ఈ బ్లాగును సెర్చ్ చేయండి

1, నవంబర్ 2019, శుక్రవారం

కేంద్రపాలిత ప్రాంతాలు ఇంకా అవసరమా?



కేంద్రపాలిత ప్రాంతాలు ఇంకా అవసరమా?
ఇప్పుడు రాష్ట్రాల సంఖ్య 28,కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 9.కేంద్రపాలితప్రాంతాలు ఇదివరకు  అండమాన్ నికోబార్ దీవులు,చండీగడ్, దాద్రా నగరహవేలీ, డయ్యూ డామన్,లక్షదీవులు,డిల్లీ,పాండిచ్చేరి అని ఏడే ఉండేవి.జమ్ము-కాశ్మీర్,లడఖ్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు కలిసి తొమ్మిది అయ్యాయి.మొదట్లో దేశానికి దూరంగా ఉన్న చిన్న దీవుల్నో,రాష్ట్రాల విభజనలో తగాదాలమూలంగా ఎవరికి బదిలీ చెయ్యని ప్రాంతాన్నో ,వలసదేశాల వారసత్వం నిలపాలనే కోరికతోనో వీటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ఇన్నాళ్ళూ ఉంచారు.కేంద్రం దేశపాలన రక్షణ వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించి రాష్ట్రాల పక్కనే ఉన్న చిన్నచిన్న కేంద్ర పాలిత ప్రాంతాల పాలనా  బాధ్యతలనుండి క్రమేణా తప్పుకోవాలి.వీటిని ఆనుకొనిఉన్న రాష్ట్రాలలో కలిపేసి రాష్ట్రాలను బలపరిచాలి.
మొదటి భాషాప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర అని గొప్పలు చెప్పుకోవటమేగానీ వాస్తవానికి తెలుగు ప్రజలు అనేక రాష్ట్రాల్లోకి చీలిపోయారు.ఇప్పటికీ  తెలుగు ప్రజలు నిజంగా ఒకే పాలన క్రిందకు రాలేదు.మద్రాసులేని ఆంధ్ర తలలేని మొండెం అని పొట్టి శ్రీరాములుగారు వాపోతూ చనిపోయారు. 1952 లో తెలుగు నేతలు చుట్టుపక్కల కొన్ని తెలుగు ప్రాంతాలను వదులుకున్నారు.ఫలితంగా పొరుగు రాష్ట్రాల్లో కొన్ని తెలుగు ప్రాంతాలు కలిసిపోయాయి. ఒడిసాలో  గంజాం,బరంపురం,కోరాపుట్,రాయగడ,పర్లాకిమిడి, కర్నాటకలో  చిత్రదుర్గ,కోలార్,బళ్ళారి, మహారాష్ట్రలో  చంద్రపూర్,గచ్చిబోల్ , చత్తీస్ ఘడ్ లో బీజాపూర్,బస్తర్,దంతెవాడ, తమిళనాడు లో మద్రాసు,హోసూరు,దేవనపల్లి, కృష్ణగిరి,డెంకణికోట, పాండిచేరి లో యానాం కలిసిపోయాయి. ఆనాడు మన తెలుగునాయకులే వీటిని వదిలేశారు.1956 లో తెలంగాణాతో కలిసిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు కానీ 2014 లో తెలంగాణా చీలిపోయినప్పుడు  కానీ  ఈ ప్రాంతాల విలీనం కోసం ఎవరూ ప్రయత్నించలేదు.పైగా తెలంగాణా ఏర్పాటు సందర్భంలో కొందరు తమిళనాయకులు తిరుపతి,శ్రీకాళహస్తి,నగరి,చిత్తూరు,సత్యవేడు,ప్రాంతాలను తమిళనాడులో కలపాలని పుండుమీద కారంచల్లినట్లు ఉద్యమాలు చేపట్టారు. అయితే ఇవన్నీ జరిగినా ఆనాడు తమిళనాడులో కలిపిన మద్రాసు,హోసూరు,దేవనపల్లి, కృష్ణగిరి,డెంకణికోట.పాండిచేరిలో కలిపిన  యానాం లను ఆంధ్రాలో  కలపాలి అని తెలుగునాయకులు ఎవరూ ఎదురు ప్రశ్నించలేదు.ఇప్పటికీ పొరుగు రాష్ట్రాల్లో కలిసిపోయిన తెలుగు ప్రాంతాలకోసం మనవాళ్ళెవరూ అడగటంలేదు.ఇక అడగలేరేమో.ఆనాడు 60 శాతం తెలుగు ప్రజలున్న మద్రాసును కలుపుకున్నారు. ఇంకా పుదుచ్చేరి తమిళులకు యానాం కూడా కావాలా?యానాం ప్రజలకే పుదుచ్చేరి కావాలా?ఎందుకో?
మనకు కాకినాడ పక్కన యానాం అనే కేంద్రపాలితప్రాంతం ఉంది.పక్కనే చుట్టూతా ఆంధ్ర  రాష్ట్రమున్నా  ఇది ఒక స్వతంత్ర దీవి లాగా మన రాష్ట్రంతో  సంబంధం లేనట్లు ఉంటున్నది.యానాంను కలిపితేనే మన రాష్ట్రానికి  ఓ సమగ్ర భౌగోళిక రూపం ఏర్పడుతుంది.కాకినాడ దగ్గర 32 చ.కి.మీ. విస్తీర్ణం,55 వేల జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం. యానాంకు రాజధాని పాండిచ్చేరి తమిళనాడులో 870 కి.మీ. దూరంలో ఉంది. యానాం  ఫ్రెంచ్ కాలనీగా  1954 లో విమోచనం చెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని గ్రేటర్ కాకినాడలో కలపాలని తీర్మానం చేసింది. కానీ అప్పటి యానాం నాయకులు పాండిచేరీతోనే కలిసి ఉంటామన్నారు.తెలుగురాష్ట్రంలో యానాన్ని కలపకపోటానికి వేరే కారణం ఏమీ లేదు. యానాం ను మన రాష్ట్రంలో కలపటానికి అక్కడి ప్రజలు ఇప్పటికీ ఇష్టపడటం లేదు. జై ఆంధ్రా,తెలంగాణా ఉద్యమాల  సమయంలో కూడా సమైక్యవాదులు కూడా వీళ్ళను ఒప్పించలేకపోయారు. విచిత్రంగా యానామీయులు సమైక్యాంధ్రకు మద్దతుగా ఎందుకోగానీ ఒక రోజు యానాంలో బందు పాటించారు.  యానాం ప్రజల భాష తెలుగే.వారిది తెలుగు సంస్కృతే.వారి చదువు,వ్యాపారం,వివాహసంబంధాలు అవసరాలు అన్నిటికీ  ఆంధ్ర పైనే ఆధారపడి ఉంటారు.పొద్దున లేస్తే కాకినాడ రావాలి. పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది. ఇన్ని దశాబ్దాల తరువాతకూడా యానాం ప్రజలు ఆంధ్రలో కలవటానికి, గ్రేటర్ కాకినాడలో విలీనానికీ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. యానాం అధికార కేంద్రం పుదుచ్ఛేరిలో ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయాలన్నీ పుదుచ్చేరిలోనే జరుగుతాయి. అధికారుల బదలీల్నుంచి అభివృద్ది, సంక్షేమ పథకాల అమలు వరకు అక్కడి ఆదేశాలకనుగుణంగానే యానాంలో అమలౌతాయి. యానాం ప్రజలు చిన్న బెయిల్‌ కావాలన్నా పుదుచ్ఛేరిలోకి పరుగులుదీయాల్సిందే. భాషాపాలిత  రాష్ట్రం అనే నినాదాన్నీ వినరు. పక్కనే ఉన్న కాకినాడలో కలవకుండా ఎక్కడో దూరాన ఉన్న పాండిచేరి పాలనలోనే ఉంటామంటారు. భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళనాడులో ఉన్న  పుదుచ్చేరి నుండి విడదీసి ఆంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుంది. ఆంధ్రాలో కలుస్తారా అంటే  లేదు అంటున్నారు. యానాంను ఆంధ్రలో కలవటానికి ఇష్టపడతం లేదు.ఎందుకో తెలుసా? కేంద్రపాలిత ప్రాంతంలకు ఇచ్చే  పన్ను రాయితీల కోసం.అక్కడ రేట్లు తక్కువగా ఉంటాయి. కేంద్ర పాలిత ప్రాంతాలు విస్తీర్ణంలో జనాభాలో చిన్నవి కాబట్టి  కేంద్రం ఇచ్చే నిధులు సరిపోతాయి. అక్కడి జనానికి ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. ట్యాక్సులు లేకుండా కొన్ని సరుకులు, మద్యం చవకగా దొరుకుతుంది.చాలామంది మద్యాన్ని మిగతా దేశానికి సరఫరా చేసే వ్యాపారులుగా స్థిరపడ్డారు.మధ్యలో యానాం ఉండగా రాష్ట్రంలో మద్యనియంత్రణ  చాలా కష్టం. ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు అడ్డుపడే దయ్యాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ గా కేంద్రం నియమించిందని పుదుచ్చేరి ముఖ్యమంత్రి బావురుమంటున్నాడు.
యానాం పాలన పూర్వం తూర్పు పాకిస్తాన్ లాగా  పుదుచ్చేరి నుండి జరుగుతుంది. అది బంగ్లాదేశ్ విముక్తి చెందినట్లు పాండిచ్చేరి నుండి విముక్తి పొందాలి.ఆంధ్రలో కలవాలి. 370 అధికరణం రద్దుతో కాశ్మీర్ లో ఉగ్రవాదం తగ్గిందట.అలాగే మిగతా కేంద్రపాలిత ప్రాంతాలకూ  ఈ ప్రత్యేక అధికారణాలు రద్దుచేసి,పక్కరాష్ట్రాలలో కలిపేస్తే  స్థానికంగా ఉన్న  రకరకాల మాఫియాలు,ముఠాలు తగ్గుతాయి.పక్కరాష్ట్రాలలో కలిపితే రాష్ట్రాల అధికారపరిధి పెరుగుతుంది.కొన్ని సరిహద్దు ప్రాంత  సమస్యలు తగ్గుతాయి.ముఖ్యమంత్రి జగన్‌ యానాంను ఆంధ్రలో కలపమని కేంద్రాన్ని కోరారట.యానాం ఒక్కటే కాదు కేంద్రపాలితప్రాంతాలన్నిటినీ రద్దుచేసి చుట్టుపక్కల రాష్ట్రాలలో కలపాలి.
---నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్, 6301493266

6 కామెంట్‌లు:

  1. నూటికి నూరుపాళ్ళూ మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  2. < 370 అధికరణం రద్దుతో కాశ్మీర్ లో ఉగ్రవాదం తగ్గిందట.>
    నిజంగానే ? సైన్యం అవసరం లేకుండానే అక్కడ ప్రజలు తిరిగేస్తున్నారంటారా ?

    రిప్లయితొలగించండి
  3. ఈ టపాలో యానాం పట్టణాన్ని ఆంధ్రలో కలపాలన్న వాదనతో ఏకీభవిస్తున్నాను. ఏపీ గడ్డమీద ఆ ఊరున్న geographical position ఏమిటి, దాన్ని ఎక్కడో ఉన్న పుదుచ్చేరిలో భాగం అనడం ఏమిటి? హాస్యాస్పదంగా లేదూ?

    రిప్లయితొలగించండి
  4. https://www.facebook.com/photo.php?fbid=2764201113611861&set=a.233025936729404&type=3&theater

    రిప్లయితొలగించండి