ఈ బ్లాగును సెర్చ్ చేయండి

28, సెప్టెంబర్ 2019, శనివారం

అందరికీ మరుగుదొడ్లు కట్టి కాపాడండి


అందరికీ మరుగుదొడ్లు కట్టి కాపాడండి
మధ్యప్రదేశ్‌ లోని శివ్‌పురి జిల్లా భావ్‌ఖేడి గ్రామ పెత్తందారులు ఇద్దరు దళిత పిల్లలను పంచాయతీ భవనం ఎదుట బహిరంగ మలవిసర్జన చేస్తున్నారని ఆగ్రహించి కొట్టి చంపారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చి 72 ఏళ్లు గడుస్తున్నా కులం పడగనీడన బతుకీడ్చక తప్పనిస్థితిలోనే దళితులున్నారనటానికిదే తాజా సాక్ష్యం.దేశంలో కులవివక్ష,మత వివక్షలు నానాటికీ పెరిగి బలహీనుల ఉసురు తీస్తున్నాయి. అందువలన అందరికీ మరుగుదొడ్లు కట్టి బలహీనుల ప్రాణాలు కాపాడటం ప్రభుత్వాల తక్షణ బాధ్యత.లేకపోతే కొందరు పసిపిల్లలని కూడా చూడకుండా మలవిసర్జకుల అంతు చూసే కార్యక్రమం మొదలుపెట్టవచ్చు.
గత అయిదేళ్లలో 11 కోట్లకుపైగా మరుగుదొడ్లు నిర్మాణమయ్యాయని, దేశంలో బహిరంగ మలవిసర్జన చేసే55 కోట్లమంది 2019 నాటికి  5 కోట్లకు తగ్గారని చెబుతున్నారు.మరుగుదొడ్డి లేకపోవడం వల్ల గ్రామీణప్రాంతాల్లో మహిళలు, బాలికలు వేకువజామునే లేచి తమ కాలకృత్యాలు తీర్చుకోవాలి. లేదా రాత్రి చీకటి పడేవరకూ వేచి ఉండాలి. ఊరిబయటకు పోయే  మహిళలు  అత్యాచారాలకూ, అపహరణలకూ గురవుతున్నారు.ఇప్పుడు ఆ జాబితాలో హత్యలూ చేరాయి.పాకీదొడ్లను కడిగి బాగుచేసిన వాళ్ళను కృతజ్నతలేకుండా చంపుతున్నారు.రాజ్యాంగం రాసినప్పుడు మేధావులు ఈ కులవివక్ష మతవివక్ష ఇంతగా దేశాన్ని అతలాకుతలం చేస్తాయని ఊహించి ఉండరు. కులాలను రాజ్యాంగ పట్టికలో పేర్చి షెడ్యూళ్ళలో అమర్చి రిజర్వేషన్లు కల్పించారుగానీ కులాంతర మతాంతర వివాహాలను వివక్షలకు విరుగుడుగా భావించలేదు.మొన్న 10.9.2019 న సుప్రీం కోర్టు జస్టిస్ అరుణ్ మిశ్రా,షాల నేతృత్వంలో కులాంతర మతాంతర వివాహాలు దేశానికి మంచివేనని ,అవి లౌకిక భావనను పరివ్యాప్తం చేస్తాయని తీర్పు ఇచ్చారు.ఈ తాజా తీర్పును అందిపుచ్చుకొని పాలకులు చట్టాలు చెయ్యాలి.కులాల నెపంతో ఎవరూ హత్యలకు పాల్పడకూడదు. మరుగుదొడ్లు కట్టిస్తే ఆ ఇంటి జనం ఊరిబయటకు వెళ్ళారు.వీధిలో మలవిసర్జన చెయ్యకుండాఉంటారు.తక్కువ కులం ,తక్కువ మతం వాళ్ళనే బేధభావం తొలగిపోతుంది.వారిలో పరిశుభ్రత పెరుగుతుంది. ఈ సదుద్దేశంతోటే కులాంతర మతాంతర వివాహాలకు లక్షరూపాయల నగదు ప్రోత్సాహం కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఎన్ని ప్రోత్సాహకాలు ప్రకటించినా రిజర్వేషన్లు ఇచ్చినా అవి మరింత కడుపుమంటకు,నరనరాన పాకే ద్వేషానికి తావు ఇస్తున్నాయేకానీ కులమత ద్వేషాలను నేటివరకు చల్లర్చలేకపోయాయి.మరో కులం పిల్లలు వీధిలో దొడ్డికి కూర్చున్నారనే సాకుతోకూడా చంపుతున్నారంటే  ఎంత కులద్వేషం పేరుకుపోయి ఉంటుంది?నాలుగు తిట్టి లేదా కొట్టి తరిమేసే నేరానికి పిల్లల్ని కొట్టి చంపటామా?ఈ హత్యలను ఎవరైనా ఎలా సమర్ధిస్తారు?     
అందువలన మనుషుల్ని కలిపే మరోదారిలో పాలన సాగాలి. దేశంలో 72 ఏళ్ళ సుదీర్ఘ కాలం కుల మత పోరాటాలతోనే గడిచిపోయింది.ఇకనైనా కులాంతర,మతాంతర వివాహాలకు మాత్రమే రిజర్వేషన్లను పరిమితం చేయటం మంచిదని నా భావన. కులాంతర మతాంతర వివాహాలు మన దేశంలోని కులమత ద్వేషాలకు శాంతియుత విరుగుడు మందులు.ఏకులమో ఏమతమో చెప్పుకోలేని హైబ్రీడ్ పిల్లలు భారీగా పుట్టాలి.ఈసంకర పిల్లలే రేపటి భారతావనికి శాంతి దూతలు కావచ్చు.కులం లేకుండా పోవడం వల్లనే మనలో నిజమైన ఐక్యత వస్తుంది.కులవ్యవస్థ అందరూ కలిసి పాల్గొనే ఉమ్మడి కార్యక్రమాన్ని అడ్డగిస్తుంది.ఇది మన అందరి పని అనే స్పృహ లేకుండా, అందరూ కలిసి పోకుండా చేస్తుంది.అయా కులాలు మతాలలోని ధనవంతులు తమకులంలోనే ఉన్న నిరుపేదలను పెళ్ళిళ్ళు చేసుకొని ఉంటే ఇప్పటికే చాలావరకు అంతర్గత ఆర్ధిక అంతరాలు తొలిగిపోయేవి.కులాంతర మతాంతర వివాహాలు భారీగా జరగాలని అంబేద్కర్ తోపాటు గాంధీజీ కూడా కోరారు.కాకపోతే అటువంటి వివాహాలకు తగిన ప్రోత్సాహకాలను ఆనాడే ప్రకటించలేదు. వారి మరణానంతరం వంద సార్లు రాజ్యాంగ సవరణలు జరిగినా ఈ అంశం ఎవరూ ముట్టుకోలేదు.స్వచ్చందంగా ఇలాంటి పనులు భారీగా జరగవు.పైగా కులాన్నే తమ జాతిగా కూడా పిలుస్తున్నారు.అందుకే ఇప్పటికైనా కులాంతర,మతాంతర వివాహాలు చేసుకున్న పేదలకు మాత్రమే రిజర్వేషన్లను పరిమితం చేయాలి.కులమత ప్రసక్తిలేని, ఏ కులమో చెప్పలేని భారత జాతి గణనీయంగా పెరిగితే కుల,మత కలహాలు,రిజర్వేషన్ల గొడవలు సమసిపోయి మన దేశం మరింత బాగుపడుతుంది.
నూర్ బాషా రహంతుల్లా
విశ్రాంత డిప్యూటీ కలక్టర్,6301493266


1 కామెంట్‌: