ఈ బ్లాగును సెర్చ్ చేయండి

10, నవంబర్ 2013, ఆదివారం

కొత్త రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటు ప్రగతికి తోడ్పాటు



కొత్త రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటు ప్రగతికి తోడ్పాటు
నూర్ బాషా రహంతుల్లా 9948878833

కొత్త రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటు ప్రతిపాదనకు ఎప్పటికప్పు డు బ్రేకులు పడుతున్నాయి. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి, నేతల ఒత్తిళ్ళు ఈ ప్రతిపాదనను కార్యరూపం దాల్చకుండా మోకాలడ్డు తున్నాయి. ఇద్దరు, ముగ్గురు మంత్రులున్న కొన్ని జిల్లాల్లో అక్కడ కొత్త రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటులో తనదంటే తన మాట నెగ్గాలనే ఆదిపత్యపోరు అసలుకే ఎసరు తెస్తోంది. దానికితోడు ప్రత్యేక సమైక్య ఉద్యమాలు; అన్నీ  వెరసి కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కాకుండా రాజకీయ గ్రహణం పట్టింది.

మండలాల ఏర్పాటుతో మొదలు  
57 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మండలాల ఏర్పాటు మహా గొప్ప పాలనా సంస్కరణ.క్షేత్రస్థాయిలో ఇదే అతి గొప్ప వికేంద్రీకరణ. పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రజలంతా హర్షించిన సంస్కరణ . అలాగే కొత్త రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని మన నేతలు కసరత్తులు  చేసారు కానీ  శాస్త్రీయ పద్ధతిలో పూర్తిగా అమలు కాలేదు. చేయగలిగితే ప్రజలకు అది కూడా గొప్ప వరం అవుతుంది. కొత్త రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటు వలన ప్రజలకు ప్రయాస తగ్గి, మెరుగైన పాలన అందుతుంది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం, ఆరు జోనుల్లోను జోనల్ రెవిన్యూ కార్యాలయాలు తెరవటం వల్ల రాష్ట్ర ప్రజలకు ఎంతో వెసులుబాటు కలుగుతుంది. రాజధాని నగరం మీద పెనుభారం తగ్గుతుంది. ప్రజలకు ఖర్చు తగ్గుతుంది. పేదవారికి పాలనా సదుపాయాలు చేరువవుతాయి.
కొత్త రెవిన్యూ డివిజన్ల కోసం ప్రతిపాదనలు
కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్,లేదా హుస్నాబాద్, ఖమ్మం జిల్లా లో కల్లూరు లేదా సత్తుపల్లి, కడప జిల్లాలో బద్వేలు లేదా పులివెందుల,గుంటూరు జిల్లాలో బాపట్ల, ప్రకాశం జిల్లాలో అద్దంకి లేదా మార్టూరు,కృష్ణా జిల్లాలో నందిగామ, నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరు, అనంతపురం జిల్లాలో తాడిపత్రి లేదా గుంతకల్లు, మెదక్ జిల్లాలో జహీరాబాద్ లలో రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తారని వార్తలొస్తున్నాయి.కర్నూలు,చిత్తూరు జిల్లాల నుండి ప్రతిపాదనలు ఇంకా రావలసి ఉందట.ఇలా ఎవరికి బలమున్న చోట్ల వారు డివిజన్ కేంద్రాన్ని సాధించుకోవటం కాకుండా  డివిజన్ల ఏర్పాటులో ఒక ప్రామాణిక పద్ధతిని ముందు నిర్ణయించాలి.    

గజిబిజి
అరకు పార్లమెంటు స్థానానికి పాడేరు డివిజన్ కేంద్రం.అలాగే జహీరాబాదుకు  కామారెడ్డి,బాపట్ల కు  తెనాలి ,హిందూపురం కు  ధర్మవరం ,రామగుండం కు మంచిర్యాల డివిజన్ కేంద్రాలు.ఇలా కొన్ని చోట్ల అసెంబ్లీ ,పార్లమెంటు నియోజకవర్గాలకు రెవిన్యూ డివిజన్లకూ భౌగోళిక హద్దుల సారూప్యత సామీప్యత ఏకరూపత లేదు.ఒక అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతం రెండు మూడు నాలుగు రెవెన్యూ డివిజన్ల లో కూడా ఉంది.ఉదాహరణకు పామర్రు శాసన సభ నియోజకవర్గం  మచిలీపట్నం,గుడివాడ,నూజివీడు,విజయవాడ అనే నాలుగు రెవిన్యూ డివిజన్లలోనూ ఉంది.అలాంటి చోట్ల  ఎమ్మెల్యే ఏదైనా పని కావాలంటే నలుగురు ఆర్డీవోలను సంప్రదించాలి పర్యవేక్షించాలి.ప్రజలకు కూడా ఇలాంటి అమరిక ఎంతో శ్రమ కలిగిస్తుంది.

కొత్త రెవెన్యూ డివిజన్లకు మార్గదర్శకాలు:

ఇలాంటి గజిబిజి గందరగోళాన్ని నివారించి పాలనా యూనిట్లలో స్పష్టత సౌలభ్యతా తేవటానికి భూపరిపాలన కమీషనర్ అధ్యకన ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది :

  • ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో 10-15 మండలాలు, 2-3 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉంటాయి. చిట్టచివరి మండలం కూడా రెవెన్యూ డివిజన్ కేంద్రానికి 70 కిలోమీటర్ల పరిధిలోనే ఉండాలి.
  • గిరిజన ప్రాంతాల్లోనైతే ఈ దూరం 50-60 కిలోమీటర్లలోపు ఉండేలా చూడాలి.వీలైతే ఏజెన్సీ మండలాలన్నీ ఒక రెవెన్యూ డివిజన్ కిందకు తీసుకురావాలి, పట్టణ ప్రాంతాల్లో 7-9 మండలాలతోనే ఒక డివిజన్ ఏర్పాటు చేయాలి.
  • డివిజన్ కేంద్రం దాని కిందకు వచ్చే మండలాలకు మధ్యలో ఉండాలి.

రెవిన్యూ డివిజన్లలో  జరిగే పనులు

భూమి శిస్తు వసూలు, జమాబందీ, చౌకడిపో డీలర్ల నియామకం, శాంతి భద్రతలు, భూసేకరణ , రెవిన్యూ కోర్టుల నిర్వహణ, పంచాయతీ పర్యవేక్షణ, ఆహారధాన్యాల కొనుగోలు, జనాభా లెక్కల సేకరణ, ఎన్నికల నిర్వహణ, పొదుపు పధకాలు, పెన్షన్లు, సినిమాహాళ్ళ లైసెన్సులు, పంచనామా లు, భూతగాదాలు, ఇలా ఎన్నో పనులకు రెవిన్యూ డివిజినల్ అధికారులు హాజరవుతూ ఉంటారు.

ఆన్ లైన్ లో రెవిన్యూ సేవలు

ప్రజలకు ప్రయాణయాతన తప్పించే ఉద్దేశంతో భూమి రికార్డులు, జమాబందీ, పాస్ పుస్తకాలు ద్రువపత్రాలు, పాస్ పుస్తకాలు,కుల,నివాస,ఆదాయ ధృవపత్రాలు వంటి రెవెన్యూలోని కీలక సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే మీసేవ కేంద్రాలద్వారా అందజేస్తున్నారు.రిజిస్ట్రేషన్ చేస్తున్న భూమి ప్రభుత్వానిదా? అసైన్‌మెంట్‌దా? పోరంబోకా? అన్నది తెలియడం కోసం  ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండటం కోసం  తహసిల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం చేసి భూముల క్రయ, విక్రయాల్లో రెండు శాఖల మధ్య సమన్వయం తీసుకొస్తున్నారు.

అసెంబ్లీ స్థానాలతో సమానంగా రెవిన్యూ డివిజన్లు లేవు  

ప్రస్తుతం రెవిన్యూడివిజన్లు  ఆంధ్ర లో  35,రాయలసీమ లో 15,తెలంగాణా లో 42 ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలుంటే , రెవిన్యూ డివిజన్లు 92 మాత్రమే ఉన్నాయి.జిల్లాల వారీగా రెవిన్యూ డివిజన్లు ఇలా ఉన్నాయి: 1.శ్రీకాకుళం: శ్రీకాకుళం , పాలకొండ , టెక్కలి 2. విజయనగరం: విజయనగరం , పార్వతీపురం 3. విశాఖపట్నం: విశాఖపట్నం , పాడేరు , నర్సీపట్నం , అనకాపల్లి 4. తూర్పుగోదావరి: కాకినాడ , పెద్దాపురం , రంపచోడవరం , రాజమండ్రి , అమలాపురం , రామచంద్రాపురం 5. పశ్చిమ గోదావరి: ఏలూరు , నర్సాపురం , కొవ్వూరు , జంగారెడ్డిగూడెం 6. కృష్ణా: మచిలీపట్నం , గుడివాడ , విజయవాడ , నూజివీడు 7. గుంటూరు: గుంటూరు , తెనాలి , నరసరావుపేట , గురజాల 8. ప్రకాశం: ఒంగోలు , మార్కాపురం , కందుకూరు 9. పొట్టి శ్రీరాములు నెల్లూరు: నెల్లూరు , గూడూరు , కావలి ,నాయుడుపేట , ఆత్మకూరు 10.వైఎస్సార్  కడప: కడప , రాజంపేట , జమ్మలమడుగు 11. కర్నూలు: కర్నూలు , ఆదోని , నంద్యాల 12. చిత్తూరు: చిత్తూరు , తిరుపతి , మదనపల్లి , చంద్రగిరి 13. అనంతపురం: అనంతపురం , పెనుగొండ , ధర్మవరం, కళ్యాణదుర్గం , కదిరి 14. హైదరాబాదు: సికింద్రాబాదు , హైదరాబాదు 15. రంగారెడ్డి: వికారాబాదు , చేవెళ్ళ , రంగారెడ్డిఈస్ట్ ,రాజేంద్రనగర్ , మల్కాజ్ గిరి 16. మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ , వనపర్తి , నాగర్‌కర్నూల్ , నారాయణపేట , గద్వాల 17. కరీంనగర్: కరీంనగర్ , పెద్దపల్లి , జగిత్యాల , సిరిసిల్ల , మంథని 18. నిజామాబాద్: నిజామాబాద్ , బోధన్ , కామారెడ్డి 19. వరంగల్: వరంగల్ , మహబూబాబాద్ , పరకాల , జనగాం , నర్సంపేట 20. ఖమ్మం: ఖమ్మం , పాల్వంచ , కొత్తగూడెం , భద్రాచలం 21. నల్గొండ: నల్గొండ , మిర్యాలగూడ , భువనగిరి , సూర్యాపేట , దేవరకొండ 22. సంగారెడ్డి: సంగారెడ్డి , మెదక్ , సిద్దిపేట 23. ఆదిలాబాద్: ఆదిలాబాద్ , ఆసిఫాబాద్ , ఉట్నూర్ , నిర్మల్ , మంచిర్యాల.

రైలు మార్గాలు లేని రెవిన్యూడివిజన్ కేంద్రాలు 25.

25 రెవిన్యూ డివిజన్ కేంద్రాలకు ప్రజలు చేరుకునేందుకు రైలు మార్గాలు ఇంకా ఏర్పడలేదు. శ్రీకాకుళం,మెదక్,భద్రాచలం,అమలాపురం,నాగర్ కర్నూల్,ఉట్నూర్,బోధ్,పాలకొండ,చేవెళ్ళ,నారాయణపేట,వనపర్తి,జమ్మలమడుగు,మదనపల్లి,కందుకూరు,కొత్తగూడెం,పరకాల,నర్సీపట్నం,పాడేరు,సూర్యాపేట,రంపచోడవరం,జంగారెడ్డిగూడెం,పాల్వంచ,సంగారెడ్డి,రామచంద్రాపురం,దేవరకొండ.ఈ 25 డివిజన్ కేంద్రాలకూ రైలుమార్గాలు విస్తరిస్తే రాష్ట్రం చాలావరకు బాగుపడినట్లే.
కంటితుడుపు కమిటీలు కాలయాపన
1956 లో మన రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్టమొదట 1957 లో ఆర్థిక కమిటీ ప్రభుత్వ పాలనలో పొదుపు చర్యలు సూచించటానికి  ఏర్పడింది. ఆ తరువాత పాలనా సంస్కరణల గురించి 1960 లో ఉన్నితన్ కమిటీ, 1964 రామచంద్రారెడ్డి కమిటీ, 1967 లో ఎంటి రాజు కమిటీ, 1976 లో ఎన్జీవోల సదస్సు, 1980 లో లాల్ కమిటీ, చంద్రశేఖర్ కమిటీ, 1981 లో శ్రీరాములు కమిటీ, 1985 లో రుస్తుంజీ కమిటీ ఎన్నో సూచనలు చేశాయి. వాటిలో కొన్ని అమలు అయ్యాయి. కొన్ని సిఫారసులు నేటికీ అమలు కాలేదు. జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలని, వివిధ డైరెక్టరేట్లను సెక్రటేరియట్ లో విలీనం చెయ్యాలని 1960 లో ఉన్నతన్ కమిటీ సిఫార్సు చేసింది. పంచాయతీరాజ్, మున్సిపల్, రెవిన్యూ శాఖలను విలీనం చెయ్యాలని 1964 లో రామచంద్రారెడ్డి కమిటీ సిఫార్సు చేసింది. పౌరసరఫరాల బాధ్యతలను జిల్లా కలెక్టర్ల నుంచి తప్పించాలని 1967 లో ఎం.టి.రాజు కమిటీ నివేదించింది. ఈ సిఫార్సులేవీ ఈనాటికీ అమలుకు నోచుకోలేదు.  అలాంటప్పుడు అసలు ఆ కమిటీలను ఎందుకు నియమించినట్లు ? సమస్య పరిష్కారం పట్ల నిజమైన శ్రద్ధ ఉండి, సమగ్ర నివేదికల కోసం కమిటీలను ఏర్పాటు చేస్తే ఆ కమిటీల సిఫార్సులను అమలు చేయాలి. అంతేగాని ప్రతిపక్షాలు కోరాయనో, ప్రజలు అడిగారనో కంటితుడుపుగా ఏర్పాటుచేసే కమిటీలు ఖజానాకు భారమే తప్ప వాటి వల్ల ప్రజలకు ఒరిగేదేమిటి ?

ఎమ్మెల్యేకొక ఆర్డీవో ఉంటేనే స్పష్టత ,సౌలభ్యం
1956 లో ఒక్కొక్క రెవిన్యూ డివిజినల్ అధికారి 4 లక్షల ప్రజల అవసరాలకు హాజరయ్యేవాడు. ఇప్పుడు 10 లక్షల మందికి పైనే ప్రజలు ఒక్కొక్క ఆర్.డి.. పరిధిలో ఉంటున్నారు.రెవిన్యూ డివిజన్ల సంఖ్య జనాభాకు అణుగుణంగా పెరగాల్సి ఉంది.ప్రతి ఎమ్మెల్యే నియోజక వర్గాన్నీ ఒక డివిజన్ గా ప్రకటిస్తే బౌగోళిక సరిహద్దులు ఎమ్మెల్యేకి, డిప్యూటీ కలెక్టర్ కు సమానంగా ఉంటాయి. పాలనా వ్యూహాలు ఉమ్మడిగా రూపొందిస్తారు.ఇద్దరూ ఒకే ప్రాంగణంలో ప్రజలకు దొరుకుతారు.ఎమ్మెల్యేలకు కూడా కార్యాలయ భవనాలు శాశ్వతంగా ఏర్పడతాయి. పోలీసు శాఖలో ప్రతి ఎమ్మెల్యేకి ఒక డిస్పీ వచ్చేలా చేశారు.అదేపద్ధతి రెవిన్యూలో కూడా పాటిస్తే  ఒక ఎం.పీ.కి ఒక కలక్టర్, ఒక ఎమ్మెల్యే కు ఒక ఆర్.డి.వో. అనే పద్దతిలో రాష్ట్రం  42 జిల్లాలు,294 రెవిన్యూ డివిజన్లు గా చేయాల్సి వస్తుంది. రాయలసీమలో 37 కోస్తాలో 88 తెలంగాణా లో 77 మొత్తం రాష్ట్రంలో ఇంకా 202 కొత్త రెవిన్యూ డివిజన్లు ఏర్పడాలి. అవసరమైతే రెవిన్యూ,పంచాయతీరాజ్,మునిసిపల్ లాంటి శాఖలను ఒకటిగా కలిపి సీనియర్ అధికారుల్ని శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి అధికారులుగా ప్రజాసేవకోసం వినియోగించుకోవాలి.రాష్ట్రం కలిసున్నా విడిపోయినా ఇలాంటి పాలనా సంస్కరణలు మాత్రం చేపట్టక తప్పదు.ఇది చారిత్రక ప్రజావసరం.
 సూర్య 10.1.2014
https://www.facebook.com/photo.php?fbid=693090090722984&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి