ఈ బ్లాగును సెర్చ్ చేయండి

23, ఆగస్టు 2013, శుక్రవారం

కొత్తరైలు మార్గాల కోసం ఉద్యమించక తప్పదు

 
కొత్తరైలు మార్గాల కోసం ఉద్యమించక తప్పదు
నూర్ బాషా రహంతుల్లా
             1849లో భారతదేశంలో ఒక్క కిలోమీటర్ రైలుమార్గంకూడా లేదు.1853 లో బొంబాయి-థానే అనే చిన్న మార్గంతో మొదలైన భారతీయ రైలు మార్గాల పొడవు ప్రస్తుతం 65 వేల కి.మీ.తో  ఆసియాలో కెల్లా అగ్రగామిగా ఉంది. మన రైలు మార్గాల వ్యవస్థ 7500 స్టేషన్లతో ప్రపంచంలో నాల్గవస్థానం ఆక్రమిస్తున్నది. ఇది దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. రోజూ రెండున్నర కోట్ల మంది జనాభా రైళ్ళ ద్వారా ప్రయాణం చేస్తున్నారు. అయితే పెరుగుతున్న జనాభాతో పాటు రైల్వే మార్గాలు పెరగడం లేదు.
దక్షిణ మధ్య రైల్వే 5810 కి.మీ.ల మార్గాలతో దేశంలో మూడవ స్థానంలో ఉంది.అయితే మన రాష్ట్రం మొత్తం దీని పరిధిలోకి రాలేదు.విశాఖపట్టణం డివిజన్ ను,గూడూరు ను  జోన్ లో కలపాలని ఇప్పటికీ ప్రజలు గోల చేస్తున్నారు.దక్షిణ మధ్య రైల్వేలో హైదరాబాదు,సికిందరాబాదు,గుంతకల్లు,గుంటూరు,విజయవాడ,నాందేడు డివిజన్లున్నాయి.ఇది 1966 లో ఏర్పడింది.మన రాష్ట్రంలో  మెదక్ జిల్లా కేంద్రానికి ఇంకా రైలు మార్గం  లేదు. భద్రాచలం, అమలాపురం, నాగర్ కర్నూల్, సిద్దిపేట పార్లమెంటు స్థానాలకు రైలు మార్గం లేదు. అలాగే      ఉట్నూరు,బోత్, అసిపాబాద్, వనపర్తి, జమ్మలమడుగు, మదనపల్లి, కందుకూరు, కొత్తగూడెం, పరకాల,నర్సీపట్నం,పాడేరు,పాలకొండ,పెద్దాపురం,రంపచోడవరం,రామచంద్రాపురం,జంగారెడ్డిగూడెం,ఆత్మకూరు,చంద్రగిరి,కళ్యాణదుర్గంచేవెళ్ళ,వనపర్తి,నారాయణపేట,సిరిసిల్ల,పరకాల,జనగాం,నర్సంపేట,పాల్వంచ,సూర్యాపేట,దేవరకొండ,సంగారెడ్డి,మెదక్, సిద్దిపేట,ఆసిఫాబాదు,మొదలైన రెవిన్యూ డివిజన్ కేంద్రాలకు ఇప్పటికీ రైలు మార్గం విస్తరించలేదు.
1946 లో పుచ్చలపల్లి సుందరయ్య కోరిన కొత్త రైలు మార్గాలు :
              కీర్తిశేషులు శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారు 1946 లో "విశాలాంధ్ర   లో ప్రజారాజ్యం" అనే పుస్తకంలో 12 రైలు మార్గాలు వెయ్యాలని కోరారు.   అవి   ఈనాటికి కూడా నిర్మించబడలేదు. ఆయన కోరిన రైలు మార్గాలు   ఇవి:

1.           విశాఖపట్నం-భద్రాచలం-వరంగల్లు
2.           హైదరాబాద్-దేవరకొండ-మాచర్ల-దొనకొండ-పొదిలి-ఒంగోలు
3.           ఒంగోలు-అద్దంకి-నర్సరావుపేట-సత్తెనపల్లి-అచ్చంపేట
4.           ఒంగోలు-పొదిలి-కనిగిరి-బద్వేలు-కడప-రాయచోటి-మదనపల్లి-బెంగుళూరు
5.           నెల్లూరు-బద్వేలు-మైదుకూరు-ప్రొద్దుటూరు-ఆళ్ళగడ్డ-నంద్యాల-ఆత్మకూరు
6.           గూడూరు-రాపూరు-రాజంపేట-రాయచోటి-కదిరి
7.           రాయదుర్గ-కళ్యాణదుర్గ-అనంతపురం-తాడిపత్రి-కోయిలకుంట్ల-నంద్యాల
8.           బళ్ళారి-ఆదోని-కర్నూలు-ఆత్మకూరు-ఎర్రగొండపాలెం-మాచర్ల
9.           కదిరి-పులివెందుల-ఎర్రగుంట్ల-ప్రొద్దుటూరు
10.     ఖమ్మం-తిరువూరు-చింతలపూడి-జంగారెడ్డిగూడం-నిడదవోలు
11.     చల్లపల్లి-పామర్రు-గుడివాడ-నూజివీడు-తిరువూరు
12.     రాజమండ్రి-భద్రాచలం

       ఆయన జీవిత కాలంలో ఈ రైలు మార్గాలను చూడలేకపోయారు.
1960 లో రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిపాదించిన మార్గాలు:
బొగ్గు, సిమెంటు, ఎరువులు, ముడి ఇనుము, ఆహారధాన్యాలు, పంచదారబెల్లం, చేపలు, పండ్లు మొదలైన వస్తువుల మన రాష్ట్రం నుండి రవాణా    అవుతాయి. ఈ రవాణా కోసం రైలు మార్గాలు ఎంతో అవసరం. రాష్ట్రంలోని   వివిధ ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మన రాష్ట్ర ప్రభుత్వం 1960 లో ఈ క్రింది కొత్త రైలు మార్గాలను ప్రతిపాదించింది.

·       కొవ్వూరు-భద్రాచలం-దంతెవాడ-(మద్యప్రదేశ్)
·       గద్వాల-రాయచూర్
·       రామగుండం-జగిత్యాల-నిజామాబాద్
·       లింగంపల్లి-పటాన్ చెర్వు-మెదక్-సిద్దిపేట-సిరిసిల్ల-కరీంనగర్- పెద్దపల్లి
·       జగ్గయ్యపేట-వాడపల్లి
·       నడికుడి-వినుకొండ-దర్శి-పొదిలి-ఉదయగిరి-ఆత్మకూరు-రావూరు-గూడూరు
ఈ మార్గాలన్నింటికీ ప్రాథమిక సర్వే పని పూర్తయ్యింది. కాని కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించడం లేదు.
జనం పదే పదే కోరుతున్నకొత్త మార్గాలు:
 ఇక ఆయా ప్రాంతాల ప్రజలు ఈ క్రింది రైలు మార్గాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు.
       కొత్తగూడం-ఖమ్మం-సూర్యాపేట-నల్గొండ-జడ్చర్ల
      కడప-ఆళ్ళగడ్డ-నంద్యాల
      బాపట్ల-నిజాంపట్నం- రేపల్లె-అవనిగడ్డ-మచిలీపట్నం
     కైకలూరు -ఏలూరు
      మచిలీపట్నం నర్సాపురం -కాకినాడ

ప్రజల ప్రయాణ అవసరాలను కేంద్రప్రభుత్వం శ్రద్ధగా గమనిస్తే ఈమార్గాలు ఎంత ప్రాముఖ్యమైనవో తెలుస్తాయి.తరచుగా వరదలు తుఫానులకు గురయ్యే కోస్తా ప్రాంత ప్రజలకు ప్రయాణ బాధలు
 ఎక్కువగా ఉంటాయి.ఈ కొత్త రైలుమార్గాలు మన తెలుగునాట సముద్ర తీరప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయి. నేపాల్,బర్మా,పాకిస్థాన్,బంగ్లాదేశ్,థాయ్ ల్యాండ్,వియత్నాం,భూటాన్ లాంటి విదేశాలకు కూడా రైల్వే లింకులు కలపాలని చూసే ప్రభుత్వం ముందుగా స్వదేశంలోపలి  మార్గాలను చక్కబరచాలి.
మన రాష్ట్రంలో ప్రస్తుతం 4958 కి.మీ. ల రైలు మార్గాలున్నాయి.మనది మీటర్‌గేజ్‌ లేని రాష్ట్రం.నడికుడి- బీబీనగర్ రైలు మార్గం మాత్రమే మనకు స్వాతంత్రానంతరం కొత్తగా ఒనగూడిన ప్రజోపయోగం.

ప్రైవేట్‌ రైల్వే లైన్లు

రాష్ట్ర ప్రభుత్వం సగం నిధులను భరించడానికి ముందుకొచ్చే లైన్ల నిర్మాణానికి మాత్రమే రైల్వేశాఖ అనుమతి ఇస్తోంది.ఇకపై సర్వేలు పూర్తయి, లాభదాయకత ధృవపడి కొత్తగా ప్రతిపాదించిన లైన్లు మాత్రమే ప్రవేటుకు అప్పగిస్తారు.విధానాలు:
  • లైన్‌ కనీసం 20 కిలోమీటర్ల పొడవు ఉండాలి.
  • రైళ్లు నడిపే అధికారం రైల్వేదే.
  • లైన్ల నిర్మాణం కోసం సేకరించిన భూములు, లైన్లన్నీ రైల్వే ఆస్తులుగానే పరిగణిస్తారు.
  • భూసేకరణ రైల్వేయే చేపడుతుంది. డబ్బులు మాత్రం ప్రైవేటు సంస్థలు చెల్లించాలి.
  • ప్రైవేటు సంస్థ సదరు లైనును 30 ఏళ్ల పాటు నిర్వహించుకొని ఆదాయం పొందాలి.


బస్సులు నడపటానికి పోటా పోటీగా ముందుకొచ్చే ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు ఎందుకోగానీ ప్రైవేటు రైళ్ళ విషయంలో వెనుకాడుతున్నారు. అందువలన పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రజాప్రతినిధులందరూ కలిసి పార్లమెంటులో కేంద్రం మీద కొత్త  రైలు మార్గాల కోసం వత్తిడి తేవాలి. 275 వేల చ.కి.మీ విస్తీర్ణం గల మన రాష్ట్రంలో ప్రతి వెయ్యి కిలో మీటర్ల భూమికి కేవలం 18 కి.మీ. రైలు మార్గం మాత్రమే ఉంది. సగటున ప్రతి ఆంధ్రుడు రైలు బండి ఎక్కాలంటే 45 కిలోమీటర్లు పోవలసి వస్తున్నది. కొన్నిచోట్ల అయితే దాదాపు 60 కి.మీ. వ్యాసార్థంలో రైలు సౌకర్యం లేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత బ్రిటిష్ వాడికంటే వేగంగా నిర్మాణం కావలసిన రైలు మార్గాలు నత్త నడక నడుస్తున్నాయంటే సిగ్గుచేటు. రైల్వే మంత్రి పదవి కూడా ఆంధ్రుల కింతవరకు ఇవ్వలేదు. మన పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో ఏం చేస్తున్నారో అర్ధం కాదు. "విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు" అని ఉద్యమాలు చేసి ఉక్కు ఫ్యాక్టరీ సాధించాం. మరి ఆ ఉక్కు ఇక్కడి రైలు మార్గాలకు, వంతెనలకు ఉపయోగించాలని డిమాండ్ చేస్తే బాగుంటుంది. ఈ రైలు మార్గాల నిర్మాణం వల్ల మన రాష్ట్రంలోని పరిశ్రమలు అభివృద్ధి అభివృద్ధి చెందుతాయి. వేలాది  పేద కార్మికులకు ఉపాధి లభిస్తుంది. రాష్ట్ర రవాణా సమస్యలు తీరుతాయి. రోడ్డు రవాణా గణనీయంగా తగ్గి రోడ్లు పటిష్టంగా ఉండి, ఎక్కువ కలం మన్నుతాయి.కేవలం ఒక తాలూకా కేంద్రంగా ఉన్న ఊరు విజయవాడ.అది మునిసిపల్ కార్పొరేషన్ కావటం దేశ చరిత్రలో ప్రథమం. అది పెద్ద రైల్వే జంక్షన్ కావటం వల్లనే అంటే అతిశయోక్తి కాదు. కాబట్టి ఈ రైలు మార్గాల సాధన కోసం ఆంధ్రులంతా గట్టి కృషిసల్పాలి.రాష్ట్రం విడిపోయినా ప్రజలకు రైళ్ళ లేమి బాధ తప్పదు.మార్గం ఉంటేనే కదా  బండి నడిచేది?రాష్ట్ర ప్రభుత్వాలైనా భూసేకరణ జరిపి అత్యవసరమని భావించిన ప్రాంతాల్లో పబ్లిక్ -ప్రైవేటు నిధులతో రైలుమార్గాలు నిర్మించి నిర్వహించటానికి కేంద్రాన్ని ఒప్పించాలి.
 https://www.facebook.com/photo.php?fbid=503406646357997&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater 

ఆంధ్రపత్రిక22.12.1990,

 http://www.suryaa.com/opinion/edit-page/article-151305

https://www.facebook.com/photo.php?fbid=623617004336960&set=a.233025936729404.60739.100000659993594&type=1
సూర్య29.8.2013
గీటురాయి 4.10.2013
    


రాష్ట్రాల ఆధారంగా రైల్వే జోన్లు కుదరదు
రైల్వేశాఖ మంత్రి స్పష్టీకరణ
రాష్ట్రానికి కొత్త జోన్ కష్టమే!
సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో పెట్టిన హామీ నెరవేరేలా కనిపించడం లేదు. గురువారం రైల్వే మంత్రి మల్లికార్జునఖర్గే లోక్సభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ఈ అంశాన్ని చాటుతోంది. ''దేశంలోని రైల్వే జోన్లు, డివిజన్లను పునర్వ్యవస్థీకరించాలంటూ వచ్చిన సిఫార్సులపై ఆ శాఖ తుది నిర్ణయం తీసుకుందా'' అని ఇద్దరు సభ్యులు అడిగిన ప్రశ్నకు మల్లికార్జునఖర్గే 'లేదు' అని సమాధానం చెప్పారు. ''ప్రస్తుతానికి ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. అందుకు తగిన నిర్దిష్ట సమయం చెప్పడం కూడా కష్టం. విస్తీర్ణం, పని భారం, అందుబాటు, ట్రాఫిక్ రద్దీ, ఆర్థిక అవసరాల్లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని భారతీయ రైల్వే కొత్త జోన్లు, డివిజన్ల ఏర్పాటు గురించి ఆలోచిస్తుంది. వీటిని రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దుల ప్రాతిపదికనో, లేదంటే ప్రాంతీయ, భౌగోళిక అంశాలను దృష్టిలో ఉంచుకొనో ఏర్పాటు చేయడం కుదరదు. వివిధ వర్గాల నుంచి కొత్త రైల్వే జోన్లు, డివిజన్ల కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో కమిటీ ఏర్పాటు చేశాం. నిర్వహణ, ఆర్థిక, పరిపాలన, సిబ్బంది వ్యవహారాలను దృష్టిలో ఉంచుకొని కొత్త జోన్లు, డివిజన్ల ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తూ సదరు కమిటీ నివేదిక ఇచ్చింది. దానిపై ఇంతవరకూ తుది నిర్ణయం తీసుకోలేదు'' అని పేర్కొన్నారు.(ఈనాడు 7.2.2014)








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి