ఈ బ్లాగును సెర్చ్ చేయండి

1, ఆగస్టు 2020, శనివారం

రిజర్వాయర్లు,బ్యారేజీలు, చెరువుల సంఖ్య పెంచాలి

 
రిజర్వాయర్లు,బ్యారేజీలు, చెరువుల సంఖ్య పెంచాలి
వరదలు అంతర్జాతీయ సమస్య.వరదలు,ప్రకృతి ఉత్పాతాలలో భారత్‌ ప్రపంచంలోని తొలి నాలుగు దేశాల్లో ఒకటి.దేశంలో 12 శాతం భూభాగం వరద ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది.అనేక నదుల వరదలు పంటలను మింగేస్తున్నాయి.వందలాది మంది ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ప్రకృతి విపత్తుల నిర్వహణ వ్యయమంతా కేంద్రమే భరించాలని బిహార్‌ లాంటి రాష్ట్రాలు కోరుతున్నాయి.వరదలను ఆపటానికి నదులపై ఆనకట్టలు డ్యాంలు, బ్యారేజ్‌ లు కడతారు. చిన్నప్పుడు సాంఘీక శాస్త్రంలో బీహార్ దుఃఖదాయిని అని ఒకనది గురించి చెప్పేవారు. సినిమా న్యూస్ రీల్స్ లో బీహార్ లో వరదలు అని చెప్పే వారు. గంగానదిపై తెహ్రీ డ్యాం కట్టినా బిహార్‌ వరదలు ఆగలేదు.హరిద్వార్ నుంచి కోల్‌కతా దాకా వరదలే. కృష్ణవేణమ్మ గొనిపోయె నింత ఫలము అని శ్రీనాధుడు ఆనాడు వరదలపాలైన పంటకోసం విలపించాడు.కృష్ణా గోదావరులలో నేటికీ వరదలు తగ్గలేదు.ఈ వరద నీటిని దాచుకొనే రిజర్వాయర్లు లేవు.ఎండాకాలంలో నీళ్ళ కొరత.ఇప్పుడు మళ్ళీ ఆగస్టులో శ్రీశైలానికి ధవళేశ్వరానికి భారీ వరదలు రాబోతున్నాయని ఇంజనీర్లు చెబుతున్నారు. నదుల్లో సంవత్సరాలుగా ఒండ్రు నిలవ పెరుకుపోతూఉంది. చితాభస్మాలు,కాలిన శవాలు,పరిశ్రమల మురికి,రసాయన వ్యర్ధాలు అన్నీ నదుల్లోకే వదులుతున్నారు.అయిదేళ్ళకో పదేళ్ళకో ఒకసారైనా నదులలో పూడిక తీయరు.వరదలద్వారానే పేరుకుపోయిన వ్యర్దాలన్నీ సముద్రంలో కలుస్తాయి. పూడికలు పోయి నదులకు నీరు పారే శక్తి పుంజుకుంటుంది.డ్యాములు,భారీ ఆనకట్టల ద్వారా వరదలు ఆపుతున్నారు కానీ ఒండ్రును కూడా ఆపుతున్నారు. డ్యాముల దగ్గర విపరీతంగా ఒండ్రు పేరుకుపోతున్నది. సముద్రంలోకి కొట్టుకు పోవడం లేదు.వరద వస్తేనే మురికి సముద్రంలోకి పోవటం. చుట్టుపక్కల పల్లపు ప్రాంతాలన్నీ మునిగిపోవటం జరుగుతున్నాయి.భారీ డ్యాములవల్లనే కొన్ని వరదలు వస్తున్నాయి. వరదలొచ్చినా కొన్ని నగరాలలో త్రాగు నీళ్ళు ఉండవు.ఏటా కురిసిపోయే వర్షాల్లో కేవలం ఎనిమిది శాతాన్నే పొదివి పట్టుకోగలుగుతున్నామన్న మోదీ జల సంరక్షణకు పూనుకోవాలి. దేశంలో 450 నదులు ప్రవహిస్తున్నాయి. కానీ ఆ నీళ్ళు తాగునీటి అవసరాలకు పనికిరావు. 60 కోట్ల భారతీయులు తీవ్ర నీటి ఎద్దడితో సతమతమవుతున్నారు. 84 శాతం జనావళికి కుళాయి నీళ్లు అందుబాటులో లేవు. 70శాతం జలాలు కలుషితమైపోయాయి. ఏటా రెండు లక్షలమంది జలకాలుష్యంద్వారా రోగాలపాలవుతున్నారు. తాగునీరు పొందడాన్ని ఈ దేశ పౌరుల జీవన హక్కుగా సుప్రీంకోర్టు స్పష్టీకరించింది. నదులు ప్రాణమున్న చట్టబద్ధ జీవులని, మనిషికి ఉండే చట్టబద్ధ హక్కులన్నీనదులకు ఉంటాయని ఉత్తరాఖండ్ హైకోర్టు చెప్పింది. ఏటా కురిసే వాననీళ్లలో 70శాతం వృథాగా ఉప్పు సముద్రం పాలవుతూనే ఉంది. భూగర్భాన్ని నీటికోసం తొలిచేసి, ఆ వెలితిని పూరించటం లేదు. 160 జిల్లాల్లో భూగర్భ జలం ఉప్పు నీరుగా మారిపోయింది. 230 జిల్లాల్లో ఫ్లోరైడ్‌ నీళ్లున్నాయి.కలుషిత జలం మానవాళి చరిత్రలోనే అతిపెద్ద సామూహిక విష ప్రయోగమని చెప్పింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. యుద్ధవిమానాల కోసం లక్షల కోట్లు కేటాయిస్తూ ప్రకృతి విపత్తుల నుండి రక్షణ కోసం వేల కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారు.
నీటితోనే మనిషి మనుగడ ముడివడి ఉంది. అతివృష్టి, అనావృష్టి తో జనజీవనం దుర్భరమై పోతోంది. దేశంలో భిన్న పరిస్థితులున్నాయి.ముంబై లో వర్షాలకు వరదలొస్తే , చెన్నై లో నీటి కరువు. అందువలన జాతీయ రహదారుల వల్ల దేశ రవాణా రంగానికి ఎంతో మేలు జరిగింది.అలాగే నిరంతరం నీరు పుష్కలంగా ఉండే జాతీయ నదులను కరువు నదులతో కలిపి గంగనీటిని కావేరీ దాకా తేవాలి.పట్టిసీమ నీటిని పంపులద్వారా ఎత్తిపోసి విజయవాడ తెచ్చారు.తెలంగాణా కాళేశ్వరం ప్రొజెక్టూ , మిషన్‌ కాకతీయ ఎత్తిపోతల ద్వారా తెలంగాణలో గొలుసుకట్టు చెరువుల్ని పునరుద్ధరించారు.వరదనీళ్లను సర్దుకోటానికి ఊర చెరువులు , సాగు చెరువులు పెరగాలి. గ్రామాలకు చెరువులు దొరువులే ఆయువుపట్టు. దేశంలో అయిదు లక్షల అరవై వేలకు పైగా చెరువులు అయిదు లక్షలకు పడిపోయాయి. కబ్జాల పాలైన చెరువులు దొరువులను మున్సిపల్‌ ఆస్తులు’గా నమోదు చెయ్యాలి.చెరువులూ కుంటల్ని కాపాడుకోవాలి. చెరువులతోపాటు వాటికి నీటిని తీసుకొచ్చే కాలువలు, ఉప కాలువలూ అన్నీ ఆక్రమణల పాలైపోయాయి.
ఒండ్రువలన నదీగర్భం మట్టం పెరుగుతుంది. పెరిగిన నదీ మట్టానికి సమాంతరంగా గట్ల ఎత్తును పెంచుకుంటూపోతారు. ఎత్తులో నది ఉంటే నది దిగువన పల్లంలో చుట్టుపక్కల ప్రాంతాలు ఉంటాయి.గట్లు తెగిపోతాయి.మురుగు నీరు వదిలి పోదు.కాస్త వానకే హైదరాబాదు రోడ్లు కాలువల్లా మునిగిపోతున్నాయి.ఎత్తులో ఉన్నాయనుకుంటున్న జాతీయ రహదారులు ,రైలు మార్గాలు కూడా మునిగిపోతున్నాయి. వరదలు తెచ్చే ఒండ్రు వందల బస్తాల యూరియాతో సమానమని గోదావరి జిల్లాల రైతులు సంబరపడేవారు.ఆ ఒండ్రు తమ పొలాలపై పొర లాగా కమ్ముకోవాలని కోరుకుంటారు.నాగార్జునసాగర్ డ్యాము ఉన్నందువలన కృష్ణా నదిలో తెనాలి పొలాలకు ఒండ్రు రాదట. ఒండ్రును ఆపే పోలవరం ఆనకట్ట కూడా మాకు వద్దు , తల్లీ గోదారికే వెల్లువోస్తే అందం అంటూ గతంలో వరదలను నిశ్చింతగా స్వాగతించారు.నదీజలాలు తీసుకువచ్చిన ఇసుక ఒండ్రు మేటలు లంకల మీద గ్రామాలు కూడా ఏర్పడ్డాయి. ప్రజలు కూడా తమ ఇళ్ళలో సురక్షితంగా ఉండే వాళ్ళు. వరదలొచ్చి బ్రతిమిలాడినా సహాయ శిబిరాలకు వచ్చేవాళ్లు కాదు. పోలవరం ప్రాజెక్టు వద్దని,వరదలవల్లనే తమ భూమి సారవంతమవుతుందని కోనసీమ కొబ్బరి రైతులు,తమ కొబ్బరిచెట్లకోసం కోనసీమకు రైలుమార్గం కూడావద్దన్నారని ఒక పుకారు.
భారీ డ్యాముల బదులు నది పొడవునా 50 కిలోమీటర్లకు ఒకటి చొప్పున చిన్న బ్యారేజీలను నిర్మించాలని కె.ఎల్.రావు,విద్యాధరరావు,మెచినేని కిషన్ రావు లాంటి వారి సూచనలను అమలు చెయ్యాలి.చిన్న బ్యారేజీలు లాకులలాగా సరుకు రవాణా పడవలకూ ఉపయోగపడతాయి. ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పుసముద్రంపాలు' అన్నాడు ఆరుద్ర. భారీ వ్యయంతో పోలవరం లాంటి భారీ డ్యాములు కట్టే కంటే నదులు సముద్రంలో కలిసే దాకా ఎక్కువ సంఖ్యలో చిన్న చిన్న రిజర్వాయర్లు,బ్యారేజీలూ కట్టాలి.ఎక్కడికక్కడే చిన్న బ్యారేజీలు,రిజర్వాయర్లు స్థానిక అవసరాలకు ఉపయోగపడతాయి.నది రెండువైపులా కరకట్టలను రహదారులుగా మార్చాలి.వేరే భూమి కొననక్కరలేదు.నదులలోనే విస్తారమైన జలసంపద నిలువ చేయవచ్చు.
972 కిలోమీటర్ల కోస్తాలోని 66 తీర ప్రాంత మండలాలు ఏటా అకాల వర్షాలు,వరదలు,తుఫాన్ల కారణంగా అపార నష్టానికి గురవుతున్నాయి.ఈ 66 మండలాలను మండలాలను కలుపుతూ కోస్తా రహదారి నిర్మించాలి. తీర ప్రాంతంలో చేపల రేవుల్ని నిర్మించాలి. వరదలు,తుఫానులు తట్టుకొనేలా మెరకపోసి పేదలకు ఇళ్ళు కట్టించి ఇవ్వాలి.తుఫాను షెల్టర్లు,లింకు రోడ్లు,వంతెనలు విస్తృతంగా నిర్మించాలి. రేపల్లె-బందరు-నరసాపురం- కాకినాడ - విశాఖపట్టణం టెర్మినల్స్ ను కలుపుతూ తీరం వెంట కొత్త రైలుమార్గం వేయాలి.ఎక్కడ రేవు దొరికితే అక్కడ ఫార్మా ఉక్కు పరిశ్రమలతో నింపారు.సముద్రతీరం విషవాయువులతో తాండవిస్తోంది.సెజ్ లు వచ్చాక సముద్ర తీరంలోని ఇసుక దిబ్బలు,సరివి తోటలు గ్రామాలకు గ్రామాలే క్రమంగా మాయమైపోయాయి.తీరవాసులు వరదలు మోస్తున్నారు.తుఫానులు కాస్తున్నారు. వాగులపై వంతెనలు లేక, సరైన రవాణా వ్యవస్థ లేక కష్టాలు పడుతున్నారు. నదులు,వాగులు,మురుగుకాలవలు దాటలేక అవస్థలు పడుతున్నారు.వరదలు ఎదుర్కోటానికి భారీ డ్యాములకు బదులు పెద్ద సంఖ్యలో రిజర్వాయర్లు,బ్యారేజీలు కట్టించాలి.కొత్త చెరువులు తవ్వించాలి. ఎందుకంటే మనకు నీళ్ళ కొరత,కరువు కూడా ఉన్నాయి.ఎండాకాలం మంచినీళ్ళ కోసమే కాక పచ్చదనం కోసం గ్రామగ్రామాన నిరంతరం చెరువుల్లో నీళ్ళు నిలవ చేయాలి.
 నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్,6301493266


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి