ఈ బ్లాగును సెర్చ్ చేయండి

24, అక్టోబర్ 2019, గురువారం

ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే నో జాబ్‌!

ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే నో జాబ్‌!
(సూర్య 27.10.2019 లో నా సంపాదకీయం)
2021 నుండి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మందిని కంటే ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదని అస్సాం సర్కార్‌ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.ఉద్యోగం వచ్చాక మూడో బిడ్డను కంటే ఉద్యోగం ఊడబీకుతారట.ఎక్కువమంది పిల్లల్ని కన్నవారికి గృహ ,వాహన రుణాలు ప్రభుత్వ సహాయపథకాలు ఏమీ అందవట.స్థానిక సంస్థల్లో ఎన్నికలలో పాల్గొనే అవకాశం ఉండదట.ఇవేమి రూల్సు?ఎవరి పిల్లలు వాళ్ళ ఇష్టం అనేవాళ్ళకు చిన్నకుటుంబమే చింతలులేని కుటుంబం అని చెబుతున్నారట.
కానీ మరోపక్క మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి నేతలు ఒకరిద్దరితో ఆపొద్దు, ఉద్యోగాలిస్తాం ఎక్కువమంది పిల్లల్ని కనండి.జనాభాను పెంచండి అని పదేపదే చెప్పారు,చెబుతున్నారు.ప్రతి హిందూ జంట పదిమందిని కనాలి,పిల్లలను భగవంతుడే కాపాడుకుంటాడని శంకరాచార్య స్వామి,వాసుదేవానంద,సాక్షిమహారాజ్,పరిపూర్ణానంద,….   లాంటి స్వామీజీలు అదేపనిగా దేశమ్మీదపడి పిల్లలు కనే పోటీలుపెడుతున్నారు. పీజీలు చదివినా ఉపాధి లేదని మన యువకులు బాధపడుతున్నారు.ప్రస్తుతం దేశంలోని నిరుద్యోగ యువకులను ఉద్ధరించండి చాలు.ముందు మీరు సన్యాసం వదిలి పిల్లల్ని కంటారా అని కొందరు స్వామిజీలను అడుగుతున్నారు.ఎంత మంది పిల్లలను కనాలి అనేది కనేవాళ్ల ఆర్ధిక పరిస్థితిని బట్టి ఉంటుంది. చైనాలో ఇప్పుడు రెండో బిడ్డను కనమని ప్రోత్సహించినా వద్దులే అంటున్నారట.
“అరయన్ వంశము నిల్పనే కద వివాహంబు?" అన్నారు.అంతా బాగుంటే ఎక్కువ మంది పిల్లలు కావాలనే తల్లిదండ్రులు కోరుకుంటారు.తమ వంశం బాగా విస్థరిస్తోందని ఉబ్బితబ్బిబ్బులౌతారు.కానీ వర్ధమాన దేశాల్లో వాస్తవ జీవితం సుఖప్రధంగా లేదు.దోపిడీ,అన్యాయం, అవినీతి,కులమత వివక్షల మూలంగా అందరికీ సమాన అవకాశాలు లేక అభివృద్ధి చెందలేక పేదప్రజలు బాధలు పడుతున్నారు.మంది ఎక్కువైతే మజ్జిగ పలచన.ఇది పోటీ ప్రపంచం.వెనకబడితే వెనకే.ఆస్తిపాస్తుల కోసం అన్నదమ్ములు,అక్కచెల్లెళ్ళు ,తండ్రీ బిడ్డలు కూడా గొంతులు కోసుకుంటున్నారు.మానవ నైజం ఆదినుండీ ఇలాగే ఉంది.విశాలమైన భూమి మీద ఇద్దరే అన్నదమ్ములున్ననాడు కూడా కయీను హేబేలును చంపాడు.పేదరికం అనేక పాపాలకు పురికొలిపే ప్రధాన కారణం.మానవతా విలువలు అసలే లేని లోకంలో పిల్లల్ని అతిగా కని మనం అవస్థలు పడుతూ వారినీ అవస్థలలో తోసే దానికంటే మన ఆర్ధిక స్థితిని అంచనా వేసుకొని పరిమితం కావటం మంచిది. నారుపోసినవాడే నీరు పోస్తాడంటూ,మహత్యాలు చెయ్యాల్సిందేనని దేవుడిని పరీక్షకు గురిచెయ్యొద్దు.పెళ్ళి చేసుకునే వాడికి భార్యను పోషించే ఆర్ధిక శక్తి ఉండాలని ముహమ్మదు ప్రవక్త షరతు పెట్టారు.మరి బిడ్డల్ని కనటానికి మరిన్ని షరతులుండవా?

పిల్లలు అవసరమే.మతాలన్నీకుటుంబ నియంత్రణ ఆపరేషన్ పాపమనీ,అందరూ పిల్లల్ని కని భూమిని నింపాలనే చెబుతాయి.చాలావరకు ప్రజలు పాటిస్తున్నారు కూడా.అయితే నాగరికత పెరిగేకొద్దీ మతాల బోధను పక్కనబెట్టి ఎంతమందిని కనొచ్చు అనేది వారి వారి కుటుంబ ఆర్ధిక స్థోమతను బట్టి ఎవరికి వారే నిర్ణయించుకుంటున్నారు.పిల్లల్నిబాలకార్మికులుగా చేయాలని ఏ తల్లిదండ్రులూ కనరు.వారి భవిషత్తుగురించి ఎన్నోకలలు కంటారు.వారి కలల్ని కల్లలుగా చేసే వ్యవస్థ వేళ్ళూనుకు పోతే 'ఎదురీత బ్రతుకు' ఎవరు ఎంచుకుంటారు?పిల్లల్ని కొల్లగా కనాలని బోధించేవారు కనటం ఆపేసిన వారు ఎందుకంత కఠిన నిర్ణయానికి వస్తున్నారో గ్రహించాలి. పిల్లలకు విద్యాహక్కు,ఆహార హక్కు,పని హక్కులున్న దేశంలో నిర్భయంగా పిల్లల్ని కంటారు. 2011 జనాభాలెక్కల ప్రకారం  హిందూ జనాభా వృద్ధి రేటు 16.8 శాతంగా నమోదైతే, ముస్లిం జనాభా వృద్ధి రేటు 24.6 శాతంగా నమోదైంది. కుటుంబనియంత్రణ పాటించనందువల్ల ముస్లిముల జనాభా పెరిగిపోతున్నదని హిందూ నేతలు,ఎంతపెరిగినా మీ అంత జనాభా మాకు లేదులే అని ముస్లిం నేతలు వాపోతూ ఎవరి మతస్తులకు వాళ్ళు పిల్లల్ని కనటంలో పోటిలు పెడుతున్నారు.పైగా నారుపోసినవాడే నీరుపోస్తాడు అని,అవతలి మతం వాడికంటే మనదే పైచేయిగా ఉండాలంటే ఆ మాత్రం త్యాగం తప్పదని ఓదారుస్తున్నారు.ఇలాంటివాళ్ళ మాటలు విని అమాయకజనం శక్తికి మించి పిల్లల్ని కని నిరుపేదలైపోతున్నారు.అందువలన ఒకరు ఇద్దరు బిడ్డలతో ఆపరేషన్ చేయించుకోటానికి ముందుకొచ్చిన ముస్లింలకు హిందూ సంస్థలు,హిందువులకు ముస్లిం సంస్థలు పదివేల రూపాయల ఆర్ధిక సహాయం అందజేస్తే ఈ ముల్లాలు,స్వామీజీల మాటలు లెక్కచేయకుండా అన్ని మతాలలోని పేదలు ఆపరేషన్లకు బారులు తీరి నిలబడతారు.దేశంలో అధికజనాభా సమశ్య కూడా కొద్దిగా తగ్గుతుంది.ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టగలిగితే వారిదే విజయం,పుణ్యం. పుణ్యం ఎలాగంటే మనిషి కష్టాలన్నిటికీ పుట్టుకే గదా కారణం?అసలు ఎన్నో కష్టాలకు కారణ భూతమైన ఆజన్మే కలుగకుండా ఎంతోమందికి స్వచ్చంద ఆపరేషన్లనే శాంతియుత కార్యక్రమం ద్వారా ముక్తిని మోక్షాన్నిఅనగా జన్మరాహిత్యాన్ని ప్రసాదించే పుణ్యాత్ములకు కూడా పునర్జన్మ ఉండదు.మోక్షసిద్ధి ఖాయం.
నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత డిప్యూటీ కలక్టర్,6301493266

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి