ఈ బ్లాగును సెర్చ్ చేయండి

22, మే 2020, శుక్రవారం

వలసబాట పట్టిన బాటసారికి ఎంత కష్టం?


వలసబాట పట్టిన బాటసారికి ఎంత కష్టం?
ప్రతి జీవికీ తన సొంత ఊరుతో ఒక అనుబంధం పెనవేసుకొని ఉంటుంది.అది అతనికి జన్మనిచ్చిన భూమి.తన బాల్యమంతా స్నేహితులతో గడిపిన భూమి. తన జీవనోపాధి కోసం ఎన్నో ప్రాంతాలకు వలస వెళ్లినా, ఏ దో నాటికి తన ఊరికే తిరిగి వస్తాడు.తప్పదు.తప్పిపోయిన కుమారుడిది వలస పోయిన చోట ఎంత దయనీయమైన బ్రతుకో బైబిల్ లో ఏసుక్రీస్తు చెబుతాడు.వలస కూలీ కూడా తనకు పనిదొరికిన ఊరు వదిలి వెళ్లాల్సోస్తే బాధపడతాడు.పని దొరకని సొంత ఊరికి తిరిగి వెళదా మంటే దిగులు.పిల్లల పోషణ ఎలాగా అని భయం.ఏమి బతుకు... ఏమి బతుకు... చెడ్డ బతుకు అని పాడుకోని కార్మికులు ఎవరుంటారు? కాలినడకన వందల కిలోమీటర్లు నడుస్తున్న కూలీలు తమ పిల్లలని కూడా నడిపిస్తుంటే మానవత్వం ఉన్న ఎవరికైనా కన్నీళ్లు వస్తున్నాయి.వడదెబ్బ కు కొందరు చనిపోయారు. అంత పేదరికంలో ఉన్న వారు ఎక్కువమంది పిల్లల్ని కని వారిని బాధపెట్టకూడదు అని అంటే వారి ఇష్టం కననివ్వండి ఎంత జనాభా ఉంటే అంత అభివృద్ధి అంటున్నారు కొందరు.గతంలో చంద్రబాబు నాయుడు గారైతే ఎక్కువమంది పిల్లలతో ఫలానా ఫలానా దేశాలు బాగు పడ్డాయి తెలుసుకొని ఎక్కువ మందిని కనండయా అని బుద్ధి చెప్పారు.
పిల్లలంటే అందరీకీ మక్కువే.కానీ పిల్లలు మంచి సౌకర్యాలతో బ్రతికే పరిస్థితులు కల్పించకపోతే తాను కన్న పిల్లలనే చంకనేసుకొని సంచరించాల్సి వస్తుంది. శ్రీశ్రీ చెప్పినట్లు దిగులు పడుతూ, దీనుడౌతూ తిరగాల్సి వస్తుంది.ఆనాడు సిరిగలవానికి చెల్లును/తరుణుల పదియాఱువేల దగ పెండ్లాడ తిరిపెమున కిద్దరాండ్రా?పరమేశా! గంగ విడుము పార్వతి చాలున్ అని దేవుణ్ణి కూడా అడిగిన దేశం మనది.ఆత్రేయ కూడా ఆకలిరాజ్యంలో నిరుద్యోగుల అవస్థలకు చలించి స్వతంత్ర దేశంలో చావుకూడా పెళ్లిలాంటిదే బ్రదర్ అంటాడు.చావును పెళ్ళితో పోలుస్తావా అని ఆత్రేయను విమర్శించలేదు.ఆయన సదుద్దేశాన్ని అర్ధం చేసుకొని ఊరుకున్నారు.పెళ్లిళ్ళకే ఒప్పుకొని వాళ్ళు పిల్లలకు ఒప్పుకుంటారా?ఇప్పుడైతే చిన్న కారణం దొరికితే చాలు నీవు ఇంత అజ్నానివా అని ఉతికి ఆరేస్తున్నారు.అక్కిరాజు ప్రసాద్ లాంటివారు ఇదంతా తలుచుకొని ఏమున్నదక్కో ఏమున్నదక్కా , పిల్ల పాపలకు నేర్పిందేమి లేదు అంటూ బాధపడతారు. ఈ కష్టం గడిచే వరకు పనిదొరికినవారు తోటి వారికి తమ పనిలో భాగం ఇచ్చి తోడ్పడలేరు.ఒకరికొకరు సహాయపడే వాతావరణం కరోనా కల్పించిన కరువులో తగ్గి పోయింది. ఎవరి స్వార్ధము వారిది. వలస కూలీలకు రవాణా సౌకర్యాలు కల్పించటానికే చాలా సమయం పట్టింది. వారి తిరుగు ప్రయాణాలకు డబ్బులు ఎలా అని తర్జన భర్జన పడ్డారు .ఛార్జీలు నువ్వు పెట్టుకోవాలంటే నువ్వే పెట్టుకోవాలని కేంద్రము రాష్ట్రాలూ వాదులాడుకుంటూ కాలం గడిపాయి. వలస కార్మికులు ఆకలి మంటలతో రోడ్ల మీద పడ్డారు. అందరినీ ఇళ్లలో ఉండమన్నారు.వలస కూలీలకు సొంత ఇల్లు ఉండదు.యజమాని కట్టించిన రేకుల షెడ్డులోనే కాపురం. కాని వారి తిండి,కనీస అవసరాల కోసం జనం వీథుల్లోకి వస్తున్నారు. ఇక వలస కష్టాలు వద్దు , దొరికిందే తింటాము , ఊళ్లోనే ఉంటాము ఆని గ్రామానికి బస్సుదొరికి తిరిగివెళుతున్న కుటుంబాలు అంటున్న వార్త చూచి ఈ నిర్భాగ్యుల నిర్ణయం నిలుస్తుందా?అనిపించింది.ఇదికరోనా వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం లాంటి తాత్కాలిక నిట్టూర్పుమాత్రమే అన్నారు కొందరు.అసలు వాళ్ళకు ఉన్నప్రాంతంలోనే ఉపాధి దొరికితే వలసలు ఎందుకు వస్తారు,వీరి కష్టాలకు కన్నీళ్ళకు ఎవరు బాధ్యులు అని కొందరి విశ్లేషణ.సొంత ఇల్లు, భూమిలేని ఈ వలస కూలీలకు ఇల్లు కట్టించి,తలాఒక అరఎకరమన్నా పంచిపెడితే ఊళ్లోనే ఉంటారని మరొకరి సలహా.
వలసకూలీలను తిరిగి పోనివ్వకూడదని వలస రాష్ట్రంలోనే ఆపాలని బిల్డర్లు పారిశ్రామికవేత్తలు ఒత్తిడితెచ్చి కొన్ని శ్రామిక రైళ్లు ఆపేశారట.మేధావులు అందరూ వీళ్ళగురించే బాధపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఆవరించిన కూలీల నడక కష్టంలో వారికున్న కొద్దిపాటి ఆర్ధికశక్తి తోనే సహాయము చేసిన దారిపొడుగూ నిలబడిన స్థానిక దాతలందరికీ నమస్కారం.దేశ ప్రజలు దీపాలు వెలిగించారు.పూలు చల్లారు.టపాసులు పేల్చారు.అయినా 4 గంటలు మాత్రమే సమయం ఇచ్చి లాక్‌డౌన్‌ ప్రకటించారు. లాక్‌డౌన్‌ ప్రకటించక ముందే నాలుగురోజులపాటు సొంత ఊళ్ళకు పోవటానికి వీలుగా ప్రజలకు రవాణా సౌకర్యాలు ఇచ్చినట్లైతే బాగుండేది. తల్లీబిడ్డలతో సహా చంకన సంచులు, నెత్తిన గోతాలు పెట్టుకొని వందల వేల మైళ్లు కాలి నడకన హైవే ల మీదుగా చేస్తున్న ప్రయాణాలు చూసిన వారి కళ్లలో నీళ్లొచ్చాయి.మద్యం పున:ప్రవేశంతో పరిస్థితి మరింత దిగజారింది. రోడ్లపై నడిచిన వలస కార్మికులపై కొన్నిచోట్ల లాఠీచార్జి కూడా చేశారు.పైగా ఇక నుండి కరోనాతో సహజీవనం చేయక తప్పదట. రాష్ట్రాలకు ఋణ పరిమితికి షరతులు పెట్టినందుకు కేంద్రాన్ని కేసీఆర్ విమర్శించారు. ఆనాడు కేంద్రం మిథ్య అన్న ఎన్టీఆర్ మాటలు గుర్తుచ్చాయి. భారత ఆర్థిక వ్యవస్ధను గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో ప్రకటించిన 'ఆత్మ నిర్భర భారత్‌' రుణాలు నడిచే కూలీలకు ఇవ్వాలి. ఆత్మనిర్భరము డబ్బులు ఇస్తే కలుగుతుంది.రైళ్లు వేయకుండా కూలీలు తమ సామానులు బిడ్డలను ఎత్తుకొని నిబ్బరంగా నడవాలంటే ఎలా నడుస్తారు? చివరికి రోహిణి కార్తె సమయంలో శ్రామిక రైళ్లు వదిలారు.పంటను తడిపేందుకు ఒక మగ్గు నీళ్ళు సరిపోతాయా?వేలమంది కూలీల తరలింపుకు అవతలి రాష్ట్రం కూడా అనుమతీస్తేనే రైలు కదులుతుందట.కూలీల గురించి బాధపడుతూనే ఈ ఆంక్షల పరిమితుల్లో జిల్లా కలక్టర్లు కూడా ఏమీ చేయలేక కొన్నిచోట్ల ఆగిపోయారట.
దేవుడు వలసకూలీలను ఎందుకు చేశాడు? అని అడిగితే ఒకాయన సముద్రాల లెవెల్లో ఈ చరణాన్నే సమాధానంగా పాడాడు:
"వేద శాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం
అల్పబుద్దితో జ్ఞానదాతనే సలుపకు పరిహాసం …
బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనసముదాయం
బదులు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం"
సరేనని మూసుకొని కూర్చున్నాను.
--- నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ , 6301493266

1 కామెంట్‌: