ఈ బ్లాగును సెర్చ్ చేయండి

18, జూన్ 2020, గురువారం

దేహమేరా దేవాలయం! జీవుడే సనాతన దైవం!


దేహమేరా దేవాలయం! జీవుడే సనాతన దైవం!
1986 లో వచ్చిన మెదడు వాపు వ్యాధికూడా కరోనా లాగే జనాన్ని కలవరపెట్టింది. ఆనాడు ఆ విచిత్ర వైరసు పందులలో పెరిగి దోమల ద్వారా వ్యాపిస్తున్నట్లు వైద్యులు విన్నవిస్తే వైరస్ కు కారకములైన వరాహములను దోమలను వధించండి అని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అధికారులను ఆజ్నాపించాడు. దోమల్ని నిర్మూలించటం తమ తరంకాదని అందరూ పందులమీదపడి వేటాదారు.అప్పట్లో ఎరుకల వాళ్ళ సంఘం హైకోర్టుకువెళ్లి పందుల్ని కాపాడుకొంది.కొన్నిచోట్ల ఆలయాల్లో మూలవిరాట్టులకు భక్తజనులు ఉన్నిబట్టలు, చలికోట్లు, టోపీలు అలంకరించారు. ‘ఈశ్వరుడే సత్యం ,సత్యమే ఈశ్వరుడు’ అనే భక్తుల విశ్వాసాల నుండి సగుణారాధన ,నిర్గుణోపాసన పుట్టాయి. ప్రార్థనల కోసం దేవాలయాలు , పూజల కోసం, దేవతా విగ్రహాలను ప్రతిష్టించారు. దేవుడంటే ఒక నమ్మకం, ఒక మానసిక స్థైర్యం. గుడి,చర్చి, మసీదు అని పిలిచే పేరులో మార్పు తప్ప...భావం ఒక్కటే. దేవాలయానికి వెళ్లడమంటే ప్రాపంచిక విషయాలను పక్కనబెట్టి నిర్మలమైన హృదయంతో దేవుని ముందు తనను తాను ఆవిష్కరించుకోవడం. కరోనా ప్రభావంతో మూతబడిన దేవాలయాలు చాలా వరకు తెరుచుకున్నాయి. భక్తులంతా మాస్క్‌లు ధరించి.. భౌతిక దూరం పాటిస్తూ దైవ దర్శనం చేసుకుంటున్నారు. 4.5 లక్షల మందిని చంపిన కరోనాను మహమ్మారి అని కొందరు , కరోనా దేవత అని కొందరు పూజలు చేస్తున్నారు. అయితే దైవ దర్శనానికి వెళ్లిన వారిని కూడా కరోనా వదలడంలేదు. మనిషి పుట్టినప్పటినుండి కోట్లాది జీవకణాలను తయారుచేసిన దేహం ముసలితనంలో ఆగిపోతుంది.ఇక్కడ ఆగితేనే మరోకచోట పుట్టటం సాధ్యం కాబట్టి మరణమే పునర్జన్మకు సోపానమని కొందరు ఆధ్యాత్మిక వాదులు అంటారు.చావబోయేవాళ్లు చనిపోయిన వానికోసం ఏడుస్తున్నారు ,ఎవరి చావుకూ బాధపడకూడదని శంకరాచార్య సలహా ఇచ్ఛాదట..కానీ మామూలు మనిషికి అంత తెలివి ఎక్కడిది?దుఖిస్తూనే ఉంటాడు.
జగన్నాధుడికి జ్వరమొస్తే దశమూలికా వైద్యం చేశారట.మక్కా ,జెరూసలేము ,కాశీ, అయోధ్య ,తిరుపతి లాంటి అన్నీ ప్రాంతాలను కరోనా వైరస్‌ కమ్మేసింది. లక్నో లోని దేవాలయంలో దేవుడికి కరోనా వైరస్‌ సోకుతుందనే భయంతో శివలింగానికే మాస్క్‌ వేసేశాడో పూజారి.'చిత్తం శివుడి మీద, మనసు చెప్పుల మీద' అన్నట్టుగా భక్తుల మనసు దేవుడికంటే ఎక్కువ కరోనా మీద ఉంటోంది.గుడిని దేవుడినీ నమ్ముకొని భక్తులు వస్తే భక్తులను నమ్ముకొని ఎంతోమంది వ్యాపారులు బతుకుతూ ఉంటారు.వ్యాపారం నడవాలంటే ప్రజలే భక్తులై రావాలి.దేవుని దర్శనం తర్వాత కాసేపు గుడిలో కూర్చోవాలని చెప్పిన ఆగమ శాస్త్రం కరోనా నయం చేయటం ఎలాగో చెప్పలేదు.వైద్యానికి డాక్టర్లే కావాలి.ఇంతటి దయనీయ స్థితిలో కూడా కొట్లాటలు,తుపాకీ కాల్పులు ఆగలేదు.భారత చైనా దేశాల సైనికులు కొంతమంది చనిపోయారు. యుద్ధం చేసి తలలు తెగవేయగలము , తెగిపోయిన తలలను తిరిగి అతికించగలముగానీ తిరిగి ప్రాణంపోయలేము.ఆస్థాయికి నేటికీ వైద్యవిద్య ఎదగలేదు.యుద్ధం ఇరుదేశాలకు నష్టమే.తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి, శ్రీకాళహస్తి ఆలయంలో పూజారికి కరోనా సోకింది. గుంపులు గుంపులుగా చేరిన హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరినీ కరోనా వదలటంలేదు. తబ్లిగి వెళ్లొచ్చిన కరోనా ముస్లిముల కంటే మరింత ఎక్కువగా మహమ్మారిలా కరోనా వ్యాపించింది.ట్రంప్ చర్చీలు తెరవాల్సిందే అన్నాడు. ఇక్కడ కూడా దేవాలయాలు, చర్చిలు, మసీదులు తెరవడానికి అనుమతి ఇచ్చారు. దేవుడు వరమిచ్చినా కరోనా వరమివ్వలేదు.దేవుడి తర్వాత దేవుడిగా, దేవుడి ప్రతిరూపాలుగా చెప్పుకునే పూజారులకే కరోనా వచ్చి డాక్టర్లదగ్గరకు వెళుతున్నారు.రెడ్.ఆరంజ్,గ్రీన్ జోన్లు లేవు.అందరూ డేంజర్ జోన్ లోనే ఉన్నారు. చస్తే కరోనా, బతికితే డయేరియా అంటారు. స్కూళ్లు, కాలేజీలు తెరవడానికి కూడా భయపడుతున్న సమయం ఇది. కరోనా వచ్చిన చోట ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూస్తున్నారు. ఇళ్లదగ్గరే ఉండి పనిచేయమంటున్నారు.పూర్వంలాగా సినిమా హాళ్ళకు జనం రారు.పిల్లలను ఎక్కువగా కనరు.విదేశాలకు,రాష్ట్రాలకు వలసలు పోరు.అందరికీ ప్రాణ భయం ఏర్పడింది.బలుసాకు తినయినా బతికుంటే చాలు అనుకుంటున్నారు.ఏది ఏమైనా కరోనా కు టీకారావాలి. మందుకనుక్కోవాలి. ఇప్పుడే దేవాలయాలు తెరవడం అనవసరం. భక్తులు భయం భయంగా దేవాలయాలకు వెళ్లకూడదు. కరోనాను తెచ్చుకోకూడదు. అమ్మలారా నాకోసం ఏడ్వకండి , మీకోసం మీబిడ్డలకోసం ఏడవండి అనే ఏసుక్రీస్తు మాటలు అందరికీ గుర్తొస్తున్నాయి. కాదనటానికి లేదు.దేవుడు సర్వాంతర్యామి,సర్వోపగతుడు అని నమ్మితే ఆయన్ని చూడటానికి ఎక్కడికీ వెళ్ళనవసరంలేదు. ఇందుగలడందులేడను సందేహము వలదు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు అని ప్రహ్లాదుడు లాగా హృదయంలోనే దర్శించుకోవాలి.దేవాలయాలకు కూడా కరోనా కాలంలో గుంపులుగా వెళ్లకూడదు. కరోనా తగ్గేవరకూ ఆగుదాం.
1985 దేవాలయం సినిమాలో వేటూరి రాసిన పాటలోని మాటలను ఓదార్పుకోసం అదేపనిగా గుర్తుచేసుకుందాం;
శిలా గోపురం ఆలయమా? శఠగోపురమే అర్చనమా?
దేహమేరా దేవాలయం! జీవుడే సనాతన దైవం!
నేనే బ్రహ్మ ,నేనే విష్ణువు, నేనే శివుడై నిలబడితే
ఏ అర్హత నాకుండాలీ? ఏ అధికారం కావాలీ?
అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి
--నూర్ బాషా రహంతుల్లా , విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి