ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, జులై 2019, మంగళవారం

స్పందన- ప్రజా సమస్యల పరిష్కార వేదిక


స్పందన- ప్రజా సమస్యల పరిష్కార వేదిక
1.7.2019 న అన్ని జిల్లాలలో జరిగిన స్పందన కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. అధికారులు పరిష్కారాలు కూడా అంతేస్థాయిలో ప్రజలకు అందిస్తారని కోరుకుందాం.పూర్వం రాజుగారు ప్రజలు పడుతున్న పాట్లు స్వయంగా తెలుసుకోవటానికి మారువేషంలో తిరిగేవాడట.ప్రజలమధ్య పాదయాత్రలు చేసి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించేవాడట.ఇంకోరాజు కోట గుమ్మందగ్గర ధర్మగంట బిగించాడట. ఎవరైనా బాధితుడు వచ్చి ఆ గంట మోగిస్తే రాజుగారు బయటకొచ్చి బాధితుని మొరవిని న్యాయం తీర్చేవాడట. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఫిర్యాదులపట్ల ప్రభువులు తప్పక స్పందించాలి.
అంతులేని సమస్యలు  
రేషన్‌ కార్డు లేదని.. పాఠశాల, కళాశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని.. పింఛన్లు, తాగునీరు, రోడ్లు, భూ ఆక్రమణలు.. ఇలా ఏదో ఒక సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. మండల స్థాయిలో ఉన్న అధికారులను కలిసి వారి సమస్యలను విన్నవించుకుంటారు. అయితే ఆ స్థాయిలో వారి సమస్యలకు పరిష్కారం దొరకకపోవడంతో ప్రతి సోమవారమూ కలెక్టరేట్‌కు వస్తుంటారు. కలెక్టర్‌కు తమ సమస్యలను విన్నవించుకుంటే పరిష్కారం దొరుకుతుందని ఆశపడుతుంటారు.ఇప్పటివరకు ప్రజావాణి,మీకోసం,ప్రజావేదిక,ప్రజలవద్దకు పాలన,రచ్చబండ లాంటి రకరకాల పేర్లతో పాలకులు ప్రజల సమస్యలు తీర్చటానికి ప్రయత్నించారు.అదే కోవలో నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి   ప్రజా సమస్యల పరిష్కార కోసం స్పందన అనే కార్యక్రమం ఏర్పాటుచేశారు.కొత్తజిల్లాల ఏర్పాటుతో ప్రజాఫిర్యాదులకు స్పందించే కలక్టర్ల సంఖ్య పెరుగుతుంది, స్పందనాకేంద్రాలు ప్రజలకు దగ్గరకొస్తాయి.దూరం భారం తగ్గుతాయి. పనులు త్వరగా అవుతాయి. అయితే ముఖ్యమంత్రి నివాసం వద్ద ప్రజాదర్బార్,కలక్టరేట్ల దగ్గర స్పందన కార్యక్రమం రెండూ సమాంతరంగా జరుగుతూ ఉంటే దూరప్రాంతాలనుండి ప్రయాణం చేసి మరీ జనం ప్రజా దర్బార్ కే వస్తారు.అర్జీ రాజుగారికిస్తేనే తృప్తి.
స్పందన విశేషాలు
ప్రజల సమస్యల పరిష్కారం కొరకు అహర్నిశలు 24 గంటలూ పనిచేయటమే ఈ స్పందన కార్యక్రమ లక్ష్యం. ప్రజలు తమ ఫిర్యాదులను దీనికోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబరు 1800-425-4440 కు ఫోన్ చేసి చెప్పవచ్చు. లేదా  spandana.ap@gmail.com కు అర్జీని మెయిల్ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏ శాఖకు సంబంధించిన సమస్య గురించి అయినా సంబంధిత శాఖకు ఈ వెబ్ సైట్ ద్వారా పంపవచ్చు. అర్జీ తగు చర్య కోసం సంబందిత అధికారులకు పంపబడుతుంది. ఎవరైనా ఎప్పుడైనా (24x7) కాల్ చేసి తమ అర్జీ పరిస్థితిని తెలుసుకోవచ్చు.
అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ప్రత్యేకంగా కుర్చీలు వేసి అర్జీదారులను కూర్చోబెట్టి ఆయా శాఖల అధికారుల ఎదుట తక్షణమే సమస్యలను పరిష్కరిస్తున్నారు.నెల్లూరులో ఒక వికలాంగుడికి స్పందన కార్యక్రమంలోనే మూడు చక్రాల కుర్చీ అందజేస్తే అర్జీదారుడు ఆనందంతో తబ్బిబ్బు అయ్యాడట. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి ఎదుటే వాటిని పరిష్కరించటం విశేషమే. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన ఫిర్యాదుల దినాల్లో ప్రజల అర్జీలను నమోదు చేశారు.అర్జీదారులందరికీ రశీదులు కూడా ఇచ్చారు.అర్జీదారులను కూర్చోబెట్టి ఆయా శాఖల అధికారుల ఎదుట తక్షణమే సమస్యను పరిష్కరిస్తామనటమే ఈ కార్యక్రమంలో గొప్పతనం.తక్షణమే పరిష్కరించకపోయినా ఫలానా తేదీ లోగా సమస్యను పరిష్కరిస్తామని రశీదులు ఇచ్చారు.అధికారులు ఇచ్చినమాట నిలుపుకుంటే కార్యక్రమం విజయవంతమౌతుంది.
జిల్లా అధికారులందరూ హాజరుకావాల్సిందే
స్పందన కార్యక్రమానికి జిల్లాలోని ఆయా శాఖల అధికారులు హాజరుకావాలి.  తమ కింది స్థాయి సిబ్బందిని పంపకూడదు.గైర్హాజరైతే శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. పైగా అర్జీదారులను చిరునవ్వుతో పలకరించి వారి సమస్యలను పరిష్కరించటం పెద్ద పాలనా సంస్కరణే.తీసుకున్న వినతుల్ని ఎక్కడ పెట్టామో తెలియని అయోమయ దశ ఉండకూడదు.తీసుకున్న ప్రతిఅర్జీకి ఒక లెక్క ఉండాలి.అర్జీదారుని పట్ల బాధ్యత ,సానుభూతి ఉండాలి.జవాబుదారీ తనం లేని బద్దకస్థులు,జాప్యగాళ్ళు,లంచగొండులు పనులు సకాలంలో చేయకుండా ప్రజలను పీక్కుతింటున్నారు. సాంకేతిక విజ్నానం ఎంతో పెరిగిన 21వ శతాబ్దంలో కూడా ప్రజలు పనులకోసం  ఏళ్ళతరబడి ఆఫీసులచుట్టూ కాళ్ళరిగేలా తిరగాల్సిరావటం ఎంత అనాగరికం? ఒకే సమస్య తీరక పదే పదే దరఖాస్తులు ఇవ్వాల్సిరావటం,లంచాలు ఇస్తేతప్ప పనికాకపోవటం,పనికాలేదనే దిగులుతో మనుషులే రాలిపోవటం,రాలిపోయిన వాళ్ళ భార్యాబిడ్డలను కూడా అదేపనిగా తిప్పటం లాంటి సంఘటనలు తలుచుకుంటే ప్రజలకు  ఎలాంటి గతి పట్టించారో అర్ధమవుతుంది.వీళ్ళకసలు మానవత్వం ఉందా అనిపిస్తుంది.రైతులు పాస్ పుస్తకాలు రాక ఆత్మహత్యలు చేసుకోబోవటం,ఉద్యోగులు రిటైర్ అయ్యి ఏళ్ళుగడిచినా పెన్షన్,గ్రాట్యుటీ రాకపోవటం,సొంత ఆఫీసులో వాళ్ళే పనులు చెయ్యకపోవటం వార్తల్లో చూస్తున్నాం.  ఇలాంటి సభ్యత సంస్కారం లేని లంచగొండులను వెంటాడి పట్టుకోవాలి.కనీసం వాళ్ళు తీసుకున్న దరఖాస్తులను ఎన్నిరోజుల్లో పరిష్కరించాలో ఎన్నాళ్ళకు పరిష్కరించారో ఎందుకు ఇంత జాప్యం చేశారోజవాబు చెప్పే వ్యవస్థ ఉండాలి.అసలు తనక్రింది ఉద్యోగులను ఇలాంటి ప్రశ్నలు నిలదీసి అడగాలంటే శాఖాధికారి దగ్గర  వివరాలు ఉండాలికదా?  
శాఖాధిపతుల కార్యాలయాల్లో కూడా స్పందన జరగాలి  
సోమవారం కలక్టర్ల దగ్గర జరిగే స్పందనలో జిల్లా స్థాయిలోని సమస్యలే దాఖలవుతాయి.జిల్లాస్థాయిలో తేలని విషయాలు,శాఖాధిపతులకే చెప్పుకోవలసిన విషయాలు,శాఖాధిపతుల కార్యాలయాల్లోనే పేరుకుపోయిన విషయాలు కొన్ని ఉంటాయి.ఇప్పుడు ఆ అవకాశం కల్పిస్తూ వివిధ శాఖల డైరెక్టర్లు,కమీషనర్లు ఈ కార్యక్రమాన్ని సొంతం చేసుకోవాలి. స్పందన కార్యక్రమాన్ని  శాఖాధిపతుల కార్యాలయాల్లోకూడా జరపాలి. శాఖాధిపతుల కార్యాలయాల్లో కూడా అర్జీలు తీసుకొని వారి స్థాయిలో పరిష్కార ప్రయత్నం చెయ్యాలి. లేకపోతే ప్రతివిషయానికీ అర్జీ తీసుకొని సచివాలయంలోని సెక్రెటరీలు, మంత్రుల దగ్గరకు,ముఖ్యమంత్రి నివాసానికి జనం వెళ్ళలేరు. అనంతపురం నుండి వచ్చిన విశ్రాంతమ్మ  తోపులాటలో  స్పృహ తప్పిపడిపోయిన సమస్య మళ్ళీ రాకుండా చూడాలి.ముఖ్యమంత్రిగారికి స్వయంగా అర్జీ అందిస్తేనే త్వరగా పని జరుగుతుందనే అపోహ పోవాలి.స్పందనలో అందుతున్న అర్జీల పరిష్కారం ఎంత బాగా జరిగితే అంతబాగా ప్రజలు అధికారులను నమ్ముతారు.జిల్లా అధికారులు అర్జీలను చక్కగా పరిష్కరిస్తూ ఉంటే రాష్ట్రం నలుమూలలనుండి ప్రజలు తాడేపల్లి పరుగెత్తరు.కొడుకు విదేశీ విద్య ఉపకారవేతనం కోసం దరఖాస్తు లాంటివి ఇవ్వటానికి కూడా ఎంతోదూరం ప్రయాణం చేసి ముఖ్యమంత్రి నివాసం దాకా రాకూడదు. జిల్లాల్లో స్పందన విజయవంతం అయితే రాజధానికి ప్రజల ప్రయాణం తగ్గుతుంది.
పెండింగ్ అర్జీల పై నిరంతర పరిశీలన జరపాలి
జిల్లా కార్యాలయ మాన్యువల్ లో ఫైళ్ళ నిర్వహణ,పెండింగ్ ఫైళ్ళ పరిష్కారం పద్ధతులు సవివరంగా ఉన్నాయి.దానిప్రకారం ప్రతి అధికారీ తనకార్యాలయ గుమాస్తాల వ్యక్తిగత రిజిస్టర్లను నెలకొకసారి ఖచ్చితంగా సమీక్షించేవారు. అందువలన తన కార్యాలయంలో ఏ గుమాస్తా దగ్గర ఏ ఏ ఫిర్యాదులు ఎందుకు పెండింగ్ లో ఉంటున్నాయి, ఎందుకు ఆగిపోతున్నాయి తెలిసిపోయేది. జాప్యానికి అధికారే కారణం కానక్కరలేదు.కిందిస్థాయి  సిబ్బంది చేసే అహేతుక  జాప్యం కూడా అధికారి అసమర్ధతగానే పరిణమిస్తుంది. అందువలన ప్రతి అధికారీ తన కార్యాలయంలోని పెండింగ్ అర్జీల పై నిరంతర పరిశీలన జరపుతూనే ఉండాలి.జాప్యం లేకుండా అర్జీలు పరిష్కరిస్తూనే ఉండాలి.
-       నూర్ బాషా రహంతుల్లా 6301493266 

3 కామెంట్‌లు: