ఈ బ్లాగును సెర్చ్ చేయండి

9, జూన్ 2020, మంగళవారం

సమభావం, సమధర్మం సహజీవనమనివార్యం

సమభావం, సమధర్మం సహజీవనమనివార్యం
(సూర్య లో నా సంపాదకీయం 9.6.2020)
 
నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని శ్రీశ్రీ పెదవివిరిచాడు. కాకి చనిపోతే కాకులన్నీ గుంపుగా చేరి గోల చేస్తాయి. మానవత్వం ఉన్న మనుషులు కూడా అంతే. అలెక్స్ హేలీ రాసిన రూట్స్ ఏడుతరాలు అనే తెలుగు నవలగా వచ్చింది.తెల్లవాళ్లు అమెరికా నుంచి ఆఫ్రికా వచ్చి నల్లవాళ్లను బానిసలుగా పట్టికెళ్లటం కొన్నితరాలపాటు నల్లవాళ్లు బానిసలగానే అమెరికాలో బ్రతకటం చదివితే దుఖం వస్తుంది.అమెరికాలో బానిసత్వాన్ని భరించలేక తిరగబడి పారిపోయి వచ్చిన బానిసలను వెతికి పట్టుకొని మళ్లీ బానిసత్వం లోకి పంపించడానికి 1700 సంవత్సరాల్లో బానిస గస్తీ దళాలు ప్రారంభమయ్యాయి.1868లో బ్లాక్‌ కోడ్స్‌ను పూర్తిగా రద్దు చేసి నల్ల జాతీయులకు కూడా సమాన హక్కులు కల్పించారు. అంతర్జాతీయంగా జాతి వివక్షపట్ల నిరసన వ్యక్తం చేసి సమానత్వం కావాలన్నారు మేధావులు. విధికి లోబడి తనకు తెలియకుండానే మనిషి చెడ్డ పనికి పూనుకొంటాడని భగవద్గీత 18:60 వ శ్లోకం చెబుతోందట. అర్జునుడు తన ఇష్టము లేకనే అస్వతంత్రముగ యుద్ధము చేశాడట.జనమేజయుడు తనకు ఇష్టంలేకపోయినా మాయ ప్రభావంతో బ్రాహ్మణ సాధువు తల నరికాడట.1968లో నల్లజాతీయుడు డాక్టర్‌ మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ ను హత్య చేశారు. ఇప్పుడు ఫ్లాయిడ్‌ను హత్య చేశాడొక అమెరికన్ పోలీస్‌. ఎవరు ఏమిచేసినా పోయిన ప్రాణం తిరిగిరాదు.చంపకుండానే ఉండాలి. చంపదగినయట్టి శత్రువు తనచేత జిక్కెనేని పొసగమేలుచేసి పొమ్మనుటే చాలు అన్న వేమన సూత్రాన్ని ఈ లోకంలో ఎంతమంది పాటిస్తారు?ఫ్లాయిడ్ ప్రాణం తీసేంతగా చేసిన తప్పు ఏమిటి? అని నల్లవారు అడుగుతున్నారు . విభజించు పాలించు సిద్ధాంతాన్ని అమలు చేసిన వాళ్ళంతా ఫలితంగా తిరుగుబాటును చూశారు. డొనాల్డ్‌ ట్రంప్‌ బంకర్‌లో దాక్కోవలసి వచ్చింది. సైన్యాన్ని ప్రయోగిస్తాడట. ఇదికూడా విధి రాతయేనా? దేశాధిపతి అయినా జనాగ్రహం ముందు దుర్బలుడే. నిరసనకారులంతా దొంగలని, నిరసనకారులు వైట్‌హౌస్‌లోకి వచ్చినట్లయితే వారిపైన క్రూరమైన కుక్కలు దాడిచేసేవని, అలాగే సీక్రెట్‌ సర్వీస్‌ భద్రతా దళాలు ఆయుధాలను ప్రయోగించేవారని లూటీలు కొనసాగితే కాల్చిచంపుతామని ట్రంప్ అన్నారు. సహనంతో కలిసి బ్రతకాలనే సాధు శాస్త్రాలు మూగబోయాయి. కులము,మతము,రంగును బట్టి వివక్ష చూపేది మానవత్వాన్ని మంటగలిపే నీచ సంస్కృతివద్దు అని పెద్దలు గతంలో ఎంత చెప్పినా రెండు ప్రపంచయుద్ధాలు జరిగాయి.అసలు యుద్ధం జరగని దేశమంటూ ప్రపంచంలో లేదేమో! పేరు ధర్మరాజు అని పేరుగాంచిన పెద్ద మనుషులు కూడా సహనభావం లోపించి కయ్యాలు తెచ్చుకుంటున్నారు. యుద్ధకాంక్షతో రగిలిపోయే వీరులలో యుద్ధ ఆవేశాన్ని తగ్గించి పూర్వం సుందరాంగులు తమ అందచందాలతోశాంతి సహన భావాలను మేల్కొలిపేవారట.ఇప్పుడు ఆ శ్రుంగార భావనలు,విషకన్యలు ఉపయోగించటం లేదు.పట్టరానికోపం,అహంకార ఆధిపత్య ధోరణులు, వివక్ష,ఏదో ఒక సాకుతో రగిలిపోవటం , ప్రతిఘటన కొన సాగిస్తున్నారు.అమెరికా,ఆఫ్రికా, అరేబియా.ఖండాల దేశాలలో అసహనం ఇలా ఉంటే , మనదేశంలో కుల వివక్ష ,అంటరానితనం దుర్మార్గంగా కొనసాగిన రోజులున్నాయి. ఈ కరోనా అందరినీ అంటరానివాళ్లను చేసింది. అయినా ఈ దుర్మార్గాలు ఇంకా దేశాన్ని పూర్తిగా వదలలేదని అడపాదడపా వార్తలు వస్తున్నాయి.కొన్ని చోట్ల దేవాలయాలలోకి రానివ్వలేదని బాధపడుతున్నారు.కొన్నిచోట్ల కులాంతర వివాహితుల్ని చంపారు. కొన్నిచోట్ల చెరువునీళ్లు తీసుకొనివ్వకపోవటం లాంటి దౌర్జన్యాలు జరిగాయి.సోషల్ మీడియాలో ఈ కదనాలు వస్తూనే ఉన్నాయి.
లౌకికవాదం,సమసమాజ స్థాపన కోరిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ తానే స్వయంగా అస్పృశ్యత వివక్షలను ఎదుర్కొన్న బాధితుడు.చివరికి బౌద్ధాన్ని స్వీకరించాడు. ఇతర రాష్ట్రాలలో ఎంతోమంది మహనీయులు కుల మత వివక్షలను పోగొట్టటానికి ఎన్నో నవలల్లో, సినిమాల్లో దుయ్యబట్టి హితబోధ చేశారు. తెలుగునాట మన రచయితలు,మహానుభావులు గొప్ప సందేశాలను ప్రజలకు అందించారు. అల్లకల్లోల సమయంలో వాటిని ఒకసారి మనమూ గుర్తుతెచ్చుకుందాం: “మంచి చెడ్డలు లోకమందున ఎంచి చూడగ రెండే కులములు / మంచి అన్నది మాల అయితే మాల నేనౌతాను” అన్నాడు గురజాడ. “జాతిబేధము కలుగదు నీతికెందు:పాపపుణ్య విబేధ భావమున పొసగు:ధర్మశీలురు నిర్దయాత్మకులు ననడు:రెండే జాతులు మరి వేరొకండు లేదు”.(1937 బాల యోగిని) “మాలలు మాత్రం మనుజులు కారా? మనుజుల విభజనమేలా?” (1938 మాలపిల్ల) "జాతి బేధం సమసిపోదా జనులు సుఖమందా?నీతిలేని పాడు సంఘం నిజము కనుగొనదా?సాటివారి సమత చూచే కాలమేరాదా ?నీవనీ నేననీ బేధమే విడనాడదా ? (1954 సంఘం - తోలేటి) “చిదంబరములో శివుని దర్శనం చేయగరాదనే పూజారి/అంతట శివుడే అతనిని బ్రోచి పరంజ్యోతిగా వెలయించే “ (1958 జయభేరి - శ్రీశ్రీ) "అంటరానితనము – ఒంటరితనము,/అనాదిగా మీ జాతికి అదే మూలధనము,ఇక సమభావం, సమధర్మం సహజీవన మనివార్యం,తెలుసుకొనుట మీధర్మం"(1972 మంచి రోజులు వచ్చాయి -దేవులపల్లి కృష్ణ శాస్త్రి) “బానిసభావం విడనాడి ,ఏజాతి నిలుచునో అది జాతి” (1973 గాంధీ పుట్టినదేశం - మల్లవరపు గోపి).
మీరూ ఇలాంటి పాటల చరణాలను ఎన్నో చెబుతారు. ఒక్క సినిమా రంగంలోనే జ్నానము తెలిసిన తెలుగు పెద్దలు ఇన్నివిధాలుగా వాపోయారు,ఇప్పటికీ వాపోతూనే ఉన్నారు. మనదీ పెద్ద చరిత్రే. దేశంలో ఎన్నోచోట్ల కులహత్యలు ,అణచివేతల వార్తలు ఈనాటికీ వస్తున్నాయి.దేశ సంపద సృష్టికర్తలైన కూలీలకు వందనాలు ఆర్పిద్దాం. ప్రపంచంలో వివిధ జాతులు కులాలు మతాల మనుషులు మర్యాదగా గౌరవంగా సురక్షితంగా బ్రతకాలి. కాబట్టి మనుషులంతా కలిసే బ్రతకాలి. మానవజాతుల మధ్య సమభావం,సమధర్మం,సహజీవనం తప్పదు.
--నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,6301493266

1 కామెంట్‌: