ఈ బ్లాగును సెర్చ్ చేయండి

30, మే 2020, శనివారం

ఎన్ని కష్టాలురా దేవుడా ?

ఎన్ని కష్టాలురా దేవుడా ? (సూర్య 31.5,2020)
దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలను తాకాయి.మనదేశంలో వడదెబ్బతో ఏటా ఐదారువేల మంది మరణిస్తూ ఉంటారు. ఇప్పుడైనా వడగాడ్పులను ప్రకృతి వైపరీత్యంగా గుర్తించాలి. వడగాడ్పులకు కొన్ని రాష్ట్రాలలో రాకాసి మిడతలు లక్షలాది ఎకరాల్లో పంటను నాశనం చేస్తున్నాయి. అగ్నిమాపక యంత్రాలతో డ్రోన్లతో మందులు పిచికారీ చేయిస్తున్నారు.కొన్నిచోట్ల పొలాలలో బాతుల గుంపులు మిడతలను కొంతవరకు నివారిస్తున్నాయట. భారత స్వావలంబనలో బాతులపెంపకందారులను కూడా ప్రోత్సహించాలి.
ఔరంగాబాద్ రైలుపట్టాలపై పడుకొని చనిపోయిన కూలీలు, ముజఫర్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌పై వడగాలికి చనిపోయిన ్లి,బిడ్డల మరణ దృశ్యాలు ప్రజల్ని కంటతడి పెట్టించాయి.వేలాదిమైళ్ల దూరం నడుచుకుంటూ స్వస్థలాలకు వెళుతున్న అసంఖ్యాక కార్మికులు ఆకలిదప్పులకు గురవుతూనే నడచుకుంటూ పోతున్న పిల్లలు, మహిళలు రహదారులపై, అడవుల్లో, రైల్వే ట్రాక్‌లమీదే పడి కుప్పకూలిపోతున్నారు. ఆత్మనిర్భర భారత్‌లో రహదారులన్నీ వలసకూలీల పాదాలతో రక్తమోడుతున్నాయి. కరోనా బారినపడి వలసకూలీల్లో చాలామంది చనిపోతున్నారు. ప్రైవేట్‌ ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా మూతపడిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే వైద్యం పొందాలి. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు,రంగంలోకి దిగి చేతనైనంత సాయం చేస్తున్నారు.
ఇకమీదట ఉత్తరప్రదేశ్‌ కూలీలకోసం ఆరాష్ట్ర వలసల కమిషన్‌ ను అభ్యర్దించాలి.కార్మికులను కావాలని అడిగిన రాష్ట్రం, ఆ కార్మికుల సంక్షేమానికి, వారి సామాజిక భద్ర తకు ఎలాంటి చర్యలు తీసుకోదల్చుకున్నదో కమిషన్‌కు చెప్పాలట. బీమా సదుపాయం కల్పిస్తామని హామీ ఇవ్వాలట. అమలుజరిపితే ఈ నియమాలు మంచివే. ఎందుకంటే మనకోసం మాల్స్, మల్టీప్లెక్స్‌లు, అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, ఆసుపత్రులు, ఫ్యాక్టరీలు కట్టిన శ్రామికులకు మేలు జరగాలి.
అసంఘటిత రంగంలో ఉన్న కూలీలకు పెద్ద పెద్ద కోర్కెలు తీరవు.పుట్టినచోటే ఏదో ఒక పని దొరికితే చాలు.వలస కూలీలుగా కన్నవారిని విడిచి, భార్యాబిడ్డల్ని వదిలి వేల కిలోమీటర్ల దూరం దాటి రావల్సిన అవసరం వీరికి వుండదు. పేదరిక నిర్మూలన పథకాలు ఎన్ని వున్నా ఉపయోగపడ లేదు. వలస జీవులతో పనులు చేయించుకుంటున్న యజమానులు కార్మికులకు న్యాయంగా దక్కవలసినవి దక్కనివ్వాలి.గ్రామాలకు చేరుతున్న వారికి ఉపాధి హామీ చట్టం కింద పనులు కలిపించడానికి రాష్ట్రాలన్నీ ముందుకు రావాలి.అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వేలో పట్టణ కార్మికుల్లో 80 శాతంఅంటే 9.3 కోట్ల మంది లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధిని కోల్పోయినట్టు తేలింది. నగరాలు, పట్టణాల్లో మిగిలిపోయిన అసంఘటిత రంగంలోని అసంఖ్యాక కార్మికులకు పనులు కల్పించాలి. కార్పొరేట్‌ విద్యా సంస్థలు తమదగ్గర పనిచేసిన ఉద్యోగులకు జీతాలివ్వాలి.కార్డుల్లేని వారికి రేషన్‌ కార్డులు ఇవ్వాలీ.
ఎండాకాలంలో అందరికీ నీడనిచ్చే చెట్లు కావాలి , నీళ్ళకోసం చెరువులు , బావులుకావాలి.నీరు నీడ కల్పించే పనుల్ని తిరిగి గ్రామాలు చేరుకున్న కూలీలకు ఉపాధి హామీ పధకంలో పనులు కల్పించాలి.ఇక వేరే ఊళ్ళకు వలస పోకుండా సొంత రాష్ట్రాలలోనే పనులు దొరికేలా పరిశ్రమలు నెలకొల్పాలని పారిశ్రామిక వేత్తలను కోరాలి.స్వయం ఉపాధి భారీ ఎత్తున విస్తరించాలి .అడవులను నరకడం ఆపాలి. విషపూరిత రసాయనాలు, వాయువులను వెదజల్లే పరిశ్రమలను జల్లెడపట్టాలి. లాక్ డౌన్ వల్ల ఇలాంటి విషపరిశ్రమలు మూతపడి గంగ ,యమున లాంటి నదులు శుభ్రపడ్డాయట.అభివృద్ధి పేరిట పర్యావరణ చట్టాల నిబంధనలను తుంగలో తొక్కి గనుల తవ్వకం జరుపకూడదు.ఏదైనా కొత్త పరిశ్రమ నిర్మాణానికి ముందు స్థానిక ప్రజల మొరవినాలి. అటవీ పర్యావరణ శాఖ జాతీయ సంస్థలు డెహ్రాడూన్‌, ఛండీగఢ్‌ లో వున్నాయి. 19 ప్రాంతీయ కార్యాలయాలు ఆయా అడవులకు సమీపం లోనే వున్నాయి. వాటన్నిటికీ నియంత్రణ శక్తి సామర్ద్యాలను పెంచాలి.సముద్ర తీర పరిరక్షణ సముద్ర తీరం ఆక్రమణల పరం కాకుండా జరగాలి. తీరం వెంబడి విస్తరించిన మడ అడవులు బ్రతకాలి. మత్స్యకారుల జీవనోపాధికి ముప్పు వస్తే వారు గుజరాత్ లాంటి దూర రాష్ట్రాలకు వలస పోకుండా ప్రత్యామ్నాయ జీవన మార్గాలు కల్పించాలి.కరోనా దెబ్బకు దేశంలో నిరుద్యోగిత 1.2 కోట్లమందితో 24 శాతానికి చేరుకుంది.నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు తమ రిజిస్ట్రేషన్‌లు రద్దు చేసుకుంటున్నాయి.గ్రామీణ ఉపాధి కల్పన పథకానికి కేంద్రం రూ. 40,000కోట్లు ప్రకటించటం మంచిపనే.గ్రామాలలో మరింతమంది కార్మికులకు ఉపాధి దొరకడంతోపాటు ఉత్పత్తి చేసిన సరుకులకు డిమాండ్‌ ఏర్పడుతుంది. ఇక్కడ ఉత్పత్తి అయిన సరుకుల వినియోగం పెరగాలంటే ప్రజల కొనుగోలుశక్తి పెరగాలి. కాబట్టి అమెరికా, బ్రిటన్‌ లలో లాగా ఇక్కడా నిరుద్యోగులకు భృతి, నగదు తోడ్పాటు ఇవ్వాలి.
వీటన్నిటికి తోడు అరుణాచలప్రదేశ్ భూభాగం లోకి చైనా సైనికులు దూసుకొచ్చి మన సైనికులతో ఘర్షణకు దిగారట. జనం కరోనాతోనే పెద్ద యుద్ధం చేస్తున్నారు.తమ ప్రాణాలు నిలుపుకుంటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.రోగుల ప్రాణాలను కాపాడటానికి చైనా కూడా టీకా తయారీ ప్రయోగాలలో సఫలం కాబోతోందని వార్తలొస్తున్నాయి. ఆ సంతోషం నిలువకుండానే ఈ యుద్ధవార్తలేమిటి? అంటే ఓర్చుకోవాలి నాయనా! జీవితం అంటేనే వ్యాధులు బాధలు వ్యధలు వేదనలు అన్నాడు ఒకాయన.
ఆత్రేయ గారి పాటలో కూడా ఇలాంటి ప్రశ్నలే గుర్తొచ్చి వేదాంతంలో పడేశాయి :
తలచినదే జరిగినదా దైవం ఎందులకు?/
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు
ముగిసిన గాథ మొదలిడదు దేవుని రచనలలో/మొదలిడు గాథ ముగిసేదెపుడో మనుజుల బ్రతుకులలో
ఎదలో ఒకరే కుదిరిననాడు మనసే ఒక స్వర్గం/ఒకరుండగా వేరొకరొచ్చారా లోకం ఒక నరకం
ఎవరొస్తారో ఎవరుంటారో ఏమౌనో మన కలలు /
ఇది సహజం ఇది సత్యం ఎందులకీ ఖేదం?
---నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి