ఈ బ్లాగును సెర్చ్ చేయండి

25, నవంబర్ 2020, బుధవారం

అబలల రక్షణ కోసం నైతిక విద్య,మానసిక వైద్యం పెరగాలి


 
అబలల రక్షణ కోసం నైతిక విద్య,మానసిక వైద్యం పెరగాలి ( వ్యూస్ 25.11.2020)
ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారనే మన దేశంలో దేవదాసీలు జోగినులకు ఒంటరి మహిళలకు పెన్షన్, రేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు భర్త చనిపోయినట్లు గతంలో సర్టిఫికేట్ అడిగేవారు. అనేక మహిళా ఉద్యమాలు జరిగాక ఇప్పుడు అలాంటి నిర్హేతుక సర్టిఫికెట్లు అడగటంలేదు. పైగా ఒంటరి మహిళలకు కొంత భద్రత, భరణమూ దొరికాయి. మహిళల టాయ్‌లెట్‌ అవసరాలకు కొందరు దాతలు వ్యానిటీ వాన్‌లు ఏర్పాటు చేశారు. కొందరు దాతలు బహిష్టు సమయంలో స్త్రీలకు శానిటరీ న్యాప్‌కిన్లు ప్యాడ్లు పంచారు. కొందరు స్త్రీలకోసం కమ్యూనిటీ కిచెన్స్‌ కూడా నడుపుతున్నారు. కొందరు దాతలు అక్రమ రవాణా, కార్మిక బాలికల కోసం అంకురం, సఖి, రెయిన్‌బో కేంద్రాలలో వసతి గృహాలు పెట్టి వలస శ్రామికులకు భోజన, వసతి సౌకర్యాలతో పాటు ఆరోగ్య సేవలనూ అందిస్తున్నారు. చిన్నపిల్లలను పనిలో పెట్టుకోవడం, అమానుషంగా వేధించటం, అమ్మాయిల ఒంటిమీద వాతలు పెట్టటం లాంటి నేరాల నుండి కాపాడుతున్నారు. గృహహింస బాధితులకు ప్రభుత్వాస్పత్రులలో సహాయ కేంద్రాల ద్వారా ఆరోగ్య, న్యాయ, కౌన్సెలింగు సేవలు కల్పించి సహాయపడుతున్నారు.
మ‌హిళ‌ల‌కు స‌మ‌స్య‌లు త‌గ్గాలి
విడాకుల తర్వాత నిరాధార మహిళలకు సమస్యలు తగ్గాలి . ఒంటరి మహిళలు పిల్లలను పోషించుకోవాలి. ఇంటి నుంచి వెళ్ళిన మహిళ క్షేమంగా తిరిగొస్తుందన్ననమ్మకం లేదు. దారిలో ఎక్కడ ఏ అపాయం పొంచి ఉందో ఊహించలేని పరిస్థితి. వారికి రోజులు గడవటం జీవన్మరణ సమస్య. దిక్కూ మొక్కూ లేని ఒంటరి మహిళల సంక్షేమం చూడటం శ్రేయోరాజ్య బాధ్యత. ఆకలితో అలమటించే వారికి అన్నమే పరబ్రహ్మ స్వరూపం. వేలిముద్రలు, కంటిపాపలు, ఐరిస్‌, ఆధార్‌ కార్డుల ఆధారంతో దేశవ్యాప్తంగా తామెక్కడ ఉంటే అక్కడే నిత్యావసర సరుకులు తీసుకొనేలా రేషన్‌ కార్డులు ఇస్తున్నారు. ఇంటర్నెట్‌ వేగం పెంచామంటున్నారు. నేటికీ విడాకులు పొందిన మహిళలు భరణం కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. అప్పులు చేస్తున్నారు. ప్రాణాంతకమైన కూలీ పనులు చేస్తున్నారు. మనోవర్తి ఉద్దేశమే భర్త నుంచి విడివడిన భార్య మనుగడకు అవసరమైన మొత్తం అందుబాటులో వుండేలా చూడటం. మనోవర్తి కేసు తేలడానికి 20 సంవత్సరాలు పడుతోంది. భర్త నుంచి వేరుపడి విడిగా వుంటున్న భార్యకు న్యాయస్థానంలో మహిళ పిటిషన్‌ వేసిన తేదీనుంచే మనోవర్తి చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఒకే ఇంట్లో ఒక వితంతువు ఒక ఒంటరి స్త్రీ ఉంటే పింఛను రాదు. 30 ఏళ్ళు దాటిన బ్రహ్మచారిణులకు, విడాకులు పొందిన ఒంటరి మహిళలకు పేదవాళ్లైతే వారి సంక్షేమం కోసం వారికి విడిగా రేషన్ కార్డు పెన్షను ఇవ్వాలి.గంట‌కు ఇద్ద‌రిపై అత్యాచారం
ప్రతీ గంటకు ఇద్దరు మహిళలు అత్యాచారానికి గురి అవుతున్నారు. వరకట్నం కోసం మహిళలు బలి అవుతున్నారు. 70 శాతం మంది మహిళలు గృహ హింసను ఎదుర్కొంటున్నారు. మహిళలను సంభోగ వస్తువుగా, పిల్లల్ని కనే యంత్రంగా, వంటింటి కుందేలుగా, వరకట్నం తీసుకువచ్చేవారిగా చూస్తున్నారు. ఆడది అంటే చులకన. సినిమాల్లో సీరియళ్లలోనూ మహిళలపై దౌర్జన్యాలనే చూపిస్తున్నారు. అమ్మాయి తనకు దక్కలేదని కసి, పగ, ద్వేషాలు పెంచుకొంటున్నారు. అత్యాచారాలతో ఆగకుండా హత్యలు చేస్తున్నారు. వరకట్న నిషేధ చట్టం, గృహ హింస చట్టం, పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం, భ్రూణ హత్యల నియంత్రణ చట్టం, నిర్భయ చట్టం లాంటివి ఎన్ని వచ్చినా మహిళలపై నేరాలు ఆగటంలేదు. ఎంపీలు, ఎమ్మెల్యేలపైనే అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. అత్యాచారాలకు గురైన మహిళలు దిశ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు.మ‌హిళ‌ల‌కు స‌త్వ‌ర న్యాయం పొందే హ‌క్కు
మహిళలందరూ సత్వర న్యాయం పొంది ఆత్మగౌరవంతో జీవించే హక్కు ఉంది. న్యాయ స్థానాల్లో కేసులు చాలా కాలంగా పేరుకుపోయి ఉంటున్నాయి. నేరస్తులకు శిక్షలు ఎంత వేగంగా పడితే అంత మంచిది. భార్యపై భర్తకు సర్వ హక్కులు లేవు. బలవంతం చేస్తే భర్త కూడా నేరస్థుడే. అత్యాచార బాధితురాలికి సమీపంలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రి కూడా చికిత్స నిరాకరించడానికి వీలు లేదు. పోలీసులకు సమాచారం అందిస్తూనే చికిత్స ఆరంభించి, ఉచితంగా సేవలందించాలి. ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లండని తప్పించుకోవడానికి వీల్లేదు. చికిత్స నిరాకరించడం నేరం అవుతుంది. ఆత్మరక్షణార్థం చేసే హత్య నేరంగా పరిగణించరాదు. అత్యాచారానికి పాల్పడే నేరగాడిని బాధితురాలు హత్య చేస్తే దాన్ని ఆత్మ రక్షణ హక్కుగా గుర్తిస్తారు. నిర్భయ అత్యాచారం కేసులో నిందితుల్లో ఒకడు బాల నేరస్థుడు. ఆమె తీవ్రంగా గాయపడటానికి ఇతను ముఖ్య కారకుడు. భర్త దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండకుండా భార్య ఒక హక్కుగా భర్త ఇంటిలోనే ఉండొచ్చు.
ఆగ‌ని ప‌రువు హ‌త్య‌లు
కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న ప్రేమికులను పరువు హత్యలు చేస్తున్నారు. ప్రేమ వివాహాలు కొన్ని లవ్ జిహాద్‌ పాలవుతుంటే ఉత్తరాఖండ్‌లోని బీజేపీ ప్రభుత్వం అన్య మతస్తులను మనువాడితే రూ. 50 వేలు పారితోషికం ప్రకటించింది. భార్య, భర్తలలో ఎవరైనా ఒకరు షెడ్యూల్డ్ కులాలకు చెందినవారై ఉండాలని షరతు పెట్టింది. దుర్మార్గులు చంటి పిల్లల్ని కూడా అత్యాచారం చేయడానికి వెనకాడటం లేదు. చట్టాల ద్వారా ఒంటరి మహిళలకూ ఆత్మ నిర్భరం కలగాలి. కట్నం ఇచ్చిన వారికి శిక్ష నుంచి మినహాయింపు నివ్వటం, 18 ఏళ్ళు నిండిన వారి పరస్పరామోద శృంగారం నేరం కాదనటం , అగ్రవర్ణాల పురుషులు దళిత మహిళలను ముట్టుకోరని, ముట్టుకోనప్పుడు అత్యాచారం ఎలా చేస్తారనటం లాంటి కొన్నితీర్పుల్ని మహిళలకు మేలుచేసే విధంగా మెరుగుపరచుకోవాలి.
ఉన్న స‌మ‌స్య‌లు చాల‌వా?
షష్ఠి పూర్తి వయసులోనూ పాతికేళ్ల యవ్వనాన్ని సొంతం చేసుకోవచ్చని ఆక్సిజన్ చాంబర్ల ద్వారా వయసు వెనక్కి నెట్టి వృద్ధులకు తిరిగి యవ్వనం తెప్పించే ప్రయోగాలు చేస్తున్నారట ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు. వృద్ధుల క్రోమోజోముల్లో టెలోమెర్‌ తొడుగులు పూయించి జాంబీ కణాలను తగ్గించి వృద్ధాప్య ఛాయలు త్వరగా అలుముకోకుండా చేశారట. మళ్ళీఈ నవ యవ్వనం దేనికి? సమాజాన్ని సర్వమంగళం చేయడానికేనా? మహిళలపై గృహ హింస కేసులు పెరుగుతాయి. ఇప్పుడున్న సమస్యలు చాలవా ? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అబలల పట్ల మర్యాదగా నడుచుకునేలా జనానికి ఈ నవయవ్వనం నేర్పుతుందా?అని అడుగుతున్నారు. నేరగాళ్లకు శిక్షలు తప్పవు. అబలల రక్షణ కోసం నైతిక విద్య, మానసిక వైద్యం పెరగాలి అంటున్నారు.
---- నూర్ బాషా రహంతుల్లా, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ ,6301493266

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి