ఈ బ్లాగును సెర్చ్ చేయండి

19, అక్టోబర్ 2019, శనివారం

అత్యవసర సర్వీసుల్ని ఆగనీయకూడదు!


అత్యవసర సర్వీసుల్ని ఆగనీయకూడదు!
తెలంగాణా ఆర్టీసీ సమ్మెలో 5 గురు  కార్మికులు  చనిపోయారు. ఆత్మాహుతులు,గుండెపోట్లు,బలిదానాలతో కార్మికుల జీవితాలను అస్తవ్యస్థం చేసిందని ప్రతిపక్షనాయకులు ప్రభుత్వాన్ని తిట్టిపోశారు.చివరికి సొంతపార్టీలోని కొందరు మంత్రులుకూడా కండక్టర్లు,డ్రైవర్ల పొట్టకొట్టకూడదని సలహాలు,హామీలు ఇచ్చారు.  ఇక చర్చలు లేవు విధుల్లో చేరని వాళ్ళకు నూకలు చెల్లాయన్నారు ముఖ్యమంత్రి . ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలి,తండ్రిపాత్ర పోషించి పిల్లల డిమాండ్లను పరిష్కరించాలి. సమస్యలను అలాగే ఉంచడం సరికాదు.వారిడిమాండ్లు సగానికి పైగా న్యాయమైనవే.ప్రజాస్వామ్యదేశంలో ప్రజలే శక్తివంతులు,వాళ్ళుతిరగబడితే ఆపలేము , ఎం.డి.ని వెయ్యండి జీతాలు ఇవ్వండీ అని హైకోర్టు చెప్పాల్సివచ్చింది. కేసీఆర్ కంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగనే నయమనిపించాడంటున్నారు కార్మికులు.కార్మికసంఘాలు చేయరాని తప్పుచేశాయి. పండుగ ముందే సమ్మె ఏంటి? కుక్క తోకను ఊపాలిగానీ తోకే కుక్కను ఊపకూడదు,న్యాయస్థానంలో వీళ్ళ అంతు తేలుద్దాం అని ప్రభుత్వ రంకెలు. బతుకులెన్నాళ్ళు - భాగ్యాలెన్నాళ్ళు? ఈ మాత్రానికే చావాలా? అని కొంతమంది అమరవీరులను నానామాటలు అన్నారు. బ్రతికుంటే బలుసాకు తినైనా బతకొచ్చు అంటారే గానీ జీతమాగిపోతే బ్రతికేదెలా?మేము తినే బుక్క మీకుపెట్టి పోషించుకుంటాం,కిరాయిడ్రైవర్లవాళ్ళ ప్రమాదాలు జరుగుతున్నాయి,ఆర్టీసీని నాకు అప్పజెప్పండి లాభాల్లో నడిపిస్తాం ...అంటూ కొందరు ప్రతిపక్ష నాయకులు కేసీఆర్  మొండివైఖరి వల్లనే ఇదంతా అన్నారు. వాస్తవానికి నెలనెలా జీతము,పెన్షను సరిగా రాకపోతే పొట్టగడవకే చాలామంది ఉద్యోగులు రాలిపోయేలా ఉన్నారు.ఎందుకంటే ఆ జీతం మీద ఆధారపడే కుటుంబమంతా బ్రతకాలి. ప్రజల సానుబూతి ఉండాలంటే పండగ సమయాల్లో సమ్మెలు పెట్టకూడదు.పాలకులు కూడా సమ్మెదాకా రానివ్వకూడదు.పేదరికంతో బాధపడుతూ ఎవరూ బ్రతకదలుచుకోలేదు.బాధ ఎలా కలిగినా తట్టుకోలేమంటూ బ్రతుకు చాలిస్తున్నారు. బతుకంత భయం లేదు - చావంత కష్టం లేదు అన్నారు. కేసీఆర్ తెలంగాణా ఉద్యమ నేతగా ఉన్నప్పుడు ఇదే ఆర్టీసీ ఉద్యమనేతలను అరెస్టు చేసినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రిని అగ్గితో గోక్కుంటున్నావని చేసిన విమర్శలు నేట్లో వైరల్ అవుతున్నాయి.ఆర్టీసీ ఆస్తులు తాకట్టులో ఉన్నాయని ,రోజుకు వడ్డీనే 80 లక్షలు కడుతున్నారని,2445 కోట్ల అప్పులమీద సంస్థ నడుస్తున్నదని, 2500 డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, రాయితీల బకాయీలు కూడా సకాలంలో ప్రభుత్వం ఇవ్వకపోతే సంస్థ ఎలా నడుస్తుందని  ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.బాసికం మొదలు భజంత్రీలవరకు అన్నీ బదుళ్ళతోనే పెళ్ళిజరిపినట్లు ఉంది ఆర్టీసీ పరిస్తితి.   ఆర్టీసీ బస్సులమీద టోల్ గేట్ పన్నులు కూడా రద్దుచేయలేదే ? అవి  వాడే డీజిల్ మీద 27 శాతం వ్యాట్ పన్నుఎందుకని అడిగారు. చర్చలెందుకు జరపరంటూ గవర్నర్ను కలిశారు,బిక్షాటన చేశారు.రాష్ట్ర బంద్ పాటించారు.కొందరు టీఆరెస్ నాయకులు ఆర్టీసీ సమ్మె వెనుక తమ నాయకులే ఉన్నారని చెప్పటం,తెలంగాణా ఉద్యమంలో ఆత్మహత్యలు చేసుకొని అసువులు బాసిన వారిని అమరవీరులుగా కీర్తిస్తున్న నాయకుల పొగడ్తలతో వాతావరణం బాగా చెడిపోయింది. కార్మికుల 45 డిమాండ్లలో 20 డిమాండ్లు పూర్తిగా హేతుబద్ధమైనవే ,ఆర్ధిక భారం పడనివే కాబట్టి వాటినైనా వెంటనే పరిష్కరించాలని ధర్మాసనం తీర్పుచెప్పింది.విలీనం తప్ప మిగతా విషయాలపైనైనా  చర్చలు జరపండని కార్మికులు కోరుతున్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రజలకోసం ప్రభుత్వమే కాపాడుకోవాలి. అత్యవసర సర్వీసుల్ని ఆగనీయకూడదు! ప్రజల మామూలు ప్రయాణాలు,జాతరలు తిరునాళ్లు ఎలక్షన్లు ... ఇలా అన్నిటిలో పనికొచ్చేది ఆర్టీసీ. ప్రజల డబ్బుతో వేసిన నున్నటి  రోడ్లను  ప్రైవేటు పరం చేసి, గతుకుల పల్లె బాటలను ఆర్టీసీకి ఇచ్చారు. గుంటల్లో క్లచ్చులు తొక్కీ తొక్కీ, పగిలి పోయిన రోడ్ల మీద బండ బ్రేకులను కొట్టీ కొట్టీ  డ్రైవర్లు, కండక్టర్లు అలిసిపోతున్నారు.పల్లె వెలుగులక్షలాది బ్రతుకు పోరాటాలను పట్టణాలకు పల్లెలకు మధ్య మోస్తూ తిరుగుతున్నాయి. ఎర్ర బస్సు ఎక్కకుండా,పాస్ రాయితీ పొందకుండా హైస్కూలుకో కాలేజీకో వెళ్ళిచదవని విద్యార్ధులు ఎవరైనా ఉన్నారా అంటూ బస్సులతో తమజీవితాలు ఎలా ముడివేసుకున్నాయో గుర్తుచేసుకొని బాధపడ్డారు కొందరు . వేతనాలు చెల్లించకపోతే పిల్లల ఫీజులేలా కడతారు?నిత్యావసరవస్తువులు ఎలా కొనుగోలు చేస్తారు? ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు.ఏజెన్సీ ప్రాంతాలలో ఆసుపత్రులకు వెళ్ళలేకపోతున్నారు.పాఠశాలల సెలవులు పొడిగిస్తే సమస్యతీరదని ,నిరసనలు ప్రజాగ్రహం గా మారనివ్వకండని హైకోర్టు హితవు చెప్పింది.ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యాటమే కాకుండా  డొక్కుబస్సుల స్థానంలో కొత్తవాటిని కొనటానికి వెయ్యికోట్ల రుణం ఇస్తానంది.ఇలాంటి మంచి  చర్యలు తీసుకొని తెలంగాణా ప్రభుత్వం ఆర్టీసీని నిలబెట్టుకోవాలి.ప్రజలకు అవసరమైన రవాణా సంస్థను సేవా సంస్థలాగా నడపాలి.
--- నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత డిప్యూటీ కలక్టర్,6301493266 
 (సూర్య 20.10.2019 లో నా సంపాదకీయం )
 https://www.facebook.com/williams32143/posts/2733406600024646

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి