ఈ బ్లాగును సెర్చ్ చేయండి

5, ఆగస్టు 2020, బుధవారం

జిల్లాలతోపాటు జోనులూ కావాలి

జిల్లాలతోపాటు జోనులూ కావాలి (సూర్య 13.8.2020)
జోన్లు ఏర్పడ్డాకే రాజధానుల తరలింపు జరుగుతుందని జగన్మోహనరెడ్డి చెప్పారు.జోనులు ఏర్పాటు చేస్తామనటం మంచి ఆలోచనే.మూడు రాజధానులు,సీఆర్ డీఏ రద్దు బిల్లులపై హైకోర్టు యధాతదస్థితి ని విధించింది.ఒక్క రాజధానినే కట్టలేనప్పుడు మూడు రాజధానులు ఎందుకు? అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని భూములిచ్చిన రైతులు వేడుకొంటున్నారు.కేంద్రాన్ని జోక్యం చేసుకోమంటున్నారు.అమరావతి కోసం పూజలు హోమాలు చేశారు.ప్రజలు మూడు ప్రాంతాలలో కూడా మాకేంటి అని అడుగుతున్నారు.జోనులుపెట్టి అమరావతితోపాటు మిగతా ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేయాలని ఎమ్మేల్యేలు కోరుతున్నారు. జిల్లాలంటే అందరికీ తెలుస్తోందికానీ ఈ జోనులంటే ఏమిటో ప్రజలకు పూర్తిగా తెలియలేదు. 1972 జైఆంధ్ర ఉద్యమానికి విరుగుడుగా ఏర్పాటు చేసినవే ఈ జోనులు. విశాఖపట్నం రైల్వే జోను లాంటివే ఈ జోన్లు. ఏ జోనులోని ఉద్యోగాలు ఆ జోను వారికే ఇచ్చి స్థానికుల్ని సంతృప్తి పరచడమే జిల్లాలు,జోనుల ఏర్పాటు లక్ష్యం. 33 జిల్లాలు 9 జోన్లు తెలంగాణా లో ఏర్పాటు చేశారు కానీ ఆంధ్రలో ఆలశ్యమయ్యింది. జోనల్ ఆఫీసులంటే సచివాలయానికి జిల్లాలకు మధ్య బ్రాంచీల వంటివి,హైకోర్టుకు బెంచీలలాంటివి.జోనల్ అధికారికి సచివాలయ స్థాయి అధికారాలు ఉంటాయి. జోనల్ కార్యాలయాలతో సచివాలయ స్థాయి సేవలు కూడా అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తాయి.పరిపాలనా వికేంద్రీకరణ కోసం తలపెట్టిన కొత్తజిల్లాల ఏర్పాటూ జోనుల ఏర్పాటు నేటికీ పెండింగ్ లోనే ఉన్నాయి.హైకోర్టు,రాజధానుల తరలింపుకు సుప్రీంకోర్టు పార్లమెంటు ఒప్పుకోవాలి.కొత్తగా ఏర్పడే అరకు బాపట్ల అనకాపల్లి అమలాపురం హిందూపురం నంద్యాల నరసాపురం నరసరావుపేట రాజమండ్రి రాజంపేట తిరుపతి విజయవాడ జిల్లాలను కూడా ఈ నాలుగు జోనుల్లో సర్దాలి. జోనుల వల్ల ప్రజలకు ఒరిగేది ఏమిటంటే అందరూ విశాఖకో కర్నూలుకో అమరావతికో ప్రయాణం కట్టనక్కరలేదు.ఎవరి జోన్ పరిధిలో వారికి పనులు జరుగుతాయి. నాలుగు జోనుల్లో కలక్టర్ల కంటే పైహోదా కలిగిన నలుగురు కమీషనర్లు రాజధానికి కలక్టర్లకు మధ్య వారధుల్లాగా పనిచేస్తారు.ప్రతిపనికి ప్రజలు రాజధానికి రాకుండా ఈ కలక్టర్లు,కమీషనర్లు జిల్లాలు,జోనులు వారీగా స్థానిక ప్రాంతాలలోనే ఉండి పనిచేస్తారు.కలక్టర్ల దగ్గర పనులు కానివాళ్లు కమీషనర్లను ఆశ్రయిస్తారు. జిల్లాల విభజనకూడా పూర్తయితే ఇంకా బాగుండేది.కొత్తగా కొన్ని జిల్లాలు వచ్చేవి. అన్ని డిపార్టుమెంట్లూ జోనల్ వ్యవస్థను అమలుచేస్తుంటే రెవిన్యూ డిపార్టుమెంట్ లో జోనల్ కార్యాలయాలు ఇప్పటికీ లేవు. జోనల్ కమీషనర్ జిల్లా కలక్టర్ కంటే పై స్థాయి అధికారి.కలక్టర్ల స్థాయిలో పనులు కాకపోతే రాజధానికి పోనక్కరలేకుండా జోనల్ కార్యాలయాలలో చాలా పనులు జరుగుతాయి.వాస్తవానికి మూడు రాజధాని నగరాలను కట్టడం కంటే ఒక్కచోటే నవనగరాలనిర్మాణం కంటే నాలుగు చోట్ల ప్రాంతీయ కార్యాలయాలు పెట్టటం చవకైనపని , అన్నిప్రాంతాలకూ మరింత ప్రయోజనకరం.పూర్వం జోన్లు ఏర్పాటు చేశారు కానీ అన్ని శాఖలకు జోనల్ కార్యాలయాలను కట్టలేదు. జోనులవల్ల కలక్టర్లకంటే పై స్థాయి సచివాలయ అధికారులు నాలుగు జోనుల్లో నాలుగు ప్రాంతీయ కమీషనర్లుగా పనిచేస్తారు.జోనులు ఏర్పడితే రాజధానుల ప్రాధాన్యత చాలావరకు తగ్గిపోతుంది.ప్రజలు అందరూ రాజధాని సెక్రటేరియట్ కు వెళ్లాల్సిన అవసరం,ప్రయాణ భారం తగ్గుతాయి. అన్ని శాఖల్లో 95 శాతం పనులు జోనుల్లోనే పూర్తవుతాయి.జిల్లా కేంద్రాలు జిల్లా మధ్యలో,జోనుల కేంద్రాలు జోన్ మధ్యలో ఉంటే ఇంకా మంచి జరుగుతుంది. శివరామకృష్ణ , జి.ఎన్.రావు కమిటీలు జోనుల ఏర్పాటుకు కూడా సిఫారసు చేశాయి.హైకోర్టుకు బెంచీలు పెట్టమన్నాయి. జోనల్ కేంద్రాలు జిల్లాల మధ్యలో దగ్గరగా ఉండాలని చెప్పాయి. ముఖ్యకేంద్రాలన్నిటికోసం ప్రజలు పోటీ పడుతున్నారు.జిల్లా కేంద్రాలకోసం పోటీ ,జోనల్ కేంద్రాలకోసం పోటీ,రాజధాని నగరాలకోసం పోటీ.విశాఖలోసచివాలయం పెడితే రాయలసీమ జిల్లాలకు దూరమని,కర్నూలులో హైకోర్టు పెడితే ఉత్తరాంధ్రకు దూరమని అక్కడి ప్రజలు తమ బాధను వ్యక్తంచేస్తున్నారు. బ్రాంచీలు పెరగటం ఆయా ప్రాంతాల సౌకర్యాలు పెంచటానికే. దగ్గరలో పనులు జరగటం వల్ల ప్రజలలో సంతృప్తి స్థాయి పెరుగుతుంది. పనులు త్వరగా జరగాలి అంటే పనివిభజన బాధ్యతల విభజన తప్పదు. విజయవాడ,రాజమండ్రి,తిరుపతి పట్టణాలు జిల్లా కేంద్రాలు కాకపోయినా ప్రజల వలసలతో గొప్పనగరాలు అయ్యాయి.నగరాలు ఏవీ ఒక్కసారి ఏర్పడవు.ఏళ్ల తరబడి పోగుబడిన అభివృద్ధే మహా నగరం. విజయవాడ సెంటర్ కాబట్టే అమరావతిని ఎంపిక చేసి వీలైనన్ని భవనాలూ కట్టారు.కట్టిన భవనాలను కూలగొట్టకుండా ప్రభుత్వం వినియోగం లోకి తేవాలి.భూములిచ్చిన రైతులు నష్టపోకుండా అగ్రిమెంటు ప్రకారం పరిహారం చెల్లించాలి.హైదరాబాదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని పెట్టుబడి అంతా ఒకేచోట పొగుపడకుండా జోనుల మధ్య పంచాలి. ఇప్పటికే లక్షలజనాభాతో పెద్దదయిన తీర నగరంపై మరింత జనభారాన్ని మోపటం అనవసరం.ఎంతపెద్దనగరమైనా అది రైలు జంక్షను కాదు.ఒక అంచులో ఉంది. కర్నూలు కర్ణాటక అంచు లో ఉంటుంది . ఉత్తరాంధ్ర రాజధాని కోసం విజయనగరం మధ్యస్థానం , రాయలసీమ రాజధాని కోసం మధ్యస్థానం కడప . వీటిని రైల్వే జంక్షన్లుగా అబ్జివృద్ధి చెయ్యాలి. ఆతరువాత రాజధాని కేంద్రాలుగా వాటంతట అవే అభివృద్ధి చెందుతాయి. రాజధానుల అభివృద్ధికి దూరదృష్టి ఉండాలి. జిల్లా కేంద్రాలు పెరిగితే అన్ని చోట్లకు పెట్టుబడి పాకుతుంది. జిల్లా కేంద్రాలన్నిటినీ రైల్వే జంక్షన్లుగా మార్చాలి.మనకు అధిక జనాభాతో కిక్కిరిసిన మహానగరాలకంటే చిన్న పట్టణాలే మంచిదని కరోనా నేర్పింది. అష్టకష్టాలలో ప్రయాణం కుడా ఒకటి.ప్రయాణం అనుత్పాదకవ్యయం.ప్రజలకు ప్రయాణఖర్చు భారీగా తగ్గాలి.
1. ఉత్తరాంధ్ర విజయనగరం జోను: శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం,అరకు,అనకాపల్లి 5 జిల్లాలు
2.మధ్యకోస్తాకాకినాడజోను:తూర్పు,పశ్చిమగోదావరి,కృష్ణా,రాజమండ్రి,అమలాపురం,నరసాపురం,విజయవాడ 8 జిల్లాలు
3.దక్షిణకోస్తా గుంటూరు జోను : గుంటూరు,ప్రకాశం,నెల్లూరు, బాపట్ల,నరసరావుపేట 5 జిల్లాలు
4.రాయలసీమ కడపజోను:కర్నూలు,కడప,అనంతపురం,చిత్తూరు,తిరుపతి,రాజంపేట,హిందూపురం,నంద్యాల 7 జిల్లాలు.
నాలుగు ప్రాంతాలకు మధ్యలో ఉన్న కేంద్రాలుగా విజయనగరం,ఏలూరు,ఒంగోలు,కడప నగరాలను చేయవచ్చు.ప్రాంతాలకు భౌగోళికంగా మధ్యలో ఉండటం కూడా ప్రాంతీయ కేంద్రానికి మంచి అర్హత. రాజధాని నగరాన్ని మరోచోటికి మార్చటం కంటే నాలుగు చోట్ల ప్రాంతీయ కార్యాలయాలు పెట్టటం చౌక మరింత ప్రయోజనకరం.
అలాగే అమరావతిలో కొత్త కట్టడాల ఖర్చులను కుదించుకొని నాలుగు చోట్ల జోనల్ కార్యాలయాలను కట్టించాలి.అమరావతిలో కట్టిన భవనాలను వాడుకుంటూనే సమన్యాయం కోసం హైకోర్టుకు రెండు చోట్ల బెంచీలు పెడితే రాజధాని కోసం ప్రజలు రానక్కరలేని పరిస్తితి జోనులవల్ల వస్తుంది. ప్రజలు దూరం పెరిగితే భారమై మొరపెడతారు. ఎవరు ఎన్ని చెప్పినా ఎక్కడికక్కడే మాప్రాంతం రాజధానికావాలి ,ప్రాంతీయ కేంద్రం కావాలి అని పోటీ పడుతున్నారు. అందువలన నలువైపులనుండి ప్రజల రాకపోకలకు రైలు,రహదారి సౌకర్యాలు ఉండటమే మండల కేంద్రాలకు గానీ ,రాజధాని నగరానికి గానీ పెద్ద సంపద.జిల్లా కేంద్రాలను,జోనల్ కేంద్రాలను నిర్ణయించే ముందు పెద్దలు శాస్త్రీయంగా ప్రజల రోడ్డు,రైలు రవాణా సౌకర్యాల గురించి ఆలోచించాలి.
-- నూర్ బాషా రహంతుల్లా ,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,6301493266

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి