ఈ బ్లాగును సెర్చ్ చేయండి

15, ఆగస్టు 2020, శనివారం

కూతుళ్లకూ సమాన ఆస్తిహక్కు

కూతుళ్లకూ సమాన ఆస్తిహక్కు (సూర్య 16.8.2020)
సృష్టిలో సగభాగం స్త్రీ అంటారు.నరుని పక్కటెముకలోనుంచి తీసినది కాబట్టి నారి అన్నారు. కులుకు మిటారి, బంగరు బొమ్మ, కప్రంపుదిమ్మ, అన్నులమిన్న,సంపెంగగున్న, వన్నెల దొంతి, మువ్వల బంతి, రతనాల తేట, వరాల మూట, పండు వెన్నెల సౌరు, వలపుల మొక్క, మేలు తలపుల చుక్క అని అతివ ను అందమైన పేర్లతో పొగిడారు. కానీ వేల ఏళ్లపాటు ఆమెకు పురుషునితోపాటు సమాన ఆస్తి హక్కు ఇవ్వలేదు. కట్నాలు ఎన్ని ఇచ్చినా ఆడవాళ్ళకు సరైన రక్షణలేదు. స్త్రీ, పురుష సమానత్వం కోసం ఎన్ని చట్టాలు వచ్చాయో? గృహహింస,దిశ ,నిర్భయ లాంటి చట్టాలు అనేకం వచ్చాయి. తండ్రి ఆస్తిలో మగ పిల్లలతోపాటు ఆడపిల్లలకు కూడా సమాన వాటా రావాల్సిందేనని మహిళలకు ఆస్తి హక్కు కల్పిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది. ఎటువంటి ఆస్తీ లేక జీవితం దుర్భరంగా తయారయిన విధవరాళ్ళకు కూడా ఇది ఎంతో మేలు చేసే తీర్పు.ఇన్నాళ్లూ భారతీయ స్త్రీలు“పతి పద సేవయే యోగముగా నాతికి పతియే దైవముగా “ అన్నారు. ఆలయమేలా ? అర్చన లేలా ?ఆరాధన లేల ?పతి దేవుని పద సన్నిధి మించినది వేరే కలదా ?అదే పరమార్ధము కాదా ?అని పాడారు. అసలు నిజం తెలుసుకున్న కొందరు పురుషులు మాత్రం “ఆలయన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి”అని భార్యలను దేవతల్లాగా చూసుకొంటున్నారు. స్త్రీలను పూజించే చోట దేవతలు నడయాడతారనే సూక్తిని పాటిస్తూ ఇంటికి దీపం ఇల్లాలే అంటున్నారు.బెంటింగ్ లాంటి మహనీయులు సతీ సహగమనాన్ని రూపుమాపారు. గురజాడ , కందుకూరి వీరేశలింగం లాంటి మహనీయుల తీవ్రకృషి వల్ల మన రాష్ట్రంలో బాల్యవివాహాల పీడ విరగడయ్యింది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నాడు కారల్‌ మార్క్స్‌. ఆడపిల్లలకు ఆస్తులు పంచాల్సి వచ్చినప్పుడు ,వారసుల మధ్య ఆస్తి తగాదాలు వచ్చినప్పుడు మనుషుల అసలు రంగు బయటపడుతుంది. 1937 వరకూ పెళ్లి కానుకలు మాత్రమే స్త్రీ ధనంగా ఆమెకు దక్కేవి.వితంతువుకు భర్త ఆస్తిని అనుభవించే హక్కు మాత్రమే ఉండేది. కానీ దాన్ని అమ్ముకునే హక్కు లేదు. మహిళ లను పూజించనక్కరలేదు ,తోటి మనిషిగా గుర్తించి, వారికి పురుషులతోపాటు సమాన హక్కులు ఇస్తే చాలని అంబేద్కర్ అన్నారు. అబ్బాయిలతోపాటు అమ్మాయిలకు ఆస్తి దక్కాలని కేంద్ర న్యాయశాఖ మంత్రిగా హిందూ కోడ్‌ బిల్లును తయారుచేశారు.ఆ బిల్లు ఆమోదం కోసం ఆనాడే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 1986లో ఎన్‌టీ రామారావు ఆడపిల్లలకు కూడా సమాన ఆస్తి హక్కు కల్పించారు.ఉద్యోగాల్లో ఆడవాళ్ళకు 30 శాతం, రాజకీయాల్లో 9 శాతం రిజర్వేషన్లు కల్పించారు.తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు కూడా ఈ చట్టాలు తీసుకొచ్చాయి. స్త్రీలకు భూమిపై యాజమాన్య హక్కు రావటం గొప్పమార్పు.ఆమెకు చాలా కాలానికి ఓటు హక్కు ఇచ్చారు.ఆమెకు నేటికీ భూమిపై సరైన హక్కులు లేవు.85 శాతం వ్యవసాయ భూమి పురుషుల పేరుతో ఉంటే 15 శాతం భూమి మాత్రమే స్త్రీల పేరుతో ఉందట.సగం జనాభా స్త్రీలే ఉన్నప్పటికీ స్త్రీలకు భూమి పై హక్కులు వారి జనాభాకు తగ్గట్లు రాలేదు.మిగతా స్త్రీలకు భూమిపై హక్కులు ఎప్పటికీ వస్తాయో ?ఆమె సంపాదనంతా కుటుంబ పోషణ ,పిల్లల చదువుల కోసమే సరిపోతోంది.ఇండియాలో 43 శాతం మంది వ్యవసాయ కూలీలు మహిళలే ఉన్నారు. వారికున్నది 2 శాతం భూమి మాత్రమే.వారిది తీవ్రమైన పేదరికం,చాలీ చాలని కూలి. ఇటీవల ఒంటరి మహిళలకు పెన్షన్,అమ్మఒడి,చేయూత కార్యక్రమాలతో స్త్రీలకు ఆర్ధిక సాయం చేస్తున్నారు.రేషను కార్డు,భూమి ఇల్లు పట్టాలు మహిళ పేరుతో ఇస్తున్నారు.భూమిపై స్త్రీల యాజమాన్య హక్కులు పెరిగేకొద్దీ కుటుంబాల ఆర్ధికాభివృద్ధి జరుగుతుంది.భర్త భూమిలోనే ఎన్నేళ్లు పనిచేసినా భార్యపేరిట భూమిని మార్చరు.ఆడదాని పేరుతో ఆస్తి తరిగిపోతుందని,ఆమెకు అక్కరలేదనే భావన తరతరాలనుండీ పేరుకుపోయింది
మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ ,
కలకంఠి కంట కన్నీరొలికిన తొలగిపోవురా సిరులు,
కన్నకడుపున చిచ్చురగిలెనా కరువులపాలౌను దేశం అన్నారు సినారె.
దేశంలోని మహిళలందరికీ మేలు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ దివ్యమైన తీర్పు పట్ల హర్షిద్దాం !
--నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి