ఈ బ్లాగును సెర్చ్ చేయండి

15, మే 2020, శుక్రవారం

మద్యంలో మునుగుతున్న సంక్షేమం

మద్యంలో మునుగుతున్న సంక్షేమం ( గీటురాయి 15.5.2020) 
 
కరోనా వల్ల ప్రపంచంలో 3 లక్షల మంది,అమెరికాలో 85 వేలమంది.ఇండియాలో 25 వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా 16 లక్షలమంది భారత్ లో 25 వేల మంది.ఆంధ్రలో 11 వందలమంది కోలుకున్నారు.వీళ్ళు ప్లాస్మా దాతలుగా పనికివస్తారు. కరోనానివారణకు టీకాలు తయారు చేసే పనిలో ఇండియా తోపాటు అమెరికా ,చైనా.ఇటలీ,ఇజ్రాయెల్,బ్రిటన్ లాంటి చాలాదేశాలు ఉన్నాయి.కానీ వ్యాక్సీన్ తయారీకి మిగతా దేశాలు 61 వేల కోట్లరూపాయలు ఇవ్వదలిస్తే అమెరికా మాత్రం డబ్బులేమీ ఇవ్వను అందట. తాము విజయవంతంగా టీకా పరీక్షించామని ఇటలీ , ఇజ్రాయెల్ చెప్పాయి.
విదేశాల్లో చిక్కుకున్నవారిని స్వదేశానికి తీసుకు రావటం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత మాత్రం సరైనది కాదని, కరోనా లేదని నిర్థారించుకున్నవారిని మాత్రమే ఇలా తేవాలని.ఏ ఒక్కరికి వైరస్‌ ఉన్నా విమానంలో ఉన్న మిగతావారంతా ప్రమాదంలో పడతారని. కేవలం థర్మల్‌ స్క్రీనింగ్‌తో విమానాలు ఎక్కించవద్దని కేరళ ముఖ్యమంత్రి పినరపి విజయన్‌ అంటున్నారు.
లాక్‌డౌన్‌ వలన దేశంలో 45 రోజులుగా ఎక్కడికక్కడ చిక్కుకున్న వలసజీవుల్ని స్వస్థలాలకు తరలించడానికి ఆర్ధిక ఇబ్బందులతో శ్రామిక రైళ్లు నడుపు తున్నారు. లక్షలాదిమంది కూలీలు సొంతూళ్లకు కాలి నడకన వెళ్ళి 70 మంది చనిపోయారు.కొందరైతే సిమెంట్‌ మిక్సర్‌ కంటైనర్ ట్రక్కులు పట్టుకొని బయలుదేరారు.ఔరంగాబాద్ రైలు లో ప్రయాణిస్తున్న వలసకూలీలు చనిపోయినా , స్వస్థలాలకు పోవడానికి అనుమతించమంటూ దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ వలసజీవులు తిరగబడటం మొదలుపెట్టారు.శ్రామిక రైళ్ళలో కూలీల ఛార్జీలు కేంద్రం 85 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు 15 శాతం భరించాలట. వలసజీవుల తరలింపు కోసం ఛార్జీలు అడగారు.వలసజీవుల్లో 65 శాతంమంది దగ్గర కనీసం వంద రూపాయలు కూడా లేవట. ప్రధాని నరేంద్ర మోదీతో తమకు ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రులంతా మొర పెట్టుకుంటున్నారు. ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు అన్నట్లు వలసజీవులకు సొంత ఊళ్ళకు పోవాలనే దిగులు లాక్ డౌన్ కాలంలో పెరిగిపోయింది. ప్రభుత్వం నగదు వసూలు కేంద్రం మాత్రమే కాదు. వలసకార్మికుల తరలింపు చెయ్యాలికానీ ఎక్కడ వున్నవారు అక్కడే వుండిపోవాలని నిర్దేశించ కూడదు. స్వస్థలాలకు పంపే చార్జీల ఖర్చు కొంత తమపార్టీ భరిస్తుందని సోనియా గాంధీ ముందుకొస్తే కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప మరో ఫరో రాజులాగా అడ్డుపడి తమ భవననిర్మాణాల కోసం కూలీలు కావాలని శ్రామిక రైళ్లను ఆపేశారు.
కేంద్రం దగ్గర ప్రస్తుతం 3 కోట్ల 10 లక్షల టన్నుల బియ్యం, 2 కోట్ల 75 లక్షల టన్నుల గోధుమలు నిల్వలు ఉన్నాయి.లాక్డౌన్ కాలంలో కూలీలకు ఇవ్వటానికి ఆహారధాన్యాలను రాష్ట్రాలకు విడుదల చేయటం సంక్షేమ కార్యం. ఒక్క కేరళ రాష్ట్రం మాత్రమే ప్రతి ఇంటికి 19 రకాల ఆహార వస్తువులు 5 వేల రూపాయలు పంపించింది. మోడీ ఆర్థిక ప్యాకేజీ ఏమీ ప్రకటించలేదు. ఈ నిల్వలను మద్యం తయారీకి శానిటైజర్ల రసాయన పరిశ్రమల్లో ఎథనాల్‌ తయారీకి మళ్ళిస్తారట. చమురు ధరలు కారుచౌక గా దొరికే కాలంలో పెట్రోలు డీజిల్‌ కు బదులు ఎథనాల్‌ వాడటం ఎందుకు? ఎథనాల్‌ తయారీ కోసం ఆహారధాన్యాలను మళ్ళించడం అవసరమా? ఐరాస ఆహారధాన్యాలను ఎథనాల్‌ తయారీలో వాడవద్దని, అవి ప్రజల ఆహారం కోసం వినియోగించాలని చెప్పింది.ప్రస్తుతం దేశంలో ఉన్న 50 కోట్ల లీటర్ల ఎథనాల్‌ తో 70 కోట్ల లీటర్ల శానిటైజర్‌ లను కూడా తయారు చేయవచ్చు.ఆత్మనిర్భర భారత అభియాన్ పేరిట 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించింది.కానీ అందులో పరిశ్రమల యజమానులకే గానీ , వలసకూలీలకు ఏమీ కేటాయించలేదు.
మన దేశానికి ఎండ వాతావరణం ఒక శాపము వరము కూడా. శ్రామికుల కూలీల సహజ వ్యాధి నిరోధక శక్తి, లాక్‌డౌన్‌ కూడా తోడయ్యాయి. లాక్ డౌన్ కాలంలో మద్యం దొరకలేదు. కానీ లాక్ డౌన్ ముగియ కుండానే ఇంత తొందరగా మద్యం షాపులు ఎందుకు తెరిచారు అంటే కేంద్రం మద్యం అమ్ముకోమని చెప్పింది కాబట్టేనట.మద్యందొరికిందని తాగుబోతులు సంతోషపడుతుంటే తాగుబోతులు దొరికారని కరోనా ఖుషీ అయ్యిందట.సురాపాన, మద్యవ్యాపార ఆదాయం చాలా పెద్దది.ఎవరూ సారాయిని బాహాటంగా సమర్ధించకపోయినా,తాగకపోయినా దాన్ని నిషేధించలేరు. సారాయిలో సక్రమ అక్రమ అనే తేడాలే లేవు. కొందరు నాయకులు మాత్రం మద్యనిషేధం సాధ్యం కాదుఅంటున్నారు. మన రాష్ట్రంలో మద్యం దుకాణాలను తెరిచి తాగుబోతులు గుమికూడటానికి ఆస్కారం ఇచ్చారు. ప్రతి ఏడాదీ 20 శాతం చొప్పున వైన్‌ షాపులు తగ్గించేస్తామన్నారు. 4,380 షాపులను 2934 కు కుదించటం మంచి పనే.సంపూర్ణ మద్య నిషేధం మహిళాలోకంతో పాటు ఎందరో సంతోషించే పని. లిక్కర్‌ ధరలు 25 శాతం పెంచినా తాగుబోతులు ఆగలేదు. లిక్కర్‌ లేనందున లాక్‌డౌన్‌ సమయంలో రోడ్డు ప్రమాదాలు, గృహహింస, పలు రకాల నేరాలు బాగా తగ్గాయి. మద్యం తాగటం వలన వ్యాధులొస్తాయని అందరికీ తెలుసు . మద్యం అమ్మకాలవలన తప్పనిసరిగా మద్యంరోగుల కేసులు పెరుగుతాయి.సమస్త నేరాలు కూడా పెరుగుతాయి. తాగుబోతులకు మళ్ళీ ఆరోగ్యశ్రీ ఎందుకు? బ్రాంది షాపులకు వెళ్లే వారికి షాకిచ్చేలా ఆంధ్రాలో 75 శాతం ,తెలంగాణ లో 11 శాతం పెంచారట.అయినా తాగుబోతులు తగ్గలేదు.మద్యం కొనుగోలు చేసేవారికి ఆరోగ్యశ్రీ ,రేషన్ కార్డు, పెన్షన్ లాంటివి ఆపాలి అంటున్నారు కొందరు. ఏమి ఆపినా తాగుబోతులు ఆగరు అంటున్నారు మరికొందరు.మద్యం అమ్మకాలను నిషేధించలేమని ఆన్ లైన్ లో ఇళ్లకే సప్లై చేయండి అని సుప్రీం కోర్టు కూడా తేల్చేసింది
96 శాతం తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియం కోరితే అది మెజారిటీ ప్రజాభిప్రాయంగా ప్రభుత్వం శిరసావహించింది.తెలుగుమాధ్యమాన్ని కోరే జనం తక్కువైపోయారు కాబట్టి మౌనం దాల్చింది.చివరికి కేరళ ముఖ్యమంత్రి పినరయి లాంటి వాళ్ళు కూడా మద్యము దానివలన వచ్చే ఆదాయమూ కావాలనే అంటున్నారు. ఏసుక్రీస్తును శిలువ వెయ్యండి.బరబ్బా అనే దొంగను విడుదల చెయ్యండి అనే మెజారిటీ ప్రజల అభిప్రాయానికి పిలాతు,హేరేదు తలవంచారు. మాకు మద్యమే కావాలనే తాగుబోతులు చెబుతున్న మద్య ఆదాయ లెక్కలు సినిమాలలో డైలాగులు కూడా అయ్యాయి.ఛీ తాగుబోతుల కోసమా ఇన్నాళ్ళూ నేను సానుభూతి చూపించింది?అని కొంతమంది మనసు మార్చుకున్నారు. భౌతికదూరం అనే మోదీ మాటలు బ్రాందీ షాపుల ముందు పోలీసులు అమలు చేయలేకపోయారు. కోకోకోలా, థమ్సఆప్‌‌ లాంటి కూల్ డ్రింక్స్ లో పురుగుమందులు కలిశాయని తెలిసినా వాటిని త్రాగటం ఆపారా? తాగి తాగి పోతావురాఅంటే , పోనివ్వండీ ఎదవ ప్రాణం ఎప్పటికైనా పోవలసిందేకదా? భోపాల్ లో మిథైల్ ఐసో సైనేట్ , విశాఖలో స్టీరీన్,కోనసీమలో ఓఎన్ జీసీ గ్యాస్ లీకై నిముషాల్లో జనం ప్రాణాలు పోలేదా? మద్యం అంతకంటే విషమా? దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు అన్నట్లు కోటిరూపాయలు ఇచ్చైనా సరే సారాయి దుకాణాలను , తాగుబోతులను కాపాడుటకు ప్రభుత్వముంది కదా? తాగుడూ ఉండాలి ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కూడా ఉండాలి.ఇక్కడ చస్తే కదా మరోచోట పుట్టేది? అనివార్య మైన నిరంతర ప్రక్రియ ఇది. తప్పించ వీలుకాని జనన మరణాల చక్రము ఆగదు!ఆగకూడదు అంటాడు.
--- నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266
 
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి