడు పెరుగుతున్నా, మద్యపానం తగ్గటం లేదు ప్రతిఏటా  వినియోగం 38శాతందాకా వార్షికపెరుగుతోంది. మద్యపాన వ్యసనం అలాంటిది. సర్కార్ల మద్యాదాయ కక్కుర్తి అంతకంటే ఎక్కువగా పెరుగుతున్నది.రహదారి ప్రమాదాలు ,మరణాలు కూడా అదేరీతిలో పెచ్చరిల్లుతున్నాయి.గిరాకీ ఎక్కువకాబట్టి లిక్కర్ ఆదాయాన్ని ప్రభుత్వాలూ కావాలంటున్నాయి. తద్వారా కోట్లాది కుటుంబాల్లో ఆరని కన్నీటి కాష్ఠాల్ని ప్రజ్వరిల్లజేస్తున్నాయి.స్కూళ్ళు,ఆసుపత్రులు,పండ్లు,కూరగాయల దుకాణాలు ఉండాల్సిన ఊరి సెంటర్లలో ఈ మద్యం దుకాణాలు పెట్టడంవల్ల  సభ్యతగల ప్రజలు,చిన్నపిల్లలు,మహిళలు సురక్షితంగా పోలేక పోతున్నారు.ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు.
రాజ్యాంగ విధి
భారత రాజ్యాంగంలోని 47 వ ఆర్టికిల్ ప్రకారం  దేశంలో లిక్కర్‌ వినియోగాన్ని  క్రమేణా తగ్గించాలి. చివరికి మద్య  నిషేధం విధించినలాంటి పరిస్థితి తేవటం ప్రభుత్వాల విధి. దేశ జనాభాలో సారాయి వినియోగదారులు పదిహేను శాతానికి పెరిగారు. మద్యానికి బానిసలైన వారు అయిదు కోట్ల 70 లక్షలమంది.వేలాదిమంది  భిన్నమార్గాల్లో మాదక ద్రవ్యసేవనంతో జోగుతున్నారు. దేశంలో సారాయి  తలసరి వినియోగం 6  లీటర్లకు ఎగబాకింది.సూదుల ద్వారా మాదక ద్రవ్యాలకు అలవాటుపడ్డవారి జాబితాలో ఉభయ తెలుగు రాష్ట్రాలు నాలుగైదు స్థానాల్లో ఉన్నాయి. దేశంలో తొలిసారి లిక్కర్‌ రుచి మరిగే వయసు 12.3 ఏళ్లకు పడిపోయిందట. దేశం అభివృద్ధిచెందే కొద్దీ ప్రమాదాల సంఖ్య కూడా పెరిగిపోతున్నది. రోడ్లు అభివృద్ధికి సోపానాలు అంటారు.ఆరులేన్ల  రోడ్లు న్నాయి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న వాహనాలున్నాయి, కానీ ఈ మద్యం తాగి నడపడంవల్ల రహదారులు మృత్యుకూపాలుగా మారుతు న్నాయి. మద్యంవల్ల కోట్లాది ప్రజల ఆరోగ్యం పాడైపోతున్నది.   
మత్తు పానీయాలకు, మాదక ద్రవ్యాలకు బానిసలై దేశంలో రోజూ పదిమంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.  మద్యాదాయంపై ప్రభుత్వాలు ఇంత మక్కువ పెంచుకోవటం ఏందో అర్ధం కావటం లేదు. .  మాదక శక్తులవల్ల  కోట్లాది కుటుంబాల ఆర్థిక స్థితిగతులు  తలకిందులు అవుతున్నాయి. శాంతిభద్రతల సమస్యలు వస్తున్నాయి . గంజాయి చాక్లెట్లు , సింథటిక్‌ డ్రగ్స్  అమ్ముతున్న ముఠాలు విస్తరించాయని వార్తలొస్తున్నాయి. మట్టుపదార్ధాల ఆన్‌లైన్‌ కొనుగోళ్ల సంస్కృతి మారుమూల పల్లెలకూ  చొచ్చుకుపోయింది. పరిస్తితి ఇంత  ప్రమాదకరంగా ఉన్నా ప్రభుత్వాలు అలవాటుగా  స్వస్థభారత్‌ , ఆరోగ్యకర సమాజ నిర్మాణం ... లాంటి  ప్రచార నినాదాలు  చేస్తున్నాయి .
ఎన్టీఆర్ తొలి సంతకం మద్యనిషేధం
1947 అక్టోబరు ఒకటో తేదీనుండి అప్పటి మద్రాసు ప్రభుత్వం మద్య పానానికి స్వస్తిచెప్పింది. అప్పట్లో  తాగుబోతులు అంటే ప్రజల్లో ఒక రకమైన అసహ్య భావం ఉండేది. తాగుబోతులైన యువకులకు ,తాగుబోతుల పిల్లలకు పెళ్లిళ్లు అయ్యేవికావు. 1960 తర్వాత నిషేధం నీరుగారిపోయింది.  రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం కోల్పోతున్నామనే వాదన లేవదీశారు. 1969 ప్రాంతంలో నిషేధానికి పూర్తిగా స్వస్తిపలికారు.మద్యాదాయం విజృంభించింది. ఏకంగా రాజకీయాలనే శాసించే స్థాయికి చేరుకుంది. సులభంగా డబ్బు సంపాదించే మార్గమయింది. సారా రాజుల సామ్రాజ్యాలు వెలిశాయి. ఆయా ప్రాంతాల్లో వారి అనుమతి లేకుండా ప్రవేశించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. సారా సైన్యాలతో వారే స్వయంగా దాడులు చేస్తూ సమాంతర ప్రభుత్వంగా కొన్ని ప్రాంతాల్లో వ్యవహరించారు.వీటన్నిటి ఫలితంగా  1991 లో నెల్లూరు జిల్లాలో  దూబగుంట రోశమ్మ అధ్వర్యంలో ఆడపడచులు దాదాపు యాభై వేలమంది సారా వ్యతిరేక ఉద్యమం చేపట్టి సారాయి అమ్మకాలను నిలుపు చేయించారు.అప్పుడు  ఈ ఉద్యమం అన్ని జిల్లాలకు ప్రాకింది .సారావ్యతిరేక ఉద్యమం లో భాగంగా మల్లాది సుబ్బమ్మ తదితర మహిళా బృందం ఎన్టీరామారావు గారి ఇంటికి వెళ్ళి సారా నిషేధ విజ్నప్తిపై సంతకం పెట్టమని  అడిగారట.ఆయన వారిని ఎగాదిగా చూచి,మేము మీ విజ్నప్తిపై సంతకము చేయము అధికారంలోకి వచ్చాక అమలు చేస్తాము అని జవాబు ఇచ్చారట.ముఖ్యమంత్రి స్వర్గీయ విజయభాస్కర రెడ్డి 1994 ఏప్రిల్‌ ఒకటిన సారాను నిషేధించి పాక్షికంగా మద్య నిషేధాన్ని విధించారు. తెలుగుదేశంనేత స్వర్గీయ ఎన్‌టి రామారావు పాక్షిక నిషేధంతో ఆశించిన ఫలితాలు రావని సంపూర్ణ మద్యనిషేధమే సరైన పరిష్కారమని పిలుపు నిచ్చారు. మహిళలు నమ్మి అఖండ మెజారిటీతో తెలుగు దేశాన్ని గద్దెనెక్కించారు. ఎన్‌టిఆర్‌ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సంపూర్ణ మద్యనిషేధాన్ని ప్రకటిస్తూఫైల్‌పై మొదటి సంతకం చేశారు.మద్యనిషేధం అమలు చేయాలని త్రికరణ శుద్ధిగా ప్రయత్నించిన నాయకుడు ఎన్టీఆర్!
 ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం మద్యం అమ్మకానికి తెరలేపింది. ఆదాయం పెంచుకునేందుకు మద్యం వ్యాపారాన్ని అన్నివిధాలా వాడుకున్నారు. ఆనాటి నుంచి మద్యం వ్యాపారం అంతకంతకూ పెరుగుతూనే ఉంది.చీప్‌లిక్కర్‌ పేరుతో బెల్టు షాపుల ద్వారా శివారు పల్లెలకు కూడా చేర్చి అమ్ము కుంటున్నారు. ఇంత పెద్ద ఆదాయాన్ని కోల్పోయే స్తోమత ప్రభుత్వాలకు లేదని పెద్దలు చెపుతున్నారు. మద్యం ఆదాయంవల్ల రెండు రూపాయల కిలో బియ్యంతోసహా ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని ఈ డబ్బులేకుండా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎలా చేపట్టగలమని ప్రశ్నించుతున్న ఆర్ధిక మేధావులను ఒక మహిళా  నాయకురాలు “ఆదాయం కోసమే మద్యంషాపులతో ఎంతో ఆదాయం ఆర్జిస్తున్నామని చెప్పు కుంటున్నారు కదా. దీనికంటే గ్రామానికి ఒకటి చొప్పున వ్యభిచార కొంపలకు లైసెన్సులు ఇవ్వండి పెట్టుబడి లేకుండా ప్రభుత్వానికి వేలాది కోట్ల రూపాయలఆదాయం వస్తుంది అప్పుడు మీరు అనుకునే అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఎన్న యినా చేయవచ్చు” అంటూ నిలదీసిందట. పొర్లించి, పొర్లించి కొట్టినా మీసాలకు మట్టి కాలేదుగా అన్నాడట ఒక సిగ్గుమాలిన వ్యక్తి . ఎన్నిసార్లు ఈ సారాయి వ్యాపారం ఆపివేయండి, కోట్లాది సంసారాలు కూలిపోతున్నాయి అని గడ్డిపెట్టినా ఈ పాలకులకు బుద్దిరాలేదు. బంతికే రావద్దంటే విస్తరాకు తెమ్మన్నట్లు, పొరుగింటి అట్లకు నెయ్యి కాచినట్లు ఈ ప్రభుత్వాలు తమ అత్యాశను, తాగుబోతు తనాన్ని వెల్లడించుకున్నాయి. పైసల కోసం కక్కుర్తి పడి సారాయి వ్యాపారం చేసే ప్రభుత్వాలు కూలిపోయిన కాపురాల ఆడపడుచుల పగకు గురవుతాయి.గురయ్యాయి కూడా.మద్యనిషేధానికి ప్రయత్నించే ఏ నాయకుడికైనా మహిళల మద్దతు దొరుకుతుందని,మద్యపానాన్ని ప్రోత్సహించే ఏ నాయకుడినైనా ఆ మహిళలే ఒడిస్తారనీ చరిత్ర మనకు చెబుతోంది.  
నవరత్నాలలో ఇది ఒక్కటి ఒక ఎత్తు... మిగిలిన ఎనిమిది ఒక ఎత్తు
సుదీర్ఘ పాదయాత్రలో మద్య నిషేధం ఒక్కటే సరైన పరిష్కారం అని గ్రహించిన ముఖ్యమంత్రి జగన్ దశలవారీగా సంపూర్ణ మద్యనిషేధం సాధిస్తామనే వాగ్దానం తమ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించారు. మూడు దశల్లో నిషేధించి కేవలం ఫైవ్ స్టార్ హోటళ్ళలో మాత్రమే మద్యం దొరికేలా చేస్తామని వాగ్దానం చేశారు. ఈ వాగ్దానం  ఎలా అమలవుతుంది అని ఫేస్ బుక్ లో మిత్రులను కొందరిని అడిగాను. వారి స్పందన ఇలా ఉంది :
మద్య నిషేధం మాత్రం, నాకు అనుమానమే.ఎక్కువ ఆదాయం వచ్చేది అక్కడనుంచే.చాలామంది ఎమ్మెల్యేలకు బార్లు,మద్యం దుకాణాలు ఉన్నాయి.ఎన్ టి ఆర్ కూడా చేయలేక పోయారు”.
క్కువ శాతం ప్రజలు కూడా ఆదరించే వ్యసనం మద్యపానం. అది మంచి ఆదాయ వనరు కూడా. అన్ని విధాలా బలవంతులైన  వారే ఆ వ్యాపారం నడుపు తున్నారు. అటువంటి దానిని కట్టడి చేయటం అనుకున్నంత సులువు కాదు. నవరత్నాలలో ఇది ఒక్కటి ఒక ఎత్తు... మిగిలిన ఎనిమిది ఒక ఎత్తు. ఈ ఒక్క దాని మీద వచ్చే ఆదాయం తో మిగిలిన వాటన్నిటినీ సక్సెస్ చేయవచ్చేమో...
ఆ వర్గం ప్రజలలో వ్యతిరేకత రాకుండా..వ్యాపారుల నుండి నిరసనలు లేకుండా..ప్రత్యామ్నాయ ఆదాయం చూచు కోకుండా..
వాగ్దానాలు నెరవేర్చడం కత్తిమీద సాము లాంటిదే...అయినా ప్రజల క్షేమం కోసం ఈ వాగ్దానం ముఖ్యమంత్రి విజయవంతంగా అమలు చేయాలని కోరుకుందాం “.
“మ్యానిఫెస్టోనే మాకు బైబిల్,ఖురాన్,భగవద్గీత అని నమ్ముతున్న నాయకుడు గనుక మద్య నిషేధం ఏ పార్టీ వాళ్ళైనా వ్యతిరేకించలేని మంచి వాగ్దానం గనుక  ఈ వాగ్దానం అమలులో ముఖ్యమంత్రి తప్పక విజయం సాధించాలని కోరుకుందాం !”
n  నూర్ బాషా రహంతుల్లా  6301493266 


 https://www.facebook.com/photo.php?fbid=2558274717537836&set=a.233025936729404&type=3&theater&notif_t=feedback_reaction_generic&notif_id=1563668967862270

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి