ఈ బ్లాగును సెర్చ్ చేయండి

8, అక్టోబర్ 2020, గురువారం

చట్టాలు సరిగా అమలుచేయటమే రాజధర్మం


చట్టాలు సరిగా అమలుచేయటమే రాజధర్మం (సూర్య 11.10.2020)
చట్టాలు సరిగా అమలుచేయటమే రాజధర్మం అని వాజపేయి చెప్పారు.ఆయన ప్రధానిగా సర్వధర్మ సమభావన చూపిస్తూ అన్నివర్గాల మన్నన పొందారు.స్వర్ణ చతుర్భుజి లాంటి జాతీయ రహదారుల నిర్మాణంతో దేశ రోడ్లు రవాణా రంగం రూపమే మారిపోయింది. అర్ధరాత్రి కూడా మహిళా నిర్భయంగా రోడ్డుమీద తిరగాలి అన్న గాంధీజీ కోరిక మాత్రం నెరవేరలేదు.హత్యాచారానికి గురైన బాధితురాలి మరణవాంగ్మూలాన్ని బట్టి దోషులను పట్టుకొని శిక్షించకపోతే చట్టం సరిగా అమలు కానట్లే.సాక్షుల రక్షణకు ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని సుప్రీంకోర్టు యుపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. కార్మికులు, రైతులు,వలస కూలీలు, చిన్న ఉద్యోగులు, వ్యాపారులు, అందరికీ చట్ట ప్రయోజనాలు సమంగా అండాలి. కరోనా తరువాత ఆహారధాన్యాల నిత్యావసరాల ధరల పెరిగి ప్రజలు కష్టపడుతున్నారు. పనులు దొరకక అన్ని వర్గాల శ్రామిక ప్రజలు అలమటిస్తున్నారు. విదేశీ వాణిజ్యం పారిశ్రామికోత్పత్తులు ఎగుమతులు తగ్గాయి. ఆర్థిక సంక్షోభం, ఫలితంగా నిరుద్యోగం తీవ్రమై ప్రజల కొనుగోలు శక్తి హరించుకుపోతున్నది. విదేశాలలో పని చేస్తున్న చాలామంది భారతీయులు తిరిగి వచ్చేసినందువల్ల పంపే డబ్బు కూడా తగ్గిపోతుంది. కొత్త పరిశ్రమలు ఏర్పడకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు. దేశంలో ఆర్థిక సంక్షోభం నానాటికీ ముదురుతోంది. అమెరికాతో సహా అన్ని దేశాలలో ఆర్థిక పతనం మొదలయ్యింది. ఫెడరలిజం భారత రాజ్యాంగపు మౌలిక లక్షణం .రిపబ్లిక్‌ అంటేనే ఫెడరల్‌, లౌకిక స్వభావం కలిగి వుంటుంది. రాజ్యాంగంలోని 7వ షెడ్యూలులో కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అంశాల జాబితా, రాష్ట్రాల పరిధిలోకి వచ్చే అంశాలజాబితా , రెండింటి పరిధిలోఉండే అంశాల జాబితా ఉన్నాయి. ఎవరిపని వాళ్ళు చెయ్యాలి. రాష్ట్రాల పరిధిలో ఉండే అంశాల పనిలోకి కేంద్రం వస్తోంది.రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా అమ్మకం పన్ను బదులు జిఎస్‌టి లోకి తెచ్చారు. జిఎస్‌టి లోకి మారినందున రాష్ట్రాలకు వచ్చే ఆదాయం తగ్గితే దానిని కేంద్రం భర్తీ చేస్తుందన్న హామీ ఇచ్చారు.ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యపై నూతన విద్యా విధానం వచ్చింది.రాష్ట్రాల జాబితాలో ఉన్న వ్యవసాయం పై మూడు బిల్లులు ఆమోదించారు.రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం కొరటంలేదు. జమ్ము-కాశ్మీర్‌ రాష్ట్రాన్ని అక్కడి అసెంబ్లీ ఆమోదం లేకుండానే కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టారు. రాష్ట్ర గవర్నరు ఆమోదిస్తే రాష్ట్రం అసెంబ్లీ ఒప్పుకున్నట్లే భావిస్తున్నారు. రాష్ట్రాల పాలనా వ్యవస్థలో కేంద్ర పాలన క్రమంగా పెరుగుతోంది.జాతీయంగా ఫెడరల్‌ వ్యవస్థలో మనమంతా భారతీయులమే కానీ భాషలు ప్రాంతాలవారీగా తెలుగు , బెంగాలీ , మలయాళీ, తమిళుల మై ఉంటాము. ఎవరి ప్రాంతాల భాషల పరిరక్షణ కోసం వారు ప్రయత్నిస్తారు. ఐక్యత కోసం ఒకే దేశం అన్న జాతీయ చైతన్యం మంచిదే . కానీ ఒకే భాష, ఒకే సంస్కృతి ఈదేశం లో ఎప్పుడూ లేదు.ప్రాంతాలనుబట్టి ఎన్నో భాషలు అనాదిగా దేశంలో ఉన్నాయి. ఒకే సంస్కృతి పేరుతో బలవంతంగా హిందీయేతర రాష్ట్రాలపై హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారని కొన్ని రాష్ట్రాల నేతలు వాపోయారు. భిన్నత్వంలో ఏకత్వమే మనదేశ ప్రత్యేకత. ఉమ్మడి జాబితాలోని అంశాలపై చట్టాలు చేసేటప్పుడు రాష్ట్రాల అభిప్రాయం తీసుకుంటే మచిది. లేకపోతే అధికారాలన్నీ కేంద్రం వద్ద కేంద్రీకృతం అయ్యాయని ప్రజలు అనుకుంటారు. రాష్ట్రాల అసెంబ్లీలు చేసిన సవరణలు, సూచనలు, వినాలి. రాష్ట్రాలతో సంప్రదించి రాష్ట్రాల వాదనలు కూడా విని చట్టాలు చేయడమే నిజమైన ఫెడలరిజం. సింధు గంగ, బరాక్‌, బ్రహ్మపుత్ర , నర్మద, తపతి, మహానది, సబర్మతి, గోదావరి, కృష్ణ, పెన్న, కావేరి, పాలారు, వైగై నదులున్నాయి. ఆంధ్ర తెలంగాణా మధ్య కృష్ణా, గోదావరి నదీజలాల యాజమాన్య బోర్డుల పరిధి దగ్గర గొడవ వచ్చింది.ఇలా అనేక రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలున్నాయి. పోతిరెడ్డిపాడు నుండి కాళేశ్వరం నుండి పెద్ద ఎత్తున నీటిని తరలిస్తున్నారని పరస్పరం ఆరోపించుకుంటున్నారు.తెలంగాణాలో ఎత్తిపోతల ద్వారా నీరుపంపు చేసుకుంటున్నారు. పోలవరం పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీకి మళ్లించారు. ట్రిబ్యునల్‌ కేటాయించిన దానికంటె ఒక్క చుక్క కూడా అదనంగా తీసుకోబోమని ఆలంపూర్‌-పెద్దమరూర్‌ వద్ద బ్యారేజి నిర్మించి కృష్ణా నీటిని తరలిస్తామని వాదులాడుకుంటున్నారు.నదుల యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉండాలి నదీ జలాలు ఎన్ని ఏ రాష్ట్రానికి పంపిణీ చెయ్యాలి ఎవరి వాటా ఎంత లాంటి రాష్ట్రాల తగాదాలను కేంద్రం పరిష్కరింఛాలి. ‘మహానది-గోదావరి’, గోదావరి-కృష్ణా- కావేరి నదుల అనుసంధానం కావాలంటున్న కేంద్రం గంగా-కావేరీ నదుల అనుసంధానం జరిపి ఉత్తరాది వరదల ప్రాంతాల నీళ్ళను దక్షిణాది కరువు ప్రాంతాలకు తరలించే పని కేంద్రం చేపడితే బాగుండేది. . డాక్టర్‌ కె.యల్‌.రావు కేంద్రమంత్రిగా 2,640 కిలోమీటర్ల ‘గంగ-కావేరి అనుసంధాన పథకం ప్రతిపాదించారు. ఉత్తర భారతంలోని బ్రహ్మపుత్ర, గంగ వంటి జీవనదుల నీటిని దక్షిణ భారతానికి మళ్లించాలి. అందువల్ల ఉత్తరాదిన వరదల బెడదను నివారించి దక్షిణాదిన నీటి కొరతను తీర్చటానికి గంగా కావేరీ నదులను అనుసంధానం చేయాలని సర్వోన్నత న్యాయస్థానం 2002 అక్టోబరు 31న కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రప్రభుత్వం కూడా సరే అని ఒక తీర్మానాన్ని ఆమోదించింది.ఒకే దేశం- ఒకే ప్రజ- నినాద స్పూర్తితో అన్నీ రాష్ట్రాల ప్రజలు ఐక్యమవ్వాలంటే అన్నిరాష్ట్రాలకూ సదుపాయాలు సమంగా అందాలి.దేశంలో వరదలతో కొన్ని రాష్ట్రాలు అల్లాడుతుంటే తాగు, సాగు నీటి కొరతతో కొన్నిరాష్ట్రాలు అల్లాడుతున్నాయి. 73 సంవత్సరాల స్వతంత్ర పాలన కాలంలో ఏ రాష్ట్రంలో ఏమి సమస్యలున్నాయో తెలిపే చరిత్ర ప్రభుత్వాల దగ్గరే ఉంది. ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు అనే విలాపాలు ప్రజలు చేయకూడదంటే అన్ని రాష్ట్రాల దాహార్తిని తీర్చాలి. అన్ని రాష్ట్రాల భూములకు వరదలను అరికట్టి సాగునీటిని కల్పింఛాలి.ఇదే ఫెడరల్‌ ప్రభుత్వాల మొదటి బాధ్యత.
--- నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266

 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి