ఈ బ్లాగును సెర్చ్ చేయండి

8, డిసెంబర్ 2020, మంగళవారం

కంటి చూపును కాపాడుకోవాలి!

 

కంటి చూపును కాపాడుకోవాలి!

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు.కన్ను తెరిస్తే జననం! కన్ను మూస్తే మరణం!రెప్పపాటే గదా జీవితం? అన్నారు. నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి అన్నాడు ఆత్రేయ.ఎలుగుబంటి ఒక కంటితోనే నిద్రపోతుందట.రాజు కూడా తన కంటి చూపును బాగు చేసుకుంటూ ప్రజలను కంటిపాపల్లాగా చూసుకుంటూ అందరికీ బాగుండాలన్నారు. సృష్టిని చూడాలంటే కంటిచూపే గదా ముఖ్యం? అయితే ఈనాడు ప్రజల  కంటిచూపు ఆపదలో పడింది. చీకట్లో మగ్గుతున్నవారెందరో కంటిచూపు కోసం ఎదురుచూస్తున్నారు. వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్ల మూలంగా ప్రపంచ జనాభాలో సగం మందికి మయోపియా అనే హ్రస్వదృష్టి సోకుతుందట. వయసు పెరిగేకొద్దీ చూపు మసకబారుతుంది.దృష్టి సన్నగిల్లి , ఒకే వస్తువు రెండుగా కనిపించడం, మసగ్గా కనిపించడం, కళ్ల ముందు మెరుపులు, ఏవేవో మెరుపు తీగలు తేలుతున్నట్లు కనిపించడంచూసే దృశ్యం మధ్యలో నల్లమచ్చ కనిపించడం ,కొంత భాగం కనపడకుండా పోవడం  లాంటి సమస్యలు వస్తున్నాయి. శుక్లాలు, నీటికాసులు(గ్లకోమా),కార్నియాఅంధత్వం,మెల్లకన్ను,రెటినోపతి, లాంటి దృష్టి లోపాలను మంచి ఆహారము,చికిత్సలతో తొలగిస్తున్నారు.కళ్లలోని కార్నియా దెబ్బతినకుండా  కాటరాక్టు రాకుండా కళ్లు ఆరోగ్యంగా, అందంగా ఉండటం  కోసం ఒమేగా-3 నిచ్చే గుడ్లు,చేపలు తినమంటున్నారు.అలాగే విటమిన్‌-,సి బీటాకెరోటిన్‌ లు కావాలంటే మొక్కజొన్న,పాలకూర, కేరట్లు ,సిట్రస్‌ ఫ్రూట్స్‌ బాగా తినమంటున్నారు. పొగతాగడం మానేయ్యమంటున్నారు.మరణించిన తర్వాత నేత్రాలు వృథాగా పోకుండా ఉండేందుకు అందరూ నేత్రదానం చేయమంటున్నారు.ఒకరుదానం చేయడంద్వారా ఇద్దరికి కంటిచూపు వస్తుంద. క్యాటరాక్ట్ (తెల్ల ముత్యం) వల్ల లెన్స్ తన పారదర్శకతను కోల్పోతుంది.శుక్లాలు , క్యాటరాక్టులు 65 ఏళ్ల వయసు దాటాక ఎలాగైనా వస్తాయి. మధుమేహం మందులను ఎక్కువగా సేవించడం వల్ల కూడా శుక్లాలు వస్తున్నాయని అంటున్నారు. చక్కెర నోటికి తీపి అయినా కళ్లకు మాత్రం చేదే.కన్నుకు డయాబెటిస్‌ వల్ల రెటినోపతి అనే సమస్య రావచ్చు.రక్తనాళాల చివర్ల (క్యాపిల్లరీస్) లో అడ్డంకులు ఏర్పడితే కంటికి రక్తం అందక చూపు చచ్చుబడుతుంది.అందుకే డయాబెటిస్ ఉన్నవారు తరచూ కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. డయాబెటిస్‌ను, రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి.కొందరికి పుట్టుకతోనే కంజెనిటల్ క్యాటరాక్ట్ లు వస్తున్నాయి. కంటిలోపలే మబ్బుకమ్మిన కటకాన్ని తీసేసి ఒక కృత్రిమమైన కటకాన్ని అమర్చుతారు. శస్ర్ర చికిత్స జరిగిన తరువాత మీ చూపు మెరుగవుతుంది.అద్దాల అవసరం కూడా వుండకపోవచ్చు.క్యాటరాక్టు ఒకే కంటికి రావచ్చు లేక రెండు కళ్లకి రావచ్చు,అంతేకాని అది ఒక కంటిలోనుండి  మరో కంటికి వ్యాపించదు.మనదేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు చొప్పున పిల్లలు అంధత్వానికి గురవుతున్నారు.శుక్లాలతో పుట్టిన పిల్లలకు శస్త్ర చికిత్స వెంటనే చేయించాలి. కార్నియా లోపంతో గుడ్డివాళ్ళయిన పిల్లలకు కార్నియా మార్పిడి చికిత్సతో కొంత మేరకైనా వారికి తిరిగి చూపు అందించవచ్చు.పిల్లల్లో కార్నియా సమస్యతో వచ్చే అంధత్వానికి ప్రతి ఆరుమాసాలకు ఒకసారి 200000 ఐయు విటమిన్-ఏ ఇప్పించాలి.  విటమిన్-ఏ లోపం వల్ల ముందుగా రేచీకటి సమస్య వస్తుంది. పిల్లలు రాత్రిపూట తడబడుతున్నా, పదే పదే వస్తువులను గమనించక పడదోస్తున్నా అది రేచీకటి సమస్యగా గుర్తించాలి.ఆరు మాసాల వయసు నుంచే పిల్లలు తల్లిని గుర్తు పడుతుంటారు. పరిశీలనగా అన్ని వైపులా చూస్తారు. తరుచూ కనురెప్పలు కొట్టుకొంటూ , కనుగుడ్లు అదేపనిగా తిప్పుతూ ఉన్నా, రంగు వస్తువులను చూపినా వాటిని చూడకుండా మరోవైపు చూస్తున్నా , కళ్లు మరీ పెద్దవిగా ఉన్నా కంటి సమస్యలు ఉన్నట్లు అనుమానించాలి. మెల్ల ఉన్నప్పుడు రెండు కళ్లనుంచి మెదడుకు చేరే ప్రతిబింబాలలో మెదడు స్పష్టంగా ఉన్న ప్రతిబింబాన్ని పరిగణనలోకి తీసుకుని మసకగా ఉండే రెండవ ప్రతిబింబాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. కాలం గడిచేకొద్దీ మెల్లకంటి చూపు మరింత తగ్గి చివరికి అంధత్వానికి దారి తీస్తుంది. శస్త్ర చికిత్స ద్వారా కంటి కండరాలను సరిచేసి మెల్లను నివారిస్తారు. కంటిలో ఉండే ద్రవాలతో నరం మీద ఒత్తిడి పెరిగి గ్లకోమా వచ్చి కంటిచూపు కోల్పోతే యాంటీ గ్లకోమా చుక్కల మందు జీవితకాలం వాడాలి. ఆహారంలో విటమిన్-ఏ పాళ్లు పెంచడం వల్ల రేచీకటి (నైట్ బ్లైండ్‌నెస్)తగ్గుతుంది. పక్షవాతం (స్ట్రోక్ ) వల్ల మెదడు లోని భాగాలు రక్తసరఫరా తగ్గి చచ్చుబడిపోతాయి. మెదడులో వచ్చే గడ్డలు (బ్రెయిన్ ట్యూమర్స్ ) చూపును మెదడుకు చేరవేసే ఆప్టిక్ నర్వ్ అనే నరాన్ని నొక్కివేయడం వల్ల కంటికి ఎదురుగా దృశ్యం సగమే కనిపించవచ్చు. లేజర్ చికిత్స, శస్త్రచికిత్సలతో కాంతినరాలపై వత్తిడిని అదుపులోకి తెస్తారు. విడిపోయిన రెండు రెటీనా పొరలను కలుపుతారు.కొందరిలో కనుగుడ్లు ముందుకు పొడుచుకు వచ్చినట్లుగా కనిపిస్తుంటాయి. థైరాయిడ్ హార్మోన్ల సమతౌలత్య నెలకొనేలా హార్మోన్ చికిత్స తీసుకోవాలి. కంటి నల్ల గుడ్డు ప్రాంతం ఉబ్బెత్తుగా ఉంటే కాంటాక్ట్ లెన్స్‌లతో చికిత్స చేయవచ్చు. డయాబెటిస్‌ నివారణకు ఫ్రెడరిక్‌ బాంటింగ్‌ ఇన్సులిన్‌ ను, అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ పెన్సిలిన్‌ని, జోనస్‌ సాక్‌  పోలియో టీకాను, ఎడ్వర్డ్‌ జెన్నర్‌ మశూచి వ్యాక్సిన్‌ ను కనుగొన్నారు.  వ్యాక్సిన్లు, యాంటిబయాటిక్‌ల వల్ల మానవాళి అనేక మహమ్మారులను ఎదుర్కొంది.త్వరలో కరోనాకు వ్యాక్సిన్‌ రావచ్చు.  వైద్యులు శాస్త్రవేత్తల కొత్త అన్వేషణలతో ప్రజల కంటి చూపును పదిలంగా కాపాడుకోవాలి!

---నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ 6301493266



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి