ఈ బ్లాగును సెర్చ్ చేయండి

19, డిసెంబర్ 2020, శనివారం

మూడు రాజ‌ధానులు త‌ర‌వాత‌ - ముందు అమరావతిలో కట్టడాలు పూర్తిచేయాలి

అమరావతిలో కట్టడాలు పూర్తిచేయాలి (వ్యూస్ 19.12.2020)

మూడు రాజ‌ధానులు త‌ర‌వాత‌ - ముందు అమరావతిలో కట్టడాలు పూర్తిచేయాలి

వినియోగంలోకి తేవాలి
కేంద్ర జోక్యం కోరుతున్న రైతులు
పొల్లు పోయిన ప్ర‌ధాని మాట‌
మూడు రాజధానులపై అసెంబ్లీలో తీర్మానం చేసి, అమరావతి రైతుల ఉద్యమానికి సంవత్సరం నిండింది. మూడు రాజధానులు, సీఆర్ డీఏ రద్దు బిల్లులపై హైకోర్టు యధాతదస్థితిని విధించింది. ఒక్క రాజధానినే కట్టలేనప్పుడు మూడు రాజధానులు ఎందుకు? అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని భూములిచ్చిన రైతులు వేడుకొంటున్నారు. కేంద్రాన్ని జోక్యం చేసుకోమంటున్నారు. ప్రజలు మూడు ప్రాంతాలలో కూడా మాకేంటి అని అడుగుతున్నారు. జోనులుపెట్టి అమరావతితోపాటు మిగతా ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేయాలని ఎమ్మేల్యేలు కోరుతున్నారు. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణం బాధ్యత కేంద్రానిదే. రాజధాని శంకుస్థాపనకు మోడీ వచ్చారు. ఢిల్లీని తలదన్నిన రాజధానిని అమరావతిలో నిర్మిస్తామని చెప్పారు. ఆరున్నర సంవత్సరాల నుండి కేంద్రంలో బిజెపినే అధికారంలో ఉన్నారాజధానితో తమకు సంబంధమే లేదనీ రాజధాని రాష్ట్ర వ్యవహారమంటూ హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేసింది. కేంద్ర బడ్జెట్లో రాజధానికి, పోలవరం, కడప ఉక్కుకు నిధులు నిండుగా ఇవ్వలేదు. ప్రత్యేక హోదా, విజయవాడ మెట్రో, విశాఖ రైల్వే జోన్ లు రాలేదు. 2024లో రాష్ట్రంలో అధికారం లోకి వస్తే రాజధానిని 5 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తారట. మూడు రాజధానులు కాకపోతే 30 రాజధానులు ఉంటాయని ఒకరు, మూడు రాజధానులు కాదు మూడు సచివాలయాలు ఉండాలని మరొకరు అంటున్నారు. రాజధానిని వెలగపూడిలోనే ఉంచి కర్నూలు విశాఖల్లో ప్రాంతీయ సచివాలయాలు, హైకోర్టు బెంచీలు, అసెంబ్లీ సమావేశాలు కూడా జరపాలని కొందరు కోరుతున్నారు. దేశంలో వంద రాష్ట్రాలు ఉండాలని బిజెపి కోరిక.

 
రాజ‌ధాని త‌ర‌లింపున‌కు డ‌బ్బులేవి?
అన్నీ ఒకే చోట కేంద్రీకరించాలనే చంద్రబాబు సింగపూర్ మోడల్‌ భూ సమీకరణ రాజధాని రాలేదు. అలాగే రాజధాని స్థలాల మార్పు తరలింపుకు డబ్బుల్లేవు. రాష్ట్రానికి అమరావతి సెంటర్లో సమ దూరంలో ఉండటమే ఆస్థలానికి ఒక ప్లస్ పాయింట్.రాజధాని ఒకే చోట ఉన్నా అభివృద్ధి రాష్ట్రమంతా జరగాలి. విద్యా, వైద్య సంస్థలు, పరిశ్రమలు అన్ని ప్రాంతాలకు విస్తరించాలి. అదే నిజమైన వికేంద్రీకరణ. ఇప్పటిదాకా అమరావతిలో కట్టిన కట్టడాలు పూర్తిచేసి వాడుకోవాలి. రాజధానికి 40 వేల ఎకరాల పూలింగ్‌ అక్కరలేదు. ప్రపంచ స్థాయి రాజధాని అక్కరలేదు. ఒక పక్క జాతీయ రహదారి, మరోపక్క రైల్వేస్టేషన్ రెండూ ఉన్న మంగళగిరిలో వెయ్యి ఎకరాల స్థలం చాలు. తెనాలి, గుంటూరు, విజయవాడ అనే మూడు రైల్వే జంక్షన్ల మధ్య మంగళగిరి ఉంటుంది. మొదట మంగళగిరి క్రికెట్ స్టేడియం ప్రక్కనే సచివాలయ నిర్మాణానికి జీవో ఇచ్చి సన్నాహాలు చేసి తరువాత వెలగపూడికి అనవసరంగా మార్చారు. భౌగోళికంగా ఉండే సెంటర్ ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గదు. విజయవాడ అలాంటి ప్రాధాన్యతగల సెంటరే.

 
సాష్టాంగ‌ప‌డిన బాబు విమ‌ర్శ‌లు
ఉద్దండరాయునిపాలెం శంకు స్థాపన ప్రదేశంలో సాంష్టాంగపడిన చంద్రబాబు ఇది దేవతల భూమి అన్నారు. విజ్ఞత ఉన్నవారెవరైనా రాష్ట్రానికి నడిబొడ్డున, అందరికీ సమాన దూరంలో ఉన్న అమరావతినే రాజధానిగా ఉండాలనుకుంటారని అన్నారు. మూడు రాజధానులకు రిఫరెండంలో ప్రజలు ఒప్పుకుంటే రాజకీయాలకు గుడ్ బై చెబుతానన్నారు. తిరుపతి ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకోవాలని మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు తలపెట్టిన అమరావతి రాజధాని కాలేకపోయింది. అమరావతి రాజధాని అయితే తమబిడ్డలు కోటీశ్వరులౌతారని స్టానిక రైతులు ఆశపడ్డారు. జగన్ ఉద్దేశించిన మూడు రాజధానులు వద్దని ఆప్రాంత రైతులు సంవత్సరం పాటు ఉద్యమం చేశారు. అప్పులతో ఏర్పడ్డ రాష్ట్రానికి గుంటూరు విజయవాడ మధ్య నాగార్జున యూనివర్శిటీ దగ్గర వెయ్యి ఎకరాల భూమి కొని సచివాలయం లాంటి ఆఫీసులు క్వార్టర్లు కట్టి ముగించమని ఆనాడే వడ్డే శోభనాద్రీశ్వరరావు,యలమంచలి శివాజీ లాంటి నేతలు సలహా ఇచ్చారు. ఒకేచోట ఇన్నివేల ఎకరాలు అనవసరమని కొందరు విమర్శించారు. రాజధాని నిర్మాణానికి కేంద్రంనుండి ఎంత సహాయం చేస్తారో తెలియకుండానే ముందుకెళ్ళారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పరిగణిస్తామని చట్టంలో చెప్పినా దానిని పూర్తి చేయటానికి సహాయం కోసం ఇప్పటికీ జగన్ అడుగుతూనే ఉన్నారు. శివరామకృష్ణన్ కమిటీకి ప్రత్యామ్నాయంగా నియమించిన నారాయణ కమిటీ సూచన ప్రకారం కొత్త రాజధాని స్థలం ఎంపిక చేశారు. శంకుస్థాపనకు వచ్చిన మోడీ అడ్డుచెప్పకపోవటం, శాసనసభలో జగన్ కూడా సరే అనటంతో వేగంగా ముందుకెళ్లారు.

 
అమ‌రావ‌తికి మురుగు కాల్వ కూడా లేదు
అమరావతి రాజధానికి మూసీలాంటి మురుగుకాలవ కూడా లేదు.ఎక్కడి మురుగు అక్కడే భూమిలో కలవాలట. వరదల పాలైన హైదరాబాద్ ఎంత మురికి మహానగరమో తెలిసిందికదా? హైదరాబాదు మహానగరం లాగా పెట్టుబడి అంతా ఒకేచోట పొగుపడకుండా జిల్లాలు జోనుల మధ్య పంచాలి. ప్రజలు ఎక్కడికక్కడే మాప్రాంతం రాజధానికావాలి ,ప్రాంతీయ కేంద్రం కావాలి అని పోటీ పడుతున్నారు. విజయవాడ, రాజమండ్రి, తిరుపతి జిల్లా కేంద్రాలు కాకపోయినా ప్రజల వలసలతో గొప్పనగరాలు అయ్యాయి. నగరాలు ఏవీ ఒక్కసారి ఏర్పడవు. ఏళ్ల తరబడి పోగుబడిన అభివృద్ధే మహా నగరం. ఇప్పటికే లక్షల జనాభాతో పెద్దదయిన సముద్ర తీర నగరం విశాఖ. మూడు పక్కలే భూమి ఉన్న నగరంపై మరింత జనభారాన్ని మోపటం అనవసరం. ఎంత పెద్దనగరమైనా అది రైలు జంక్షను కాదు. రాష్ట్రానికి ఉత్తరాన ఒక అంచులో ఉంది. కర్నూలు కర్ణాటక అంచులో ఉంది. ఉత్తరాంధ్ర మధ్యస్థానం విజయనగరం, రాయలసీమ మధ్యస్థానం కడప. ముందు వీటిని రైల్వే జంక్షన్లుగా అభివృద్ధి చెయ్యాలి. భౌగోళికంగా మధ్యలో ఉండటం కూడా రాజధాని కేంద్రానికి మంచి అర్హతే. నాలాలు మార్చటానికైనా డబ్బులేదు. ఆనాడే అమరావతిలో కట్టిన భవనాలు వృధా అన్నారు కేసీఆర్. కట్టుబట్టలతో బయటికొచ్చిన వారు ఎవరైనా పొదుపు పాటిస్తారు. రాజధాని నగరానికి అవసరమైన భూములు కొనటం భవనాలు కట్టడంలో తమ స్తోమతను బట్టి ప్రణాళికలు కుదించుకుంటారు. వాడుకోకుండా ఇలా రైతుల భూములకు కౌలు ఎన్నేళ్లు కడతారు? రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎప్పటికి ఇస్తారు ? సమీకరించిన భూమిలో పెద్ద పెద్ద విద్యాసంస్థలకూ, వ్యాపారసంస్థలకూ మాత్రమే భూమి ఇచ్చారు.

 
అమ‌రావ‌తి కాద‌ని హైద‌రాబాద్‌లో బాబు ఇల్లు
సింగపూర్ మోడల్ అని తాత్కాలిక నిర్మాణాలు చేశారు. తాడేపల్లి లో జగన్ తన నివాసాన్ని కట్టుకుంటే చంద్రబాబు హైదరాబాదులో ఇల్లు కట్టుకున్నారు. రాజధాని ఇన్నిరూపాలు సంతరించుకుంటుందని జగన్ మూడురాజధానులు అంటారని ఎవరూ ఊహించలేదు.వెలగపూడి నుంచి హైకోర్టు, సచివాలయం తరలిపోతాయంటే స్థానికులు తట్టుకోలేకపోతున్నారు. కోటీశ్వరులమౌతామన్నరైతుల ఆశలు అడియాసలు అయ్యాయి. మూడు ప్రాంతాల వారికీ వారి వారి ప్రాంతాలు అభివృద్ధి అవుతాయన్న కోర్కెలు పెరిగాయి. విజయవాడ రాష్ట్రానికి నడిమద్యలో ఉన్నఅతి పెద్ద రైల్వే జంక్షన్. జిల్లా కేంద్రం కూడా కాలేకపోవటం లాంటి చరిత్ర చేసిన గాయాలను నెమరువేసుకుంటూ మౌనం దాల్చింది. రాజధాని అటు అమరావతీ కాదు ఇటు విజయవాడా కాదు. మధ్యలో వెలగపూడి. సచివాలయం, హైకోర్టు పోయి అసెంబ్లీ మాత్రమే నిలుస్తుందట.మొదట్లోనే ఈ గొడవలు జరిగితే ఇన్ని వేల ఎకరాల భూ సమీకరణ జరిగేది కాదు. శంకుస్థాపనకు ప్రధాని మోడీ స్వయంగా వచ్చిన అమరావతిని అసెంబ్లీకి మాత్రమే కుదిస్తారా అంటున్నారు. ఆనాటి నాయకుల వాగ్దానాలు కన్నకలలు నెరవేరక రైతులు పదేపదే కోర్టుకెక్కుతున్నారు. భూసమీకరణలో దాఖలైన చాలా కేసులు నేటికీ పెండింగ్ లో ఉన్నాయి. జగన్ రైతు నాయకులతో చర్చించి ఒక మధ్యే మార్గాన్ని వెల్లడించి నచ్చజెప్పటంలేదు.
వ‌చ్చేది త‌మ ప్ర‌భుత్వ‌మే అంటున్న సోము
సోము వీర్రాజు మాత్రం 2022 లోనే జమిలి ఎన్నికలు వచ్చినా లేకపోతే 2024 ఎన్నికల్లోనైనా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం వస్తుందని రాజధానిని అమరావతిలోనే ఉంచుతుందని చెబుతున్నారు. ఏడాది గడిచినా పెయిడ్ ఆర్టిస్టులతో రైతుల ఉద్యమం చేయిస్తున్నారని అంటున్నారు.ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనీ, అయినవారికి భూములు తక్కువ ధరకే కట్టబెట్టారనీ ఇప్పటికీ ఆరోపణలు చేస్తున్నారు. అక్రమాలు చేసిన దోషులను పట్టుకొని శిక్షించమని, కట్టిన భవనాలను కూలగొట్టవద్దనీ, రాజధానిని తరలించటానికి ముందే కట్టిన భవనాలను ఏం చేస్తారో చెప్పమనీ తెలుగుదేశం ,బీజేపీ, జనసేన, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం లు కోరుతున్నాయి. జోన్లు ఏర్పడ్డాకే రాజధానుల తరలింపు జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి జిల్లాలకంటే పెద్దవైన జోనుల కార్యాలయాలు ఏర్పాటు చేయవచ్చు. జోనల్ ఆఫీసులంటే సచివాలయానికి జిల్లాలకు మధ్య బ్రాంచీల వంటివి, హైకోర్టుకు బెంచీలలాంటివి. జోనల్ అధికారికి సచివాలయ స్థాయి అధికారాలు ఉంటాయి. జోనల్ కార్యాలయాలతో సచివాలయ స్థాయి సేవలు కూడా అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తాయి. హైకోర్టు, రాజధానుల తరలింపున‌కు సుప్రీం కోర్టు పార్లమెంటు ఒప్పుకోవాలి. జోనుల వల్ల అందరూ విశాఖకో కర్నూలుకో అమరావతికో ప్రయాణం కట్టనక్కరలేదు. ఎవరి జోన్ పరిధిలో వారికి పనులు జరుగుతాయి. నాలుగు జోనుల్లో కలక్టర్ల కంటే పైహోదా కలిగిన నలుగురు కమీషనర్లు రాజధానికి కలక్టర్లకు మధ్య వారధుల్లాగా పనిచేస్తారు.

 
3 రాజ‌ధానుల కంటే జోన్ కార్యాల‌యాలు చ‌వ‌క‌
మూడు రాజధాని నగరాలను కట్టడం కంటే ఒక్కచోటే నవనగరాలనిర్మాణం కంటే నాలుగు చోట్ల ప్రాంతీయ కార్యాలయాలు పెట్టటం చవకైన పని, అన్నిప్రాంతాలకూ మరింత ప్రయోజనకరం. జోనులు ఏర్పడితే రాజధానుల ప్రాధాన్యత చాలావరకు తగ్గిపోతుంది.ప్రజలు అందరూ రాజధాని సెక్రటేరియట్ కు వెళ్లాల్సిన అవసరం,ప్రయాణ భారం తగ్గుతాయి.అన్ని శాఖల్లో 95 శాతం పనులు జోనుల్లోనే పూర్తవుతాయి.జిల్లా కేంద్రాలు జిల్లా మధ్యలో,జోనుల కేంద్రాలు జోన్ మధ్యలో ఉంటే మంచిది. శివరామకృష్ణ , జి.ఎన్.రావు కమిటీలు కూడా జిల్లాల మధ్యలో దగ్గరగా జోనులు ఏర్పాటు చెయ్యమని సిఫారసు చేశాయి.హైకోర్టుకు బెంచీలు పెట్టమన్నాయి. విశాఖలోసచివాలయం పెడితే రాయలసీమ జిల్లాలకు దూరమని, కర్నూలులో హైకోర్టు పెడితే ఉత్తరాంధ్రకు దూరమని అక్కడి ప్రజలు తమ బాధను వ్యక్తంచేస్తున్నారు.మూడుప్రాంతాలలో సచివాలయానికి బ్రాంచీలు పెట్టవచ్చు. తమకు తమ ప్రాంతంలోనే పనులు జరగటం వల్ల మూడుప్రాంతాల ప్రజలు సంతృప్తి పడతారు. పనులు త్వరగా జరగాలి అంటే పని విభజన బాధ్యతల విభజన తప్పదు. రాష్ట్రానికి విజయవాడ సెంటర్ కాబట్టే అమరావతిని ఎంపిక చేశారు. కట్టిన భవనాలను కూలగొట్టకుండా ప్రభుత్వం వినియోగం లోకి తేవాలి. భూములిచ్చిన రైతులు నష్టపోకుండా అగ్రిమెంటు ప్రకారం పరిహారం చెల్లించాలి. ముందుగా అమరావతిలో కట్టిన కట్టడాలు వృధా కాకుండా పూర్తిచేసి వాడుకోవాలి.

- (నూర్‌బాషా ర‌హ్మ‌తుల్లా, ఏపీ రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి