ఈ బ్లాగును సెర్చ్ చేయండి

13, జూన్ 2020, శనివారం

కపట వైఖరి వద్దు


కపట వైఖరి వద్దు (సూర్య 14.6.2020)
గడ్డి తినైనా సరే గండ్ర గొడ్డలి కొని తీరుతానని శపథం చేసిన దుష్టులను నీతి బోధతో ఎవరాపగలరు ? ఖానేకు నహీ ఎల్లీకి బులావ్ అన్నట్లుగా కొన్ని దేశాలు ఆయుధాల సేకరణ కోసం తలకు మించిన బరువును ఎత్తుకుంటున్నాయి. మన దేశం కూడా వేల కోట్ల రూపాయలు రక్షణ రంగానికే వ్యయం చేస్తున్నది. ఈ ఖర్చు మీద ఎలాంటి ఆడిట్ ఉండకపోవటం, రక్షణ ఖర్చులన్నీ రహస్యంగా ఉండటం,భారీగా ముడుపులు ముట్టడం లాంటి ఆశాజనకమయిన విషయాలు రాజకీయ నాయకులకు ఉన్నందువల్ల పొరుగు దేశాన్ని బూచిగా చూపించి, ప్రజల్ని భయపెట్టి, పొరుగు దేశాన్ని తిట్టడం ద్వారా దేశభక్తిని ప్రదర్శించి, ఓట్లు రాబట్టి, తమ పదవులను నిలుపుకొని, ఆదాయం పొందటానికి అతి అనువుగా ఉంది ఈ రక్షణ రంగం.ఆయుధాల తపన ఆగిపోతే మిగిలే డబ్బుతో ఆకలి చావుల్ని ఆపవచ్చు.అడుక్కుతినే వాళ్ళను అరికట్టవచ్చు. అక్షరాస్యతను పెంచవచ్చు. ఇల్లు కట్టించవచ్చు. ఇంకా ఎన్నో చేయవచ్చు. అయితే ఈ అత్యవసరమయిన పనులన్నిటినీ అవతల పెట్టి ఆయుధాలు కొంటున్నారంటే అర్ధం ఏమిటి ? చైనా తన రక్షణ బడ్జెట్‌ను ఇప్పుడు 179 బిలియన్ డాలర్లు చేసిందట.. భారతదేశ రక్షణ కేటాయింపులతో పోలిస్తే ఇది మూడింతలు ఎక్కువట. స్వార్ధమా పరమార్ధమా ? ఎందుకీ ఆయుధ పిచ్చి ?
ఆగ్రరాజ్యాలు అని మనం ముద్దుగా పిలుచుకొనే అన్నలు ఎప్పుడైనా ముఖాముఖీ తలపడ్డారా? పైగా మోహరించిన బలగాలను తొలగించుకుంటూ పరస్పరం సుహృద్భావ పర్యటనలు జరుపుకొంటున్నారు.మధ్యలో పిచ్చిపట్టి తన్నుకుంటున్న వర్ధమాన దేశాలకు బుద్ధిలేనట్లే గదా! తోటివాడు తొడ కోసుకుంటే మనం మెడ కోసుకోవాల్సిందేనంటారు గానీ ఏ దేశంలోనూ విశ్వమానవత వినరాదు.
కోడిని కోసి గోత్రానికంతా పగ అయినట్లుగా పాకిస్తాన్,చైనా,ఉత్తర కొరియా మొదలైన దేశాలు పరిసర దేశాల ఆగ్రహానికి గురి అయ్యాయి.ఒక్కో దేశానికి ఒక్కో కారణం. స్నేహం సజావుగా సాగితేనే స్నేహం. కలిసినప్పుడు కృత్రిమంగా నవ్వుకోవటం, చాటున గోతులు తవ్వుకోవటం. లేకపోతే ఎవరికైనా చెప్పి ఏడ్చుకోవటం, ఇవన్నీ కొంపలు ఆర్పుకునే పద్ధతులే. ఇలాంటి దొంగ స్నేహంకంటే నిర్మొహమాటమయిన ఎడబాటే మేలు. క్రికెట్ అనీ, సార్క్ అనీ పాకిస్తాన్ ను దగ్గరకు చేర్చుకునే ప్రయత్నాలు అనుభవం మీద మానేశారు. చైనా చేపట్టిన 'బెల్ట్‌ అండ్‌ రోడ్డు ఇనీషియేటివ్‌'లో ఇండియా చేరలేదు. భారత–చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వివాదాస్పద సరిహద్దులనుంచి ఇరు దేశాల సైన్యాలూ 2 కిలోమీటర్లు వెనక్కు వెళ్లాయట. మన దేశం అమెరికాతో సన్నిహితం కావడం చైనాకు నచ్చడం లేదు. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో తన ప్రయోజనాలను దెబ్బతీసేలా అమెరికా పావులు కదుపుతోందని, అందులో భారత్‌ భాగస్వామిగా మారుతోందని చైనా ఆందోళన. ఈ సరిహద్దు వివాదం 1962లో యుద్ధానికి దారి తీసింది. బ్రిటిష్‌వారు గీచిన మెక్‌మోహన్‌ రేఖను తాము ఎలా గుర్తిస్తామని చైనా వాదిస్తుంటే, వాస్తవాధీన రేఖ అస్పష్టంగా ఉందని భారత్‌ వాదిస్తున్నది. ఏ దేశంపై ఏ దేశానికీ నమ్మకంలేదు.రెండు దేశాల మధ్య తగాదాను ఆసరా చేసుకుని వాటిమధ్య తల దూర్చటం ఇద్దరికీ ఆయుధాలు అమ్మటం అమెరికా ఎత్తుగడ..డొనాల్డ్‌ ట్రంప్‌ దీనిలో మధ్యవర్తిత్వం వహిస్థానంటే భారత్‌, చైనా రెండూ వద్దన్నాయి.అన్ని దేశాలపై ఆయుధాల ఖర్చు తగ్గాలి. ప్రపంచంలోనే రెండు అతి పెద్ద జనాభా దేశాలు చైనా ఇండియా.దేశాలమధ్య మైత్రి సరుకులపై సుంకాలను తగ్గించి ప్రపంచ వ్యాపారాన్ని పెంచుతుంది. భారత్‌, చైనా మధ్య మైత్రీబంధం బలోపేతం కావడం ఇరు దేశాలకు ఉపయోగకరం. పరస్పర స్నేహము,ఇరుదేశాలకు మేలు.
---నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి