ఈ బ్లాగును సెర్చ్ చేయండి

5, నవంబర్ 2013, మంగళవారం

ఆరోగ్య రక్షణ కోసం అందరికీ మరుగు దొడ్లు


 
ఆరోగ్య రక్షణ కోసం అందరికీ  మరుగు దొడ్లు 
నూర్ బాషా రహంతుల్లా 9948878833


"నూట ఇరవై కోట్ల భారత జనాభాలో 53 శాతానికి రోజువారీ కనీస అవసరమైన మరుగుదొడ్లు అందుబాటులో లేవు. దాదాపు సగానికిపైగా అంటే 60 కోట్ల మందికిపైగా భారతీయులు రోజూ బహిర్భూమిలోనే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు.ఇది పౌష్టికాహారలోపానికి మూలకారణమవుతోంది.ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల మందికి మరుగుదొడ్లు అందుబాటులో లేవు.వందకోట్ల మంది బహిర్భూమిలోనే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు.పారిశుద్ధ్యం పెంచితే పిల్లల్లో పరోక్షజ్ఞానం పెరుగుతుంది".ఐక్యరాజ్య సమితి తొలిసారిగా ప్రపంచ మరుగుదొడ్డి దినాన్ని 19.11.2013 న నిర్వహించిన సందర్భంగా ప్రపంచ బ్యాంకు నివేదికలోని మాటలివి.



ఆరోగ్య రక్షణ మానవ హక్కు అనే అంశం మీద డిల్లీలో 5.11.2013 జాతీయ సదస్సు జరిగింది.ఆ సదస్సులో ఆరోగ్యాన్ని మించిన ప్రాథమిక హక్కేదీ లేదు. దేశంలో ప్రజారోగ్య సేవలు అంతంతమాత్రంగా ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చాలా ఖరీదు అయ్యింది. ఆరోగ్య హక్కు కంటే ప్రాథమికమైనది ఇంకేమీ లేదు. ఆరోగ్య హక్కు విషయంలో కమిషన్‌ సందర్భోచితంగా స్పందిస్తుంది అంటూ  జాతీయ మానవ హక్కుల కమిషన్‌ అధ్యక్షుడు జస్టిస్‌ కె.జి.బాలకృష్ణన్‌ ఎంతో విచారం వ్యక్తం చేశారు.ప్రస్తుతం జీడీపీలో 1.2 శాతం మాత్రమే ప్రజారోగ్యానికి ఖర్చు చేస్తున్నాము. ఇది ఇంకా పెరగాలి , డబ్బుతో సంబంధం లేకుండా వైద్యం పొందే అవకాశాలు కల్పించాలి అని  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి మనోజ్‌ ఝలానీ పేర్కొన్నారు. 
నేను అబ్బాయినయితే
 నేను అబ్బాయినయితే మూత్ర విసర్జన ఎక్కడయినా చేసుకోగలుగుతాను అని ఒక అమ్మాయి జవాబిచ్చింది.బహిరంగంగా చర్చించుకోవడానికి ఇష్టపడని విషయాల్లో మల మూత్ర విసర్జన అంశం ఒకటి. కనీస సౌకర్యాలు లేకపోవడం వల్ల కలిగే అనర్థాలపై చాలామందికి అవగాహన లేదు. అందుకే దీనిని అప్రధాన అంశంగా భావిస్తూ సమస్యను దాటవేస్తుంటారు. పట్టణ ప్రాంతాల్లో జనసమ్మర్దం ఎక్కువగా ఉండే బస్టాండులు, రైల్వేస్టేషన్లలో తగినన్ని మరుగుదొడ్లు లేకపోవడం, వాటి నిర్వహణలో లోపాల వల్ల కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. కలిమి కలిగినవారికి ఇదొక సమస్య కాకపోవచ్చు కాని, పట్టణ ప్రాంత మురికివాడల్లోని పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంత వాసులకు ఇదొక తీవ్ర సమస్యే. ప్రపంచవ్యాప్తంగా ఆరుబయట మల విసర్జన చేసే ప్రజల్లో అరవై శాతం మన దేశానికి చెందినవారే.

అశుద్ధ వాతావరణంలో ఆరోగ్య రక్షణ సాధ్యమేనా ?
కేంద్ర మంత్రి జయరాం రమేష్‌. గతంలో  దేశంలో మరుగు దొడ్ల కంటే మందిరాలే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని చెప్పినందుకు నిరసనలు ఎదుర్కొన్నారు. ఈ మధ్య గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా దేశానికి మందిరాలు కాదు, మరుగు దొడ్లు అవసరం , అందరికీ మరుగు దొడ్లు ఏర్పాటైతే అది దేశాభివృద్ధికి పెద్ద సూచికగా నిలుస్తుంది అన్నారు. మరుగు దొడ్లు ఏర్పాటు అంత సులభం కాదు. మరుగు దొడ్లు లేమి వల్ల పరిసరాల పరిశుభ్రత లోపించి కోట్లాదిమంది రోగాల బారిన డుతున్నారు. జ్నానీ జైల్ సింగ్ రోజుల్లో నిషేధించినా ఈ రోజు కూడా మన దేశంలో తలపై తట్ట పెట్టుకుని అశుద్ధాన్ని మోసుకెళ్ళటం జరుగుతున్నది. బాలవుడ్‌ హీరో ఆమీర్‌ ఖాన్‌ ఈ మధ్యనే తన సత్యమేవ జయతే కార్యక్రమంలో ఈ అశుద్ధాన్ని మోసేవారి బాధలు చూపిస్తే ప్రధానమంత్రి ఆయన్ని స్వయంగా  పిలిచి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కానీ ఫలితం శూన్యం. అందరికీ సరైన మరుగు దొడ్లు ఏర్పడితే ఈ దురదృష్టాచారం రూపుమాసిపోతుంది. మరుగు దొడ్లకంటే ఆహారమే ఎక్కువ అవసరం అని వాదించేవారూ ఉన్నారు. ఆహార భద్రత చట్టం చేసింది అందుకేనంటుంది ప్రభుత్వం.హృదయమే నీ ఆలయం’, దేహమేరా దేవాలయం అని మనసులోనే మందిరాలు కట్టుకోవచ్చుకానీ మరుగు దొడ్లు మాత్రం మనసుల్లో కట్టుకోలేం. వాటికోసం తప్పనిసరిగా స్థలం కావాలి.నివసించటానికి రెండు సెంట్లు జాగా కూడా లేనివాళ్ళు మరుగుదొడ్డి మాకెందుకంటున్నారు.మరుగుదొడ్డి తప్పనిసరి చేస్తూ ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేసినా కొంతమంది మరుగుదొడ్డిని మరుగుపరచి మిగతా ఇల్లు కట్టుకున్నారు.

దేశంలో మొత్తం పేదల సంఖ్య 33  కోట్లు. దేశంలోని బాలల్లో 46 శాతంమందికి పౌష్టికాహారం లభించడంలేదు. ప్రతి లక్ష మందిలో 258మంది మహిళలు గర్భవతులుగా ఉన్న సమయంలో మృతి చెందుతున్నారు. 20 లక్షలమంది బాలలు ప్రతి సంవత్సరం తమ మొదటి జన్మదినంకు ముందే చనిపోతున్నారు.ప్రపంచంలోని క్షయవ్యాధి గ్రస్తులలో ఐదవ వంతుమంది మన దేశంలో ఉన్నారు. క్షయ వ్యాధి పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధి. పారిశుద్ధ్యం లేదు. దేశంలో సగంమంది ప్రజలకు మరుగుదొడ్లు అందుబాటులో లేవు. గ్రామీణ ప్రాంతాలలో అయితే మరుగుదొడ్ల  సదుపాయం లేని ప్రజల సంఖ్య 66 శాతం వుంది.వీళ్ళంతా చెంబు తీసుకొని ఊరి బయటకు వెళ్ళి అశుద్ధాన్ని తొక్కుకుంటూ మలవిసర్జన చేసి వస్తుంటారు.ఇంతటి అపరిశుభ్ర వాతావరణాన్ని పరిశుభ్రం చేయకుండా ప్రజల ఆరోగ్యాన్ని ఎలా రక్షిస్తారు? రోగం వచ్చాక మందులకు తగలేసేదానికంటే రోగం రాకుండా కాపాడుకోవటం మంచిదికదా?
నిర్మల భారత అభియాన్‌
కార్యక్రమం ఉద్దేశం దేశంలో అన్ని గ్రామాలలో ఉన్ననివాసాలలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయడమే. 2010 కల్లా బహిరంగ మల విసర్జన లేకుండా చేయాలనే లక్ష్యంతో 1999 లో భారత ప్రభుత్వం Total Sanitation Campaign నే పధక మొదలుపెట్టింది.2013 వచ్చినా ఫలితం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.ఎన్ని పధకాలు ప్రవేశపెట్టినా అందరికీ మరుగుదొడ్లు సమకూరటంలేదు.పైగా ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అన్నట్లు ఎవరికి తోచిన సలహా వారిస్తున్నారు. నిర్మల భారత్ సాధన కోసం మరుగుదొడ్లు,మూత్రశాలలూ విస్తారంగా నిర్మించాలి.


జైరాం రమేష్‌ ఉచితసలహాలు :
భారతదేశంలో ప్రతిఇంటికి మరుగుదొడ్లు మంజూరు చేసే కార్యక్రమం చేపట్టాం. అత్త వారింట్లో  మరుగుదొడ్లు ఉంటేనే వివాహం చేసుకోవాలి . అత్తారింటిలో మరుగుదొడ్లు ఉంటేనే అత్తారింటికి వెళ్ళాలి  లేకుంటే పోనవసరం లేదు . గ్రామీణ ప్రాంతాలలో పలు నివాసాలలో  మరుగుదొడ్లు లేవు. ఇప్పటికీ ఆరు బయట మల విసర్జనచేస్తున్నారు. సాధారణంగా వివాహాలు జరిగే టపుడు వధూవరుల జాతకాలు చూస్తాము. కానీ వరుడి నివాసంలో మరుగు దొడ్లు ఉన్నాయా లేదా అనే విషయాన్ని విచారించాలి. తనభర్త నివాసంలో మరుగుదొడ్డి లేనందువలన  మధ్యప్రదేశ్‌లో అనితా నారే అనే ఆమె పెండ్లి అయినరెండు రోజులకే  పుట్టింటికి వెళ్లి పోయింది. మహిళల గౌరవాన్ని కాపాడే విధంగా మనం వ్యవహరించాలి.
చందనా ఖాన్ నీతిసూత్రం :
ఐఏఎస్ అధికారిణి చందనా ఖాన్ మరుగు దొడ్లు కడగటం శ్రమదానంగా భావింఛాలి.  పాకీ పనివాళ్ళు , ఆయాలు మాత్రమే ఈ పని చేయాలని భావించకూడదు. మహాత్మా గాంధీజీ స్వయంగా మరుగు దొడ్లు కడిగారు.మరుగుదొడ్లు కడిగితే విద్యార్థుల్లో సేవా భావం పెరుగుతుంది.వారిచేత పాఠశాలల్లో మరుగుదొడ్లను కడిగిస్తే మన పని మనం చేసుకోవడంలో తప్పులేదు అనే నీటిని వారికి నేర్పినట్లవుతుంది  అని చెప్పి, పిల్లల తల్లిదండ్రుల నుండి నిరసన ఎదుర్కొన్నారు. 

ప్రకృతి వైద్యు  హితబోధలు 
ప్రముఖ ప్రకృతి వైద్యుడు మంతెన సత్యనారాయణరాజు సుఖ విరేచనం సుఖమయ జీవనం అనే పుస్తకంలో మనిషి ఆరోగ్యానికి మలవిసర్జనకూ ఉన్న ఎన్నో లింకులు చక్కగా వివరిస్తారు.పశువులు పక్షులు మలవిసర్జనకు సంకోచించవనీ మలాన్ని కడుపులోనే ఆపుకోవనీ అలా మలాన్ని కడుపులోనే ఆపిఉంచి రోగాలు కొనితెచ్చుకుంటున్నది ఒక్క మనిషేననీ చెప్పారు.మసీదుల్లో మలమూత్ర విసర్జనకోసం మరుగుదొడ్లు ఖచ్చితంగా ఉంటాయి. మలమూత్ర విసర్జన చేయకుండా, అవయవాలు కడిగి శుభ్రం చేసుకోకుండా నమాజుకు రాకూడదని నియమం.భక్తుల ప్రకృతిపరమైన ఈ అవసరాన్ని గుర్తించి  మందిరాలన్నిటిలో ఏదో ఒక పక్కగా మరుగుదొడ్లు కడుతున్నారు.ఆయుర్వేద,ప్రకృతి వైద్యులందరూ మలబద్దకాన్ని రోగంగానే పరిగణించారు.పశుపక్షులన్నీ ఎక్కడబడితే అక్కడ మలమూత్ర విసర్జన చేస్తూ పరిసరాలను పాడు చేస్తుంటాయి.నాగరీకుడైన మానవుడు అలా చేయలేడు.అంగారక గ్రహం మీదకు ఉపగ్రహాన్ని పంపి అభివృద్ధి చెందిన దేశంగా మారిన మన దేశంలో నేటికీ భారతీయులకు  మలవిసర్జనకోసం సరైన శుభ్రమైన మరుగుదొడ్లు  లేకపోవటం సిగ్గుపడాల్సిన విషయం.  

మహిళల అవస్థలు
మరుగుదొడ్ల సౌకర్యం లేని కారణంగా అధికంగా ఇబ్బందుల పాలవుతోంది మహిళలే. చీకట్లో తప్ప మల విసర్జనకు అవకాశం లేని పరిస్థితుల్లో వీరు- అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. మలబద్దకం, మొలల సమస్య, అజీర్ణం వంటి సమస్యలకు ఇది కారణమవుతోంది. ఆరు బయట మల విసర్జన జరిగే ప్రాంతాల్లో పాదరక్షలు లేకుండా తిరగడం వల్ల బద్దెపురుగు బాక్టీరియా సోకే అవకాశం ఉంది.మున్సిపాలిటీ సామూహిక మరుగుదొడ్లు పనిచేయడంలేదు. నరకం అనుభవిస్తున్నాం. మహిళల బాధలను అర్ధం చేసుకోండి. మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురండి మీకు పుణ్యముంటుంది. అంటూ పట్టణాలలోని మహిళలు రచ్చబండ కార్యక్రమంలో వేడుకుంటూ ఉంటారు. పల్లెటూళ్ళలోనైతే రాత్రి చీకటి పడేదాకా ఆగి కడుపు బిగబట్టుకొని మహిళలు ఉరిబయటకు రోడ్ల మార్జిన్లలోకి పోతారు.మగవాళ్ళోస్తే సిగ్గుతో చితికిపోతూ లేచినిలబడుతుంటారు.మాలవిసర్జన ఆరోగ్యకరంగా , హాయిగా, సాఫీగా సాగదు.ఎన్నో అవాంతరాలు.మరుగుదొడ్లు లేని  ఆడవాళ్ళు మలవిసర్జన కోసం బయటికెళ్ళినప్పుడు అనేక చోట్ల అత్యాచారాలు కూడా జరిగాయి.
50 లక్షల కోట్ల రూపాయలనష్టం
మన దేశంలో శిశు మరణాలకు ప్రధాన కారణం డయేరియా, శ్వాసకోశ వ్యాధులు. మల విసర్జన తరవాత సబ్బుతో చేతులు కడుక్కునే చిన్న చర్య ద్వారా డయేరియాని 40శాతం, శ్వాసకోశ వ్యాధులను 30శాతం తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరుగుదొడ్ల వినియోగం లేకపోవడం, సరైన పారిశుద్ధ్య వసతులు లేకపోవడం వల్ల కలిగే అనారోగ్యంతో మనదేశం ఎంతో  నష్టపోతోంది.మన రాష్ట్రంలోని చాలా పట్టణాల్లో మరుగుదొడ్ల పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. రాష్ట్రంలోని సగం పాఠశాలల్లో మరుగుదొడ్ల సౌకర్యం లేదు. అరవై ఆరు శాతం పాఠశాలల్లో అమ్మాయిలకు శౌచాలయ సౌకర్యం లేదు. మరుగుదొడ్లు ఉన్నా వాటి నిర్వహణ లోపం వల్ల అవి నిరుపయోగమవుతున్నాయి. అమ్మాయిలు చదువు మానివేయటానికి ఇదీ ఓ కీలక కారణం.భారతదేశంలో మరుగు దొడ్లు అందరికీ అందుబాటులో లేనందువల్ల ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రతి యేటా సుమారు 50 లక్షల కోట్ల రూపాయల నష్టం సంభవిస్తూందట. ఈ నష్టం ఎలాగంటే బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన వల్ల కలిగే వ్యాధులనుండి వైద్యం చేయించుకోవడానికి , జబ్బు పడ్డందువల్ల పనులు మానేసి నందుకు, స్కూళ్ళలో టాయిలెట్లు లే అమ్మాయిలు చదువుమానినందుకు, శుభ్రత లేనందువల్ల విదేశీ టూరిస్టులు రానందుకు, ఇలా అన్ని కలిపి భారత దేశానికి ప్రత్యక్షంగా,పరోక్షంగా కలిగే నష్టం అన్నమాట.

పల్లెటూళ్ళు పట్టణాలలోని మురికి వాడల్లో బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జనవల్ల నీరు కలుషితమయ్యి ఆ నీటినే తాగడం వల్ల డయేరియా లాంటి అంటురోగాలొచ్చి జనం చనిపోతుంటారు.  మన దేశంలో 36 కోట్ల మందికే మరుగు దొడ్డి సౌకర్యం ఉంది. ఇందులో అధిక భాగం ఉమ్మడి మరుగుదొడ్లు . 
 
ఆరోగ్య శాఖ సూచనలు:
డయేరియా,కలరా,టైఫాయిడ్ లాంటి అనేక రకాల జబ్బులు మానవ మలంలోని  క్రిముల  కారణంగా వస్తాయి. ఈ క్రిములు వ్యాప్తి చెందకుండా మానవ మలాన్ని మరుగుదొడ్డి ద్వారా తొలగించాలి. మరుగు దొడ్డిని ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచాలి. మరుగుదొడ్డిని ఉపయోగించే సౌలభ్యం లేకపోతే, ప్రతి ఒక్కరూ మల విసర్జన కోసం ఇళ్లు, బాటలు, నీటి వనరులు, పిల్లలు ఆడుకునే స్థలాలకు దూరంగా వెళ్లాలి. విసర్జన తర్వాత వెంటనే మలంపై ఒక పొర మందం మట్టిని కప్పి పూడ్చివేయాలి.మరుగు దొడ్లను తరచూ శుభ్రపరచాలి. మల విసర్జన తర్వాత, భోజనానికి ముందు ఎల్లప్పుడూ చేతులు కడుక్కోవాలి . స్థానిక సంస్థలు ప్రభుత్వాలు, ఊరు, వాడల్లో ప్రజలు మరుగు దొడ్లు నిర్మించుకోవటానికి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే డిజైన్లు ఇచ్చి సహాయపడాలి.
సులభ్‌ ఇండియా
వివిధ రాష్ట్రాల్లో విసర్జకాలను ఎత్తిపోయవలసిన మరుగుదొడ్లు ఉండటం వల్ల, ఆ పనికి మనుషుల్నే ఉపయోగిస్తున్నారు. ఈ అమానవీయ వృత్తిని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం 1993లో ఒక చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం డ్రై లెట్రీన్స్‌ నిర్మాణాన్నీ నిషేధించింది. కానీ, ఇప్పటికీ వాటి నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ఈ వృత్తిపై నిషేధం, అందులో ఉన్న వారి ఉపాధికి సంబంధించిన తాజా బిల్లును కేంద్ర క్యాబినెట్‌ మొన్న ఆగస్టులో ఆమోదించింది. ఈ వృత్తిలో సుమారు పదమూడు లక్షల మంది కొనసాగుతున్నారు. లాభాల బాటలో నడుస్తున్న రైల్వే శాఖ సైతం విసర్జకాన్ని ఎత్తివేయడానికి మనుషుల్నే ఉపయోగిస్తోంది. ప్రత్యామ్నాయాలను అన్వేషించడంలో ఈ శాఖ దశాబ్దాలుగా నిర్లక్ష్యం వహిస్తోంది. ఫలితంగా ప్రపంచంలోనే 'అతిపెద్ద ఆరుబయట మరుగుదొడ్డి'గా భారత రైల్వే శాఖ అపకీర్తిని మూటకట్టుకుంది.తలల మీద మానవ మలాన్ని మోసే పాకీపనిలోంచి బయటపడి, వివిధ వృత్తుల్లో స్ధిరపడినవాళ్ళు. ఆగష్టు 17, 2010 న పార్లమెంటులో అడుగుపెట్టి ఎం.పి.లను కదిలించారు. ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా పాకీపనిలాంటి పరమ నికృష్టమైన పనిని కొనసాగిస్తున్న రాజకీయ వ్యవస్థ  సిగ్గుతో తలదించుకునేలా చేశారు. సఫాయి కర్మచారుల ఆందోళనలను వెలుగులోకి తెచ్చారు. మలాన్ని తలమీద  మోసిన ఆ తల్లులకు దేశవాసులు పాదాభివందనం చేసేలా తమ కధలు వివరించారు.
డా.బిందేశ్వర్ పాథక్ 2003 నుండి సులభ్ ఇంటర్నేషల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ పేరిట మాన్యువల్ స్కావెంజర్ల కోసం "కొత్త దిక్కు" (NEW DIRECTION) అనేకేంద్రం పెట్టి వాళ్ళతో కొత్త వ్యాపారాలు పెట్టించాడు. వంట పదార్ధాల తయారీ, కుట్టుపనులు, ఎంబ్రాయిడరీ వంటివి నేర్పించాడు. మొదట్లో మాత్రం అవి ఎవరూ కొనేవారుకాదు. అంటరాని, పారిశుధ్య కార్మికులు చేసినవా అని చీదరించుకొనేవారు. పోను పోనూ పరిస్ధితులు మారాయి. వాళ్లు తయారుచేసే వస్తువులే మరింత నాణ్యంగా ఉన్నాయని జనం గ్రహించారు. సేమియా, అప్పడాలు, ఊరగాయలు వాళ్ళ ఇళ్ళలోనే తయారుచేసినా తెగ మ్ముడుపోయాయి. 

 
అంటరానితనం పూర్తిగా పోవాలి
అంటరానితనం పల్లెటూర్లలోనే కాదు, పట్టణాలలో కూడా ఉంది. వ్యక్తిగత పరిశుభ్రత లేని వాళ్ళను ఆరోగ్యవంతులు దగ్గరకు రానివ్వరు.శుభ్రతకి కులంతో సంబంధం లేదు.చాలినన్ని నీళ్ళు దొరకని ప్రాంతాలు మురికివాడలుగా మారుతాయి. మురికివాడలలో దుర్వాసన,సకల రోగాలు,పెరిగిపోవటం సహజం. అక్కడ నివాసం ఉండే ఏ కులస్తులకైనా ఈ రోగాలు వస్తాయి. దోమ కులం చూసి కాటేయ్యదు. ఒకప్పుడు విద్యుత్ శాఖ వారు మురికివాడలకి కరెంట్ కనెక్షన్లు ఇచ్చేవాళ్ళు కాదు. కబ్జా చేసిన స్థలాలలో కట్టిన అనధికారిక ఇళ్ళకి కరెంట్ కనెక్షన్ ఇవ్వడం సాధ్యం కాదు అని సమాధానం చెప్పేవారు. మురికివాడవాసులు అక్రమ కనెక్షన్లు వినియోగించడం, విద్యుత్ శాఖ వారు కేసులు నమోదు చెయ్యడం కూడా జరిగేవి. తరువాత ప్రభుత్వం మురికివాడలకి కూడా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించింది. మురికివాడలకి విద్యుత్ సౌకర్యం కల్పించారు కానీ మరుగు దొడ్లు లాంటి సౌకర్యాలని నిర్లక్ష్యం చేశారు. మురికివాడవాసులలో 78% మంది ఖాళీ స్థలాలలో, రైలు పట్టాల పక్కనా మల విసర్జన చేస్తుంటారు. 22% మంది మాత్రమే పబ్లిక్ టాయ్లెట్లు వాడుతారు.మురికివాడలలో బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా ఉంటారు.వాళ్ళు ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉండాలంటే వ్యక్తిగత మరుగుదొడ్లు విస్తారంగా ఉచితంగా కట్టించాలి.దేశం సుభిక్షంగా ఉండాలంటే పేదలందరికీ భారీ స్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణం జరపక తప్పదు. ఆహారభద్రత ఎంత ముఖ్యమో మలవిసర్జన భద్రత కూడా అంతే ముఖ్యం.ఆహారం దొరక్క పస్తుంటే  పస్తున్న వ్యక్తికి మాత్రమే ఆకలి బాధ కలుగుతుంది .మల విసర్జనకు తావుదొరక్క ఎక్కడబడితే అక్కడ కూర్చుంటే చుట్టూ ఉండే అసంఖ్యాక జనానికీ రోగాల బాధ తగులుకుంటుంది.యుద్దాలలో హతులయ్యేవారికంటే అపరిశుభ్రతవల్లనే ఎక్కువమంది చనిపోతున్నారు.తగినన్ని నిధులు కేటాయించి మరుగుదొడ్లను అందరికీ తప్పనిసరి చెయ్యాలి.

సఫాయి పని నిషేధం
కేంద్ర ప్రభుత్వం మరో చారిత్రక చట్టాన్ని అమలులోకి తెస్తోంది. మనుషులతో మరుగుదొడ్లు శుద్ధి చేయించే పనిని నిషేధించింది.అపరిశుభ్ర మరుగుదొడ్లనూ తీసివేయాలని నిర్ణయించింది.యంత్ర పరికరాలు లేకుండా చేతుల ద్వారా మరుగుదొడ్లను శుభ్రం చేసే సఫాయి పనికి పూర్తి స్థాయిలో చెక్ పెడుతోంది. ఇందుకోసం కేంద్రం చేసిన 'ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ యాస్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దెయిర్ రిహాబిలిటేషన్ చట్టం-2013'ను దేశవ్యాప్తంగా 2013 డిసెంబర్ 6 నుంచి అన్ని పట్టణ ప్రాంతాల్లోనూ అమలులోకి తేనుంది. కేంద్ర గణాంక శాఖ వివరాల ప్రకారం రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 1,73,690 అపరిశుభ్ర మరుగుదొడ్లున్నాయి. వీటిలో 14,015 మరుగుదొడ్ల నుంచి మలాన్ని మురుగు కాల్వల్లోకి వదిలేస్తున్నారు. 7,111 మరుగుదొడ్లను మనుషుల ద్వారా శుభ్రం చేయిస్తున్నారు.
కేంద్ర చట్టం త్వరలో అమలులోకి రానుండడంతో అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించిన మరుగుదొడ్లు అన్నిటినీ ఆరు నెలల్లోగా తొలగించి, వాటిని పరిశుభ్ర మరుగుదొడ్లుగా మార్చాల్సి ఉంటుంది. చట్టాన్ని అతిక్రమించిన వారిపై తొలుత రూ.50 వేల జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. చట్టం అతిక్రమణలు కొనసాగితే గరిష్ఠంగా రూ.5 లక్షల జరిమానా లేదా ఐదేళ్ల జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. అన్ని పట్టణ ప్రాంతాల్లోనూ సర్వే చేపట్టి, అపరిశుభ్ర మరుగు దొడ్లు శుభ్రం చేసే సఫాయి పనివారిని గుర్తించి వారికి విధిగా ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పిస్తారు.

- See more at: http://www.andhrajyothy.com/node/35126#sthash.B6QH9N2A.dpuf
 http://www.suryaa.com/opinion/edit-page/article-158935  (సూర్య 10.11.2013)

https://www.facebook.com/photo.php?fbid=660883877276939&set=a.233025936729404.60739.100000659993594&type=1&theater

గీటురాయి  22.11.2013







సాక్షి 6.12.2013



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి