ఈ బ్లాగును సెర్చ్ చేయండి

17, డిసెంబర్ 2020, గురువారం

పంటలకు బీమా ఉండాలి మద్ధతుధర రావాలి !

పంటలకు బీమా ఉండాలి మద్ధతుధర రావాలి ! (వ్యూస్ 17.12.2020)
స్వామినాథన్‌ కమిటీ సిఫార్సు మేరకు ఉత్పాదక వ్యయంపై రైతన్నకు కనీసం యాభై శాతం లాభం ఉండేలా చూస్తామమన్నది భాజపా ఎన్నికల హామీ. దేశవ్యాప్తంగా వరి విస్తీర్ణం 5లక్షల హెక్టార్లు. క్వింటా వరి ఉత్పత్తి ఖర్చే రూ. 1500 .రైతుకు 50శాతం లాభదాయకత ఉండాలంటే మద్దతు ధర అంతకన్నా ఎక్కువే ఉండాలి. ఎక్కువ మద్దతు ధర ఇస్తే,సేద్య వ్యయాన్ని నియంత్రించాలన్న యత్నాలు విఫలమై మార్కెట్ అస్థిరపడుతుందని ఎన్నికలహామీ వదిలేసి ప్రభుత్వమే సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించింది!
17శాతం జ‌నాభాకు 2.4శాతం సాగు భూమి
ప్రపంచంలో 17% జనాభా ఉన్న దేశానికి కేవలం 2.4% భూమితో సాగు చేసి రైతులు తిండిపెడుతున్నారని చెప్పేదీ వాళ్ళే. ఇలాగైతే వ్యవసాయాన్ని లాభదాయకంగా మలవగలరా? రైతు కుటుంబం సంపాదన బంట్రోతు జీతంకన్నా తక్కువట. రైతులు కాడీమేడీ వదిలేస్తున్నది సేద్యం చేసి నెగ్గుకురాలేకే కదా? ధాన్యం లెవీ సేకరణ తగ్గించి భారత ఆహార సంస్థ కూడా కొనకపోతే కార్పొరేట్లు మిల్లర్లూ దళారుల దాడిలో రైతులు విలవిల్లాడక తప్పదు. సేద్యాన్ని లాభసాటిగా మారుస్తామన్న ప్రభుత్వం మద్దతు ధరలు పెంచాలి. రైతుల ద్వారానే దేశానికి ఆహార భద్రత సాధించాలి. పాడి పంట అన్నారు. ప్రజలు బ్రతకాలంటే ఇవి రెండూ అవసరమే. రైతులు పంటలను స్వేచ్ఛగా అమ్ముకుని లాభాలు సంపాదించుకోవాలనే ప్రభుత్వం పాడీ పంటలు రెంటినీ కాపాడుకుంటూ పాలనచెయ్యాలి. మన దేశం ఆహార భద్రత కోసం తిండిని మనమే పండించుకోవాలి. మన భూముల మీద ఏ పంటలు పండించాలన్న స్వేచ్ఛ మనకే ఉండాలి. ప్రభుత్వం ఆహార ధాన్యాల ధరలను కూడా నియంత్రించాలి. మార్కెట్‌ శక్తులు ప్రభుత్వ జోక్యం లేకపోతే రైతులను పిండేస్తాయి. రైతు లాభాలకోసం అంటూ రైతులతో కరోనా సంక్షోభ సమయంలో హడావుడిగా తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను రద్దు చేయాల్సిందేనంటూ రైతులు ఉద్యమించారు. దేశానికి అన్నంపెట్టే రైతన్నలు నిరాహార దీక్షకు కూర్చున్నారని అశోక్ గెహ్లాట్, కేజ్రీవాల్ లాంటి నేతలు వాపోయారు. రైతుల ఉద్యమానికి ఎందరో కళాకారులు, క్రీడాకారులు, పౌర హక్కుల కార్యకర్తలు, రిటైర్డ్ జవాన్లు, సివిల్ సర్వీసు అధికారు కూడా మద్దతు పలికారు. 78 మంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు నిరసన ప్రకటన చేశారు. రైతులతో చర్చించాలని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని కోరింది.
ఇది ధనిక రైతుల ఉద్యమం అని కొందరు విమర్శిస్తున్నారు కానీ అందులోని పేదరైతుల ఆశల్నికోరికలను కూడా చూడాలి. రైతులకు రాయితీల పందేరం అమెరికాలోనే ఎక్కువ.అలాంటి అమెరికా – ఇండియా, చైనా, బ్రెజిల్‌, ఖతర్‌, సింగపూర్‌ పేద దేశాలు కావు వాటికి రాయితీలు ఇవ్వకూడదంటే మనం ఏమన్నాము? సేద్య కార్యకలాపాలకు ఏటా లక్షా 60 వేలకోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్న అమెరికా వర్ధమాన దేశాలు తమ రైతులకు రాయితీలు ఇవ్వరాదని మెలికె పెట్టడం ఏమిటని అడగలేదా?
ఉత్ప‌త్తి వ్య‌యంలో ప‌దిశాత‌మే రాయితీ ఉండాల‌ని నిబంధ‌న‌
తిండిగింజల ఉత్పత్తి వ్యయంలో పది శాతానికి మించి సేద్య రాయితీలుగా కట్టబెట్టరాదని ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధన. పేద దేశాల్లోని తిండిగింజల రాయితీలపై ఏమిటీ నిబంధనలు? ఆహార ధాన్యాల సేకరణ పంపిణీ కేంద్ర బాధ్యత.రైతులకిస్తున్న కనీస మద్దతు ధరలు, ప్రోత్సాహక సబ్సిడీలపై పరిమితులు విధించాలా? స్వేచ్ఛా వాణిజ్యానికి అర్థం రైతుల త్యాగాలు మాత్రమేనా ? రైతాంగానికి లాభం పెంచేలా బ్యాంకు రుణాలు, సమగ్ర పంటల బీమా, శీతల గిడ్డంగులు, మార్కెటింగ్ అవకాశాలు ఇంకా పెరగాలి. అడవి, నీరు, గనులు, కిరాణా సరుకులు ,కూరగాయల వ్యాపారాన్నికూడా కార్పొరేట్లే చేస్తున్నారని రైతులు నిలదీస్తున్నారు.
సంక్షోభంలో రైతులు
సాగుభూమి ఉన్న రైతులే సేద్యం లాభసాటిగా లేక సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయం. భూమిపై ఎలాంటి హక్కులూ కౌలురైతులకు ఉండవు. కూలీలు, కౌలు రైతులే నిజమైన సాగుదారులు. కౌలుదారుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ఇన్‌పుట్‌ సబ్సిడీలు, పంట రుణాలు, విత్తనాల పర్మిట్లు, ఉచిత ఎరువులు, రుణ మాఫీ, ప్రమాద బీమా బ్యాంకుల ద్వారా అప్పులు కౌలుదారులకు కూడా రావాలి. ప్రకృతి విపత్తుల నష్టాలు తట్టుకునే శక్తి కౌలు రైతులకు ఉండదు. భూ యజమానుల పేరిట వచ్చే పరిహారం భూమి కౌలుపత్రాలు లేనందువల్ల కౌలుదారులకివ్వరు. జయతీ ఘోష్‌ కమిషన్‌ వాస్తవ కౌలు సాగుదారులకు ప్రభుత్వ రాయితీలన్నీ అందించాలని సూచించింది. కౌలు ఒప్పందం రిజిస్టరు కావాలి. లేదా స్థానిక అధికారులు లీజును ధ్రువీకరించాలి. కౌలు చట్టమైతే కార్పొరేట్‌ వ్యవసాయం దేశంలో దూరుతుందని కొందరు భయపడుతున్నారు. ఈ పత్రాలు చూపి భూమిపై కౌలుదారులు యాజమాన్య హక్కులను ఎక్కడ లేవనెత్తుతారో అని యజమానులు భయపడుతున్నారు. యజమానులు కౌలుదారులకు కూడా రక్షణ కావాలి. సేద్యం లాభసాటిగా ఉంటేనే కౌలు రైతులూ పెరుగుతారు. పంట అమ్మేశాక రైతులు బియ్యం కూడా కొనుక్కోవాల్సి వస్తోంది. ధనిక రైతులు, నాయకుల కన్నా కూలీలు కౌలు రైతుల సంఖ్యా బలం ఎక్కువ.
పేద రైతుల పోరాటాలు
1835లోనే కేరళలో మలబార్‌ మొఫ్లా పేద రైతులు, 1946 లో తెలంగాణ పేద రైతులు అక్కడి జమీందారుల దోపిడీ వ్యతిరేకంగా పోరాడారు. భూమి శిస్తు పెంచి నీలిమందు పంటను పెంచాలనే చంపారన్‌ చట్టానికి వ్యతిరేకంగా బీహార్ పేద రైతులు 1917లోనే ఉద్యమం చేశారు. 1925లో గుజరాత్‌లోని బార్దోలి ఖేడా రైతుల ఉద్యమం వల్ల భూమి శిస్తు రద్దయింది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లో కార్పొరేట్ల ప్రవేశానికి అక్కడి ఆదివాస పేద రైతులు వ్యతిరేకించారు. పశ్చిమ బెంగాల్‌లోని సింగూరు, తమిళనాడు, ఆంధ్రాలో కూడా కార్పొరేట్‌ కంపెనీల రాకను రైతులు నిరసిం చారు. అన్యాయం చేయడం నేరమైతే దానిని చూస్తూ ఊరుకోవడం కూడా నేరమేనని అంటూ రైతుల ఉద్యమానికి మద్దతుగా శిక్కు మత పెద్ద సంత్ బాబా రామ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. పంజాబ్‌ రైతుల పోరాటం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో? ధాన్యానికి ధర తగ్గిపోతే రైతులు అప్పులపాలౌతారు. అదే ధర పెరిగితే వినియోగదారులు కొనలేక ఆకలి చావులపాలౌతారు. కరోనా కాలం లోనే వరి ఎగుమతులు బాగా పెరిగాయి. నెస్టిల్, డాబర్, బ్రిటానియా వంటి కంపెనీల వ్యాపారం పెరిగింది.వలసబాట పట్టిన కూలీలు తిరిగి వచ్చారు. పంటలకు భీమా ఉండాలి. కనీస మద్దతు ధరలు దొరకాలి. రైతుల ఆత్మహత్యలు ఆగాలి. ఢిల్లీ ముట్టడి లో పంజాబ్ , ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా రైతులు పాల్గొన్నారు. మన దేశంలో 70 శాతం మంది ప్రజలు వ్యవసాయరంగంపై ఆధారపడి జీవనోపాధి వెళ్లదీస్తున్నారు. 20 కోట్ల మంది సాగుదార్లు ఉన్నారు. వీళ్ళే 130 కోట్ల మందికి అవసరమైన ఆహారాన్ని అందిస్తున్నారు.ఆనంద్‌ మిల్క్‌ యూనియన్‌ లిమిటెడ్‌(అమూల్‌) పాడి రైతుకు మంచి ధర ఇచ్చి పాలు కొనుగోలు చేస్తుంది. తనకు వచ్చే ఆదా యంలో కొంత మొత్తాన్ని బోనస్‌ రూపంలో ఏటా రైతులకు ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా పాడిరైతులకు లీటర్‌ పాలకు రూ. 5 నుంచి రూ. 7 వరకూ అదనపు లబ్ధి ప్రకటించింది. కల్తీ పాలు తగ్గుతాయని ఆశ. రైతులకోసం కూడా ఇలాంటి పనులు చెయ్యాలి. రైతు కుటుంబాలకు కార్మికులకు నెలసరి ఆదాయం పెరగాలి. రైతుల ఆదాయం కూలీలు యూరియా పురుగు మందుల ఖర్చుతో తగ్గిపోతోంది.వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరిగితే, నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధరలు నిర్ణయించుకోలేరు. వ్యవసాయం లాభసాటిగా ఉంటే పట్టణాలకు కూలీల వలసలు తగ్గుతాయి. నగరాల్లో కార్మికులకు వేతనాలూ పెరుగుతాయి. 50 శాతం మంది పిల్లలు సరైన ఆహారం లేక శారీరక ఎదుగుదల తగ్గి తమ వయసుకు తగ్గ ఎత్తు లేరు. ఒకవైపు రైతుల ఆదాయాలు పడిపోతుంటే కొత్త బిలియనీర్లు పుట్టుకొస్తున్నారు. ఎకరం భూమి కూడా లేని నిరుపేద రైతుల సంఖ్యే భూములున్న రైతుల సంఖ్య కన్నా ఎక్కువ. వ్యవసాయ బిల్లుల్లో భూమిలేని వ్యవసాయ కార్మికులు, భూమిలేని రైతుల ప్రస్తావన లేదు.మధ్య దళారీలను ఎలా తొలగిస్తారో చెప్పలేదు. రైతుల పంటలకు కనీస మద్దతు ధరకు గ్యారంటీ ఇవ్వలేదు. కనీస మద్దతు ధరకు గ్యారంటీ ఇవ్వాలని రైతులు హామీ కోరారు. అదితప్ప ఏదైనా ఇస్తామని ప్రభుత్వం అంటోంది. గ్రామీణ సంత మార్కెట్లను మండీలను ప్రైవేటు గుత్త వ్యాపార వర్గాల చేతుల్లో పెట్టరాదని, ప్రభుత్వ ఆహార సంస్థే నేరుగా రైతుల నుంచి ధాన్యోత్పత్తులను కొనుగోలు చేయాలని రైతులు కోరుకుంటున్నారు. స్వామినాథన్‌ నివేదిక సిఫారసులను అమలు చేయాలని రైతులు కోరారు. పారిశ్రామికవేత్తల లాభాలకు అడ్డుగోడలన్నింటినీ తొలగించడానికే వ్యవసాయ సంస్కరణలన్నారు మోదీ.ఈ చట్టం కింద రైతులు న్యాయ పరమైన ఫిర్యాదు, దావాలు చేయలేరు. కొంతమంది ఈ చట్టాలు చాలా అవసరం, ఆచరించదగ్గవని రైతులను రాక్షసులుగా చిత్రిస్తున్నారు. వ్యవసాయమే దేశ నిజమైన సంపద. ప్రభుత్వ పథకాలు చిట్టచివరి వారికి కూడా చేరాలి. విత్తులు నాటే సమయం నుంచే పంటకోసం రైతులు భయంగా బ్రతకాల్సి వస్తుంది. కార్పొరేట్ వ్యవసాయం లోని సహకార మార్కెటింగ్‌ తో రైతులకు మేలు జరగటమే కాకుండా ధరల స్థిరీకరణకు కూడా తోడ్బడుతుందని పంటలను నిల్వచేసేందుకు కోల్డ్ స్టోరేజ్ గిడ్డంగులు ఏర్పరుస్తారని వ్యవసాయ టెక్నాలజీ అభివృద్ధి వల్ల వ్యవసాయ కూలీల కొరత తగ్గుతుందని కొందరు వాదిస్తున్నారు. పంజాబ్‌ అసలెన్నడూ పీఎంఎఫ్‌బీవై అమలు చేయలేదు.బీమా పథకాలకోసం రాష్ట్రాలు తమ వంతు వాటా ప్రీమియం సకాలంలో చెల్లించడంలేదు. అందువలన రైతులు బీమా పరిహారం పొందలేకపోతున్నారు.సకాలంలో ప్రీమియం కట్టకపోతే బీమా సంస్థలు కొర్రీలు వేస్తాయి.కేంద్ర పథకమే రైతులకు బీమా ఇవ్వలేక కంపెనీలకే అధిక లబ్ధి పొందితే ఎలా?పేదరికంపై పోరాడుతున్న కర్షకులకు కేంద్రం,రాష్ట్రాలు మద్దతు అందించాలి. ఎంపిక చేసిన తొమ్మిది రాష్ట్రాల్లోనే గాక దేశవ్యాప్తంగా పంటల బీమా పథకం పక్కాగా అమలయ్యేలా చూడాలి.దేశవ్యాప్తంగా రైతుల్లో పంటల బీమా పథకంపై అవగాహన పెంచాలి.
పంచాయ‌తీల ద్వారా బీమా రాత‌కోత‌ల ప‌ని
పశ్చిమ బెంగాల్ లో గ్రామ పంచాయతీల ద్వారా బీమా రాతకోతల పని తగ్గించారు. పంట పశు నష్ట పరిహారం ఆరు వారాల్లో చెల్లించారు. తుపానులు, కరవు, అతివృష్టి,అనావృష్టి,నుండి కాపాడేందుకు పంటల బీమా రైతులందరికీ అవసరం.పంటల బీమా సరిగా అమలు చేయకపోతే, రైతులు చితికిపోతారు. పంటల బీమా పధకంలో రిస్కులు ఎక్కువని తమకు లాభసాటి కాదని బీమా సంస్థలంటున్నాయి. రాష్ట్రాలు సకాలంలో ప్రీమియం చెల్లించకపోతే నష్టదాయకమని చెబుతున్నాయి. బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లించడం దానం కాదు. అది అన్నదాతల శ్రమ తిన్నందుకు రైతుల పక్షాన చెల్లించే కృతజ్ఞ‌త. పంజాబ్‌ లో వ్యవసాయ బిల్లులు రైతుల ఆదాయాన్ని పెంచి వ్యవసాయ–పర్యాటకాన్ని ప్రోత్సహించేలా బాగున్నాయని రైతులు అంటున్నారు. అతివృష్టి,అనావృష్టి, వరదలు, కరువులు , చీడలు ఇలా ఎన్నో నష్టాలు వ్యవసాయాన్ని ఎప్పుడూ కమ్ముకొని ఉంటాయి. పంట వస్తుందో రాదో గ్యారంటీ లేని పరిస్థితుల్లో రైతులున్నారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన బీమా ధీమానిస్తూ పంట నష్టాల నుంచి రైతుకు కొంత రక్షణ నిస్తుంది. కొద్దిపాటి ప్రీమియంతో రాయితీలు కల్పిస్తుంది. బీమా కేంద్రం, రాష్ట్రం చెరిసగం భరించాలి. గ్రామ పంచాయతీ యూనిట్‌.అయిదు కోట్ల రైతులు పీఎంఎఫ్‌బీవై కింద నమోదయ్యారు.బీమా సంస్థలు ఎక్కువ ప్రీమియం డిమాండు చేస్తున్నాయని చెబుతూ గుజరాత్‌ తప్పుకుంది.సీఎం విజయ్‌ రూపాని ముఖ్యమంత్రి కిసాన్‌ సహాయ్‌ యోజన పథకాన్ని పైసా ప్రీమియం వసూలు చేయకుండా రాష్ట్ర నిధులతో ఏర్పాటు చేశారు.జగన్ ప్రభుత్వం కూడా ఉచిత పంటలభీమా రైతుభరోసా జలకళ ఇళ్ళు లాంటి పధకాలు తేవటం హర్షదాయకం.ప్రజలకు రైతులకు మేలుచేసే మంచి పధకాలను ఎవరూ వ్యతిరేకించరు.స్వాగతిస్తారు.
--- నూర్ బాషా రహంతుల్లా విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి