ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, నవంబర్ 2020, సోమవారం

నదులకు కరకట్టలు పటిష్టం చెయ్యాలి, మురుగుకాలువలు తవ్వించాలి!

 నదులకు కరకట్టలు పటిష్టం చెయ్యాలి, మురుగుకాలువలు తవ్వించాలి! (సకలం 31.10.2020)


వర్షాలు పడితే చాలు హైదరాబాద్‌ మునిగిపోతుందని కొన్నేళ్లనుంచి అందరూ అనుకొంటున్నారు. నగరాన్ని వర్షం వదలకుండా ముంచెత్తుతోంది. నిత్యం భారీ వర్షం నగరాన్ని వణికిస్తోంది. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మూసీ నదికి రెండు వైపులా రెయిలింగ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించించింది. నగరంలో ఉన్న మూడు వంతెనలు అఫ్జల్, ముస్సాలం జంగ్, చాదర్‌ఘాట్‌ తెగిపోవడంతో, పూరానాపుల్ వంతెన మాత్రమే నగరంలోని రెండు ప్రాంతాల మధ్య మిగిలి వుంది. ఆనాటి వరదల్లో అప్పటి పాలకుడు నిజాం మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ నిరాశ్రయులకు తమ సంస్థానాల్లోని భవనాల్లో ఆశ్రయం కల్పించారు . ఆఫ్జల్‌ దవాఖాన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ భవనం కూలిపోయింది. దానిపక్కనే 150 మంది ప్రాణాలను కాపాడిన చింత చెట్టు ఇప్పటికీ ఉంది.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య నివేదిక

మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1909, అక్టోబరు 1న ఇచ్చిన రిపోర్టు మేరకు ఏడవ నిజాం మీర్‌మహబూబ్‌ అలీ ఖాన్‌ బహదూర్‌ హైదరాబాదు నగరానికి త్రాగునీటిని అందించటానికి వరదలను నివారించటానికి 1920లో మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ ఆనకట్టను, 1927లో హిమాయత్ సాగర్ జలాశయాలను నిర్మించాడు. కుంభవృష్టి హైదరాబాద్‌ తో పాటు వరంగల్లు, విజయవాడలను కూడా ముంచెత్తింది. సహజంగా పారవలసిన నాలాలు పారలేదు. కాలువల స్థానంలో భవంతులు, షాపులు కట్టారు. వరదలను ఆపటానికి నదులపై ఆనకట్టలు డ్యాంలు, బ్యారేజ్‌ లు కట్టి ప్రకృతి విపత్తుల నిర్వహణ వ్యయమంతా కేంద్రమే భరించాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. ఆనాడు కోరంగి రేవు పట్టణం భారీ ఉప్పెనలో నేలమట్టమయి పోయింది.

దిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తానన్న కేంద్రం ఏం చేసింది?

దిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని చెప్పిన కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చి తరువాత రాజధానితో మాకు సంబంధం లేదని హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేసింది. రాజధానిలో రాజధాని లేకుండా ప్లాట్లు ఇస్తే ప్రయోజనం ఏముందని భూములు ఇచ్చిన రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం అంటోంది. రాజధాని నిర్మాణం వలన ప్లాట్లకు విలువ పెరుగుతుందని, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని, ఉపాధి దొరుకుతుందని భూములిచ్చిన రైతుల ఆశ. రాజధాని చుట్టూ నవనగరాలు లేకపోయినా ఇప్పటికే కట్టిన నిర్మాణాలను పూర్తిచేయ్యాలి. అభివృద్ధి వికేంద్రీకరణ మంచిదే. ప్రజావేదిక లాగా కట్టినవాటిని కూలగొట్టకుండా వాడుకోవాలి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారి వరద పోటెత్తింది. దీంతో సాగునీరును దాచుకునే సాగరాలు, చెరువులు, రిజర్వాయర్లు లేక వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు ఉప్పుసముద్రంలోకి విడుదల చేశారు.

వరదలు వచ్చి ప్రాణాలు హరించినా అడ్డుకునే ప్రయత్నం లేదు

చరిత్రలో కోరంగి,దివిసీమలతోపాటు హైదరాబాద్, మద్రాసు, మైసూరు, బొంబాయిలు కూడా పెనుతుపానులకుగురయ్యాయి. ప్రజలు మృత్యు వాత పడ్డారు.వరదలను అడ్డుకునే నిర్మాణాలు జరుగలేదు. ప్రకృతి సహజ పరిసరాలను దోచు కోవడమే ఈ వరదలకు వినాశనానికి కారణం. నాలాలు ఆటంకం లేకుండా ప్రవహించటం లేదు. నాలాలనూ, చెరువులనూ దురాక్రమించారు. మురికి మూసీని నది అనగలమా? భారీ వర్షంతో పాచిపోయిన నిల్వ నీటి వాడకంవల్ల ఆరోగ్య సమస్యలొచ్చాయి. నీటి పైప్‌లైన్ల కింద నేల కోసుకు పోయి గుంటూరులో సప్లయి అయిన మురుగునీరే తాగి అక్కడి జనం డయేరియా పాలయ్యారు. ఉప్పెనలో మునిగి ఉన్న కుటుంబాల పునరావాసం ఎప్పటికి పూర్తి చేస్తారో? హైదరాబాదులో వరదాబాధితులకు పదివేలరూపాయల చెక్కులిచ్చారట. వరదనీరు తీసేంతవరకు తమ ఇళ్లకు వెళ్లలేరు. మళ్ళీ మళ్ళీ వానలు వరదలు సద్దుమణగకుండా అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. వీధులు అంధకారంలో మగ్గుతున్నాయి.

చేసిన తప్పే చేస్తున్నారు

వరదల సమయంలో అక్రమనిర్మాణాలను కూల్చివేసిన తరువాత మళ్ళీ నిర్మాణాలు చేస్తున్నా పట్టించుకోవటంలేదు. అధికారులూ, ప్రజాప్రతినిధులూ మౌనంగా ఉంటున్నారు. ఇళ్ళు మునిగిపోయినప్పుడు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నాలాల కబ్జాలను నిర్మొహమాటంగా తొలగించాలన్నారు. కబ్జాలను కూల్చివేసి, నాలాలకు బౌండరీలు నిర్ణయించి గోడలు కట్టాలని ఆదేశించారు. స్వాతంత్ర్యం అనంతరం గోదావరికి 11 సార్లు వరదలు వచ్చాయి 1953, 1986 లలో చాలా పెద్ద వరదలు వచ్చాయి. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 20లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని సముద్రంలోకి వదిలారు. 1986 వరదల్లో సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన బ్యారేజ్ ద్వారా 35 లక్షల క్యూసెక్కుల వరద జలాలు పారి గోదావరి గట్లు తెగిపోయాయి. వందలాది గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 1986 నాటి వరదల స్థాయికి మరో 5 అడుగుల ఎత్తులో 550 కిలోమీటర్ల మేర గోదావరి ఏటి గట్ల ఆధునికీకరణ చేశారు.

మురుగు కాల్వలు కావాలి

పోలవరం ప్రాజెక్ట్ లో కట్టిన కాఫర్ డ్యాములవల్ల గోదావరి నీటి ప్రవాహం దిశ మారి వరద జలాలు ఎగబడి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రవాహం చాలా తీవ్రంగా పెరిగింది. ఇంకా కొన్ని చోట్ల ఏటిగట్లు బలహీనంగా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆరికరేవుల, కుమారదేవం , దొంగరావిపాలెం గండ్లు , తూర్పు గోదావరి జిల్లాలోని వేమగిరి, కూళ్ల, సుందరపల్లి, బొబ్బిల్లంక గండ్లు ఇలాంటివే. కృష్ణానదికి వరదలొచ్చి విజయవాడలోని వివిధ కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. చంద్రబాబు నాయుడు నదిలో నివాసం ఉన్నందుకు హైదరాబాదులో ఇల్లు కట్టుకున్నందుకు ఇక్కడి ప్రజలు కొందరు ఆక్షేపిస్తున్నారు. కృష్ణలంక తోట్లవల్లూరు వద్ద పీకల్లోతు వరదనీరు వచ్చింది. కృష్ణా తీర ప్రజలు కరకట్ట నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజికి ఎగువన ఉన్న రాజధాని నగరానికి మురుగు కాలువ కావాలి. మురుగును నదిలో కలపకూడదు. రెండు రాష్ట్రాలలో నదులకు కరకట్టలు పటిష్టం చెయ్యటంతో పాటు మురుగును నదుల్లో కలపకుండా విడిగా మురుగుకాలువలు తవ్వించటం తక్షణ అవసరం.



 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి