ఈ బ్లాగును సెర్చ్ చేయండి

14, నవంబర్ 2020, శనివారం

సంగీతం,చేపలు మెదడుకు మంచిమేత

 




సంగీతం,చేపలు మెదడుకు మంచిమేత (గీటురాయి 27.11.2020)
పౌష్టికాహారలోపంతో బాధపడే గర్భిణులు,బాలింతలు,బాలికలు,చిన్నారులకు అంగన్ వాడీలు ,ప్రాధమిక పాఠశాలల్లో భోజనంలో ఎండు చేపలకూరను అందించాలని ఒడిశా ప్రభుత్వం తలపెట్టింది. ఆహార పదార్ధాలు చవకగా ప్రజలకు అందితేనే ఆరోగ్యం.ప్రజలు బాగా తినాలనే ఉద్దేశంతో ‘కోడిగుడ్డు శాకాహారమే’ Egg is vegetarian అని కూడా ప్రచారం చేశారు.గుడ్డుకు బదులు పాలు పళ్ళు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి చౌహాన్ వాదనను కాదని ఆయన సమక్షంలోనే పిల్లలకు గుడ్డుతోపాటు చేపలకూర కూడా వండి వడ్డించాలని మధ్యప్రదేశ్ మంత్రి కుసుమ మెహ్డెల్ ఆదేశించారు.
ఆకలి తీర్చుకోవడానికి జంతువులను వేటాడి చంపి పచ్చి మాంసం తిన్న ఆదిమ మానవుడు తరువాత నిప్పులమీద కాల్చుకున్నాడు.క్రమేణా చేపలు కూడా ఆహారమై పోయాయి.జంతు బలుల హింసలేకుండా శాకాహారమే బెస్ట్ అని కొందరు ఉద్యమస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. తాను ఇకపై పూర్తి స్థాయి శాకాహారిగా మారిపోతున్నానని,మాంసాహారంతోపాటు గుడ్లు, పాలు, పాలతోచేసే ఇతర పదార్థాలూ కూడా వదిలేస్తున్నానని ఆమీర్‌ఖాన్ ప్రకటించారు.రాజస్థాన్, పంజాబ్, హర్యానా,యూపీ రాష్ట్రాల్లో కూడా అంగన్ వాడీల్లోగానీ, బడిపిల్లల మధ్యాహ్న భోజనంలోగానీ గుడ్లు అందించడంలేదు. ఎండుచేపలు,ఉప్పుచేపల వేపుడు,కూర,పులుసు ఎంతగానో ఇష్టపడతామని చిరంజీవి లాంటి సెలబ్రిటీలు గర్వంగా చెప్పుకున్నారు.గుడ్లు,చేపలు తిననివాళ్లు తినేవాళ్లకూ మాంసకృత్తులు దొరకకుండా చేయకూడదని కొందరి వాదన.
సంగీతం,చేపలు మెదడుకు మంచిమేత ఆన్నారు.పిల్లలకు సంగీతం నేర్పించండి అని సంగీత విద్వాంసులు చెబుతుంటే,చేపలు కూడా బాగా తినిపించండి అని వైద్యులు సలహాలిస్తున్నారు. అయితే ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో పెరిగిన ఆకుకూరల్లాగా శుభ్రమైన నీళ్ళలో పెరిగిన మంచి చేపలను మాత్రమే తినాలి.చీకాకు పరిచే రణగొణ ధ్వనులను కాకుండా హాయిగొలిపే సంగీతాన్ని మాత్రమే వినాలి.చేపలకు కరోనా వైరస్ శోకిందన్న భయంతో ఇండియా,ఇండోనేషియా,రష్యా,బ్రెజిల్,దేశాల కటిల్ చేపల దిగుమతులను చైనా నిషేధించింది. కొల్లేరు సరస్సులో ఉప్పు రసాయనాలు పెరిగి నల్లజాతి చేపలు అంతరిస్తున్నాయి. కూరగాయ పంటలపై విచ్చలవిడిగా చల్లుతున్న రసాయనాలు చేపలలోకి కూడా వెళుతున్నాయట. ఈ రసాయనాలు ప్రజల శరీరాల్లోకి వెళ్ళి కేన్సర్ నాడీ వ్యాధులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. నదుల్లో నీరు స్నానం చేసేందుకూ పనికిరాని స్థితికి చేరింది. చేపలు ఆ నీటిలో బతకలేని స్థితి.నదుల్లో హానికరమైన కోలిఫామ్‌ బ్యాక్టీరియా ఉంది. పట్టణాలు,సముద్రాల నిండా ప్లాస్టిక్ చేరింది. నగరాల్లోని మురుగు నీటిని పరిశ్రమల నుంచి వెలువడే ప్రాణాంతకమైన రసాయన వ్యర్థాలను శుద్ధి చేయకుండా నేరుగా నదుల్లోకి వదిలేస్తున్నారు. నదులు కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాలను శుభ్రం చేయటంలేదు. అలాంటి మురుగు నీళ్ళలో పెరిగిన మొక్కలైనా చేపలైనా తిన్నవారి ఆరోగ్యానికి హానికరమే. ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తున్న కారణంగా స్థానికంగా చందువా లాంటి చేపలు దొరకటం,లేదు. మన చేపలు మన ప్రజలకే అండటంలేదు. స్థానిక ప్రజల ఆరోగ్యం కోసం చేపల ఉత్పత్తి కోసం ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తుంటే తినే తిండిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే ఎలా?
చేపలలో 25 వేల జాతులున్నాయట.మట్టగిడిస, కొర్రమేను, బొమ్మిడాయి,ఎర్రమట్ట, కోయంగ, మోసు, వాలుగ, పాలబొంత, వంజరం , బంగారు తీగ మట్టగడిస, కొయ్యింగ,రాగండి,వానమట్ట, సవ్వలు, టేకుచేప, కట్టిపరిగ, పిత్తపరిగ, బొచ్చెలు, మెత్తాళ్ళు, పండుగప్పలు, సాల్మన్, కొరమీనులు శీలావతి, గొరక, ఇంగిలాయి, జల్ల, బొచ్చ, జడ్డువాయి, చేదుపరిగె,పండుకప్ప, గండి బొడిగి, కొయ్యంగ, మునగపాము, గుడగ్గాయి, చామరాయి, పొట్టిదిలాసు, కట్టినెరసు, బుడపార, చాకిరొయ్య, గడ్డికొయ్య, మాలతప్పడాలు, ఏటిజల్ల, మార్పులు, పల్లెంకాయ, పాలజల్ల, పారాటాయి , పరిగెలు,పిత్త పరిగెలు, కొయ్యంగలు, తుళ్ళు, జలుగులు, కర్నింగాయలు, అరటి చేపలు, శాక రొయ్యలు, బుంగ రొయ్యలు, గాజు రొయ్యలు, గొల్లిగాయలు, జల్లలు, రామలు, ఆకు పరిగెలు, సీసం రొయ్యలు, బెత్తెలు, ఇసుక దొందులు, ఇంగిలాయలు, మార్పులు, బొచ్చె, పులస, పండుగొప్ప, శీలవతి, జడ్డువా, బంగారుతీగ, గడ్డి చేప, నల్లగండు మేను, తెల్లగండు మేను, కట్ల, ఇల్లంబ్రాయిలు...ఇలా ఎన్నో రకాల చేపలు దొరుకుతాయి.
చేపల మొప్పలు ఎత్తి చూసినపుడు లోపల ఎర్రగా, పింక్ కలర్లో కాంతివంతంగా ఉండాలి.ఎర్రగా కనపడటానికి రంగుకూడా వేస్తారు.చేపల ఉపరితలం చొట్టపడకుండా గట్టిగా ఉండాలి. చేపల కళ్ళు మెరుస్తూ కాంతిగా ఉండాలి. ఉప్పునీటిలో పెరిగే పండుగప్పను ఇప్పుడు మంచినీటి చెరువుల్లో కూడా పెంచుతున్నారు. సాల్మన్ చేపలలో ప్రొటీన్లు, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ డిలు పుష్కలంగా లభిస్తాయి. వీటి మాంసం ఎరుపురంగులో ఉంటుంది. రవ్వచేపలని కూడా పిలుస్తారు. లక్షల విలువ చేసే కచ్చిడి చేపల పొట్టలో ఔషధ గుణాలున్నాయంటారు.ఆపరేషన్ తరువాత కుట్లు వేసే దారాన్నికచ్చిడి పొట్ట భాగంతో తయారుచేస్తారట.నల్లమట్ట చేప మనిషంత పొడవు ఉంటుంది.ట్యూనా చేప 70 కిలోల వరకు బరువు పెరుగుతుంది. చేపలలో విటమిన్-A, D, E, K లు ఉంటాయి. క్రొవ్వు తక్కువగా ఉంటుంది.గర్భిణులు చేపలు తింటే పుట్టబోయే శిశువులకు ఉబ్బసం రాదని నమ్మకం.వాటిలోని ఒమేగా3 ఆమ్లాలు కేన్సర్ కణితులను నివారిస్తాయట. గుండెజబ్బుతో బాధపడుతున్నవారు చేపల్ని తినడం మంచిది.తేలిగ్గా అరుగుతాయి. వీటిలో లైసీన్‌, మిథియోనిన్‌, సిస్టీన్‌ అమైనోయాసిడ్లు లభిస్తాయి. చేపలలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్లు పిల్లల పెరుగుదలకు అవసరం.సముద్రపు చేపల్లో అయోడిన్‌ ఉంటుంది. చేతి పరికెలు ముల్లుతో సహా తింటే కాల్షియం, భాస్వరం, ఐరన్‌ అధికంగా లభిస్తాయి.రోజూ చేపలు తీసుకునేవారిలో గుండెజబ్బులు, మధుమేహం, పక్షవాతం తక్కువ.బొజ్జ, అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర పెరగటం, మంచి కొలెస్ట్రాల్‌ తగ్గటం, ట్రైగ్జిరైడ్లు ఎక్కువ కావటమే ఈ జబ్బులకు కారణం.చేప నూనె మాత్రలు అధిక రక్తపోటుతో పాటు గుండెజబ్బు మూలంగా వచ్చే మరణాలనూ తగ్గిస్తాయి. చేపలు పెద్దపేగుకు మేలు.మాంసం కన్నా చేపలు తినటం మంచిది. మెదడుకు మేలు చేసేవి చేపలు.చెరువు చేపలకంటే సముద్రపు చేపలు మంచివి. చేపలు తినటం వలన రక్తనాళాలలో రక్తం గడ్డకట్టదు. ట్రైగ్లిజరేడ్లు తగ్గుతాయి. బిపిని కంట్రోల్ లో ఉంచుతాయి. శస్త్రచికిత్సలు జరిగిన తరువాత కొరమీనులు తినడం వల్ల గాయాలు, కోతలు త్వరగా మానుతాయంటారు. చందువాలు జీర్ణకోశానికి మేలు చేస్తాయి. నూనెకవ్వలు సార్టెన్ చేపలలో ఒమేగా 3, ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువ. బీపిని కంట్రోల్ లో ఉంచుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచివి. ఎండుచేపలలో పోషకాలు పెరగటంతో పాటు, రుచి కూడా పెరుగుతుంది. పిల్లల పెరుగుదలకు మంచిది.
ఎండు చేపలు
నక్కపల్లి,చందోలు,గుంటూరు ఎండు చేపల సంతలలో చప్పిడి చేపలు,ఉప్పుచేపలు,వంజరం,కానగంతలు,కాకిపరిగెలు,గులివిందలు,తట్టాలు లాంటి ఎన్నోరకాల ఎండు చేపలు అమ్ముతారు. దేశవ్యాప్తంగా ఉన్న సముద్రతీరాలలో రోడ్లమీద బోట్లపైన చేపలను ఎండ బెట్టి వ్యాపారం చేస్తారు.పచ్చి చేపలకు ధీటుగా ఎండు చేపల వ్యాపారం సాగుతోంది.దుమ్ము ధూళి లేకుండా చేపలను ఎండబెట్టటానికి మత్స్య శాఖ వారు హార్బర్లకు దగ్గరలో కొన్నిచోట్ల సోలార్ డీహైడ్రేటర్ ప్లాంటులను కూడా ఏర్పాటు చేశారు.పూర్వం ఎండు చేపలపై ఎలాంటి పన్ను ఉండేది కాదు.ఈమధ్యే 12 శాతం జీయస్టీ పన్ను తీసేయ్యాలని చేపల వ్యాపారులు ఆందోళన చేశారు.
చేపలను ఎక్కువ నూనె పోసి వండకుండా తక్కువ నూనెతో వండుకోవాలి. ఎక్కువ నూనెలో వేపుడు చేసిన చేపలతో క్యాన్సర్ల ముప్పు పెరుగుతుంది. మెత్తాళ్ళను చింతచిగురుతో కలిపి వండుకుంటారు.పండుగప్ప,కొరమీనుల ఖరీదు కొంచెం ఎక్కువ. బొమ్మిడాయిలు చింతకాయతో కలిపి పులుసు చేస్తారు.చప్పిడి చేపలను మునక్కాయ,కోడిగుడ్డు,చిక్కుడుకాయ కాంబినేషన్ తో చేస్తారు.ముళ్లుతీసేసి పిట్టు లాగా కూడా చేసుకుంటారు. గోదావరి నదిలో దొరికే పులసచేపలు అత్యంత ఖరీదైనవి.
కరోనా ప్రభావంవల్ల చేపల వేట వ్యాపారం రెండూ దెబ్బతిన్నాయి. కోవిడ్‌ వ్యాక్సిన్‌ కూడా అందుబాటు లోకి రాలేదు.పర్యావరణ హితమైన బాణసంచా కాల్చడంపై ఆంక్షలకు ప్రజలు అంగీకరించారు.అందరికీ ఎంతో కొంత సంపద పంచిచ్చిన నేలతల్లి,గాలి.నీరు కలుషితమై విషమై పోయాయి. రసాయన విషప్రయోగశాలలో రోగి అయ్యింది సేంద్రియ భారతి . కలుషిత పంట ఎవరి కడుపు నిండుతుంది?విషపూరిత పండ్లు చేపలు తిని ప్రాణాలమీదకు తెచ్చుకోకూడదు. ఆనాటి పచ్చదనం పరిశుభ్రత మళ్ళీ వస్తుందా? కాలువల్లో నీళ్ళు అనాటిలాగా అలాగే తాగగలమా?చేలల్లో చేపలు బ్రతుకుతాయా?కాలువల్లో మంచి చేపలు దొరుకుతాయా?అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
--- నూర్ బాషా రహంతుల్లా, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి