ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, అక్టోబర్ 2020, శుక్రవారం

దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నిరంతరం జరుగుతూనే ఉండాలి

 

 

                  



దుష్ట శిక్షణ శిష్ట రక్షణ
నిరంతరంరుగుతూనే ఉండాలి 

 (సూర్య 3.10.2020,4.10.2020,గీటురాయి 16.10.2020 )  

కులములేనివాడు కలిమిచే వెలయును ,కలిమి లేని వాని కులము దిగును ,కులముకన్న నెన్న గలిమి ప్రధానంబు అన్నాడు వేమన. వలచి గెలిచి కలలు పండిన జంట లేదీ ఇలలో కులము మతము ధనము బలము గొంతు కోసెను తుదిలో అన్నారు మనసుకవి ఆత్రేయ. ఎవరిది ఎక్కువ కులము ?ఎవరిది తక్కువ కులము ?ఎవరు తెచ్చినారు ఈ బేధాలు? కులాలు మతాలు కూటాలన్నీ కలిమివల్ల కల్పించిన వేరా మనమంతా కుల మత్తును వీడి మనుషులంతా ఒకటేనని చాటరా అని సినారె ఆనాడే చాటారు. గోదాదేవి లాగానే బీబీ నాంచారి కూడా విష్ణుపత్నిగా ఆరాధించ బడుతుంది.వెంకటేశ్వరుడు లౌకికవాదానికి ప్రతీకగా మారి మతాంతరవివాహాలకు మార్గం సుగమం చేసి మార్గదర్శకుడయ్యాడు అని డా.సి.వి. సుబ్బన్న శతావధాని తన బీబీ నాంచారి ప్రబంధములో చెప్పారు. సమాజంలో దుర్మార్గుల దౌర్జన్యం నుంచి బలహీనులను రక్షించటం కోసమే నైతిక విలువలు , చట్టము , ప్రభుత్వము,పోలీసులు,కోర్టులు ఉన్నాయి. హేమంత్ లాంటివారు బలైతే వారి తల్లిదండ్రులు రక్షణ కోసం రోడ్డున పడి ఉద్యమాలు చేయవలసి వస్తోంది. శ్మశానానికి వెళుతుంటే కూడా హంతకులు వెంటాడుతూనే ఉన్నారట.మహిళలపై అత్యాచారాలు, హత్యాచారాలు చేస్తున్నారు.కులాంతర వివాహితుల్ని చంపుతున్నారు. ఉత్తరప్రదేశ్‌ లో ఒక దళిత అమ్మాయిని నలుగురు అగ్రకుల యువకులు అత్యాచారం చేసి నాలుక కోశారు.ఎముకలు విరిగిపోయి ఆ అమ్మాయి మరణించింది.కుటుంబీకులకు శవాన్ని ఇవ్వకుండా పోలీసులే అర్ధరాత్రి అంత్యక్రియలు చేశారట.పరామర్శకు రాహుల్ ప్రియాంకలనూ వెళ్లనివ్వలేదు.అసలు అత్యాచారమే జరగలేదు,ఇదంతా దేశాన్ని కల్లోలపరచటానికి కొందరి కుట్ర అని ఆ రాష్ట్ర డీజీపీ అన్నారు.14 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి చెట్టుకు వేళ్లాడదీసి ఆమె ప్రాణాలు తీశారు. మూడేళ్ల బాలికను కూడా ఇలాగే హింసించి చంపారు. నిర్భయ చట్టం ప్రకారం ఈ అత్యాచారహంతకులకు ఉరిశిక్ష అమలు కావాలి.కులపోటీ హత్యల వల్ల వ్యక్తిగత కక్షలు తీరవచ్చుగానీ మరే లాభం లేదు.పోయినప్రాణం తిరిగిరాదు.చట్టం వల్ల నేర భయం కలిగేలా సాంఘిక సంస్కరణలు రావాలి.మృగాళ్ల బారిన పడిన ఈ ఆడపిల్లలు దళితులు, వెనకబడిన కులాలవారు.పిల్లలపై లైంగిక నేరాల నిరోధక(పోక్సో) చట్టంలోని శిక్షలు అమలు కావాలి.నిర్భయ ఉదంతం తరువాత 150మంది నేరగాళ్లకి శిక్ష పడినా కూడా దేశంలో అత్యా చారాలు తగ్గలేదు. ఉత్తరప్రదేశ్‌లో లైంగిక నేరాలు అరికట్టడానికి పెట్టిన 1,023 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు 206 కు తగ్గాయి.లైంగిక వేధింపుల ఆరోపణ లపైనా, అత్యాచారం జరిగిందన్న ఫిర్యాదులపైనా పోలీసులు ఉదాసీనంగా ఉండటంవల్లే దోషులకు సరిగా శిక్షలు పడటం లేదని పార్లమెంటరీ సంఘం తేల్చింది.మరి కఠిన చట్టాలు తెచ్చి ప్రయోజనం ఏమిటి? నిర్భయ కేసులో దోషులు ఉరికంబం ఎక్కటానికి ఎనిమిదేళ్ల జాప్యం జరిగింది.నిర్భయ లాగా మనిషా కు సత్వర న్యాయం జరగలేదు . మహిళలపై లైంగిక నేరాలు జరిగినప్పుడు పోలీసు విభాగం సత్వరం స్పందించాలి. నిందితులను పట్టుకుని త్వరగా శిక్షలు పడేలా చూడాలి. నేరానికీ, శిక్షకూ మధ్య జాప్యాన్ని నివారించాలి. నేరగాళ్లలో భయం కలగాలి. షీ టీమ్‌ , దిశ లాంటివన్నీ మహిళలపై నేరాలు అరికట్టడానికే. దిశ చట్టంప్రకారం లైంగిక నేరస్తులను పట్టుకుని 21 రోజుల్లో శిక్షించాలి. బాధిత మహిళలు వెంటనే పోలీసులకు తెలిపే దిశ యాప్‌ ను కొన్ని రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకున్నాయి.ఈనాడు మనలో ఎవరికైనా  కూతుళ్ల దినోత్సవం' వల్ల సంతోషం కలుగుతుందా? పిల్లలు పుట్టలేదని కన్నీళ్ళు, పిల్లల్ని కాపాడుకోలేకా కన్నీళ్ళు, మానాభిమానాల కోసం కన్నీళ్ళు,కూతుళ్ళు హత్యాచారానికి గురై చనిపోతే కన్నీళ్ళు,కన్నీటితో తడవని ఇల్లేది? కులాంతర వివాహం చేసుకున్నయువతీయువకులను తల్లిదండ్రులే దుర్మార్గంగా ప్రాణాలు తీస్తున్నారు. గద్వాల జిల్లాలో ఒక బాలిక వేరే కులం అబ్బాయి వల్ల గర్భవతి అయిందన్న కోపంతో తల్లిదండ్రులే హతమార్చారు. వందల ఏళ్లనుండీ ఇదే చరిత్ర. కరీంనగర్‌ జిల్లా గద్ది కుమార్‌, భువనగిరి జిల్లా నరేశ్‌ అంబోజి, పెద్దపల్లి జిల్లా మంథని మధుకర్‌ , మిర్యాల గూడ పెరుమాళ్ల ప్రణయ్‌ ఇవన్నీ కులోన్మాద హత్యలే. పుట్టుకతో ఎవరికీ పాపం రాదు.తక్కువకులంలో పుట్టటం శాపంగా జనమే మార్చారు.ఎక్కువకులంలో పుట్టటం పరువు గా తలపోశారు. కానీ పిల్లలకు ఇవేమీ తెలియవు.కులంవల్లనే ఏదో ఆధిక్యత సంక్రమించిందని, వేరే కులం వాళ్ళను పెళ్లి చేసుకుంటే పరువు పోతుందనీ , కులానికి, వంశానికి ఉన్న పరువును హత్యలద్వారా కాపాడుకోగలమని హంతకులు నమ్ముతున్నారు. ప్రాణంతీస్తే కులానికిగానీ తల్లిదండ్రులకు గానీ పరువు వస్తుందా? రాదు.పైగా ఉన్న పరువు పోతుంది. పెద్ద కులాల యువకులు, చిన్నకులాల అమ్మాయిలను ప్రేమిస్తే, పెళ్లి చేసుకుంటే సర్దుకుపోతున్నారు. పెద్ద కులాల అమ్మాయిలను చిన్నకులాల అబ్బాయిలు ప్రేమిస్తే మాత్రం సహించడం లేదు. నాలుగు వర్ణాలు అన్నారు కానీ ఎన్నో కులాలు ఉన్నాయి.కూటికి పేద అయినా, కులానికి కాదట. కులాంతర వివాహాలకు కూడా చదువు ఉద్యోగము ఆస్తి చూసుకుంటున్నారు. కులము కంటే బ్రతకటానికి ఆస్తి,ఉపాధి,సంపాదన ముఖ్యం అనుకుంటున్నారు.సరిసమానుల మధ్య వివాహానికి కులాలు మతాలు అడ్డుకావని కులాంతర మతాంతర వివాహాలను పనిగట్టుకొని చేసే వారూ ఉన్నారు. ప్రభుత్వం కూడా కులాంతర మతేతర వివాహాలకు ప్రోత్సాహకాలు ఇస్తోంది.ఎందరో జ్నానులు ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ కులం ఎంతో బలీయంగా తయారయ్యింది.ఎవరైనా తమకు ఇష్టమైన మతానికి మారవచ్చు కానీ కులం మారలేరు.కులం శాపంగానో వరంగానో మనిషికి జీవితాంతము పట్టి ఉంటోంది. కులములోన నొకఁడు గుణహీనుఁ డుండిన,కులము చెడును వానిగుణమువలన,ఎలమి చెఱకునందు వెన్నుపుట్టినరీతి అని చెప్పిన వేమనే కులములోన నొకడు గుణవంతు డుండెనా,కులము వెలయు వాని గుణము వలన,వెలయు వనములోన మలయజంబున్నట్లు అనికూడా అన్నాడు. కొంతమంది అత్యాచారాలు హత్యలతో తమ కుల మతాలకున్న మంచి పేరును చెడగొడుతున్నారు.వారు చేసే చేదుపనులు అనుసరించే హింసా మార్గం అందరికీ సమస్యలే తెచ్చిపెడుతూ ఉంది.కుల మతాల పేరుతో హత్యలకు ,విధ్వంసాలకూ పాల్పడే వ్యక్తులు ఖర్చుతో తమ ఊరిలో మంచి రోడ్లు వేయించి,వంతెనలు, విద్యాలయాలు,ఆసుపత్రులు కట్టించి ప్రజలను కాపాడవచ్చు. మంచిపనులేమీ చేయకుండా కేవలం విధ్వంసాలకు పాల్పడే వారికి మంచిపేరేం వస్తుంది?పైగా వీళ్ళ హింసాప్రవృత్తివలన వారి మతానికీ,కులానికీ ఏ తప్పూ చెయ్యని శాంతిని కోరే వారికీ కూడా సభ్య సమాజంలో తలెత్తుకు తిరగలేని అవమానం,హానీ కలుగుతాయి. మానవత్వం చూపుతూ  కులము మతము అడగకుండా అందరికీ అన్నదానం చేస్తున్నవారికి, ప్రమాద బాధితులకు ,రోగులకు సహాయపడుతున్నవారికి,సత్రాలు చలివేంద్రాలు పెట్టి బాటసారుల దాహార్తిని,క్షుద్బాధను తీరుస్తున్న మానవతామూర్తులు అందరికీ వందనం.ఆడబిడ్డల మాన ప్రాణ రక్షణ కోసం మంచివాళ్లు అందరూ భగవంతుడిని కన్నీటితో ప్రార్ధిస్తున్నారు.రక్షణ కల్పించమని ప్రభుత్వాలను వేడుకొంటున్నారు. ప్రజా క్షేమంకోసం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నిరంతరంరుగుతూనే ఉండాలి.

--
నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,6301493266

 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి